7, డిసెంబర్ 2011, బుధవారం

నా టెమ్ ప్లేట్ మార్చుకున్నానునేను కూడా టెం ప్లేట్ మారిస్తే...

పనిలేని పనులు చెయ్యడం లో నాకు నేనే. (ఏమిటో ఈ మధ్యన ఆత్మ నిందా స్తుతి అలవాటయ్యింది.) సెల్ఫ్ పిటీ మాదిరిగా ఇదేమైనా రోగమా?

ఇదైతే బాగుంది. అని ఒకటి సెలెక్ట్ చేశా.

అబ్బే,మరీ పచ్చదనం. బాగులేదు.

పోనీ ఆకాశం,  ఒద్దులే. మరీ గాలిగా ఉంది.

పళ్ళు, కాయలు యాక్...వొద్దబ్బా, బజ్జీలు అయితే బాగుంటుంది.

ఇంకోటేదో పెట్టబోయా.

కుదర్లేదు.

బ్లాగంతా కరంటు కోతకు గురైనట్టు కనపడుతోంది.

కంగారు పుట్టింది. అచ్చరాలు కనిపిస్తే చాలు దేవుడా అనుకుంటూ, బాధ పడుతూ కూర్చున్నా.

ఎలా ఎలా...


నా కంప్యూటర్ గురువైన మా అబ్బాయిని అడిగితే పోలా? వాడే ఏదో తిప్పలు పడతాడు.


పిల్లోడు స్టీవ్ జాబ్స్ కు వీర హనుమంతుడు.

యాపిల్ తినడానికిస్తే పక్కగా కొంచం కొరికి ఎంగిలి చేసి, స్టీవ్ జాబ్స్ ఫోటోకు నైవేద్యం పెడతాడు.

టీనేజ్ కొడుకు ప్రైవసీ గౌరవించే గొప్ప తల్లిలాగా తలుపు తట్టి, "అబ్బాయీ ఏంచేస్తున్నావూ, నేనోసారి రావొచ్చా?” అని అడిగాను.

"ఎందుకూ? ఎప్పుడూ తలుపు కొట్టి లోపలకొస్తావూనేనేదో చూసేస్తున్నానని, నీకు అనుమానం. 'కట్ ద రోప్' ఆడుకుంటున్నా, కావాలంటే చూడు, చూడు" అని ఐ ఫోన్ నా ముక్కు మీద ఆనించాడు.

"పర్లేదులేరా, ఈ వయసులో అందరూ చూస్తారులే, కావాలంటే నా బుక్స్ ఇస్తాను వాటిలో చాలా ఇన్ ఫర్మేషన్ ఉంటుంది.”

"అక్కర్లేదు. కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు" అన్నాడు, అదో రకమైన విఙ్ఞానంతో పుచ్చిపోయిన మేధావి లాగా.

"ఏంటీ ఇంత మంచిగా మాట్లాడుతున్నావూ? ఏం కావాలీ? " అడిగాడు టేబిల్ మీదున్న యాపిల్ తీసి కళ్ళకద్దుకుని తింటూ


"అబ్బీ, నీ కన్న తల్లి ఋణం తీర్చుకోవాల్సిన టైమొచ్చిందిరా.”


"ఏంటీ, నీక్కూడా కేన్సరా? " కంగారులో యాపిల్ వేగంగా పరపరా తింటున్నాడు.

"కాదురా? నా బ్లాగు టెంప్లేట్ మార్చబోయాను. అంతా చీకటయ్యింది. కంగారుగా ఉంది.నా బ్లాగుకో కొత్త టెంప్లేట్ పెట్టు”

"పాతది బాగానే ఉందిగా?”

"నిమ్మకాయ షర్బత్ బొమ్మ రోజూ అది చూసి చూసి డోకొస్తుంది. అదీ కాక అందరూ కొత్తవి మార్చుకున్నారు.”

"అయితే ఒక కండిషన్.”

అన్ కండిషనల్ గా సహాయం చేసేది ఎవరు ఈ రోజుల్లో,

"సరే అబ్బాయ్, మంచి టెంప్లేట్ తగిలించుతర్వాత చూస్తా నీ పనిఅందరికన్నా నాలుగాకులు ఎక్కువుండాలి. రంగులు నాకు నచ్చాలి. కాఫీ కప్పు ఉండేలా చూడు. ”వాడితో చెప్పాను.

బ్లాగర్ అకౌంట్ తెరిచి వాడిముందు పెట్టా.

స్నానానికి పోయి వచ్చేసరికి కొత్త టెంప్లేట్ పెట్టి ఉంచాడు.

"బాగుందిరా కానీ, కాఫీ ఏదీ?”

"ఈ వయసులో నువ్వు కాఫీ ఎక్కువ తాగ కూడదు. బ్లాగు పైనున్నవి తినాలి" హితం చెప్పాడు.

"థాంక్స్ రా" అని చెప్పి వెళ్ళబోతూ,

ఏవో కాగితాలు సర్దుకుంటూ సోఫాలో కూర్చుంటే పక్కనే చేరి

" అమ్మా,..”

"ఓంటయ్యా, ఓంకావాలీ" ఎప్పుడైనా బ్లాగు రిపెయిర్లకు పనికొస్తాడని గారం మేపుతున్నా.

"నీ బ్లాగుకి మంచి టెంప్లేట్ పెట్టానుగా.”

" అవున్రా, నువ్వు పుట్టకపోతే నేనేమయ్యేదాన్ని?” బుగ్గ నొక్కుకుని వాణ్ణే అడిగాను.

"మరి నాకేమైనా కొంటావా?”

లోపల ఏదో గంట మోగింది.....అమ్మో!

"సర్లే బడితెలా పెరిగి ఏమిటా గారాలు, దూరం కూర్చో, చీర నలిగితే నాకు నచ్చదు.”

"మరే, రేపు రియా బర్త్ డే"

"అయితే?”

"ఏమైనా గిఫ్ట్ ఇస్తా...”

"ఏం కొంటావ్?”

"ఒక మేక్ కొననా?”

"పీక పిసుకుతా, ఫో అవతలకు"

"మేకెందుకురా నీకూ?” పిల్ల వాడి నాయనమ్మ వచ్చి వివరాలు కనుక్కుంది.

ఆడ స్నేహితురాలి పుట్టిన రోజుకి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాడని చెప్పాను.

"అమ్మా, పోనీ ఐ పేడిస్తాను.”

నాయనమ్మ చీదరించుకుంది.

"ఛీ ఏవిట్రా అసహ్యంగా, మేకలు కాసేదానితో, పిడకలు చేసేదానితో నీకెందుకురా స్నేహం?”

పిల్లాడు నాయనమ్మకు ఐ పాడ్ అంటే ఏమిటో చెప్పాడు.

"ఒహో కంపూపర్ పలక" రేటెంతో అడిగింది ఆవిడ.

రేటు విని "స్నేహితురాలికి అంత డబ్బు పోసి పుట్టిన్రోజు బహుమతి కొంటావా? ఏవిటో అనుకున్నాను, అన్నీ తాతగారి పోలికలేనమ్మాయ్" అని నాతో చెప్పింది

"ముష్టి ఐ పాడ్ ఏవిట్రా, మీ నాయనమ్మ నాకిచ్చిన కాసుల పేరుంది. అదిచ్చేయ్.” కచ్చకూ వెటకారానికీ మధ్యగా చెప్పాను

"అదివ్వడానికి ఇంకా టైముందిలే" అని ముసి ముసి గా నవ్వుతూ టీ పాయ్ మీద చూపుడు వేలితో సున్నాలు రాస్తున్నాడు.

వాడి సిగ్గు వేషాలు చూసి వళ్ళు మండి, వీపు మీద నాలుగు పిడకలంటిస్తే సరి.అనుకుని చెయ్యెత్తి, వొద్దులే ముందు ముందు బ్లాగు అవసరాలకు మొండికేస్తాడనుకుని,

"నీతో మాటల్లో పడి లేటవుతుందిరోయ్, నే పోతా," అంటూ లేచి లాప్ టాప్ చంకన పెట్టుకున్నా

"అమ్మా, రియా బర్త్ డే"

"ఆడపిల్లల్తో స్నేహాలేవిట్రా నీకు. చదువు సంధ్యాలేకుండా? మొన్న అదేదో టెస్ట్ లో ఎన్నొచ్చాయ్ నీకు? సిగ్గు లేదూ, ఏనాడైనా, డాక్టర్ పెద్దబ్బాయి గారి చిన్నమ్మాయి కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నావా? ఒక్క సారైనా నా పరువు నిలబెట్టావా?”

"నాన్నా ,చూడు.."అంటూ పిల్లాడు తండ్రి దగ్గరకు చేరాడు


"పాపమే, మేక్ బుక్, ఐ పాడ్ వొద్దుగానీ, ఆ పిల్లను భోజనానికి పిలుద్దాము" నాన్న రాజీకొచ్చాడు.

"ఏమీ అవసరం లేదు. బుద్ధిగా చదువుకోమనండి.”

"ఎందుకే పిల్లల్ని కూడా కాల్చుకు తింటావూ, ఎవరితోనూ స్నేహంగా ఉండకపోతే ఎట్లా?”


"మధ్యలో నీ ఇంట్రస్ట్ ఏవిటయ్యా? నువ్వు వాడిలో ఐడెంటిఫై అవుతున్నావా? “

"అమ్మా, ఎలాగో నీ బ్లాగు హాక్ చేసి దాంట్లో చెత్త ఎక్కించక పోతే..” అంటూ మావాడు ఆవేశ పడుతున్నాడు.

"ఏడిశావులే, చదివి చావు. ”*****హాస్పిటల్ కు వచ్చే సరికి ఓ పాతికేళ్ళ కుర్రాడు రిసెప్షన్ లో కూర్చుని ఉన్నాడు. తెల్లగా, పొడుగ్గా, లేత నీలి రంగు జీన్స్ , తెల్ల చొక్కా, శుభ్రంగా ఏదో మోడలింగ్ చేసే మనిషిలా ఉన్నాడు. నేనొచ్చింది కూడా పట్టించుకోకుండా, దిగులుగా నేలవంక చూస్తూ ఉన్నాడు.

నా రూమ్ లోకి నడిచేటప్పటికి

ఒక అమ్మాయి తల్లి దండ్రులతో కలిసి కూర్చుంది. తండ్రి లేచి,

"నమస్కారమండీ, నేను గుర్తున్నానా? పెద్దమ్మాయి రెండు కాన్పులూ ఇక్కడే, ఇది చిన్నమ్మాయి మొన్న సోమవారం పెళ్ళయింది.”


అమ్మాయి వేళ్ళ దగ్గర్నుండీ, మోచేతులు పైవరకూ గోరింటాకు.

"బయట కూర్చున్నతను మీ అల్లుడా?”

అవునన్నాడు ఆయన

"ఏమిటీ సమస్య?” అడిగాను

"పైకి చూట్టానికి బాగానే ఉన్నాడని దాదాపు కోటి రూపాయలిచ్చాంలాంఛనాలే పాతికయ్యాయి. పిల్లవాడికి సూట్లు రేమండ్స్ లో తీశాం రెడీమేడ్. నగలు , వియ్యంకుడికి రెడీమేడ్,....”

"విషయానికి రండి.” అసలే నాకు ఓర్పు తక్కువ.

ఆ పిల్ల మొదలు పెట్టింది.

ఆమె ఏ సంకోచం లేకుండా తన సమస్య చెప్పగలుతున్నందుకు ఆమెను అభినందించాను మనసులోనే. తల్లి దండ్రుల ముందు చాలా స్వేచ్ఛగా అన్ని విషయాలూ మాట్లాడగలిన ఈ కాలం లో పుట్టనందుకు నన్ను నేనూ అభినందించుకున్నాను.


ఆ అమ్మాయి తనేం ఆశలు పెట్టుకుందీ, ఎలా ఆశాభంగం పొందిందీ, తండ్రి ముందే వివరంగా చెప్తుంటే, నేను కాసేపు నేల చూపులు చూసి ఇక తట్టుకోలేక తండ్రిని బయట అల్లుడికి తోడుగా కూర్చోమన్నాను.

ఆ అమ్మాయి కంటిన్యూ చేస్తూ ..

రొమాంటిక్ గా బిహేవ్ చెయ్యలేదండీ... భయపడతాడు...

తల్లి నా టేబిల్ మీదకు వంగి రహస్యం చెపుతున్నట్లు, "అబ్బాయి పెళ్ళికి పనికి వస్తాడో లేదో అని అనుమానం గా ఉంది.”

అబ్బాయి వివరాలు కనుక్కున్నాను.

మూడేళ్ళకే స్కూల్లో వేశారు. అన్ని క్లాసుల్లోనూ ఫస్టే, చైతన్య టాపర్. చదువైన వెంటనే ఉద్యోగం.


మొత్తం పురుష జాతి మీద అమితంగా జాలి పుట్టుకొచ్చింది.నా క్లాస్ మేట్ ఒకతను, సైకియాట్రీ చేసి, కౌన్సిలింగ్ సెంటరొకటి పెట్టి, సెంటర్లో భూములన్నీ కొన్నాడు.

ఫోన్ చేశాను.

క్లాస్ మేట్ లైన్లో కొచ్చాడు.

"ఏవోయ్, ఈ మధ్య ఏం కొన్నావ్?”

"ఏం కొనలేదు.”

అమ్మయ్య అనుకుంటూ "ఏం పాపం?"అడిగాను

"కొనడానికి మన ఊళ్ళో ఏం మిగల్లేదు.”

ఓర్నీ, కొట్టాడు దెబ్బ.

"సరే గానీ, ఓ ఎమెర్జెన్సీ కేసు చూడాలి నువ్వు.”

"కేసేమిటో? "అడిగాడు.

"అసలేమయ్యిందంటే..”

"అమ్మా, తల్లా,” బిచ్చగాడిలా అరిచి "కథలు బ్లాగులో రాసుకో నాలుగు లైన్లలో చెప్పు చాలు, నాకు కేసు అర్ధమవుతుంది.”

బొత్తిగా ఓర్పు లేదోయ్ నీకు అంటూ చీవాట్లు పెట్టి

"మొన్నే పెళ్ళి

పిల్లాడు ఫాస్ట్

పిల్ల లేత

కాదు కాదు రివర్సు"

కొత్తగా పెళ్ళయిన ఇద్దర్నీ పంపించాను.

కౌన్సిలింగ్ అయిన తర్వాత క్లాస్ మేట్ ఫోన్ చేశాడు.

" చెప్పు.”

" కంగారు లేదు, చిన్న యాంగ్జైటీ, ఇంకా రెండు మూడు రోజులు రమ్మన్నాను. పర్లేదు సర్దుకుంటాడులే కానీ,

ఏంటదీ ఆ పిల్ల చేతులు మీద వానపాములు పాకుతున్నట్టు, అవి చూసే భయపడుంటాడు.”అన్నాడు.

"ఎప్పుడూ స్థలాలు, పొలాలు , ఇళ్ళ బ్రోకర్ల మధ్యేనా, అప్పుడప్పుడు మనుషుల మధ్య తిరుగుతూ ఉండు. అవి వానపాములు కాదు, గోరింటాకు.” చెప్పాను.

"ఏమో నాకే భయమేసి, ఆ పిల్లతో ఎక్కువగా మాట్లాడలేదు. నువ్వు మాట్టాడు.”

వెధవ, మొత్తం ఫీజు వాడు తీసుకుని సగం పని నాకు చెప్తున్నాడు.ఏమన్నారు కౌన్సిలింగ్ డాక్టరు గారు అంటూ వచ్చారు పిల్ల, ఆమె తల్లిదండ్రులు.

అమ్మాయి తల్లి మళ్ళీ టేబిల్ మీదికి వంగి, "పిల్లాడిలో ఏదైనా తేడా ఉంటే చెప్పండి. ఇప్పుడే జాగ్రత్త పడతాం. మొన్నేగా పెళ్ళైయింది.”

"ఏమైనా ట్రీట్ మెంట్ ఉంటే ఇవ్వండి మేడం" ఆ పిల్ల సలహా నాకు.

"ఖర్చెంతైనా పర్లేదు.” తల్లీదండ్రుల ఔదార్యం.

ఏమివ్వను తల్లీ, ఓర్పు పెరగడానికి మందులేవీ ఎవరూ కనిపెట్టలేదు మరి. అలాంటి మందు వుంటే డాక్టర్లందరమూ వాడుకునే వాళ్ళం.

ఆ అమ్మాయిని లోపల రూమ్ లో కూర్చోబెట్టి మాట్లాడాను. మాట్లాడుతున్నంతసేపూ, తల్లి తొంగి చూస్తూ ఉంది.

వెళ్ళబోయే ముందు,

"చూడండి, మా కొలీగ్ ఏ సమస్య లేదన్నారు. బళ్ళో వేసిన మొదటి రోజునే పరీక్ష రాయమంటే ఎలా? కొద్దిగా టైమివ్వండి. అలా కంగారు పెట్టకండి.” చెప్పాను.

ఆ అమ్మాయి తల్లితో,

"మీరు ముందు తొంగి చూసే అలవాటు మానండి. అన్నీ సరవుతాయి.”

******

నేను ఇంటికెళ్ళేసరికి మా వాడి రూమ్ లోనుండి మాటలు వినబడుతున్నాయి. తండ్రీ కొడుకులు ఇంకా ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు. నా మీదే అయ్యుంటుంది. వాడి రూమ్ బయట నుంచుని వినబోయి, పెళ్ళికూతురి తల్లి గుర్తొచ్చి, ధడాల్మని లోపలికి వెళ్ళాను.


పిల్లోడు పక్కకు తిరిగి పడుకుంటే, నాన్న వాడి పొట్టకానుకుని కూర్చున్నాడు.


నన్ను చూడగానే మా వాడు గాఢ నిద్రపోతున్నట్టు ఒక లాగా నటిస్తున్నాడు.

వాడి వీపు రుద్దుతూ ఉన్నాడు ఈయన.

"ఎందుకూ రోజూ వాడికా వీపు సేవ?”

"బాగుంటుంది.”

"మీకా, వాడికా?”

"ఇద్దరికినూ, ఏం నీకేమైనా ప్రాబ్లెమా?” మాంఛి తిరుగుబాటు ధ్వనితో...


"సరే, ఆ ప్రియాని రేపు భోజనానికి పిలవమని చెప్పండి వాడితో" అన్నాను.

"ప్రియా కాదు రియా" మావాడు అంటున్నాడు.

చూస్తే, గాఢ నిద్రలో ఉన్నట్టు ఫోజు.

"కలవరిస్తున్నాడు" అన్నాడు ఈయన ఇంకా స్పీడుగా వీపు రుద్దుతూ.

వాడి కలవరింత, తండ్రి కవరింత.

32 comments:

మధురవాణి చెప్పారు...

హహ్హహ్హా.. పొద్దు పొద్దున్నే భలే నవ్వించారండీ.. సూపర్ పోస్ట్!

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు చెప్పారు...

ఇంతకీ మీరు వాళ్ళ దగ్గర రుసుము వసూలు చేసుకున్నారా లేదా చెప్పలేదు?
ఈ Template గురుంచి, మీరు వైద్య వృత్తిలో ఉన్నారు, తెల్ల కిరణాలు కళ్ళ మీద ఎక్కువ సమయం పడితే ఏమి జరుగుతుందో మీకు చెప్పక్కర్లేదు.

Sravya Vattikuti చెప్పారు...

హ హ మీ అబ్బాయి మాత్రం సూపర్ :)))
ఆమె ఏ సంకోచం లేకుండా తన సమస్య చెప్పగలుతున్నందుకు ఆమెను అభినందించాను మనసులోనే. తల్లి దండ్రుల ముందు చాలా స్వేచ్ఛగా అన్ని విషయాలూ మాట్లాడగలిన ఈ కాలం లో పుట్టనందుకు నన్ను నేనూ అభినందించుకున్నాను.
-----------------------------------------
హ హ మీరు అసలు :)))

జ్యోతి చెప్పారు...

సూపర్... చాలా బాగా రాస్తున్నారు డాక్టర్ గారు. కంటిన్యూ...

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది. ఇది ముఖస్తుతికాదు. సుతిమెత్తగా చెబితే అర్ధం చేసుకునేలాలేరండీ! ప్రతీదానికి మొరటుతనం అలవాటయిపోయింది.సిగ్గుపోయింది జనంలో.

రాజేష్ మారం... చెప్పారు...

:)) Superb and Hilarious :)

జ్యోతిర్మయి చెప్పారు...

శైలజ గారూ...చాలా బావుంది. నిజం చెప్పాలంటే షుగర్ కోటెడ్ టాబ్లెట్ లా ఉంది.

sunita చెప్పారు...

"ఛీ ఏవిట్రా అసహ్యంగా, మేకలు కాసేదానితో, పిడకలు చేసేదానితో నీకెందుకురా స్నేహం?”

వాడి సిగ్గు వేషాలు చూసి వళ్ళు మండి, వీపు మీద నాలుగు పిడకలంటిస్తే సరి.

ఏంటదీ ఆ పిల్ల చేతులు మీద వానపాములు పాకుతున్నట్టు, అవి చూసే భయపడుంటాడు.”అన్నాడు.


"ఎందుకూ రోజూ వాడికా వీపు సేవ?”

excellent!hilarious post!!Template baagundi. meedi gunTooraenaa Madam! meeroo Ramana gaaroo bandhuvulaa?

శ్రీనివాస్ చెప్పారు...

:)

రసజ్ఞ చెప్పారు...

మీరు డాక్టరనమాట! బాగుంది మీ కథ! బాగా నవ్విస్తూనే వైద్యం చేశారు (విషయం చెప్పారు)! లాఫింగ్ తెరపీనా?
ఏంటదీ ఆ పిల్ల చేతులు మీద వానపాములు పాకుతున్నట్టు, అవి చూసే భయపడుంటాడు.”అన్నాడు.

హహహ నాకు కూడా అలానే అనిపిస్తుంది ఎవరయినా కోన్ పెట్టుకుంటే!

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హహహ :-))) బాగుందండీ...

కృష్ణప్రియ చెప్పారు...

:))

Chandu S చెప్పారు...

మధురవాణి గారూ,

ధన్యవాదాలు.

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు గారు,

మీకా అనుమానమెందుకొచ్చింది. రుసుము చెల్లించకపోస్తే, రూములో అడుగే పెట్టనివ్వంగా.

(కేసు నిజం. కథ కొంచం ఇమాజినేషన్. నేను రుసుములు వసూలు చేస్తే ఉద్యోగం ఊడుతుంది.)

ఎరుపు చూసి విసుగొచ్చి, తెలుపు కావాలన్నాను. నిజాయితీగా చెప్పాలంటే, మీరు చెప్పేవరకూ నాకు తట్టలేదు.

శ్రావ్య గారూ,

"హ హ మీరు అసలు :)))"

మీరు ఇదివరకెప్పుడో కూడా ఈ కామెంట్ పెట్టారు. ఏంటి దీని అర్ధం? (తెలుసుకుని మురుసుకోవాలని.)

జ్యోతి గారూ,

ధన్యవాదాలు

కస్టేఫలే గారూ,

మీకు నచ్చినందుకు సంతోషం గా ఉందండీ.

రాజేష్ మారం గారూ,

ధన్యవాదాలు

జ్యోతిర్మయి గారూ,

ధన్యవాదాలు.

సునీత గారూ,

మాది గుంటూరే.

రమణ గారూ నేనూ బంధువులా అంటే?

బ్లాగు బంధువులం.

శ్రీనివాస్ గారూ,

ధన్యవాదాలు.

రసజ్ఞ గారూ,

థాంక్సండీ.

వేణూ శ్రీకాంత్ గారూ,

పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ బాగా జరిగాయా?

Thanks

కృష్ణప్రియ గారూ,

Thank you

కొత్తావకాయ చెప్పారు...

"యాపిల్ తినడానికిస్తే.. " హహ్హహాహ్హా... టెంప్లేట్ చాలా బావుంది. ఇంత మంచి హాస్యానికి విషయాన్ని కూడా జోడించి మంచి టపా రాసారు. గ్రేట్ పోస్ట్!!

రాజ్ కుమార్ చెప్పారు...

సూపరండీ...
మీరేమ్ అనుకోరంటే చిన్న మాట. నాకు పాత టెంప్లేట్నే బాగా నచ్చింది. ;);) ఇదీ బానే ఉందనుకోండీ. కానీ అదే ఇంకా బాగుందీ.

ఆ.సౌమ్య చెప్పారు...

హహహహ...hilarious...ఏం రాసారండీ అసలు! :))
ప్రతీ వాక్యానికి చచ్చేట్టు నవ్వుకున్నాను. నవ్విస్తూ మీరిచ్చిన మెసేజ్ కూడా అదుర్స్!

Sravya Vattikuti చెప్పారు...

మీరు అసలు మామూలు గా రాయరండి బాబోయ్ అని అర్ధం శైలజ గారు :))

Chandu S చెప్పారు...

కొత్తావకాయ గారూ,

మీరు కామెంట్ పెడితే సంతోషం కన్నా, భయం డామినేట్ చేస్తుంది. తెలుగులో ఏం తప్పులు రాశానోనని.

థాంక్సండీ

Chandu S చెప్పారు...

నీలం వేణూరాం రాజ్ కుమార్ గారూ,
మొన్నటి మీ పోస్ట్ చదవక ముందు, ఇద్దరూ వేరు వేరు అనుకుంటూ ఉండేదాన్ని. చిన్నమాటే, ఉన్నమాటే. చూడగా చూడగా నాకూ పాతదే బాగుంది. మావాడిని అదే పెట్టమందామనుకుని, మళ్ళీ రియాకో, ప్రియాకో వంట చేసే ఓపిక లేక దీనితోనే కాలక్షేపం చేస్తున్నాను.
Thanks for reading

Chandu S చెప్పారు...

సౌమ్య గారూ,

welcome to my blog

నచ్చినందుకు ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

Dear శ్రావ్య గారు,
Thank you very much

సిరిసిరిమువ్వ చెప్పారు...

:)..మామూలు రోజూవారీ సంఘటనలలో కూడా హాస్యం రంగరించి భలే వ్రాస్తారండి మీరు.

I really enjoy reading your posts.

మీదీ గుంటూరే..మాదీ గుంటూరే.

టెంప్లేట్ పాతదే బాగుందండి!

నిషిగంధ చెప్పారు...

భయంకరంగా నచ్చేసింది :))

Chandu S చెప్పారు...

సిరిసిరిమువ్వ గారు,

థాంక్సండీ.

మిగతా బ్లాగర్లు ఏడిపిస్తారేమో మనల్ని 'ఇంద్ర' సినిమా గుర్తొచ్చి

Chandu S చెప్పారు...

నిషిగంధ గారూ,

మీ బ్లాగుకు ఒక భయంకర అఙ్ఞాత అభిమానిని.

ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

మీ దగ్గరికొచ్చినవాళ్ళకి మందులక్కరలేదు . నవ్వి నవ్వీ ప్రాణాలు పోవాల్సిందే .
ఈ పోస్టు హోమయోపతీ మందులా ఉంది .

రాజ్ కుమార్ చెప్పారు...

నన్ను నా పూర్తి పేరుతో పిలిచి రికార్డ్ సృష్టించారండీ.. ధన్యవాదాలు.
(కొంచేమ్ ఆలస్యంగా చూశాను ;))

naimisha yenduri చెప్పారు...

superb

Chandu S చెప్పారు...

దుర్గా ప్రసాద్ గారు, శైలజ గారూ, చదివినందుకు, కామెంటు వ్రాసినందుకు థాంక్స్

naimisha yenduri చెప్పారు...

madam, do u remember me? sailaja.y from guntur
i came to know about ur blog 2 days ago from sir.it is very excellent and superb, no more words to say.i have habit of reading books since childhood,so i will visit ur blog regularly.ur writings r humorous.i am so much exited after reading ur stories.ur telugu language is very nice. a very big WOW...to ur talent.iam very poor at computer, so it took 2 days to reply after taking naimi's help...BYE.

Pramod Reddy Damera చెప్పారు...

super.............

రామ్ చెప్పారు...

ఆ అమ్మాయి తల్లితో,

"మీరు ముందు తొంగి చూసే అలవాటు మానండి. అన్నీ సరవుతాయి.”

ఒక్క ముక్క లో పరిష్కారం చెప్పారు ... ఎందరికో !!!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి