16, మే 2013, గురువారం

భార్యా, ప్రేమవతీ..


'పెళ్ళి చేసుకో, పెళ్ళి చేసుకో'  అని ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తుంటే,  హీరోయిన్ లాంటి అమ్మాయి కావాలన్నాను. రూపం లో హీరోయిన్ లా ఉంటే సినిమాల్లో కెళ్తుంది గానీ నన్నెందుకు చేసుకుంటుంది? అందుకని గుణం లో హీరోయిన్ లక్షణాలున్న అమ్మాయిని తెస్తామని, ఓ పిల్లను వెతికి పెళ్ళి చేశారు. ఆ పిల్లకు హీరోయిన్ లాగా మసులుకునే ట్రెయినింగ్ ఇచ్చి మరీ కాపురానికి పంపించారు.

'ఆహా, హీరోయిన్ లాంటి భార్యతో జీవితమా!' అంటూ మీరేం ఊగిపోకండి.


ఇంట్లో ఉయ్యాల బల్ల పెట్టించమంది. ఎందుకంటే, పాత సినిమాల్లో, అప్పుడప్పుడు కొత్త సినిమాల్లోనూ, హీరో, హీరోయిన్ లు బల్ల మీద సగం కూర్చుని సగం పడుకుని  "నువ్వు నాకిష్టం, నాకు దొరికిన అదృష్టం " అని కీచుకీచుమనే గొలుసు ఉయ్యాల మీద,  కీచులాడుకుంటూ ఊగుతుంటారట.

అది సరే! 'ఇద్దరం ఉయ్యాలమీద కూర్చుంటే ఊపేదెవరూ?' అంటే, కాసేపు ఆలోచించింది.

ముందు తను కూర్చుంటుందట. నేను బలంగా ఉయ్యాలను ఊపి, ఎగిరి ఉయ్యాలపై కూర్చుంటే సరి. ఆ పాట్న, పాట పాడుకోవచ్చని వివరించింది. అలా ఎగిరికూర్చోబోయాను కానీ, లోపించిన చాకచక్యం వల్ల, కింద చతికిలపడ్డాను. ఊపిన ఉయ్యాల ఆగకుండా వచ్చి నా తలకాయకు తగిలి బొప్పి కట్టింది.


ఓ రోజు ఆఫీసులో చచ్చేంత పని చేసొచ్చాను. వస్తూ వస్తూ ఏదో తినేశాను. ఎవడితోనూ మాట్టాడే ఓపికలేదు. ఇంటికొచ్చే దారిలో ఎవరు పలకరించినా సంజ్ఞలతోనూ, హావభావాలతోనూ నెట్టుకొస్తూ, నన్ను నేను తోసుకుంటూ ఇంటికొచ్చాను. లోపలికెళ్ళి శవం లా పడుకుందామా, కొయ్య దుంగ లాగా పడుకుందామా ?అన్న రెండు ఆప్షన్స్ లలో, ఒకటి నా రెండు వేళ్ళ సహాయంతో ఎంచుకున్నాను. . తలుపు తోయగానే అప్పటికే కప్పు నుండి ఏర్పాటు చెయ్యబడ్డ అట్టపెట్టెలోంచి రంగు చెమ్కీలు, తళుకులూ, రంగులూ నా నెత్తిన పడ్డాయి. పెళ్ళయి నెలయిన సందర్భంగా ఈ సంబరాలు.
ఓ అరగంట సేపు షవర్ కింద దువ్వెన తో బలంగా దున్ని, దున్ని దువ్వితేగానీ, ఆ రంగులు, ఆ తళుకులూ పోలేదు. బద్ధకంగా సోఫాలో బడి నిద్రపోదామన్న బలమైన కోరిక తీరకుండా తడి తలతో వచ్చి కూర్చున్నాను. అది ఆరేదెపుడు, నేను నిద్రపోయేదెపుడు? " బుజ్జి తండ్రి కోపం లో ఎంత ముద్దు గున్నాడో?” కిలకిలా నవ్వుతూ తలంతా రెండుచేతులతో చెరిపేసి ముద్దు చేస్తోంది.

ఎప్పటికో నిద్రపోయాను. అర్ధ రాత్రి గురక తీస్తుంటే భుజం పట్టుకుని ఊపి నిద్రలేపింది. నేను గాఢ నిద్రలోంచి మేల్కొని ఎవరు నువ్వు అన్నాను. నన్ను మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళి, వెన్నెల్లో కూర్చుందామని, జానా బెత్తెడు ఇరుకు బాల్కనీలో కూర్చోబెట్టింది. రెండు కుర్చీలు ఎదురూ బొదురూ వేసుకుని కూర్చున్నాము. వెన్నెల బాగనే ఉంది. పక్కింటోళ్ళ బాల్కనీలో ఆరేసిన బట్టలు, మనీ ప్లేంట్ తీగలు వాళ్ళ మొక్కల కుండీలూ చూస్తుంటే దిక్కులు చూడకుండా కళ్ళలో కళ్ళుపెట్టుకుని చూడమంది. "ఎందుకూ?" అంటే వెన్నెల్లో రొమాన్సు చేసుకోవాలట .

'పెళ్ళి చేసుకున్నాగా, మళ్ళీ ఇదికూడా చేసుకోవాలా?'

రెండు నిముషాలు చూసుకున్న తర్వాత "ఇలా చూసుకుంటుంటే ఏమొస్తుందే?” అని ఆవులిస్తూ అడిగా.

నోర్మూసుకుని చెప్పినట్టు చెయ్యమంది.

నేను అన్యాయాన్నీ అక్రమాల్నీ ఎక్కువసేపు చూస్తూ ఉండలేను.

"ఏంటే, ఈ తిక్క చేష్టలు?" అంటూ తిరగబడ్డాను.

అన్ రొమాంటిక్, అరసికుడిన .

ఇంటికీ బాల్కనీకి మధ్య తలుపేసి లోపలికి పోయింది. రాత్రంతా వెన్నెల్లో రొమాన్స్ నడిపా.. దోమలతో!  


ఇంకో రోజు వాళ్ళ ఆడస్నేహితులందర్నీ పోగేసింది. కిట్టీ లేడీసంట. సున్నితమైన వస్త్రధారణ చేశారు. నావల్ కు ఆవలి తీరాన చేపల వలలాంటి వలువలు కట్టారు. సౌందర్యోపాసకుడూ, మరియూ కె రాఘవేంద్ర భక్తుడైన మా వూరి టైలర్ మస్తానైతే అరకిలో మీటర్ దూరంలో నించుని వీరినొక నిముషం గమనించాడా! అతికినట్లు తలా వొక బ్లౌజు కుట్టగలడు. అలాంటి లేడీసంతా చుట్టూ చేరి చేతులూపుతూ నేను అదృష్టవంతుణ్ణయ్యానని ఓదారుస్తున్నారు.

ఒకావిడ 'మా హబ్బీ ఇట్టా' అంటోంది . మరొకావిడ 'మా హబ్బీ అట్టా' అంటోంది. ప్రపంచం లో ఉన్న సగం రంగులు వాళ్ళ చీరలమీద ఉండగా, మిగిలిన సగం వాళ్ళ మొహం మీద కనిపిస్తున్నాయి. దానికి తోడు ఒకటే కాకి గోల. అమ్మేజింగ్, సుప్పర్బ్, వావ్వ్ లతో వాంతులు తెప్పిస్తున్నారు. బాబో, ఈ సారి ఈ ఆడంగులు ఇంటికొచ్చినపుడు, బొచ్చ ఒకటి అందుబాటులో ఉంచుకోవాలి సుమా. సమయానికి డోకొస్తే ఇల్లు పాడవకుండా!

పెళ్ళయి అయిదునెలల అయిదురోజులైందట. అయిదోతనం పండేందుకు ఓ పండగ చేసింది.
అయిదురూపాయల బిళ్ళంత బొట్టు కాకుండా ఇంకా పాపిట్లో ఒకటి, మొహం మీద రెండు, గొంతుమీద ఒకటి మొత్తం అయిదు బొట్లు ( లెక్క సరిపోయిందా?) పెట్టింది.

అయిదు రకాల పూలు లెక్కగట్టి అయిదు కేజీలు తెప్పించి ఇల్లంతా పోసి ఆ పూలమీద నన్ను అడుగులేస్తూ రమ్మంది. ఎంత తగలేసిందో? నన్ను సోఫాలో కూలేసి అయిదు రకాల టిఫిన్లు తెచ్చి పెట్టింది. నోట్లో పెట్టుకున్న తక్షణమే దిబ్బలో పారేయించుకునే యోగ్యత గల అయిదు రకాల పిండి వంటలు.
పంచవటి అనే రెస్టారెంట్ నుండి తెప్పించిందట.
అయిదు భాషల్లో ఐ లవ్ యూ అని రాసిన చాటంత గ్రీటింగ్ కార్డ్ నామొహం మీద పెట్టింది. పవర్ కట్ట్ అయినప్పుడు విసురుకోవచ్చని పక్కనే పెట్టి
"ఎంతే దీని ఖరీదు?" అనడిగితే ఏమ్మాట్టడకుండా నా అయిదోతనం కలకాలం ఉండేట్టు దీవించమని నాకు దణ్ణం పెట్టింది. మిగతా నాలుగు తనాలేవిటో చెప్పమన్నాను.

 జవాబు తెలియదనుకుంటా,  సిగ్గుతో కవర్ చేసుకుంటూ " ఛీ ఫో " అంది.  ఈవిడ ఉన్మత్త ప్రేమావేశం తో ఎప్పుడైనా సరే హఠాన్మరణం చెందేందుకు ఉత్తమావకాశాలు కలిగి ఉన్న నేను ఆవిణ్ణేమని ఆశీర్వదించను. నేనున్నా లేకపోయినా కలకాలం చల్లగా బతుకు అన్నాను.

*******

టీవీ చూస్తున్నా. ఆరోజు నాకు ఇష్టమైన నటి ఎక్కడుందో చెప్తారట. నాకా ప్రోగ్రామంటే భలే ఇష్టం. ఇప్పట్లో ముసలీ, అప్పట్లో కుర్ర అయిన కొన్ని హృదయాలను అడ్డ దిడ్డంగా దున్నేసిన 'హలం' కోసం వెతుకుతున్నారట. ఆవిడతో మాట్టాడిస్తారట. టీవీ చానల్ లోగో కలిగి ఉన్న మైకు, కత్తిలా పట్టుకుని, మొహమంతా బిగదీసుకుని, ఒకాయన ఎక్కడికో పోతున్నాడు. బాక్ గ్రౌండ్ లో

ఎస్ జానకి పాడిన, " ఓ .....ఎవరేమన్ననూ, తోడు రాకున్ననూ..... ఒంటరిగానే పోరా బాబూ ఫో ఓ ఓ " వినపడుతోంది.


ఓ స్కూలు దగ్గరకెళ్ళాడు.  రేక్కాయలు అమ్మే ఓ ముసలావిడ దగ్గర కూర్చుని ఏవో మంతనాలు జరుపుతున్నాడు.

"గిద్దెడు రేక్కాయలకు ఎంత సేపురా నీ బేరం, తొందరగా తెమిలి చావు.” అంటుంటే మనముందుకొచ్చి కత్తి మైకు మూతిమీద పెట్టుకుని

హలం ఈ స్కూల్లోనే ఏడో క్లాసు వరకూ చదివిందట. స్కూలు కొచ్చే రోజుల్లో ఈ ముసలావిడ దగ్గరే రేక్కాయలు కొనేదట. ఆ తర్వాత ఏమైందో తెలియదని ముసలమ్మ చెప్పిందని మనతో చెప్పాడు

మండుటెండలో నడుచుకుంటూ ఇంకెటో పోతున్నాడు. ఆటో ఎక్కొచ్చనుకోండి. కానీ అకుంఠిత దీక్ష పూనిన వారికి బుర్రలు పని చెయ్యవు. ఇంతకూ హలం ఏదీ అని గొడవ చెయ్యకుండా, చూసేవారిని చల్లార్చేందుకు మధ్యమధ్యలో "ఎంతటి రసికుడవో తెలిసె రా. రా.. రా.. " అంటూ హలం టీవీలోకి రమ్మంటోంది.

ఎవరయ్యా బాబూ అక్కడ, ఈ హలం కు జాతీయ ఐటం నటి అన్న పురస్కారం ఇప్పించండి.

హలం ఇంకో పాటందుకుంది.

"కుశలమేనా భామలంతా, మీ విషయమూ నేనెరుగనా?” అంటూ నా ప్రొఫైల్ తెలిసిన దానిలా నావంకే చూస్తూ పాడుతోంది.

"ఇంకో పది అడుగులు దూరంలో ఉన్న హలం ఇంటికి వెళ్ళబోతున్నాం" అని నాకు చెప్పి నత్తలాగా నడుస్తున్నాడు టీవీ వాడు.

హలం దొరుకుతుందో, దొరకదో? దొరికినా ఇప్పటి రూపం చూడగలనో లేదో అని టెన్షన్ తో బుర్ర వేడెక్కి పోతోంది. గుండె గబగబా కొట్టుకుంటోంది. ఈ రకంగా శారీరకంగా, మానసికంగా అన్ని రకాల వత్తిడికి గురవుతుంటే వెనకనుంచి వచ్చి "డార్లింగ్" అంటూ ఢమాల్న నా మీద పడి నా మెడలో చేతుల దండ వేసింది. ఓ మోస్తరు సైజులో ఉన్న బాల కొండచిలవలు రెండు హఠాత్తుగా వంటి మీద పడ్డ ఫీలింగుతో , సీలింగు ఎగిరిపోయేట్టు "ఓసి నీ అమ్మ కడుపు కాలా. ఏవైందే నీకు?” అని అరిచా.

నా భాషకు క్షమించాలి మీరు. భయమొచ్చినా, కోపమొచ్చినా అమ్మమ్మలనాటి నాటు భాష లోకి దిగిపోతాను.

రిమోట్ అందుకుని టీవీ కట్టేసి పారిపోతోంది.

"ఉండు, నీ పని పడతా" అంటూ వెంట బడ్డా. నేను, తనవెంట బడడాన్ని పూర్తి స్థాయిలో అపార్ధం చేసుకొంది. ఏదో చిలిపి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాననుకుని తెరలు తెరలు గా ఇకిలింపులు వొలికిస్తూ ఇల్లంతా స్లో మోషన్ లో పరిగెత్తుతోంది . పరుగెత్తడం తో ఆయాసమొచ్చింది. " ఓయమ్మో, ఇలాంటి పిల్లతో నావల్లకాదు బాబోయ్" అనుకుని కిటికీ పక్కనే ఉన్న కుర్చీలో కూల బడ్డా.

ఓ వాటర్ గన్ తెచ్చి, కిటికీ చువ్వల్లోంచి  మొహం మీద నీళ్ళు కొట్టింది. తుపాకి పేల్చినా నయ్యం, కోపం రాకుండానే చావొచ్చు.

“నీకేం మాయరోగమొచ్చిందే. ఇట్టా చావగొట్టేస్తున్నావు, టీవీ రిమోట్ ఇవ్వకపోయావో " అంటూ గుడ్లురుముతూ చడా మడా తిట్టేశాను. హర్ట్ అయినట్లుంది.

"ఛీ, రొమాన్స్ అర్ధం చేసుకోలేవు. నా బాడ్ లక్" అంటూ చేల గట్లెంట హీరోయిన్ పరిగెత్తే విధానంలో పరుగు తీస్తూ బెడ్ రూంలో కెళ్తోంది.

ఆవిడ చిలిపి చేష్టలలో భాగంగా, పొద్దున్న నన్ను నిద్రలేపడానికని ఓ బిందెడు నీళ్ళు, నా మీద గుమ్మరించింది. ఎండుతుంది కదా అని పరుపు తీసుకెళ్ళి డాబా మీద ఎండలో పడేశాను. 'ఆగు, ఆగు దాని మీద పరుపు లేదు' అని చెప్పబోయేంతలో , వెక్కి వెక్కి ఏడ్చేందుకు వీలుగా  బెడ్ మీద బొక్క బోర్లా దభామని పడింది.

అంతే! మూతి చితికి , ఆవిడ స్వభావానికి తగ్గ రూపం దాల్చింది. పైపైన ఓదార్చేసి టీవీలో హలం ఈ పాటికి వచ్చేసి ఉంటుందనుకుని వచ్చి కూర్చుంటే,  హాలిడేకోసమని హలం హాలండ్ కు పోయిందట! ఎవరిదో ఇనపగేటు ముందు నిల్చుని చెప్తున్నాడు టీవీ వాడు. ఆ ఇల్లు హలందేనా? ఆ గేటు, వాడి మాటా నిజమేనా?


నా ప్రవర్తనకు, అలిగి కూర్చుంది. ఎన్ని సారీలు, ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళింటికెళ్తానంది. లోపల ఆనందం బయటికి కనపడకుండా తొక్కేసి,  వేరే పేటలో ఉంటున్న మా అత్తగారింట్లో దింపి
"తప్పని సరిగా నేను నిన్ను కోల్పోతానని" ఇంగ్లీషులో నమ్మబలికి ఇంటికొచ్చా.

దౌర్జన్యప్రేమ బాధితుడినైన నేను చాలా రోజులనుండీ నిద్రకు కరువొచ్చిన వాడిలా పగలేదో రాత్రేదో తెలియకుండా నిద్రపోయా. నిద్రలేచేసరికి సాయంత్రమవుతోంది.

ఇంటివెనక్కి వెళ్ళి గోంగూర కోసుకుని పది నిముషాల్లో పచ్చడి చేశాను. లేత కర్వేపాకు తెచ్చి తాలింపు పెట్టి మజ్జిగ పులుసు తయారు చేశాను.

రాత్రయ్యే సరికి , టీవీ ముందు నేల మీద బిచాణా పరిచాను. తిండి సరంజామా అంతా సర్దుకున్నాను. అన్నం వండిన కుక్కర్, గోంగూర పచ్చడి అందులో నంజుకోడానికి లేత పచ్చిమిరప పిందె ఒకటి పక్కన బెట్టుకున్నాను.
తినబోయేంతలో కొత్త ఆలోచనొకటి మొలకెత్తింది. ఈ వేడి అన్నంలో ఉల్లిపాయ నంజుకుంటే ఉత్తమం. ఉల్లిపాయంటే మరీ గరుత్మంతుడి టైపు కాదు. చిన్న సైజుది ఓ మాదిరి అంగదుడి లాంటి పాయైతే సరిపోతుంది. ఏవంటారు?

చెప్పులేసుకుని తలుపులేసి బజారు పోయాను.


పావుకిలో ఉల్లిపాయలు,కొని ఇంటికొచ్చి తలుపుతీయగానే ఏదో పూలవాసనొచ్చింది. తలుపేసి చుట్టూ చూశాను. ఎవరూ లేరు. అంతా నా భ్రమ. "పిచ్చి గున్నణ్ణి, పెళ్ళానికెంత దడిసి పోయాను.” సెల్ఫ్ పిటీతో కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను .

టీవీ ముందు కూర్చుని నాకు నచ్చిన ప్రోగ్రాం పెట్టాను.

అందులో ఏంకర్ పొట్టి స్కర్టు వేసుకుని ఇప్పటి ట్రెండ్ ప్రకారం కాలుమీద కాలేసుకుని కూర్చుని ఉంది. ప్రోగ్రాం లో అందరూ స్వచ్ఛమైన వెకిలితనం లో పోటీపడుతూ విరగబడుతున్నారు. 

  కొన్ని మాటలు అయోమయంగా ఉన్నాయి గానీ గెస్ట్ గా వచ్చినావిడ నవ్వులు, మారుతున్న ఆవిడ ఎక్స్ప్రెషన్లు గమనించుకుంటూ పోతుంటే ఎంత జటిలమైన బూతులైనా ఇట్టే అర్ధమవుతున్నాయి. నేను కూడా వాళ్ళకు దీటుగా తన్మయత్వంతో ఊగిపోతూ ఓ ముద్ద కలిపాను. ఇంకో చేత్తో ఉల్లిపాయ తీసుకున్నాను.

ముద్ద తిని పాయ కొరకాలా, పాయ కొరికి ముద్ద తినాలా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతుండగా, నా ఎదురుగా ఉన్న అద్దంలో ఏదో ఆకారం కనిపిస్తోంది. అద్దంలోకే చూస్తున్నాను. ముద్ద పెట్టుకుందామనుకుని తెరిచిన నోరు భయాందోళనలకు గురై అదే స్థితిలో ఉండిపోయింది. ఆ ఆకారం సోఫా వెనకనుండి లేస్తోంది. సోఫామీదకెక్కి నా వీపు మీద దభీ మని దూకడానికి అరక్షణం మాత్రమే పట్టింది.

"అయ్యబాబోయ్, దెయ్యం, దెయ్యం, ఫైరింజన్ పిలవండి " అని మతిబోయి కేకలేస్తూ , ఇల్లంతా చెడ తిరుగుతున్నాను. ఆ గోలలో తిండంతా తన్నేసుకున్నాను.

కంగారు తగ్గిన తర్వాత చూస్తే దెయ్యం కాదు, నా భార్యే!

   విజయవంతంగా, సంతోషంగా, ఆమెను నేను కోల్పోయినా, ఆమె మాత్రం నాకు దూరంగా మనలేని ప్రేమతో వచ్చేసిందట!
నేను ఉల్లిపాయలకోసం వెళ్ళినపుడు, డూప్లికేట్ తాళంతో తలుపు తీసి సోఫా వెనక నక్కిందట నన్ను ఆశ్చర్యంలో ముంచడానికి.

"ఛీ పిరికి, ఎలా ఉంది సర్ప్రైజ్, " అంటూ నా రెండు చెవులూ పట్టుకుని ,వాటి ఆధారంతో నా తలకాయ అటూ ఇటూ ఊపుతూ ముద్దు చేస్తోంది.

అయ్యింది. అంతా అయ్యింది.
నా బతుక్కి శాంతి లేదు.

అయ్యలారా, అమ్మలారా, గుండు చేయించుకుని, దాన్ని ఖరీదైన కాషాయం తో కవర్ చెయ్యాలన్న దురాశ నన్ను నిలవనీయడం లేదు. అది తీరే మార్గం లేదా? 

3, మే 2013, శుక్రవారం

దోషి

ఈ నెల వాకిలిలో నా కథ
(వాకిలి వెబ్ మేగజైన్ టీం కు ధన్యవాదాలతో )

దోషి

ఇంటికి తాళం పెట్టి ఉంది. వాకిట్లో ముగ్గు లేదు. ఏమయ్యిందో రమణకు. తమ ఊరెళ్ళి పోయి ఉంటుందా. ఆమె తల్లీదండ్రీ వచ్చి తీసుకెళ్ళిపోయుంటారా? అమ్మో తనమీదే ప్రాణాలు రమణకు అనుకుంటూ ఇంటి వెనక వేపువెళ్ళి వెతికాడు. అక్కడా లేదు.

దణ్ణెం మీద బట్టలారేస్తూ పక్కింటి పద్మ కనిపించింది.

"రమణ ఏది?”

"దొరగారింటికెల్లింది.”

"ఇంట్లో పని చెయ్యడానికెల్లుంటది.”

పద్మ బదులు చెప్పలేదు.


బరువుగా ఉన్న సంచీతోనే యజమాని ఇంటివేపు పరుగు లాంటి నడకతో వెళ్ళాడు.

గేటులోంచి చూస్తే ఇంటి బూజు దులుపుతున్న రమణ కనిపించింది.

గేటులో నారాయణ ను చూడగానే బూజు కర్ర ఒద్దికగా పక్కన పెట్టి చీర కుచ్చిళ్ళు సరి చేసుకుని దగ్గరకొచ్చింది.

దొర ఇంట్లో, పని చేస్తున్నట్టుగా లేదు. కట్టూ బొట్టూ చూస్తే ఇంటి పని చేసుకుంటున్నట్లు తోచింది.

అతనితో బాటే బయటకొచ్చింది.

ఊళ్ళమీద ఎండల్లో తిరగడం వల్ల రంగు తగ్గింది. వేళకు తిండిలేక, పోషణలేక చిక్కిపోయాడు. మట్టికొట్టుకుపోయిన బట్టలు.

"గభాల్న చూస్తే గుర్తు పట్టలేక పోయాను. ఏంటిట్టా అయ్యావు.” అంది

ఎలా అయ్యాను?”

ఏం లేదులే!”

"ఓహో చిక్కిపోయాననా? ఎక్కడ రమణా, తినేందుక్కూడా టైముండదు. రోజంతా పనే.”

నారాయణ ఇంటివేపు వెళ్ళబోతుంటే అటుకాకుండా గుడి వేపుకు దారితీసింది.

"అదేంటే?" అంటే "నీతో ఓ సంగతి చెప్పాలి" అంటూ గుడి పక్కన చెరువు దగ్గర ఆగింది. చెరువు లోకి దిగడానికి వీలుగా మెట్లు, మెట్లకు రెండువేపులా సిమెంటు అరుగుల్లాంటివి కట్టారు. ఒక దానిపై కూర్చున్నాడు. రమణ కూర్చుంటుందని కొద్దిగా జరిగాడు కానీ అతనికెదురుగా కూర్చుంది.

అప్పుడప్పుడు చేపలు ఎగిరి మళ్ళీ నీళ్ళలో పడుతున్నాయి.

"ఏమయిందే, ఈడకు తెచ్చావెందుకూ?”

"కొన్ని సంగతులు చెప్తాను, మనసు కష్టపెట్టుకోవాక.”

ఆమెకు చేతనైనట్లు విషయం చెప్పింది.

ఆమె మాటలు వినేందుకు కష్టంగా తోచాయి, కానీ తేలికగా అర్ధమయ్యాయి.

ఆపైన మనసు మోయలేనంత బరువైంది.

నారాయణకు తామిద్దరూ మొదటిసారి మాట్లాడుకున్న రోజు గుర్తొచ్చింది.కొన్ని నెలలక్రితం ఇక్కడికి రాకమునుపు ఇద్దరూ కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూళ్ళో ఉండేవాళ్ళు. నారాయణది గుడిపక్కన చిన్న షాపు. పూజ సామాన్లు, పిల్లలకు ఆటబొమ్మలు, గాజులు అమ్మే వాడు. తల్లి చిన్నతనంలోనే పోయింది. రెండేళ్ళ క్రితం తండ్రికి జబ్బు చేసినపుడు చదువు మానేసి కొట్టు చూసుకోవాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చేర్చిన రెండు వారాల తర్వాత తండ్రి పోయాడు.
ఆడపిల్లలు అసూయపడేంత అందంగా సుకుమారంగా ఉండే వాడు. ఆడపిల్లలు నారాయణను చూసేందుకే వచ్చేవాళ్ళు. బేరం అయిపోయినా ఏదో వంకన మాట్లాడుతూ ఉండేవాళ్ళు.

రోజూ రమణ , తల్లితో కలిసి గుడికి వెళ్ళేది . ఆమె వెళ్తూ ఉంటే కుర్రోళ్ళంతా మాటలాపేసేవాళ్ళు. ఎవరివంకా చూసేదికాదు. నారాయణకు మాత్రమే తెలిసేట్టు క్షణం పాటు రెప్పలెత్తి చూసేది. ఎవరినీ అంటకుండా సీదాగా నారాయణ మీద బాణం లాగా చూపేసి వెళ్ళేది. ఆ ఒక్క చూపు, వళ్ళంతా సంతోషం నింపేది. గుండెంతా గుబులయ్యేది. మళ్ళీ రేపు సాయంత్రం వరకూ అదే ధ్యాసతో కొట్టుకులాడేవాడు. దారిలో ఎక్కడేనా ఎదురుపడితే ఇద్దరూ వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసుకునే వాళ్ళు.

ఓ రోజు సాయంత్రం గుడి వెనక కలుసుకుంది. పెళ్ళాడటానికి మేనమామ కొడుకు వస్తున్నాడని కబురొచ్చిందంది. పెళ్ళిఖాయమైపోనట్టేనంట. మిలట్రీ లో పనిచేస్తాడనీ, బాగా మోటు మనిషనీ చెప్పింది. ఆడికి సెలవలెక్కువగా ఉండవు కాబట్టి వచ్చీ రాంగనే పెళ్ళి చేసుకుని పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోతాడంట. నారాయణ లేకపోతే చచ్చిపోతానని ఏడ్చింది. ఆడితో పెళ్ళయి, ఆడు వంటి మీద చెయ్యేస్తే చెర్లో శవంగా తేల్తానంది. అప్పటికప్పుడు ఊరిడిచిపెట్టి వెళ్ళిపోదామని, హాయిగా కలిసి ఉందామంది. వీళ్ళకు దూరంగా ఎక్కడైనా కష్టం చేసుకుని బతుకుదామంది. అతనేం చెప్పబోయినా వినిపించుకోలేదు.


తర్వాతి రోజు తెల్లవారు జామునే , ఇద్దరూ కలిసి రైలెక్కి తమ వూరికి దూరంగా వేరే ఊరెళ్ళి, పత్తి మిల్లులో చేరారు. రోజుకు చెరొక వంద రూపాయలు. పగలంతా పని. రాత్రి నిద్ర. తెల్లవారుజామునే లేచి పన్లోకెళ్ళాలి. పని అలవాటులేక రమణ లేచేది కాదు. రమణ సరిగా చెయ్యడం లేదని మిల్లు పన్లోకి వద్దన్నారు. రమణ యజమాని ఇంట్లో పనికి కుదిరింది. యజమాని ఇంటి దగ్గర్లోనే చిన్న పాకలో ఉండేవారు.

ముందు జాగ్రత్త గా మెడలో పసుపచ్చ తాడు, కాలి వేలికి మెట్టెలు తగిలించినా కూడా, బిక్కుబిక్కుమనే ఇద్దరి మొహాలు చూస్తే వీళ్ళసలు పెళ్ళి చేసుకున్నారా, భార్యాభర్తలేనా అని చూసిన వాళ్ళకు అనుమానమొచ్చేది.

నాలుగునెలలు గడిచాక నమ్మకంగా పని చేస్తున్నాడని, పరాయి సొమ్ము ముట్టుకోడని యజమానికి నారాయణమీద గురి కుదిరింది. వ్యాపారం లో డబ్బు లావా దేవీలు చూసేందుకు పై ఊళ్ళకు పంపేవాడు. కొన్ని సార్లు వారమో, రెండు వారాలో అక్కడే ఉండాల్సివచ్చేది. కొత్త ఊరు పాత బడింది.


ఓ రోజు మేనేజర్ రమణ వాళ్ళ పాక దగ్గరకొచ్చాడు. ఇంట్లోకి కావల్సిన సరుకులు రమణనడక్కుండానే ఇంట్లో పెట్టాడు.

ఏమిటి సంగతంటే, నీకేవైనా కావాలేమోనని యజమాని కనుక్కురమ్మని పంపారన్నాడు. అలసట తీర్చుకోడానికి కూర్చున్నట్లు అరుగు మీద కూర్చుని కబుర్లు మొదలెట్టాడు.

మేనేజర్ ఎప్పటినుండో యజమాని దగ్గరే పనిచేస్తున్నాడట. భార్యపోయి రెండేళ్ళైనా యజమాని ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదట. ఎప్పుడూ బిజినెస్ వ్యవహారాలేగానీ చిల్లర వ్యవహారనేవి పట్టవట. మనసు నవనీతం, గుణం బంగారం అంటూ ఇంకా ఏవేవో చెప్పుకొచ్చాడు.

ఏ రోజుకారోజు కొత్త కబుర్లు చెప్పేవాడు మేనేజర్. యజమాని అంత తొందరగా ఎవరి వంకా చూడడట. అల్లాటప్పా ఆడవాళ్ళ మీద చూపు పడదంట. ఆయన చూపేశాడంటే ఇక ఆపిల్లను అప్సరసల అప్పచెల్లెలనుకోవాల్సిందేనట. ఒక్కసారి చేపట్టాడో ఇక స్వర్గాన్ని తీసుకొచ్చి పెరట్లో వాకిట్లోనో దింపేస్తాడట. అయ్యగారికి ఎదురుచెప్పడం, ఎదురుదెబ్బతింటం ఇవేవీ తెలివున్న పనులు కాదట. ఏది చెప్పినా సరే చెవిలో రహస్యం చెప్తున్నట్లు మెత్తగా చెప్పేవాడు.

ప్రతిరోజూ ఏదోవంకన జీపాగేది.

"మొన్న, బెల్లం మర్చేపోయానేవ్ నామతి మండా" అంటూ బెల్లం బుట్ట దింపి అటక మీద పెట్టడానికి లోపలకెళ్ళాడు మేనేజర్.

"ఎందుకివన్నీ? ఏం చేసుకోను ?" కోపంగా అడిగింది మేనేజర్.

"నన్నడుగుతావేమే? అయ్యగారున్నారుగా అడగరాదూ" అని లోపలే ఏదో సర్దుతున్నాడు మేనేజర్.

రమణ మెల్లగా జీపుదగ్గరకెళ్ళి "ఒక్క దాన్ని ఈ సరుకులన్నీ ఏం జేసుకోను?” నేల చూపులు చూస్తూ అడిగింది మెల్లగా. అడుగుతుంటే గుండె వేగంగా కొట్టుకోవడం ఆమెకు తెలుస్తూనే ఉంది.

రమణను పైనుంచి కిందివరకూ చూసి " అవునుమరి ఒక్కదానికి కష్టమే. ఏం జేస్తావు?” అన్నాడు .

రమణ కు అప్పటికప్పుడు సిగ్గుముంచుకొచ్చి లోపలికి పరుగు తీసి అద్దం ముందు నుంచుంది.

'నాలో ఏం నచ్చింది?” అనుకుంటూ.

తర్వాతి రోజు పాక ముందు జీపాగింది. మేనేజర్ కూరగాయలు, పళ్ళు తీసుకొచ్చి ఇంటో దింపి మళ్ళీ మొదలెట్టాడు. భార్య ఉన్నన్నన్నాళ్ళూ రోగమనీ, మందులనీ ఆస్పత్రులచుట్టూ తిరిగేదట . ఆయనకు శ్రమతప్ప సుఖం లేదట. ఇంతమందికి మేలు చేస్తున్న దేవుణ్ణి పట్టించుకునేవారే లేరట. కానీ పెదవి విప్పి తనబాధ ఎవరితోనూ చెప్పుడట. గరళం మింగిన శివుడేనట.

ఇవాళ అయగారు భోజనం చేయలేదట. అయ్యగారు భోజనం చెయ్యలేదని మేనేజర్ కు మనసెలాగో ఉందట. కనిపెట్టి చూసుకునే మనిషెవరూ లేకపోయారని వాపోయాడు.

భోజనం వండి ఉంచుతాను. తీసుకెళ్ళమంది.

"నేను తీసుకెళ్ళడవేమిటే, నీకు మాత్రం ఆయన యజమాని కాదూ? భోజనం పట్టుకెళ్ళడానికి ఏవిటే నీకు నామోషీ?” అంటూ కసిరాడు.

రమణ వాకిట్లోకొచ్చి నిలబడింది. జీపులో కూర్చున్న యజమాని ఆమెవంక చూడకుండా దారివంక చూస్తూ మీసం సవరించుకుంటున్నాడు.ఎందుకో యజమాని తనవంక చూడకపోవడం రమణకు నచ్చలేదు.

"ఎట్టా ఎల్లేది. ఇటుపక్కకే సూడడు" మేనేజర్ తో ఫిర్యాదుగా అంది.

'వలలో పడిన చేపతో ఇంక కబుర్లేవిటీ?' అనుకుని
"ఓసి నీ దుంప తెగా, అందరూ చూసేవేళ చూస్తారటే మహారాజులు. ఎవరూ లేని వేళ చూసుకుని నీవంక దొరగారు చూస్తారో, దొరవంక నువ్వు చూస్తావో నాకేమి ఎరుక ?” అంటూ, ముసిముసిగా నవ్వుతూ పంచె కొంగు ఎడమ చేత్తో ఎత్తిపట్టి వెళ్ళిపోయాడు.
పనికెళ్ళే రోజుల్లో పత్తిమిల్లులో అందరూ దొంగ చూపులు చేసేవారే. నారాయణతో ఉట్టుట్టి స్నేహం చేసేవారు. నారాయణ భుజాన చేతులేసి తలా తోకా లేకుండా మాట్టాడుతూ తనవంక దొంగతనంగా చూసేవారు. దొర ఇంటో ఉంటే వేరే మనుషులు కన్నెత్తి చూస్తే ఒట్టు.

దొరకెంత మంచి ఇల్లు. ఎన్ని గదులో. ఊళ్ళో తమ ఇంటికన్నా బాగుంది. ఇంటిముందు ఎంత పెద్ద తోట. ఎన్ని పూలో. మల్లెపూలు కొనాల్సిన అవసరమే లేదు. వంట తప్ప పనులేం చెయ్యక్కర్లేదు.

తర్వాతి నుండీ ఆమెకు నారాయణ లో లోపాలన్నీ ఒకటొకటే గుర్తొస్తున్నాయి. కొంచం వంగి నడుస్తాడు. దొర ఐతే దొరలాగే ధైర్యంగా నడుస్తాడు . నారాయణ మరీ తెల్లగా ఆడపిల్లలా ఉంటాడు. దొరది మంచి రంగు. మగవాడి రంగు. కోరమీసం. నారాయణకు సిగ్గు, మొహమాటం. ప్రతి దానికీ భయపడతాడు. తామిద్దరూ ఇక్కడికొచ్చిన మొదట్లో భయంగా ఉందని ఊరికూరికే ఏడిచేవాడు. అస్సలు ధైర్యం లేదు. దొరకెంత ధైర్యం. మగవాడంటే ఎలా ఉండాలి. ఇద్దర్నీ పోలుస్తూ, తూకం వేస్తూ గడిపింది. బరువు పెరిగిన వేపుకే మనసు త్రాసు ఒరిగింది.

దొర ఎంత ఇష్టంగా తిన్నాడు తను చేసిన పులుసు. అడిగి మరీ వడ్డించుకున్నాడు. తన వంట రుచి చూశాడుగా, ఇక వదలడు.

ఇల్లంతా శుభ్రం చేసింది. పసుపు రాసి బొట్లు పెట్టింది. దొరకు పెళ్ళాం పోయి రెండేళ్ళవుతోందట. మళ్ళీ పెళ్ళిచేసుకోడా? నాకన్నా బాగా చూసుకునేవారెవరు దొరుకుతారు?
ఇద్దరూ ఆలోచనల్లోంచి బయటకొచ్చారు.

విన్న విషయం కన్నా రమణ మొహం లో భావాలే అతనికి కష్టంగా అనిపిస్తున్నాయి. అతనెందుకొచ్చాడా, ఎప్పుడెళ్తాడా అన్నట్లు ఎటో చూస్తూ కూర్చుంది. అతను చేసిన నేరానికి ఆమె ఫలితం అనుభవిస్తున్నట్లు కూర్చుంది. అతనికేం మాట్లాడలన్నా కూడా బెరుకుగా అనిపించింది.

ఒక చేప ఒడ్డున పడింది. నారాయణ లేచి దాన్ని నీళ్ళలోకి విసిరేశాడు.

ఎందుకొప్పుకున్నావు రమణా?”

ఒప్పుకునేదేముంది. ఏరే దారి లేకపోయింది. ఆడదాన్ని. రోజంతా ఇంటిసుట్టూ తిరిగేవోడు. నాకెవరున్నారు అండ. నువ్వు చూడబోతే ఏడకుబోయావో తెలియకపోయె.”

అయితే నా తప్పేనా?”

జరిగినదానికి కనీసం రమణ ఏడిస్తే బాగుణ్ణు అనిపిస్తోంది కానీ కఠినంగా ఉన్న ఆమె ముఖం చూసి అతనికి నీరసమైంది.

అంత విచారంగా అంతకుమునుపెపుడూ లేదు. కానీ ఇదివరకులా ఏడవలేకపోయాడు.


"ఏం చేద్దాం రమణా?”


"జరిగిందేదో జరిగింది.నువ్వూరికెళ్ళిపో." తీర్పు చెప్పగల అధికారం ఆమెకున్నట్లు అంది

నారాయణ ఏమీ మాట్టాడలేదు.

"సరేలే, నువ్విట్టా నా దగ్గిరగా కూసుండగా దొర జూస్తే ప్రమాదం. అసలే కోపమెక్కువ. నిన్ను చంపినా చంపుతాడు.”
ఇతనెటూ పిరికివాడే . ఆమె వరించిన వాడు వీరుడు.

"సరే రమణా, ఈ డబ్బిచ్చి వెళ్తాను.”

"నేనిస్తాలే. నువ్వెళ్ళు"

"కాదు రమణా, లెక్క చెప్పొద్దా? " ఇద్దరూ నడిచి దొర ఇంటికొచ్చారు.

అప్పటికి దొర ఇంటి బయట కూర్చున్నాడు.


అయ్యగారూ అంటూ నారాయణ డబ్బు సంచీ తీసి ఇచ్చాడు. దొర మొహం చూడలేక, తనే తప్పు చేసినట్లు తలదించుకున్నాడు.

ఆ ఊరి వ్యాపారం లో అంత సొమ్ము కళ్ళ జూడడం అదే మొదటి సారి. దొర కళ్ళు వెలిగాయి. సిగరెట్ ముట్టించి పొగ వదిలాడు. ఆలోచనలు కూడా కమ్ముకుంటున్నాయి.

"ఇహ నుండీ నువ్వాడనే ఉండి యాపారం జూసుకో." నారాయణ తో చెప్పాడు

దొర ఉద్దేశ్యం రమణకు ఇంకోలా అర్ధమైంది. కళ్ళు దించుకుని నేల చూపులు చూస్తూ, సిగ్గు కప్పిపుచ్చుకునేందుకు చీరకొంగు ముడిపెడుతూ విడదీస్తూ నిల్చుంది.

రమణ వంక చూశాడు దొర.

'మెల్లగా ఇంట్లో తిష్ట వేసేట్టు ఉంది. వదిలించుకోవాలి' లోపలే అనుకుని

" దీన్నికూడా తీసుకెళ్ళు. తెల్లారుజాము బండికి పోండి. అప్పుడప్పుడొచ్చి నేను చూసుకుంటుంటా.............యాపారం." నారాయణతో చెప్పాడు.

ఇదేంటి అన్నట్టు రమణ దొరవంక చూసింది.

అతనదేం పట్టనట్టు సిగిరెట్ చివర మంటని జాగ్రత్తగా చూస్తున్నాడు.

ఇద్దరూ అలానే నిల్చోవడం అతనికి విసుగనిపించింది.

అక్కడ ధాన్యపు రాశి దగ్గర పనిచేస్తున్న పని వాళ్ళను కేకేశాడు. "ఒరేయ్ ఈళ్ళక్కూడా ధాన్యం కొలవండి" అంటూ లేచి లోపలికెళ్ళాడు యజమాని.

కొలవద్దని పని వాళ్ళతో చెప్పాడు కానీ కొలువొద్దని చెప్దామంటే దొర అక్కడ లేడు.

ఇంటి గుమ్మం దాటి లోపలికెళ్ళే ధైర్యం ఇద్దరికీ లేదు. పదినిముషాల ముందే ఆమె పసుపు రాసిన గుమ్మాలు.

ఇద్దరూ తమపాక వేపు అడుగులేశారు.

దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు.

పదినిముషాలముందే తామేం మాట్లాడుకున్నారో గుర్తొచ్చింది ఇద్దరికీ.

ఇంటికెళ్ళాక ఇద్దరికీ తిండి తిందామన్న ధ్యాస లేదు.

ఇంటి తాళం తీసి లోపలొకెళ్ళింది. అంతా బూజుపట్టింది. ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. శుభ్రం చేయకుండా గుంజకానుకుని కూర్చుంది. నారాయణ బయట అరుగుమీద కూర్చున్నాడు. ఒకరితో ఒకరికి మాటల్లేవు. సాయంత్రం రాత్రైంది. పదింటి వేళ లోపలికెళ్ళి తను వస్తూ వస్తూ కొన్న మంచినీళ్ళ సీసా ఇచ్చాడు. తినడానికి కొన్నవి ఇచ్చి తినమన్నాడు. ఆకలికి సిగ్గులేదు కనక సరిపోయింది. లేకపోతే ఎంతమంది బతికుంటారు లోకంలో.

దూరంగా ఓ చోట కూర్చున్నాడు.


"ఇద్దరం వచ్చాము. నన్నొక్కణ్ణే పొమ్మన్నావు. ఆయనేమీ ఇద్దర్నీ పొమ్మన్నాడు. నువ్వే చెప్పు ఏంచేద్దామో?”

రమణ ఏం మాట్టాడలేదు.

"పద రమణా, ఊరు తీసుకెళ్తాను.”

"అమ్మా నాన్నా చంపేస్తారు.”

"నేను వదిలిపెడతానులే.. భయపడకు.”

****

రైలు దిగి ఇంటికెళ్ళేసరికి ఇంకా చీకటిగానే ఉంది.

తెల్లవారు జామున పార్వతమ్మ ఇంటిముందు ముగ్గు పెడుతోంది.

కూతుర్నీ, ఆమె పక్కన నారాయణనూ చూసి క్షణం నోట మాట రాలేదు. ఓలమ్మో అని కేకెయ్యబోయి నోరునొక్కేసుకుంది. వెంటనే తెలివి తెచ్చుకుని గబగబా గొడ్ల సావిట్లోకి లాక్కెళ్ళింది.

"ఏడకు పోయారే? నికోసం మీ అయ్య తిరగని ఊరులేదు.”

మేనమామ కొడుకుని పెళ్ళిచేసుకోవడం ఇష్టం లేక ఇతన్ని తోడు తీసుకుని ఎటో వెళ్ళాననీ, భయమేసి ఇంటికొచ్చేశాననీ ఎక్కిళ్ళ మధ్య పొంతన లేని కథ చెప్పింది రమణ. పార్వతమ్మ రెట్టించ దలుచుకోలేదు.


" పట్నంలో ఉన్న పెద్దకూతురుకి ఒళ్ళు బాగాలేదనీ, సాయానికి పట్నమెళ్ళిందని ఇప్పటిదాకా అందరికీ చెప్పుకొస్తన్నాం అయ్యా. ఇయ్యాల నువ్వు దాంతో కలిసి వచ్చావని తెలిస్తే పరువుపోద్ది. ఈళ్ళ నాయన నిన్ను చూస్తే సంపేస్తాడు. నాయనా, ఊరిడిసి ఎల్లిపో నీ మంచికే సెప్తున్నా. ” అంటూ నారాయణను బతిమలాడింది.

"నా కొట్టూ , అదీ ఈడనే కదా! ఏడికని పొయ్యేది ? "


రమణ తండ్రి సావిట్లోకొచ్చాడు. ముగ్గుర్నీ చూశాడు. ఎవరూ నోరిప్పకపోయినా విషయం అర్ధమైంది.

కోపం పొంగుకొచ్చి "ఏరా! పిల్లకు ఏం మాయమాటలు చెప్పి తీసుకెళ్ళావురా?” అంటూ చేతికందిన కర్రతో నారాయణ మీదకెళ్ళాడు. ఎక్కడకొడుతున్నాడో చూసుకోకుండా కోపమంతా కొట్టడంలో చూపిస్తున్నాడు.

రమణతల్లి వచ్చి, "అయ్యా పిల్లబతుకు అల్లరైపోతది.” అని మొగుడి కాళ్ళమీద బడి " జరిగిందేదో జరిగింది. ఊళ్ళో జనాలకు తెలిస్తే బతకనియ్యరు మనల్ని. ఆ పిల్లోణ్ణి పంపించేయ్" అంది.

ఆవేశం తగ్గి, ఆయాసం తీరాక రమణ తండ్రికి తెలివొచ్చింది. భార్య మాటలు అర్ధమై చేతిలో కర్ర నేలకు విసిరికొట్టాడు రమణ వంక చూసి ఛీ అని లోపలికెళ్ళాడు.

"అయ్యా తెల్లారకముందే ఎల్లిపోయ్యా. నీకు దణ్ణమెడతా.” అంది పార్వతమ్మ

లేచి బట్టలు దులుపుకుని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు.

పార్వతమ్మకు ఉసూరుమనిపించి ఆమె కూడా వెనక్కి తిరిగి చూసింది. కానీ రమణక్కడ లేదు. అప్పటికే లొపలికెళ్ళిపోయింది.