6, నవంబర్ 2013, బుధవారం

అతడు - ఆమె-1

continued from అతడు - ఆమె


హోటల్ లో తన ప్రైవేట్ స్వీట్ లోనికి వెళ్ళాడు. బెడ్ రూం లో భార్య నిద్రపోతోంది. సౌందర్యం మాత్రం మెలకువగా ఉండి ప్రహరా కాస్తోంది. 

బట్టలు మార్చుకుని, ఆమె నిద్ర లేస్తుందేమోనని, చప్పుడు కాకుండా  బాల్కనీ లోకి వెళ్ళి కూర్చున్నాడు. 

  చల్లగాలి వీస్తోంది. అప్పుడో చినుకు ఇప్పుడో చినుకు పడుతున్నాయి అతనిమనసులో ఆలోచనల్లాగా.  లోపలికెళ్ళి ఒక డ్రింక్ తెచ్చుకుని చీకట్లోకి చూస్తూ కూర్చున్నాడు.  

గుండెల్లో ఏదో తెలియని దిగులు. 

 ఎప్పటికో నిద్ర వస్తుందన్నట్లనిపించి లోపలికెళ్ళి కౌచ్ మీద పడుకుని నిద్రపోయాడు.

*****

     వెలుగొచ్చి కళ్ళమీద పడుతోంది.  నిద్రలేవగానే కాళ్ళవరకూ కప్పిన బ్లాంకెట్ చూశాడు. తనేమీ కప్పుకుని పడుకోలేదే. భార్య కప్పి ఉంటుంది. చుట్టూ చూశాడు. ఆమె జాడ లేదు. లేచి కూర్చున్నాడు.రాత్రి తాలూకు నైరాశ్యం పొగమంచులాగా అతన్నింకా వదల్లేదు. 
 గ్లాస్ విండో లోనుండి బయటకు చూస్తే, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ లో భార్య ఈత కొడుతోంది. 

 టైం ఎంతైందో, చూశాడు. ఎనిమిది కావొస్తోంది. 

ఫోన్  మోగుతుంటే చెయ్యి చాచి అందుకున్నాడు.

హోటల్ రిసెప్షన్ నుండి మాట్లాడుతున్నారు.  

“సార్, మీకోసం ఒకరొచ్చారు. మీకు సంబంధించిన ఇంపార్టెంట్ వస్తువొకటి మీకందివ్వాలంటున్నారు.” 

“ముఖ్యమైన వస్తువా? ఏంటది.” 

“ఒక్క నిముషం సర్. ఆమే మీతో మాట్లాడతారట.” ఎవరికో ఫోన్ అందించారు. 

ఆమె? ఎవరు?

“గుడ్ మార్నింగ్ సర్.  ఇంత ఉదయాన్నే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి. 
నేను భాను ని ..” అంటూ ఏదో చెప్పబోతోంది. ఆమెను ఆపేసి 

“భాను.. అంటే , ఎవరు మీరు?”  అడిగాడు

“సర్, నిన్న యూనివర్సిటీ నుండి నాకార్లో వచ్చారు.”

కప్పుకున్న బ్లాంకెట్ తీసి విసుగ్గా పక్కన పడేశాడు. అతనికి కొత్త పరిచయాలన్నా,  స్నేహాలన్నా, భయం. ఆ పరిచయం మొక్కకు ఎక్కువ నీళ్ళు పోసి చంపేసేవాళ్ళని చాలా మందిని రోజూ చూస్తూ ఉంటాడు.

ఆ అమ్మాయి మీద ఏర్పడుతున్న ఆసక్తి మీద నీళ్ళు చల్లినట్లనిపించింది.

“ఇంత పొద్దున్నే …ఏమిటి విషయం?” భాష ఇంగ్లీషుకు మారింది. కంఠంలో కాఠిన్యం వచ్చి చేరింది.


“సారీ సర్.  ఇవాళ ఉదయం, నా కార్లో మీ వాలెట్ చూశాను.  
నిన్న  పడిపోయి నట్టుంది రెండు రోజుల వరకూ సిటీలో ఉండను. అందుకని తప్పనిసరిగా మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యల్సివచ్చింది.  హోటల్ రిసెప్షన్ లో  ఇచ్చి వెళ్తున్నాను.   బై సర్.”

“ఓ …. నిజమా?”  ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్ కార్డ్స్  అన్నీ గుర్తొచ్చాయి.

ఆ అమ్మాయి గురించి తొందరపాటుతో,  తప్పుగా అనుకున్నందుకు మనసు మొట్టికాయలేస్తోంది. 

“మిస్ భాను, ఒక్క అయిదు నిముషాలు వెయిట్ చేస్తారా? నేనే కిందకి వస్తాను. లెట్స్ హావ్ కాఫీ.”

“థాంక్స్ బట్ సారీ సర్, ఫ్లైట్ అందుకోవడానికి ఎక్కువ టైం లేదు. ఇక నేను బయలుదేరతాను.”

“. థాంక్స్ …థాంక్యూ”

“పర్లేదు సర్”


ఫోన్ పెట్టేసిన తర్వాత అనిపించింది ఆమె ఫోన్ నంబర్ తీసుకుంటే బాగుండేది అని. 

 ఆమె మళ్ళీ కనిపించదు కదా. ఛా.
ఆమెందుకు మళ్ళీ కనిపించాలీ? 

ఏమో కనిపిస్తే బాగుండు. 
డోర్ బెల్ మోగింది. హోటల్ స్టాఫ్. 
సీల్ చేసిన కవర్ ఇచ్చి వెళ్ళాడు. కవర్ అలాగే అతను చేతిలో పెట్టుకుని కూర్చున్నాడు.

 స్విమ్మింగ్ అయిపోయిందేమో భార్య వచ్చింది. 
ఎప్పుడూ కడిగిన ముత్యమే. పరిమళాలు వెదజల్లుతూ…

ఆమెకు కనిపించకుండా ఆ కవర్ దాచేశాడు. ఎందుకు దాస్తున్నాడో అతనికే తెలియదు. ఈ విషయం ఆమెకు తెలియాలని అనిపించలేదు. 

“గుడ్ మార్నింగ్” అంటూ దగ్గరగా వచ్చింది.

"గుడ్ మార్నింగ్ డియర్"  అంటూ ఆమె బుగ్గ తాకాడు. అప్పుడే స్నానం చేసి వచ్చిందేమో ,చల్లగా ఉంది. 

********  మూడు రోజుల తర్వాత, బ్రేక్ ఫాస్ట్ టేబిల్ దగ్గర ఎప్పటిలాగా,  అతని సెక్రటరీ  పక్కనే వంగి నిల్చుని   ఐ పాడ్ లో ఆ రోజు స్కెడ్యూల్ చూపించి  వివరిస్తోంది. 

“సర్, ఈ రోజు టీవీ ప్రోగ్రాం షూటింగ్ ఉంది మీకు.”


ఏదీ అంటూ ఐపాడ్ లో కేలెండర్ చూశాడు.

సాయంత్రం నాలుగింటికి  ఒక టీ వీ చానెల్ ఇంటర్వ్యూ అని ఉంది.


. ఈ  హాలిడే ట్రిప్  లో ఏ ఇంటర్వ్యూ ఇవ్వకూడదని అనుకొన్నాడు. మరెందుకు ఉంది అనుకుంటూ గుర్తు తెచ్చుకోబోయాడు.  

టీవీ చానల్ వాళ్ళు వద్దనలేని రెకమండేషన్ తో వచ్చారు. ఒప్పుకోక తప్పలేదు. 

“డిటైల్స్ చెప్పు.” 

“వాళ్ళ చానల్ లో సెలెబ్రిటీ లైఫ్  అనే సీరీస్ నడుస్తోందట సర్. ప్రముఖుల జీవితాలు ఎలా ఎలా ఉంటాయో తెలియజెప్పే ఒక ఇంటర్యూ , షూటింగ్ ఉంటాయట.” 

“తెలుగా? ఇంగ్లీషా?”

“తెలుగు చానెల్ సర్. మీ డైలీ రొటీన్, ఇష్టాఇష్టాలు మాట్లాడుతుంటే  టీవీ వాళ్ళు ఇక్కడే షూట్ చేస్తారట సర్.  ఇవాళ సాయంత్రం నాలుగింటికి వస్తానన్నారు.”

స్కూలు కెళ్ళడానికి బద్ధకించే చిన్న కుర్రాడిలా “ఇది కాన్సిల్ చేయడానికి వీలవుతుందేమో చూడు” అన్నాడు.

వాళ్ళు ఎవరి రికమండేషన్ తో వచ్చారో, కాన్సిల్ చేస్తే రాబోయే సమస్యల గురించి చాలా సాఫిస్టికేటెడ్ ఇంగ్లీషులో చెప్పింది.

ఇంటర్వ్యూ - రొటీన్ ప్రశ్నలు, వాటికి ఇంకా రొటీన్ సమాధానాలు. 


ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ 

ఇష్టమైన హాలిడే స్పాట్

మీ విజయం వెనక స్త్రీ 

ఇలాంటివే కదా, మనసులోనే మననం చేసుకున్నాడు.  ఇలాంటివి ఎన్నో ఇంటర్వ్యూలు చేశాడు .  కానిస్తే సరి అనుకున్నాడు. 


అతను తయారయి నాలుగింటికి ఎదురు చూస్తూ కూర్చున్నాడు. హోటల్ ఆవరణలోనే వెనుక వైపు చిన్న కాటేజ్ ఉంది. మెత్తటి లేతాకు పచ్చ లాన్ . దానికి ఎదురుగా స్విమ్మింగ్ పూల్.  ఎక్కడినుండో మెల్లగా రఫీ పాటలు వినిపిస్తున్నాయి. అతనేదో మేగజైన్ చదువుకుంటున్నాడు. 

అలికిడి ఐతే తల పైకెత్తి చూశాడు. 

ఆమె. 

యూనివర్సిటీ లో కనిపించి, కార్లో దించిన  అమ్మాయి. ఇదేంటీ ఎటు వెళ్ళినా మళ్ళీ ఈ అమ్మాయే కనిపిస్తోంది.

ఈ సారి నల్లని ట్రౌజర్స్ మీద నీలం రంగు షిఫాన్ బ్లౌజ్ వేసుకుంది. . జ్ఞాపకాలను మెలిపెట్టేసే  రింగుల జుట్టు.  ఆమెను చూడగానే తెలియని సంతోషం కలుగుతోంది. 

“మీరు.. మీరా.. రండి రండి”  ఆహ్వానించాడు. 


దగ్గరగా వచ్చి గ్రీట్ చేసింది. 

“ గుడ్ ఈవెనింగ్ సర్.”


“మీరేమిటి ఇక్కడ.”

"నేను జర్నలిజం లో డిగ్రీ చేశాను. కొన్ని నెలలలో Mass communications లో మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాను. అప్పటి వరకు ఖాళీ. ఈ ఛానెల్ లో టెంపరరీ గా పనిచేస్తున్నాను." 

“మరి మొన్న యూనివర్సిటీ లో కనిపించారు?”

“మా చానల్ CEO కు యూనివర్సిటీ డీన్ బాగా తెలుసు.  మా బాస్ ని రిక్వెస్ట్ చేస్తే, నన్ను పంపించారు..”

“మీ పేరు?” మొన్న ఫోన్ లో మాట్లాడుతు ఏదో చెప్పినట్లు గుర్తు!

“భాను …భానుమతి.”

“పాత పేరు కదా.”

“ కానీ నాపేరు నాకిష్టం .” 

“నాతో ఇంటర్వ్యూ ఉంటుందని మీకెప్పుడు తెలుసు?”

“మీరు ఇండియా రాకముందే!”

“మరి  మొన్న కలిసినపుడు చెప్పలేదే?”

“అప్పుడు వర్షం… అదీ.. చెబితే సిల్లీగా ఉంటుందని ..”


“అలాగా , ఇంటర్వ్యూ మొదలెడదామా ?” అని, “నాగురించి ప్రపంచానికి అంతా తెలుసు, ఇంకా ఏవున్నాయి తెలుసుకోవడానికి?”

“సముద్రాన్ని పైనుండి చూసి అంతా చూసేశాం అనుకోలేం కదా. లోపల ఎన్నో ఉంటాయి. తెలుసుకోవాలనిపిస్తుంది.”

ఆమె చిన్నగా నవ్వింది. 

ఆ నవ్వు ఎక్కడో .. బాగా తెలిసిన చిరునవ్వు. గుండె వేగంగా కొట్టుకుంది. 

ఏదో తెలియని కలవరం, ఉత్సాహం, గుబులు. 

ఈ అమ్మాయిలో ఏదో ఉంది. 

ఇంటర్వ్యూ మొదలైంది. “ఐశ్వర్యం, కీర్తి, ఓటమి ఎరుగని జీవితం… ఎంతో మంది కోరుకునే జీవితం మీది. మీ జీవితం గురించి మీరేం అనుకుంటారు? What is YOUR life?”

“సమాధానం ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను. 
మీకో బుట్టెడు పూలిస్తాను.  బుట్టనిండా చేమంతులు, పెద్ద గులాబీలు, మల్లెలు. రెండో వైపు గుబాళించే ఒకే ఒక  మల్లెపూవు. రెంటిలో ఒకటే తీసుకోమంటే , ఏం తీసుకుంటారు?”

ప్రశ్నలో ఏదో మెలిక ఉందని తెలుస్తోంది. కొంచం ఆలోచించి 

“obviously బుట్ట నిండా పూలనే తీసుకుంటాను.”

“ఆ పూలన్నీ ప్లాస్టిక్ వి అయితే ?”

“సార్, మీరు నన్ను  టెంప్ట్ చేశారు.”

“So am I.  Tempted.”

“అదృష్టవంతుల జాబితాలో మీ పేరు మొదటి వరుసలో రాయొచ్చు. దానిపట్ల మీరేమనుకుంటారు?”

అదృష్టవంతుడినా? అతనికి అనుమానమొచ్చింది. 

“కొంచం సిగ్గుగా ఉంటుంది. ఎంతో మంది పేదరికం అనుభవిస్తుంటే నేను మాత్రం కొన్ని సౌకర్యాలు అనుభవించడానికి సిగ్గుగా ఉంటుంది.”

“కానీ మీ సంపాదనలో చాలా భాగం ఛారిటీ కి ఖర్చుపెడుతున్నారు కదా?విద్య, వైద్యం, ఉచితంగా అందించే ఎన్నో  కార్యక్రమాలు చేస్తున్నారు కదా? “  

“పెళ్ళిలో ఎంతో ఆహారం మిగిలి పోతుంది. పారేస్తాము లేదా ఆకలితో ఉన్నవారికిస్తాము. దాన్ని సమాజ సేవ అనగలమా?”

“ మరి? ఆ కార్యక్రమాలని విలువలేని వాటిగా పరిగణిస్తారా?”

“నేను ఈ స్థాయికి రావడానికి మొదట్లో కొందరు సహాయం చేశారు.  ఉపకారం చేస్తున్నామన్న భావన వారికీ ఉండదు, అందుకునే మనకూ కలగనీయరు. అలా చేయగలగడం వారి గొప్పతనం. వారి స్థాయిలో  చేయలేను. వారికీ నాకూ చాలా తేడా ఉంది.”

“ఎలాంటి తేడా?”

“సత్యానికి అసత్యానికీ ఉన్నంత తేడా.”

“ ఒక విజయమవంతమైన జీవితానికి సంతృప్తి కూడా అదే స్థాయిలో ఉందా?”

“కోరుకున్న జీవితం పట్ల ఉండే ఆశ, పడే శ్రమ కొండంత. అందుకున్న తర్వాత సంతోషం నలుసంత.  కంట్లో నలుసంత.”

“అంటే?” 

“శ్రమలోనే ఆనందం. స్థాయిలో కాదు.”


“మీకెదురైన మనుషులు మీతో ఎక్కువగా ఏం మాట్లాడతారు?”

“ఏదైనా సహాయం కోసం నన్ను కలిసే వాళ్ళు ఎక్కువ. అన్ కండిషినల్ గా కలిసేది తక్కువ.”


“మీ విజయానికి కారణమేమయ్యుంటుందని అనుకుంటున్నారు.”

“స్వార్థం. నేను పైకి రావాలని, నేను మాత్రమే అందరికన్నా పైన ఉండాలనే బలమైన కోరిక ఉండడం వల్లనేమో. కొందరు దాన్ని winning attitude అనుకుంటారు”

“మీ వ్యక్తిత్వం లో మీకు నచ్చనిదేమిటి?”

“ బిజినెస్ లో సక్సెస్ అయినంత మాత్రాన నా వ్యక్తిత్వం ఆదర్శవంతమైనదని నేననుకోను. నాలో ఎన్నో లోపాలున్నాయి. వాటిని చూసి చిరాకు పడుతుంటాను.”

“ఏదీ, ఒకటి చెప్పండి.”

“మనుషులని ప్రేమించడం నాకు చేతకాదని నా అభిప్రాయం.”

“మీ సమాధానాలు మిమ్మల్ని బాగా విమర్శిస్తున్నాయి. Are you a realized person? ” 

“సత్యాన్ని తెలుసుకోవడమే realization అయితే I am not. నేనింకా సత్యాన్ని వెతుకుతున్నాను.” 

ఇంటర్వ్యూ కొంచం సీరియస్ గా మారుతోందని అనిపించింది ఆమెకు 

“మీకు మామూలు మనుషుల్ల్లాగా కోపం వస్తుంటుందా? ఇంట్లో మీ భార్య మీద చిరాకు పడడం వంటివి.”

“అలాంటి అదృష్టాలు మా ఇంట్లో కనిపించవు.  చిరాకు పడడం, ఆ తర్వాత బతిమలాడడం వంటి సరదాలు ఉండవు.” 

“ ఒకప్పుడు ఉండేవా?”

“అవి సరదాలని గ్రహించలేని రోజుల్లో ఉండేవి.” 

“ఆ సరదాలు మిస్ అవుతున్నారా?”

“మిస్ కావడం కన్నా, వాటికిపుడు నా లైఫ్ లో చోటు లేదు.”

“మీ భార్యతో అభిప్రాయబేధాలు వస్తుంటాయా?”

“చాలా అరుదు, దాదాపు లేవనే చెప్పాలి.”

“అంటే.. చాలా అన్యోన్యమైన జీవితమన్నమాట.”

“మీకింకా పెళ్ళి కాలేదు కదూ?” అడిగాడు. 

“మీకెలా తెలుసు?”

“అలా అనిపించింది. ఏమనుకోకండి.”

“మీ భార్య పట్ల మీ భావాలెలా ఉంటాయి? మీకు భర్తగా ఎన్ని మార్కులిచ్చుకుంటారు. ?”

“ఆమె పట్ల కృతజ్ఞత గా ఉండాలనిపిస్తుంది. . ఆమె తో జీవించకపోతే, కొందరి విలువ  నాకెప్పటికీ తెలిసేదే కాదు.”

“అంటే ఆవిడ మిమ్మల్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ ఉంటారా?”

“కాదు ,  కరెక్ట్ చేసుకునే అవకాశం కల్పించింది. “

“మీ భార్యతో మీ పరిచయం ఎలా జరిగింది.”

“ఆమె నాకు ముందే తెలుసు.. కానీ  ఆమెతో కలిసి జీవిస్తానని  అనుకోలేదు.” 
.
“మీకిబ్బంది కలిగించే ప్రశ్న?” 

“మీ నుండా? లేక మనుషుల నుండా?”

“ఎవరి నుండైనా.”

“ కొందరు నాకు పిల్లలు లేరన్న  విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించబోతారు. నాకది పెద్ద సమస్యకాదు. దాన్ని ముఖ్యమైన సమస్యగా గుర్తించమని బలవంత పెడతారు. దాన్ని పరిష్కరించమని వత్తిడి చేస్తుంటారు.”


“మీ విజయం వెనుక స్త్రీ ఎవరు? మీ భార్యేనా?”

“మీ నుండి ఈ ప్రశ్న ఆశించలేదు.”

“అంటే?”

“మగవాడి విజయం వెనుక స్త్రీ ఉండాల్సిందేనా? ప్రతి మగవాడి జీవితంలోనూ స్త్రీ ఉంటుంది. ఆమే, అతని విజయానికి కారణమవుతుందని బలవంతాన ఒప్పించాల్సిందేనా?” నవ్వాడు. 

సిగ్గుపడింది.

“ఈ ప్రశ్న తీసేస్తాను లెండి.”

“భలే వాళ్ళే ఉంచండి ఉంచండి. ఆ ప్రశ్న లేకుండా మగవాడి ఇంటర్వ్యూ పూర్తి కాదు కదా!” 

చానెల్ సి ఇ వో అడగమన్నవి కొన్ని, ప్రేక్షకులు ఆశించే ప్రశ్నలు కొన్ని అడిగింది. ప్రశ్నలకనుగుణంగా షూటింగ్ కూడా చేశారు. 

ఇంటర్వ్యూ పూర్తి అయే సరికి  చాలా పొద్దుపోయింది. 


“థాంక్యూ సర్. థాంక్యూ వెరీ మచ్. మీరింత విలువైన సమయం మాకిచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.” మనస్ఫూర్తిగా చెప్పింది.

ఇంతలో అతని ఫోన్ మోగింది.

అతని భార్య చేసింది. 

"ఇంకా అయిపోలేదా?"

"వచ్చేస్తున్నాను" 

ఆ మాట విని భాను లేచింది.

రాత్రి తాలూకు చలి చుట్టుముట్టింది.

“మొన్న చెప్పాలనుకున్నాను. you spoke very well. మీరు మాట్లాడే తీరు బాగుంది. నాకు బాగా నచ్చింది. మీకు మంచి భవిష్యత్తు ఉంది.ఆల్ ది బెస్ట్. “

చిరునవ్వుతో ఆమెకు షేక్ హాండ్ ఇచ్చాడు.

ఆమె చేతిలోని వెచ్చదనం అతన్ని ఆదరించి, ఓదార్చింది. .

గుండె నిండి పోయింది. ఆ రోజు యూనివర్సిటీ రోడ్ మీద కలిగిన ఉత్సాహం మళ్ళీ అతనిలో ప్రవేశించి , ముఖంలో చిరునవ్వుని వెలిగించింది.

“ఇంటర్వ్యూ  ఎడిట్ చేసి మీ దగ్గరకు తీసుకొస్తాను సర్. ఫైనలైజ్ చేయబోయే ముందు మీకు నచ్చనివి తొలిగించేస్తాము."

“ OK “

థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది ఆమె.

రాత్రి డిన్నర్ అయిన తర్వాత తొందరగానే నిద్రపోయాడు. 

ఒకటి రెండు గంటల తర్వాత మెలకువ వచ్చింది. 

ఇంక నిద్ర పట్టదేమోననిపించింది. బాల్కనీ లో చుక్కల్ని చూస్తూ కూర్చున్నాడు. దగ్గర్లో ఏవో పూల చెట్లు కనిపించాయి. రాత్రిపూట విచ్చుకునే తెల్లటి పూలు. వాటి సుగంధం . 
 సాయంత్రం జరిగిన ఇంటర్వ్యూ గుర్తొచ్చింది. జ్ఞాపకాలు విచ్చుకుంటున్నాయి. . అవును కొన్ని పూలు రాత్రి పూటే విచ్చుకుంటాయి.  

(ఇంకా ఉంది) 


13 comments:

అజ్ఞాత చెప్పారు...

అయ్యో...అపుడే అయిపోయిందా ! అనిపించేలా భలే రాస్తారండీ మీరు
మళ్ళీ సీరియల్స్ కి అలవాటు చేస్తున్నారు మీరు

ఎగిసే అలలు.... చెప్పారు...

Chaalaa chaalaa baagundi..
inkaa enni rojulaku raastaaro second part..appadi varaku wait chestundaali:-):-)

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

"రెండు రోజుల వరకూ సిటీలో ఉండను.అందుకని తప్పనిసరిగా మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యల్సివచ్చింది."
"మూడు రోజుల తర్వాత, బ్రేక్ ఫాస్ట్ టేబిల్ దగ్గర ఎప్పటిలాగా, అతని సెక్రటరీ పక్కనే వంగి నిల్చుని ఐ పాడ్ లో ఆ రోజు స్కెడ్యూల్ చూపించి వివరిస్తోంది."

స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా రాస్తున్నారు భలే

నాగరాజ్ చెప్పారు...

ఇంటర్వ్యూ బాగా ప్లాన్ చేశారు. ఆమె ప్రశ్నలు సాదాసీదాగా కాకుండా స్టాండర్డుగా ఉన్నాయి. సమాధానాలు కూడా వాస్తవికంగా కొంత ఫిలసాఫికల్ టచ్ తో బావున్నాయి. "శ్రమలోనే ఆనందం, స్థాయిలో కాదు" - జీవితసత్యాన్ని కాచివడిబోసినట్టుంది ఈ లైను!

anu చెప్పారు...

మీరు రాసే కొన్ని వాక్యాలు మీపట్ల ఆకర్షితులయ్యేలా చేస్తాయండీ.. ఉదాహరణకు కొన్నిపూలు రాత్రి పూటే విచ్చుకుంటాయి.. వంటివి. మీ రచనల కోసం ఇన్ని రోజుల నిరీక్షణ ఈ కథ చదవగానే కొంత తీరిందండి.. మీ రచనలకు addict అయ్యేలా చేశారు మొత్తానికి....

శశి కళ చెప్పారు...

waiting for second part curiously :))

Vanaja Tatineni చెప్పారు...

బావుంది . చాలా ఆకట్టుకుంది . మిగతా భాగాల కోసం ఎదురు చూస్తూ ..

రాజ్ కుమార్ చెప్పారు...

ఇంటర్వ్యూ అదరహో....

ఈ పార్ట్ కూడా అదరహో... ఇలా రెండ్రొజుల గ్యాప్తో నే మొత్తం రాసెయ్యండి ;)

జ్యోతిర్మయి చెప్పారు...

ఇవి చాలా నచ్చేశాయి.

“పెళ్ళిలో ఎంతో ఆహారం మిగిలి పోతుంది. పారేస్తాము లేదా ఆకలితో ఉన్నవారికిస్తాము. దాన్ని సమాజ సేవ అనగలమా?”


“నేను ఈ స్థాయికి రావడానికి మొదట్లో కొందరు సహాయం చేశారు. ఉపకారం చేస్తున్నామన్న భావన వారికీ ఉండదు, అందుకునే మనకూ కలగనీయరు. అలా చేయగలగడం వారి గొప్పతనం. వారి స్థాయిలో చేయలేను. వారికీ నాకూ చాలా తేడా ఉంది.”

వంశీ పరుచూరి చెప్పారు...

Just waiting for the next part :)

Unknown చెప్పారు...

బాగుందండి చాలా నెక్స్ట్ పార్ట్ కోసం ఆత్రుతగా ఎదురు చూపులు ..(రాధిక నాని)

bittu చెప్పారు...

>>కొన్ని పూలు రాత్రి పూటే విచ్చుకుంటాయి.
made it worth waiting for 3 months!! :)
eagerly waiting for the next part...

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

మాబోటి వాళ్ళకి అర్ధమయ్యే రీతిలో రాయాలని మనవి. కొన్ని పూలు రాత్రే పూస్తాయి ఔను - ఈ వాక్యం ఇంకా నాకిక్కడ ఎందుకుందో అర్థం కాలేదు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి