8, జులై 2011, శుక్రవారం

మా హిందీ మాస్టారు         నేను పదో తరగతి చదువుతున్న రోజులు. అప్పలాచారి మేష్టారు తిట్టారని మా  'అమ్మాయి' ఏడుస్తూ వొచ్చింది. మా చెల్లెల్ని మేము ఇంట్లో అమ్మాయనే పిలుస్తాము.ఎనిమిదో క్లాసు చదువుతున్నావ్, నీ పేరు కూడా తప్పు లేకుండా రాసుకోలేవూ అంటూ కోప్పడ్డారని వెక్కిళ్ళు పెట్టింది. నిజమే, పాపం అది హిందీలో బాగా వీకు, అన్ని సబ్జెక్ట్ ల లో మాదిరిగానే. అప్పట్లో అమ్మా నాన్నలు ఇప్పటి పేరెంట్స్ లా పనులు మానుకుని పిల్లల్ని చదివించేవాళ్ళు కాదు. ఆ మాట కొస్తే మేమేం చదువుతున్నామో మా నాన్నకి తెలిసేది కాదు. ఎవరైనా మా ఇంటికొచ్చి, మీ అమ్మాయి ఎన్నో క్లాసని అడిగితే "ఐదో, ఆరో అనుకుంటా! అమ్మాయ్, నువ్వేం చదువుతున్నావే ఇప్పుడు" అంటూ, ఆ చుట్టం ముందే కనుక్కుని, ఆయన వెళ్ళగానే మర్చిపోయేవాడు.పరీక్ష హాలు దగ్గర దింపటం,ఆ మూడు గంటలూ బయట చెట్ల కింద పురిటి నెప్పులు పడే ఈనాటి బాధ్యత గల తల్లిదండ్రుల్ని, ఎప్పుడూ చూడ లేదు ఆ రోజుల్లో.

  స్కూల్లో ఇద్దరే హిందీ మేస్టార్లు. ఒకరు అప్పలాచారి.అనకూడదు గాని, అప్పలాచారి ఒట్టి గాలి మేస్టార్లా ఉండేవాడు. కామెడి విలను వేషాలేసే జయప్రకాష్ రెడ్డి అంత అవతారo, వొళ్ళంతా కనపడే గ్లాస్కో పైజమా లాల్చి వేసుకునేవాడు.   నెలకోసారి, మెడ్రాసు వెళ్లి బొంగురు గొంతుతో తిరిగి వొచ్చే వాడు. సినిమాలో హీరోయిన్ తండ్రి వేషం వొచ్చిందనీ, డబ్బింగ్ అది అయ్యేసరికి గొంతు పోయిందని చెప్పి, తెచ్చుకున్న strepsils బిళ్ళలు క్లాసులో అందంగా వుండే ప్రమీలకు, లావణ్యకూ ఇచ్చేవాడు. అసలు వాళ్ళిద్దరికన్నా కూడా, రోహిణి బాగుంటుందని, మగపిల్లలమంతా అనుకునేవాళ్ళం. కాని, రోహిణి కిచ్చే ధైర్యం లేదు అప్పలాచారికి. ఒకసారి ఆ పిల్లతో పరాచికాలాడుతూ, బుగ్గ గిల్లబోతే , చెంప చెళ్ళుమనిపించిందని స్కూల్లో పుకారు.

        రెండో మేష్టారు, పూజ్యులైన మా హిందీ మాస్టారు గారు. అప్పలాచారికి పూర్తిగా వ్యతిరేకం. సౌజన్య మూర్తి. ఇది ఆయన పేరనుకునేరు. ఆయన్ని పేరు పెట్టి రాయడానికి పెన్ను రావడం లేదు. ఎంత పోకిరి స్టూడెంట్ అయినా సరే, మా మాస్టారు పట్ల భక్తితో మెలిగేవాడు. అయన గొప్ప సంస్కృత పండితుడు. పెద్ద గ్రంధాలు రచించారు. బతుకు తెరువు కోసం హిందీ మాస్టారి ఉద్యోగం చేసేవారు. అలాగని ఆయన పాఠాలు పిల్లలు పెద్దగా వినేవాళ్ళు కాదు . పాత్రలు, వాటి స్వభావాలు, విశ్లేషించుకుంటూ మాస్టారు పాఠం చెప్తుంటే , చుక్కల ఆట ఆడుకునే వాళ్ళు. హిందీ ఎమ్మే పరీక్ష రాసే సావిత్రి టీచర్ మాత్రం శ్రద్ధగా వినేది. సంవత్సరమంతా గాలి కబుర్లు పోగేసి చెప్తూ, పరీక్ష ముందు ముఖ్యమైన ప్రశ్నలు బట్టీ వేయించే అప్పలాచారి క్లాసులే సుఖంగా ఉండేవి.


          ఆ రోజుల్లో, దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలు, ప్రాధమిక, మధ్యమ, ప్రవేశిక అంటూ ఏడో, ఎనిమిదో ఉండేవి. ఆ పరీక్షలకి మా హిందీ మాస్టారు ఉచితంగా ట్యూషన్ చెప్పేవారు. మా అప్పటికే నేను మాస్టారి దగ్గర ట్యూషన్ చేరి, మొదటి పరీక్ష పాసయ్యాను. మా అమ్మాయిని కూడా హిందీ పరీక్షలకి కూర్చోబెడితే హిందీ భయం పోతుందని, మాస్టారు ట్యూషన్ లో చేర్పించాను.


        మా హిందీ మాస్టారు, ఆయన తమ్ముడి కుటుంబం తో కలిసి పాత కాలం డాబా ఇంట్లో ఉండేవారు. మాస్టారికి భార్య లేదు, కూతురిని కని, కాన్పులో చని పోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఆయన తమ్ముడు కూడా మా స్కూల్లోనే లెక్కల మాస్టారిలా పని చేసేవారు. ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. స్కూల్లో కూడా కలిసే తిరిగే వాళ్ళు.మాస్టారిలో, కోపం,సంతోషం,విచారం, ఏమీ పెద్దగా కనిపించేవి కావు. మెత్తని చిరునవ్వు,చల్లని చూపులు. పిల్లలందరి పట్లా ఒకే రకమైన ప్రేమ. హిందీ పరీక్ష ఫీజు ఆయనే కట్టే వారు వాళ్ళ పిల్లలతో పాటు. వాళ్ళ పిల్లలు సినిమాకు వెళ్తుంటే, మాక్కూడా టిక్కెట్లు కొని, మమ్మల్నీ పంపించేవారు.          ట్యూషన్ లో పాతిక ముప్ఫై మంది పిల్లలు.వాళ్ళలో ఎక్కువమంది చిన్న మాస్టారి పిల్లలే . అయిదారుగురు మంది ఆడపిల్లలు. అటూ ఇటూగా అందరూ బంగారపు ఛాయే. పట్టు బట్టల మీద, బరువైన బంగారు నగల మీద విసుగొచ్చి , కొన్నాళ్ళు హాయిగా నేత పరికిణీలు, వాయిలు వోణీలు వేసుకుందామే అని కూడబలుక్కుని ఇంట్లోంచి పారిపోయి వచ్చిన లక్ష్మి దేవి పిల్లలలాగా ఉండేవాళ్ళు.ఎంత సనాతన కుటుంబమైనా, పిల్లలందరూ స్వేచ్ఛగా మసిలేవాళ్ళు. మగపిల్లలతో చాలా మామూలుగా,స్నేహంగా గలగలలాడుతూ మాట్లాడేవారు. మగవాళ్ళని చూసి ముడుచుకుపోవటం, సిగ్గుపడటం, లోపలి కి పారిపోవటం లాంటి వికారపు చేష్టలు చేసేవాళ్ళు కాదు. నేను మా చెల్లెల్ని 'మా అమ్మాయి' అంటానని బాగా వేళాకోళం చేసేవారు."ఏమిటోయ్ , మీ 'అమ్మాయిని' బాగా చదివిస్తున్నావా? "అంటూ ఏడిపించేవాళ్ళు.        మొదట్లో,మా అమ్మాయి, పెద్ద ఆసక్తితో వినేది కాదు. మాస్టారు పాఠం చెప్తుంటే నల్లటి నాపరాళ్ళ గచ్చు మీద వేసిన చుక్కల ముగ్గు చూస్తూనో, మాస్టారి దోమతెర ఎక్కడెక్కడ చినిగిందో గమనిస్తూనో వుండేది. రోజూ రాత్రి పాఠం అయిన తర్వాత మాష్టారు, వీధి చివరిదాకా వొచ్చి, "ఒరేయ్, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు" అని చెప్పేవారు. మా అమ్మాయి చదవక పోయినా, ఆయన ప్రేమలో మార్పు లేదు.మెల్లగా మా అమ్మాయిలో మార్పు ఒచ్చింది. మాస్టారిని impress చేయడానికి బాగా చదివేది. ఆయన్ని నాకంటే కూడా, ఎక్కువగా అభిమానించేది. ఆర్నెల్లకో పరీక్ష చొప్పున పాసవుతూ, ఇంటర్ కి వొచ్చేసరికి ఒక్క భాషా ప్రవీణ మాత్రం మిగిల్చింది.           పాతికమంది పిల్లలతో మొదలైన ట్యూషన్ అందరూ జారుకోగా, చివరికి అయిదుగురం మిగిలాం. నేను, మా అమ్మాయి, పక్క బజార్లో ఉండే గాయత్రి, మాస్టారు గారి ఇద్దరమ్మాయిలు.  అన్ని రకాల ట్యూషన్ల మధ్య హిందీ పాఠాలకి పగలు కుదిరేది కాదు. ఉదయం అయిదు నుండి ఆరు వరకు పాఠం చెప్పించుకునేవాళ్ళం. 


     వరండాలో, ట్యూబ్ లైటు, బయట కొద్దిగా వెన్నెల, డాబా మీదనుండి కిందకి వేలాడే గిన్నెపూల తీగలు. రోజూ మేము పరీక్షకు చదువుతున్నట్లు ఉండేది కాదు. హిందీ సాహిత్య పరిచయ సభలో కూర్చున్నట్లు ఉండేది. చల్ల గాలి గిన్నె పూల సువాసన మోసుకొస్తుంటే, మున్షి ప్రేమచంద్ కథలు, హరివంశ్ రాయ్ బచ్చన్ రచనలు మాస్టారు వివరించి చెప్తూ మాకు తెల్లవారుజామున వరండాలో విందుభోజనం పెట్టేవారు.ఈ అమితాబ్ బచ్చన్ ఆ హరివంశ్ రాయ్ బచ్చన్ కొడుకా అని ఆశ్చర్యపోయే వాళ్ళం. ప్రేమ్ చంద్ రాసిన కఫన్ పాఠం విన్నతర్వాత ఆయనకు దాసోహం అయ్యాను. నాకు కొడుకు పుడితే ప్రేమ్ చంద్ అని పేరు పెట్టుకోవాలని మొక్కుకున్నాను.          తెల్లవారుజామునే లేచి, చన్నీళ్ళ స్నానం చేసి, మా అమ్మతో ఒక్క జడేయించుకుని, గుడికి వెళ్తున్నట్టు తయారయ్యేది మా అమ్మాయి. పక్క వీధిలో గాయత్రిని కూడా కలుపుకుని వెళ్ళేవాళ్ళం. దారి పొడుగునా, రకరకాల, పూల పరిమళాలు. పొన్న పూలు గాలి తాకిడికి జలజలా రాలి పడేవి. నరసింహమూర్తి మాస్టారి గోడ మీదనుండి, యెర్ర కాడల తెల్ల పారిజాతాలు అరుగు మీద వొత్తుగా పడివుండేవి. ట్యూషన్ నుండి తిరిగి వచ్చేటప్పుడు, గాయత్రి , మా అమ్మాయి ఇద్దరూ ఆ పూలు యేరుకునేవాళ్ళు. వెళ్ళేటపుడు ఏమీ మాట్లాడుకునేవాళ్ళం కాదు గాని, వచ్చేటప్పుడు మాత్రం కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం.


       మాస్టారి ఇంటికెళ్ళేసరికి అంతా గాఢ నిద్రలో ఉండేవాళ్ళు.పాపం, మా వల్ల మాస్టారి గారి ఇద్దరమ్మాయి లు నిద్ర లేక ఇబ్బంది పడేవాళ్ళు. ఒక్కరోజైనా మేము మానేయ్యకపోతామా, కంటి నిండా నిద్ర పోలేక పోతామా అని ఆశ పడి,భంగ పడేవాళ్ళు.   ఒక రోజు మా మాస్టారు " ఉస్కీ మా "- అతని తల్లి అనే కథ పాఠం చెప్పటం మొదలు పెట్టారు.రాత్రి ఎక్కువ సేపు చదివిందేమో , మా అమ్మాయి కళ్ళు మూతలు పడుతున్నాయి . దానికి తోడు , చల్లని గాలి , మాస్టారి గంభీరమైన గొంతు అన్నీ కలసి , ఘంటసాల "పాడుతా తీయగా "పాట వింటున్నట్లుగా ఉంది.


            కథ విషయానికొస్తే , స్వాతంత్ర్యోద్యమం లో ఉరి శిక్ష పడ్డ ఒక యువకుడిని , ఉరి తీసే ముందు రోజు అతని తల్లి కలవడానికి వెళ్తుంటుంది . ఆమె స్వగతమే కథ . బిడ్డని ఎలా పెంచుకుందో చెప్తూ ఉంటుంది .తీరా వెళ్ళే సరికి పోలీసులు ఆమెని కలవనివ్వరో , లేదా అప్పటికే ఉరి తీసేస్తారో , బాగా గుర్తు లేదు కాని , ఆమె తీవ్రమైన నిరాశకి గురవుతుంది . తిరిగి వెళ్ళేటపుడు ,మళ్ళీ స్వగతం లో మాట్లాడుకుంటూ వెళ్తుంది . ఆమె బిడ్డ గురించి చెప్తూ ఉంటే, గుండె బరువై పోతుంది .ఆమె ఏడ వదు , మామూలుగా, ఏమి ఉద్వేగానికి లోనవ్వకుండా చాలా సాధారణంగా కొడుకు సంగతులు చెప్పటం హృదయవిదారకంగా ఉంది .మెల్లగా మాస్టారి కంఠం వణికింది . మాస్టారి గొంతులో తేడా కు , జోల పాటకి నిద్రపోతున్నపసి పాప లేచినట్లు , మా అమ్మాయి కళ్ళు విప్పి అయోమయంగా నా వంక చూసింది . ఆయన వణుకు ఆగలేదు.  ఏడుపుగా మారింది . పాఠం పూర్తయ్యేసరికి కదిలి కదిలి ఏడ్చారు .


ఆ రోజు వచ్చే దారిలో ముగ్గురం మౌనంగా వున్నాం . గాయత్రికి , మా అమ్మాయికి పూలు యేరుకుందామన్న ధ్యాస లేదు .             తర్వాత కొన్నాళ్ళకి గుంటూరు వచ్చేసాం . మాస్టారిని ఆర్నెల్లకో , సంవత్సరానికో , చూసి వచ్చేవాడిని . నేను ఆ వూరి అమ్మాయినే పెళ్ళిచేసుకోవడం వల్ల, పెద్ద మాస్టారు , చిన్న మాస్టారు ఇద్దరూ కలిసే వొచ్చారు పెళ్ళికి . పెళ్లి మండపం లో అడుగు పెడుతూనే మా అమ్మాయి గురించి అడిగారు . మాస్టారు వొస్తున్నట్లు , నేను మా అమ్మాయికి చెప్పలేదు.  చూపు మందగించి, చిక్కిపోయి, వార్ధక్యం పైబడిన మాస్టారిని చూస్తూనే మా అమ్మాయి కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యింది . మాస్టారి పాదాలకి మొక్కి వెక్కి వెక్కి ఏడ్చింది . దాని పెళ్ళిలో అప్పగింతలప్పుడు కూడా అంత ఏడవ లేదు .


"అబ్బాయిని చూపించవా అమ్మా " అని అడిగారు మా బావనుద్దేశించి.


మా నాన్న, మా బావ దగ్గరకెళ్ళి "బాబూ, ఓసారిలా వొస్తారా " అని పిలిచాడు.


పక్కనే సిగరెట్ తాగుతున్న మా బావ , దాన్ని కింద పడేసి , బూటు కాలితో నలిపి,  దగ్గరకు వొచ్చి ఒక చేయి ఎత్తి "నమస్తే " అన్నాడు .

మా అమ్మాయిని మా బావని పక్క పక్కనే నిల్చోబెట్టి , సంస్కృతంలో యేవో మంత్రాలు చదువుతూ దీవించారు .మా బావని ఆప్యాయంగా తడుముతూ , "అమ్మాయి జాగ్రత్త నాయనా "అన్నారు .

ఆ తర్వాత మా బావ , మా అమ్మాయితో అంటున్నాడు "ఎవడే, ఆ ముసలాడు, నాకు జాగ్రత్తలు చెప్తాడు, నీ బాబుకే , మనమంటే ........."

P.S: మాస్టారి గురించి ఎంత ఎక్కువ రాస్తే, అంత ఎక్కువ పేలవంగా కనపిస్తోంది . ఆయన విలువ నేను పనిగట్టుకుని తగ్గించే ప్రయత్నం పెట్టుకున్నానేమో అనిపిస్తుంది. ఇదంతా చదివిన తర్వాత మీరు కూడా మా బావ లాగా ఫీల్ అయితే, ఆ గురుద్రోహానికి శిక్ష ఈ లోకంలోనే పడాలని కోరుకుంటాను.


రెండేళ్ళకి నాకు అబ్బాయి పుట్టాడు .


మా అబ్బాయి బారసాల రోజున, ప్రేమ్ చంద్ అని పెడదామంటే, మా ఆవిడ కుదరదంటే కుదరదంది. ఎవరికీ లేని, ఎవరూ వినని పేరు పెట్టాల్సిందే అంటూ, "విభ్రాంత్" అని పెట్టింది.

"ఇదెక్కడి దౌర్భాగ్యం,కొడుక్కి ఇష్టమైన పేరు కూడా పెట్టలేని వాజమ్మ బతుకు" అంటూ మా పెద్దక్క దగ్గర గోల పెట్టాను.

" ఏమిట్రా నీ చాదస్తం,పెళ్ళాం మాటకి ఎదురు చెప్తావ్, చదవేస్తే ఉన్న మతి పోయిందని, పెళ్ళైన తర్వాత కూడా సోంత ఇష్టాలు సాగాలంటే ఎలాగురా? భార్య ని కాదని స్వంత పెత్తనం తో ,రెండు రూపాయల ఉప్పు పాకెట్ కొనగల మగధీరుడిని చూపెట్టు ఈ లోకంలో, దండ వేసి, దండం పెడతా". అంటూ మా అక్క చీవాట్లు పెట్టింది.

26 comments:

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

చాలా చాలా బాగుందండీ.. మీ మాష్టారి గురించి తెలుసుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి గురిచేసింది. మీ శైలి మీ మాష్టారుగారినీ తెల్లవారుఝామున మీరు ట్యూషన్ కి వెళ్లడాన్ని అన్నిటిని ఒక అందమైన దృశ్యంలా కళ్ళకు కట్టినట్టు చూపింది. చివరికి వచ్చేసరికి కళ్ళు కాస్త చెమరించాయి కానీ అంతలోనే పిల్లాడి పేరుతోటీ.. అక్కయ్యగారి లెక్చర్ తోటీ నవ్వించేశారు :-)

కొత్తావకాయ చెప్పారు...

చదవడం మొదలు పెట్టినపుడు సాదా సీదా గా అనిపించింది. డాబా మీద నుండి వేలాడే గిన్ని పూల తీగల తో కట్టి పడేసారు. అలతి అలతి పదాలు. చక్కటి కధనం. రాస్తూ ఉండండి. మీ బావ నాకు అసలు నచ్చలేదు.

Afsar చెప్పారు...

హృద్యమయిన కథనం! ఇదే మొదటి సారి అనుకుంటా, మీ బ్లాగు చదవడం! ఇక చదవాలి పోస్టులు మిస్సవ్వకుండా.


"ఆయన్ని పేరు పెట్టి రాయడానికి పెన్ను రావడం లేదు." నిజమే, ఇక్కడ మీ గౌరవ భావాన్ని గౌరవిస్తూనే చిన్న మాట. గొప్ప అధ్యాపకుల పేరు ప్రస్తావించడం బాగుంటుందని నా అభిప్రాయం. బహుశా, అలా పేరు తలచుకోవడం కన్నా గొప్ప గురు దక్షిణ లేదనుకుంటా.

మీ ఆలోచనల్లో సున్నితత్వం వుంది, అలాంటి సున్నితత్వమూ కావాలి ఈ కాలానికి!

SHANKAR.S చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
SHANKAR.S చెప్పారు...

చాలా కాలం తరవాత బ్లాగుల్లో మనసుని తడిమిన పోస్టుని చదివా. గురుభ్యో నమః మీ మాస్టారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నా.

రసజ్ఞ చెప్పారు...

చాలా బాగా రాసారండి. నాకూ మా హిందీ మాష్టారు గుర్తొచ్చారు. కళ్ళు చెమర్చాయి పాత రోజుల్లోకి వెళ్ళి. "ఆయన్ని పేరు పెట్టి రాయడానికి పెన్ను రావడం లేదు." ఈ వాక్యంలో మీ గురుభక్తి కనిపిస్తోంది కానీ అఫ్సర్ గారు చెప్పినట్టు అలాంటి గొప్ప వ్యక్తి మీ గురువుగారని చెప్పుకోవడం గర్వకారణమే కదా? కనుక అందువలన చేత మీరు పేరు చెప్పి ఉంటే బాగుండేది.

Pavani చెప్పారు...

Very nice and moving.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

"....ఎవరికీ లేని, ఎవరూ వినని పేరు పెట్టాల్సిందే అంటూ...."

Excellent depiction of today's mania to give weird names to children, which they will curse for being named like that later.

As usual, your wrting about Hindi Master is heartening to read. I think, you are writing about an imaginary character and its an experiment in writing a story in this manner.

If my presumption is wrong, I yearn to know more about your Hindi Mastaaru.

ఆత్రేయ చెప్పారు...

ఎంతో బాగుంది
కేవలం భాష మీది ప్రేమ తో హిందీ ప్రైవేట్లు చెప్పే మాస్టర్లు '60 లలో '70లలో ఉండేవారు.
సైన్సు లెక్కలు అయితే బాగా డబ్బులొస్తాయి అని చూడకుండా హిందీ సంస్కృతం తెలుగు నేర్చుకొని, ఆ విద్య ని ధనాపేక్ష లేకుండా పదిమందికి పంచే ఆ సరస్వతీ పుత్రుల నుంచి
ఈ నాటి మన కార్పోరేట్ కాలేజీల వాళు నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది.
మీ మాస్టారికి నమస్సులు, మీకు అభినందనలు !!

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

మీ టపా హృద్యంగా ఉంది.మీ మేష్టారు గారి పేరు కూడా వ్రాయండి.గొప్పవారిని తలుచుకోవడంలో తప్పులేదు.

విభ్రాంత్ అన్న పేరుకి అర్థం మీ శ్రీమతి గారికి వివరించలేకపోయారా :-)

SooryuDu చెప్పారు...

chandu gaaru,

naa praaaNa snEhituraalu chepitE indaakanE modalu peTTaanu mee 'hindi master' tO. manasulOpaliki jEri kaburulu panchukunTunnaTTu, enta chakkagaa raasaarO, meeru. gunDe ninDipOyindi. inkaaa inkaa nimpEsukndaaamani miginavannee chadivEsaaanu. ninDina gunDe beeTlu vaarElaa aa chandamaama katha. hryudamantaa chittaDi , egasi vecchagaa kaLLallOki vacchina chirutaDi.

mahaanubhaavulu meeru, inta chakkagaa raayagaligaaru, naa taraphuna meeku bOlDu abhinandanalu. inkaa ennennO raastoo unTaarani aaSistoo..

--sooryuDu

Sujata చెప్పారు...

:D ! Nice Story. BTW Munshi Premchand is a wonderful story teller. U are none the less.

రాజ్ కుమార్ చెప్పారు...

అద్భుతం గా రాశారు సార్. చదువుతూ ఉంటే మొత్తమంతా నా కళ్ళముందు కనిపించింది. అంకితభావం గల అంత గొప్ప గురువు గారు దొరకడం నిజంగా పూర్వజన్మ సుకృతం. అలాంటి వారు మనకి స్కూల్ డేస్ లో మాత్రమే కనిపిస్తారనుకుంటా.
హిందీ మాష్టారు గారికి నా పాదాభివందనాలు

Sravya Vattikuti చెప్పారు...

చాల బావుందండి ! ఇది చదవగానే నా చిన్నప్పటి స్కూల్ టీచర్స్ గుర్తొచ్చారు !

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

చాలా బాగుందండీ. ఇది నిజంగా జరిగింది అయితే మీ హింది మాష్టారికి నమస్కారం. శివరామ ప్రసాదు గారన్నట్టు ఇది కధ అయితే మీకు నమస్కారం.

Chandu S చెప్పారు...

ఆత్రేయ గారు, Pavani గారు, రసజ్ఞ గారు, SHANKAR.S గారు, Afsarగారు ,కొత్తావకాయ గారు, వేణూ శ్రీకాంత్ గారు
Sravya Vattikuti గారు, రాజ్ కుమార్ గారు, Sujata గారు, SooryuDu గారు, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు
@బులుసు సుబ్రహ్మణ్యం గారు

మా హిందీ మాస్టారు మీకందరికీ నచ్చినందుకు చాలా సంతోషం.

మాస్టారి పేరు

శ్రీ జనస్వామి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.


అందమైన పేరు.


ఆ మధ్య మగధీర చూస్తున్నాను. ఒక సీనులో బ్రహ్మానందం వాళ్ళావిడ లేకుండా ఏదో ఊహల్లో...

( గుర్తొచ్చిందా సీను)

ఆ సీను వెనక నేపధ్య సంగీతానికి " ఎంత వారలైనా కాంత దాసులే" వినిపించింది.


***********
శంకరాభరణం గొప్ప హిట్ అయ్యింది.

సోమయాజుల గారికీ, విశ్వనాథ్ గారికీ ఊరూరా సన్మానాలు జరుగుతున్నాయి.

ఆ సన్మాన సభలో మాట్టాడమని మా మాస్టారిని పిలిచారు. మేమూ వెళ్ళాం.

మాస్టారు సినిమాను విశ్లేషించి ప్రసంగిస్తూ ఈ కింది సీను చెప్పారు.

శంకరశాస్త్రి రైలు దిగగానే, వెంట ఒక స్త్రీ ని చూసి , ఆయన అసిస్టెంట్ సాక్షి రంగారావు మొహంలో రంగులు మారతాయి. అక్కడ నేపథ్య సంగీతం " ఎంతవారలైనా కాంత దాసులే". సాక్షి రంగారావు మనోభావాలు నేపథ్య సంగీతం లా వినిపించిన తీరు, ఇంకా స్త్రీ పురుష సంబంధాలు, కొన్ని నా వయసుకి అర్ధం కాని మాటలు ఏవో చెప్పారు.

సన్మానం అందుకున్న విశ్వనాథ్ గారు "ఏన్నో ఊళ్ళు తిరిగి వస్తున్నాం కానీ ఇంత 'బాగా' సినిమా చూసింది మాత్రం మీరే. నాకివ్వాళ సన్మానానికి అర్హుణ్ణి అనిపించేలా చేశారు" అని మాస్టారితో అనటం గుర్తుంది.

ఎంతో మంది స్టూడెంట్లు. ఎవరి వాళ్ళం, మేమే మాస్టారికి చాలా దగ్గర అనుకునే వాళ్ళం. మా జీవితంలో జరిగే ప్రతి ముఖ్య సంఘటన మాస్టారికే ముందు కబురు చెప్పేవాళ్ళం.

మరొక్కసారి అందరికీ కృతఙతలు. కథ చదివినందుకు,
మాస్టారు మీకూ నచ్చినందుకు.

మరొక్క మాట

కథ చెప్పిన narrator మాత్రమే మగవాడు. నేను కాదు.

చందు శైలజ

Sravya Vattikuti చెప్పారు...

కథ చెప్పిన narrator మాత్రమే మగవాడు. నేను కాదు.

చందు శైలజ
-------------

హ హ కొట్టారండి దెబ్బ మీ management పోస్ట్లు చూసి మగవారే అనుకున్నా , హ హ పురాణం సీత గారి లెవెల్ లో మీరు మాకు కూడా ఒక దమ్క ఇచ్చారు . ఇప్పుడు నిజం గా మీ బ్లాగు మరీ మరీ నచ్చింది :)

beekay చెప్పారు...

Excellent work ,Congratulations. Please keep it going...

beekay చెప్పారు...

As suggested earlier, please remove word verification and enable comment moderation. This will simplify your life as well as commentor's life. Thanks in advance.

అజ్ఞాత చెప్పారు...

you are really great keep it up
keep writing

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

చాలా హృద్యంగా ఉన్నదండి. మా గుంటూరు హిందు హైస్కూలు హిందీ ఉపాధ్యాయులు శ్రీ లింగేశ్వరరావుగారు గుర్తుకువచ్చారు. ఆయన కూతురు భారతిగారి దగ్గర నేను, మా అక్క, చెల్లెళ్ళు హింది చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చాయి. ఆవిడ పుణ్యమా అని 8వ తరగతికే హింది విశారద (ఉత్తరార్ధ) కూడా పూర్తి చేసాను.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

ఈ పోస్ట్ నేనెలా మిస్సయ్యానబ్బా?

యధావిధిగా మీ గురువులకి పాదాభివందనం.మీ లేలేత మనస్సుకి సుకుమారవందనం.గుండెల్ని తడిమారంటారే దాని భావం మీ రాతల్లో/పోస్టుల్లో తెలుస్తూ ఉంటుందిలెండి.

prasanthi kolli చెప్పారు...

చందు నిజమైన ఉపాధ్యాయులు విధ్యార్థి జీవితాన్ని నిర్మించుకోవటంలో ఒక సమిధ వేస్తారు....ఆ కాలంలో అలాంటివారు ఉండేవారు.....ఈ కాలంలో అరుదు....విలువలు అంటే డబ్బు లెక్కలు అనుకునే రోజులు మరి . మా స్టారి గారికి వందనాలు

HIMADEVI YEKULA చెప్పారు...

చందూ!ఇష్ట గురుదైవానికి నువ్వు సమర్పించిన నైవేద్యం....
చదివినోళ్ళందరికీ ప్రసాదంలా....చదివిన పుణ్యమైనా దక్కింది....

anyagaami చెప్పారు...

"ఎంతో మంది స్టూడెంట్లు. ఎవరి వాళ్ళం, మేమే మాస్టారికి చాలా దగ్గర అనుకునే వాళ్ళం." ఇది అద్భుతమైన భావన. మీ గురుస్మరణ బ్రహ్మాండంగా ఉంది. గొప్ప ఉపాధ్యాయులందరితో విద్యార్థులకి ఇటువంటి అనుబంధమే ఉంటుందేమో! నాక్కూడా అటువంటి గురువుల్ని తలచుకొన్నప్పుడల్లా వొళ్ళు గగుర్పొడుస్తుంది.

Shobha చెప్పారు...

చాలా బాగుంది కధ. ఇలాంటి బావ లను ఆ కుటుంబం ముఖ్యంగా అంత సున్నితమైన ఆ అమ్మాయి ఎలా భరించిందో! గురువులలో తేడా తెలుపు నలుపులకు ఉన్నంతగా ఉంది. మంచి గురువు ఉంటే ఆసక్తి పెరుగుతుందని అమ్మాయి నిరూపించింది. ఆ గురువుని జీవితాంతము మనసులో నిలుపుకొగలిగే ఆ అమ్మయి మనసును ఆ బావ అర్ధం చెసుకుని గౌరం ఇవ్వలేకపోవడం అతని, ఆమె దురదృష్టం. ఎంతగానో కదిలించిన కధ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి