24, జులై 2011, ఆదివారం

పనిష్మెంట్-4continued from పనిష్మెంట్-3

బాగా బయటకు, రోడ్డు మీదకు వచ్చారు.

ఇద్దరూ మాట్టాడుకోకుండా కార్లో కూర్చున్నారు.

విశ్వనాథం కి ఎక్కడికో వంటరిగా ఎవరూ లేని విశాలమైన చీకటి చోటికి వెళ్ళి,

మనసారా దిగులు పడాలనీ.....ఉంది

సుబ్బు ప్రజన్స్ భరించలేనంత దుర్భరంగా ....

సుబ్బు మెల్లగా కారు దిగి వెనక్కి వెళ్ళిపోయాడు.

మనసు అతన్ని,

అతను మనసుని .....పదే పదే ప్రశ్నిస్తున్నారు.

ఎలా? ఇలా జరుగుతుందేమిటి? ఏంచెయాలి ఇప్పుడు? ఇప్పుడేమిటి?

తను నమ్మిన విలువలు... తన ముందే ధిక్కరించి, అవమానం చేసి

ఇంత అవమానమా ?

ఎప్పుడో నాలుగున్నరకు అయిపోయింది పార్టీ. ఒకరొకరే బయటకి వస్తున్నారు.

ఇందుమతి ఎవరితో వస్తుందో...?

విశ్వనాథం ఆమె వచ్చి కారు డోరు తెరిచేవరకు, కళ్ళు మూసుకునే వున్నాడు.


"అలిసిపోయాను శేఖర్, వెనక పడుకుంటాను " అంది ఇందు.

ఆ మాట విశ్వనాథం కి రిలీఫ్ గా ఉంది.

కార్లో వెళ్తుంటే, చూసాడు, వేరే ఎవరిదో కారు క్రాస్ చేసి వెళ్ళింది. నిమ్మకాయలు కట్టిన కొత్త కారులో ,

సుబ్బు వెళ్తున్నాడు.


************

"మళ్ళీ ఏ పేట మారావ్?” అడిగాడు విశ్వనాథం

"ఆర్నెల్ల నుండీ చెంచు పేటలో వుంటున్నా సార్. మీరేం మంత్రం వేశారో మా ఆడంగులకి, గొడవల్లేకుండా అంతా సవ్యంగా ఉంది .”

అంటూ సంచీ లోనుండి ఒక న్యూస్ పేపర్ చుట్టిన పొట్లాం తీసి టేబిల్ మీద పెట్టాడు.

"ఏంటిది?”

"మా వూళ్ళో సత్యనారాయణ టాకీసు పక్కన చేసే జిలేబీ సార్. బాగా పేరు. మీలాంటి గొప్ప గొప్పోళ్ళందరూ కారుల్లో వొచ్చి కొనుక్కు పోతుంటారు.”

ఇంత అధునాతనమైన వాతావరణంలో ఎంటీ చెత్త అన్నట్టు ఉరిమి చూసే నర్సు వంక క్షమాపణ పూర్వకంగా చూసి ఆమెతో అంటున్నాడు " అయ్యగారికి చిరుతిండి కొనుక్కుని తినే తీరిక ఉండదు గదమ్మా"


"డాట్టరు గారు కొద్దిగా రుసి చూస్తే, మరి నేనెళ్తా.”

అప్పుడే సుబ్బు లోపలికి వచ్చాడు.

జిలేబీ రుచి చూసి

"అప్పుడప్పుడూ వస్తుండవోయ్ " అన్నాడు.

" అయ్యగారి దయ వల్ల ఇంకా వచ్చే పని లేదండీ.”

***********

ఇందుమతి తీరిక లేనంత గొప్ప సోషలైట్ అయ్యింది.

విశ్వనాథం ప్రాక్టీసు కూడా పెరిగింది. ఇద్దరూ లేటుగా ఇంటికి చేరేవారు, ఒకళ్ళు ముందు, ఒకళ్ళు తర్వాత. విశ్వనాథం కి తెలియకుండానే ఇందుమతి కి దూర దూరం గా జరిగి పోతున్నాడు.

చాలా రోజుల్నుండీ, ఇందుమతి విశ్వనాథం లో లోపాలు ఎత్తి చూపెడుతూ, తనెంత అసంతృప్తి తో వేగి పోతోందో విశ్వనాథం తో చెపుతూ వస్తూ వుంది.

తల్లి దండ్రులకు ఫోన్ లో వివరించి చెప్తూ వుంది

సరదాగా ఉండడు.

తన భావాలకు తగ్గ భర్త కాదు

తన సర్కిల్ లో ఇమడలేనంత సాదా గా ఉంటాడు.

ఒక రోజు, మెల్లగా మనసులో విషయం బైట పెట్టింది. మనిద్దరం విడిపోదాం.

ఉలికి పడ్డాడు.

" కారణంతో విడిపోదాం ఇందు, పోనీ నువ్వు చెప్పు, నేనేం తప్పు చేస్తున్నానో?”

"తప్పు కాదు శేఖర్, నువ్వు మంచాడివే, కానీ నాకేం ఆనందంగా ఉంది నీతో.”

"నీ స్వేచ్ఛకి ఎప్పుడూ అడ్డు రాలేదు ఇందూ,”

"కానీ నాకు తోడు కావాలిగా శేఖర్, నీతో లైఫ్ బోరింగ్ గా ఉంది. నా వల్ల కావటం లేదు.విడాకులకి అప్లయ్ చేద్దాం.”

వి డా కు లు

మాట తన కోసం కాదు ఇంకెవరికోసమో పుట్టింది అన్నంత విచిత్రంగా వినిపించింది విశ్వనాథానికి.

"ఆలోచించడానికి కొద్దిగా టైమివ్వు ఇందూ "అన్నాడు విశ్వనాథం బలహీనంగా

*******

ఒక రోజు విశ్వనాథం ముందే వచ్చి

చీకట్లో లాన్ లో కూర్చున్నాడు.

ఇంటి ముందు మేయర్ వాహనం ఆగింది.

అటువైపు నుండి ఇందుమతి దిగింది. ఇటువైపు వచ్చి వీడ్కోలు తీసుకుంటోంది.

" వదలాలని లేదు.”

"మా ఇంటిముందే వుంటారా ఏంటీ? " కిలకిలా నవ్వింది.

"వెళ్తాను కానీ ,ఏదైనా ఇచ్చి పంపించు.”

"ఇంత వరకూ ఇచ్చింది చాల్లేదా? "చెంప మీద చిన్నగా కొట్టింది.

విశ్వనాథం చెవుల్లో సముద్రపు హోరు. రక్తమంతా కాళ్ళలోకి చేరినట్టు...

********
ఎవరో బాగా డబ్బున్న ఇల్లాలి లాగా ఉంది.

"చెప్పండి, ఏంటి సమస్య?”

"మీరే

"నేనా?”

" మీరెందుకు ఆవిణ్ణి అదుపులో పెట్టుకోలేరు? ఆవిడ వల్ల నా కాపురం కూలిపోతోంది.”

"మీరు?”

" పాటికి అర్ధమయ్యి వుండాలి నేనెవరినో"

"నేనెప్పుడూ ఆమెను అదుపు చెయ్యాలనుకోలేదు. మీకు జరుగుతున్న అన్యాయానికి నేనే కారణమనుకుంటే నన్ను క్షమించండి. ”

"నాకు పిల్లలు ఉన్నారు. మేం ఏమైపోవాలి" కళ్ళలో నీళ్ళు.

ఇద్దరూ ఒకే పడవ లో ప్రయాణం చేస్తున్నారు.

**********

"శేఖర్, "

చటుక్కున లేచి దూరంగా జరిగి కూర్చున్నాడు విశ్వనాథం.

"ఎవరూ నన్ను అర్ధం చేసుకోవటం లేదు. నువ్వే ఏదైనా చెయ్యి, నేను కూడా నీ దగ్గరకు సలహా కి వొచ్చే ఒక క్లయింట్ ననుకో.”

విశ్వనాథం కి ఏడవలేని నవ్వొచ్చింది.

భార్య ప్రేమకథ ఓపికగా విని ,ఆమెకు నచ్చే సలహా ఇవ్వగల విశాల హృదయం ఎవరికైనా పెడతాడా దేవుడు?

"నువ్వంటే నాకేం కోపం లేదు శేఖర్, కానీ మనసు లేదు నీ మీద.”

"నా సంగతి ఒదిలెయ్ అమ్మాయి కి పిల్లలున్నారుభార్యా, పిల్లలకి అన్యాయం చేయడం పాపం కాదా?”

"అసలావిడ కిషోర్ కి తగ్గ భార్య కాదు తెలుసాపాపం ఆవిడ కో ఒపరేటివ్ గా ఉండదనీఫాషన్స్ తెలియవనీ ఎప్పుడూ బాధ పడుతుంటాడు.”

"వేరే స్త్రీ కి దగ్గర కావాలంటేభార్యని లోకువ చెయ్యడం  మార్గం ఇందూ "

"అలా ఏం కాదుఆవిడ ఏం బాగుంటుంది నాకన్నాఛండాలంగా...."

"కొన్నాళ్ళకు  మోజు తీరిపోతే ఏమవుతావు ఇందూ?”

"మాది వొట్టి మోజు కాదని నిరూపిస్తాం  లోకానికి.”

వీళ్ళ ప్రేమలు నిజమా కాదా అని చూట్టం తప్ప లోకానికి వేరే పనుల్లేనట్టు."ఇందూ, నన్ను మోసం చేసేటప్పుడు నీకేం అనిపించలేదా? “

"ఇందులో మోసం ఏముంది శేఖర్, నా ఫ్రీక్వెన్సీ, నీ భావాలు అసలు కలవవు, నేను నా సంతోషాన్ని వెతుక్కోవడం మోసమెలా అవుతుంది? కమాన్ శేఖర్, మరీ ఇంత నేరో గా ఆలోచిస్తావనుకోలేదు"

"నేనూ నీలా ఆలోచిస్తే..”

"ఈ పాటికి నన్ను అర్ధం చేసుకునేవాడివి. అలా ఆలోచించడం లేదనే కదా విడిపోవాలనుకుంటున్నాను.”

"........."

"అయినా ఏంటిది శేఖర్, ఇది కూడా తిండి, నిద్ర లాంటి అవసరమే అంటారుగా. నచ్చింది తింటాం. కోరుకున్నపుడు నిద్ర పోతాం. దీనికి మాత్రం విలువలు, అంటూ రభస చేస్తారేం?”

ఆ నిముషం లో విశ్వనాథం కి, ఆఫీసులో క్లయింట్ లాగానే అనిపించింది.

"నిజమే, ఆహారం లాంటి అవసరమే, కానీ, ఇది అంత కన్న విలువైన అవసరం.

తిండి, నిద్ర అయితే తోడు అవసరం లేదు. ఒక్కరున్నా సరిపోతుంది.

కానీ ఇక్కడ, ఇద్దరు కలిసి ఏక దీక్ష తో, అనురాగంతో చేసే వ్రతం. వ్రతఫలం కూడా, ఇంకా బలమైన అనురాగమే. ఇద్దరి లో ఏ ఒక్కరు వ్రత భంగం చేసినా, అది రెండో మనిషికి శాపమవుతుంది ఇందూ "


బండి తోలే మనిషి, ఎడ్లని ఆగమనే పద్ధతిలో, " ,, " అంటూ" ఇంత డోస్ నా వల్ల కాదు , ఈ పుస్తకాల భాష నాకు ఎక్కదు. నాన్న కోపంగా ఉన్నాడు శేఖర్, నువ్వే కొంచం నచ్చ చెప్పు.”


to be continued

5 comments:

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

నా చిన్నతనంలో అంటే 1960లు 1970లలో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో సీరియల్స్ చదవటం మొదలు పెట్టాను. అప్పుదు మళ్ళీ వచ్చే వారం కోసం ఎదురు చూడటం, ఆ కథ ఏమయ్యింది అని చూడటం. అప్పటి రోజుజులు జ్ఞాపకం వస్తున్నాయి మీ ధారావాహికలు చదువుతుంటె. బాగా వ్రాస్తున్నారు. Keep it up.

Sravya Vattikuti చెప్పారు...

hm ! Really you have a great story telling style. I am eagerly waiting for the next part !

కృష్ణప్రియ చెప్పారు...

"మాది వొట్టి మోజు కాదని నిరూపిస్తాం ఈ లోకానికి.”


వీళ్ళ ప్రేమలు నిజమా కాదా అని చూట్టం తప్ప లోకానికి వేరే పనుల్లేనట్టు.


-- :)Too good!

పైన ఇద్దరు చెప్పినట్లు నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను...

సాయి చెప్పారు...

nice story...waiting for nxt

అజ్ఞాత చెప్పారు...

Good writing .go ahead

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి