15, జులై 2011, శుక్రవారం

నా కంప్యూటర్ బుర్ర

  చిన్నప్పుడు నా బుర్ర కంప్యూటర్ లా పని చేసేది. అంటే ఏవో, లెక్కలు, ఎక్కాలు బాగా రావడం కాదు. ఏదో చిన్న సదుపాయం ఉండేది. బహుశా మీ బుర్రలకి కూడా ఉందేమో. చిన్న వయసులో, ఏదైనా విచిత్రమైన సంఘటనో, మాటో నాకు సరిగా అర్ధం కాలేదు అని బుర్ర ఫీల్ అయితే,చాలా జాగ్రత్తగా, ఆడియో, వీడియో తో సహా యధాతధం గా మెమొరి చిప్ లో దాచి ఉంచి, నాకు అర్ధం అయ్యే వయసు వొచ్చే సరికి సదరు ఫైల్ ని ఒపెన్ చేసేది, కోడింగ్ వగైరాలు పూర్తి చేసి.

అలాంటి ఫైల్స్ లో ఒకటి మీ కోసం!

ఏడో తరగతి లో ఉండగా...

స్కూల్లో డ్రాయింగ్ మాస్టారికి కొంచం ఎకసెక్కాలు ఎక్కువ. దానికి తోడు, స్కూల్లో నాటకాలకి, ఏన్యువల్ డే ఫంక్షన్ లకి ఆయనదే హడావుడి. హార్మొనీ పెట్టె మీద వాయిస్తూ సొంత పాటకి, సొంత బాణీ కట్టాను చూడండ్రా అంటూ, " ఓ సాథీ రే, తేరే బినా భీ క్యా జీనా" ట్యూనులో " ఓ చిలకా, నీ కళ్ళ లోనే నా గూడూ" అంటూ పాడేవాడు. ( మీరూ ట్రై చెయ్యండి). మేము కూడా బాగా మెచ్చుకునేవాళ్ళం. అబ్బా,  మాస్టారికి ఎంత సంగీత ఙానం అని.

అమ్మాయిలని చూస్తే ఎకసెక్కాలు మరింత ఎక్కువ చేసేవాడు. పాటల పోటీలకి, ఆటల పోటీ లకి పేర్లివ్వడానికి ఆడ పిల్లలు వెళితే, " మీలో ఆడు వారు ఎవరు? పాడు వారు ఎవరు?" అన్నాడు.

ఇలాంటివే కొంచం మోతాదు పెంచి చేస్తున్నాడని ఆడ పిల్లల నాన్నలో, అన్నలో చితక్కొట్టారు. మొహం చూపించలేక బదిలీ చేయించుకుని వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఎప్పుడో కృష్ణంరాజు సినిమా రంగూన్ రౌడీ లో అదే ట్యూను వినపడింది. మాస్టారి ట్యూను తెలుగు సినిమా వాళ్ళకి కూడా నచ్చినట్టుంది.

కొన్నాళ్ళు డ్రాయింగ్ పీరియడ్ లో కథలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ గడిపేశాం. ఆ తర్వాత, మరీ కుర్ర డ్రాయింగ్ మాస్టరొచ్చాడు. వి ఎస్ ఆర్ కాలేజీలో చదువుతున్న మా శేషు అంత కూడా లేడు. వచ్చే వారం నుండి డ్రాయింగ్ బుక్స్ , రంగు పెన్సిళ్ళు తెచ్చుకోండన్నాడు. ఈ లేత మాస్టారిని లెక్క చెయ్యచెయ్యడమేంటి ?
ఇప్పట్నుండే మాట విన్నామంటే, వీడు మన మాట వినడురా “అని మా క్లాసు లీడర్ నేమీ చంద్ అన్నాడు.

వాడికి వూరంతా మిఠాయి కొట్లే, అందుకని వాడి మాటే విన్నాం.

తర్వాత వారం కాదు, ఆ తర్వాత వారం కూడా బొమ్మలు గీసే పుస్తకాలు, పెన్సిళ్ళు తీసుకెళ్ళలా.

ఈ సారి మాస్టారి అహం దెబ్బ తింది. దెబ్బ తింది అని అల్లానే కూర్చోకుండా, మాకు దెబ్బలు వేస్తానని లేచాడు. అందర్నీ నుంచోమన్నాడు. మాతో పాటు చదివే ఆడపిల్లలు అందరూ బుడంకాయలలాగా ఉన్నా, మా పెంచక్క మాత్రం మా అందరికన్నా పొడుగ్గా, పెద్దగా ఉండేది. పెంచక్క పేరు వీర పెంచలమ్మ. అల్లా నీరసం తెచ్చుకుంటారే? పేరు చూసి జడ్జ్ మెంట్ కు రావొద్దు.

వయసు పదమూడే అయినా, ఆ మధ్యెప్పుడో, బాపు తీసిన ‘’తూర్పు వెళ్ళే రైలు సినిమాలో జ్యోతి అనే హీరోయిన్ ఇంక్కొంచమందంగా, నాజూకు ముక్కుతో కనపడితే ఎలా ఉంటుందో, అలా ఉండేది.

చిలక పచ్చ పరికిణీ , గులాబీ రంగు వోణీ వేస్కుని వస్తే, మా అందరికి మూకుమ్మడిగా వాళ్ళ ఇంటి మీద పడి, వాళ్ళ పెద్దవాళ్ళనందర్నీ ఉతికెయ్యాలన్నంత అవేశం వచ్చేది ఆమెకు ఆ దిక్కుమాలిన పేరు పెట్టినందుకు.


డ్రాయింగ్ మాస్టారు, గుళ్ళో పూజారిలా, బుడంకాయలందరిని " చెయ్యి పట్టండి, చెయ్యి పట్టండి" అంటూ ప్రసాదం పెట్టినట్టు, చేతిలో ఒక్కోళ్ళకి ఒక్కో దెబ్బ వేస్తున్నాడు. చివరి బెంచ్ లో మా పెంచక్క !  ఆగి పోయాడు.

చెవులకు బుట్టలు, జడలో కనకాంబరాలు, లేత అరిటాకు పచ్చ ఓణీ, ఎదురుగా పూల చెట్టు లాగా నుంచుంది పెంచక్క. పిల్ల మాస్టారికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఏం చెయ్యాలో అర్ధం కాక నిలబడి పోయాడు.

మేమందరం గమనిస్తున్నామని, గమనించి, “ఏదీ చెయ్యి చాపు... చాపండి” అంటూ చెయ్యి పట్టుకున్నాడు. చాలా సేపు అలాగే ఆమెను చూస్తూ, చెయ్యి పట్టుకునే ఉన్నాడు. దెబ్బ వెయ్యకుండా. మాలో కొంత మంది, కిచ కిచ మని నవ్వారు. తగిలీ తగలకుండా దెబ్బ వేశానని అనిపించి పోయి కుర్చీ లో కూల బడ్డాడు. ఇద్దరూ బెల్ కొట్టేదాకా, ఏమీ మాట్టాడకుండా కూర్చున్నారు.


(నాక్కూడా ఆ డ్రాయింగ్ మాస్టారి వయసొచ్చిన తర్వాత అర్ధమయ్యింది ఈ సీను. మాస్టారికి ఎన్ని వోల్టుల షాక్ కొట్టి అట్టా కుర్చీలో పడి పొయ్యాడో)


ఆ తర్వాత డ్రాయింగ్ క్లాసు ఉన్న రోజు, పెంచక్క ప్రత్యేకంగా తయారయ్యి వొచ్చేది. బొమ్మ బాగా వెయ్యలేదనో, రంగులు సరిగా పుయ్య లేదనో ఏదో వంక తో మమ్మల్నెవ్వరినీ కొట్టకుండా, పెంచక్కని మాత్రం చెయ్యి పట్టుకుని కొడుతుండేవాడు. ఎన్ని కొట్టినా, పెంచక్క, సరిగా వెయ్యడానికి ప్రయత్నించకుండా, ఇంకా ఇంకా తప్పులు చేసేది. ఎంచక్కని ,పెంచక్కని కొట్టడానికి మాస్టారికి చేతులెలా వొస్తున్నాయో! ఎందుకు అలా అక్కని హింసిస్తున్నాడు అని బాధ పడే వాళ్ళం.మేం సాయం చేయబోతే, వొద్దంటే వొద్దనేది.ఏదో లెండిరా నాకర్మకిలా వొదిలెయ్యండి అని వేదాంతం లో పట్టా పుచ్చుకున్న దానిలా పలికేది. ఆ అలంకరణ, ఆ చెవుల పక్క జుట్టు రింగులుగా అమర్చుకోవడం చూస్తే మాస్టారు తో దెబ్బలు తినడం నిజంగా కర్మ అనే అనుకుంటుందా అని ఎందుకో అనుమానమొచ్చేది. దెబ్బలు తింటూ రోషం లేకుండా, ముసి ముసి నవ్వులు నవ్వేది.


కొన్నేళ్ళ తర్వాత రామకృష్ణ థియేటర్ లో ఇంటెర్వల్ లో కనిపించింది పెళ్ళికి సంబంధించిన గోల్డ్, సిల్వర్ మెడల్స్ తగిలించుకుని.

" పెంచక్కా" అని పలకరించబోయాను.

"ఇష్షూ, నా పేరిప్పుడు స్మిత" అంది మెత్తగా.(అప్పటికింకా, సిల్క్ స్మిత రాలేదు.)

ఆ పక్కనుంది డ్రాయింగ్ మాస్టారేనా?

6 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

హహహ.. భలే ఉందండీ..

>>>ఇప్పట్నుండే మాట విన్నామంటే, వీడు మన మాట వినడురా “అని మా క్లాసు లీడర్ నేమీ చంద్ అన్నాడు.

వాడికి వూరంతా మిఠాయి కొట్లే, అందుకని వాడి మాటే విన్నాం.>>>>

నాకు ఇది భలే నచ్చేసిందీ.. నైస్ పోస్ట్

రాజ్ కుమార్ చెప్పారు...

సాయంత్రం రెండు పోస్ట్లు చూశానండీ. .మహాకొడుకు(కరెక్టేనా?) -1,2.. ఏదో వెరైటీ గా పెట్టారు గా పేరూ.. ఇప్పుడు కన్పించటం లేదేంటండీ?

Chandu S చెప్పారు...


 థాంక్స్ రాజ్ కుమార్ గారు, మహా కొడుకు నాకెందుకో నచ్చ లేదు. తీసేసాను

భాస్కర్ రామరాజు చెప్పారు...

ఆర్యా!!
నా జ్ఞాపకాల దొంతరని తట్టిలేపారు.
బాగుంది.

-భాస్కర్

Pappula Ganesh చెప్పారు...

ఎంచక్కని ,పెంచక్కని కొట్టడానికి మాస్టారికి చేతులెలా వొస్తున్నాయో!nice one

btsridhar చెప్పారు...

కొన్నేళ్ళ తర్వాత రామకృష్ణ థియేటర్ లో ఇంటెర్వల్ లో కనిపించింది పెళ్ళికి సంబంధించిన గోల్డ్, సిల్వర్ మెడల్స్ తగిలించుకుని.

LOL..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి