20, జులై 2011, బుధవారం

పనిష్మెంట్

గుమ్మం దగ్గరే నుంచుంది.

తెల్ల చీరలో అక్కడక్కడా గుర్తొచ్చిన అయిదో ఎక్కం.

5 X5 = వయసు

5X 11= బరువు.

5X 1.1= ఎత్తు

వెనక్కి తిరిగి చూసింది.

పిలక జడ పనమ్మాయి వచ్చి పాల గ్లాసు బల్ల మీద పెట్టి, త్వర త్వరగా వెళ్ళిపోయింది.

ఇలా ఏ సినిమాల్లోనూ చూడలేదే ?

ఆమే నడుచుకుంటూ వచ్చి, మంచం మీద కూర్చుని,

"ఇది నా రూమే తెలుసా?”

"అలాగా" ( తెలియదు)

"నేనెప్పుడూ ఏ పని చెయ్యలేదు.......చెయ్యను కూడా!”

"అలాగా”( ఇప్పుడే తెలిసింది)

"నీకు కోపం వచ్చినా నాకేం భయం లేదు.”

"అలాగే “( తెలుస్తోంది)

"అన్నీ నేనేనా? మీరు మాట్లాడరే?”

అలాగే ( మాట్లాడతా). ఇంటర్ ఎప్పుడు పాసయ్యావ్?

5 X 15 = చిరాకు %

చదువు విషయం ఎత్తకుండా వుండాల్సింది.

"ఇంకా చదుకోవూ?”

"పెళ్ళైందిగా ! ”

విశ్వనాథం దగ్గర జవాబు లేదు.

" చదువు ఎందుకూ?నేను చాలా ఇంగ్లీష్ మాట్టాడతా,నాకు చాలా ఫాషన్స్ తెలుసు. ”

"ఇంగ్లీష్ లో మాట్లాడటం వొచ్చా? ఎలా నేర్చుకున్నావ్.”

"ఇంగ్లీష్ లో కాదు. ఇంగ్లీష్ మాట్టాడతా. మా భారతక్క చదువుకుని ఉద్యోగం చేస్తుంది. దానికి ఇంగ్లీష్ మాట్టాడటమే రాదు. మొత్తం తెలుగులోనే, నేనలా కాదు. చాలా ఇంగ్లిష్ కలిపి మాట్టాడతా.”


"ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా?”

"" తలూపింది.

"ఊ అంటే కాదు. సరిగా చెప్పు.”

"డాక్టరు గారి భార్య అంటే గొప్ప. ఇంత వరకు మా ఇళ్ళలో ఎవరూ డాక్టర్ని అల్లుడిగా తీసుకు రాలేదు. మళ్ళీ బాగా డబ్బులొస్తాయి. హాస్పిటల్ లో ఆయాలే పనంతా చేస్తారు. వాళ్లతోనే వంట కూడా చేయించొచ్చు.”

"ఎందుకూ వాళ్ళతో వంట, నాకొచ్చు, నేను చేస్తాలే.”

"మీరా?, పెద్ద డాక్టరు, మగాళ్ళు, మీరు చేస్తారా ?"నవ్వింది.

తింటే లేని తప్పు వండితేనా?”

"మీకు కోపం రాదా?”

"ఎందుకూ కోపం.

"నాకేమో బాగా కోపం. కోపమొస్తే ఇంట్లో వన్నీ విసిరి కొడతాను. మా ఇంట్లో అందరికీ భయం నేనంటే.”

"అలాగా..”

"నాన్నకు కూడా"

5 X 20 = అందం, అమాయకత్వం, మూర్ఖత్వం, అతిశయం అన్నీ వందశాతం ఉన్న ఇందుమతి.


**************

సిటి ఇందుమతికి బాగా నచ్చింది. తెలిసిన వాళ్ళని పిలిచి పార్టీ ఇచ్చారు. అందగత్తె, ఆస్తిపాస్తులున్న మామ దొరికినందుకు విశ్వనాథానికి షేక్ హాండ్లు ఇస్తూ కుళ్ళు కనపడని సంతోషం వ్యక్తం చేశారు . భోజనాల ప్లేట్ పట్టుకుని, నలుగురు నలుగురు చొప్పున చిన్న చిన్న గ్రూప్ లుగా ఏర్పడి వాళ్ళ పెళ్ళి ఎన్నాళ్ళు నిలుస్తుందో, ఎవరు ఎవర్ని ఆడిస్తారో, అదృష్టం లా కనిపిస్తున్నా, విశ్వనాథం ముందు ముందు ఎన్నెన్ని తిప్పలు పడాలో చర్చించుకున్నారు.

భోజనం ప్లేట్ ఒక్కింటికి ఎంత పడి వుంటుందో అంచనా వేసి, ఇంతోటి రుచికి అంత పెట్టడం దండగ అని అభిప్రాయపడ్డారు.

**********

"ఎప్పటికప్పుడే ఈయన వల్ల ఇల్లు మారాల్సిన పరిస్థితి వొస్తుందండీ. అందరితో గొడవే. నిన్న మా పక్కింటాయన తో గొడవ పడి కొట్టుకుంటే, హాస్పటల్లో నాలుగు కుట్లు పడ్డాయి కూడాను.”

"ఎక్కడా? కుట్లూ?”

"ఈయనకి కాదండీ డాక్టరుగారు, పక్కింటాయనకి,”

"ఇంతకీ ఏమిటీ గొడవ?”

"ఒకటే అనుమానం సార్ నా మీద.”


"మీరేమనుకోకపోతే అయిదు నిముషాలు బయట కూర్చుంటారా.”

ఆవిడ వెళ్లిన తర్వాత విశ్వనాథం అడిగాడు.

"చెప్పండి. “

"ఏం చెప్పమంటారు సార్.”

"మొదటి నుండీ చెప్పండి.”

"మొదట్లో మారీసు పేటలో ఉండే వాణ్ణండీ. ఎదురింటి పైన కాలేజీ కుర్రాళ్ళు. నాతో స్నేహం గా ఉండే వాళ్ళు. పెళ్ళైన తర్వాత కూడా కొన్నాళ్ళు బాగానే ఉన్నారు.

ఒకసారి నేను ఇంటికొచ్చేసరికి ఇది వాళ్ళ మెట్లు దిగి వస్తుంది. ఏమయ్యిందే అని అడిగితే, ఆ ఎదురింటి కుర్రాడు నన్ను ఓ లాగా చూస్తున్నాడు. ఆ చూపు కర్ధమేంటి, నీ ఉద్దేశ్యమేంటి, నా పట్ల నీ అభిప్రాయమేంటి అని అడగడానికెళ్ళానంది.

ఒట్టి పిచ్చి మాలోకంది, వాడి అభిప్రాయం దీనికెందుకు? తిక్కల మారిది కాకపోతే. ఆ తర్వాత నుండీ, ఏమైందో ఏమో, వాళ్ళు దీన్ని చూసి ఈలలెయ్యడం, చేతులూపటం.

ఓ రోజు ఇలా కాదనుకుని, వాళ్ళ మీదకి కర్ర తీసుకుని పోయా. వాళ్ళు నలుగురు, నేనొక్కణ్ణి,......

ఓ రొండ్రోజులు హాస్పిటల్లో ఉన్నా,” అని తల తడుముకున్నాడు.

"ఆ ఇల్లు మారి గంగానమ్మ పేటలో ఇల్లు తీసుకున్నా.

చదువుకుంటానంది. మంచి వుద్దేశ్యమే గదా అని సరే అన్నా. ఇంటి ఓనరు మనవడు సెలవలకొచ్చాడు లెక్కలు చెప్పించుకుంటానంది. మంచి ఆలోచనే గదా అని సరేలేవే అన్నా. ఓ రోజు, ఆ కుర్రాడి వాలకం ఏదో లెక్క మారినట్టు అగపడింది .

మా ఇంటి ఓనర్ని నిలదీశా, ఇదేమన్నా మర్యాదగా ఉందా అని.

ఈ పిచ్చి పీనుగ మీద నానా అభాండాలు వేసి, గొడవకెళ్ళానని నన్ను మనవడితో తన్నిపించి, గిన్నే, చెంబూ బైట పడేశాడు.

ఈ రకంగా అన్ని పేటలూ, నా వొంట్లో అన్ని పార్టులూ అయిపోయినయి డాట్టరు గారూ.”

"ఆవిడతో మీరు ఎప్పుడైనా మాట్టాడారా ఈ గొడవల గురించి.”

"దానికేం తెలుసు సార్, ఒట్టి వెర్రి బాగుల్ది. నేనే అనుమాన పడినట్టు మాట్టాడితే తట్టుకుంటదా? ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే?”

అబద్ధం నమ్మడంలో ఉన్న కంఫర్ట్ వదులుకోవడానికి తయారుగా లేడు.

అయిదు నిముషాలూ అయిన తర్వాత, ఆవిడ వచ్చింది.

"ఈ పిచ్చికి మందే లేదా డాక్టరు గారూ?” అంటూ మొగుడుకి పిచ్చి అని నమ్మించి, వాణ్ణి, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకురాగల అమాయకపు ఇల్లాలు.

"ఉందమ్మా, కానీ మీరో పని చెయ్యాలి...”

********


ఇందు మతికి తొందరగానే స్నేహాలు ఏర్పడ్డాయి ఆ పార్టీ తర్వాత.

" శేఖర్ , శేఖర్" అంటూ పిలిచేది విశ్వనాథాన్ని.

"నా పేరు శేఖర్ కాదు గా "

"విశ్వనాథం బాగో లేదు శేఖర్, మా పంచ కట్టు తెలుగు మాస్టారు గుర్తొస్తున్నారు.”

"శేఖర్ మాత్రం ఏం గొప్పగా ఉంది. “

"ఏం కాదు, నేను చిన్నప్పట్నుండీ, శేఖర్ అనే పేరు గలవాడు నా మొగుడై వస్తాడు అని అనుకునే దాన్ని.”

"సరే, నీ ఇష్టమే నా ఇష్టం "అంటూ ఏదో సినిమా పేరు చెప్పాడు.

*************


"రా శేఖర్, ఎప్పుడూ పేషంట్లేనా?”

"ఇప్పుడేగా వచ్చింది నేను హాస్పిటల్ కి"

"బోర్ కొడుతోంది, రా శేఖర్, పిచ్చి పేషంట్లు, వేరే హాస్పిటల్ కి పొమ్మను"

"ఏంటి పిల్లా , నన్ను పని చేసుకోనీయవా?”

"అదుగో, నువ్వు పిల్లా అంటే.. నాకేదో గుర్తొస్తుంది. నువ్వు అర్జంటుగా ఇంటికి రా చెప్తాను.”

"ఇలా పావుగంటకో ఫోన్ చేస్తే ఎట్టా చెప్పు. ఆ టివి చూస్తూ కూర్చో.”

"ఛీ ఫో ..నీతో మాట్టాడను, సాయంత్రం ఇంటికి రా చెప్తా...”

ఇంటికి రాగానే, భుజానికి వేళ్ళాడుతూ ఎటెళ్తే అటు వస్తూ...

"ఏంటిది ఇందూ, బరువంతా నా మీద వేసి నడుస్తావు. ఇంటికి రాగానే నన్ను నాలుక్కాళ్ళ జంతువుని చేస్తావ్. వేరే నడువు నువ్వు.”

"ఊహూ, నేను ఇలాగే నడుస్తా, పర్లేదులేవోయ్ శేఖర్, నన్ను మోస్తే నీకు పుణ్యమొస్తుంది.”

"పుణ్యమేమో గాని పిల్లా, కీళ్ళనెప్పి, నడుం నెప్పి ఒస్తున్నాయి.”

"అదుగో, నువ్వు పిల్లా అంటే ఏదోలా ఉంటుందని చెప్పానా!”

"సర్లే పిల్లా, ఇదే ఆఖరు.”

....to be continued

4 comments:

అజ్ఞాత చెప్పారు...


 చాల బాగుందండి, సెకండ్ పార్ట్ ఎప్పుడు

Sravya Vattikuti చెప్పారు...

బావుందండి ! ఇంతకు ముందు మహాకొడుకు అని రెండు భాగాలు ఉండేవి , తీసేసారా :(((

Chandu S చెప్పారు...


 @Sraavya gaaru, thanks for enquiry. ' మహా కొడుకు ' కి కొంచం రెపైర్ అవసరం అయ్యింది. ఈ పనిష్మెంట్ తర్వాత ఇంకొన్ని పార్ట్ లు కలిపి పోస్ట్ చేస్తాను.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

మీరు రాసే ఊరునుంచని మళ్ళి మళ్ళి నిరూపిస్తున్నారు. రాసేవారూ-రాసే ఊరూ కూడ వేసెయ్యండి వీలు చూసుకుని

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి