21, అక్టోబర్ 2011, శుక్రవారం

పరిమళ-4continued fromపరిమళ-3


టైం చూసింది. ఆనంద్ కనపడక 24 గంటలవుతుంది. తనది అనవసరమైన కంగారా? ఒక వేళ వచ్చేస్తాడేమో...తను అనవసరం గా అల్లరి చేస్తుందా అతన్ని అనిపించింది ఒక క్షణం.

 బాగ్ లో ఉన్న ఐ పాడ్ తీసి మెయిల్ చూసుకుంది. ఏమీ లేవు ముఖ్యమైనవి. మెసేజ్ ఇచ్చింది అతని ఫోన్ కు ఎక్కడున్నావు అని.

జవాబు లేదు.

ఆ ఫోన్ ఇంకా సింగపూర్ లోనే ఉంది.

పెళ్ళయి, కొన్ని రోజులే గడిచి, ఎంతో ప్రేమిస్తూ ఉన్న అతను, ఎన్నో రకాలుగా కమ్యూనికేషన్ చేయ గలిగిన ఇలాటి రోజుల్లో ....24 గంటల మిస్సింగ్ ఎక్కువే అనిపించింది.


 ఒక వేళ సార్ ఉండి ఉంటే ఏం చేసే వారు ఈ పరిస్థితి లో" శర్మ గారి వంక చూసి

"ఆయనకు తెలిస్తే ఇలా జరిగి ఉండేది కాదు కానీ ఈ మూడు రోజులూ ఎవరైనా ఏం చెయ్య గలరు?”

" తను సింగపూర్ వెళ్ళిన తర్వాత లేటైతే, అప్పటివరకూ వీళ్లు జీతాల్లేక .....నో అలా కాకూడదు.”

వాళ్ల తర్వాతే ఏదైనా?

టేబిల్ మీద న్యూస్ పేపర్ లో ఏదో నగల షాపు ఎడ్వర్ టైజ్ మెంట్ "పండుగ రోజు రండీ, లక్ష్మీ దేవిని ఇంటికి మోసుకెళ్ళండీ" అంటూ

"శర్మగారూ, నగల షాపులు తెరిచి ఉంటాయా?”

"ఉంటాయమ్మా, పండుగ రోజు సెంటిమెంట్ కోసం ఆడవాళ్ళు బంగారం కొంటారు."

"రండి నాతో."

ఇంటికి తీసికెళ్ళింది.

పెళ్ళి కానుకగా ఆనంద్ ఇచ్చిన కొన్ని నగలు తీసుకుని,

బంగారపు షాపు వద్ద కారు ఆపించి లోపలికి వెళ్ళింది.

" మనీ అవసరమైంది. వీటి విలువ ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి."

షాపు ఓనర్ ఆశ్చర్య పడుతూ చూశాడు. పండుగ రోజు నగలు అమ్మగలిగిన యాంటీ సెంటిమెంట్ లేడీని.

"ఒక్క నిముషం కూర్చోండి." అని విలువ కట్టే నెపం మీద నగలు పక్కకు తీసుకెళ్ళి సేల్స్ మేన్ ని పిలిచాడు.

"ఇవి మనం ఆనంద్ ఇండుస్ట్రీస్ ఓనర్ కి ఇచ్చినవి కదూ , ఎవరూ ఈమె?"

"ఆ సార్ గారి భార్యే ననుకుంటా సార్."

"ఆయన భార్యకు నగలమ్మాల్సిన అవసరం ఏమిటీ?"

అని ఇంకా ఆశ్చర్యపోయి ఆమె దగ్గరకొచ్చి,

"ఏమైనా పుచ్చుకుంటారా, కాఫీ , టీ," మర్యాదగా అడిగాడు.

" ఏమీ వద్దండీ, వెళ్ళాలి.”

"సార్ ఊళ్ళో లేరా అమ్మా?”

" లేరు." ఓపిక తెచ్చుకుని జవాబులు చెబుతోంది.

" మీక్కావాల్సిన అమౌంట్ తీసుకెళ్ళండమ్మా, ఈ మాత్రానికి నగలు ఎందుకూ..”

" వద్దండీ," అంది పరిమళ తర్వాత ఇవ్వగలనో లేనో అనుకుని

" అయ్యగారి దగ్గర మాటొస్తుంది. కావాలంటే నగలు నాదగ్గరే ఉంచండి. మీ అవసరం తీరినతర్వాత తీసుకెళ్దురుగాని.”

" సరే, వాటి విలువ ఎంతైతే అంత ఇవ్వండి.”

మనీ తీసుకుని శర్మ గారితో ఆఫీసుకెళ్ళే సరికి వర్కర్లు ఎదురు చూస్తూ ఉన్నారు.

శర్మగారూ, అని డబ్బిచ్చింది.

ఆయన జీతాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.

ఇంతలో ఆమె ఓ పక్క కెళ్ళి

సింగపూర్ ఫోన్ చేసింది.

" సురేష్, ఒక హెల్ప్ చెయ్యాలినేను సింగపూర్ వస్తున్నాను.”

"ఎప్పుడూ, బావగారితోనా, ఏ ఫ్లయిట్ కో చెప్తే..”

ఒక్కదానే వస్తున్నాను, వివరాలు వచ్చాక.”

జీతాలిచ్చిన తర్వాత శర్మ గారితో "సార్ వచ్చే వరకు కొన్ని రోజులు పండుగ సెలవలు ప్రకటించండి.” చెప్పింది.

సుందరం ఇచ్చిన చెక్ మీద ఆనంద్ పేరు రాసి ప్రేమ లేఖల మీద కనపడేట్టు పెట్టి సొరుగు తాళం వేసింది.

శర్మగారిని పంపించి, డ్రైవర్ ని కూడా వెళ్ళమంది.

ఒంటరిగా కారు నడుపుతూ ట్రావెల్ ఏజెన్సీ చూసి పక్కనే ఉన్న చిన్న సందులో కారాపి, సింగపూర్ వెళ్ళేందుకు టికెట్ కొనుక్కుంది. మర్నాడు తెల్లవారు జామున అయిదున్నరకు ఫ్లయిట్.

ఇంటికొచ్చే సరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది.

పిల్లలు బయట తోటలో ఆడుకుంటున్నారు.

జానకి వంటమనిషికి ఏదో పురమాయిస్తూ ఉంది.

" ఎలా ఉంది అత్తగారికి?" జానకిని పలకరించింది.

"బాగానే ఉంది."ముక్తసరి గా.

"ఆనంద్ ఊరెళ్ళాడు.” పరిమళ చెప్పింది.

"ఎప్పుడూ?”

"రాత్రి .ఇంటికేమైనా ఫోన్ చేశాడా?” కనుక్కుంది పరిమళ

"లేదు.”

"ఆమె దగ్గర ఎవరైనా..”

"నేనెంత సేపు ఉండాలి. పిల్లల్ని చూసుకోవద్దూ? నర్సుల్నే చూసుకోమని వచ్చాను.”


"హాస్పిటల్ ఖర్చులకు" అంటూ జానకి కి డబ్బిచ్చింది.

జానకి కి పరిమళ వాలకం నచ్చలేదు.

నిన్నగాక మొన్నొచ్చి ఏదో ఊరిమీద పెత్తనాలు చెయ్యడం, తనకే డబ్బివ్వడం.

"అక్కడ పెట్టు" విసురుగా అంది.

"రేపు మా వూరు వెళతాను, ఆనంద్ వచ్చేవరకూ .” నెమ్మదిగా అంది పరిమళ

జానకి కి విపరీతమైన కోపమొచ్చింది పరిమళ మీద.

" ఆయన ఎప్పుడూ ఇంటిపట్టున ఉండడు, నేనెళ్ళి మా పుట్టింటో కూర్చుంటున్నానా?”

జానకి అన్నది సబబు గానే ఉంది. కానీ ఎలా?

"నేను వెళ్ళక తప్పదండీ. ఏమనుకోవద్దు.”

" రేపటి వరకూ హాస్పిటల్ లో నువ్వుండు, రేపు ఎవరినైనా పిలిపిస్తాను. నీక్కూడా అత్త గారే,.” పదునుగా ఉంది ఆమె గొంతు.

సరే నని పైకెళ్ళింది.

బీరువా తీసి కొన్ని జీన్స్, కొన్ని షర్టులు సర్దుకుంది.

పాస్ పోర్ట్ తీసి చూసుకుంటే కాన్ఫరెన్స్ కోసం ఇచ్చిన సింగపూర్ వీసా ఇంకో పది రోజుల వరకూ ఉంది.

ఏమేమి జరగొచ్చు అని కొద్ది సేపు ఆలోచించింది. మనసు చెప్పిన కొన్ని రిస్క్ లు ఆలోచించి వాటికి తగ్గట్టు కొన్ని పేపర్స్ సర్దింది.

ఆనంద్ లాప్ టాప్ తీసుకుంది. అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ తీసింది.

బాగ్ సర్దుకుని కిందకు వెళ్ళిందిపిల్లలు భోజనం చేస్తున్నారు.

"హాస్పిటల్ కు వెళ్తున్నానండీ, రేపు పొద్దున్నేఊరు వెళతాను."అని చెప్పింది.

"అవును, ఊరి బస్ లు పొద్దున్న అయితే ఖాళీ గా ఉంటాయి.”

మాటలు పెంచకుండా బయటకొచ్చింది.

జానకికి ఇంకా కోపంగానే ఉంది. మంచి తనాన్ని చాతకానితనం గా తీసుకునే రోజులివి అనుకుంది.

గేటు దగ్గర వాచ్ మేన్ఎదురింటి పనివాళ్ళతో కబుర్లు చెప్తున్నాడు. ఇంటి వెనకకు నడిచి తలుపు తీసి రోడ్డు మీదకు వచ్చింది. ఇల్లు బాగా దూరమయ్యాక ఆటో ఎక్కి హాస్పిటల్ కు వెళ్ళింది.

అత్త గారు, నీరసంగా కనిపిస్తుంది. ఆవిడ పక్కన స్టూల్ మీద కూర్చుంది.

నిన్న మధ్యాహ్నం తిన్న తిండి. విపరీతమైన ఆకలి. పక్కనే మంచినీళ్ళు ఉంటే తాగింది.

మధ్యమధ్యలో ఆవిడ కళ్ళు విప్పి చూస్తోంది కానీ ఏమీ మాట్లాడటం లేదు.

రాత్రి ఎనిమిదింటికి, రోగితో ఉన్న వాళ్ళకోసమని హాస్పిటల్ భోజనం వచ్చింది. తినాలనిపించ లేదు. అరటి పండు తిని మంచినీళ్ళు తాగి కూర్చుంది.

రాత్రి రౌండ్స్ కు వచ్చాడు డా. శ్రీమన్నారాయణ.

"ఇవ్వాళ చాలా ఇంప్రూవ్ మెంట్ ఉందమ్మా, ఇంకా రెండు మూడు రోజులు చూసి ఇంటికి పంపిస్తాను.” అన్నాడు.

"థాంక్స్ సార్" అంది.

"మీరింకా దిగులుగానే ఉన్నారే?” అన్నాడు.

"లేదు, లేదు" అంది చిరునవ్వు తెచ్చిపెట్టుకుని.

"ఆమె హాస్పిటల్ లో ఉన్నట్లు ఒక మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వగలరా?”

"తప్పకుండా" అని పక్కనున్న జూనియర్ డాక్టర్ కు చెప్పాడు ఆ సంగతి చూడమని.

తెల్లవారు జామున లేచి ఇంటికి ఫోన్ చేసింది.

జానకి "హలో" అంది

"నేనండీ, పరిమళను, బయలుదేరేముందు ఒక సారి చెబుదామని, అత్తగారు ఒక్కరే ఉన్నారు.”

ఫోన్ పెట్టేసిన శబ్దం. అత్తగారి వంక చూసింది, ఆవిడ నిద్ర పోతోంది.

బాత్ రూమ్ లో చీర మార్చి జీన్స్, కుర్తా వేసుకుంది. మొహం మీద ఉన్న చిన్న చుక్కలాంటి బొట్టు తీసి చేతి కి అంటించుకుంది. జడ విప్పి దువ్వుకుని లూజ్ గా వదిలేసింది. దూరం నుండి చూస్తే ఆమే పరిమళ అని తెలిసిన వాళ్ళెవరూ అనుకోరు.

ఫ్లైట్ టైమవుతోంది. నర్స్ తో చూస్తూ ఉండమని చెప్పి హాస్పిటల్ బయట ఆటో ఎక్కి ఎయిర్ పోర్ట్ కు వెళ్ళిపోయింది.


*****************


సురేష్ ఢిల్లీ లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో పిజి డిప్లొమా చేసి, సింగపూర్ లో ప్రైవేట్ గా యాక్టింగ్ స్కూల్ నడుపుతున్నాడు.

జరిగింది చెప్పింది

"ఏంటక్కా ఇదేదో సినిమాలా ఉందే. ఒక వేళ ఫోన్ ఎవడైనా కొట్టేశాడేమో, అతను ఇంకెక్కడైనా ?"

"ఆ అవకాశం లేకపోలేదు. కానీ దొంగ అయితే సిమ్ కార్డ్ మార్చేవాడు."

ఫోన్ చేశాడు ఆ నంబర్ కు. మోగుతోంది కానీ రెస్పాన్స్ లేదు.

"ఆనంద్ ని ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే ఎలర్ట్ అవుతారు వద్దు."

"ఒకవేళ ఆనంద్ దొరక్క పోతే..."

"దానికీ ప్రిపేర్డ్ గా ఉన్నాను. చూద్దాం. ఒక వేళ ఆనంద్ అక్కడుంటే బయటికి తీసుకు రావడం ఎలా"

"తనంతట తాను వచ్చి ఉంటే సమస్య లేదు. అలా కాకుండా, ఎవరైనా బలవంతాన తీసుకువచ్చి ఉంచితే , అప్పుడు ఆలోచించాలి ఎలా తీసుకు రావాలా అని.”

"పోలీసుల హెల్ప్ తీసుకుంటే?” పరిమళ అంది.

"తీసుకోవచ్చనుకో, అక్కడున్నాడని గారెంటీగా తెలియకుండా కంప్లైంట్ ఎలా ఇస్తాం? “

"నిజమే"

"సరే అక్కా, ఆ ఇంటి ఎదురుగా, ఒక సర్వీస్ అపార్ట్ మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకుంటాను. ఒకటి రెండు రోజులు మా వాళ్ళనెవరినైనా అందులో ఉంచి ఎవరున్నారో ఏమిటో అబ్జర్వ్ చేయమని చెప్తాను. నువ్వు రిలాక్స్ అవ్వు. “

"ఎవరో ఎందుకు , నేనే ఉంటాను.”

ఆ రెండు రోజులు ఆ ఇంటి వంకే చూస్తూ కూర్చుంది.


**********


"అబ్బాయిలూ అమ్మాయిలూ, నటన ఎంత సహజంగా ఉండాలంటే మనం నటిస్తున్నామని ఎదుటివాళ్ళు తెలుసుకోలేనంత. దానికి అబ్జర్వేషన్ పవర్ ఎంతో అవసరం. మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రావడానికి ఒక అవకాశం ఇస్తున్నాను.”

కొంచం ఆగాడు సురేష్

"ఒక ఇంటికి వేర్వేరు సమయాల్లో వెళ్ళి ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడి, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు మనుషుల గురించి బాగా గమనించి చెప్పాలి. కొరియర్ బాయ్, బ్యూటిషియన్, ప్లంబర్, ఇలా ఒక్కో వేషం తో వెళ్ళి సహజంగా నటించి రావాలి.”

"ఒక వేళ నకిలీ వాళ్ళమని పట్టుబడితే..”

" నా స్టూడెంట్లు అంత చెత్త యాక్షన్ చెయ్యరనే నా నమ్మకం. ఒక వేళ పట్టుబడితే, ఫలానా డ్రామా స్కూలు పిల్లలం , మా పైత్యపు మాస్టారు ఇలా చెయ్యమన్నాడు అని చెప్పండి. ఐ డి లు తీసుకెళ్ళండి. అంతా అయిన తర్వాత, ఇదిగో ఈ మార్కింగ్ షీట్ ఇవ్వండి మీ నటన మీద వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి. తన అభిప్రాయానికి విలువ ఇస్తున్నారని తెలిస్తే ఎంతటి వాడైనా ఉబ్బిపోతాడు. మరీ గొడవైతే నేను రెడీ గా ఉంటాను ఏ క్షణం లోనైనా రావడానికి”

ఏక్టింగ్ స్కూలు పిల్లలు, పరిమళ ఇచ్చిన ఇన్ ఫర్మేషన్ ప్రకారం ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి ఒక్కతే ఉంటోంది ఆ ఇంట్లో. ఆ పిల్లకు ఫాషన్ల పిచ్చి, షాపింగ్ అంటే ఇష్టం. రాత్రి పూట కూడా ఎవరూ రారు ఆ ఇంటికి. హాలుకి ఎడమవేపునున్న గది ఎప్పుడూ మూసి ఉంటుంది.

 అక్కడ ఏం చేశారు, ఎలా చేశారు లాంటి సంగతులు చెప్పిన తర్వాత, మార్కుల కోసం పిల్లలు గొడవ చేస్తుంటే,

"చెరిల్ ను రానివ్వండి. ఆమె కూడా వచ్చాక..”

చెరిల్ చెమటలు పట్టి మురికిగా జిడ్డు కారుతూ వచ్చింది.

"ఏమయ్యింది?” అడిగాడు

"నాది క్లీనింగ్ జాబ్ కదా మాస్టర్, ఇంట్లో అన్ని రూం లు క్లీన్ చేయించింది బాత్ రూమ్ లతో సహా."

"అన్ని గదులూ అంటే, ఆ మూసి ఉన్న గది కూడానా?” ఆత్రుతతో.

"అదికూడా. అందులో ఒకాయనున్నాడు. ఏమీ తినడనుకుంటా, తినకుండా వదిలేసిన ఫుడ్ క్లీన్ చేసే సరికి అమ్మో.... చేతులు పడి పోయినాయి.”


"ఎవరికెన్ని మార్కులొచ్చాయో చెప్పండి సార్.” పిల్లలు టెన్షన్ ఆపుకోలేక.

"అందరూ చాలా చాలా దగ్గరగా ఉన్నారు, బట్ చెరిల్ కు ఒక మార్క్ ఎక్కువ ఇవ్వక తప్పదు. ఎందుకంటే మూసిన గదిని తెరిపించగలిగింది."

పిల్లలు నాకేం తక్కువ అంటే నాకేం తక్కువ అంటూ గోల చేస్తుంటే, చెరిల్ కు భయం పట్టుకుంది ఫస్ట్ మార్క్ పోతుందేమో అనుకుని.

"సార్ ఇంకో విషయం, ఆ గదిలో ఉన్నతని పేరు కనుక్కున్నాను.”

"ఏమిటీ?”

"ఆనంద్"

to be continued

4 comments:

Sravya Vattikuti చెప్పారు...

హ్మ్ ! భలే suspense maintain చేస్తున్నారు , బావుంది ఈ ఎపిసోడ్ !

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

Good Suspense level. Keep it up.

కృష్ణప్రియ చెప్పారు...

నా కామెంట్ రాలేదు.. ఎందుకో.. పోస్ట్ అయిందో లేదో సరిగ్గా చూసుకోలేదు..
అంత ఈజీ గా ఆనంద్ వచ్చేశాడు అంటే అనుకున్నాను.. ఏదో గొడవ అవుతుందని :-(

Chandu S చెప్పారు...

కృష్ణప్రియ గారూ, మీ కామెంట్ పరిమళ 6 లో పోస్ట్ అయ్యిందండీ.

ఈ కథ రెగ్యులర్ గా చదువుతున్నందుకు ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి