17, అక్టోబర్ 2011, సోమవారం

పరిమళ-1


continued from పరిమళ


రిజిష్ట్రార్ ఆఫీసులో పెళ్ళి చేసుకుని, రొండు కుటుంబాల చుట్టాలకొక రోజు, స్నేహితుల కొక రోజు విడివిడిగా భోజనాలు ఏర్పాటు చేశారు.

ఇంటికొచ్చిన తర్వాత, మా అమ్మ, వదిన అని మళ్ళీ పరిచయం చేశాడు .

నమస్కారం చేసింది.

ఎనిమిదేళ్ళ అమ్మాయి, ఏడేళ్ళ అబ్బాయి ఆనంద్ పక్కనే చేరి, మాగురించి చెప్పు అన్నట్లు సతాయిస్తుంటే,

"అన్నయ్య పిల్లలు" అని పేర్లు చెప్పాడు.

వాళ్ళు పరిమళను తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టారు.

వాళ్ళేం చదువుతున్నారో, పరిమళ కనుక్కుంటుంటే.

ఆనంద్ వచ్చి పక్కనే కూర్చున్నాడు.

" అన్నయ్యని చూపించాను నిన్న భోజనాలలో" అని గుర్తు చేశాడు

పరిమళ కు గుర్తొచ్చి, ఏరీ అన్నట్లు చూస్తుంటే,

"అన్నయ్య కు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పట్నుండి డైరెక్టర్ కావాలని.”

" షూటింగ్ కోసం కులుమనాలీ వెళ్లారు ." జానకి చెప్పింది.

పిల్లలు అందుకుని మా డాడీ సినిమాల్లో చేస్తాడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఆల్బం తెచ్చారు.

చూడు పిన్నీ, ఇక్కడ నేనే చిరంజీవి అంకుల్ పక్కన, ఇక్కడ డాడీ మోహన్ బాబు అంకుల్ తో, ఒక సారి మా ఇంటికి ...." పిల్లలు సినిమావాళ్ళ కబుర్లు చెప్తున్నారు.

"ఇంక లేవండి, అన్ని కబుర్లు ఒక్క సారేనా" అని జానకి పిల్లల్ని కసిరి

"మీరు పైకెళ్ళండి." అని ఆనంద్ తో చెప్పింది.

ఆనంద్ గది కి తీసుకొచ్చి, చూపించాడు. ఆ గదిలోనుండి పక్కనే ఉన్న ఒక తలుపు తీసి, వేరే గదిలోకి తీసుకెళ్ళాడు.

"ఈ స్టడీ రూమ్ నీకోసమే.”

చాలా విశాలమైన గది. బుక్స్ పెట్టిన ఒక షెల్ఫ్, చక్కగా అమర్చిన ఉన్న సోఫాలు,

కిటికీ పక్కనే ఏదో ఎత్తైన చెట్టు ముదురు ఆకు పచ్చ రంగు ఆకులతో ఉంది.

కిటికీలకు సన్నని లేత నీలం రంగు పరదాలు. టేబిల్ మీద పెద్ద స్క్రీన్ తో మాక్ కంప్యూటర్.

ఆ రూమ్ లో కూడా పెద్ద తెల్లటి బెడ్.

"నాకు వేరే రూమ్ ఎందుకూ? “

"నువ్వెప్పుడైనా చదువుకోవాలన్నా, రిలాక్స్ అవాలన్నా.”


ఒక బీరువాతీసి చీరలు, జీన్స్, డ్రస్ లు ,వజ్రాల నగలు చూపించాడు. "రకరకాల చీరల మీద పెట్టుకోడానికి మా వదినా వాళ్ళు ఏదో మేచింగ్ సెట్ అంటుండేవాళ్ళు. నీక్కూడా అలాంటి ఇష్టాలుంటాయేమోనని పెళ్ళి మాటలు జరపక ముందు కొన్నాను. నీకిష్టం లేదని తెలిసినా వాటిని కదిలించబుద్ది కాలేదు. వాడకపోయినా ఇవన్నీ నీవే.ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు.”

ఏమీ వద్దన్నట్లు తలూపింది.

నేను స్నానం చేసి వస్తాను అని తనగది లోకి వెళ్ళాడు. వెళుతూ తలుపు దగ్గరకు వేసి వెళ్ళాడు.

ఆ రూమ్ లోనే ఉన్న బాత్ రూం తలుపు తీసి చూసింది. చాలా సౌకర్యాలతో ఉంది.షవర్ కేబిన్ పక్కన ఒక టేబిల్ మీద తెల్లటి బాత్ టవల్ రోల్స్ చుట్టి ఉన్నాయి. స్నానం అయిన తర్వాత లేత పసుపుపచ్చ కాటన్ చీరకట్టుకుని, జడవేసుకుంటుంటే కాఫీ కప్పులతో ఆనంద్ వచ్చాడు.

"రా, కాఫీ చల్లారి పోతుంది.” కిటికీ దగ్గరున్న కుర్చీ లో కూర్చో బెట్టి తను నుంచునే కాఫీ తాగుతూ నిలబడ్డాడు.

కిటికీ లోనుండి కనపడే తోట ను చూస్తూ ఉంది పరిమళ.

"కొత్త గా ఉందా?”

"ఊఁ..కొంచం.”

"హోమ్ సిక్?”

" పర్లేదు. వేరే ఊళ్ళు వెళ్ళడం అలవాటే , నాన్నకే బెంగ గా ఉండి ఉంటుంది. అమ్మ పోయిన తర్వాత నన్ను వదిలి ఎప్పుడూ లేడు.”

" పోనీ ఆయనని తీసుకువద్దామా, మనతో ఉంటారు.”

" అదేం వద్దు. అయినా నాన్న రాడు. అన్నయ్య,అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారుగా,”

"మీ అన్నయ్య ..”

" డిగ్రీ వరకు చదివి ఇంక చదవనన్నాడు. నాన్న పెద్ద గా బలవంతం చెయ్యలేదు. చిన్నప్పుడు నన్ను నిద్ర లేపి, స్కూలికి అన్నయ్యే రెడీ చేసే వాడు. తర్వాత మావయ్య వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఊళ్ళో మాకున్న పొలం చూసుకుంటున్నాడు. నేను, నాన్నా నా చదువుకోసం సిటీ వచ్చేశాం.”

ఏదో ఆలోచనలో పడింది.
"అన్నయ్య కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది.” అతని ముఖం చూసి ఆగింది

"చెప్పు..”

" నేను పెళ్ళి చేసుకోకుండా, నాన్న తో ఉంటూ, అన్నయ్య పిల్లలని బాగా చదివించాలనుకున్నాను.”

" దానికి పెళ్ళి మానుకోవాలా?” అని ఏదో గుర్తొచ్చినట్లు,

"ఉండు, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను, చూపిస్తాను." అని లేచాడు.

"ఇంకానా? వొద్దు" అని చెయ్యి పట్టి ఆపింది.

పరిమళ మొదటి సారి తనంతట అతన్ని తాకడం తో ఆనంద్ కు సంతోషం తో చిరునవ్వు వచ్చింది.

"థాంక్స్." అన్నాడు.

చెయ్యి వదిలేసింది. అతను ఒక పాకెట్ తెచ్చి తెరిచి చూడు అన్నాడు.

Apple I Pad.

"నీకు బాగా ఉపయోగమనీ, తీసుకున్నాను. హాండ్ బాగ్ లో తీసుకెళ్ళొచ్చు. బుక్స్, జర్నల్స్, స్టడీ మెటీరియల్ చాలా ఉంచొచ్చు. నా ఫోన్ వివరాలు దీనిల్లో లోడ్ చేశాను. నన్ను నువ్వు, నిన్ను నేను ఎక్కడున్నామో తెలుసుకోవచ్చు.”

ఎలాగో చూపించాడు. పరిమళ ఐ పాడ్, ఆనంద్ ఐ ఫోన్ పక్క పక్కనే బ్లూ చుక్కల్లా కనిపించయి, ఇంటి అడ్రెస్ తో సహా.

"కిందకు వెళ్దామా?" అంది

"ఏం ?”

"మనకోసం చూస్తూ వుంటారేమో.”

అందరితో కలిసి భోజనం చేసి కొద్ది సేపు టివి చూస్తూ కూర్చున్నారు.

పొద్దు పోతోంది ఇంక పడుకోండి అని జానకి చెప్పడంతో మళ్ళీ పైకి వచ్చారు.

"ఎక్కడికన్నా బయటి కెళ్దామా?" అడిగాడు.

"వద్దు, ఎక్కడికీ వెళ్ళాలని లేదు.”

ఆనంద్ బెడ్ రూమ్ తలుపు తీస్తే బయట గార్డెన్ లైట్ల వెలుగులో సన్నగా వాన పడుతుంది.

"వాన ఇష్టమేనా?”

"లేదు, ఎందుకో దిగులుగా అనిపిస్తుంది.”

"ఏం? “

"ఇళ్ళు లేని వాళ్ళు గుర్తొస్తారు.”

"ఎప్పుడూ బెస్ట్ స్టూడెంట్ గా ఎలా సాధ్యం? అస్తమానం పుస్తకాలు, చదువేనా?” అడిగాడు.

"నేను మరీ సిన్సియర్ స్టూడెంట్ ని కాదు. చదువంటే కొద్దిగా ఇష్టం. ఏదైనా పాఠం బాగా వస్తే ఏదో తెలియని సంతోషం. మీ గురించి చెప్పండి”

"మీరు అనొద్దు. బిజినెస్ కోసం డిగ్రీ, నిన్ను రోజూ చూడటం కోసం పిజి చేశాను. అంతే. టెక్స్ టైల్స్ ఇండస్ట్రీస్ కి నాన్న గారు నా పేరే పెట్టారు. వాటికి సంబంధించిన షో రూమ్ లు కొన్ని మన దేశం లోనూ, కొన్ని బయటా ఉన్నాయి. ఒక సారి నిన్ను ఎంప్లాయీస్ కి పరిచయం చెయ్యాలి.”

"ఎందుకూ..”

"మరి వాళ్లకు వాళ్ళ కొత్త బాస్ ని చూడాలని ఉండదా?”

"నేనా? నేనేదైనా ఉద్యోగం చేస్తాను ఆనంద్. ఇలా డబ్బుల్లో బతకటం ...నాకొద్దు.”

"నీలాటి వాళ్ళే యజమాని లా ఉండాలి పరిమళా, పేద వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు. పోనీ చేద్దామనుకునే ఉద్యోగమేదో మన ఇండస్ట్రీలోనే చెయ్యి.”

ఆమె ఆలోచిస్తూ ఉంటే "సరే తొందర లేదులే ఆలోచించు.నీకు నచ్చే ఒక మాట చెప్పనా?”

“......”

"పెళ్ళి ఖర్చు వద్దన్నావుగా, ఎంతవుతుందో అంచనా వేసి వర్కర్లకు బోనస్ ఇస్తున్నాము.”

"నిజమా?" చిరునవ్వు నవ్వింది.

" ఒకటడగనా? అడిగితే ఏమంటావో" అని.

"ఏమిటి?”

"నాన్నగారు నాకోసమే ఒక ఇల్లు కట్టించారు, పెళ్ళి తర్వాత నేను దాంట్లో ఉండాలని. వెళ్దామా?”

"ఇంటో వాళ్ళకు ఎంత బాధగా ఉంటుందీ మనమలా వెళ్ళిపోతే?”

"మనిద్దరమే ఉందాం కొన్నాళ్ళు”

"ఈ ఇంటికేమయ్యింది? ఐనా ఎందుకంత ఏకాంతం?”

"పోనీ ఒకటి రొండు రోజులుండి వచ్చేద్దాం. నాన్న కోసం.”

మాట్లాడుకుంటుంటే తెల్లవారబోతోంది. వర్షం పెద్దదయ్యింది.

"పడుకో.”

అని వెళ్ళ బోయాడు.ఆనంద్

" ఎక్కడికీ?”

"నా గదిలో ...”

"వద్దు. ఇక్కడే ఉండు.” అని చెయ్యి పట్టుకుని ఆపింది.

"నాకు ఒక్కదానికే ఇంత పెద్ద గదిలో నిద్ర పట్టదు..”

ఆమె పక్కనే తల వేపున కూర్చున్నాడు. చెయ్యి వదలకుండా.

కొంత సేపటికి పరిమళ నిద్ర పోయింది.

సొఫా మంచం దగ్గరకు జరిపి పడుకున్నాడు.


************

అలాంటి ఇల్లు పరిమళ ఎప్పుడూ చూడలేదు,

ఊరికి కొద్ది దూరంలో ఉంది. ట్రాఫిక్ శబ్దాలకు దూరంగా. ఇంటికి చేరే సరికి సాయంత్రమయింది. ఎన్నో రకాల చెట్లు. ఆ ఇంటిని ఇల్లు అనటం కొద్దిగా తక్కువ చేసినట్లే. ఇంటి ముందు కొలను లో తామరాకులు తేలుతున్నాయి. అప్పుడే లైట్లు వెలిగాయి. ఇంటి ముందు ఆకుపచ్చని మెత్తటి పచ్చిక. దీపాల వెలుగులో తోట అందంగా ఉంది. లోపలికి తీసుకెళ్ళాడు. హాలుకి కుడివైపు పెద్ద వరండా, దాన్ని ఆనుకుని స్విమ్మింగ్ పూల్. చూట్టూ వెలుగుతున్న దీపాలు దూరంగా ఆకాశంలో చంద్రుని వెలుగుతో పోటీ పడుతూ.


చేతులు పట్టుకుని తోటలో తిరిగారు.

రకరకాల పూల చెట్లు.

"ఎవరు ఇంత బాగా తోట ని చూసుకుంటుందీ?” అడిగింది.

"ఇప్పుడు వస్తారు.”

తోట చూసే అతను భోజనం తెచ్చాడు. అతని భార్య కూడా వచ్చింది.

"ఎక్కడిదీ ఈ కారేజీ?"ఆనంద్ ని అడిగింది.

"మా రాణి వండిందమ్మా. బాగా చేస్తది వొంట,"భార్య వంక చూసి అన్నాడు.

ఇంట్లో కొంచం సర్దే పని ఉంది బాబూ, అని లోపలికి వెళ్తుంటే.

వాళ్ళతో పాటు ఆనంద్ పరిమళ లోపలికి నడవ బోయారు.

అతను చనువు గా ఆపి, "కొంచం తోటలో కూర్చోండయ్యా" అన్నాడు.

అతని చిన్నప్పటి కబుర్లు విని నవ్వి నవ్వి పరిమళ బుగ్గలు ఎరుపెక్కాయి.

"ఎవరో ఒకమ్మాయి నేను నవ్వను అని చెప్పినట్టు గుర్తు.” అన్నాడు.

"నిజమే, ఇలాటి పిచ్చి కబుర్లు ఎవరూ చెప్పలేదు.””

"నా చిన్ననాటి ఆడ స్నేహితుల గురించి అడుగుతావేమో ననుకున్నాను?” అడిగాడు.

"వొద్దు.”

"ఫర్లేదు, చెప్పనీ.”

"మనసు గది ఎవరిది వారికి ప్రత్యేకం. దాంట్లో ఎన్నో మణి మాణిక్యాలు వుంటాయి. వేరే వాళ్ళు తెరిచి చూస్తే పాములు తేళ్ళు లా కనపడతాయి.”
"అంత భయపడేవేమీ లేవు.”

"అయినా వొద్దు.”

ఒక అరగంటైన తర్వాత, లోపల్నుండి తోట పని చేసే అతను, అతని భార్యా వచ్చారు.వెళ్ళొస్తాం అంటూ వెళ్ళబోతుంటే

"ఎక్కడుంటారు?” కనుక్కుంది.

"ఇక్కడేనమ్మా"అని కొద్ది దూరం లో కట్టిన క్వార్టర్స్ చూపించాడు.

" మీ అమ్మగారు ఏవో ఇచ్చి పంపించారు." లోపలికి వెళ్ళి ఒక పాకెట్ ఇచ్చింది. ఆ అమ్మయికి చీర అతనికి బట్టలు.

ఆనంద్ అతనికి డబ్బులిచ్చాడు.


"అంత పెద్ద కారేజీ మేమిద్దరం ఏం తింటాం, మీరూ వుండండి భోజనం చేసి వెళ్దురు గాని.” చెప్పింది పరిమళ

ఆ మాటకు ఇద్దరూ ముఖముఖాలు చూసుకుని "మాకు ఇంటి దగ్గర ఉందిలేమ్మా, మీరు తినండి,

వాళ్ళు వెళ్ళిన స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళి దాని పక్కనే నుంచుని పైకి చూసి ఇవ్వాళ పౌర్ణమి లా ఉందే అని అడిగింది.

"అవును ఇవ్వాళ ఒప్పుకుంటావో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను."

" నీకు స్విమ్మింగ్ వొచ్చా?” పరిమళ అడిగింది.

"ఊఁ మరి నీకో?”

"రాదు.”

"నేర్పించనా? ఇద్దరం కలిసి చెయ్యొచ్చు.” మామూలుగా అడిగాడు.

ఏం మాట్లాడకుండా తల పక్కకు తిప్పింది అతనికి మొహం కనపడనీయకుండా.

" సైలెంట్ అయిపోయావే "దగ్గరకొచ్చి అడిగాడు.

లేచి వెళ్ళిపోయింది..

స్నానం చేసి చీర కట్టుకుని జడ వేసుకుని తయారయి చూస్తే ఆనంద్ ఇంకా స్విమ్మింగ్ పూల్ లోనే ఉన్నాడు.

డైనింగ్ టేబిల్ మీద అన్నీ సర్ది చూస్తూ ఉంటే, వచ్చాడు.

స్నానం అయినట్లుంది. రాత్రి పూట వేసుకునే పైజమా లాల్చీ వేసుకున్నాడు.

పరిమళ మౌనంగా వడ్డిస్తుంది.

"సారీ, మామూలుగా అన్నాను.”

కళ్ళెత్తి అతన్ని చూసి కళ్ళు దించుకుంది.

కళ్ళలో కోపం లేదు.

ఏదో ఉంది. ఆ చూపు హుషారు నిచ్చింది. తెలియని సంతోషాన్ని పెంచింది.

"ఏమయ్యిందీ?" అడిగాడు.

"తిను ఆనంద్" ఇదివరకులా లేదు స్వరం.


భోజనం అయిన తర్వాత ఇద్దరూ ఇంటిముందున్న కొలను ముందు కూర్చున్నారు.

ఎన్నో ఏళ్ళ తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితుల లాగా, చేతిలో చెయ్యి వేసుకుని.

"పెళ్ళైన కొత్తలో అమ్మా, నాన్న ఉమ్మడికుటుంబంలో వంటింట్లో సర్దుకునేవారని నాయనమ్మ చెప్పింది. అందుకోసమేనేమో నాన్న ఈ ఇల్లు కట్టాడు. అబ్బాయి పెళ్ళైన తర్వాత వేరే ఉండాలి. మనతో ఉండమని అని నువ్వు పేచీ పెట్టొద్దు అని అమ్మతో చెప్తుండేవాడు.”

రాత్రి చల్లదనం ఎక్కువయ్యింది.

మెట్లెక్కి పైకెళ్ళి ఇద్దరూ బెడ్ రూమ్ తలుపు తీశారు.

ఆశ్చర్య పడ్డారు ఆ రూమ్ అలంకరించిన తీరుకి. గదంతా తోటలో పూచిన మల్లెలతో నిండి వుంది.

"ఇదేమిటీ ఆ తోటతను, అతని భార్యా చేశారా ?"అనుమానంగా ఆనంద్ వంక చూసింది .

"నాకేం తెలియదు. ఇదంతా వాడి ఆర్ట్ డైరెక్షనే .అసలే వాడికి సినిమాల పిచ్చికూడా.” ఆనంద్ కంగారు పడుతూ

"పాపం వాళ్లకు కూడా ఇలాగ అలంకరించుకోవాలని ఉంటుందేమో ఆనంద్. రేపు వాళ్ళ మొహాలు ఎలా చూసేది.”

"మరీ ఎక్కువగా బాధపడకు, ఇక్కడ వాళ్ళిద్దరికీ ఏ అడ్డూ లేదు. వాడికి ఎంత ఎక్స్ పీరియన్స్ లేక పోతే ఇంత బాగా అరేంజ్ చేస్తాడు. “

బెడ్ రూమ్ కి ఆనుకుని ఒక బాల్కనీ ఉంది. బాల్కనీ చుట్టూ పిట్టగోడ మీద సన్నజాజి తీగలు. పూలు విచ్చుకుని నక్షత్రాల సంఖ్యతో పోటీ పడుతూ. పూల తీగెల దగ్గర నుంచున్నారు.

ఒక పూల గుత్తి పట్టుకుని వాసన చూసి,

"ఎందుకు రాత్రి విచ్చుకునే పూలకే ఇంత మంచి స్మెల్ ఉంటుందీ?” అడిగింది

" నాకు తెలిసిన ఒక పూల చెట్టు, రాత్రీ పగలు తేడాలేదు. ఎప్పుడూ మంచి పరిమళమే." అన్నాడు ఆమె వంక చూస్తూ.

"ఏమిటీ డబుల్ మీనింగ్ మాటలు" చేతి మీద గిచ్చింది.

"ఇవా డబుల్ మీనింగ్ మాటలు, సినిమాలు చూడవు కదూ.ఎలా ఉంది?”

"ఏమిటి ?”

"పెళ్ళి ముందు భయపడినట్టే ఉందా పెళ్ళి తర్వాత?”

ఆనంద్ ఆశ్చర్య పడేట్టు, ఆమె దగ్గరకొచ్చి

"నేనేదో ప్రత్యేకమైన అమ్మాయినని అనుకునే దాన్ని. నేను చాలా మామూలు అమ్మాయినని గుర్తు చేస్తున్నావు. నువ్వంటే ఇష్టం అనిపిస్తుంది. నీతో స్నేహం బాగుంది.” అంటూ చేతులు అతని మెడలో హారంలా వేసి భుజం మీద తల పెట్టుకుంది.

"థాంక్ యూ" అన్నాడు, ఆనంద్ ఆమెను ఇంకా దగ్గరకు తీసుకుని.

ఒకనిముషం తర్వాత అతన్ని విడిపించుకుని

"పెళ్ళి వల్ల కష్టాలు, బాధలు అంటారు అంతా. అదేంటో చూద్దాం అనిపిస్తుంది. రిస్క్ తీసుకోవచ్చు అనిపిస్తుంది.”

"ఒక సారి రిస్క్ తీసుకుందామా ?”

"మళ్ళీ రొండు అర్ధాలా" అని పూలగుత్తి తో కొట్టింది.

*******

..to be continued

2 comments:

అజ్ఞాత చెప్పారు...

"మనసు గది ఎవరిది వారికి ప్రత్యేకం. దాంట్లో ఎన్నో మణి మాణిక్యాలు వుంటాయి. వేరే వాళ్ళు తెరిచి చూస్తే పాములు తేళ్ళు లా కనపడతాయి.”
చాలా బాగుంది
కాముధ

Chandu S చెప్పారు...

@ kamudha
ఇవి నాక్కూడా నచ్చిన వాక్యాలు. మీకు నచ్చినందుకు సంతోషం

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి