18, అక్టోబర్ 2011, మంగళవారం

పరిమళ-2


continued from పరిమళ-1


ఉదయమే లేచి తయారయ్యి బయటకొచ్చారు.

పూల చెట్ల మధ్య ఉన్న రాణి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆనంద్ కారులో బేగ్ పెట్టడం చూసి,

"ఏమిటీ అప్పుడే ప్రయాణమా? ఇంకా నాల్రోజులు ఉండొచ్చుగా.” అంది అలిగినట్టు.

"ఇంకా నాల్రోజులు నీ చేతి వంట తింటే లావయిపోతామని భయంగా ఉంది.మేమిద్దరం సన్నగానే ఉందామనుకుంటున్నాం, మీ ఆయన లాగా.” ఆనంద్ అన్నాడు.

"ఊరుకో బాబూ అన్నీ చెతుర్లు.” సిగ్గుపడ్డాడు తోట చేసే అతను.

"మళ్ళీ రండమ్మా" రాణి ప్రేమగా అంది.

"బాగా వండి పెట్టావు. మీరే రండి ఆ ఇంటికి." అంటూ ఒక బంగారు కమ్మల జత రాణి కి ఇచ్చిచెప్పింది పరిమళ

 వస్తాము అని చెప్పి కారెక్కారు.

"ఇంకొక్క రోజు ఉందామనుకున్నాను.” ఆనంద్ అన్నాడు.

"నా థీసిస్ అయిపోవచ్చింది ఆనంద్. అది సబ్మిట్ చేస్తే నాకు రిలీఫ్.”

ఒక అరగంట తర్వాత ఇంటికి చేరుకున్నారు.

"ఇవాళ ఆఫీసుకు వస్తావా?”

"మరి నేను మా గైడ్ దగ్గరకెళ్దామనుకున్నానే" అంది పరిమళ.

"దాందేముంది, ముందు ఆఫీసు కెళ్ళి ఆ తర్వాత గైడ్ దగ్గరకు తీసుకెళ్తాను.”

మాట్లాడుకుంటుంటే పరిమళ వాళ్ళ నాన్న వచ్చాడు.

"రండి, రండి" అంటూ మర్యాద చేసింది ఆనంద్ వాళ్ళ అమ్మ.

"బాంక్ లో పని ఉండి వచ్చానమ్మా ఒకసారి మీ అందరినీ చూసి పోదామని" కారణం చెప్తున్నాడు.

"అయ్యో, ఎందుకండీ అంత మొహమాటం. అమ్మాయిని చూసుకోటానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి.”

"ఏంటి నాన్న,చిక్కిపోయావే,ఎలా ఉంది నీకు అక్కడ?”పరిమళ తండ్రి పక్కన కూర్చుని.

"బాగుంది. చిన్ననాటి స్నేహితులందరూ ఉన్నారు."

నువ్వు బాగున్నావా, అబ్బాయి బాగా చూసుకుంటాడా అని అడగాలని ఉన్నా, వాళ్ళ ముందు ఏమీ అడగలేక కూతురి మొహం లో సంతోషాన్ని అంచనా వేస్తున్నాడు.

ఆనంద్ వచ్చి ఆయనని పలకరించాడు. "బాగున్నారా?"

బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత,

నాన్న ఇప్పుడే వస్తాను అని పైకి వెళ్ళి తన పేపర్స్, నోట్ బుక్స్ తెచ్చుకుని,

"నాన్నా, థీసీస్ ఇవ్వాళే ఇచ్చేస్తున్నాను" చెప్పింది.

"మేము రావడానికి లేటవుతుందేమో, ఇవాళ ఉండండి." చెప్పాడు ఆనంద్.

" అవును నాన్నా, నేనొచ్చే వరకూ ఉండు.”

"వుండేందుకు వేరే ఎప్పుడైనా వొస్తాలే అమ్మా. ఇప్పుడు కాదు.”

"నాన్నా, నా మొబైల్ నీ దగ్గరుంచుకో, వదిన్ని అడిగానని చెప్పు.” అని మొబైల్ ఇచ్చింది.

"ఇంటి దగ్గరుండు, మావయ్య గారిని, ఆయన వెళ్తానన్నపుడు, జాగ్రత్తగా, కార్లో దించి రా." డ్రైవర్ తో చెప్పాడు.కారు దిగి పరిమళ చుట్టూ చూసింది. యజమాని పెళ్ళి చేసుకుని భార్యతో రావడం పనివాళ్ళు కుతూహలంగా చూస్తున్నారు.

ఆనంద్ ఆఫీసులో తన రూమ్ లో కూర్చోబెట్టి,

"వెల్ కం"అని టేబిల్ సొరుగులోనుండి ఒక చిన్న బాక్స్ తీసి ఇచ్చాడు.

"ఏమిటిది?"

"ఆఫీసు తాళాలు నీదగ్గరుంచుకో, ఈ ఇండస్ట్రీకి నేనెంతో నువ్వూ అంతే."

"ఏమిటిది ఆనంద్? ఏమిటీ పిచ్చి?"

"ఆయనెవరో తాజ్ మహల్ కట్టాడు, నేనిచ్చింది తాళాలేగా. ప్లీజ్ ఉంచు." బేగ్ లో పెట్టాడు.

ఒక ఫైల్ తీసి ఇచ్చాడు చూడమన్నట్టు.

"అప్పుడే ఫైల్స్ చూడాలా?"

"ఇది పర్సనల్ చూడు."

తెరిచి చూసింది.

అన్ని ఆఫీసు లెటర్ హెడ్ మీద టైప్ చేసిన ప్రేమ లేఖలు.

"ఏమిటిది?"

"పని చేస్తున్నపుడు నువ్వు గుర్తొస్తే ..."

"తెల్ల కాగితాల మీద రాయొచ్చుగా, ఇలా లెటర్ హెడ్ మీదా?"

"పనికట్టుకుని రాయాలంటే ఏమీ రాదు మరి."

అవ్వన్నీ ఒకటొకటిగా చూస్తూ,

ఇదేమిటీ ఈ లెటర్ ఖాళీ గా ఉందీ?"

"నాకో వాకింగ్ మిత్రుడున్నాడు. ఆయన చెప్పాడు. మనలో ఒక నిశ్శబ్దం ఉంటుందనీ, వాకింగ్ చేసేటపుడు దాన్ని అనుభవిస్తూ, నడవాలని చెప్పాడు. ఒక రోజు ఆయన చెప్పింది ట్రై చేశాను. ఆ నిశ్శబ్దం లో కూడా నువ్వే. ఇది ఆ రోజు ప్రేమ లేఖ. ఈ లెటర్స్ అన్నింటిలోనూ నాకిదే బాగా ఇష్టం."

"నేను నీ అంత ప్రేమించలేనేమో ఆనంద్."

"నన్ను ప్రేమించనీ చాలు." 

"వాకింగ్ ఫ్రెండ్ ని పిలవలేదా, పెళ్ళి భోజనాలకు?"

"పిలిచాను, రాలేదు. ఆయన వయసులో పెద్ద. ఇదివరకు జాగింగ్ చేసే వాణ్ణి. ఆయనకోసం నేనే వాకింగ్ చేస్తున్నాను."

ఇంతలో ఆఫీసులో పనిచేసే వాళ్ళు వచ్చారు.

"శర్మగారు, నాన్న గారి టైం నుండీ ఉన్నారు. సుందరం, అకౌంటంట్ మా పెద్ద తాతయ్య గారి మనవడే., మూర్తి ,సెక్రటరీ అని" పరిచయం చేశాడు.

కాన్ఫరెన్స్ హాల్లోకి తీసుకెళ్ళాడు. ఎంప్లాయిస్ అందరూ కూర్చుని ఉన్నారు.

పెద్దగా ఉంది. "వీరి నాన్నగారు వర్కర్లతో ఇక్కడే మాట్లాడేవారమ్మా" శర్మగారు చెప్తున్నారు.

చిన్న డయాస్ లాంటిది వుంది.

పరిమళ డయాస్ ఎక్కబోతూ, వర్కర్లందరికీ చేతులు జోడించి నమస్కారం చేసింది.

ఆనంద్ భార్యని పరిచయం చేశాడు. పెళ్ళి సందర్భంగా బోనస్ గురించి చెప్పి, పరిమళని ఏమైనా చెప్పమన్నాడు.

"మిమ్మల్ని కలవడం చాలా బాగుంది. మీతో కలిసి పనిచేయడానికి, మీ కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాను. ఈ ఇండస్ట్రీ వల్ల మీరూ, మీకుటుంబాలు ఎదగాలని, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీరు మంచి జీవితం గడపటానికి ఈ ఇండస్ట్రీ ఉపయోగ పడాలని కోరుకుంటున్నాను."

శర్మ గారు 'ఆనంద్ నాన్న గారుంటే ఎంతో చాలా సంతోషపడే వాళ్ళమ్మా" అన్నారు.

పరిమళ, శర్మ గారి తో కలిసి వర్కర్ల తో మాట్లాడింది కొంత సేపు.

వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఆనంద్ ను కలవడాని ఆఫీసులో ఎవరో వచ్చారని చెప్తే వెళ్ళాడు.

అందరూ పనుల్లోకి వెళ్ళారు. పరిమళ, శర్మగారి తో కలిసి ఆఫీసుకెళ్ళే సరికి ఆనంద్ఎవరో ఫారినర్స్ తో మాట్లాడుతున్నాడు.

టైం చూసింది.

అమ్మో , అసలే గైడ్ కి టైం మెయింటైన్ చెయ్యని వాళ్ళంటే పిచ్చి కోపం.

వెళ్ళాలి అని చూస్తుంటే, శర్మగారే అడిగాడు.

"ఏమ్మా, ఎక్కడికన్నా వెళ్ళాలా?" అని.

"అవునండీ, యూనివర్సిటీకి వెళ్ళాలి."

"సార్ కు ఇప్పుడిప్పుడే తీరదేమో, పోనీ డ్రైవర్ తో వెళతారా?"  అడిగాడు.

"మరి ఆయన కు కారు కావాలంటే?"

"అదొక్కటేనా, ఇంకా ఉన్నాయిలేమ్మా మీరు వెళ్ళండి, సార్ కు చెప్పి వెళ్తారా?"

"ఎవరితోనో మాట్లాడుతున్నారుగా, వద్దులెండి. నేను యూనివర్సిటీ లో పని చూసుకుని ఇంటికెళ్ళిపోతానని చెప్పండి."

పరిమళ గైడ్ చెప్పిన కరెక్షన్స్ చేసి థీసీస్ సబ్మిట్ చేసే సరికి మధ్యాహ్నం మూడయ్యింది.

ఆనంద్ ఫోన్ చెయ్యలేదేం అనుకుని మొబైల్ నాన్న కిచ్చాను కదా అని గుర్తు చేసుకుంది.

ఇంటికొచ్చి అత్తగారిని అడిగింది.

"ఆయన వచ్చారా?" అని,

"వాడిప్పుడెందుకొస్తాడమ్మా, సాయంత్రమవుతుంది." అని నవ్వింది ఆమె.

జానకి వచ్చి భోంచేద్దాం రా అని తీసుకెళ్ళింది

భోజనం తర్వాత, నిద్ర ముంచుకొచ్చింది.

నిద్ర పోయి లేచేసరికి సాయంత్రమయ్యింది.

ఏమిటిలా మొద్దులా పడుకున్నాను అని స్నానం చేసి కిందకు వెళ్ళింది.

పిల్లల ఆటలు, హోమ్ వర్క్, కబుర్లతో టైం గడిచింది.

రాత్రి పదయ్యింది.

జానకి పిల్లల్ని నిద్రపుచ్చి వస్తుంటే అడిగింది

"ఆనంద్ రాలేదండీ." అని.

"ఒక్కోసారి, పని ఎక్కువగా ఉంటే అర్ధ్రాత్రి అవుతుంది, కంగారు పడకు.” అని చెప్పింది.

ఆఫీసుకు ఫోన్ చేసింది.

ఎవ్వరూ తీయడం లేదు.

ఆనంద్ మొబైల్ కు ఫోన్ చేస్తే రెండు రింగ్ ల తర్వాత కట్ అయ్యింది.

ఆనంద్ ఇచ్చిన ఐ పాడ్ గుర్తొచ్చింది. ఆనంద్ ఐ ఫోన్ ఎక్కడుందో చూసిందిఎయిర్ పోర్ట్ దగ్గర ఉన్నట్లు బ్లూ చుక్క వెలుగుతుంది.

పొద్దున్న వచ్చిన వాళ్ళని పంపించడానికి వెళ్ళి ఉంటాడు అనుకుని సమాధానపడింది.

అర్ధరాత్రి అయ్యేవరకూ చూస్తూ చూస్తూ ఉంటే ఎప్పుడో కునుకు పట్టింది.

నిద్ర లేచి చూస్తే తెల్లవారుజాము నాలుగైంది.

ఆనంద్?

గుండె జల్లుమంది.

ఒక వేళ వచ్చి పైకెళ్ళి పడుకున్నాడేమో, గబగబా మెట్లెక్కి బెడ్రూం, తన స్టడీ రూమ్ వెదికింది.

లేడు.

ఎక్కడికెళ్ళాడు?

ఇంటి ఫోన్ నుండి ఆనంద్ మొబైల్ కు చేసింది.

ఏదో గొంతు, కవరేజ్ ఏరియా లో లేదు అని చెబ్తోంది.

ఆఫీసుకు ఫోన్ చేసింది.

మోగుతుంది కానీ ఎవరూ ఎత్తడం లేదు.

ఎక్కడికెళ్ళాడు.

ఏదో భయం వళ్ళంతా పాకింది.

ఎక్కడున్నాడు?

ఐ పాడ్ తెచ్చి ఆనంద్ ఫోన్ ఎక్కడుందో చూసింది.

Beach road, Singapore

బ్లూ చుక్క వెక్కిరిస్తున్నట్లు.

శాటిలైట్ వ్యూలో చూసింది. కొన్ని ఎత్తైన బిల్ల్డంగ్ లకు దగ్గర్లో ఒక ఇల్లు..చుట్టు పక్కల అలాటి ఇళ్ళే చాలా ఉన్నాయి.

To be continued6 comments:

Sravya Vattikuti చెప్పారు...

బావుంది బావుంది కథ సింగపూర్ కి తెచ్చారే :))))

కృష్ణప్రియ చెప్పారు...

మళ్లీ దుఃఖాంతం చేసేలా ఉన్నారా ఏంటి కొంపదీసి...

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

నిన్నటి నా కామెంట్ కి మీ జవాబు చూసి “అబ్బే విరుచుకుపడటం అవీ నా స్కూలు కాదండీ, అయినా మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను మీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తున్నాను మీరు ఏం రాసినా ఏమననులెండి” అని చెబ్దాం అనుకున్నాను కానీ అంతలోనే ఈ రోజు భాగం చదివాక కొంచెం భయం పట్టుకుంది :-)
ఐనా ఆ పైవాడు రాసే చిత్రవిచిత్రమైన ప్రేమ కథలూ వాటి ముగింపుల ముందు మీరు రాసేవి ఏపాటిలెండి :-)

Chandu S చెప్పారు...

శ్రావ్య గారూ, ఆ మధ్య చీర ఏదో బాకీ ఉన్నానని గుర్తు. ఏదో రకంగా ఆ బాకీ తీర్చేద్దామనిపించి సింగపూర్ తెచ్చాను

Chandu S చెప్పారు...

కామెంటుకు రిప్లై ఇస్తే క్లూ అందుకుంటారని భయం.(మీ బ్లాగులో మీ పిల్లల బ్రెయిన్ చూశాను. వాళ్ళే అంత స్మార్ట్ గా ఉంటే, ఇక వాళ్ళని కన్న మీ సంగతేంటి.)

కృష్ణప్రియ గారికి thanks.

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారికి

Thanks

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి