19, అక్టోబర్ 2011, బుధవారం

పరిమళ-3

continued from పరిమళ-2


ఇంతలో అత్తగారి గదితలుపు తెరిచిన చప్పుడైంది.

ఆవిడ తో చెబ్దామనుకుని అనుకుంటూ ఉండగా

ఆవిడే పరిమళ దగ్గర కొచ్చి

"నాకేంటో బాగా లేదమ్మా, ఊపిరాడనట్లుంది. .” మాట్లాడుతూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది.మొహం మీద నీళ్ళు చిలకరించినట్లు చెమటలు.

"హాస్పిటల్ కు వెళ్దామా?”

"ఆనంద్ లేటు వచ్చాడేమో. డ్రైవర్ ని పిలిపించు.”

ఆనంద్ ఇంకా ఇంటికి రాని సంగతి ఆ పరిస్థితి లో ఆమెకు చెప్పాలనిపించలేదు పరిమళకు.

జానకిని నిద్ర లేపి, అత్తగారికి బాగోలేని సంగతి చెప్పి డ్రైవర్ తో హాస్పిటల్ కు వెళ్దామంది.

"డ్రైవర్ ని ఇంటికి పంపిచానే" చెప్పింది జానకి

"పర్వాలేదు, నాకు డ్రైవింగ్ వొచ్చు. “

జానకి, 'అబ్బో, కొత్త పెళ్ళికూతురు మొగుణ్ణి కష్టపెట్టదు కాబోలు' అనుకుంది.

ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తోంది. కొంత దూరం వచ్చాక,

"మీరు మామూలుగా ఏ హాస్పిటల్ కి వెళతారండీ?”

పేరు చెప్పింది ఆవిడ, "అందులో పనిచేసే శ్రీమన్నారాయణ మా బంధువులబ్బాయి. ఇప్పుడు డ్యూటీ లో ఉన్నాడో లేదో?

హాస్పిటల్ రిసెప్షన్ లో వివరాలు రాసుకున్నారు.

ఆమెను పరీక్షలకోసం లోపలికి తీసుకెళ్ళారు. జానకి ఆమెకు తోడుగా లోపలికి వెళ్ళింది

వెయిటింగ్ హాల్లో కూచుంది పరిమళ.

ఎందుకెళ్ళాడు సింగపూర్, ఎవరైనా తీసుకెళ్ళారా? అదేం పక్క ఊరు కాదుకదా ఎవరో తీసుకెళ్ళడానికి.

ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పాలి.

జానకి బయటికి వస్తే అడిగింది. "బావగారు? "

"కులూమనాలీ తర్వాత మానస సరోవరం దగ్గర షూటింగ్. చాలా పెద్ద ఆర్టిస్ట్ ల కాంబినేషన్ సీన్లు ఉన్నాయని, అస్తమానూ ఫోన్ చేసి విసిగించొద్దు అని ముందే చెప్పి వెళ్ళారు. ఈయన లేకపోతే షూటింగ్ కష్టం.” అత్తగారి సంగతి భర్తకు చెప్పమని కాబోలు అనుకుని, జానకి అది కుదరన్నట్టు అంది.

డాక్టరు గారు బయటికొస్తే దగ్గరకెళ్ళింది.

"నేను డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియాలజిస్ట్. మీరేనా ఆనంద్ ..”

"అవును.”

"ఆనంద్ కు తీరిక లేదేమో కదా, నేను చూసి చాలా రోజులయ్యింది. పోతే అమ్మ గారిని రొండ్రోజులు అబ్జర్వేషన్ లో ఉంచుతాను. మైల్డ్ హార్ట్ ఎటాక్"

"ప్రమాదమేమైనా?”

" అంత భయపడాల్సింది లేదు కానీ, పెద్ద వయసు కదా, ఇప్పుడే ఏమీ చెప్పలేను.”

ఏమిటీ ఇలా ఒకటి మీద ఒకటి ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి తెలియపర్చాలి. అసౌకర్యంగా ఆలోచిస్తూ ఉంది.

ఆమె ముఖం చూసి "రిలాక్స్ అవ్వండి, ఆమెకు బెస్ట్ సర్వీసెస్ అందుతాయి. ఏదో ఊహించుకుని భయపడొద్దు.” ఆయన పరిమళ భుజం తట్టి వెళ్ళి పోయాడు.

ఆయన చెప్పిన మాటలు ఆమె తనున్న పరిస్థితి కి అన్వయించుకుంది.

పోనీ శర్మ గారికి చెపితే,

ఎవరి గురించీ ఏమీ తెలియదు. ఎవరు ఎలాటి వాళ్ళో, ఎవర్ని నమ్మటం ?

స్నేహితురాలు సుశీల గుర్తొచ్చింది.

సుశీల వాళ్ళాయన కుమార్ అడిషనల్ ఎస్పీ.

సుశీల కు ఫోన్ చేసింది.

నిద్రలో ఉన్నట్టుంది, వాళ్ళాయనే తీశాడు.

"ఎవరూ?” ఫోన్ లో కూడా పోలీసే.

"నేనండీ, పరిమళని, సుశీల..”.

"ఏయ్ సుశీ,” నిద్ర లేపుతున్నాడులా ఉంది.

"ఏంటే, ఇంత రాత్రి"

"సుశీలా, తెల్లవారింది, నిద్రమత్తు లోంచి బయటికిరా, మనసు పెట్టి విను. ఆనంద్ నిన్న పొద్దున ఆఫీసుకు వెళ్ళాడు. ఇంతవరకూ రాలేదు.”

"వస్తాడులేవే, ఎక్కడికిపోయినా మళ్ళీ వస్తారు.” అనుభవం మీద చెబుతున్నట్టుంది.

"కాదు సుశీలా, ఏదో అనుమానంగా ఉంది.”

వాళ్ళాయనకు విషయం చెప్పినట్లుంది.

"మీ ఇంటికి రమ్మంటావా? "సుశీల అడిగింది.

ఆనంద్ వాళ్ళ అమ్మగారికి బాగోలేక పోతే హాస్పిటల్ కు తీసుకొచ్చాను. అడ్రస్ చెప్పింది.

హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు సుశీల, ఆమె భర్త, పరిమళ,

ఆనంద్ నిన్నటి నుండీ ఇంటికి రాకపోవడం, ఫోన్ కాంటాక్ట్ పోవడం, అతని ఫోన్ సింగపూర్ లో లొకేట్ అవడం చెప్పింది.

"బిజినెస్ పని మీద వెళ్ళారేమో?”

"చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఏముందీ?”

"స్నేహితులు, శత్రువులు?”

కొన్ని రోజుల పరిచయం

"తెలియదు.”

"ఒక సారి ఆఫీసు కెళ్దాం.”

"ఇవ్వాళ రేపు పండుగ అని సెలవలు.”

"అదే బెటర్. ఎవరికీ తెలియకపోవడమే మంచిది.”

అత్తగారితో ఉన్న జానకి ని పక్కకు పిలిచి చెప్పింది.

"నేను వెళ్తానండీ, నా స్నేహితులు వచ్చారు. కొంచం పని ఉంది.” సుశీల, వాళ్ళాయన ఇద్దరూ అప్పటికే బయట నుంచుని ఎదురు చూస్తున్నారు.

జానకి విచిత్రంగా చూసింది. స్నేహితులు ఇక్కడికి రావడం ఏమిటీ. పరిమళ ని హాస్పిటల్ లో ఉంచి, జానకి ఇంటికెళ్దామనుకుంది.

పరిమళ ఆమెనలా వదిలి వెళ్ళడం జానకి కి నచ్చలేదని తెలుస్తూనే ఉన్నా గమనించనట్లు బయటకు నడిచింది.

జానకి వెనకే వచ్చి "ఆనంద్ తో మనీ పంపించు ఇక్కడ వాడటానికి, వచ్చే హడావుడిలో నేనేం తీసుకురాలేదు" చెప్పింది.

పరిమళ తలూపింది.

ఆఫీసులో కూర్చున్న తర్వాత

"నిన్న ఏమైనా గొడవ పడ్డారా?” ఆయన అడిగిన ప్రశ్న అవమానంగా తోచింది.

"లేదు. "మాట కన్నా కళ్ళలోనే కుమార్ కు జవాబు దొరికింది.

"ఏం జరిగిందో మొత్తం చెప్పండి దాచకుండా. మొహమాట పడితే ఏదైనా క్లూ మిస్సవ్వొచ్చు." అన్నాడు సుశీల భర్త.

ఆఫీసు కు తీసుకెళ్ళడం, అక్కడనుండి యూనివర్సిటీ కెళ్ళడం వచ్చిన దగ్గర్నుండీ కాంటాక్ట్ లో లేక పోవడం చెప్పింది.

మొత్తం విన్న తర్వాత కొన్ని ప్రశ్నలడిగాడు. జవాబులు విని,

"మీరు భయపడనంటే ఒకటి చెపుతాను. బహుశా ఎవరైనా కిడ్ నాప్ చేసి ఉంటారేమో?”

"నా భయం కూడా అదే.”

సొరుగులు వెదికాడు.

లెటర్ హెడ్ ప్రేమలేఖలు కనిపించి ఏంటివి అన్నాడు.

సుశీల కూడా ముందుకు వంగి "అబ్బా అవ్వి వాళ్ళ పర్సనల్. వదిలెయ్యండీ" అంది.

అయినాసరే ఆయన ఒక సారి వాటిని పైపైన చూసి పరిమళకు ఇచ్చాడు.

"ఏదో ఆశించి అతన్ని తీసుకెళ్ళి ఉంటారు. ఆనంద్ ఏమీ లావాదేవీలు జరపకుండా ఆపగలిగితే కొంత వరకు అతన్ని సేవ్ చెయ్యొచ్చు..”

ఒకసారి మీ చేతిలో ఉన్న లెటర్స్ లో ఒకటి ఖాళీ గా ఉంది అది ఇవ్వండి. అన్నాడు.

రెండు రోజుల ముందు తారీకు తో, ఆనంద్ సంతకం మాత్రమే ఉన్న

నిశ్శబ్దపు ప్రేమ లేఖ.

కుమార్ చేతికిచ్చింది

దీని మీద పవర్ ఒఫ్ అటార్నీ మీకు వచ్చేట్లు టైప్ చేస్తాను. మీ సంతకం ఉంటే తప్ప ఎలాటి ట్రాన్సాక్షన్ చెల్లదని ..

ప్రేమలేఖ మీద పవర్ ఆఫ్ అటార్నీ?

"ఆనంద్ చాలా సెన్సిటివ్ అండీ. తర్వాత...”

"ఇలాటి టైం లో సెంటిమెంట్స్ లాభం లేదు. “

"మనం ఇక్కడ రాసుకుంటే వాళ్ళ కెలా తెలుస్తుందీ?" సుశీల అడిగింది

"మీ బిజినెస్ కు సంబంధించిన వాళ్ళే అయ్యుంటారు.  బ్రాంచ్ లన్నింటికీ ఫాక్స్ చేయించండి. తీసుకెళ్ళిన వాళ్ళకు వార్నింగ్ లా ఉంటుంది. “

ఫోన్ చేసి శర్మ గారిని అర్జెంటు గా రమ్మంది.

"శర్మ గారూ, సార్ పని మీద ఊరెళ్ళారు. బ్రాంచ్ లు ఎక్కడెక్కడున్నాయో దీన్ని అన్నింటికీ ఫాక్స్ చేయించండి. “ ఆయన చేతికి ఆ పేపర్ అందించింది

ఆనంద్ లేక పోవడం, పరిమళ ఇంకెవరితోనో వచ్చి ఆనంద్ సంతకం పెట్టిన పవర్ ఆఫ్ అటార్నీ కాగితాన్ని అన్ని శాఖలకూ ఫాక్స్ చెయ్యమనడం తికమకగా అనిపించినా చెప్పినట్లు చేశాడు.

వస్తామంటూ సుశీల వాళ్ళు లేచారు. వాళ్ళతో పాటు బయటికి వచ్చింది పరిమళ.

"భయపడకండి.మీకేం ఫోన్ వచ్చినా ట్రేస్ చేసేందుకు ఏర్పాట్లు చేయిస్తాను."  వెళ్ళబోయేటపుడు సుశీల భర్త చెప్పాడు.

"ఇంకో విషయం. నేను ఎల్లుండి ట్రైనింగ్ కు డెహ్రాడూన్ వెళుతున్నాను. మీకేదైనా అవసరమొస్తే సహాయం చెయ్యమని మా కొలీగ్ కు చెప్తాను.”

"నేను సింగపూర్ వెళతానండీ. మా పెదనాన్న గారి అబ్బాయి చాలా సంవత్సరాల నుండీ అక్కడే ఉన్నాడు. ఏమైనా హెల్ప్ చేస్తాడు.” చెప్పింది పరిమళ.

"ఏం చెయ్యగలరు అక్కడ ?”

"తెలియదు. కానీ, వెళ్ళాలి. చూడాలి. " ఆమె మాటలో పట్టుదల విని ఇంకేమీ మాట్లాడలేదు కుమార్.

"వెళ్తే ఒక జాగ్రత్త తీసుకోండి. ఈ సంగతి ఎవరితోనూ అనొద్దు. ఎప్పుడూ ఇమెయిల్ తో టచ్ లో ఉండండి. ఇక్కడ ఇన్ వెస్టి గేషన్ కోసం నమ్మకమైన వాళ్ళను ఏర్పాటు చేస్తాను.”

వెనక్కి తిరిగి వచ్చి ఆఫీసులో కూర్చుంది.

శర్మ గారు వచ్చి"ఫాక్స్ చేశానమ్మా" అన్నాడు.

అలిసి పోయిన ముఖం, ఎక్కడో ఆలోచనలో ఉన్న కళ్ళు పరిమళ ని చూసి ఏదో అడగబోయి.. అనుభవం చెప్పిన పాఠాల వల్ల పెద్ద వాళ్ళ విషయాలకు దూరం గా ఉంటే మంచిది అని ఊరుకున్నాడు.

లేచింది వెళ్దామని.

"అమ్మా ఒక మాట,  వర్కర్లకు జీతాలు అందలేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు."

"ఆనంద్ కు ఈ విషయం తెలుసా.”

" లేదమ్మా, పెళ్ళి హడావుడి లో ఉన్నారని.....సార్ కు తెలియపరచలేదు.”

"అదేమిటీ? బోనస్ కూడా ఇద్దామని అన్నారు.”

"దేవుడి దగ్గర వరాలకు కొదవేముంటుంది తల్లీ" కళ్ళు దించుకుని చెప్పారు.

వర్కర్లు పండుగ రోజు ఆకలి దీపావళి జరుపుకుంటుంటే, తాము...

 పరిమళకు, మల్లెలతో నిండిన గది గుర్తు వచ్చింది. తన మీద తనకే చిరాకు పుట్టింది.

"అకౌంటెంట్ ని పిలిపించండి.”

అతను వచ్చే లోపల, జీతాలు ఇచ్చే పద్ధతి తెలుసుకుంది. సుందరం పేరు మీద బాంక్ అకౌంట్ ఉంటుందనీ, ఆ అకౌంట్ నుండి డబ్బు విత్ డ్రా చేసి జీతాలు పంచుతాడనీ.

సుందరం వచ్చాడు. వచ్చీ రాగానే,

"ఆనంద్ ఏడమ్మా, శర్మ గారూ ఎసి వెయ్యకుండా కూర్చో బెట్టారే అమ్మాయిని, పెద్దవుతున్న కొద్దీ మీకు ...” విసుక్కున్నాడు.

పరిమళకు చిరాకు కలిగినా అణుచుకుంది.

 టేబిల్ మీద న్యూస్ పేపర్ భక్తిగా పెడుతూ

"ఏమ్మా కాఫీ తీసుకుంటావా? కొబ్బరి బోండాం తెప్పించనా?”

"అవ్వన్నీ తర్వాత, పనివాళ్ళకు జీతాలు అందలేదు?”

"ఇచ్చేశానే.” అన్నాడు చాలా ఆశ్చర్య పడుతూ

" ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చెయ్యండి చూస్తాను.”

సిస్టం ముందు కూర్చుని తంటాలు పడుతున్నాడు.

నెట్ స్పీడ్ స్లో గా ఉందంటూ..

కాసేపైన తర్వాత

"పాస్ వర్డ్ టైప్ చేస్తుంటే రాంగ్ అని వస్తుంది.”

అని మళ్ళీ ఏదో ప్రయత్నించ బోయాడు.

"ఆగండి, ఎక్కువ సార్లు రాంగ్ పాస్ వర్డ్ టైప్ చేస్తే అకౌంట్ ఇక తెరుచుకోదు.” పరిమళ అని అతన్ని ఆపేసింది.

ఇంతలో సుశీల, కుమార్ మళ్ళీ వచ్చారు.

"బాగ్ మర్చిపోయానే" సుశీల మళ్ళీ వచ్చిన కారణం చెప్పింది

ఒక్క నిముషం కూర్చోమని కళ్ళతో చెప్పింది.

" సార్, చిన్న ప్రాబ్లం, మా అకౌంటెంట్ ముఖ్యమైన పాస్ వర్డ్ మర్చిపోయాడు. మీ వద్ద పాస్ వర్డ్ బ్రేక్ చేసే సాఫ్ట్ వేర్ ఉంటుందా? అంటే ఎవరైనా క్రిమినల్స్ దొరికి, వాళ్ళ లాప్ టాప్ లో ఫైల్స్ ఓపెన్ చెయ్యాలంటే, వాళ్ళు కో ఆపరేట్ చెయ్యక పోతే.. “ కుమార్ ని అడిగింది పరిమళ.

కుమార్ కు హింట్ దొరికింది.

"పోలీసులకి సాఫ్ట్ వేర్ తో ఏం పని? హార్డ్ వేర్ ఉపయోగిస్తాం. ఏమయ్యా సరిగా గుర్తు తెచ్చుకో" అని అన్నాడు.

ఆ మాటలకు హఠాత్తుగా గుర్తొచ్చినట్లు, "అమ్మా ఓపెన్ అయిందమ్మా" అన్నాడు సుందరం వీలైనంత సంతోషం మొహం లో చూపెడుతూ.

"ఈ పని అయిన తర్వాత ఒక సారి పోలీస్ స్టేషన్ లో కనపడు, ఇవ్వాళే" అన్నాడు కుమార్.

"అలాగే సార్.”

పరిమళకు అర్ధమయింది కుమార్ కు సుందరం మీద అనుమానమొచ్చిందని.

సుశీల వాళ్ళు వెళ్ళారు.

పరిమళ బాంక్ అకౌంట్ చెక్ చేసింది.

"ఏమిటీ , మనీ అంతా అలాగే ఉంది. సాలరీస్ ఇవ్వక పోతే ఎలా?”

" అరెరె,తమ్ముడి పెళ్ళి హడావుడిలో పడి మర్చి పోయి చచ్చాను.”

"ఒకె , బాంక్ లో డబ్బు తీసి అర్జెంట్ గా జీతాలు , బోనస్లు ఇచ్చేయండి.”

"ఇవ్వాళ, రేపు పండుగ సెలవలు, తర్వాత ఆది వారం.” శర్మ గారు అన్నారు.

"సరే చెక్ బుక్ ఉందా?”

పట్టుకొచ్చాడు.

"మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం చెక్కు రాసి ఇవ్వండి.”

"ఎవరిపేరు మీద రాయమంటారు.”

"జస్ట్ అమౌంట్ వేసి సంతకం పెట్టండి చాలు. ఇంకో మాట, మళ్ళీ చెప్పే వరకూ మీరు ఆఫీసుకు రావొద్దు.”

బయటికి నడవబోతూ ఉండగా,

"పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం మర్చిపోవద్దు." వెనక నుండి, హెచ్చరించింది.

అవమానం, కోపం కలిసి మొహం ఎర్రగా అయ్యింది సుందరానికి.

వర్కర్లు X (జీతాలు + బోనస్) + అత్త గారి హాస్పిటల్ ఖర్చు+ సింగపూర్ ఖర్చు.

లెక్క వేసింది.

ఇవ్వాళ, రేపటి లోగా వెళ్ళాలి సింగపూర్. సింగపూర్ వెళ్ళేముందు వర్కర్లకు జీతాలు ఇచ్చే వెళ్ళాలి అనుకుంది.

ఏం చెయ్యాలి. ఎక్కడినుండి తేవాలి డబ్బు?

to be continued

6 comments:

Raj చెప్పారు...

చాలా బాగుంది..సస్పెన్స్ అలా మేయింటైన్ చేస్తునారు..waiting for next part...

రాజ్ కుమార్ చెప్పారు...

రోజూ మీ పోస్ట్ కోసం ఎదురు చూసేలా రాస్తున్నారండీ... సూపర్..

Sravya Vattikuti చెప్పారు...

కాని మరీ అంత పెద్ద బిజినెస్ మాన్ ఒక్క రోజు ఇంటికి రాకపోతే ఇలా? హ్మ్ !
Interesting waiting for the next part.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

ఈ రెండ్రోజుల్లోనూ ఏదైనా ఒక ఐపి నుండి ఎక్కువ హిట్స్ ఉండి ఉంటే అది నాదే అని ఫిక్స్ అయిపోండి :-) కంప్యూటర్ ముందుకు వచ్చినపుడల్లా రిఫ్రెష్ కొడుతూనే ఉన్నా :-)

Chandu S చెప్పారు...

Raj గారికి,
Thanks.

రాజ్ కుమార్ గారికి,
Thanks for reading

Sravya Vattikuti గారికి,
thanks.

వేణూ శ్రీకాంత్ గారికి,

కొంచం వేరే పని లో ఉన్నానండీ, టైపింగ్ టైం తీసుకుంటోంది. ఓపిక పట్టండి.
Thanks

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హహహ పర్లేదండీ... take your time.. I can understand, నాకు బోలెడంత ఓపిక.. జస్ట్ మీరు ఏ రేంజ్ కి క్యూరియాసిటీ పెంచేసారో అలా చెప్తున్నాను అంతే :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి