19, జనవరి 2015, సోమవారం

ఒక గుర్నాథం కథ
   పేరుకు తగ్గట్టు గవర్నమెంటాఫీసులో పనిచేస్తాడు. సత్ప్రవర్తన, నీతినియమాలు, జీవించడంలో కొన్ని విలువలు పాటించాలని గట్టిగా కోరుకుంటాడు.  తన చుట్టుపక్కల వారిని కూడా విషయాలపై దృష్టి పెట్టమని కోరుతూ,  పోరుతూ ఉంటాడు.   విలువల పరిరక్షణకై ఓ కమిటీనేర్పరచాలనీ, సమాన స్థాయి భావాలున్న ఇంకొందర్ని కమిటీ సభ్యులుగా చేర్చుకుని, తన భావాలను ఊరూరా వ్యాపింప చేసి, ఆపై జిల్లాలవారీగా, రాష్ట్రాల్లోనూ, దేశవిదేశాల్లో కూడా బ్రాంచీలు పెట్టి నైతిక విలువల్ని కాపాడుతూ సమాజానికి ఓ గట్టిమేలు చేయాలని తలచేవాడు. 

  తన ఆలోచనలే సరైనవనీ, లోకంలో జనాలందరూ  తన అత్యున్నతమైన భావాలను అనుసరింంచి ఆచరించాలనీ భావిస్తాడుఅలా ఎన్నటికీ జరగదని తెలుసుకోలేక, ఏవిటీ పిచ్చి జనాలు , ఎటుపోతుందీ సమాజం అనుకుని బాధ పడతాడు. 24 గంటలూ సమాజానికి నిరంతర వార్తాభిషేకం చేసే న్యూస్ చానెల్స్ చూస్తూ, సంఘం నడవడిక గురించి కలవర పడుతూ  కలత నిద్ర పోయేవాడు

  శీలమూ- దాని ప్రాముఖ్యత అన్న అంశాన్ని లోతుగా పరిశీలించి ,  పరిశోధించి కొంత అర్థం చేసుకున్నాడు, మరి కాస్త అస్పష్టతకు గురైన పిమ్మట ,  శీలం దేహానికి సంబంధించినదా? లేక మనసుకు సంబంధించినదా? అని ప్రశ్నలు తనను తాను వేసుకున్నాడు. పక్కన వారికీ వేశాడు.

ఒక విచ్చలవిడి స్నేహితుడు విచిత్రమైన సమాధానమిచ్చాడు.

“చేతకాని చవటాయిల దేహానికి శీలం ఉంటుందోయ్. కానీ మనసు శీలమేవిటీ నా బొంద. మునీశ్వరుల మనసులో సైతం  దౌర్భాగ్యపు ఆలోచనలు పుట్టక మానవు. అందువలన మనసు శీలం గురించి మాట్టాడొద్దు. అటువంటి ఆలోచనలు రాకపోతే వాణ్ణి ‘మనిషి’ అని అనకూడదు. ‘ఆ’ వస్తువుకు అత్యుత్తుమ పిచ్చివైద్యునిచే అత్యవసర మానసిక చికిత్స చేయించడం అవసరం.” 

నిర్ఘాంత పోయాడు గుర్నాథం . ఏవిటీ? మనసుకు శీలసాధన అంత అసాధ్యమా. అదేదో సాధించాలి సుమా అనుకున్నాడు.

 అందువలన ఆడవారిని చూడడం మానుకున్నాడు. వెర్రి ఆలోచనలు రాకుండా మనసుకు ఆంజనేయ దండకంతో  కంచె వేశాడు. అయ్యప్ప స్తోత్రం తో దడి కట్టాడు. మనసు గతి తప్పుతోంది అనుకోగానే ఏదో ఒక స్తోత్రాన్ని గట్టిగా పఠించేవాడు. దయ్యాలకైనా, దయ్యపు ఆలోచనలకైనా ఆంజనేయ దండకమే పరిష్కారమని కనుగొన్నాడు.

  రోజు  ఆఫీసులో పని ముగించుకుని, ఇంటికి పోతుండగా, ట్రాఫిక్ లో ఆటో కారు ఢీ కొట్టుకున్నాయి. ప్రాణం లేని బళ్ళు కొట్టుకోగా లేనిది, ప్రాణమున్న మనుషులేమైనా తీసిపోయారా అనుకుంటూ కొట్టుకోడాని సిద్ధమయారు వాహనదారులువార్మ్ అప్ కావడానికి కోసం ముందు మాటలతో కొట్టుకుంటున్నారు

 ఆ ఇద్దరిలో ఒకడు,  ఎదుటివాడి తల్లి శీలవతి కాదేమోనన్న అనుమానం వ్యక్తం చేశాడుతల్లికే కాదు, తన కుటుంబంలో ఆడమనిషికీ శీలవతి కాకుండా పోయే హక్కు లేదని నిరంకుశంగా వాదిస్తున్నాడు రెండోవాడు. జన్మ రహస్యాలు వెలికి తీస్తూ, వారి వారి కుటుంబాల్లోని స్త్రీల నడవడికల వివరాలతో రోడ్డు మీద పేకాడుతున్నారుఅలిసిపోయి ఇళ్ళకెళ్తున్న జనాలకు వినోదాన్ని అందిస్తూ , కాస్తో కూస్తో సమాజ సేవకు పూనుకున్నారు.. 

గుర్నాధం వెంటనే వాళ్లదగ్గరకెళ్ళి  తల్లులందరూ గా గౌరవనీయులనీ, అలా నీతి తప్పి మాట్లాడకూడదని  చెప్పాడు మాటలువిన్న వాహన దారులు, స్వంత తగాదాను కొంత మరిచి,  గుర్నాధం నోర్మూసుకుని పోకపోతే, అతని తరపు ఆడవాళ్ళతో  వాళ్ళు ఎలా ప్రవర్తించదలుచుకున్నారో నివేదిక ఇచ్చారు. మనసును సగం వికలం అయ్యింది.

వాళ్ళ ధోరణికి గుర్నాధం మర్యాదగా మనస్తాపం చెంది ఇంటికొచ్చి అలవాటుగా టివి పెట్టాడు

    సినిమాల్లో పెద్దాయన, తన సినిమాల్లో ఏది విత్తనమో, ఏది వృక్షమో వెయ్యోసారి చెప్తూండగా, ఏంకర్ మాత్రం మొదటి సారి వింటున్నట్లు మొహం పెట్టివింటోందివయసైపోయిన పెద్దమనిషి ఏదో ఒక నీతి మాట చెప్పక పోడు అని ఎదురు చూస్తూ వింటున్నాడు
 బయటి పరిచయాలు కాళ్ళకంటిన బురద తో సమానమని, దాన్ని వాకిట్లోనే కడిగేసి, పవిత్రంగా లోపలికెళ్ళి గుడిలో దేవతలాంటి భార్యను పూజచేసుకోవాలన్నాడు. విన్న తర్వాత మనసు పూర్తిగా వికలం అయింది.  

    ఇంతకూ ఈ గుర్నాథానికి పెళ్ళీ, గట్రా అయిందా?  ? మాట మీరడుగుతారని తెలుసు, మాటకే వస్తున్నా. యువకులందరూ పెళ్ళీ పెటాకులు చేసుకోకుండా సంఘ సేవకు పూనుకోవాలనుకుంటాడుబ్రహ్మచర్యం పాటిస్తూ, ఉత్తమ విలువలను ప్రచారం చేస్తూ  మేలైన సమాజస్థాపనకు పూనుకుంటేపనిలో పనిగా జనాభా సమస్య సైతం తీరి పోతుందనేవాడు

     ఇలాంటి అసంభవ భావాల వరదలో కొట్టుకపోతుండగా స్నేహితుడి పుట్టిన రోజు పండగొచ్చింది. గుర్నాధం కూడా సిన్మా చూసి ఆనందించి తనని దీవించాలనీ, రాకపోతే చచ్చినంత ఒట్టు అన్నాడు అన్నాడు స్నేహితుడు. పుట్టిన రోజు చావు మాటలెందుకులెమ్మని అందరితో కలిసి సిన్మా జూడబోయాడు.

వాళ్ళందరూ ఓపికగా ఎదురుచూస్తున్న , పేరున్న నటీమణి  డేన్స్ రానే వొచ్చింది. పక్కనున్న స్నేహితులు ఊపిరితిత్తుల శక్తి కొలదీ ఈలలేసి, శక్తి అంతా ఖర్చయ్యాక , ఆమె సాన్నిహిత్యం కోసం జీవితంలో ఎవరెవరిని, ఏమేమి త్యాగం చేయగలరో పందేలు కాసుకుంటున్నారు.

వారి అనైతిక కోరికలని ఏవగించుకున్న గుర్నాధం మాత్రం కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసా తో మొదలు పెట్టి అయ్యప్ప స్వామి గీతాల అండతో,  తన మనసుని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా దేవుళ్ళ మీదే పెట్టాడు.  వారు కూడా తలో చెయ్యి వేసి కాసేపు సాయపడ్డారు, కానీ డేన్స్ వేసినావిడ అద్భుత సమ్మోహనా శక్తీ, అసమాన ప్రజ్ఞా, మరియూ టేలెంటూ వగైరా గమనించి, ఔరా అనుకుని వెనక్కు తగ్గారు.  

   ఆవిడ విజృంభించి ఇతన్ని రాత్రీ , పగలూ తరుముతూనే ఉంది. మనసునోమాదిరిగా కంట్రోల్ లో ఉంచగలిగినా శరీరం ఎదురు తిరిగి నలుగురితో బాటే నువ్వూ పెళ్ళిచేసుకో, పెళ్ళిచేసుకో అని సొద పెట్టింది
అవును పెళ్ళిచేసుకోవాలి. చేసుకుని ఇద్దరూ కలసి ఉత్తమాశయ సాధనకై పాటుపడాలి అనుకున్నాడు.  


 తనకు భార్య కాగల అదృష్టవంతురాలికిఅవసరమైన లక్షణాలేమిటి?” అన్న హెడ్డింగ్ పెట్టి ఒకటి ,రెండు ….వరుసగా పది నంబర్లు వేశాడు.

అతనే పని మొదలెట్టినా,  పేపర్ మీద రాస్తాడు.

ఎలాంటి భార్య కావాలి? బాగా ఆలోచించి , ‘అదేషు ఇదీ , ఇదేషు అదీ’ అన్న పద్యాన్ని దీక్షగా చూశాడు.

ఏవిటీ రంభ లాంటి seductress అయి ఉండాలా?
అమ్మ లాగా అన్నమొండాలా? ఇంకా...
తిమ్మరుసులాగా తీర్పుచెప్పాలి.
పనిమనిషి రంగమ్మలాగా ఇల్లూడ్చాలి.

 డేన్సులాడే మనిషికి  వంటేం వస్తుంది. ఒకవేళ చేసినా రంభాపాకం నోట్లో పెట్టుకునే వీలుగా ఉంటుందా. ఛీ వీళ్ళూ, వీళ్ళ కోరికలూ అనుకుని ఈసడించుకున్నాడు.
ఆశ తప్ప ఆలోచనలేదు వీళ్ళకు.

అవేమీ అక్కర్లేదు. శీలవతిగా ఉంటే చాలును. శీలమంటే దేహానికి సంబంధించినదా, మనసుకా అని తీవ్రంగా ఆలోచించి మనసుకే శీలముంటే చాలు.

ఒక సుగుణాల రాశి అయిన యువతి, రేప్పొద్దున్న రేపుకు గురైతే ఆమెకు శీలం లేదని అనడం ఎంతో పాపం  అనుకొని పెళ్ళిచూపులకెళ్ళాడు. పెళ్ళికూతురు చదువుకున్న పిల్లే..... పత్రికలూ , ప్రభలూ బాగా చదువుకున్న పిల్ల.  

సరస హృదయులైన మన దర్శకులందరి చలవ చేతా, రసికులమేమోనని నని గాఢంగా అపోహపడే కొందరు సరసకథ రచయితల  వల్లనూ, ఆమెకు పెళ్ళి మీద ఆశలు బాగానే ఉన్నాయి. వచ్చేవాడు కొంగు లాగుతూ కొంటె చూపులతో  అలరిస్తాడని స్వంత అంచనాలతో నిర్మించిన  పల్లకీలో పొద్దస్తమానం కలలు కనేది

పెళ్ళి చూపుల్లో గదిలోకి పోండి,   పావుగంట సేపు మాట్లాడుకుని , సంపూర్ణంగా ఒకరినొకరు అర్ధం చేసుకోండని”  పెద్దవాళ్ళు  ఏకాంత సంభాషణ ఏర్పాటు చేశారు. అమ్మాయి చొరవ చేసి ఆడవాళ్ళతో అతనికి స్థాయి పరిచయాలున్నాయో వివరం చెప్పమంది
తానెల్లాంటివాడో చెప్పి, పెళ్ళి చేసుకోవడం లో తన ఆంతర్యం వివరించాడు. నైతిక విలువల ప్రచార కమిటీ ఒకటి స్థాపించాలనుందనీ, సమాజంలో అనైతికతను పూడ్చిపెట్టి, ఆపై నీతినియమాల ప్రతిష్టాపనే ఈ పెళ్ళి ముఖ్యోద్దేశమన్నాడు. ఈ పవిత్ర కార్యాచరణలో భార్య తనకు చేదోడు వాదోడుగా ఉండాలన్నాడు.

 నైతికత ,విలువలు!! 

పరీక్ష రేపైనా, అంతవరకూ పుస్తకం మొహం చూడని విద్యార్థిలా  కంగారు పడింది

పెళ్ళయిన తర్వాత ఏం చెయ్యాలో ఆమెకు కొంత వరకూ తెలుసు, కొంత మంది విశాల హృదయులైన సిన్మా డైరెక్టర్ల వల్ల, స్నేహితురాళ్ళతో పంచుకున్న జ్ఞానం వల్ల ఆమె పెళ్ళి అనే పండుగకు తయారుగానే ఉంది

కానీ పెళ్ళికొడుకు ఏమి చెయ్యాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని అడిగింది.

పెళ్ళి తర్వాత నాకు నువ్వు, నీకు నేను. అంతే తప్ప వేరే వారిపట్ల ఆకర్షణకు గురికాకూడదు. వారిపట్ల విముఖత కలిగి వుండాలి.  దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకుందాము. ఉదాహరణకునువ్వు పక్కింటాయన్నీ, నేను పక్కింటావిడనీ మోహించే వీలు లేని విధంగా.. .అంటే మనం ఊరికి దూరంగా కాపురం పెడతాము విధంగా నైతిక విలువల్ని కాపాడదాం.

 అవేమిటో మనం కాపాడేదేమిటి? ఇప్పుడు కాపాడక పోతే ఏమవుతుంది. అడిగింది. మరి అంత మంచి పనికి ఎవరో ఒకరు పూనుకోవాలికదా. అలా పూనుకుంటున్న వాణ్ణి నేను. నీకు కూడా అదృష్టం పట్టి నా భార్యవు కాబోతున్నావు
మహాత్మా గాంధీ, కస్తూర్బా లను , ఇంకా,  ఒకే లక్ష్యం తో అంటిపెట్టుకుని తిరుగుతుండే మరికొందరు  సినిమా దంపతుల్నీ గుర్తు చేశాడు. 

పెళ్ళికూతురికి ఇదేదో ముడిపడే సమ్మంధం లా తోచక , కష్టపడి నటిస్తున్న నటనకు స్వస్తి చెప్పి రిలాక్స్ అయింది. అక్కడే టేబిల్ మీద ఉంచిన లడ్డు కొరుక్కుని తింటూ, “అలా వద్ద్డండీ. మనం మనుషుల మధ్యే ఉంటే బాగుంటుంది. ప్రతిరోజూ, సాయంకాలం మన వరండా లో కూర్చుని ఎదురింటి భార్యా భర్తలను చూస్తూ గడుపుదాం. మీరు ఆవిణ్ణి, నేను ఆయన్ను. చూస్తూ, మన నిగ్రహమెంత కఠినమైనదో పరీక్షించుకోవచ్చు. ఎలా ఉంది ఆలోచన.”

గుర్నాధానికి తన ఆలోచనలు వ్యక్తపరచగల అవకాశం దొరక బుచ్చుకుని ఆమెకో ఉపన్యాసమిచ్చాడు. అతని భావాల తీవ్రతకు ఆశ్చర్యపోయి, ఆమె లేచి నుంచుంది. రెండు నిముషాల మౌనం తర్వాత ఆమె, గుర్నాధానికో సలహా ఇచ్చింది, పెళ్ళి జోలికి పోవొద్దు అని. ఆమె కళ్ళలో కనపడిన జాలి దాని తాలూకు నిజాయితీ గుర్తించాడు

తర్వాత ఎప్పుడు పెళ్ళి తలపు తట్టినా ,  మొదటి పెళ్ళి చూపుల పెళ్ళికూతురు వెంటాడి, 'వొద్దు ,వొద్దు'  అనేది. మెల్లగా పులుసుకు కూడా పనికి రాని బెండకాయ అయ్యాడు.


(Ending - with in few days)

5 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

మీ పోస్టులు చదువుతా పడీ పడీ నవ్వుతా లాల్ సలాములు చేస్తాయ్.
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్... ;)

..nagarjuna.. చెప్పారు...

విత్తనం వృక్షం గురించి మాట్లాడే పెద్దాయన పార్టు కేక :)

వనజ తాతినేని చెప్పారు...

మీదైన శైలి.. నవ్వుకోలేదు .. సీరియస్ గా ఆలోచించాను .. ఎన్ని సీరియస్ విషయాలని అలవోకగా హాస్యంతో నింపి కథగా మలిచారు . వెరీ వెరీ నైస్ .. శైలజ గారు . అభినందనలు . తీరిక చేసుకుని వ్రాస్తూ ఉండండి .

Sujata చెప్పారు...

Bavundandi... ending was perfect.

Dr V.Shobha చెప్పారు...

చందూ, నవ్వలెక చచ్చిపొతున్నాను


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి