23, ఫిబ్రవరి 2012, గురువారం

పూలు కనిపిస్తే..
" సార్" డాక్టరు గారి రూమ్ లో కెళ్ళింది శ్రీలక్ష్మి.

"ఏమ్మాయ్?”

"ఇవ్వాళ కొంచం ముందు పంపించండి సార్!”

"సరే, పేషంట్ కు సెలైన్ అయి పోయిందేమో చూడు. బి పి చూసి, నాగేంద్రకు జాగ్రత్తగా ఒప్ప జెప్పి వెళ్ళు.”

డాక్టర్ చెప్పిన పనులు చేసి, తోటి కాంపౌండరు కు పనులు ఒప్పజెప్పి శ్రీ లక్ష్మి ఇంటికెళ్ళింది. ఆమె ఉండే కాలనీ లో అన్ని రేకుల షెడ్ల్ ఇళ్ళే. పైన కప్పుకూడా రేకుల్తోనే . గాలికి ఎగిరిపోకుండా పాత టైర్లు,కొన్ని వేసి ఉంటాయి.

ఇంటికి కొద్ది దూరం లో పంపు దగ్గర నీళ్ళు పట్టుకుంటున్న్న చెల్లెల్ని కేకేసి, తొందరగా ఇంటికి రా అని చెప్పి తను ఇంటికెళ్ళింది. నీళ్ళు వచ్చే టైమ్. ఆడవాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కొంత మంది చిన్నపిల్లలు స్నానం చేస్తున్నారు.

చెల్లెలు ఇంటికొచ్చేసరికి తను తయారయి, చెల్లెల్ని తొందర పెట్టింది.

"ఎక్కడికక్కా?”

"మా సారు పర్మిషన్ ఇచ్చాడు. ఇంటర్వ్యూ కెళ్ళాలి. “

"ఈ హాస్పిటల్ లో పని బాగానే ఉందిగా.”

అయ్యగారు హాస్పిటల్ మూసేసి అమెరికా వెళ్తాడంట. మరి వేరే పని ఎతుక్కోవద్దూ" అంది.

"కొత్త ఉద్యోగం ఎక్కడా?”

వెళ్ళే దారిలో చెప్తాలే, పద బస్టాండ్ కెళ్ళాలి. మళ్ళీ బస్సెళ్ళి పోతే కష్టం.

నాలుగింటికే బస్.

త్వర త్వరగా బస్టాండ్ కెళ్ళారు.

పక్క ఊరిలో ఉన్న ఒక మిషనరీ హాస్పిటల్ లో నర్సు ఉద్యోగం కోసం వెళుతోంది ఆమె.

బస్ ఎక్కిన ఓ పది నిముషాలకు బయలు దేరింది. నాలుగైనా ఇంక ఎండ పడుతూనే ఉంది. నలభై నిముషాలు ప్రయాణం చేసిన తర్వాత కండక్టర్ వచ్చి వాళ్ళు దిగాల్సిన ఊరు అదే నని చెప్పాడు.

బస్ దిగి చూస్తే తారు రోడ్డు మీద ఎవరూ లేరు. చుట్టూ పొలాలు. పొలాల్లో పంటలేవీ లేవు. కుప్ప వేసి న ధాన్యం కనిపిస్తున్నాయి.

"అక్కా ఇదివరకు ఎప్పుడైనా వచ్చావా ఈ ఊరికి ?" గాలికి రేగుతున్న జుట్టు సరి చేసుకుంటూ అడిగింది చెల్లెలు.

చిన్న పిల్లకు పధ్నాలుగేళ్ళు ఉంటాయి.  ఈ మధ్యనే తల్లి అలవాటు చేసిన సల్వార్ కమీజ్ మీద చున్నీ మాటి మాటికీ జారిపోతుంటే, సరిచేసుకుంటుంది

"లేదు ఇదే మొదటి సారి.” జవాబు చెప్పింది శ్రీలక్ష్మి.

"హాస్పిటల్ ఎక్కడా? ఇక్కడన్నీ పొలాలు కనిపిస్తున్నాయి మరి.”

"అడుగుదాం.” అంటూ చుట్టూ చూసింది.

తార్రోడ్డు మీద నిల్చుని ఎడమ వేపు చూస్తే పొలాల మధ్య ఒక ఎర్ర మట్టి రోడ్డు కనిపించింది. దారికి రెండు వైపులా తాడి చెట్లు. ఎడ్ల బళ్ళు నడిచిన గుర్తుగా ఆ రోడ్డు మధ్యలో ఎత్తుగాఉండి, దానికి అటూ ఇటూబండి చక్రాల గుర్తులు ఉన్నాయి. ఆ రోడ్డు వెంట నడుస్తుండగా ఇద్దరు మగపిల్లలు నల్లటి ఇనప చక్రం కర్రతో దొర్లిస్తూ కనిపిస్తే వాళ్ళను ఆపి అడిగింది హాస్పిటల్ గురించి.

ఆ పిల్లలు తాము తీసుకెళ్తామంటూ నడుస్తూ వచ్చారు అక్క చెల్లెళ్ళతో పాటు. కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత కనిపించింది హాస్పిటల్. బయట బిడ్డనెత్తుకున్న మేరీ మాత విగ్రహం ఉంది. హాస్పిటల్ బయట ఖాళీ ప్రదేశం లో పూల మొక్కలున్నాయి. సాయంత్రం అవుతూ ఉంది.

హాస్పిటల్ లో పని చేసే ఆయమ్మ వచ్చి ఏం కావాలంది.

" నర్సింగ్ కాలేజీ లో చదువుకున్నానండీ. మా వూళ్ళోనే ఒక హాస్పిటల్ లో పని చేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం ఖాళి ఉందని తెలిసి.."చెప్పింది.

"నైట్ పని చెయ్యాల్సి ఉంటుంది. ఎలా వస్తావూ ఆ వూరినుండి?" అడిగింది ఆయమ్మ

హాస్పిటల్ లో ఉండేందుకు ఏమైనా గది చూపిస్తే ఇక్కడే ఉంటానండీ..."

" సూపర్నెంట్ గారు వాకింగ్ కెళ్ళారు. వచ్చే టైమైంది.” అని ఆవిడ లోపలికెళ్ళి రెండు గ్లాసుల్లో టీ తీసుకొచ్చింది.

చీకటి పడుతోంది.

సూపరింటెండెంట్ డాక్టరు ఎప్పుడొస్తాడో, ఉద్యోగం విషయం కనుక్కోవడం ఎప్పుడుమళ్ళీ రోడ్డు వరకూ ఈ చీకట్లో నడిచి ఎప్పుడు వెళ్ళేది, బస్ ఎప్పుడొస్తుందో? అసలా పెద్ద డాక్టర్ ఏమంటాడో అనుకుంటూ చెక్క బెంచీ మీద కూర్చుంది.

చెల్లెలు పూల మొక్కల మధ్య తిరుగుతూ మధ్యలో ఒక సారి అక్కదగ్గరకొచ్చి, చెవిలో 'ఒక గులాబీ పువ్వు కోసుకోనా' అని అడిగింది.

అక్క కళ్ళతోనే వొద్దొద్దు అని చెప్పింది.

చెల్లెలు మళ్ళీ పూల మొక్కల దగ్గరకు పరిగెత్తి, అక్కకు ఇక్కడ ఉద్యోగ మొస్తే , ఈ పూలు కోసుకోవచ్చు. మంచి గదిలో ఉండొచ్చు. అనుకుంటూ ఊహిస్తోంది.


కానీ చేతులూరుకోలేక రెండు బొండు మల్లెలు కోసింది. అక్క దగ్గరకొచ్చి, చూపించి "ఎంత పెద్దవో చూడక్కా, మంచి వాసన" అంటూ ముక్కు దగ్గర పెట్టింది.

వాసన చూసి "పూలు కనిపిస్తే కోసెయ్యడమేనా, తప్పు కదూ!” చిన్న గొంతు తో మందలించింది.

ఇంతలో పెద్ద డాక్టర్ నడుచుకుంటూ వచ్చాడు.

ఆయన్ని చూడగానే శ్రీ లక్ష్మి లేచి నమస్కారం చేసింది. చెల్లెలు ఆయన వంక చూస్తూ  జంట మల్లెలున్న చేతిని వెనక్కి పెట్టుకుంది.

శ్రీలక్ష్మి వచ్చిన పని విని, వివరాలు కనుక్కున్నాడు. చదువు, కుటుంబం మిగతా విషయాలు అడిగాడు ఆయన.

ఒక అప్లికేషన్ వ్రాయమని ఒక తెల్ల పేపర్ ఇచ్చాడు.

శ్రీలక్ష్మి అప్లికేషన్ వ్రాస్తుంటేఆయమ్మ ని కనుక్కున్నాడు పిల్లలకు టీ ఇచ్చావా అని.

అప్లికేషన్ పూర్తి చేసి ఆయనకిచ్చింది.

అది చదివి, "అడ్రసు వ్రాసి వెళ్ళమ్మా, నేను మేనేజ్ మెంట్ వారితో మాట్లాడాక మళ్ళీ నీకు కబురు చేస్తాను" అన్నాడు.

తను పని చేసే హాస్పిటల్ ఫోన్ నంబర్ ఇచ్చింది.

ఆయనకూ, అక్కడున్న ఆయమ్మకూ చెప్పి బయటకొచ్చి నుంచున్నారు. డాక్టర్ వాళ్ళ వెనకే వచ్చి,

"బాగా చీకటి పడింది అమ్మా, ఎలా వెళ్తారు, పోనీ ఈ పూటకుండి రేపు పొద్దున్నే ఫస్ట్ బస్ కెళ్ళండి.” అన్నాడు.

"మా అమ్మ ఒక్కతే ఉంటుంది సార్. వెళ్ళాలి.” అంది.

ఇందాక తోడొచ్చిన ఇద్దరు మగ పిల్లల్ని ఆయన పిలిచి "చూడూ అక్క వాళ్ళను బస్ స్టాపు వరకూ దింపి రండి" అని చెప్పాడు.

ఆయనకు మరొకసారి 'తను బాగా పనిచెయ్యగలని , తనకా ఉద్యోగం వచ్చేట్లు చేయమని" చెప్పి, నమస్కారం చేసి, సార్ గారికి నమస్కారం చేయమని చెల్లెలికి కూడా చెప్పి రోడ్డు వెంట బయలు దేరారు.

చీకటిలో దారి కనిపించడం కోసం ఒక లాంతరు వెంట తెస్తున్నారు పిల్లలు. దారిలో ఆ మగపిల్లలు అడిగే ప్రశ్నలకు అక్క చెల్లెళ్ళు జావాబిస్తూ వస్తున్నారు.

ఓ ఇరవై నిముషాల తర్వాత రోడ్డు మీది కొచ్చారు. రోడ్డు కు పక్కగా ఒక కిళ్ళీ షాపు. సోడాలు, సిగరెట్లు ఇంకేవో కనిపిస్తున్నాయి. ఆ షాపు అతను పరిచయమున్నట్లు మగపిల్లలు వెళ్ళి అడిగారు, "శంకరూ, బస్ ఎప్పుడొస్తదీ?” అంటూ.

" రావాల, నేనూ ఇప్పుడే వొచ్చా" అన్నాడు అతను.

కిళ్ళీ షాపు కు కొద్ది దూరం లో నుంచుని దూరంగా బస్ కోసం చూస్తూ ఉన్నారు.

దగ్గరయ్యే లైట్ల రూపం లో ఆశ దగ్గరకి వచ్చి, అంబాసిడర్ లానో, లారీ లానో దూరమై వెళ్ళిపోతోంది.

కిళ్ళీ షాపు శంకర్ తన బంకు లోనుండి బయటికొచ్చి వివరాలు కనుక్కున్నాడు.

"ఓహో డాక్టరు గారు దగ్గరకొచ్చారా పని మీద. భయం లేదులే . బస్ వెళ్ళిపోయినట్లుంది. జీపులు బొచ్చడొస్తాయి కంగారు లేదు.” అన్నాడు.

అతను చెప్పిన పది నిముషాలకే ఒక జీపు వచ్చింది. శంకర్, మగపిల్లలు రోడ్డుకు అడ్డం నిల్చుని చేతులూపుతూ ఆపారు.

జీపులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కడినుండి వస్తున్నారో గలగలమని కబుర్లు వినపడుతున్నాయి జీపుశబ్దం తో కలిసి.

" డాక్టరు గారికోసం వచ్చారు. టౌన్ లో దింపేయండి అని." శంకర్ జీపు దగ్గరకెళ్ళి చెప్తున్నాడు.

మళ్ళీ అక్కచెల్లెళ్ళ దగ్గరకొచ్చి చెప్పాడు. "పర్లేదు ఎల్లండమ్మా, తెలిసిన వాళ్ళే." అన్నాడు.

శ్రీలక్ష్మి సంకోచం గా "బస్ రాదా" అని అడిగింది.

"బస్ ఎల్లిపోయినట్టుంది.పర్లేదమ్మా, ఆడంగులు కూడా ఉన్నారు.” అన్నాడు.


ఇంతలో జీపులోనుండి ఆడవాళ్ళు రండమ్మా అని పిలుస్తున్నారు. ఇద్దరూ జీపు వెనక వైపునుండి ఎక్కి సైడు సీటులో ఇద్దరూ సర్దుకుని కూర్చున్నారు. జీపంతా రకరకాల వాసనలు, సిగరెట్, చెమట, ఆడవాళ్ళ జడలో పూల కసురు వాసన అంతా కలిసి ఏవిటోగా ఉంది. పొలం పని చేసి వస్తున్నారేమో,ఆడవాళ్ళ చేతిలో కొడవళ్ళు.


జీపు స్పీడందుకుంది. పక్కనే ఆడవాళ్ళు గలగలా మాట్లాడుతూ, మగవాళ్ళతో చెతుర్లాడుతూ సందడి సందడి చేస్తున్నారు. మెల్లగా భయం పోయింది. ఇంకొక్క అరగంట తర్వాత ఇంటికెళ్ళిపోవచ్చు అనుకుని చెల్లెలి చుట్టూ చెయ్యి వేసి వెనక్కి ఆనుకుని కూర్చుంది. చల్లగాలి హాయిగా తగులుతోంది.

భయం తగ్గిన మీదట ఆలోచనల్లో మంచి ఊహలు వస్తున్నాయి. ఉద్యోగం ఇస్తారేమో. ఆ డాక్టర్ చాలా దయ గలవాడిగా కనిపిస్తున్నాడు. అమ్మనూ చెల్లినీ నాతో బాటు అక్కడే ఉండనిస్తే బాగుండు.


పావుగంట ప్రయాణం తర్వాత ఓ చిన్న ఊరువచ్చింది. లైట్లు కనిపిస్తున్నాయి. జీపు ఆగింది. ఎందుకో అని చూసే లోపల, ఆడవాళ్ళు దిగారు. శ్రీలక్ష్మి ఉలికి పడింది. మీరెళ్ళి పోతున్నారే అని అడిగింది. వాళ్ళు నవ్వి "మరి మావూరు ఇదేగా, పర్లేదమ్మలూ, ఇంకో అరగంటకి మీరూ ఎల్తార్లే" అంటూ వెళ్ళారు.

ఓ పది పన్నెండు మగ వాళ్ళ మధ్య ఇద్దరే ఆడవాళ్ళు. గుండె వేగం గా కొట్టుకుంటుంది శ్రీలక్ష్మికి. అక్క కదలికల్లో ఏదో తేడా చూసి చెల్లెలు అక్క చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఇద్దరి చేతులూ తడితడిగా ఉండి పట్టు జారిపోతోంది.

మరో ఫర్లాంగు తర్వాత జీపు ఆగింది. భయం ఉప్పెన లా పొంగి ఒక్క సారిగా దూకబోయింది జీపు.

"ఏందమ్మా అంత భయమేంది కూసో. జీపుకేదో సిన్న తెగులు" అన్నారు పక్కనే కూర్చున్న మగవాళ్ళు.

"పిల్ల మనల్ని జూసి బయపడ్తందిరా!” నవ్వారు.

నవ్వుల తర్వాత నిశ్శబ్దం.

ఇద్దరూ దాదాపు గట్టిగా అతుక్కుపోయినంత దగ్గరగా కూర్చున్నాను అక్కా చెల్లెళ్ళు.

జీపు రిపైర్ అయినట్లుంది. నడుస్తోంది కానీ భయం తగ్గలేదు లక్ష్మికి. కాసేపటికి జీపు రోడ్డు దిగి పొలాల్లోకి వెళ్తోంది.
ప్రాణాలు ఆవిరైనాయి. జీపులో కాళ్ళ దగ్గర తడిమింది. కొడవలి చేతికి దొరికింది. అయినా కుదుట బడ లేదు. దేవుడా అని లోపల ఏడ్చుకుని

"అన్నా, ఎక్కడికి అన్నా ఇటువైపు. మమ్మల్ని వొదిలెయ్యండి అన్నా, మీకు దణ్ణం పెడతాం. నాకు అమ్మ ఉంది అయ్యా., అన్నా, దణ్ణం పెడతా అయ్యా. కనీసం చిన్నపిల్లని నా తల్లిని వొదిలెయ్యండి సార్.” కంగారులో ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియడం లేదు. జీపు కుదుపులతో కుదుపులతో నడిచి నడిచి ఒక చీకటి తాటి తోపులో ఆగింది.

మీకూ అమ్మ ఉందిగా , ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి అన్నా, అన్నా మీ కాళ్ళు పట్టుకుంటా అన్నా!”

రోడ్డుకు దూరంగా..

ఏ శబ్దమైనా గాలిలో కలిసి నిశ్శబ్దమై పోయేంత దూరంగా!

*******

తర్వాతి రోజు పొద్దున్నే, పొలం లో పడి ఉన్న ఇద్దరి ఆడపిల్లల మృత దేహాలు

వంటి నిండా గాయాలు.

 పక్కనే పడి ఉన్న కొడవలి.

చిన్న పిల్ల గుప్పిటిలో రెండు నలిగిన మల్లెలు!

పూలు కనిపిస్తే కోసెయ్యడమేనా..

అన్నలారా, పూలు కనిపిస్తే కోసెయ్యడమేనా?

******


"మనం మానవ సమాజంలో బతుకుతున్నామా? మనుషుల ముసుగేసుకున్న మృగాల రాజ్యంలో బతుకుతున్నామా.......రోజురోజుకీ విరక్తి వచ్చేస్తోంది.”

18 comments:

జ్యోతిర్మయి చెప్పారు...

మృగాలకు ముసుగులెందుకు వేశారో...వాళ్ళకు ఏ శిక్ష వేసినా చిన్నదే అవుతుంది...

మధురవాణి చెప్పారు...

:(((((

Surabhi చెప్పారు...

Dirty brutes!ashamed to be part of this society. where ever you go you see them. A girl child from age 4 to 60 always has to live such a insecure life ? what a pathetic life for women. what does education, economicindependence, individualism, identity what does they all mean ?.very frustrating.....
I'am feeling so sick.

Chitajichan చెప్పారు...

There is one dialogue in the Film Provoked.
Aishwarya Rai, after being released from Jail, says " We should teach our sons how to respect women"
I could never forget this line.

nirmal చెప్పారు...

chandu s garu ,mee post tarvata chaaaaaaala shock lo ki vellanu. chaaaaaaaaaaala bhayank scences raaaaaaaaaasaru.still feeling bad.i dont know the solution.i was blank.thanks for good writing.

Anuradha చెప్పారు...

:(

ఆ.సౌమ్య చెప్పారు...

నా ఆవేదనకు ఇంత చక్కని అక్షరారూపమిచ్చారు...కళ్ళంట నీళ్ళొచ్చాయండీ.
మనం ఎప్పుడు బాగుపడతామో! :((

jyothi చెప్పారు...

చివరకు వచ్చేసరికి ఇది కథేలే అన్న తృప్తి ఎగిరిపోయింది.లింక్ ఒపెన్ చేసి చూసే ధైర్యం లేదు.

Praveen Mandangi చెప్పారు...

నా కంప్యూటర్‌లో ఆ వీడియో ఓపెన్ అవ్వడం లేదు.

Chandu S చెప్పారు...

ఇదేదో ప్లాన్ చేసి వ్రాసిన కథ కాదు. బాధతో వ్రాసినదే. నిజానికి నేనూ వీడియో చూడలేదు. చూడాలని అనిపించక.... అయినా ఇంకా ఏం చూడాలి వీడియోలో..

స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

నిన్న సౌమ్య + లో ఇచ్చిన లింక్ కూడా ఓపెన్ చెయ్యలేదు . తలుచుకోటానికే భయమేసే సంఘటన . ఇది అదని తెలుసుంటే చదివేదాన్నేకాదు .
శైలజ గారు మీ స్పందన సమయానుకూలంగా వుంది . ఇంకేమీ చెప్పలేను

అజ్ఞాత చెప్పారు...

పుష్పవిలాపం మళ్ళీ చూపించారు.

రాజ్ కుమార్ చెప్పారు...

:(
నాకా వీడియో ఓపెన్ చెయ్యటానికి భయమేసి పోస్ట్ మ్యూట్ చేసేశాను.
నాకేం చెప్పాలో తెలియటం లేదు

ఆ.సౌమ్య చెప్పారు...

ఆ వీడియోలో ఏమీ లేదు. ఆ ఆడపిల్లలను చూపించి వారి చేత నిజాన్ని చెప్పించారు. అంతే. అలాగే ఆ అబ్బాయిలలో 11 మంది పట్టుబడ్దారు. వారిని చూపించి కేసు ఏమిటో వివరించారు అంతే. అంత భయపడవలసినదేమీ లేదు. మీరంతా వీడియోని ధైర్యంగా చూడొచ్చు.

మనసు పలికే చెప్పారు...

మనసుని మెలి తిప్పేశారు :(((

Narayanaswamy S. చెప్పారు...

Terrible!

మనోజ్ఞ చెప్పారు...

చాలా బాధగా ఉంటుంది ఇలాంటివి చూస్తే. మొన్నే ఒక తెలుగు ఛానెల్ లో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యచారాల గురించి స్పెషల్ స్టోరీ ఒకటి చూసాను. వాళ్ళు చెప్పింది విన్నాక కొంత సేపటి వరకు తేరుకోలేకపోయాను. గంటకు ఒక అమ్మాయి అత్యాచారానికి గురి అవుతోందట. సంవత్సరానికి పధ్నాలుగు వేల మంది ఆడపిల్లలు బలవుతున్నారట. ఈ సంఖ్యలు చూస్తోంటే నాకు కళ్ళు తిరిగాయి. అసలు మనుషులమా, మృగాలమా అని అనిపించింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువట. రెండు రోజుల వరకు ఇందులో నుంచి తేరుకోవడం కష్టం అయింది నాకు. ఇప్పుడేమో ఇది.

Raja Prathigadapa చెప్పారు...

katha(anukoni)...chaduvuthu unnappudu..aa iddaru ammayilaku emi jaragakudadu..idi antha valla bhayamey anukunna..chivarilo ..vari bhayam nijam ayi..chanipovatam..manasuni kalichivesindi..nijamani tarvatha telisi gunde baruvekkindi...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి