11, ఫిబ్రవరి 2012, శనివారం

రాణీ-పేద 2

continued from రాణీ-పేద 1
ఏంకర్ పిల్లాడు ఏదో వంకన ఎక్కువ సార్లు వస్తున్నాడు మా ఇంటికి. మా అత్త మీద అతనికి హఠాత్తుగా శ్రద్ధ ఎక్కువైంది. పళ్ళూ, కాయలూ పట్టుకొస్తూ, అత్త ఆరోగ్యం గురించి మా కన్నా ఎక్కువగా పట్టించుకుంటున్నాడు.

కొన్నాళ్ళకు మధు ఓ కబురు తీసుకొచ్చాడు. ఓ రోజు మధుని ఆఫీసులో కలిసి ద్రౌపది ని పెళ్ళి చేసుకుంటానని చెప్పాడట. ద్రౌపది మీద మనసు పడటం ఊహించిందే కానీ పెళ్ళి వరకు రావడమే ఆశ్చర్యంగా ఉంది.

నాకెలా ఉండి ఉంటుందో నేనెందుకు లెండి చెప్పడం, మీరీ పాటికిఏదో అనేసుకుంటూనే ఉంటారు కదా.

అత్త సంబర పడిపోయింది." మంచి కుర్రాడే, దాని గుణానికి తగ్గ వాడు." సరి, నాలుగు కాయలకే అత్త పడిపోయినట్లుంది.

ఎంత చక్కటి చీరలు కట్టాం, ఎంతెంత మేకప్ చేసుకున్నాం, ఎన్ని నగలు పెట్టుకున్నాం చివరికి వాడికి ద్రౌపది నచ్చింది.
ఈ మగాళ్ళకేంటోనమ్మా, మాలాగా గలగలా మాట్లాడుతూ, గంతులేసే అమాయకపు ఆడవాళ్ళం నచ్చం. ద్రౌపది లా ముంగి వేషాలేసే మెత్తని కత్తులే నచ్చుతారు.

అహా ఇంకో దెబ్బ అంటూ లెక్కేస్తున్నారా? నేను లెక్క పెట్టడం మానేశాను. ఎన్నని లెక్క పెట్టేది?

వెధవ, చీప్ టేస్టూ వాడూ అని కడుపు మంట లేచింది గానీ, మంట వెలుగులో నిజం కూడా కనిపించిన్నది నిజం. మా లాగా రంగులేసి గంతులేసే హోమ్ మేడ్ రికార్డింగ్ డాన్సర్లని ఎంతమందిని చూస్తున్నాడో రోజూ, ఎంత వెలపరం పుడుతోందో..

ఈ పెళ్ళి అయిందంటే అది నాకు చుట్టమయి కూర్చుంటుంది. నా సర్కిల్ లో పరువుంటుందా నాకు. పరువు మాట అటుంచి ఈ సంగతి తెలిస్తే, మా సర్కిల్ లో కొంత మంది ఆత్మహత్యా యత్నానికి పూనుకోరు కదా? ఎలా ఈ ఉపద్రవం ఆపాలా అని ఇంకా ఆలోచనలో ఉండగానే...

ఉన్న విషయం చెప్పి, "ఏవే ద్రౌపదీ మీ అన్నను పిలిపించు, విషయం మాట్లాడాలి" అంది అత్త. అత్త మీద చిరాకొచ్చింది. ఏవిటా సంబరం అర్ధం పర్ధం లేకుండా? ముసలితనం వస్తున్న కొద్దీ చాదస్తం పట్ట పగ్గాలు లేకుండా పోతోంది.

"వద్దమ్మ గారూ" ద్రౌపది అంది.

నాకు ఆనందం, ఆశ్చర్యం ఒకే సారి కలిగాయి.

"అబ్బాయి మంచి వాడే! నీ నెమ్మది కి తగ్గట్టు దేవుడే నీ కీ సంబంధం చూశాడే.”

"వొద్దు అమ్మగారూ.” స్థిరం గా ఉన్న దాని గొంతులో నిర్ణయం అత్తక్కూడా అర్ధమయింది.

ఇంత గట్టిగా వద్దంటుందేం? దీని మనసు ఎవరి మీద? ఆ డ్రైవర్ మీదా? అయ్యుండదు. డ్రైవర్ లేక నేను, ద్రౌపది లేక డ్రైవరూ నానా తిప్పలు పడుతున్నాం కానీ, ఇది శుభ్రంగా ఏవీ పట్టనట్టు బాగానే తిరుగుతుంది. మరి ఎవరి కోసం ఈ పెళ్ళొద్దొంటుందీ?

******

ఓ రోజు నేనూ నా ఫ్రెండ్స్ సముద్రం ఒడ్డున పిక్ నిక్ ప్లాన్ చేశాం. సూర్యోదయం చూడాలని తెల్లవారకుండానే అందరం బయలు దేరాం. అందరం ఎన్నో ఏళ్ళబట్టీ డ్రైవింగ్ చేస్తున్నాం. డ్రైవర్లు లేకుండానే వెళ్ళాలని అనుకున్నాం. బీచ్ మీద మా ఆటలు చూసి ఊళ్ళో కథలు ప్రచారం చేయకుండా.


సాయంత్రం తిరిగి కార్లో వస్తుండగా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నల్లటి లాండ్ క్రూయిజర్ పక్కనే ఆగింది. నాకు తెలిసి అలాంటిది  వూళ్ళో, మధుకొక్కడికే ఉంది. టూర్ లు తిరగడానికని కొన్నాడు. యాత్రలకు అవసరమైన సామాన్లన్నీ అదేనండీ జండాలు, వగైరా వెనక వేసుకుని ఊళ్ళ మీదకు పోతూ ఉంటాడు. ఈ కారెవరిదా అని కొంచం ముందుకు పోనిచ్చి చూశాను. విండో లో నుండి, డ్రైవర్ పక్క సీట్లో తలొంచుకుని కూర్చున్న ద్రౌపది కనిపించింది.

ముందుకి వంగి చూస్తే డ్రైవర్ సీట్లో మధు.

రక్తమంతా మొహంలోకి చిమ్మింది. గుండె చప్పుడు లెక్క పెట్టగలిగేంత పెద్దగా వినిపించింది. స్టీరింగ్ పట్టుకున్న చేతులకు కారులో ఏసి ఎక్కువైనట్లు చల్ల బడ్డాయి.

పక్కన ఉన్న ఆడవాళ్ళు చూశారేమో నని చూస్తే, వాళ్ళ కబుర్లలో వాళ్ళున్నారు. కొంతలో కొంత నయం.

ట్రాఫిక్ సిగ్నల్ ఆకు పచ్చగా మారడానికి యుగాలు పడుతుందేమిటీ ఈ రోజు?

పక్కనే యముడి వాహనం లాగా ఆ నల్ల బండి.

అదేదో సినిమాలో హీరోయిన్ చేసినట్లు దాని మీద పెట్రోల్ పోసి నిప్పంటిద్దామనిపిస్తోంది. ఫ్రెండ్స్ అందర్నీ, కార్లో నుండి తోసేసి ఒక్కదాన్నే వెళ్ళిపోవాలని పిస్తూ ఉంది.

వాళ్ళందర్నీ, వాళ్ళ ఇళ్ళ దగ్గర దింపి ఎలా నేనింటికొచ్చానో, నా ఓపికకు , ఓర్పుకు నాకే ఆశ్చర్య మనిపించింది.

ఇంటికొచ్చేసరికి మధు నల్ల బండి మా ఇంటి బయట పోర్టికో లో పార్క్ చేసింది. నేను కూడా నా కారు తీసుకొచ్చి పార్క్ చేసి విసురుగా లోపలకెళ్ళాను.

అత్త కోసం చూస్తే ఎక్కడా కనపడలేదు.

ఎప్పుడు చూసినా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటుంది.

హాల్లో నిల్చుని చూస్తూ ఉంటే, హాలుకు ఆనుకుని ఉన్న గెస్ట్ రూమ్ లోనుండి మధు వస్తున్నాడు. మధు మొహం చూస్తే అలిసిపోయినట్లు ఉంది.

వెనకే ద్రౌపది వస్తుంది. అలిసిపోడూ మరీ?

నాకొచ్చిన కోపానికి, చేతిలో ఏదైనా గన్ ఉంటే ఇద్దరూ బతికుండే అవకాశమే లేదు.

నేను నిల్చున్న చోటులో ఒక టేబిల్ మీద అందమైన అక్వేరియం ఉంది. నారింజ రంగు చేపలు, ఇంకా నల్లటివి, తెల్లటివి నిశ్చింతగా ఆడుకుంటున్నాయి. దాన్ని ఒక్క సారిగా టేబిల్ మీదనుండి తోసేశాను. పెద్ద శబ్దం తో అది పగిలి, ఒలికిన నీళ్ళతో హాల్లో మడుగయ్యింది. చేపలు చెల్లా చెదురుగా పడి పోయి గిల గిల లాడుతున్నాయి. నా కన్నా కాదుగా, అందుకే వాటి మీద జాలి కూడా రాలేదు.

మధు దగ్గర కి రాబోతూ "అమ్మలూ" అన్నాడు.

"అమ్మలూ?  నన్నలా పిలిచావంటేనా ....... ఛీ"

ఒక్క నిముషం కూడా ఆగకుండా కారు తీసుకుని  పిచ్చిగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాను. నా ఆలోచనలు అంతకన్నా bizarre గా. ఏక్సిడెంట్ కాకపోవడం ఎదుటి వాళ్ళ అదృష్టం.

గుడి దగ్గర పెద్ద ట్రాఫిక్ ఉండదు. చీకటిగా ఉంటుంది. ఓ పక్కగా పార్క్ చేస్తుండగా మొబైల్ మోగింది. మధు నుండి. నేను మొబైల్ వంక చూస్తున్నాను కానీ ఆన్సర్ చెయ్య దలుచుకోలేదు.

ఇంకా ఇంకా మోగుతుంది. మధు కాలింగ్ అనుకుంటూ. దాన్ని తీసి వెనకి సీట్లోకి విసిరి కొట్టాను. ఆగింది.

ఎవరినైనా ఏదో ఒకటి చేసెయ్యాలి, లేకపోతే నన్నే నేను ..చచ్చిపోతే.. ఇంత చూసి కూడా బతకాలా.. ఏం చెయ్యాలి?

కాసేపటికి మనసు శూన్యంగా మారింది. విచిత్రంగా ఉంది. అప్పుడప్పుడు గుడి గంటల చప్పుడు.

గుడిలోనుండి ఏదో హరి కథ వినిపిస్తోంది.

'...  ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంటికొచ్చిన వర్తకుడుకి, భార్య పక్కన  నిద్రిస్తున్న యువకుణ్ణి  చూసి, భార్య మళ్ళీ పెళ్ళాడి ఉంటుందని తలచి, విపరీతమైన కోపంతో కత్తి ఎత్తాడు. ఆ ఎత్తిన కత్తికి ఇంటి చూరులో ఉన్న తాళపత్రం చిక్కింది. ఏమిటో వ్రాసి ఉందే అని చూడగా, ఏదైనా పని చెయ్యబోయే ముందు ఒక్క క్షణం ఆగమనీ, ఆలోచించమనీ..'

చెప్తున్నాడు దాసు.

వెనక సీట్లో ఉన్న మొబైల్ తీశాను. ఆఫ్ అయినట్లుంది. స్విచ్ ఆన్ చేయగానే మెసేజ్ కనిపించింది

ammalu, intikiraa please

వెళ్ళాను.

ఇంటికెళ్ళే సరికి మధు లాన్ లో కనిపించాడు.  నా కారు చూసి గబగబా వస్తున్నాడు.

లోపలికి వెళ్ళాను. హాల్లో పగిలిన ఏక్వేరియం ఆనవాళ్ళు లేవు. చేపలు గుండ్రంగా ఉన్న గాజు జాడీలో ఆడుకుంటున్నాయి.

గెస్ట్ రూమ్ తలుపు మూసి ఉంది. నాకు తెలియకుండానే అటు వైపు నడిచి తలుపులు తోసి చూశాను.

..to be ended in the next post 

20 comments:

Chitajichan చెప్పారు...

umm.. tarvata emaindi

Sravya Vattikuti చెప్పారు...

వా వా ఇప్పడు రేపటి వరకు వెయిట్ చేయాలా :(((

రాజ్ కుమార్ చెప్పారు...

ప్రతి రోజూ అనుకుంటున్నాను. అంతా పూర్తయ్యాక ఒకేసారి చదివేద్దాం అని.
ప్రతీ రోజూ వచ్చి చదివేస్తున్నాను... వాఆఆఅ...వాఆఆఆఆఅ....

jyothi చెప్పారు...

నాకర్ధమైందోచ్.అత్తగారికెదో సీరియస్ అయ్యుంటుంది.అంతే కదా?

మాలా కుమార్ చెప్పారు...

మంచి సస్పెన్స్ లో ఆపేసారే :)

Zilebi చెప్పారు...

వామ్మ్మో, వామ్మో,

ఇంకా ఉంది అని సరి ఐన చోట కథ కి బ్రేక్ పెట్టడం లో మల్లాది ని , యండమూరి ని మించి పోయేరు చందు ఎస్ గారు!!!

థాంక్ ఫుల్లీ బ్లాగుల కాలం లో వార పత్రిక కాలం లా ఒక్క వారం వైట్ చెయ్యాల్సిన అవసరం లేదు !(మీకు క్లూ ఇచ్చేసానే నెక్స్ట్ టపా ఎప్పుడు పెట్టాలో అని, చెప్పి ఉండ కూడదు ఈ మాట !)చీర్స్
జిలేబి.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

మీ ప్రజంటేషన్ అద్భుతం.. సస్పెన్సే కొంచెం కష్టంగా ఉంది.. కాకపోతే ఈ రోజంతా ఏదో పనిలో ఉండి ఇప్పటి వరకూ చదవనందుకు సంతోషంగా ఉంది. ఇపుడింకోపన్నెండు గంటలు ఎదురుచూస్తే చాలుకదామరి :) ఇలా అన్నానని రేపటి పోస్ట్ లేట్ చేయకండేం.

జ్యోతిర్మయి చెప్పారు...

అమ్మా నేను చదువుతానేంటి? ఈవేళ ముందస్తుగా పోస్ట్ చివరేముందో చూసేశానోచ్..

Chandu S చెప్పారు...

కొద్దిగా ఆగండి.

Chandu S చెప్పారు...

శ్రావ్యా, రేపే అని డెడ్ లైన్ పెడితే ఎట్లా?

Chandu S చెప్పారు...

ఇప్పుడే అనుకుంటున్నా, ఈ రాజ్ కుమార్ వచ్చి కామెంట్ పెట్టే వరకూ ముగింపు మొదలు పెట్టకూడదని. అమ్మయ్య మీరు కామెంట్ పెట్టారా, ఇక రాస్తున్నా.

Chandu S చెప్పారు...

అంతే, అంతే, ఎలా తెలిసిపోయింది మీకు?

Chandu S చెప్పారు...

మాల గారూ, ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

జిలేబి గారూ, ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

శ్రావ్య రేపంటుంది, ఈ అబ్బాయి పన్నెండు గంటలే అంటాడు. వీళ్ళ డెడ్ లైన్ల టెన్షన్ తో నాకు ముగింపు ఐడియా రావడం లేదు దేవుడా....

Chandu S చెప్పారు...

జ్యోతిర్మయి గారు ఇవ్వాళ్టి పోస్ట్ చదివి కామెంట్ వ్రాస్తే గానీ, ముగింపు పోస్ట్ చెయ్యను.

కృష్ణప్రియ చెప్పారు...

జ్యోతిర్మయి గారు,

మీరు గబ గబా చదివి ఇక్కడకి వచ్చి చెప్పేయండి. ఈ డాక్టర్ గారేమన్నారో విన్నారు కదా?

Zilebi చెప్పారు...

జ్యోతిర్మయీ గారేక్కడ కనబడడం లేదే మరి !

వారెప్పుడు వచ్చి కామెంటు తారో అది మరో సస్పెన్సు అయి పోయింది -!!

చందు ఎస్ గారు ఇక మీ పేరు సస్పెన్స్ చందూ గారనే చెప్పాలి !!

చీర్స్
జిలేబి.

Chandu S చెప్పారు...

పాపం జ్యోతిర్మయి గారు బుజ్జి పండు తో ఎక్కడో అవస్థ పడుతుంటార్లెండి. నేను అనుకున్న టైముకే పోస్ట్ చేస్తాను.

జ్యోతిర్మయి చెప్పారు...

వచ్చేశానండీ...చదివేశాను. ఇక శైలజ గారు ప్రచురించడమే తరువాయి...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి