9, ఫిబ్రవరి 2012, గురువారం

రాణీ- పేద


ద్రౌపది నా పనిమనిషి.

నన్ను రెండో మూడో సార్లు లాగి లెంపకాయ కొట్టింది.

అయినా పనిలో నుండి తీసెయ్య లేదు.

మొదటి సారి కొట్టినప్పుడే ఎందుకు పని లోనుండి తీసెయ్యలేదు అని మీకు అనుమానం రావడం సహజం.

చదవండి.

**********

మా అత్తంటే నాకు ప్రాణం తో సమానం. మా అమ్మ కన్నా ఎక్కువ.

నన్ను సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది.

నేనేమీ రియాలిటీ గేమ్ షో లో మాట్లాడటం లేదు. నిజం గానే నాకు మా అత్తంటేనూ, నేనంటే మా అత్తకూ ఇష్టం.


ఆవిడ నాకు మేనత్త. మా నాన్న ఆవిడకు స్వయానా తమ్ముడు. మా నాన్నంటే పంచ ప్రాణాలు. తమ్ముణ్ణి చూడాలని ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చేది. భోజనం చేసిన తర్వాత నాన్న, అత్త అరుగు మీద వెన్నెల్లో కూర్చుని కబుర్లాడుకుంటుంటే ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నట్లే ఉండేది. ఎంతకూ తెగని చిన్ననాటి కబుర్లు.

అత్త స్కూలు టీచరు ఉద్యోగం చేసేది. తన కొడుకుని ఎంతో క్రమశిక్షణతో పెంచింది, నాకిచ్చి చేద్దామని. మా అత్త మొగుడు మేనరికపు పెళ్ళిళ్ళ మీద సందేహ పడితే, నేను గొడవ చేసి, ఎందుకైనా మంచిదని, అందరూ చూస్తుండగా చేతికందిన ద్రావకం కొద్దిగా తాగి, మా అత్త కొడుకుతో పెళ్ళి సాధించుకున్నాను.

మాట చెప్తే పోయేదిగా అంటారా? నేనంతే, చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలి అనే సూత్రం నమ్ముతాను. మా అత్తమొగుడు ఆస్తి అంతా రాజకీయాల్లో తగలేసి గొప్ప పేరు సంపాదించాడు. మధు, వాళ్ళ నాన్న లాగా తెలివి లేని వాడు కాదు. వాళ్ళ నాన్న పేరు పెట్టుబడి పెట్టి, బిజినెస్ లోనూ, రాజకీయాల్లోనూ సమానంగా సంపాదిస్తున్నాడు.

పెళ్ళయిన తర్వాత అత్త, మాతో ఉండటానికి ఇష్టపడలేదు.

మా నాన్నతో " ఏమోరా, కొడుకూ కోడలినీ ఒక దగ్గర చూసి, నా మనసు మారి, ఆరళ్ళు పెడతానేమో, నేను వేరే ఉంటాలే" అని తమ్ముడితో అంటే

నువ్వు వేరే ఉంటే నా కూతుర్ని కాపురానికే పంపనన్నాడు నాన్న.

నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగా పెళ్ళయింది.

పెళ్ళయిన తర్వాత కాలేజీ కెళ్ళమంది అత్త. నేను చదవన్నాను.

ఇంటిపట్టునే ఉండి అత్త నీడన కాపురం చేస్తూ, సీరియళ్ళు చూసుకుంటూ, అందానికి మెరుగులు దిద్దుకుంటూ గడిపేస్తున్నాను. పనీ పాటా లేని బతుకు అని మీరు ఈసడించుకుంటే నాక్కోపమొస్తుంది. మీకు తెలియదేమో నాకసలు తీరికే ఉండదు.


కొత్త ఫాషన్ చీరలు ఎప్పటికప్పుడు కొని కట్టడం, వాటికి మాచింగ్ బ్లౌజుల కోసం డ్రైవర్ ని తీసుకుని ఊరిమీద పడి వెదకడం, ప్రతి వారం బ్యూటీ పార్లర్ కు వెళ్ళి కాళ్ళు చేతులూ మొహానికీ, జుట్టుకూ ట్రీట్మెంట్లు తీసుకోడానికి నాకు 24 గంటలూ సరిపోదు. ఇల్లు శుభ్రం చేస్తే చేతులు నొప్పి, అలమార్లు సర్దితే డస్ట్ ఎలర్జీ, వంట చెయ్యడం మోటు. ఈ పనులకోసం ఇంట్లో నలుగురు పని వాళ్ళు, ఒక వంటావిడ, ఉన్నారు. వీళ్ళందరినీ సూపర్ వైజ్ చేసే బాధ్యత అత్తది.


ఇక నా పనులు చూసే వాళ్ళు లేక నాకు చచ్చే చావయ్యేది. మీరెంత వెటకారంగా నవ్వుకున్నా అది నిజం. నా చీరలు, డ్రెస్సులు సర్దేందుకు, పార్టీ కెళ్ళాలంటే చీరకు మేచింగ్ ఏక్ససరీలు తీసిపెట్టేందుకు, నాకోసం సూపులు రెడీ చేసేందుకు, నా పొడుగాటి జుట్టుకు పోషణ చేసేందుకు మెంతి పిండి, హెన్నా, పెట్టేందుకు నాకో మనిషి కావలిసొచ్చింది. ఆ పనులు మొదట్లో అత్త చేసేది కానీ, ఈ మధ్య అత్తకు ఓపిక తగ్గింది. ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయిని చూసింది నాకోసం.

ద్రౌపది.

"అవునే, నీకీ పేరెవరు పెట్టారే?” అడిగింది అత్త

"మా తాత ఊళ్ళో బుర్ర కథలు చెప్పేవోడంట అమ్మ గారూ, మహాభారతం బుర్ర కథ చెప్తా వుంటే మా అమ్మకు నెప్పులొచ్చినాయంట. ఆడ పిల్ల పుడితే ద్రౌపది అని పెడదావని అనుకుని పెట్టాడంట.”చెప్పింది.

ఓ సారి మధు బిజినెస్ టూర్ మీద వేరే ఊరు వెళ్ళి ఓ మధ్య రాత్రి వచ్చాడు. ఆ టైములో నేను అతని గురించే ఓ కవిత రాసుకుంటున్నాను.

తలుపు చప్పుడైతే ద్రౌపది తలుపు తీసింది.

ఎదురుగా మధు.

ఒక్క పరుగుతో వెళ్ళి కౌగలించుకున్నాను.

"ఎంత మిస్ అయ్యానో తెలుసా నేను.” అంటూ

నేను అలా చెయ్యడం మధు కు నచ్చినట్లు లేదు.

"ఉండు. వదులు , ప్రయాణం చేసి మురికి గా ఉన్నాను" అంటూ వదిలించుకోబోయాడు వినకుండా అతని భుజం నా రెండు చేతులతో పట్టుకుని వేళ్ళాడుతూ,

"ఏం పర్లేదు, నాకు నువ్వు ఎలా ఉన్నా ఇష్టమే" అంటూ పైకెళ్ళ బోతూ

"అయ్యగారికి తినడానికి ఏమైనా తీసుకురావే" అని ద్రౌపది తో చెప్పాను.

దోసెలు వేసింది. పాయసం కూడా తెచ్చింది.

మధు పక్కనే కూర్చుని అతని భుజం మీద తలపెట్టుకుని కబుర్లు చెపుతున్నాను. ద్రౌపది మా రూమ్ లో కి రాబోయే ముందు తలుపు తట్టింది. అయినా నేను సర్దుకోకుండా అలానే మధుకు అతి దగ్గరగా కూర్చుని మాట్లాడుతున్నాను.

ద్రౌపదిని చూసి మధు అసౌకర్యంగా కదిలాడు. దాని మొహంలోకి చూశాను. ఖాళీ తెల్ల కాగితం లా ఉంది. మొహం లో ఏ భావమూ లేదు. ' నా ప్రవర్తన తప్పు' అంది గంభీరంగా ఉన్న దాని మొహం. నాకు చెంప మీద కొట్టినట్లయింది.


నేను రోజూ నా ప్రోగ్రాములకు, బ్యూటీ సెలూన్లకు, షాపింగులకు తిరగడానికి వేరే కారు కొన్నాడు మధు.
ఎవరో ఒక కుర్రాణ్ణి డ్రైవర్ గా పనిలో పెట్టాడు నెమ్మదస్తుడు. పనులు చెయ్యడం, తలూపడం తప్ప అతను మాట్లాడతుండగా నేను వినలేదు. పొద్దున్నే వచ్చి కూరగాయల మార్కెట్ కు వెళ్ళే వాడు. వచ్చే టపుడు ఒక పెద్ద స్టీల్ బాటిల్ లో నాలుగు కొబ్బరిబొండాలు కొట్టించి నింపుకుని తెచ్చేవాడు. నా సౌందర్య పోషక చిట్కాల్లో కొబ్బరి నీళ్ళు తాగడం ఒకటి.

తర్వాత నేను బాడ్మింటన్ ఆడటానికి వెళ్తాను. కొద్దిగా బరువు పెరిగినా నాకు నచ్చదు. నా అందం పట్ల నాకెంతో శ్రద్ధ.
ఎప్పుడు చూసినా చిన్న పిల్లలానే ఉంటావు, నీకు వయసెక్కదు అని తోటి వాళ్ళు అంటుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నాతో పాటు కాలేజీలో చదువుకున్న నా క్లాస్ మేట్స్, ముసలమ్మల్లాగా కనిపిస్తుంటే జాలిపడే దాన్ని.

ఒక రోజు మిసెస్ మనోహర్ తో మాట్లాడుతూ, మొబైల్ తీసుకుని బాల్కనీ లోకి నడిచాను. కిందికి చూస్తూ మాట్లాడుతున్నాను. ద్రౌపది ఇడ్లీ ఉన్న ప్లేటు డ్రైవర్ కు ఇడ్లీ ప్లేటు ఇచ్చి మంచి నీళ్ళు ఉన్న గ్లాసు ఎక్కడ పెట్టాలో తెలియక అటూ ఇటూ చూసింది. కారు పైన పెట్టింది.

ఏదో అన్నాడు . ద్రౌపది మొహంలో చిరునవ్వు.

లోపలికి వెళ్ళింది.


కొంత సేపటికి మళ్ళీ వచ్చి, కాఫీ గ్లాసు ఇచ్చింది. ఇడ్లీ ప్లేటు కోసమనుకుంటాను అక్కడే నిలబడింది. ఏదో మాట్లాడుతున్నాడు డ్రైవర్. అతనితో మాట్లాడుతుండగా ఎవరైనా చూస్తారేమోనని అటూ ఇటూ చూస్తోంది గానీ, పైనుండి నేను చూస్తున్నానని గమనించుకోలేదు.

మాట్లాడుతున్న ఫోన్ కాల్ కట్ చేసి రెండు నిముషాల్లో కిందకు వెళ్ళి హాల్లో కూర్చుని పేపర్ అడ్డం పెట్టుకున్నాను చదువుతున్నట్లు నటిస్తూ.

ద్రౌపది లోపలికొస్తూ ఉంది.

మొహం గంభీరంగానే ఉంది కానీ పెదవుల చివర ఇందాకటి చిరునవ్వు తుడుచుకోవడం మర్చి పోయినట్లు ఉంది.


రోజూ ఆ టైముకి నేను బాల్కనిలో నిల్చునే దాన్ని వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూడటానికి. ఈ మధ్య చాలా సార్లు గమనించాను. డ్రైవర్ ఎప్పుడూ ద్రౌపది తో మాట్లాడటానికి ప్రయత్నించడం. ఎప్పుడూ లేనిది ద్రౌపది మొహం లో నవ్వులు కనిపించడం. ఏవిటి దీనికి వాడితో సరసాలు. పని పిల్లకు ఈ వ్యవహారాలేమిటీ?

వళ్ళంతా కంపరంగా ఉంది.

ఏమైనా అందామంటే అదెళ్ళిపోతే నాకు జరగదు. మళ్ళీ ఇంకో కొత్త పిల్ల దొరకాలంటే ఎంతో కష్టం. ఒకవేళ దొరికినా ద్రౌపదిలాగా బాగా పని చేసే.. ఎందుకో మనసులో కూడా దాన్ని పొగడబుద్ధి కాలేదు.
దానికి తోడు ఈ మధ్య అది ఏ పని చేసినా నాకు అన్నీ లోపాలే కనిపిస్తున్నాయి కూడాను.

ఒకరోజు తలంటుకుంది. ఎంత చక్కటి జుట్టు , మెరిసిపోతుంది. నా జుట్టు కన్నా పొడుగు?

కుంకుళ్ళు లేకండానే ఎలా తలంటుకున్నావే అత్త అడుగుతోంది.

"టామీ కు వాడే షాంపూ తో చేశానమ్మ గారూ.”

నా అందం కోసం నెలకు ఎంత ఖర్చు పెడతానో ఆలోచించాను. బహుశా దాని ఆర్నెల్ల జీతంఆ చక్కటి జుట్టు, ఆ మెరుపు...

కుక్క షాంపూ వాడిందట. కుక్క షాంపూ!

మళ్ళీ దెబ్బ కొట్టింది.  

to be continued

19 comments:

కృష్ణప్రియ చెప్పారు...

హ్మ్.. తర్వాతేమైంది?

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

ఊ.. తర్వాత ?

(చాన్నాళ్ళకి మళ్ళీ సీరియస్ సబ్జెక్ట్ ఎన్నుకున్నట్లున్నారు కదా, బాగుంది. ద్రౌపది నచ్చేస్తుంది అనిపిస్తుంది)

రాజ్ కుమార్ చెప్పారు...

మధ్యలో ఆపేశారా? వై?
రాణి గారి కష్టాలు హెవీగా ఉన్నాయ్. ;) ;)
"చిరునవ్వుని తుడిచెయ్యటం" అనే పదప్రయోగం నాకు బాగా నచ్చిందండీ.

తరువాయి భాగం కోసం వెయిటింగ్స్ సేస్తా ఉన్యా.. ;)

మధురవాణి చెప్పారు...

తర్వాతేంటో తొందరగా చెప్పెయ్యండీ.. ఈ ఈ.. :)

మధురవాణి చెప్పారు...

అన్నట్టు.. నాకు టైటిల్ చాలా నచ్చేసింది..

జ్యోతిర్మయి చెప్పారు...

శైలజగారూ ఇదేమైనా న్యాయంగా ఉందా..నడి వేసవిలో స్నానానికి నీళ్ళు తోడుకుని బట్టలు తెచ్చుకునేలోగా బకెట్ మయమయినట్లుగా ఉంది. ఇకనుండీ మన ఆటలో 'to be continued' ల్లేవ్ అంతే...

ఆ.సౌమ్య చెప్పారు...

Interesting...waiting for the next part!

రాజ్ కుమార్ చెప్పారు...

నా కమెంట్ ఎక్కడకి పోయిందండీ? వాఆఆఆ...వాఆఆఅ

Sravya Vattikuti చెప్పారు...

హ్మ్ !

అజ్ఞాత చెప్పారు...

రెండుసార్లు కొట్టించుకున్నారు ఆ మూడో దెబ్బ కూడా తినేస్తే పోయేదిగా .( మధ్యలో ఆపేసారని అసహనం -అర్ధం చేసుకోండి)
' చిరునవ్వును తుడుచుకోవటం మర్చిపోయింది ' భలే వుందండీ ఈ వాక్యం

Chandu S చెప్పారు...

కృష్ణ ప్రియ గారూ,
చదివినందుకు ధన్యవాదాలు. తర్వాతేమయ్యిందో రేపు

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ,

ద్రౌపది నచ్చేస్తుందా? ఆహా..సరే తప్పు లేదు లెండి. అది సహజం.
చదివినందుకు ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

రాజ్ కుమార్, నాకూ అదే అనిపిస్తుంది ఆ కష్టాలు పగవాడిక్కూడా వద్దు అని.
Thanks

Chandu S చెప్పారు...

మధురవాణి గారూ, ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

Soumya,
Thanks

Chandu S చెప్పారు...

అబ్బబ్బబ్బ, పోలిక బ్రహ్మాండం జ్యోతిర్మయి గారూ,

Chandu S చెప్పారు...

ప్రచురించడం కొంచం లేటయ్యింది బాబూ, ఇంతలోనే ఏవిటా కంగారూ....

Chandu S చెప్పారు...

Sraavya,
thank you

Chandu S చెప్పారు...

లలిత గారూ,
చదివినందుకు ధన్యవాదాలు.
నేను తినే దెబ్బలకు లలిత గారికి తొందరేవిటో!
అందరూ గమనించారా?

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి