16, ఫిబ్రవరి 2012, గురువారం

ఓం నమశ్శివాయ
ఒక టెలివిజన్ చానెల్ లో ప్రోగ్రామింగ్ పనులు చూసుకుంటూ ఉంటాను. ఓ పెద్దాయన విజయ గాధ టెలికాస్ట్ చెయ్యాలి , సందర్భానికి తగ్గట్టు కొన్ని సినిమా పాటలతో కలిపి.

భార్య గురించి ఆయన చెప్పినప్పుడు ఏ పాట వినిపించాలో..., సరైన పాటే దొరకడం లేదు. సరే ఒక సారి ఆయనేం చెప్పాడో వింటే, ఆయన మాటల్లో ఏదైనా క్లూ అందుకుని ఏదో ఒక పాటెయ్యొచ్చు అని వీడియో చూస్తున్నాను.

" నా భార్య వల్లే నా కుటుంబం నిలబడింది. ఆమె కష్టపడి ఈ సంసారన్నంతా ఈదుకొచ్చింది.  కుటుంబం కోసం కోసం తను కొవ్వొత్తిగా మారి జ్యోతిలా కాలిపోయింది. అంతే కాదు నన్నో మనిషి ని చేసింది. నేను ఆమెను ఎన్నో కష్టాలు పెట్టాను. పట్టించుకునే వాణ్ణి కాదు. అప్పడు నాకూ తెలియదు భార్యనెలా చూసుకోవాలో, చిన్నతనం. నా తప్పులకు , ఆ పరమశివుడు క్షమిస్తే అంతే చాలు. ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ!"

ఆయన మాటలు విన్న తర్వాత చిన్నప్పటి ఒక ఫైలు తెరుచుకుంది.


నేను ఆరేడేళ్ళ వయసప్పుడు, నేను మా అమ్మ తో వేలాడుతూ ఉండే వాణ్ణి. బడి కెళ్తే ఆరోగ్యం పాడవుతోందని ఎక్కువగా పంపించేది కాదు. నోట్లో వేలు వేసుకుని, అమ్మ భుజం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుని ఏదో ధ్యానంలో ఉండేవాణ్ణి.

మా పక్కింటి మేడలో పిన్ని వాళ్ళు వుండే వాళ్ళు. పిన్ని అంటే అమ్మ చెల్లెలు కాదు. ఆంటీ పాపులర్ అవక ముందు కాలం లో 'పిన్ని'. పిన్ని వాళ్ళాయన ఏం చేస్తాడో తెలియదు. అతని గురించి పిన్ని చెబుతుంటే వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. వాళ్ళాయన బయటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ దగ్గర కూర్చునేది.
అమ్మ పేరు పావని. లోక పావని.  పిన్ని చెప్తుంటే అమ్మతో బాటు నేనూ వినే వాణ్ణి.


"పెళ్ళైన కొత్తలో ఓ సారి హోటల్ కెళ్ళి భోజనం చేద్దామా అని అడిగానండి. ఒక చీకటి హోటల్ కు తీసుకెళ్ళాడు. ఒకటే ఫినాయిల్ వాసన. నేను తప్ప ఇంకొక్క ఆడది లేదు. కొంచం దూరం లో ఒక్కో టేబిల్ చూట్టూ నలుగురైదుగురు మొగవాళ్ళు. ఇదేంటీ ఇలా ఉందీ అన్నాను. హోటల్ అంటావు తెస్తే ఇదేంటి ఇలా అంటావు. నీతో ఏదైనా తప్పే. మొగుడు వెధవకు ఎలా చుక్కలు చూపించాలా అని కంకణం కట్టుకున్నావు అని నాతో మాట్లాడకుండా కూర్చున్నాడు.

ఆర్డర్ తీసుకోడానికి హోటల్ మనిషి వచ్చి నుంచున్నాడు. చెప్పు ఏం కావాలో చెప్పు హోటల్ కెళ్దామంది నువ్వేగా అని అన్నాడు. చెప్పు చెప్పు అని విసిగిస్తుంటే బిరియానీ చెప్పాను. బిరియానీ తీసుకొచ్చిన తర్వాత రెండు ప్లేట్లు పెట్టబోతే నాకొద్దు, నాకాకాలి లేదంటాడు. అంతా ఆమెకు పెట్టు అని ఒక్క ప్లేట్ లో బిరియానీ అంతా పెట్టించి తిను తిను అని హోటల్ కుర్రాడి ముందే బలవంతం చేస్తాడు. ఏడుపొచ్చి తినబుద్ధి కాలేదు. నాకొద్దు అన్నాను. హోటల్ కెళ్దామంటావు, తెప్పిస్తే వొద్దంటావు.'అంటాడు”


ఓ రోజు మా అమ్మ దగ్గరకెళ్తానన్నాను. ఆ మాట అన్నప్పటినుండీ మొదలెట్టాడు మౌనం. ఇష్టం లేదని నోటితో చెప్పడు. ఏదయితే అదవుతుంది లెమ్మని రిక్షా పిలిపించుకున్నా. ఆయన ఆఫీసు రూమ్ లో కెళ్ళి వెళ్తానని చెప్తే, నాతో మాట్లాడకుండా అటెండర్ ని పిలిచి రిక్షా వాణ్ణి పిలవమన్నాడు. వాడొచ్చి నిల్చుంటే జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు, చూసే వాళ్ళకు ఈయనకు భార్య మీద ఎంత శ్రద్ధ అనిపిస్తుంది. ఎవరికి తెలుసు అలా చేసేది నన్నేడిపించడానికేనని.

ఎందుకండీ ఆ రిక్షావాడితో చెప్తారు, అంటే

సరే,  జాగ్రత్త చెప్పడం కూడా తప్పేనా, ఇక అన్నీ తప్పే అంటే ఎలా చచ్చేది. అంటాడు.స్నేహితుల భార్యలకు ఏవిటో కానుకలు తీసుకెళ్ళమని పురమాయిస్తాడు. ఆడవాళ్ళ వంక పిచ్చిగా చూస్తాడు. ఖర్మ గాలి ఎందుకలా పిచ్చి చూపులు చూస్తావు అని అన్నానా, ఇంక చంపి శ్రాద్ధం పెడతాడు. అదుగదుగో నీకు అనుమానం జబ్బు అని.

ఒక సారైతే నా స్నేహితురాలింటికి తనొక్కడే నాతో చెప్పకుండా వెళ్ళాడు. అదో సిగ్గుమాలింది. మీ ఆయన మా ఇంటికొచ్చాడు. ఏవీ జరగలేదులే కంగారు పడకు అని ఫోన్ చేసింది.

ఈయన్ని నిలదీస్తే, నీ బొంద నీ ఏడుపుకు తగ్గట్టే, వాళ్ళ మేనత్త దెయ్యంలా అక్కడే చచ్చింది. అంటాడు

నాతో చెప్పకుండా ఎందుకెళ్ళావూ..అని అడిగితే,

నీకిష్టం ఉండదు గదా అని చెప్పలేదంటాడు.


ఒకసారి అతనితో కూర్చుని మాట్లాడకూడదూ.

మాట్లాడుకుందామంటే, నాకు కొద్దిగా టైము కావాలి అంటాడు పావనీ.

ఎప్పుడో నేనే మొదలు బెట్టానా, ఆ సమయం చూసి, ఉదయం అయితే తెల్లారిందా గొడవకు, మధ్యాహ్నం అయితే మిట్ట మధ్యాహ్నం ఏవిటీ రభస, సాయంత్రమైతే చల్లటి పూట ఏవీ లేని దానికి, పచ్చటి ఇంట్లో ఏడవాలా, రాత్రి అయితే మొగుణ్ణి నిద్ర కూడా పోనివ్వవా అని తప్పించుకుంటాడు. మా ఇద్దరికీ సామరస్యం లేదని నేను వెంటబడటమే పావనీ, అతనికి మాత్రం ఈ పిల్లీ ఎలకా ఆటే ఇష్టం.ఎప్పుడైనా నీ స్నేహితులతో చెప్తాను అంటే, అయినా వాడెవడే నాకు పాఠాలు చెప్పడానికీ, మార్కులెయ్యడానికి అందరూ గురివింద గాళ్ళు, ఊళ్ళో కాపురాలు పెద్దమనిషిలా నేను చక్కదిద్దుతుంటే, వాళ్ళొచ్చి నాకు చెప్పేదేవిటీ? నేనేమన్నా పసిపిల్లాణ్ణా, నాకు తెలీదూ మంచీ చెడూ ..నీ గురించి నేనూ చెప్తానంటాడు.

"ఏవిటి చెప్తాడూ?”

" నాకు అనుమానం జబ్బనీ, నేను హింసిస్తున్నానీ, సాధిస్తున్నాననీ. ఆయన స్నేహితులు ఆయన మాటలు వింటారుగానీ నా మాటవింటారా. . .. ఏవిటో పావనీ ..పిచ్చెక్కిపోతుందీ!”

"పోనీ మీ అన్నకు చెప్పకపోయావా?”

"నేను చెప్పకముందే ఇతనే మా అన్నకు చెప్పాడు, నీ చెల్లెలికి పిచ్చి , అనుమానపు పిచ్చితో చంపుతుందనీ.”

"నీకతనిపై అనుమానమా జ్యోతీ?”

"అనుమానమూ లేదు, నమ్మకమూ లేదు. నాకేం తెలుసు అతని గురించి . ఏమో ఎటువంటివాడో.. “

"మరి మీ అన్న ఏమన్నాడు..”

"ఏమంటాడు, పిచ్చి మాత్రలేసుకో అన్నాడు.”

"నీకు పిచ్చేంటీ?”

"అదే నేనూ అన్నాను, నాకు పిచ్చి లేదన్నయ్యా" అంటే

"పిచ్చివాళ్ళు అట్లానే అంటారమ్మా. మందులేసుకో అని గట్టిగా చెప్పి వెళ్ళాడు. అంత నమ్మించగలడు.”


"స్నేహితుల్లో సగం మందికి చిన్నిళ్ళు ఉన్నాయి. వాళ్ళంటే ఎంత ఆరాధనో! వాళ్ళ కాపురాల్లో ఏ కష్టమొచ్చినా ఇతనే ముందుంటాడు.ఏ చిన్న గొడవొచ్చినా ఆ చిన్న భార్యకు అండగా నిలబడతాడు.

మొన్న మా తమ్ముడి పెళ్ళి పిలుపులకు మొట్టమొదట ఆవిడింటికే తీసుకెళ్ళాడు. మీకే మొదటి పిలుపు, వి ఐ పి లను ముందు కవర్ జేస్తున్నామని ఆవిణ్ణి మునగచెట్టెక్కిస్తున్నాడు. ఇద్దరి మాటలూ చూస్తే చాలా పరిచయమున్నట్టే అనిపించింది. కూల్ డ్రింక్ గ్లాసు ఇతని చేతుల్లో పెట్టి ఏవిటో గారాబాలు చేసింది.

ఏవిటి మీ ఇద్దరి గోల అంటే.. ఛీ, తోటి ఆడవాళ్ళను గౌరవించడం నేర్చుకో... ఆవిడ గురించి తప్పుగా మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది. సరే కానీ అంతా నా దురదృష్టం. అపార్ధం చేసుకునే పెళ్ళాం దొరకడం..ప్చ్ ఆడవాళ్ళందరూ మొగుళ్ళను నెత్తిన బెట్టుకు చూస్తున్నారునువ్వూ వున్నావు, మొగుణ్ణి ఎలా సాధించుకు తిందామా, వీణ్ణి ఎలా వేపుకు తిందామన్న ఆలోచనే. అంటాడండీ.”ఆ మధ్య నా చిన్న నాటి స్నేహితురాలు వచ్చిందండీ . అదెందుకో వెళ్ళపోకుండా ఈయనతో మా బెడ్ రూమ్ లో కూర్చుని ఇకఇకలు పకపకలు. నేను వీళ్ళిద్దరికీ పకోడీలు వండి, తీసుకెళ్ళి ఇస్తే కనీసం వాళ్ళతో కూర్చోమని మాటవరసకైనా అనలేదండీ.

దాంతో మీకేవిటి అంత నవ్వులూ.. అంటే

ఎంత ఛండాలంగా ఆలోచిస్తావే ఛీ ఛీ ఏమీ లేని చోట ఏదో అనుమానం పెట్టుకుంటావే, పెళ్ళాలు అనుమాన పడతారుగానీ అమ్మో అమ్మో మరీ ఇంత అసహ్యంగానా?

అది కాదండీ, నేను మీమీద అనుమానపడలేదు..

వొద్దు వొద్దు ఇంకేం చెప్పొద్దు. ఓం నమశ్శివాయ, ఓం నమశ్శివాయ."అంటూ ధ్యానం లోకి వెళ్ళి పోతాడండీ.


ఆ రోజు ఉదయం చాలా పెద్దగా పిన్నిగారింట్లో టీవీలు వినిపిస్తున్నాయి. ఏవిటంత సౌండ్ అని అమ్మా నేను వెళ్ళి హాల్లో పెద్దగా అరుస్తున్న టివి కట్టేసి పైకెళ్తే, పైన బెడ్ రూమ్ లో నేల మీద కూర్చుని ఎర్రటి కళ్ళతో, పిన్ని అయోమయంగా చూస్తూ ఉంది. పిన్నికి రెండువేపులా నీళ్ళు, అడుగుల తడి ముద్రలు.

"ఏవయింది?"అడిగింది అమ్మ.

" గుడినుండి వచ్చిన తర్వాత కూర్చుని వుంటే ఎప్పుడో నిద్ర పట్టింది. కిందే పడుకున్నాను. నేను నిద్రపోతున్నానని కోపం పావనీ. స్నానం చేసి తుడుచుకోకుండా ఒట్టి టవలు కట్టుకుని అటో కాలు ఇటో కాలూ వేస్తూ నామీదగా నడిచి పోయాడు. నన్ను లేపడానికి ఆ టీవి ల సౌండ్.”


టివి కట్టేసిన తర్వాత పూజ గదిలోనుండి స్పష్టంగా వినిపిస్తోంది.

ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ!


అమ్మో లేటయిపోతుంది. ఇంతకీ ఏం పాట వెయ్యాలి ఓం నమశ్శివాయా?

భార్య గురించి అరిగిపోయిన పాట ఒకటుందిగా అదేస్తే సరి.

'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ...ఇల్లాలే..'

ఓం నమశ్శివాయ.

16 comments:

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

‌^O
దీనికర్ధం ఏంటా అని అలా ఆశ్చర్యంగా చూడకండి ఏం చెప్పాలో అర్ధంకాక బుర్రగోక్కుంటున్నా అనమాట...

వనజవనమాలి చెప్పారు...

మంచి కథ. కథ లాంటి నిజం. చాలా మంది అంతే! ఇలాటి వాళ్ళు ఉంటారు,నేను చూసాను. చేసేది శివ పూజలు.. ................................................

అజ్ఞాత చెప్పారు...

ఫ్రేం లోపలి అసలు కథ ఏడిపించింది.

జ్యోతిర్మయి చెప్పారు...

పిన్ని వాళ్ళాయన పర్వర్టేడ్ జీనియస్. ఇలాంటి కేసులను మన రమణగారు డీల్ చెయ్యవలసినదే...మనం చెప్పడానికి ఏం లేదు. శైలజ గారూ ఈ పిల్ షుగర్ కోటెడ్ కాకపోయినా పనిచేసింది.

మధురవాణి చెప్పారు...

మీరు లోకంలో కంటికి ఎదురుపడే ప్రతి మనిషినీ చదువుతూ ఉంటారాండీ డాక్టరమ్మ గారూ? వెళ్ళి చూసొచ్చినట్టే రాస్తారసలు.. :)

KumarN చెప్పారు...

కథలేమో కానీ, ఓ పాయింట్/పర్సనాలిటీ గురించి చెప్పాలనుకున్నప్పుడు, వాటికి మీరు పట్టుకొచ్చే ఎక్జాంపుల్స్ ఈ స్టోరీ లోనే కాదూ, ఇంతకు ముందు వాటిల్లో కూడా, ఆథెంటిక్ గా ఉంటున్నాయి. పైన రెస్టారెంట్ & పుట్టిల్లు-రిక్షా ఎక్జాంపుల్ సూపర్ అసలు. ఆ రెండింటితో కారక్టర్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది.

Ready for prime-time?!! You can probably start sending it to reputed magazines out there, if you haven't already done so!

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ,
Thank you

Chandu S చెప్పారు...

వనజ వనమాలి గారూ,
welcome to my blog.
చదివినందుకు, కామెంటుకు సంతోషం . ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

పురాణపండ ఫణి గారూ,

ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

జ్యోతిర్మయి గారూ,

ఈ మధ్యన షుగర్ కోటింగ్ వెయ్యడం లేదు. అయినా తీసుకున్నందుకు

ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

మధుర వాణిగారూ,

అబ్బే మనుషుల్ని చదవడమా? అంత నేర్పు లేదు.....'డాక్టరమ్మ' ఇదిగో ఈ మాట మర్చిపోదామనే బ్లాగు.

ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

కుమార్ ఎన్ గారూ,

ప్రొఫెషన్ లో pressure తగ్గడానికి పనికొస్తోందని blog రాయడమే. ఈ write ups పత్రికలకు పంపడమా, అంత రేటింగ్ ఇచ్చుకోలేనండీ.
But your comment made me happy. Thank you.

Zilebi చెప్పారు...

సస్పెన్స్ 'చందూర్' గారు,

ఒక్క ముక్కా అర్థం కాలేదండీ !

ఓం నమః శివాయ !

జిలేబి.

Chandu S చెప్పారు...

జిలేబి గారికే అర్ధం కాకుండా కథ రాయగలిగానా? ఇంత టేలెంట్ ఉందని అనుకోలేదు సుమీ.

రాజ్ కుమార్ చెప్పారు...

నవ్వ కూడని పోస్ట్ ... కానీ..

ఏమంటాడు, పిచ్చి మాత్రలేసుకో అన్నాడు.”

"నీకు పిచ్చేంటీ?”

"అదే నేనూ అన్నాను, నాకు పిచ్చి లేదన్నయ్యా" అంటే

"పిచ్చివాళ్ళు అట్లానే అంటారమ్మా. మందులేసుకో అని గట్టిగా చెప్పి వెళ్ళాడు>>>

ఇక్కడ నవ్వేశాను..

మిగిలిన పోస్ట్ కి నా రెస్ప్పాన్స్ ఏమిటంటే... వేణూజీ పక్కన ఏం చెప్పాలో తెలియక ఇంకొకడు బుర్ర గోక్కుంటూ కూర్చున్నాడు చూశారా? ఆ.. అది నేనే..

ఆ.సౌమ్య చెప్పారు...

హ్మ్ హ్మ్ హ్మ్....ఉన్నారండీ ఇలాంటివాళ్ళు...నేనూ చూసాను. వాళ్ళని వదిలిపోక అక్కడే పడి ఏడుస్తున్న ఆడవాళ్లకి ఎప్పుడు జ్ఞానం వస్తుందో!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి