10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

రాణీ- పేద-1
continued from రాణీ- పేద


మధు ఉళ్ళో లేడు. నాకు బాగా విచారంగా ఉంది. నేను కిట్టీ పార్టీ కెళ్ళాలి. సింబాలిక్ గా ఉంటుందని నల్లని చీర కట్టుకున్నాను. రూపాయంత నల్లని బొట్టు. సన్నగా తీర్చినట్లున్న కనుబొమలు. జుట్టు అల్లకుండా వదిలేశాను. రాత్రంతా మధు గురించి ఆలోచించి ఓ మంచి కవిత రాశాను.

నేను బయలు దేరబోతూ, ద్రౌపదిని పిలిచాను. పార్టీలో అవీ ఇవీ అందించడానికి, పిల్లల్ని అల్లరి చెయ్యకుండా ఆడించడానికి పనికొస్తుందని. లంగా వోణీ వేసుకుని వచ్చింది. పొద్దున్న చూసిన అందమైన జుట్టు అల్లుకుని వాలుజడ వేసుకుంది.

నన్ను చూసి కళ్ళు ఎర్రగా ఉన్నాయేం అన్నారంతా.

నిద్ర లేదన్నాను.

"మీ ఆయన ఊళ్ళో లేడుగా, ఇంక నిద్ర పోలేదంటే ఏమిటో అర్ధం?” ఎవరో అన్నారు.


నేను రాసుకొచ్చిన పేజీన్నర విరహ గీతం చదువుతున్నాను.


ప్రేమ జలపాతమై

ఒక నదీ ప్రవాహమై

విరహమే సముద్రమైన ఈ వేళ

అడ్డు గోడలూ ఆనకట్టలేల'

'అనుభూతులు అనంతం...'ఏ వొడ్డు తాకినా తప్పు లేదు, ఇది జీవితం.' వారిజ పూర్తి చేసింది. అందరూ నవ్వారు.


మా అందరికి కూల్ డ్రింక్స్ ఇస్తూ తిరుగుతున్న ద్రౌపది గురించి అడిగారు అందరూ.

అంత చక్కగా ఉందే ఆ పిల్ల.

ఎంత కుదురుగా ఉంది.

మీతో బాటు జిమ్ కెళ్తుందా ఏమిటీ? అడిగారు.

ఒళ్ళొంచి పనిచేస్తే ఎవరైనా అంత చక్కగానే ఉంటారు.

నిశ్శబ్దంగా పనులు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది.

నా అదృష్టం గురించి పొగిడారు

ఏమదృష్టమో, ఇంత చక్కని పనిపిల్ల ఉంటే అపశకునం తల్లీ ,కొంపకంత మంచిది కాదు.

మా ఇంట్లో పని చెయ్యాలంటే, ఇంటర్యూ చేసే తీసుకుంటాను

ఏమిటో అర్హతలు

యాభై ఏళ్ళ పైబడి ఉండాలి, తెల్ల జుట్టు, ఎత్తుపళ్ళు, మెల్లకన్ను, ప్రత్యేక అర్హతలు

తలా ఒక తలకు మాసిన జోకు చెప్తున్నారు.

పెళ్ళికాని ఆ అమ్మాయి వినకూడని, వినలేని మాటలతో హోరెత్తిస్తున్నారు.

ద్రౌపది మొహంలో ఏమీ లేదు. అసలా విషయాలు చెవికెక్కనంత మామూలుగా పని చేస్తుంది. మేమందరం కబుర్లాడుకుంటుంటే అక్కణ్ణుంచి వెళ్ళి పోయింది.

ఎందుకో మొదటి సారి నాక్కూడా వాళ్ళందరి మధ్యా ఊపిరాడక, కొంత సేపటికి బయటకు వచ్చాను.

బయట వెన్నెల. గార్డెన్ లో మెర్క్యురీ దీపాల వెలుగు. పచ్చిక లో నడుస్తూ గేటు వరకూ వచ్చాను. ఏవో మాటలు వినిపించి ఆగిపోయాను.

ఎవరో బతిమాలుతున్నారు. ఏదో ఒప్పుకోమంటున్నారు. మా డ్రైవరేనా?

ఇంకో రెండడుగులు ముందుకేస్తే వాళ్ళెవరో చూడొచ్చు కానీ, నన్ను చూసి మాటలు, ఆపేస్తారని, పూర్తిగా విందామన్న ఉద్దేశ్యంతో అక్కడే నిల్చున్నాను.

"వొద్దు, మా అన్నకిస్టం ఉండదు." ద్రౌపది గొంతు వినిపించి ఒక అడుగు ముందుకేశాను.

డ్రైవర్, ద్రౌపది చేతులు పట్టుకుని అంటున్నాడు. " బాగా చూసుకుంటాను"

నన్ను చూడగానే దాని చేతులు వదిలేశాడు.

ద్రౌపదిలో ఏవీ తడబాటు లేదు.

కంగారు పడుతుందనీ, తప్పయిందని ప్రాధేయపడుతుందనీ, అప్పుడు నేనేమనాలో కొన్ని మాటలు తయారుగా ఉంచుకున్నాను. ఏమీ జరగనట్లు మామూలుగా లోపలికి వెళ్ళి పోయింది.

నిశ్చింతగా ఉన్న ద్రౌపది ప్రవర్తన నన్ను, నా స్నేహితురాళ్ళనీ ప్రశ్నిస్తున్నట్లుగా తోచింది. ఏవిటీ దీని బడాయి?

ఏదో ఒకటి చెయ్యాలి. దీని పొగరు దించాలి. రాత్రంతా కలత నిద్రతో మెసులుతూ ఉన్నాను.

తర్వాతి రోజు ఉదయం ఆఫీసుకెళ్ళబోతున్నాడు మధు.

నైటీ తోనే ఉన్నాను.

ద్రౌపది బూట్లు తెచ్చి అతని దగ్గర పెట్టింది. షూ లేసులు కట్టుకుంటూ ఉండగా నేను వచ్చి అతను కూర్చున్న సోఫా అంచున కూర్చున్నాను. ద్రౌపది అక్కణ్ణుండి వెళ్ళి పోగానే

"ఏమిటీ ఇంత పొద్దున్నే లేచావు?” అడిగాడు

"ఏం లేదు...”

"ఏదో ఉంది. చెప్పు ఏం కావాలి?”

"ఎందుకూ, ఏమిటీ అని అడగనంటే చెప్తా!”

"ఊఁ..”

"డ్రైవర్ ని తీసెయ్యి"

"ఏమైనా తప్పుగా బిహేవ్ చేశాడా?”

"ఏదైనా చేస్తే నేనే వెళ్ళ గొట్టేదాన్నిగా!”

"మరి ఎందుకూ?”

"ఎందుకని అడగొద్దని చెప్పాగా.”

"డ్రైవర్ లేకుండా ఎలా నీకు? బయటకెలా వెళ్తావ్?”

"డ్రైవింగ్ వచ్చుగా, కారు నేనే తీసుకెళ్తా!”

"ఇబ్బంది పడతావేమో ఆలోచించు.”

" ఆలోచించాను. పర్లేదు"

హఠాత్తుగా తీసేస్తే బాగోదు. ఆఫీసు దగ్గర పెట్టుకుంటాలే!" మధు.తర్వాత రోజు ఉదయం బాల్కనీ లో నిల్చున్నాను. ద్రౌపది ఉప్మా ప్లేటు, మంచి నీళ్ళ గ్లాసు తీసుకుని కారు దగ్గరకెళ్ళింది. డ్రైవర్ కనపడక అటూ ఇటూ చూసింది.

తర్వాత లోపలికెళ్ళిపోయింది. నా దగ్గరకొచ్చి విషయం కనుక్కుంటుందేమోనని, అది హాల్లో పని చేస్తుంటే నేను కూడా అక్కడక్కడే తిరిగాను. ఎంత సేపు ఎదురు చూసినా తన పని చేసుకుంటుందే కానీ డ్రైవర్ రాని విషయం నాతో చెప్ప లేదు. నేనూ అడగ లేదు.

నాకిప్పుడు ద్రౌపది ఎలా స్పందిస్తుందో చూడటం ఒక పెద్దపని అయ్యింది.

ఏదో దిగులు పడి చచ్చి పోతుంది అనుకుంటే ఏమీ లేదు. చాలా మామూలుగా ఉంది. పని మీద , నా మీద అదే శ్రద్ధ.

ఒక టీవీ చానెల్ వాళ్ళ గేమ్ షో లో పాల్గొనేందుకు సెలెక్ట్ అయ్యాం. టీవీ చానెల్ వాళ్ళు మధుకు బాగా తెలిసిన వాళ్ళే. ఓ పదిహేను రోజుల నుండీ రిహార్సల్స్ చేస్తూనే ఉన్నాము. సినిమా క్విజ్, ఆటల రౌండ్, టేలంట్ రౌండ్, ప్రతి రౌండ్ మధ్యన, మేము డేన్సులు చెయ్యాలి.

గేమ్ షో షూటింగ్ ఎల్లుండే, అదీ మా ఇంట్లోనే. ఆ రోజే నేను నా చీర షాపింగ్ కు వెళ్ళాలి. ఉదయం లేచిన దగ్గర్నుండీ ఒకటే ఉత్సాహం. ఎంత స్నేహితులమైనా, అలాంటి సందర్భానికి వచ్చేసరికి ఒకళ్ళ మీద ఒకరికి అంతులేని పోటీ. ఎలాంటి అకేషన్ అయినా నా చీరే పై చేయిగా ఉంటుంది. నా డ్రెస్ సెన్స్ అలాంటిది. మా వూళ్ళో ఉన్న ఒక షోరూమ్ లో లేటెస్ట్ డిజైన్స్ దొరుకుతాయి. అక్కడ తప్ప నేనెక్కడా చీరలు కొనను.

బయట కెళ్ళబోతుంటే మధు ఫోన్ చేశాడు.

బీరువాలో ఉన్న డాక్యుమెంట్లు కావాలి, డ్రైవర్ ని పంపిస్తాను ఇచ్చి పంపమన్నాడు.

" షాపింగ్ కు వెళ్ళబోతున్నాను. నేనే నీ ఆఫీసుకొచ్చి ఆ పేపర్లేవో ఇచ్చి వెళ్తానని" చెప్పాను.

ఆఫీసు కెళ్తే, డ్రైవర్ కనిపించాడు. బరువు తగ్గాడు, గడ్డం పెరిగింది. ఇక ఎవరైనా శాలువా దానం చెయ్యడమే బాకీ !

ద్రౌపది వైపు తిరిగాను. దాని మొహం ఎప్పటిలానే ఏ భావమూ లేక నిర్లిప్తంగా ఉంది. దీని దుంప తెగా, దీనికి చీమ కుట్టినట్టైనా లేదే! ఎందుకో మూడ్ చెడి పోయి అకారణంగా వళ్ళు మండుకొచ్చింది.

"అమ్మగారూ, పండగ రోజులు, రద్దీగా ఉంటయి బజార్లు, డ్రైవర్ని రమ్మనేదా?” అంది ద్రౌపది.

ఒక్క సారిగా విరుచుకుపడ్డాను. “ బోడి సలహాలు ఇవ్వొద్దు" అంటూ.

చీరల షాపు కెళ్ళాను, ద్రౌపది ని తోడు తీసుకుని. షాపు వాడు ద్రౌపది ని చూసి చుట్టాలమ్మాయి అనుకున్నాడు.

"కూర్చోండి" అన్నాడు దాన్ని ఉద్దేశించి.

"కూర్చోవే" అన్నాను.

ద్రౌపదికి ఎలా వినిపించిందో కానీ, నాకు మాత్రం నేనన్నమాట "నాతో బాటే కూర్చుంటావా?" అన్నట్లుంది.

"పర్లేదమ్మగారూ" అని నిల్చునే ఉంది..

కాసేపటికి పోలీసు వచ్చాడు. షాపు ముందు పెట్టిన నాకారు ట్రాఫిక్ కు అడ్డమొస్తుంది తీయాలంటూ.

ఇదివరకంటే, డ్రైవర్ నన్ను షాపు దగ్గర దించి ఎక్కడో దూరంగా పార్క్ చేసుకునే వాడు. ఇప్పుడు ఎక్కడ పార్క్ చెయ్యాలి, అక్కణ్ణుంచి ఎలా నడిచి రావాలి అనుకుని షాపు బయటకు నడిచాను.

" తియ్యండమ్మా, ఎంత సేపు. " పోలీసు, మిగతా వాహనదారులు అడ్డంగా ఉన్న నా కారు చూసి చిరాకుగా అరుస్తుంటే గందర గోళంగా ఉంది.

విపరీతమైన విసుగుతో "పద వెళ్దాం" అని కారెక్కబోయాను.

"అమ్మా, మరి చీరలు" వచ్చిన బేరం పోతుందన్న కంగారులో ఉన్నాడు షాపు వాడు.

"ఇప్పుడొద్దు.” అని కార్లో కూర్చున్నాను.

ద్రౌపది షాపు యజమానితో ఏదో చెప్పి వచ్చి కార్లో కూర్చుంది.

"ఏవిటీ వాడితో మాట్లాడుతున్నావు" అని మండి పడ్డాను.

మనసంతా వికలమయ్యింది.

అత్త నేను దిగులుగా ఉన్న కారణం కనుక్కుంది.

అంతా విని " కొన్ని చీరలు ముందే కొనుక్కుని అట్టేపెట్టుకోరాదు, ఇలాంటి అవసరానికి పనికి వచ్చేవి" అంది

ఎప్పటి కప్పుడు ఫాషన్లు మారిపోతున్నాయే, ఎప్పుడో కొన్న చీర కడితే అంతకన్నా పరువు తక్కువ విషయం ఉంటుందా? ఏంటో ఎవరికి అర్ధమవుతుంది నా బాధ, నా పడవలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకు తప్ప.

ఇక ఎల్లుండి టివి షూటింగ్ కు పాత చీరే కట్టాలా? భగవంతుడా, ఏనాడూ ఇలా ఓడిపోలేదే? పోనీ ఏదో వంక చెప్పి మానేస్తే, అమ్మో గొడవలై పోతాయి. అందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

మధు ఏదో పొలిటికల్ టూర్ లో ఉన్నాడు. మిగతా కార్లు, డ్రైవర్లు అతనితోనే ఉన్నారు. ఎవరినైనా అడగొచ్చు కానీ నామోషీ అనిపించి ఊరుకున్నాను. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించక, బాల్కనీ లో సన్న జాజి తీగల పక్కన కుర్చీ వేసుకుని నేను అంత దీనమైన స్థితిలో ఉన్నది ఎవరివల్లో ఆలోచించి, దానికి కారణమైన ద్రౌపదిని, డ్రైవర్ ని మనసులో శాపనార్ధాలు పెడుతూ కూర్చున్నాను.

ఇంతలో గేట్ తీసిన చప్పుడైతే కిందకు చూశాను. చీరల షాపు అతను ఏదో బరువైన మూట పట్టుకుని వస్తున్నాడు.

"క్షమించండమ్మా, మీ పని పిల్ల చెప్పేవరకూ, నా మట్టి బుర్ర కు తట్టలేదు. ఇక నుండి చీరలు ఇంటికే తీసుకొచ్చి చూపిస్తాను.”

పంచవన్నెల పట్టు చీర తీసుకున్నాను. ఎంతో అందంగా ఉంది.

కానీ సంతోషం గా లేదేమిటి.

ద్రౌపది వంక చూశాను. ఎప్పటి లాగే.....నిల్చుంది. ఆపత్కాలంలో చీర సహాయం చేసిన కృష్ణుడిలా!

మళ్ళీ కొట్టింది!

ఆ రోజే షూటింగ్. ఏంకర్ కుర్రాడు భలే చలాకీగా ఉన్నాడు. ఎర్రగా, పొడుగ్గా, గలగలా మాట్లాడుతూ, మాకు భలే నచ్చాడు. ఆ అబ్బాయి మధుకు దూరపు చుట్టం అవుతాడు. ఆ కుర్రాడి గురించి మేము చెప్పుకున్న మాటలు సెన్సార్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా గుండె పోటు రావడం నాకు ఇష్టం లేదు.

నేను నిన్న సెలెక్ట్ చేసుకున్న చీర మీద స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని వంకీ పెట్టుకునే చోట ఒక పాము ఆకారం లో ఉన్న నగ పెట్టాను.అందరికీ చాలా నచ్చేసింది. వాళ్ళ కళ్ళలో కనిపిస్తున్న అసూయతో నా సంతోషం రెండింతలయింది

ఆటల్లో రౌండ్స్ కు మధ్య వేసే డేన్సులకు ఈ మధ్యనే హిట్ అయిన ఐటెమ్ సాంగ్స్ సెలెక్ట్ చేశాం. వాటికి అందరం పోటీ పడి, ఆ పాటల్లో డేన్స్ చేసిన నటీమణులకు సిగ్గొచ్చేట్టు మూవ్ మెంట్స్ ఇచ్చాం. నర్మద గారైతే చెప్పక్కర్లేదు, తన నడుముతో ఆ ఏంకర్ కుర్రాణ్ణి ఎన్ని సార్లు ఢీ కొట్టారో....

" అందరికన్నా హుషారుగా ఉన్న ఈ ఆంటీ కి స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నాను ఎందుకంటే ఈ వయసులో కూడా అవిడ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు," అంటూ దానికి కారణం అడిగాడు.

"ఇంట్లో షానా ఇబ్బందులూ, కష్టాలూ ఉంటై. బయటికొచ్చినపుడు అవ్వన్నీ మర్చిపోయి బాగా ఎంజాయ్ షెయ్యాల. అది నా పాలసీ.” అంది.

"గివ్ హెర్ అ బిగ్ అప్లాజ్" అంటూ మా అందరి చప్పట్ల మధ్య, ఆవిడకు ప్రైజ్ ఇచ్చాడు.

చివరికి గేమ్ అయిపోయిన తర్వాత శవాల ఊరేగింపు డప్పు డేన్స్. ఒకరితో ఒకరం పోటీ పడి స్టెప్పులేశాం. షూటింగ్ ఆగిపోయినా డాన్స్ ఆపలేదు మేము.

మాతో బాటు డేన్స్ వెయ్యకుండా ఏంకర్ కొద్దిగా పక్కకెళ్ళినట్లు అనిపించి చూశాను. అతని చూపులన్నీ ద్రౌపది మీదే. హాల్లో ఓ పక్కగా నిల్చుని లేత పసుపు రంగు లంగా వోణీలో వాలు జడ ముందుకేసుకుని, కళ్ళు దించుకుని నేల వంక చూస్తోంది. ఏ రంగు పూతలు అక్కర్లేని లేత పసుపు ముద్ద బంతి పువ్వు లా ద్రౌపది. మేకప్పులు, గీసేసిన అతి సన్నటి పెన్సిలు గీతల్లాంటి కనుబొమలు, రంగు రంగుల లిప్ స్టిక్ పూతలు, అర్ధం పర్ధం లేని కంకణాల నగలతో , ప్లాస్టిక్ పువ్వుల్లా మేము.

దానికితోడు

ముని కన్యకు తపోభంగం కలిగించడానికి చేస్తున్న ప్రయత్నం లా మా వీరంగం డాన్స్.

to be continued

23 comments:

జ్యోతిర్మయి చెప్పారు...

శైలజ గారూ

Chandu S చెప్పారు...

ఓయ్

జ్యోతిర్మయి చెప్పారు...

శైలజ గారూ మీకా ఆటే ఇష్టమా సరే అడేద్దాం.

చదివిన తరువాత ఏమనిపించిదంటే..
to be continued..

KumarN చెప్పారు...

Hmm..interesting..
Wonder where is this going to?!!

అజ్ఞాత చెప్పారు...

శైలజ గారు, ఇది హాస్య కథ కాదు అలాగని సోకరసం నింపలేదు కానీ...కానీ
ఇది చదువుతుంటే , నా అనుభూతికి అందనిది ఏదో ఉందనిపిస్తుంది . ఆగి ఆగి వీస్తున్న వడగాల్పులా సాగుతుంది కధనం. మీశైలి బావుంది . ద్రౌపది పట్ల ఆకర్షణ అంతకంతకూ పెరుగుతుంది . ( చెప్పాలనుకున్నది సరిగా చెప్పానో లేదో ) ఎందుకయినా మంచిది , నేను మీ శైలిని పొగిడానండోయ్

మాలా కుమార్ చెప్పారు...

ద్రౌపతి కారెక్టర్ బాగుంది .

అజ్ఞాత చెప్పారు...

ఏదైనా వ్యాజస్తుతి అలంకారానికి మీ తరవాతే ఎవరైనా.

కాముధ

Sravya Vattikuti చెప్పారు...

హ్మ్ ! ఇంకా ముగ్గురు రావాలన్న మాట ! చాలా బావుంది మీ నేరేషన్ !
మీ బ్లాగులో నెమ్మది గా పోస్టు చేద్దురులే అసలు మిగిలిన కథ నాకు రహస్యం గా చెప్పెయకూడదు :)

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

"లేత పసుపు రంగు లంగా వోణీలో వాలు జడ ముందుకేసుకుని, కళ్ళు దించుకుని నేల వంక చూస్తోంది. ఏ రంగు పూతలు అక్కర్లేని లేత పసుపు ముద్ద బంతి పువ్వు లా ద్రౌపది."
ఎంత బాగుందో...
మిగిలినకథంత శ్రావ్యకి చెప్తే చెప్పేయండి కానీ నాకు అలా ఒక్కసారే చెప్పకండి ఇలాగే బాగుంది, ఇంట్లో ఎవరికీ కనపడకుండా దాచుకుని రోజంతా దానిగురించే ఆలోచిస్తూ రోజుకి కొంచెం కొరుక్కుతినే తాయిలంలా బహుకమ్మగా ఉంది.

అజ్ఞాత చెప్పారు...

కాముధ గారు మీరు పైన చెప్పిన వ్యాజస్తుతి అలంకారం గురించి కొంచెం వివరణ ఇవ్వగలరా ప్లీజ్ .

రాజ్ కుమార్ చెప్పారు...

అసలీ కధ ఏ మలుపు తిరుగుతుందా? అనిపిస్తుంది.
టీవీ షోస్ మీద సెటయిర్లు అదిరాయి.
నాకు వేరే ఆప్షన్ లేదు. తరువాతి భాగం కోసం వెయిట్ చెయ్యటం తప్ప.

Chandu S చెప్పారు...

జ్యోతిర్మయి గారూ,

మనం ఆటలాడుకుంటూ కూర్చుంటే ఎట్లా, అవతల బుజ్జి పండు కు బువ్వ?

Chandu S చెప్పారు...

@ KumarN,
Thanks,
see tomorrow

Chandu S చెప్పారు...

"నేను మీ శైలిని పొగిడానండోయ్"

లలిత గారూ,

అదంతా నాకు తెలీదు, మీరేదో వడగాలి అన్నారు, అదే నాకర్ధమయింది.

Thank you.

Chandu S చెప్పారు...

మాల గారూ, బాగున్నారా?

మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

కాముధ గారూ,

మీలాంటి వారు నా బ్లాగు చదివారంటే నాకు ఎక్కడలేని భయమొస్తుంది. తెలుగులో ఏమి తప్పులు వ్రాశానో నని. చదివినందుకు ధన్యవాదాలు.
అలంకారములెన్ని? సోదాహరణముగా వివరించుము అన్న తెలుగు ప్రశ్న (తొమ్మిదో క్లాసులోనో, పదో క్లాసులోనో) అప్పటికీ ఇప్పటికీ నాకు గొంతు పట్టుకుంటుంది. వ్యాజస్తుతి అలంకారం అంటే ఏమిటోనని ఇవ్వాళ వికీ లో చూశాను.

"పైకి నిందిస్తున్నట్లుగా కనిపించినా తరచిచూస్తే స్తుతి చేస్తున్న విధం కనిపిస్తుంది. పైకి స్తుతిస్తున్నా తరచిచుస్తే నిందిస్తున్నట్లు కనిపిస్తుంటే వ్యాజస్తుతి అలంకారం."

ఇదేనా? నాలాగే లలితగారు కూడా మీ జవాబు కోసం చూస్తున్నట్లు ఉన్నారు.

Chandu S చెప్పారు...

శ్రావ్య,
Thank you.

ముగ్గురు ఎవరూ? రేపు రహస్యంగా వచ్చి ఇక్కడే చూసేయండి.

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ,

నిన్న పోస్ట్ లో ద్రౌపది నచ్చేస్తోంది అన్నపుడే అనుమానించాను.

ఇవాళ ఇంట్లో ఎవరికీ తెలియకుండా చదువుతానంటున్నారు.

రేపు ఇంకేమంటారో నని నాకు ఒకటే కంగారుగా ఉంది..

Thanks

Chandu S చెప్పారు...

రాజ్ కుమార్ గారూ,

మలుపుల్లేవు ఏవీ లేవు. మామూలు కథే.

చదివినందుకు Thanks

ఆ.సౌమ్య చెప్పారు...

మీరు ఉత్కంఠ పెంచేస్తున్నారు. కథనం చాలా బాగుంది. చాలా balanced గా రాస్తున్నట్టు కనిపించినా చెప్పాల్సినవన్నీ చెబుతున్నారు. నచ్చింది.

Sravya Vattikuti చెప్పారు...

ముగ్గురూ ఎవరు ఆంటే, ఆ అమ్మాయి పేరు ద్రౌపది అని పెట్టారని నేనేదో ఊహించా శైలజ గారు , అయితే అది తప్పు అన్న మాట :))

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

రామ రామ... ఇంట్లో ఎవరికీ తెలియకుండా అన్నది తాయిలం గురించండీ బాబు పోస్ట్ గురించి కాదు :-) తాయిలం పంచుకుంటే తరిగిపోతుంది. మీ పోస్ట్ చదివిన ఆనందం పంచుకుంటే పెరిగిపోతుంది కనుక మీ పోస్ట్ దాచుకోవాల్సిన పనిలేదు. కేవలం అలా కొంచెం కొంచెం ఆస్వాదించడం బాగుంది అని చెప్తున్నా అంతే.

శ్యామలీయం చెప్పారు...

అలంకారాలు వగైరా గురించి పట్టించుకోకండి. సహజంగా మీకు కుదిరే ధోరణిలోనే వ్రాయండి. రచనలో వన్నెలు చిన్నెలు సహజంగా ఉంటే బాగుంటాయి. అవి అతికించటానికి యెవరూ ప్రయత్నించటం మంచిది కాదు. మీ శైలి బాగుంది.
అలంకారాలయేవి మరొక లాక్షణికసామాగ్రి అయేది వెదుక్కోవటం విమర్శకుల పని. వాళ్ళకోసం వ్రాయటం మీ పని కాదు.
పాఠకులు యిలాంటి సామాగ్రిని వెదుక్కుంటూ చదవరు గదా. అవి శోభనిస్తాయి నిజమే కాని వాటి యంతట అవి పడి నప్పుడే.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి