12, మార్చి 2012, సోమవారం

నాకే ఎందుకిలా?
మా పనావిడ ఓ పది రోజులు రానని చెప్పింది. వెళ్తూ వెళ్తూ

"నా మొబైల్ నంబరు చేవ్ చేస్కోండి" అంటూ నా ఎదురుగా నించుని కలెక్టర్ పాత్ర లో నటించే హీరోయిన్ పెన్ను పెట్టుకునే  ప్రదేశం నుండి తన మొబైల్ తీసింది.

మొబైల్ ఎర్ర రంగులో చూడ ముచ్చటగా ఉంది .

"అవసరం లేదు. నేను మేనేజ్ చేసుకుంటాలే. ఎప్పుడో ఒక సారి రా.” అన్నాను.

' నువ్వెళ్ళిపోతే ఇంటిపనెవరు చేస్తారే అంటూ, నేను శోకాలు తీసి అని కాళ్ళా వేళ్ళా పడతానని ఊహించిందేమో, నా నిర్లిప్త ధోరణికి ఆమె ఇగో దెబ్బ తింది. దానికి తోడు దాని మొబైల్ సోకులు సరిగా వీక్షించ కుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి ఇంకా గాయపరచాను..

ఇంటిపనంతా చేసి ఇంటాయన దగ్గర కొంత గుర్తింపు, ఒక సర్టిఫికేట్ కొట్టేయాలి.

తెల్లవారు జామున ఇంటి ముందు ఊడ్చి నీళ్ళు కొట్టాను. మసక వెలుతురులో నాకొచ్చిన ఒకే ఒక పెద్ద చుక్కల ముగ్గు వేస్తూ ఉన్నాను. ఎదురింటి ఆసామి భార్యతో కలిసి వాకింగ్ కు వెళ్ళి వస్తున్నాడు.

టీ షర్ట్ లో గుమ్మడి కాయ దాచుకుని ఆయన, చేతిలో పేపరు, పాల పేకెట్లతో ఆవిడ.


నా ముగ్గునీ, నన్ను వెనకగా చూశారు కొంత సేపు. ముగ్గు చక్కదనం నచ్చినట్లే ఉంది.

'ముగ్గు బాగుందండీ'  అంటే నేను వాళ్ళకెలా నా ధన్యవాదాలు తెలపాలోనని ఎదురుచూస్తూ ఉంటే..

'వాళ్ళ అర్భకపు పనిమనిషిని తీసేసి, ఈ పనావిడ ని పెట్టుకుందామా?' అని నాకు వినబడేట్లు పైకే ఆలోచించుతూ లోపలికెళ్ళి పోయారు..ఇల్లంతా బాగా తుడిచి మెరిసి పోయేట్లు చేశాను.

అయ్యగారికి టిపిను, కాపీ ఏడేడిగ అట్టుకెళ్ళి అందించి వినయంగా వంగి నించుంటే, నావేపు చూసి

"చేతులు శుభ్రంగా కడుక్కునే తెచ్చావా?” అని అనుమానపడ్డారు.

"బలేవోరే అయ్యగోరూ, తానం కూడా సేసే వొంట సేశానండీ" అంటే రాజుగోరు తల పైకీ కిందికీ కొద్దిగా ఊపారు. మరి దాని అర్దవేంటో?

అయ్యగోరు పొద్దుటి నుండీ నిద్ర బోయే వరకూ ఒక వ్రతం లో ఉంటాడు. పెళ్ళయిన మగవాళ్ళందరూ చేయాల్సిన వ్రతమే కానీ, ఈయన బాగా నిష్ఠగా చేస్తాడు. నా మాటలు సరిగా, పూర్తిగా వినని వ్రతం.


".. బొత్తిగా ఇంట్లో గుర్తింపు లేదు.”

"ఇంట్లో లేకపోతే మార్కెట్ కు పోయి తెచ్చుకో.”

"అక్కడ దొరుకుతుందా?”

"భలే దానివే. అక్కడ దొరకనిదంటూ ఏమీ ఉండదు. బజారెళ్ళి ఓ నాలుగుక్కిలోలు కొనుక్కొస్తే సరి.”


ఎటూ కూరగాయలు కూడా కొనాలి అనుకుని సూపర్ మార్కెట్ కెళ్ళాం.

చుట్టూ చూశా. ఎవరూ గుర్తించక పోతే ఎట్లా?

ఎవరో ఓ బులుగు చొక్కా ఆయన నా వొంకే చూస్తున్నాడు. ఎక్కడో చూసినట్లే ఉంది. వెళ్తూ వొక సారి, వెనక్కి తిరిగి రెండోసారి చూశాను. బాగా తెలిసిన మొహం. గుర్తించలేదని అతను ఫీలయ్యే ప్రమాదం ఉందని పలకరింపుగా నవ్వా. మా సీతమ్మ పిన్ని రెండో అల్లుడు కాదూ, కాడనుకుంటా. నా అభిమాని అయి వుంటాడు. బహుశా నా రచనలు చదివి ప్రభావితుడై, తన జీవిత గమనాన్ని మార్చుకునే ఉంటాడు.

షేవింగ్ సామాగ్రి కొంటున్న వాడు తన గమనాన్ని మార్చుకొని నేనున్న కూరగాయల విభాగం వేపు వచ్చాడు. నేను వంకాయలేరుతుంటే, అతడు పుచ్చు వంకాయలేరుకుంటున్నాడు. ఎంత అభిమాన రచయిత్రి ఎదురైతే మాత్రం పుచ్చు వంకాయలకూ మంచి వంకాయలకూ తేడా గమనించనంత విచక్షణ కోల్పోవాలా?

ఎటు వెళ్తే అటు వస్తున్నాడు. ఏవిటి నాకీ ఫాలోయింగ్? అబ్బ, నాకే కన్ను కుడుతోంది.

సర్లెమ్మని చిక్కుడు కాయలేరుకుంటుంటే అటువేపు వచ్చాడు. వెర్రి నాగన్న, నన్ను పలకరించడానికి భయపడుతున్నట్లున్నాడు. నిజమే మరి, అభిమాన రైటర్ ఎదురైనపుడు నిలువు గుడ్లు పడతాయని స్నేహితులు కొందరు చెప్పి ఉన్నారు. పాపం అతను మాత్రం ఏం చేస్తాడు నా రచనా చమత్కృతిలో చిక్కుకున్న చిక్కుడుకాయ.

"ఏవేఁ.. బీరకాయలు తీసుకో, తొక్కు పచ్చడి చేద్దూ గానీ. నాకిష్టం.” అంటూ వచ్చాడీయన.

బులుగు చొక్కా మాయమయ్యింది.

"ఏవయ్యా, నీకు బుర్ర ఉందా, అతనెవరో నా ఫాన్, ఫాలో అవుతుంటే, కుళ్ళుపడి తోలేశావు.”

"నీ బొందలే. వాడెందుకు ఫాలో అవుతున్నాడో చూసుకోకుండా నా మీద ఎగురుతావే?”ఇంట్లో గుర్తింపు సాధ్యం కాదు. పోనీ వృత్తిలో సాధించుదాం గుర్తింపు.

కాన్ఫరెన్స్ లో పేపరొకటి చదివితే కొద్దిగా గుర్తింపు రావొచ్చు.

ఓ మందుల కంపెనీ వాడొస్తే చెప్పా "అబ్బాయ్ అర్జెంటుగా ఓ కాన్ఫరెన్స్ కెళ్ళాలని .”

మా ఇంటినుండి కాన్ఫరెన్స్ వరకు అవసరమయ్యే రైలు టికెట్లు, ఎయిర్ టికెట్లు ఇంకా పంచభూతాల ద్వారా నడిచే సమస్త వాహానాల టికెట్లు, నా హోటల్ బస అతను భరించేట్టు, బదులుగా నేను బతికున్నంత కాలం అవసరమున్నా లేకపోయినా అతని కంపెనీ మందులనే వాడతాననే ఒక రహస్య ఒప్పందం తర్వాత ప్రయాణపు ఏర్పాట్లు చేసుకున్నాను.

తోడు ఎవర్ని తీసుకెళ్దాం

"ఏమోయ్ రెండో టికెట్టూ, రెండో టికెట్ మీద నువ్వొస్తావా నాతో?”

" మీ ఆడోళ్ళ పేరంటాలకు నేను రాను.”

"మగ వాళ్ళు కూడా ఉంటారోయ్. మొన్నో సారి వొచ్చావుగా!”

"అవునవును. మీ కొలీగ్ ఒకడు చీర ఫాల్ ముడతలు రాకుండా ఎలా కుట్టాలో చెప్పాడు. నా జన్మ ధన్యమైంది. అది చాలు.”

ఎక్కువ బతిమాలితే అతనికి కొమ్ములు పెరిగే ప్రమాదముంది.

పనిలోపని, సబలనని నిరూపించుకున్నట్లూ ఉంటుందనుకుని ఒక్కదాన్నే పోయాను.

ఊరెళ్ళగానే ఇంటినుండి ఫోన్ వొచ్చింది.

"ఎలా ఉన్నావూ? " అనుకుంటూ

"ఎలా ఉన్నావంటే ఏం చెప్పేది. నీ మీద జాలి పడక తప్పదోయ్. అబ్బబ్బబ్బ, మొగుడు అనే నస పిల్లిని వెంటేసుకెళ్ళకుండా కాన్ఫరెన్స్ పెళ్ళికొచ్చానే ... అద్దీ... అసలు స్వర్గం. భర్త పదార్ధం లేని బతుకులు సంతోషమయం.. అబ్బో, అబ్బో.. సరే నీ సంగతి జెప్పు"

“Reverse is also true.”

"ఏంటీ?”

"చివరి sentenceలో భర్త బదులు భార్య అని రీప్లేస్ చేసి చూడు. నా స్థితి అర్ధమవుతుంది.”

దెబ్బ కొట్టాడే..

ఇక్కడ మా బేచ్ మేట్ అర్నబ్ కూడా వచ్చాడు. “

"అలాగా..సరే... ఇంకేంటీ చెప్పు.” అన్నాడు తాపీగా, పట్టించుకోని నిర్లక్ష్య ధోరణిలో.

Ignorance is the worst insult.

"నా అందం కుంచెం కూడా తగ్గలేదు సరికదా, ఇప్పుడింకా బాగున్నానని అన్నాడు.” అసూయాస్త్రం వేశాను. ఇక గిలగిల్లాడాల్సిందే!

"ఆ మధ్యన వాణ్ణి చూశానుగా. సోదరీ సమానుడు. మీ బ్రాంచ్ లో ఓ పదేళ్ళు పని చేశాడుగా.. ఇంక అనుమానపడేందుకు ఏమీ ఉండదులే గానీ...ఇంకేంటీ విశేషాలు? ”

"ఓయ్, నా క్లాస్ మేట్ ని ఏమన్నా అన్నావో...”

"సరే ఉంటానే, నాకు పనుంది" అని నేనో కౌంటర్ ఇచ్చే లోపున కట్ చేశాడు.

ఇదో కొత్త రకం తెలివి తేటలు. అనాల్సిన మాటలు అనేసిన తర్వాత కొంపలు ముంచుకుపోతున్నట్టు ఫోను పెట్టెయ్యడం.

ఎందుకో మళ్ళీ ఫోన్ చేశాడు. అమ్మయ్య, ఇప్పుడేదో ఒకటి కచ్చ తీరేట్లు అనాలి అనుకుని

"ఇదిగో చూడూ .."అని మొదలెట్టా. నా మాటలు పట్టించుకోకుండా.

"ఇందాక చెప్పడం మర్చిపోయానే, పోయిన సారి చూసినపుడు, మీ వాడు భలే డేన్స్ చేశాడే. మన శివ శంకర్ మాస్టారిలా .. .మా క్లాస్ రీయూనియన్ లో డేన్సాడతాడేమో కనుక్కోవా, ప్లీజ్, ప్లీజ్" అంటున్నాడు.

కోపంలో స్ట్రాంగ్ గా ఏదైనా అందామంటే బుర్రకేవీ తోచలా.

"ఛీ ఫో.. నాతో మాట్టాడవాక" అని ఫోన్ పెట్టేశా.

ఇకనుంచి చిన్న నోట్ బుక్ లో కొన్ని పదునైన సంభాషణలు రాసి పెట్టుకోవాలి.కాన్ఫరెన్స్ లో లంచ్ టైము కు, స్టేజ్ మీద ఏదో చెప్పుకు పోతున్న మనిషి మనోభావాలను తోసేసి, ఒకళ్ళనొకళ్ళం తోసుకుంటూ, కూర్చున్న వాళ్ళ కాళ్ళు తొక్కిపడేస్తూ పరుగు పరుగున భోజనాల హాలు కెళ్ళాము. అప్పటికే పెద్ద పెద్ద సీనియర్లు బిరియానీ డేకిసాల దగ్గర క్యూలో ఉన్నారు. నేనూ ఓ బొచ్చ చేతిలో పట్టుకుని క్యూలో చివర్న నుంచున్నా.

ఎన్ని కాన్ఫరెన్స్ ల కెళ్ళినా ఒక కామన్ విషయం ఏవిటంటే, చికెన్ బిరియానీ, పాయసం కు డిమాండ్ ఎక్కువ. వాటి దగ్గరే సోమాలియా నుండి వచ్చిన వాళ్ళ లా మేము తొక్కిసలాటకు గురి అవుతాము.

ప్లేటు నిండా వడ్డించుకుని గుంపులు గుంపులు గా నించుని తిండి మీద అసలు దృష్టి లేని వాళ్ళలా రియల్ ఎస్టేట్ కబుర్లు, తోటి వాళ్ళ కాపురాల మీద, పిల్లల మీద అభాండాలు మాట్లాడుకుంటాము.

తిరుగు ప్రయాణం లో ఆలోచిస్తున్నా. ఎబ్బె ఈ కాన్ఫరెన్సుల వల్ల వచ్చే చిన్నా చితకా గుర్తింపు చాలదు నా ప్రాణానికి.

ఈ మధ్య ఏ సినిమా చూసినా హీరోకు, విలన్ కూ కొద్దిగా వెనకగా ఓ గుంపు ఉంటుంది. నా వెనక ఒక గుంపు చేరితే అబ్బ ఎంత బాగుంటుంది. అసలా ఆనందమే వేరు.

ఎస్కలేటర్ అంటే నాకు విపరీతమైన భయం. ఎస్కలేటర్ ఎక్కడానికి ధైర్యం కూడగట్టుకుంటూ వాటివంక అదే పని గా చూస్తుంటే, ఒకాయన వచ్చి, చాలా మర్యాదగా ఆ కదిలే మెట్లవైపు చేయి చాచి "మేడమ్, లేడీస్ ఫస్ట్" అన్నాడు.

"లేడీస్ ఫస్ట్"

నా కా మాటంటే ఎక్కడలేని కోపం. నా జెండర్ గుర్తించి ఎవరైనా రాయితీ ఇవ్వబోతే వాళ్ళను తీవ్రంగా అవమానించి గానీ వొదల్ను.

"అర్భకంగా ఉన్నావు. ముందు నువ్వెళ్ళు" అన్నాను.

అలా ఎస్కలేటర్ ఎక్కడానికి వెనకాడుతుంటే నా వెనక ఓ గుంపు చేరింది.

"పదవమ్మా, ఇంతలోకే చావవుగానీ" అని ఎస్కలేటర్ ఎక్కించే ప్రయత్నం చేసి, దాదాపు నన్ను వాటి మీదికి తోసినంత పని చేశారు.

ప్రయాణం లో పక్క సీటు మనుషులతో వివరాలు పంచుకుంటే వచ్చే సమస్యలు బాగా తెలిసి ఉండటం చేత, నేను నా పక్క సీటు మనిషికి తెలిసిన ఏ భాషా రాని దాని వలె ప్రవర్తిస్తూ ఉంటాను. అందువల్ల వాళ్ళు, నేను కొంత రాతి యుగం వైపుకు వెళ్ళి, సంఙ్ఞ లతో communicate చేసుకుంటూ ఉంటాం.

నా జాతక రీత్యా, ప్రయాణాల్లో తప్పని సరిగా ఓ పిల్ల పిశాచం నా పక్క సీట్లో ఉండాల్సిందే. ముందు మొహం లో మొహం పెట్టి నవ్వుతుంది. దీని దుంప తెగా, ముద్దొస్తుందీ బిడ్డ అని కొంచం ముచ్చట పడ్డానా, వాళ్ళ అమ్మనొదిలేసి నాతోనే సెటిల్ అవుతుంది.

ఇలా కాదని బోర్డింగ్ పాస్ ఇచ్చే అబ్బాయితో 'పిల్లలు లేని సీటు, పిల్లలు లేని సీటు' అని మొత్తుకుంటుంటే, పిల్లలు కలగడానికి ఇంకా టైమున్న ఓ హనీ మూన్ జంట పక్కన పడేశాడు. కొత్త దంపతులు ప్రయాణం మొదలైన దగ్గర్నుండీ ఒకే న్యూస్ పేపర్ తెగ దీక్ష గా చదువుతున్నారు. ఏమున్నాయో అంత గొప్ప న్యూస్! వాళ్ళని పలకరించి. మీరు చదవడం అయిపోయిన తర్వాత పేపర్ నాకివ్వండేం అన్నా.


ఏ రోజు పేపర్ ఆ రోజు చదవడం కుదరదు నాకు. ఏదైనా సెలవు రోజున, చిత్తు కాగితాల వాడొచ్చి కాటా వేసుకుంటుంటే, నేనూ పక్కనే కూర్చుంటా. వాడు దొంగ కాటా వేసి ఓ రూపాయి ఎందుకు కాజేయాలి. ఆ టైములో అన్ని న్యూస్ భలే ఇంట్రెంస్టింగ్ గా ఉంటాయి. వాడు త్రాసులో పెట్టిన పేపర్లు కొన్ని బయటకు లాగుతూ పూటంతా వాణ్ణి మాఇంట్లోనే కూర్చోబెట్టి చదువుతాను. అమ్మా, నేను వేరే బేరానికి పోవద్దా అని వాడు నసుగుతున్నా సరే .

హనీ మూన్ జంట అరగంటయినా తలకాయలు పేపర్లోంచి బయటకు తీయకుండా న్యూస్ పేపర్ నాకు తెరలా అడ్డం పెట్టుకుని చదువుతున్నారు. నాకు కనిపించే వైపు అంతా చదివేశాను
పేపర్ కు అవతల వేపు విశేషాలేమిటో???

 మళ్ళీ అడిగా 'న్యూస్ పేపర్' అంటూ. వాళ్ళు ఎయిర్ హోస్టెస్ ను పిలిచి సీటు మార్పించుకున్నారు. మరీ చోద్యం. నేనేమడిగాను గనక, అంత మాత్రానికే సీటు మారాలా? ఎందుకిలా?

ఖాళీ అయిన సీట్లలో ఓ పిల్ల తల్లి వచ్చి చేరింది, నా జాతకాన్ని నిజం చేస్తూ..

వాళ్ళ అమ్మ భోం చేసేటప్పుడు, పిల్ల కుదురుగా నావొళ్ళో కూర్చుందా, నేను తినబోయేసరికి ప్లేట్ లో బడి కెలికి పారేసింది.
కాస్త కునుకు తీద్దామంటే వల్లకాదు. రెప్ప వేశానో, పాపాయి తన చురుకు చేత్తో తపా తపా మొహం మీద చరుస్తూనే ఉంది. 'ఆయ్ పిల్లా' అని గదుముదామంటే సొంత పిల్ల కాదాయె. రాత్రంతా నిద్ర లేదు.

ప్రయాణం చివర్లో వాళ్ళమ్మ తల దువ్వుకుంటానని పిల్లను నా చేతికిచ్చింది. వాళ్ళమ్మ మేకప్ అయ్యే లోపు నాక్కూడా మేకప్ చేసింది, నా జుట్టు అదీ పీకి పెట్టి. పిల్లను తీసుకుని తన మేకప్ సామాగ్రి నాకివ్వ బోయింది. సహజ సౌందర్యం చాలుననుకొని తిరస్కరించాను.

పక్కన కూర్చున్నావిడ మొగుడు కాబోలు, పెళ్ళాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు.. నన్ను పైనుండి కింది వరకూ ఎగా దిగా చూస్తున్నాడు.

హే భగవాన్, నేను గుర్తింపు కావాలనుకుంది నా వృత్తి, విద్వత్తు విషయాల్లో మాత్రమే. అందం వలన వచ్చే గుర్తింపు నాకొద్దు స్వామీ, నాకొద్దు.

ఏదో మామూలు అందం ఇస్తే సరిపోయేదానికి అసమాన సౌందర్యాన్ని నాకంట గట్టి, పైనుండి చోద్యం చూస్తూ ఆనందిస్తున్నావా ప్రభూ? వీడెవడో పక్కనున్న పెళ్ళాన్ని వొదిలి నా వొంకే చూస్తున్నాడు.

ప్రయాణం చేసేప్పుడు వింత వేష ధారణ చేస్తాను బంగి అనంతయ్య టైపు లో. తెలుగు తెలుసునని వాళ్ళు అనుకోలేని విధంగా నా ఆహార్యం, వ్యవహారం ఉండటం చేత, భయం లేకుండా తెలుగులో మాట్టాడేసుకుంటున్నారు.

మొగుడు: ఆవిడెవరూ అలా ఉందీ?

పెళ్ళాం : నా పక్క సీటే.

మొగుడు: మరీ దెయ్యం లా ఉంది. కొద్దిగా దువ్వెన పడెయ్యకూడదూ ఆవిడకు.

పెళ్ళాం: ఇచ్చాను వొద్దంది.ఆవిడ కోసం ఎవరూ వచ్చినట్లు లేరు రిసీవ్ చేసుకోడానికి.

మొగుడు: వచ్చి ఎక్కడో దాక్కుని ఉండి ఉంటాడు, ఈ అవతారాన్ని ఇంటికి తీసుకెళ్ళడం ఇష్టం లేక.

మొగుడు, పెళ్ళాం: హిహి హి కి కి కి..

నాకే ఎందుకిలా?

32 comments:

వనజవనమాలి చెప్పారు...

డాక్టర్ గారు.. హాస్యరసం ఎంత ఆరోగ్యకరం అయితే మాత్రం .. మీ పోస్ట్ చదివాక గంటసేపు ఆపకుండా నవ్వుకోవడం వల్ల..కడుపు నొప్పి..కళ్ళ నీళ్ళు అనే విటమిన్ సప్లిమెంట్ ఇవ్వడం ఏమన్నా బాగుందా! అసలేమైనా బాగుందా!? .. అంట . నాకే ఎందుకిలా..అనను గాక అనను.

nirmal చెప్పారు...

chandu s. gaaru, mee post aadyantam haasyam gaa undi. intillipadi navvukunnam

జ్యోతిర్మయి చెప్పారు...

:):)

మధురవాణి చెప్పారు...

<< పెళ్ళయిన మగవాళ్ళందరూ చేయాల్సిన వ్రతమే కానీ, ఈయన బాగా నిష్ఠగా చేస్తాడు. నా మాటలు సరిగా, పూర్తిగా వినని వ్రతం.

LOL :)))))))))))

DSR Murthy చెప్పారు...

సహజంగా ఇలాంటి సన్నివేశాలు సంధర్భాలు ఎదురవుతో ఉంటాయి.
బాగుందండి మీ హాస్య రచన.

KumarN చెప్పారు...

కొన్ని డైలాగులు బాగా పేలాయి :-))

అవునూ, ఏమంటిరేమంటిరీ..."భర్త పదార్ధం లేని బతుకులు సంతోషమయం"
&‌@#$‌*%$&@!...

భార్య అనే 'వ్యర్ధ'పదార్ధం లేని గృహం,
శాంతికి నిలయం, సుఖమునకు ఆలయం.

అజ్ఞాత చెప్పారు...

hillarious... too gud!! :) :)
>>ఏదైనా సెలవు రోజున, చిత్తు కాగితాల వాడొచ్చి కాటా వేసుకుంటుంటే, నేనూ పక్కనే కూర్చుంటా.ఆ టైములో అన్ని న్యూస్ భలే ఇంట్రెంస్టింగ్ గా ఉంటాయి. వాడు త్రాసులో పెట్టిన పేపర్లు కొన్ని బయటకు లాగుతూ పూటంతా వాణ్ణి మాఇంట్లోనే కూర్చోబెట్టి చదువుతాను.
హహ్హా... ఈ విషయంలో కాగితాల వాడు తిట్టుకోవటమేమో గానీ మా అమ్మ మాత్రం భలే చీవాట్లేసేది నాకు.

Chandu S చెప్పారు...

@ Nirmal

Thank you

Chandu S చెప్పారు...

@ జ్యోతిర్మయి
Thank you.

Chandu S చెప్పారు...

మధుర వాణి గారు,
ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

DSR Murthy గారు,
ధన్యవాదాలు.

Chandu S చెప్పారు...

@ Sree,
Thanks for sharing your experience.

Narayanaswamy S. చెప్పారు...

బ్లాగ్జనుల గుర్తింపు మెండుగా నుండగా
ఇతర గుర్తింపులేల చెల్లు
ఎల్ల బ్లాగ్జనులు కలిసి పొగడరే డాక్టరుగార్ని
విశ్వదాభి రామ వినురవేమ

అజ్ఞాత చెప్పారు...

బాగుంది.

Chandu S చెప్పారు...

నారాయణ స్వామి గారు,
ధన్యవాదాలు సర్.
మీ పద్యాన్ని దాచుకుని ఇంట్లో చూపిస్తాను.

కొత్తావకాయ చెప్పారు...

"సోదరీ సమానుడు" ఇంతలా కక్ష తీర్చుకోవాలా చెప్పండి.

నారాయణస్వామిగారి పద్యం ఫ్రేం కట్టించుకోండి. హాల్లోకి రాగానే కనిపించే గోడకి తెల్ల పైంట్ వేయించి మధ్యలో పెట్టండి. మీ ఇంటికి వచ్చినప్పుడు బ్లాగ్ ప్రజలందరం సంతకాలు చేసుకుంటాం. :D

కొత్తావకాయ చెప్పారు...

"పక్కసీట్లో చురుకు చేతుల పిల్ల పిశాచాలు"

జాతక ప్రభవమేనంటారా? అయితే మీదీ నాదీ ఒకటే నక్షత్రమేమోనండోయ్. :(

Chandu S చెప్పారు...

కష్టే ఫలే శర్మ గారు,
ధన్యవాదాలండీ

teresa చెప్పారు...

:) Tickled! :)

కృష్ణప్రియ చెప్పారు...

మీ టపా, దానికి కొత్తపాళీ గారి పద్యం.. రెండూ.. దేనికవే..!! వెరీ నైస్..

సుజాత చెప్పారు...

మీ మాటలు కొన్ని మా అమ్మ మాటల్నిగుర్తుకు తెస్తుంటాయి. ఆవిడ కూడా ఎంతో ప్రేమతో మెడ విరిగేలా జుట్టు వెనక్కి గుంజి బిగించి జడలు వేస్తూ "సరిగ్గా కూచూ, ఇంతలోకే చావవు కానీ" అనేది. అదొక్కటే సందర్భం కాదనుకోండీ!

మాట వినని వ్రతం ఇంత కామనా :-)

jyothi చెప్పారు...

"పెళ్ళయిన మగవాళ్ళందరూ చేయాల్సిన వ్రతమే కానీ, ఈయన బాగా నిష్ఠగా చేస్తాడు. నా మాటలు సరిగా, పూర్తిగా వినని వ్రతం".
ఇది సరే కాని "అడిగేవాటికి సమాధానం చెప్పని వ్రతం" అని ఇంకోటుంది.పాపం మీవారికి దాని గురించి తెలీదేమో ?

Sailaja Chandu చెప్పారు...

పోనీ సోదరీ 'సుమనుడు' అననా, ఘోర సుమనాభిమానులు కాబట్టి మీకు కూడా నచ్చుతుంది.

బ్లాగు స్నేహితులు అందునా కొత్తావకాయ గారు మా ఇంటికి రావడం, మా గోడలు ఖరాబు చేస్తాననడం ఎంత మంచి ఊహ. ఎప్పటికైనా నిజం కావాలి
ఊహ అయితే మాత్రమేమి ఒక సంతోషకరమైన ఆలోచన కలిగించినందుకు ధన్యవాదాలు.

Sailaja Chandu చెప్పారు...

@ teresa

Thank you

Sailaja Chandu చెప్పారు...

సుజాత గారు,
'ఇంతలోకే చావవు గానీ'

ఈ మాటలు మా అమ్మవి. మీ అమ్మ గారివి కూడానా ,
వెనక్కి గుంజి బిగించి జడల experience పంచుకున్నందుకు ధన్యవాదాలు.

Sailaja Chandu చెప్పారు...

@ Jyothi
Thank you

అజ్ఞాత చెప్పారు...

టీ షర్ట్ లో గుమ్మడి కాయ దాచుకుని ఆయన,

ఇది బాగుంది
కాముధ

వనజవనమాలి చెప్పారు...

నేను చూసేసాను.. చూసేసాను.
కుమార్ గారు.. భార్య అనే వ్యర్ధ పధార్ధం లొనే ..ఎంతో అర్ధం ఉన్నది."సహ ధర్మచారిణే సరిలేని వరమని సత్యాన్ని కనలెనినాడు మోడుగా మిగలడా పురుషుడు.. అన్నారు.. జగమెల్లా ఆహా అనిపించిన గీత రచయిత. కాస్త వారి మాట వినుకోండి.:)))))

చందు.యెస్ ..గారు కంగారు వద్దు. అన్ని చొట్ల ఒకే మంత్రం కాదు లెండి.

vasantham చెప్పారు...

అబ్బాబ్బా..నవ్వ లేక చచ్చాను అను కోండి,
మా వాళ్ళందరికీ నవ్వుకోడి రా అని మీ లింక్ పంపించేను.
ఇంత నవ్వితే..ఎలా గండి???
కడుపుబ్బి పోయి, కింద మీద పడి నవ్వితే, అందరూ అదోల అంటే,
ఇంట్లో వాళ్ళే ..పిచ్చి బాగా ముదిరి పోయింది పాపం..
అంటున్నట్టు..ముఖ కవళికలు..
అబ్బాబ్బా, ఒక్కో మాట కి నవ్వెను, ఏమిటని చెప్పను?
మీ ఆరోగ్యమే ,మా మహా భాగ్యము..అని దీవిస్తున్నాను..
వసంతం.

మీఇంటి ఆడపడుచు చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
స్ఫురిత చెప్పారు...

ఈ మధ్య బ్లాగులే చదవడం మానేసాను, మీ పేరు ప్లస్సు లో చాలాసార్లు చూసినా ఎప్పుడూ బ్లాగువైపు వొచ్చే తీరిక దొరకలేదు...ఇవాళ ఆఫీస్లో పెద్దగా పనిలేకపోవడం తో ప్లస్ లో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రాజ్కుమార్ గారు ఇచ్చిన లింకు పట్టుకుని వచ్చాను. పొట్ట నొప్పి నవ్వు బయటకి రాకుండా ఆపుకుంటూ చదివేసరికి...ఎంత బాగా రాస్తున్నారండీ...ఎస్కలేటర్ ప్రహసనం దగ్గరైతే నవ్వాపుకోలేక చచ్చాను. నేను కూడా అదే జాతి మరి. ఎస్కలేటర్ ఎక్కితే గానీ America ప్రయాణం పూర్తవదని మావారిని పెళ్ళి చేస్కోను పొమ్మన్నాను మొదట...:)

ఇవాళ కొన్ని టపాలు చదివాను. మిగిలినవి కూడా చదివెయ్యాలి. ఇంకొన్ని రోజులు పని లేకుండా చూడు దేవుడా...!!!

అన్నట్టు పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు కాస్త అలీశం గా

Bvv Prasad చెప్పారు...

మీ హాస్యం చాలా బావుంది డాక్టర్ గారూ.. ఇన్నాళ్ళూ మిస్ అయ్యాను.. ఇక అప్పుడపుడూ చూడాలి.. ముఖ్యంగా మనసు బాగోనప్పుడు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి