18, ఆగస్టు 2011, గురువారం

సుబ్బు- ఆవిడ- బ్లాగు


చదివే ముందు: బొత్తిగా ఏడుపుగొట్టు బ్లాగు కింద తయారయ్యిందని అనిపించి ఇది అర్జంటుగా రాశాను. దీనిలో కనపడే వ్యంగం, హాస్యం ( ఏమైనా ఉంటే)  అంతా నా బ్లాగు గురించే. ఇతర బ్లాగు మిత్రులు, సీనియర్లు అపార్ధం చేసుకోవద్దని మనవి

సుబ్బు బావ మరిది వొచ్చాడు. వాడన్నా, వాడి వాగుడన్నా..

"అబ్బ మా బాసెంత దేవుడు బావా?”


"ఫలానా డాక్టరెంత మంచోడు బావా, అన్నీ తినమంటూనే లావు తగ్గిస్తాడు.”

ఏం తగ్గాడు శుంఠ.


"తెలంగాణా శకుంతల ఏంటి బావా అంత చక్కగా నవ్వుతుందీ? ప్రాణాలు పోతాయనుకో.”


ఆవిణ్ణోసారి తీసుకొచ్చి నవ్విస్తే సరి.


"మా ఇంటి ఓనరు భలే పంక్చువల్ బావా, నెలయ్యేసరికి ఠంచనుగా వసూలు కొస్తాడు.”


"ప్రకాష్ రాజేంటి బావా అంత అందంగా వుంటాడు.”


బోరు వెధవ! ఒక్క నెగటివ్ స్టేట్ మెంట్ కూడా ఉండదు.


"నాక్కోయే మాంగారికెంత నాలెడ్జ్ అనుకున్నావ్ బావా? వికి పీడియా అనుకో.”


'ఒరేయ్, నిన్నుకత్తితో పొడిచి జైలు కెళ్తా' అనుకున్నాడు సుబ్బు.


'నీ కసి ఎంత బాగుంది బావా? కత్తెంత పదును బావా.'అంటాడేమో


"అది సరేరా? పెళ్ళి చూపుల పనేమయ్యిందీ?” సుబ్బు భార్య అడిగింది.

"ఆ పని మీదే వొచ్చా. బ్లాగూ వాకిలీ లేని వాణ్ణని వాళ్ళు వెనాకాడుతున్నారు.”

"మా అక్కకుందీ ఓ బ్లాగు అని చెప్పకపోయావురా?”

" నీకంటూ ఒకటుండాలిగా అన్నారక్కా, నాకెలాగైనా ఓ బ్లాగు కావాలి అర్జెంటుగా.”


ఎంతో సులువురా, కానీకి కొన్ని అర్హతలుండాలి

"మొదటిది, నిన్ను నువ్వు గొప్ప మేధావి వనుకోవాలి, పక్కన వాడికన్నా తేడా అని బాగా నమ్మాలి.”

"అనుకోవటమేంటక్కా, నిజమేగా?”

"ఫర్లేదురా ఏమో అనుకున్నాను. బాగానే అల్లుకు పోతున్నావు.”


తర్వాత కళ్ళ కలక వొచ్చినట్టు నీ కళ్ళకి బ్లాగు దృష్టి రావాలి. ఏ చెత్త చూసినా నీ బ్లాగు హృదయం స్పందించాలి. బ్లాగు రాయడానికి అందులో ఏం సరుకుందో అని కెలికి వెదకాలి.

ఇప్పుడు చూడు ఆ డోర్ మాట్.

'ఓసీ డోర్ మాటు

ఎక్కడైనా నీకొకటే చోటు

లోకువంది బాటా బూటు

నీ లైఫంతా ఒకటే పోటు'

ఆశువుగా అక్క పద్యం చెప్పింది.

దాన్నో ఫోటో తీయి. బ్లాగులో పెట్టేయ్
పక్కింటాయన వొచ్చాడు.

"డాక్టరు గారూ, వారం నుండీ జలుబు.”

" నేను కార్డియాలజిస్టుని " సుబ్బుకి అహం దెబ్బ .

" నేను చెప్పలేదుటండీ, అన్నయ్య గారికి గుండె మందులు తప్ప జలుబు మందులు రావనీ.” వాళ్ళావిడ.

ఇంకా దెబ్బ.

లోపలికెళ్ళి ఏవో మందులు ఇచ్చి పంపించేలోపల ఆయన తన జలుబు పురాణం చెబుతూనే ఉన్నాడు.

ఆయన వెళ్ళగానే అక్క కళ్ళెగరేసింది.

"ఏంటక్కా? “తమ్ముడు

"తెరువు, బ్లాగు కన్ను.

వాడేం చెప్పాడు,

బావేం అన్నాడు,

మధ్యలో ఆవిడేం అంది,

మనింటో ఎన్ని టిష్యూలు వాడాడు, వాడి ముక్కెంత కందింది.

ఆ విధంగా రాసేసుకుంటూ పోవాలన్న మాట. "పక్కింటాయనా-జలుబు, ఒక విశ్లేషణ" అని పేరు పెట్టావనుకో అయిపోయే!

ఏదీ? ఇప్పుడు నీకో టాస్క్

అని మూలనున్న బూజు ని చూపెట్టి ఏమైనా చెప్పగలవా?” అంది.

వాడు కూడా ఆలోచిస్తూ,

“'మూలనున్న బూజూ

తుడవాలి రోజూ

ఇంటి శుభ్రతే నా క్రేజూ'

తర్వాతేంటో రావడం లేదక్కా "

" ఇలాంటప్పుడే మనం మన మేధావి బుర్ర వాడాలి.”

"ఏం తోచనప్పుడు పాఠకుల్ని ఇరికించాలి. నాలుగో పాదం వచ్చే వారం లోగా పూరించండీ అని వొదిలెయ్యాలి. తరవాత వాళ్ళే బుర్రలు బద్దలు కొట్టుకు చచ్చి ఏదో ఒకటి రాస్తారు. వాళ్ళ లైన్ కలిపి ఒక ప్రశంస మొహాన పడెయ్యాలి.”"ఫలానా రావు గారు మీ పూరణ బాగానే ఉంది. ఇంకా ప్రయత్నించండీ వృద్ధిలోకి వొస్తారు" అని.

ప్రాస కోసం ఏమైనా చేస్తాం త్యాగం అనుకుంటూ, అక్కా తమ్ముళ్ళు బ్లాగు టాపిక్కులతో ఇంటి బూజు దులిపారు.

సుబ్బు హాస్పిటల్ కి బయలుదేరాడు.

పెళ్ళాం తో చెపుదామని బాల్కనీ లోకి వెళ్ళాడు.

ఇద్దరూ బ్లాగు పైత్యంతో కొట్టుకు పోతూ

' అదిగదిగో చింతాకు

పప్పులో వేద్దాం చిగురాకు

అదంటే ఎంతో ఇష్టం నాకు

పంపేదా ఓ గిన్నెడు మీకు.'
"ఏమేవ్ , నేను హాస్పటల్ కి పోయొస్తా"

బావ భలే తాపీ మనిషక్కా, ఎంచక్కా బాగా లేటుగా వెళ్తున్నావే బావా "

'ఒరేయ్ పాజిటివ్ బామ్మర్దీ, ఎప్పుడో నిన్ను..'

"ఏం చెయ్యనోయ్. ఈ మధ్య ప్రాక్టీస్ బాగా డల్ అయ్యింది.”

" ఏమండీ, "అర లక్షకే ఆరోగ్యం" కార్డులో నా బ్లాగు చదివి కామెంటు రాసిన వాడికి 5% రాయితీ పెట్టమన్నాను. ఒక్కడూ రాయటం లేదే?”

"కామెంటు పెట్టేవరకూ వాడు బతికి ఉండాలా? నీ టపాలకు, ఠపామని టపా కట్టేస్తున్నారు.”

" ఇదివరకే నయం , ఉన్న రోగాన్ని కన్న బిడ్డ లాగా సాకి, పెంచి పెద్ద చేసి, అపురూపంగా చూసుకునేవాణ్ణి. నీ బ్లాగు వాగులో నా ప్రాక్టీసు కొట్టుకు పోయేట్టుంది.”

*********


"మీకే ఫోన్"

"ఎవరే ఇంత పొద్దున్నే?”

ఫోన్ సుబ్బు మీద విసిరేసి మూతి వొంకర్లు తిప్పుతూ

ఒహో మా అమ్మా

"అమ్మా? బాగున్నావా?" పాండురంగ మహాత్మ్యం లో తప్పు తెలుసుకున్న ఎన్టి ఆర్ లా

“.......”

"నీ మనవడా? ఈ మధ్య చిక్కాడే, నెలకు 10 కేజీల చొప్పున పెరిగేవాడు ఈ నెల 5 కేజీలే పెరిగాడు.

నీ మీద బెంగేమో.”

“...........”


"దాని బొంద దాని బోడి పర్మిషనెందుకు నువ్వు రావడానికి. నీ కిష్టమైనప్పుడు రా. ఇష్టమైనప్పుడు వెళ్ళు.”


"ఏమేవ్"

"వింటూనే ఉన్నా, నాది బోడి పర్మిషన్"

"అదికాదే, మా అమ్మ రావాలి, నీ బ్లాగు చూసి కోడలి గొప్పతనం ఇప్పటికైనా తెలుసుకుంటుందనీ....”


......ఇంకొంచం రొండో పార్ట్ లో

5 comments:

Sravya Vattikuti చెప్పారు...

ha ha :))))

విరిబోణి చెప్పారు...

good one , waiting for next part:)

రాజేష్ మారం... చెప్పారు...

సూపర్ :))

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హన్నా మీరేదో బ్లాగ్ లోకానికి కొత్త అనుకుంటున్నా.. మొన్నా మధ్య ఒక సీరియల్ లోనూ ఈ రోజు ఈ కథలోనూ బాగానే ఏకేస్తున్నారే బ్లాగర్లని :) బ్లాగ్ లోకపు పాత పాఠకులేనా లేక ఒక్క మెతుకు చూస్తే చాలదటండీ అంటారా :-))

Chandu S చెప్పారు...

బ్లాగు లోకానికే కాదు, రచనలకు కూడా కొత్తే. నిజ్జం నమ్మండి.

Venu Srikaanth gaaru,
thanks for reading

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి