7, ఆగస్టు 2011, ఆదివారం

మా రాధ బావ


"మా అమ్మ అంటే నాకు వళ్ళు మండేది చిన్నపుడు.”

నీకు ఒకళ్ళంటే పడింది కనకనా? అమ్మ తో కూడా సున్నమే?

"ఏమయ్యిందే?”

నేను పదో క్లాసులో ఉండగా, నన్ను బాగా వికారంగా రెడీ చేసి స్కూలికి పంపేది.

"పనికట్టుకుని వికారంగా చెయ్యాల్సిన అవసరం ఏమీ కనపడటం లేదే? " అన్నాను మొహంలోకి పరీక్షగా చూస్తూ.

"కానీ చేసేదండీ, నేను బాగా చక్కగా కనపడితే, ఎవడైనా నా వెంట పడితే నా చదువు పాడవుతుందనీ.”

"ఒహో మంచి జాగ్రత్తే, ఈ సారి అత్తమ్మ వొస్తే నేత చీరె కాకుండా జరీ చీర పెడదామే.”

"నెత్తి మీదనుండి కారుతున్న శేరు కొబ్బరినూనే, మా పెద్దక్క కనబొయే రోజుల్లో వేసుకోగల సైజు బట్టలూ, గట్టిగా బిగతీసి అల్లిన జడా చివర ఎర్ర రిబ్బన్ కుచ్చూ..”

"ఎర్ర రిబ్బన్ సోకు చేసింది కదే, ఇంకా ఏడుస్తావే?”

"క్లాసులోకి నేను అడుగు పెట్టగానే రోజూ ఎవడో ఒకడు B2అనేవాడు.”

"మొదట్లో, B2 అంటే Beauty బుజ్జమ్మ అనుకునే దాన్ని. మా ఇంటో నన్ను బుజ్జమ్మ అంటారుగా!”

"మరేంటే ? బండ బుచ్చా?”

"కాదండీ బుడబుక్కలు అని తర్వాత నా స్నేహితురాలు నీరజ చెప్పింది.”

"మా కజిన్స్ ఎవర్నీ ఇంటిక్కూడా రానిచ్చేది కాదు"

"కజిన్స్ అంటే?”

"పెదనాన్న పిల్లలు, అత్తయ్య కొడుకులు, మేమంతా బాగా స్నేహంగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. కానీ పెద్దయ్యాక ఎవరూ వొచ్చే వాళ్ళు కాదు మా అమ్మంటే భయపడి.”

అత్తమ్మకు పట్టు చీరే పెట్టాలి ఏకంగా అని అనుకోబోయే లోపల..

"ఒక్క మా రాధ బావని తప్ప అంది."

చీరె కాన్సిల్.

"ఏం వాడిని మాత్రం ఎందుకు రానిచ్చేది?”

"ఊరుకోండీ వాడూ వీడు అనొద్దు, నాకు కష్టంగా ఉంటుంది.”

"ముందు ఇది చెప్పుఅతను మాత్రం ఎందుకొచ్చేవాడూ?”

"అంటే మా నాన్న కు మా రాధ బావంటే బాగా ఇష్టం. మా రాధ బావక్కూడా మా నాన్నంటే అంతే.”

"మరి నువ్వంటే?”

"నేనంటే చెప్పేదేముంది? పెళ్ళిలో చూశారుగా,  తెల్లగా, ఎత్తుగా, పొడుగ్గా, మంచి ముక్కు (అన్ని మంచి విశేషణాలా?) అబ్బ, నాటకాలేసేవాడండీ, స్టేజి మీద మేకప్పు వేసుకుంటే ఎంత అందంగా ఉండేవాడనీ? మా రాధ బావ పక్కన నాటకాల్లో వేసినావిడ పేద్ద హీరోయిన్ కూడా అయ్యింది.”


" " బావ" అనకుండా మాట్టాడ రాదూ?”

“'బావ' ని 'బావ' అనకుండా బాబాయనమంటారా? మరీ 'బావు' ందండీ"

ఒక్కసారి అనొద్దంటే మూడు సార్లు.


'అందగాడు కాదూ వల్లకాడూ కాదూ, మీ ఆవిడ ఉట్టి ఎచ్చులు కోరు ఎంకమ్మ అంతే' అంటూ మనసు సమాధాన పరుస్తున్నా, నాకేంటో 'బావు'రుమని, ఛీ, మామ్మూలుగానే ఏడవాలనిపించింది.

దాని బావ గోల తట్టుకోలేక, బెడ్ రూం లోకి వెళ్ళి టివి పెట్టాను.

టివిలో ఏంకర్లందరూ మా ఆవిడ కజిన్స్ లాగా, బావ గీతాలు, బావోద్రేకాలు,

చానెల్ మార్చాను.

'ఏడ తానున్నాడో బావా' అనుకుంటూ...

మీరు కూడా ఏమిటమ్మా, నా మీద కత్తిగట్టారూ?

టివి కట్టేసి మా ఆవిడ చదువుతూ వదిలేసిన పుస్తకం పట్టుకున్నాను.

మా పక్క వూరి కథలే.

పేజీ తీయగానే " పూర్ణయ్యని అందరూ బావగాడంటారు".

పుస్తకం మూసేసి, కళ్ళు కూడా మూసేసి,

బావగాన్, నా మతిమండా, భగవాన్!


*********

పొద్దున్నే నిద్ర లేపి " ఇవ్వాళ ఆదివారం , మర్చిపోయారా?"

సరే అనుకుంటూ లేచి, నిద్ర కళ్ళతో సంచి తీసుకుని బయలు దేరాను.

"ఎక్కడికీ సంచి?" అని పెద్దగా.

'మతిలేని మేళాం' అని చిన్నగా.

"ఆదివారం అంటే చేపలొండుకోవద్దూ? అసలే , మన అపార్ట్ మెంట్ ముందు చేపలావిడ దగ్గర ఒకటే రద్దీ, ముందే వెళ్ళక పోతే ఎలా?”

"ఇవ్వాళ చేపలొద్దు ఏమొద్దు. పొట్ల కాయలు తీసుకు రండి. మా రాధబావ వొస్తానన్నాడు, పొట్లకాయలు, బీరకాయలు తప్ప వేరే ఏం తినడు."

"పొట్ల కాయలు కూడా రైతు బజార్లోవి కాకుండా, మొన్న వెళ్ళినప్పుడు, మీ స్నేహితుడింట్లో పొట్లపాదు చూశాను. అక్కడినుండి లేతవి చూసి రొండు గిల్లుకు రండి.”

ఆదివారం పొద్దున్నే వాడింటికెళ్ళాను. నా కోరిక విని, నా వాలకం చూసి ఆ ఇంటావిడ రొండు కోసి ఇచ్చి నన్ను పంపింస్తూ,

వెనకనుంచి

'ఏమయ్యిందీ అన్నయ్యగారికి వొంటో ' బావో' లేదా?' అని నా స్నేహితుణ్ణి కనుక్కుంటోంది.

అంతా బావ గుణింతం, బావ మయం.

ఈసురో మంటూ కారు తోలుకొచ్చి ఇంట్లో పెట్టి కారు దిగగానే,

పక్కింటాయన " డాక్టరు గారూ, బావున్నారా?"

" ఈ పాటికి వచ్చే వుంటాడు" అన్నాను.

విచిత్రంగా చూస్తాడే? మెంటల్ వెధవ!

ఇంట్లో కెళ్ళి చూద్దును కదా?

సోఫాలో కూర్చుని మా ఆవిడ

" ఇలా అయిపోయావే, ఎలా వుండేవాడివి " అంటూ వళ్ళు రాస్తోంది.

తెల్లగా, పొడుగ్గా, మంచి ముక్కూ, అందంగా,

మనసు చెప్పినట్టు, నేనూహించినట్టూ కాకుండా!

నమస్కారం చేసి, లోపలకొచ్చి పొట్లకాయలు వంటింట్లో పెడుతుంటే మా ఆవిడ వచ్చింది.

" ఈయనేనా రాధ బావ?" అడిగాను.

"ఊఁ, ఎలా ఉన్నాడు?”

"చాలా బావున్నాడు.” నిజంగా ఒప్పుకున్నానుమీరలా అనుమానంగా చూడకండీ, నిజంగానే ఒప్పుకున్నాను.


"అవును, కానీ ఇదేంటీ, ఇలా అనుకోలేదే నేను.”

"అప్పట్లో ఆపరేషన్ లు లేవుగా, మా నాయనమ్మకు పధ్నాలుగు మంది, అందరికన్న పెద్దది మా పెద్దత్త. ఆమె పెద్ద కొడుకే మా రాధ బావ. మా నాన్నేమో పధ్నాలుగో వాడు. విచిత్రం తెలుసా, మా నాన్న కన్న ఒక్క రోజే చిన్నోడు. మా నాన్నని కూడా మా పెద్దత్తయ్యే పెంచిందంట."

"ఎవరో హీరోయినూ అదీ అన్నావ్?”

".... శారద, మొదట్లో మా రాధబావ పక్కన నాటకాల్లో వేసేదంట," నేను అనుమానంగా చూడక పోయినా, ఒట్టు అన్నట్టు, చేయి తల మీద పెట్టుకుంది.

మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్నాను.

"వొంట్లో కులాసానా?” అంటూ

"బానే ఉంది నాయనా, మొన్న మా సత్యం కనపడి నన్ను నిలదీశాడు. నా పిల్లని చూసి ఎన్నాళ్ళయిందిరా నువ్వు అంటూ. ఒకసారి పోయిరారా అన్నాడు "


 కళ్ళొత్తుకున్నాడు రాధబావ.

P.S: మా రాధబావ అనుమతి తీసుకోకుండా కథ రాశాను. పోనీ, ఫోన్ చేసి బ్లాగులో నీ మీద కథ రాస్తా అంటే ఏమనుకోడు కానీ ,అసలే ఆరోగ్యం బాగోలేదు, ఈ బ్లాగులూ మొత్తుకోళ్ళూ అంటే... ఏమోలే.

పోనీ పేరు మార్చి రాద్దామా అనుకుంటే, " రాధ బావ" అన్నంత అందంగా ఇంకేం అనిపించలా. అయినా నన్నేమీ అనుకోడనే....

7 comments:

Tejaswi చెప్పారు...

సూపర్

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

ఇల్లాలు సినిమా అనుకుంటాను 1970లలో వచ్చింది, అందులో రాజబాబు రమాప్రభ ఒక పాట పాడతారు. ఆ పాటలో చిట్టచివర పంచ్ లైన్ రమా ప్రభ నాకప్పుడు ఐదేళ్ళు అంటుంది. రాజబాబు సంతోషిస్తాడు. ఆ పాటకు పారడీగా కథ బాగున్నది.

వేణు చెప్పారు...

శివ గారూ, ఆ సినిమా పేరు ‘ఇల్లు-ఇల్లాలు’. (హీరో కృష్ణ). ‘వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయం చెబుతాను’ అని ప్రారంభమమ్యే ఈ పాటను సుశీలతో పాటు పాడింది రాజబాబు! అసలు విషయం వెంటనే విప్పకుండా సస్పెన్సులో ఉంచి, ఉడికించి చివర్లో బయటపెట్టటం దీనిలో చెప్పుకోదగ్గ టెక్నిక్!
ఇది నేను చూసిన మొదటి సినిమా అవటం వల్ల ఈ సంగతులన్నీ తెలుసుకుని, గుర్తుంచుకున్నాను. :)

అజ్ఞాత చెప్పారు...

చాలా బావుంది :) (pun intended)!
వేణు గారూ,
ఆ పాట పాడింది జానకి గారండీ!

శారద

Chandu S చెప్పారు...


శారద గారికి, శివరామ ప్రసాదు గారికి, వేణు గారికి,

కథ అయిపోయిన తర్వాత, నాకూ ఆ పాటే గుర్తుకు వచ్చింది. చిన్నపుడు రేడియో లో మొదటి సారి పాట విన్నపుడు..


" వెళ్ళవే నా తల్లి వెళ్ళవే అమ్మా, డబ్బులిస్తాడు, మంచి బట్ట లిస్తాడు" అని వాళ్ళమ్మ అంటుంటే,


రాజబాబు కన్నా ముందు ,రాజబాబు కన్నా ఎక్కువ ఆవేశం వచ్చింది..

ఛీ, అది అమ్మా....కాదు అని

Thanks for sharing memories

వేణు చెప్పారు...

శారద గారూ, నిజమే. ఆ పాట పాడింది జానకి గారే! ఎలా పొరబడ్డానబ్బా:(

naimisha yenduri చెప్పారు...

madam meeru chaala baaga rasthunnaru.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి