13, ఆగస్టు 2011, శనివారం

అమృతం 3continued from  అమృతం 2


మావయ్య కి పిల్లలు కలగలేదు. మాకెవరికీ ఆశ్చ్యరమూ కలగ లేదు. 
పెద్ద వాళ్ళం అయ్యాం. ప్రసాదు, నేను ఎందుకు 
కొట్టుకునేవాళ్ళమో బుర్ర బద్దలు కొట్టుకున్నా గుర్తుకురానంత. 
అమెరికాలో వుద్యోగం చేస్తున్నాడు వాడు. నా చదువైన 
తర్వాత నన్ను అమెరికా రప్పించి , నాక్కూడా వుద్యోగం 
వచ్చేదాకా తన దగ్గరే వుంచుకున్నాడు. 
సెలవలకి ఇండియా వొచ్చాం. ప్రసాదుకి పెళ్ళి సంబంధాలు 
వొస్తున్నాయి. అందరికి నచ్చిన సంబంధం మా శారదత్త కు 
అక్క వరసయ్యే ఆమె కూతురు. కాక పొతే ఆ అమ్మాయికి ఓ 
చెల్లెలుంది. ఇద్దరికి కలిపే పెళ్ళి చేద్దామని ఆ పిల్లల తండ్రి 
అనుకుంటుంటే, ప్రసాదు నన్ను సూచించాడు వాళ్ళ కాబోయే 
మామగారికి. పెద్దయిన తర్వాత కూడా వాడు నన్ను 
ఓడించాడు.
నేనూ, వాడూ, తోడల్లుళ్ళమయ్యాం. తిరిగి అమెరికా 
వెళ్ళబోయే ముందు, అత్త మమ్మల్నీ వాళ్ళింటో ఉండమంది 
మాకు వీలైనన్ని రోజులు. అత్త అడిగిన తీరు చూస్తే, నాకు 
ఎందుకో అమెరికా తిరిగి వెళ్ళాలనే అనిపించలేదు. మేమున్న 
రోజుల్లో ,అత్త మొహం కనపడిన సంతోషం ముందెప్పుడూ 
చూడలేదు. ఏమిటో రకరకాల వంటలు చేసేది. 
సాయంత్రం సుబ్బులతో చెప్తోంది " మల్లెపూలు మొగ్గలుగానే 
కోసెయ్యి, ఇవ్వాళ మార్కెట్ కి వొద్దు".
 వల్లికి పూల జడ వేయించుకుందామని ఉన్నా, జుట్టు 
కత్తిరించుకుంది కనక, వేయడం కుదరదని అత్త దిగులు 
పడింది. వల్లి వాళ్ళ అక్కకి, అంటే మా వదిన గారికి, మాత్రం 
పెద్ద జుట్టే. అత్త మధ్యాహ్నం రెండింటికి కూర్చుని, 
అయిదింటిదాకా, పూల జడ కుట్టింది. ప్రసాదు, వల్లి కూడా 
అత్తకి సహాయం చేశారు పూల జడ కుట్టడంలో. వల్లి మాత్రం 
చిన్న జడ వేసుకుని , తలలో మల్లెలు తురుముకుంది. 
"పిన్నీ, నువ్వు కూడా పూలు పెట్టుకో " వల్లి,  అత్త  తో 
అంటుంది.
"ఏమోరా, మల్లెలు నలిగితే నాకు బాగోదు."
అందరికన్న అందమైన జుట్టు ఉంది అత్తకి, కాని పెళ్ళి రోజున 
చూడటమే, అత్త తలలో పూలు, ఆ తర్వాత, ఎప్పుడూ  అత్త 
జడ, పూలు లేక, ఒంటరిగానే కనపడేది.

                                                     ఆ రోజు కూడా అత్త పాయసం చేసింది.

 భోజనం అయినతర్వాత కూర్చో లేక పడుకోలేక ఇబ్బంది పడుతున్నానని, ప్రసాదు

 కేకలేశాడు నన్ను "ఎన్ని సార్లు చెప్పాన్రా   నీకు, రాత్రి పూట తిండి తగ్గించమని,

 కంట్రోల్ చేసుకోలేవూ" అని.

అత్త నన్ను వెనకేసుకొచ్చింది. 

“పోనీలేరా వాడికి పాయసం అంటే ఇష్టం పాపం. “

“కొంచం దూరం నడిచి రా" నాతో చెప్పింది.

నాతో పాటు ప్రసాదు, మావయ్య కూడా నడుస్తామని వచ్చారు.

పెద్ద వంతెన కాలవ వరకు వచ్చింతర్వాత ఇక నడవలేనని,  మొండి కేసి సిమెంటు

 గట్టు మీద కూర్చున్నాను.

 నా పక్కన ప్రసాదు, వాడి పక్కన మావయ్య.

కొంచం సేపు వూళ్ళో కబుర్లు అయ్యాక, ముగ్గురం మౌనంగా కూర్చున్నాం. 

మౌనం ఇబ్బందిగా ఉంది.

కాలవ నీళ్ళు చప్పుడు చేస్తూ అలజడిగా పరుగు తీస్తున్నాయి. 

తెలియని అలజడి.

ప్రసాదు మెల్లగా అన్నాడు " మావయ్యా"
"...... ఒక మాట అడగనా"
ఏమడగబోతున్నాడో మనసుకి తెలిసినట్టు, గుండె చప్పుడ్ని పెంచింది.
“అత్త ఎంత మంచిది మావయ్యా,  ఆమె బతుకు ఇక అంతేనా ?”
మావయ్య ఏమీ మాట్టాడకుండా ఓ నిముషం కూర్చుని  అన్నాడు
" మరి నా బతుకు మాటేవిట్రా  ?"

వళ్ళు మండింది. 

ఏం తక్కువయ్యింది  బతుక్కి. 

నా అలోచనలు చదివినట్లు ప్రసాదు నా చెయ్యి పట్టుకున్నాడు. ఆవేశంలో ఏమైనా అంటానేమోనని.
మావయ్యే మళ్ళీ మాట్టాడాడు.
" నీళ్ళు తాగేవాడికి అమృతం ఇస్తే , అప్పుడు విలువ తెలియలేదు. ఇప్పుడు తెలిసి ఏం చెయ్యను? విలువ తగ్గించనా?"
“ఇక ఈ జన్మకింతే " 
గొంతు భారంగా ఉంది.

లేచి బట్టలకంటిన గడ్డిపరకల్ని దులుపుకుని , మా కంటే ముందు నడుస్తూ బయలుదేరాడు.


************

ఇంటి కొచ్చాం.

అత్త తో పాట పాడించుకుంటున్నారులా వుంది అక్కాచెల్లెళ్ళు.


 ఏదో తమిళ పాట.

వీణ వాయిస్తూ పాడుతోంది.

భాష తెలియక పోయినాపాట బాగుంది.


అత్త  అందం వీసమంతైనా తగ్గినట్టే లేదు.

 అవే బంగారపు వేళ్ళు, సముద్రాల్లాంటి కళ్ళు.

ఎప్పుడు లానే లేత రంగు చీరచీరకు, అత్త వొంటి రంగులో 


కలిసి పోదామన్న ఆరాటం.

 జగ్గారావు మావయ్య ఎప్పుడైనా ఆ చక్కటి వేళ్ళతో ఆడుకుని వుంటాడా?

ఎందుకో, అత్త కన్నా, మావయ్యే దురదృష్టవంతుడనిపించింది.


ఆరు బయట మంచం మీద  పక్కకు తిరిగి పడుకుని రాని నిద్ర నటిస్తున్నాను.

లోపలంతా సముద్రం లాగా ఉంది.

ప్రసాదు వచ్చి పక్కనే కూర్చున్నాడు నన్ను ఆనుకుని.

వాడి స్పర్శ తో , కారణం లేని దుఃఖం నిశ్శబ్దంగా 

ముంచుకొచ్చింది.


"ఊరుకోరా" అన్నాడు


ఆలోచన లేని నీళ్ళు కిందికి జారిపోయాయి.

(అయిపోయింది)***********************


4 comments:

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హ్మ్...ఏంటో జీవితం.. :-(

Chandu S చెప్పారు...

@ వేణూ శ్రీకాంత్

ఈ సారి కథ అంటూ రాస్తే ( ప్రస్తుతానికి ఏం ఆలోచనలూ లేవు,) ఒక వేళ కథకి ఏమైనా విషయం దొరికితే మిమ్మల్నిలా బాధ పెట్టేదిగా ఉండకుండా రాద్దామని అనిపిస్తుంది. ఈసారి రాళ్ళూ, రప్పలూ చదవక ముందే సుఖాంతాలు పబ్లిష్ చేసేస్తాను.

Thanks for reading

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

నా ఒక్కడికోసం మార్చేస్తే మీ ఇతర పాఠకులు నన్ను కొట్టేస్తారేమోనండీ :-)
ఏం పర్లేదులెండి మీకు ఎలా రాయాలనిపిస్తే అలాగే రాయండి.. ప్రయత్న పూర్వకంగా నన్ను దృష్టిలోపెట్టుకుని మార్చద్దు.. నాకు అనిపించింది నేను చెప్పేస్తుంటాను, విని వదిలేయండి :-)
అయినా జీవితం అందరికీ అందమైన పూలబాట కాదు కదండీ ఇలాంటి కథలు కూడా ఎక్కడో అక్కడ జరుగుతుండి ఉండవచ్చు.. తెలుసుకున్నపుడు కాస్సేపు ఒక పదినిమషాలు బాధపడతాం మళ్ళీ మనపనిలో మనం బిజీ అయిపోతాం ఇది సాధారణమే :-)

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

సమయం దొరికినపుడు ఈ పోస్ట్ లు(6భాగాలు) చదవండి.. అనుకోకుండా చూసిన ఈ పోస్ట్ మీ బ్లాగునే ఙ్ఞప్తికి తెచ్చింది.

http://venkatbrao.wordpress.com/2010/12/03/%E0%B0%8A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B6%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%82%E0%B0%B0%E0%B0%B5-%E0%B0%92%E0%B0%95-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE/

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి