10, ఆగస్టు 2011, బుధవారం

అమృతంవల్లి కి ప్రయాణాలు, కొత్త ప్రదేశాలు చూడటం చాలా ఇష్టం. నాకేమో, ఇల్లు కదలకుండా, బద్ధకంగా గడపడమే బాగుంటుంది. ఎక్కడైనా, భార్యల మాటే చెల్లుబడి అవుతుంది కాబట్టి, మాకెప్పుడు సెలవలు వచ్చినా, ఊళ్ళ మీద పడి పోతుంటాం.

ఓ సారి పట్టుబట్టి, జలపాతం చూద్దామని తీసుకెళ్ళింది. జలపాతం చూస్తుంటే ఏమిటో తెలియని దిగులు అని పించింది. ఏమిటీ నీళ్ళ ఆలోచన లేని పరుగు. నీళ్ళకి ఆలోచన లు వుంటాయా?

ఆలోచన లేని పరుగులు.

గమ్యం లేని పరుగులు.

***********


నల్లని నయాగరా

" ఇంత పెద్ద జడా? , అమ్మా వాళ్ళ లాగా చిన్న సవరం పెట్టుకోవచ్చు కదా".

"అలవాటైపోయింది చిన్నప్పట్నుండి" అంటూ నవ్వి నా బుగ్గ పట్టుకుంది.

తర్వాతి రోజు అత్త పెరట్లో సన్నజాజి పందిరి కింద తల దువ్వుకుంటుంటే చూశాను ఆమె పొడుగాటి జుట్టు.


"నిన్న సవరం అని చెప్పావ్" అని నిలదీశాను.


"నిన్న సవరమే, ఇవ్వాళే పెరిగింది" అని మళ్ళీ బుగ్గ పట్టుకుంది.


ఎంత బాగుంది అత్త బుగ్గ పట్టుకుంటే.


*********


ప్రతి వేసవి లోనూ, అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు తాటాకుల పందిరి వేసేవాళ్ళు. సెలవలకి పిల్లలు వొస్తారని, దానికి తోడు, ప్రతీ వేసవి లోనూ, ఎవరిదో ఒకరి పెళ్ళి తప్పని సరి గా వుండేది. పెళ్ళి ఉంటే, మాకందరికి భలే సరదాగా ఉండేది. మేము పెళ్ళి వాళ్ళింటికి వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం, భోజనాలు, హడావుడి, పెద్దవాళ్ళ ఆజమాయిషీ లేకపోవడం.

ఈ సారి వేసవికి ఎవరి పెళ్ళీ వుండదేమోనని, పిల్లలం నిరాశ పడుతుంటే, హఠాత్తుగా మా జగ్గారావు మావయ్య పెళ్ళి తోసుకొచ్చింది.

మా జగ్గారావు మావయ్య చాలా అందంగా ఉంటాడని, మా వూళ్ళో వేసే నాటకాలన్నింటిలోనూ, హీరోగా, మావయ్యనే పెట్టేవాళ్ళు. పక్కనే ఉన్న హై స్కూల్లో పంతులు గా పని చేసేవాడు. మా ఇళ్ళలో ఆడాళ్ళు పంతులమ్మలు, మగాళ్ళూ పంతులయ్య ల గాను ఉద్యోగాలు చేసేవా
ళ్ళు. 


పల్లెటూరి అందగాడు, నాటకాలు వేస్తాడు, మీరూహించిన అవలక్షణాలన్నీ ఉన్న వాడు, పెళ్ళి ఎందుకో వాయిదా వేస్తుండేవాడు. మా మావయ్య వేసే నాటకాల్లో హీరోయిన్, అరుంధతి అనే ఆవిడని, పెళ్ళీ చేసుకోవాలని మా మావయ్యకి ఉండేదనుకుంటా. కాని, మా తాత తో ఆ మాటంటే, కాళ్ళూ విరగ్గొ డతాడని, భయం. కులం పట్టింపా అంటే అదీ కాదు, మా తాతకు అన్నీ కమ్యూనిష్టు భావాలే. ఆ తాటాకుల పందిరి కింద, పిల్లలందరిలో, నలుగురైదుగురికి, కోరుకున్న వాళ్ళతో కులాంతర కమ్యూనిష్టు పెళ్ళిళ్ళే జరిపాడు.మరి ఇంకేంటి అంటారా?, కారణం ఉంది, అరుంధతి కి అప్పటికే పెళ్ళయింది, మా మావయ్య కన్నా వయసులో పెద్దది. భర్త, పెళ్ళయిన సంవత్సరానికి, వూరొదిలి వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఇంక రాడేమో..


ఒక రోజు, ఓ పెద్దాయన, కార్లో మాఇంటికొచ్చాడు. మేము కారు చుట్టూ మూగి, వింతగా చూస్తుంటే, ఆయన మా తాతతో చాలా సేపు మాట్లాడాడు. తర్వాత తెలిసింది. ఆయన పాలెం జమీందారు అనీ, మా తాత చిన్నప్పటి స్నేహితుడనీ. ఆయనకు ఇద్దరే కూతుళ్ళు. కూతుళ్ళిద్దరినీ, మద్రాసు సంగీతం కాలేజీ లో చదివిస్తున్నాడు. చిన్న కూతురు ఆయనకి చెప్పకుండా, ముందూ వెనకా ఎవరూ లేని వాడినెవడినో ప్రేమించి రిజిష్టరు పెళ్ళీ చేసుకుంది. ఆ చేసుకున్న వాడు, పెళ్ళయిన ఆర్నెల్లకు, కొండమీద గుడికి తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి, కొండ మీద నుండి దూకిందో, వీడు తోసేశాడో తెలీదు కాని, వళ్ళంతా గాయాలతో పడి వుంటే, చూసిన వాళ్ళు హాస్పిటల్లో చేర్పించారు. ఈయన ఆ పెళ్ళి చేసుకున్న వాడిని, ఏమిటీ అన్యాయం అంటే, మీ పిల్ల కు మెంటల్, కావాలని దూకింది. ప్రమాదవశాత్తు పడితే వైద్యం చేయిస్తాను కాని, తనంతట తాను దూకింది కాబట్టి, నాకు సంబంధం లేదన్నాడు.
ఆ అమ్మాయి, మూడో రోజున చనిపోయింది. అందుకని, పెద్దమ్మాయిని తెలిసిన ,పెద్ద కుటుంబంలో ఇద్దామని, మా తాత మీద ఉన్న నమ్మకంతో సంబంధం మాట్లా డటానికి వచ్చాడు. చిన్న కూతురి విషయం చెప్పి కంట తడి పెట్టుకున్నాడు.మా తాత కూడా సంగతంతా విని ఎంతో బాధ పడ్డాడు. పాలెం జమీందారుకి మాట ఇచ్చేశాడు. మా జగ్గారావుకీ, మీ అమ్మాయికి మా ఇంట్లోనే కాగితాల పెళ్ళి అని.
మా తాత మా జగ్గారావు మావయ్యని కూర్చోబెట్టి విషయం అంతా చెప్పాడు. " అమ్మాయి చదువుకుంది, నాలుగేళ్ళ క్రితం చూశాను. చక్కగా వుంటుంది,తండ్రి నాకు బాగా స్నేహితుడు. కొంచం దెబ్బ తిని, కష్టం లో ఉండి ఆయన నీకు పిల్లనిద్దా మని వచ్చాడు. “

మా జగ్గారావు మావయ్యకి కాదన టానికి కారణం కనపడ లేదు. కాని, చాల దిగులుగా కనపడ్డాడు. కారణ మేమైనా గానీ, మొహమంతా కోపం చేసుకుని కూర్చున్నాడు.మా తాత చాదస్తం వల్ల మేమెప్పుడూ మామూలు పెళ్ళిళ్ళు చూడలేదు మా ఇంట్లో. పెళ్ళి కూతురు, పెళ్ళీ కొడుకు చెరో కుర్చీలో కూర్చుంటారు. రెండు కాగితాలు చదువు తారు. చదువు రాని పెళ్ళికూతురైతే, మా పున్నయ్య బావ చదివి ఆ అమ్మాయి తో చెప్పిస్తాడు. ఆ అమ్మాయి నూతిలోనుండి వొస్తున్న గొంతుతో ఎవరికీ వినపడకుండా పెళ్ళి ప్రమాణం అయ్యిందనిపించేది.

పెళ్ళి రోజున, కొద్దిగా చీకటి పడుతుండగా, కార్లో వచ్చింది పెళ్ళికూతురు.
....to be continued

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి