18, ఆగస్టు 2011, గురువారం

మూసిన తలుపురామం ని చూడగానే ఆమె తలుపు దభాలున పెద్ద చప్పుడు తో మూస్తుంది. నేనేమీ తప్పుగా చూడలేదే ఆమె వంక అనుకున్నాడు. రోజూ ఏమిటీ తలుపు దెబ్బలు. లోపలకెళ్ళి అద్దం లో చూసుకున్నాడు. కళ్ళలో ఏమీ మురికి కనపడటం లేదే.

రామం వొచ్చే సమయానికి, చేతుల్లేని నైటీ వేసుకుని, కామన్ కారిడార్ లో తిరుగుతూ ఉంటుంది. ఐ పాడ్ తాలూకు హెడ్ ఫోన్స్ చెవుల్లో దూర్చుకుని. వొంకర్ల జుట్టు,అక్కరలేనంత కొబ్బరినూనె , నీళ్ళు కారుతూ, చివర్న చిన్న ముడి. అప్పటికీ తలొంచుకునే ఫ్లాట్ తలుపు తాళం తీస్తాడు. ఈ లోపలే పరుగులాంటి నడకతో లోపలికెళ్ళి తలుపు మూస్తుంది పక్క ఫ్లాట్ మళయాళీ ఇల్లాలు.

ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో జేన్ ఉంటుంది.

జేన్ ఖరీదైన వజ్రాల షాపులో సేల్స్ గర్ల్. కాబోయే భార్యకు వజ్రపుటుంగరం గిఫ్ట్ గా కొందామని వెళితే జేన్ కనిపించింది అక్కడ. అంతవరకు రామం కి తెలియదు జేన్ ఏం పని చేస్తుందో. ఓపికగా అన్ని డిజైన్లు చూపిస్తూ, వివరిస్తూ....ఎంత చక్కటి ప్రొఫెషనల్.

కోపం రాదా దేనికీ? రామం కి సిగ్గుగా అనిపించింది. తన కింద పని చేసే వాళ్ళతో మొరటుగా ప్రవర్తించిన సంఘటనలు గుర్తొచ్చి.

అందమైన బొమ్మలకు నగలు తగిలించి వుంటాయి. బొమ్మలు తుడవడానికి లోపల పెడితే, వాటికి బదులు జేన్ ని నుంచో బెట్టొచ్చు. బొమ్మకి మాదిరిగా ఆ చెక్కిళ్ళు అంత బాగుంటాయే? పెదవులకి రోజుకో రంగు లిప్ స్టిక్ లేత గులాబి, లేత ఎరుపు . కానీ చిరునవ్వే అలంకారం. రామాన్ని చూడగానే చిరునవ్వు వత్తి పెద్దది చేస్తుంది. ఇంగ్లీషులో నే పరామర్శలు.


రామం కి వేళా పాళా లేని ఉద్యోగం.ఓ రోజు కంపెనీ లో ఏదో గొడవ. అంతా సరిఅయ్యే వరకు ఉండి వస్తే చాలా టైం అయ్యింది. వొండుకుని తినే ఓపిక లేదు. వంటింట్లోకి వెళ్ళాడు. ఏమైనా తింటానికి దొరుకుతుందేమోనని. కంపెనీ వాడు ఐరావతమంత ఫ్రిజ్ ఇచ్చాడు. వారానికి ఎవరో ఒకరు వచ్చి దాన్నిండా ఏమిటేమిటో సర్ది వెళ్తారు. చూస్తే తినగలిగినవి ఏమీ ఉండదు. మాంసాహార మార్చురీ లాగా.

తలుపు చప్పుడయ్యింది.

జేన్

ఏదో బౌల్ కి అల్యూమినియం ఫాయిల్ చుట్టిచేతుల్లో పెట్టి, నవ్వుతూ ఇది నీకోసమే అని చెప్పింది.  థాంక్స్ చెప్పడం కూడా మరిచి పోయి ఆ గిన్నె అందుకుని లోపలికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి జేన్ వంక చూశాడు. దయగా చిరునవ్వు. రామం లోపలికి వచ్చి తలుపు మూయబోతుండగా మళ్ళీ మళయాళం తలుపు ధనా మని చప్పుడయ్యింది.


**********


నాలుగు రోజులు సెలవు. జ్వరం.

పడుకునే ఉన్నాడు రామం

లోపల ఎడారిలాగా ఉంది. మంచి నీళ్ళు తాగితే బాగుంటుంది.

తలుపు చప్పుడైతే తీశాడు.

జేన్

నిన్నా ఇవాళ డ్యూటి కి వెళ్ళినట్లు అనిపించకపోతే ఏమిటో కనుక్కోవడానికి వచ్చానంది

వాలకం చూసి అడిగింది 'ఏమయ్యింది' అని.

రామం ఏం లేదు అని చెప్తే నమ్మకుండా నుదిటి మీద చెయ్యి పెట్టి చూసింది.

లోపలికి వచ్చి, ఇల్లంతా సర్ది, మందు బిళ్ళ తెచ్చింది. వేసుకుంటే ఏవో పిచ్చి కలలు, వళ్ళు చల్లగా అయ్యి తర్వాత నిద్ర వొచ్చింది.

రామం లేచేసరికి,తేలికగా, నీరసంగా,

ఏమిటో గంజి లాంటి సూపు బెడ్ పక్కనే టేబిల్ మీద.

అబ్బ గంజి కాదు, అమృతం.

********

కింద లిఫ్ట్ లో స్టూడెంట్ కుర్రాడు నీళ్ళు తెచ్చుకుంటూ " ఇవ్వాళ పైనున్న నీళ్ళ టేంక్ కడిగారు" అన్నాడు

అమ్మో నీళ్ళు లేక పోతే ఎలా?

ఇంటికెళ్ళే సరికి ఫ్లాట్ బయట ఓ పెద్ద బకెట్ నీళ్ళు. అంతకు మించిన బహుమతి రామం అందుకోలేదు ఎప్పుడూ.

ఏమిటీ ఎందుకిలా సహాయం చేస్తుందీ చక్కటి అమ్మాయి.


కారిడార్ లో తిరుగుతూ మళయాళీ ఇల్లాలు ఫోన్ లో మాట్టాడుతోంది.

"అవన్ అవళొదు ఎప్పూరం సంసారిక్కుం"

"ఎనిక్కు ఈ కార్యంగళ్ ఇష్టమల్ల.”*********రాత్రి ఎందుకో మెలుకువ వచ్చింది.

మామూలుగా ఆ టైం కి ఎప్పుడూ రాదే

నిద్ర పట్టక పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు రామం.

బయట ఎవరో ఏడుస్తున్నారు. అందుకేనా మెలకువ వచ్చింది?

ఒక్క క్షణం లో లేచి తలుపు నెమ్మదిగా తీసి విన్నాడు.

జేన్ ఎవరితోనో ఫోన్ లో మాట్టాడుతున్నట్టుంది.

వెక్కిళ్ళు, గొంతు నిండా ఏడుపు నింపుకుని బతిమాలుతూ ...

మధ్యలో పెద్దగా అరుపు . ఏదో నేల కేసి కొట్టిన శబ్దం. వెంటనే బిగ్గరగా ఏడుస్తున్న శబ్దాలు.

లోపలకొచ్చి తలుపు మూశాడు. బెడ్ మీద కూర్చున్నాడు.

మూడు గంటలు గడిచిందేమో!

తెల్లవారుతూ ఉన్నా ఇంకా చీకటి పోలేదు.

కప్పు వంక చూస్తూ పడుకున్నాడు.

లేచి డ్యూటి కి తయారయ్యి ఫ్లాట్ బయటకొచ్చి లాక్ చేస్తుంటే అదే సమయానికి జేన్ కూడా తన ఫ్లాట్ బయట.

ఉద్యోగానికి వెళ్తుందనుకుంటా.

కళ్ళు కలపడానికి బెరుకుగా అనిపించి రామం షూ రేక్ లో బూట్లు వెదుకుతున్నట్టు నటిస్తున్నాడు.

జేన్ దగ్గరకొచ్చింది.

"ఎలాఉంది ఆరోగ్యం?" అదే చిరునవ్వు.

రాత్రి ఆనవాళ్ళకోసం చూశాడు.

చిరునవ్వు తెరలో ఏమీ కనపడ లేదు.

రోజూ రాత్రి పూట అదే సమయానికి మెలుకువ వస్తుంది రామానికి ఎవరో అలారం సెట్ చేసినట్టు.

అదే సమయానికి ఎందుకు ఫోన్ లో మాట్లాడుతుందీ. అవతలి మనిషి ఏ దేశం లో ఉంటాడో?

జేన్ కి ఏమవుతాడు? భర్తా? కాబోయే వాడా? అదృష్టవంతుడే? ఏం అదృష్టం? ఏ ధైర్యంతో ముట్టుకోగలడు ఈ మచ్చ లేని చెక్కిళ్ళని.

ఎందుకింత ఏడిపిస్తాడు? జేన్ వాణ్ణి వొదిలేస్తే బాగుణ్ణు.

చలం అనుసూయ. ఎలా వొదిలేస్తుంది.

ఆపుడపుడు నవ్వుతూనే మాటలు వినబడతాయి. కానీ ఎక్కువసార్లు ఘర్షణ పడుతున్నట్టే.

ఓ రోజైతే మరీ పెద్దగా గొడవ వినిపిస్తుంది.

తలుపు తీసే ధైర్యం రాలేదు. తన తలుపు వద్దే తచ్చాడి నేల మీద కూర్చున్నాడు తెల్లారే వరకు. రేపు పొద్దున్న జేన్ ను చూస్తానో లేదో అని సందేహపడుతూ. ఇంటి పై కప్పు వంక చూశాడు. అమ్మయ్య కొక్కాలు ఏవీ లేవు మనసు స్థిమిత పడింది. అదొక్కటేనా మార్గం. మళ్ళీ దిగులు

ఒక్క సారి బయటికెళ్ళి, జేన్ ఫ్లాట్ తలుపు తట్టి , క్షేమం కనుక్కుని జాగ్రత్తలు చెప్తే , వాణ్ణి వొదిలించుకో అని సలహా ఇస్తే..

జేన్ చిరునవ్వు గుర్తొచ్చిఆగిపోయాడు. చిరునవ్వు లో హెచ్చరిక, దూరంగా ఉండమని గట్టి శాసనం .

*********

మెయిన్ బ్రాంచ్ కి బదిలీ అయ్యింది.

ఇవ్వాళే ప్రయాణం.

సర్ది ఉన్న సామానంతా ఎప్పుడో మేనేజర్ తీసుకెళ్ళాడు. రామం వెళ్ళటమే ఇక..

'జేన్ ని చూసి వెళ్ళాలి' అనుకుని చూస్తున్నాడు

ఇంతలో మళయాళి ఆవిడకు చెప్దామని పక్క ఫ్లాట్ వైపు అడుగులు వేశాడు.

తలుపు తడితే వొచ్చి తీసింది.

"నేను , ఇవ్వాళ , చివరి సారి ... " తలుపు మొహం మీదే ధనామంది.

సరి, ఈ కొబ్బరి కాయలో నీళ్ళు పోయలేం అనుకుని వెనక్కి తిరిగాడు.జేన్,

అదే చిరునవ్వు

"కింద సామాను చూశాను ఏమిటీ?” అడిగింది.

"ట్రాన్స్ ఫర్" అని ఇంగ్లీషులో చెప్పాడు.


ఆ నవ్వులో ఏదో అనుమానం నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోగలవా? అన్నట్టు.

కారు వరకు వచ్చింది.

చేతులు పట్టుకుంది" జాగ్రత్త" అంటూ.


" జేన్,ఎప్పుడూ ఏడవకు , నువ్వు సంతోషం గా ఉండాలి ఎప్పుడూ , ఏడవకు" జేన్ తో అంటున్నాడు తెలుగులో.

ఇంగ్లీషులో చెప్పే ధైర్యం ఉందా?

అది సరే, ఆమెని ఏడవద్దని చెప్తూ, అతనేంటీ..?
8 comments:

రాజేష్ మారం... చెప్పారు...

బాగుంది... కాని, నేను ఈ కథ ఇంకొన్ని భాగాలు ఉంటుందేమో అని అనుకున్నాను చదువుతుంటే... అయిపోయిందా!!!

విరిబోణి చెప్పారు...

appude ipoindaa :( ,lekha enkaa undaa?

Chandu S చెప్పారు...

రాజేష్ గారు, విరిబోణి గారు,

Thanks for reading.

సీరియల్ గా రాయనా ?

రాజేష్ మారం... చెప్పారు...

సూపర్ గా రాసేయొచ్చు... నాకయితే ఇది కథ ప్రారంభం లాగే అనిపించింది...

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

బాగుంది :-) సీరియల్ గా ఎలా నడిపిస్తారో చూడాలని ఉంది :)

Chandu S చెప్పారు...

అమ్మయ్య అయిపోయింది అనుకున్నానే, దీన్ని సాగదీసి సీరియల్ రాయనా? ఉండండి అరికాలు కొంచం గోక్కుని చూస్తాను, ఏమైనా ఆలోచనలొస్తాయేమో?

వేణూ శ్రీకాంత్ గారూ,
once again thanks for reading

yvchowdary చెప్పారు...

k sujini madam chapparu me blog chudamani

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుందండి!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి