12, ఆగస్టు 2011, శుక్రవారం

అమృతం-2continued from అమృతం-1


అత్త బిందె ఎత్తుకుని ఎలా నడిచి ఇంట్లోకి వెళ్ళిందో! ఏం జరిగిందో నేనే, అమ్మమ్మకి చెప్పాను. ఎవరికీ అనుమానం రాకుండా 

మామూలుగా ఉండడానికి అత్త, ఎంత ప్రయత్నం చేసినా, ఇంట్లో అందరికీ 

తెలిసింది.


ఎప్పుడు చూసినా, చేతిలో ఆర్నెల్ల బిడ్డ, మూణ్ణెల్ల వేవిళ్ళతో

సతమతమయ్యే మా మీనాక్షి పిన్ని, " అబ్బ, వినటానికే చీదర వేస్తుంది,

పెళ్ళయి మూడు రోజులైనా కాలేదు, అంత ఎగబడాలా," అంటూ

అమితాశ్చర్యం వ్యక్తం చేసింది.
ఆ తర్వాత మేమెప్పుడు చూసినా వాళ్ళిద్దరూ, భార్యా భర్తల

లా, మసిలినట్టే ఉండేది కాదుమా జగ్గా రావు మావయ్య రోజూ, రాత్రి

వొంటి గంట తర్వాతే వచ్చేవాడు. ఇంటి బయట మంచం, పరుపూ, దోమ

తెరా, వేసుకుని,నిద్ర పోయేవాడు.


అమ్మమ్మ" ఎక్కడికి పోతావురా అంత సేపు రాత్రి పూట" అడిగితే,

"నేనెక్కడికి పోతాను" అని ఎదురు ప్రశ్నించి " స్నేహితులతో

మాట్లాడుతుంటే ఆలస్యమయింది."


"అంత రాత్రి పూట దాకా మాట్లాడే స్నేహితులెవరురా నీకు""అబ్బ కొంప కొస్తే ప్రాణాలు తీస్తున్నావ్" అని అమ్మమ్మని విసుక్కునే

వాడు.
శారదత్త వాళ్ళ నాన్న , ఊరి చివర నాలుగెకరాల పొలం కొని, పెద్ద

బంగళా కట్టిస్తా నంటే, అత్త వొద్ద ని ,చిన్న ఇల్లు చాలంది. దక్షిణం

వేపు రెండెకరాలు, మల్లె తోట వేయించింది. తూర్పు వేపు స్థలం లో కూర

గాయలు పండించేవాళ్ళూ. ఇప్పటికి, నేను చూసిన ఇళ్ళన్నింటిలోనూ అదే

అందమైన ఇల్లు.


చాలా సినిమాల్లో, హీరో ఒకావిడని ప్రేమిస్తాడు, ఎందుకో ఆవిడని పెళ్ళి చేసుకోలేక

ఇంకొకావిడని చేసుకుంటాడు. మొదటామె కళ్ళనీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతుంది.

నాకు హీరో మీద జాలేసేది. వీడు ఈ రొండో పిల్ల తో ఎలా కాపురం చేస్తాడో

పాపం మనసు లేకుండా అని. నాలుగు సీనులయ్యింతర్వాత ఈ రొండో పిల్లలో,

పెద్ద కళ్ళో, పెద్ద బొట్టో ఏదో బాగా నచ్చేసి, తర్వాతి సీన్లో, మూడు మాసాలో  ఆరు

 మాసాలో, ఆగమంటూ పాటందుకునే వాడు. సినిమా హీరోల కన్నా నాటకాల 

హీరో మావయ్యే నయమయనపించాడు. మావయ్యకి అత్తలో ఏం నచ్చలేదో,

ఎందుకు నచ్చలేదో ఇప్పటికీ నాకు పెద్ద మిస్టరీ.అత్త కూడా, స్కూల్లో సంగీతం టీచరుగా ఉద్యోగం చేరింది. పేరుకే సంగీతం

టీచరు, అన్ని పాఠాలూ చెప్పేది. ఇద్దరూ ఒకే స్కూల్లో పని చేస్తున్నా ఒక్క రోజు

కూడా కలిసి వెళ్ళేవాళ్ళు కాదు, వొచ్చేటప్పుడు కూడా ఎవరి దారి వాళ్ళదే.అత్త స్కూల్లో చేరింతర్వాత, మగ పంతుళ్ళందరికి, సోకులు, మాటల్లో మర్యాద,

పనిలో శ్రధ్ధ ఎక్కువైనాయి. కాని, ముందుకొచ్చి మాట్లాడటానికి భయపడేవాళ్ళు.

అత్త అందమే వాళ్ళని భయపెట్టేది అనుకుంటా.మగవాళ్ళు పేపర్లు దిద్దటానికి వేరే ఊరెళ్తే, అందరం అత్త వాళ్ళింటికి వెళ్ళే

వాళ్ళం. ఆడవాళ్ళనీ, పిల్లల్నీ చేర్చి,

మధ్యాహ్నం ఆటలాడించేది. చర్ పట్టీ , ఏడు పెంకులాట ఆడేవాళ్ళం..

బడి పంతులు లో అంజలీ దేవిలా నెమ్మదిగా ఉండే మా అమ్మమ్మ

కూడా, చిన్న పిల్లలాగా ఆటలో ఇన్వాల్వ్ అయిపోయి,

"పట్టేయ్యండ్రా ఆ సన్నాసిని, తొండి చేసి పారిపోతున్నాడు"అంటూ

కేకలేసేది.

రాత్రి ఇంటి వెనక పందిరి కింద, పెట్రోమాక్సు లైటు వెలుగులో

భోజనాలు చేసేవాళ్ళం. అత్త భోజనానికి పిలిస్తే తప్పకుండా,

పాయసం కాని పాయసం ఉండేది. ఆత్త పాయసం లాంటిది ఏదో చేసేది.

రుచి పాయసానికి దగ్గరగా ఉంటుంది కానీ పాయసం కాదు.

పలుకులెక్కువ, పాలు తక్కువ.
వేసవి సెలవలకి వూరు వెళ్ళి, బస్ దిగగానే, అత్త వాళ్ళింటికి పరిగెత్తాను.

అత్త ఇంటో లేదు. పెరటిలొకి వెళ్ళి చూస్తే, మల్లె తోటలో, సుబ్బులు,

సుబ్బులు మొగుడు తో పాటు అత్త కూడా పని చేస్తోంది. వడగాలి

వీస్తుంది. పెరడంతా రకరకాల పూల మొక్కల కుండీలు. చల్లగా పచ్చి

వాసన వొస్తున్న పందిరి. మట్టి అంటకుండా సిమెంట్ నేల. ముగ్గురు

కూర్చో గల వెదురు వుయ్యాల, మెత్త ని పరుపు ఉంది.


"అత్తా " అని పెద్దగా కేకేశాను. " నేనొచ్చాను చూడు" అన్నట్టు.


శారదత్త దాదాపు పరిగెత్తి వొచ్చినంత తొందరగా వొచ్చింది.


"ఇదేంట్రా ఇంత ఎండని పడి వొచ్చావ్, చూడు మొహమెలా వాడి

పోయిందో "అని, మబ్బు రంగు చీర చెంగు అక్కడే ఉన్న, నల్ల రాతి

నీళ్ళ తొట్టిలో ముంచి పిండింది. ఆ చల్లటి పైట కొంగుతో మొహం

తుడిచింది. అబ్బ ఎంత హాయి.కూర్చోబెట్టి, లోపలికి వెళ్ళి జున్ను తెచ్చింది. కత్తి తో కోసినా తెగనంత గట్టి

జున్ను. పక్కనే ఉన్న కొడవలి తో కొబ్బరి బోండాం కొట్టి, నీళ్ళు తాగించింది. ఏవో

మాటలు చెప్తూ ఉంటే నిద్ర వొచ్చింది. లేచేసరికి బాగా చీకటి పడింది. ఉయ్యాల

దిగి బయటికి చూస్తే, ఆకాశమంతా నక్షత్రాలు. పక్కనే ఉన్న మల్లె తోటలో,

కోయకుండా మిగిలిపోయిన మల్లె మొగ్గలు నక్షత్రాలు లాగా విచ్చుకున్నాయి.


అత్త వంట చేస్తుంది. సుబ్బులొచ్చి నాకు స్నానం చేయించింది, నాకు స్నానం

చేయడం వొచ్చు అని చెప్పినా సరే.


అత్త లాగూ చొక్కా తెచ్చింది. నావే అవి, ఎక్కడి నుండి వొచ్చాయి.

" మీ అమ్మ, పెద్దమ్మ, ప్రసాదు వొచ్చి వెళ్ళారురా, నువ్వు నిద్ర పోతున్నావు. మీ

అమ్మే తెచ్చింది ఇవి, నువ్వు లేస్తే స్నానం చేయించమని"


ప్రసాదు మా పెద్దమ్మ కొడుకు. వాడికీ, నాకూ ఎప్పుడూ గొడవే. ఎప్పుడూ

ఓడిస్తాడు నన్ను అన్నిటిలో. అత్త, వాడికి కూడా జున్ను పెట్టి ఉంటుందా?

ఏమో.....

ఆలోచిస్తుంటే ,అత్త బాదంకాయ పళ్ళెంలో, వేడి అన్నంలోనెయ్యి  జీలకర్ర వేసిన 

కంది పచ్చడి, తెచ్చింది. నేను తింటూ ఉంటే తను మల్లెపూల మాల 

గుచ్చుతుంది.


"అత్తా, అందరు బియ్యం పండిస్తుంటే, నువ్వు మల్లెపూలు వేశావే, తోటలో?"

అడిగాను.


బియ్యం కాదు వరి.  మరి నువ్వు పెద్దయిన తర్వాత, నీ పెళ్ళాం 

పూల జడ కావాలంటే, వరి కంకుల్తో వేద్దామా?"


'పెళ్ళానికి పూలజడ'


ఆ వయసులో కూడా, ఆ మాటతో చక్కిలిగిలి పెట్టినట్టయింది.


', , నేనేం, పెళ్ళి చేసుకోనూ" గారాలు పోయాను."మరి ప్రసాదు పెళ్ళి చేసుకుంటే, వాడికోనా గోల అత్తకి అర్ధం అయ్యింది.

"ప్రసాదు అంటే ఇష్టం లేదని, ఆ అమ్మాయికి వెయ్యకపోతే ఏడవదూ? "అంది.


నిజమే మరి.


గుచ్చిన మల్లె చెండు, గోడ కున్న వేంకటేశ్వర స్వామి పటానికి వేసింది.

"నువ్వు పెట్టుకోవా అత్తా ?"

"మల్లెలు నలిగితే నాకు బాగోదురా"మేము మాట్లాడుకుంటుంటే మావయ్య వొచ్చాడు. అత్త, మావయ్యా ఎక్కువ

మాట్లాడుకున్నట్టే ఉండరు. మావయ్య అత్తతో మాట్టాడుతుంటే, అత్త ని

ఏమండీ అని పిలిచినట్లుంటుంది.బయటి ఆడవాళ్ళతో ఎలా వున్నాగానీ,

మావయ్య శారదత్తతో , చాలా మర్యాద గా ఉండేవాడు, ఏ భర్తా, తన భార్యతో 

ఉండనంత మర్యాదగా.మావయ్యకు కూడా భోజనం పెట్టింది. భోజనం చేసినంత సేపూ, వాళ్ళిద్దరి

మధ్య, మాటలే లేవు. తిన్న తర్వాత చేతులు కడుక్కుంటే, వడ్ల బస్తాల మీద ,

చేయి తుడుచుకునే గుడ్డ, తయారుగా వుంచింది. మా అమ్మా నాన్నైతే,

మేమందరం తిన్న తర్వాత వాళ్ళిద్దరూ, కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తారు. మా

నాన్న చేతులు కడుక్కుని, మా అమ్మ చీర చెంగు తోనే చేతులు

తుడుచుకుంటాడు.
మరుసటి రోజు, పిల్లలందరం, పెద్ద వంతెన కాలవ దగ్గర, ఈతలకోసం వెళ్ళాం.

వంతెనకు ఆనుకుని, కాలవ వొడ్డు, కొంత దూరం దాకా, సిమెంటు చేశారు.

పిల్లలు ఆ సిమెంటు, వొడ్డు మీద కూర్చునే వాళ్ళు. అదే కుర్ర రచ్చ బండ.

వూళ్ళో సంగతులు మాట్టడుకునే వాళ్ళు. నన్ను వొడ్డుకి దగ్గరగా, వాళ్ళ బట్టలకి

కాపలా కూర్చో బెట్టారు.ఈతకి ఇంకా చిన్నోణ్ణని మా అన్నయ్య నీళ్ళలోకి

వొద్దన్నాడు.


"జగ్గారావు కి మెంటలేంట్రా, ఇంట్లో పెళ్ళాన్నొదిలి, ఆ చేంబేడి డాన్సు

పంతులమ్మ చుట్టూ తిరుగుతాడే?" మా శంకరు అన్నాడు అన్నయ్య తో.


"ఏంటోరా, మావయ్యకు, అత్తకు మధ్య అసలు కెమిస్ట్రీ లేదు" అన్నయ్య ది సైన్సు

 గ్రూపు.


అప్పుడే ఒక ఈత కొట్టి అలుపు తీర్చుకుంటున్న శీను గాడు " కెమిస్ట్రీ కాదురా

అసలు ఫిజిక్......" వాడు మాట్టాడుతుంటే


వీడికీ మధ్య వాగుడెక్కువయ్యిందిరా “అని అన్నయ్యా, శంకరూ వాణ్ణి నీళ్ళలోకి

 తోసేశారు.

వాడు చేపలాగా ఈదుకుంటూ పోయాడు.ప్రతి వేసవిలో వూళ్ళో నాటకం వేస్తారు. మేమందరం ఈత చాపలూ, దుప్పట్లూ,


దిండ్లు తీసుకెళ్ళే వాళ్ళం నాటకం చూడటానికి. మా జగ్గారావు మావయ్యే హీరో.

అత్తని కూడా రమ్మనమని గొడవ చేశాను.


 “రావమ్మా, ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటావూ “అని పెద్దమ్మా వాళ్ళు బలవంతం 


చేశారు.


అత్త నాతో పాటే కూర్చోవాలని పట్టు బట్టాను. నాటకం మొదలు పెట్టబోయే ముందు,

ఆడవాళ్ళు, అత్త ను చూస్తూ కూర్చున్నారు. అతిలేత గులాబీ రంగు సాదా

చీరెలో అత్త గులాబి పూవుకన్నా బాగుంది.
స్టేజి మీద కొంత డైలాగుల నాటకం గడిచిన తర్వాత, డ్యూయెట్

మొదలైయ్యింది. మా మస్తాన్ రావు డైరెక్షనంతే మరి. మామూలు నాటకంలో,

సందర్భాన్ని బట్టి, సినిమా పాటలు కలిపి నాటకమేయిస్తాడు.

"తనివి తీరలేదే, నా మనసు నిండ లేదె" బ్యాక్ గ్రౌండ్ లో పాట వొస్తుంటే ,

జగ్గారావు మావయ్య, అరుంధతితో కలిసి స్టేజ్ మీద శృతి మించి రొమాన్స్

చేస్తున్నాడు. ఆడవాళ్ళందరూ, నాటకం చూడకుండా అత్త మొహమే

చూస్తున్నారు. నాటకం కన్నా, అత్త మొహంలో విచారమే బాగున్నట్టుంది.

...to be continued.


9 comments:

Sravya Vattikuti చెప్పారు...

హ్మ్ ! బావుదండి !

కృష్ణప్రియ చెప్పారు...

:) ఒకటి అర్థమైంది... మీ టపా చదువుతున్నప్పుడు అయిపోతుందేమోనని నెమ్మది గా చదువుతానని!

నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూస్తూ..

Chandu S చెప్పారు...

శ్రావ్య గారూ,
కృష్ణ ప్రియ గారూ,
Thanks for reading

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగుందండి.. అక్కడక్కడ కొద్దిపదాలతో అయినా మీరు చెప్పే వర్ణనలు ఆ దృశ్యాన్ని కనులముందు అవలీలగా ఆవిష్కరించేస్తున్నాయి.
అసలు నాకు తెలియక అడుగుతాను మీకింత శాడిజం ఏంటండీ.. ఆలుమగలు తిన్నగా కాపురం చేసుకోవడం మీకు నచ్చదా :-P
(ఏదో సరదాగా అంటున్నాను కోపం తెచ్చుకోకండేం :-)

Chandu S చెప్పారు...


 వేణూ శ్రీకాంత్ గారికి
కోపం రాలేదు. సంతోషం గా అనిపించింది. మీ కామెంట్ నాకు బాగా నచ్చింది.

నమ్మరు గానీ, నిన్నే అనుకున్నాను, ఇంకా ఎవరూ అడగలేదే అని, బహుశా నా బ్లాగు పెద్దగా ఎవరూ చదవరులే అని అనుకున్నాను.

అప్పుడెప్పుడో చందమామ రాశానే, దానికి నాకు నచ్చినట్టు ( మీకైతే ఇంకా నచ్చుతుందేమో) సుఖాంతమైన ముగింపు రాశాను. ఇంట్లో ఉన్న ప్రధమ పాఠకుడు, రాలు, ఎబ్బే ఇలా ఏం బాగుందీ, అని ఇంకోలా రాయి అని నాలో శాడిజం ఎక్కించారు.

ఎప్పటికైనా మీకు నచ్చేలా తిన్నగా కాపురం చేసుకునే భార్యాభర్తల కథ రాయాలని .. నా ఆశ.

మళ్ళీ అప్పుడు మీరే అంటారు అంతా తిన్నగా ఉందిగా, దానికి మీరు కథ రాయాలా, మా టైం దండగ అని.

Thank you

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

నమ్ముతానండీ యాదృశ్చికంగా అలా జరుగుతుంటాయ్:-) మిగిలిన వారి సంగతి నాకు తెలియదు కానీండి, శ్రావ్యగారు మీ బ్లాగ్ నాకు పరిచయం చేసిన నాటినుండి ఒక్క సారైనా మీ బ్లాగ్ చూడకుండా నా రోజు ముగించడంలేదు.
చందమామ ముగింపు మార్పించిన మీ ప్రధమపాఠకుడు/రాలు గారికి ధన్యవాదాలు చెప్పానని చెప్పండి :-)
నిజమే అన్నీ తిన్నగా ఉన్న కథ రాస్తే అలాంటి కథ ’మీరే’ రాయాలా? అలాటి కథలు రాసేవాళ్ళు ఇంకా బోల్డుమంది ఉన్నారుగా అని అనిపించచ్చేమో :-)

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారికి

శ్రావ్య గారికి సింగపూరెళ్ళి చీర పెట్టి రావాలనిపిస్తుంది, నా బ్లాగ్ గురించి మీకు చెప్పినందుకు.

Sravya Vattikuti చెప్పారు...

ఊ ఊ ఊ నాకు చీర వద్దు డైమండ్ నక్లెస్ కావాలి :)))))))

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హహహ :-)))

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి