11, ఆగస్టు 2011, గురువారం

అమృతం-1


continued from అమృతం

అప్పటి వరకు, సినిమాల్లో ఆడవాళ్ళే అందంగా వుంటారనుకునేవాడిని, నేనే 

కాదు, ఆమెను చూసి అందరూ చూసి ఆశ్చర్య పడ్డారు .లేత గంధం రంగు 

పట్టు చీర ఆమె వంటి రంగులో కలిసి పోతూ ఉంది. ఎంత చక్కటి జడ,

 దాదాపు మోకాళ్ళ దాకా ఉంది. పక్కనే కుర్చీలో కూర్చున్న మా జగ్గారావు

 మావయ్య తేలి పోయాడు అందంలో.

 అందరు పెళ్ళికూతుళ్ళ మాదిరిగాకళ్ళూ, తల వాలేసి 

కూర్చోకుండా,మామూలుగా చూస్తూ ఉంది. తలలో

 మల్లెలు, కొంచం ముందుకు పడి, మేమూ అందంగానే ఉంటామని చెప్పటానికి

 ఆదుర్దా పడుతూ వూగుతున్నాయి. అబ్బా ఏమిటంత చక్క దనం.

 పౌడర్లు, కంటినిండా కాటుకలతో, రంగు రంగు చీరల్తో, మిగతా 

ఆడవాళ్ళంతా లంకిణీ అక్క చెల్లెళ్ళలాగా ఉన్నారు. చిన్న బొట్టు తప్ప,

ఏమీ అలంకారాలు, పెద్ద నగలు పెట్టుకోలేదు. ఆమెకు అమే అలంకారంగా 

ఉంది.మా జగ్గారావు మాత్రం ఇంతోటి అందగత్తె లని, అప్పటికి ఓ వెయ్యి

 మందిని చూసానన్నట్టు, చాల నిర్లక్ష్యంగా చూస్తున్నాడు.పెళ్ళి ప్రమాణపు కాగితం తీసుకుని ఆమెతో చెప్పించటానికి మా పున్నయ్య

 బావ వురికి వొచ్చాడు. " అమ్మాయ్, నేను చెప్పినట్లు చెప్పమ్మా"అంటూ.

ఆయన చేతిలో నుండి కాగితం నెమ్మదిగా తీసుకుని తనే, స్పష్టంగా

 చదివింది. మొదటి సారి మాకందరికీ, పెళ్ళికూతురి గొంతు వినపడింది.దండలు మార్చుకున్న తర్వాత, అమ్మమ్మ హారతి ఇచ్చింది.

ముత్తైదువలని ఎవరినైనా పాట పాడమని అడిగింది. ఎవరికి వారే పక్కన వాళ్ళని పాడమని బలవంతం చేస్తున్నారు.

ఎవరో సరదాకి అన్నట్టు, " పెళ్ళికూతురు సంగీతం చదువుకుందిగా, పాడమంటే సరి" అని నవ్వారు.

పెళ్ళి కూతురి వదిననుకుంటా, " అవును, మా శారద బాగా పాడుతుంది,

నువ్వే పాడరాదూ శారదా" అంది. ఎక్కువ బతిమాలించుకోకుండానే

పాట పాడింది. “చందన చర్చిత నీల కళేబర" జయదేవుని అష్టపది

పాడింది. పాడే సమయంలో, మా జగ్గారావు మావయ్య లేచి అవతలకు

వెళ్ళిపోయాడు, ఇక తతంగం అయిపోయిందన్నట్టు.క్రితం సంవత్సరం మా రాముడు మావయ్య పెళ్ళైందా! పెళ్ళైన రోజునుండీ,

 పెళ్ళి కూతురు ఏ గదిలో ఉంటే ఆ గదిలోకి పని కల్పించుకు వెళ్ళి

 పెళ్ళికూతురి పక్కన ఎవరుంటే వాళ్ళతో అక్కర లేని సోది మాట్లాడే వాడు.


కానీ, పెళ్ళయిన తర్వాత కూడా, జగ్గారావు మావయ్య సంతోషంగా లేడు.

పెళ్ళికూతురిని తప్పించుకుని తిరుగుతూ ఉండే వాడు. ఎవరైనా పెళ్ళి

 తాలూకు వేళాకోళాలాడబోతే చిరాకు పడేవాడు. మా అమ్మమ్మ అది

 గమనించి, మా శారదత్తని కాఫీ ఇవ్వమనో, మంచి నీళ్ళు ఇవ్వమనో 

జగ్గారావు మావయ్య దగ్గరకు పంపేది.

నాలుగో రోజు, మరి అది అమ్మమ్మ పథకమో, యాదృఛ్ఛికమో తెలియదు 

కాని, " ఈ చిన్న బిందె తో నీళ్ళు తీసుకురా అమ్మా," అంది మా అత్త తో.

 వొరేయ్, అత్త ని బావి దగ్గరికి తీసుకెళ్ళు. అని నన్ను కూడా పంపింది. ఆ 

సమయానికే మా జగ్గారావు మావయ్య కూడా, స్నానానికి బావి దగ్గరకు

 వచ్చాడు. బిందె నూతి చెప్టా మీద పెట్టి మాట్టాడకుండా నించుంది.


 నేనే రాయబారం. " మావయ్యా, మాకు బిందె లో నీళ్ళు పొయ్యి".

 మావయ్య బకెట్ తో నీళ్ళు తోడి బిందె లో పోశాడు.

బిందె నడుము మీద పెట్టుకుని వెళ్ళ బోతోంటే, “మావయ్యతో మాట్టాడవే” అన్నాను అరిందాలా.


ఏమీ మాట్టాడకుండా, తన బంగారు వేళ్ళు, నీళ్ళలో ముంచి, నా మీద 

చిలకరించింది. నేను నవ్వుతూ తప్పించుకుంటే, ఆ నీళ్ళు మావయ్య మీద 

పడ్డాయి.


మావయ్యే మాట్టాడాడు.


" ఒక్క మాట, ఏమీ అనుకోక పొతే"


మావయ్య ఏదో చెప్పబోతున్నాడని వినటానికి అక్కడే నుంచుంది.

  అప్పటికే అత్త బుగ్గలు ఎర్ర బడ్డాయి.

ఒక్క నిముషం ఆగి నెమ్మదిగా అన్నాడు "ఇలాంటి పనులు ఎప్పుడూ చెయ్యొద్దు. నాకు ఇష్టం ఉండదు


..to be continued

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి