18, ఆగస్టు 2011, గురువారం

సుబ్బు- ఆవిడ- బ్లాగు-1


"రేపట్నుండీ నువ్వు పన్లోకి రావొద్దు.” సుబ్బు భార్య.


"ఎలా చేసుకుంటావే పనీ, పాపం దాన్ని రానివ్వు.” సుబ్బు.

"అది కాదండీ, మొన్న ఇది ఓ పూట సెలవు తీసుకుంటే, నేనే అంట్లు తోముతున్నానా? ఒకటే అయిడియాలు కుప్పలు కుప్పలుగా వొచ్చి పడ్డాయి. ఇంకో నెల వరకు బ్లాగు సరుక్కి లోటు లేదు. ఒక్క పూట అంట్లు తోమితేనే, ఇన్నొస్తే, ఇక రోజూ తోమితే, నా బ్లాగ్ సూపర్ హిట్...నిముషానికొకటి పోస్ట్ చెయ్యొచ్చు.”

" ఆ బ్లాగో , మూకుడో ఇటు పడెయ్యండమ్మా, దాని జిడ్డంతా వొదిలిస్తా.” వర్క్ ఎక్స్ పీరియెన్స్ అంతా వాయిస్ లో ధ్వనింపచేస్తూ పుల్లమ్మ.

" అర్జెంటుగా బయటకు నడవ్వే”


*************

ఇంట్లో ఉన్న అతి పెద్ద పళ్ళెంలో పులిహోర, చక్రపొంగలి, గారెలు

డైనింగ్ టేబిల్ మీదే రంగులద్దిన మాయాబజార్ సినిమా.

"పనికి మాలిన డాక్టరీ చదువులు. బిడ్డ ఎంత చిక్కిపోయాడో" మనవడి విశాలమైన వీపు సవరదీస్తూ నాయనమ్మ,

ఎస్వీ ఆర్ లా మాయలు చూపిస్తున్నాడు మనవడు.

"ఒరేయ్ బండ వెధవా, ఇలా తింటే, నీ మొహం ఏ ఆడపిల్లా చూడదు" సుబ్బు భార్య బెదిరించి పళ్ళెం లాక్కుని పదార్ధాలు చెత్త బుట్టలో పడేసి తీరికగా పళ్ళెం తోముతూ, తోముతూ..

" చూశావురా నీ పెళ్ళాం చేసిన చుప్పనాతి పని, స్వయంగా వొండి తెచ్చాను. బిడ్డ ముద్దుగా తింటుంటే? " ఏడుపు గొంతుతో నాయనమ్మ.

" ఏదో బ్లాగుకి అయిడియా వొస్తుందనిలే. నీ మీద కోపం కాదూ ..." సుబ్బు.

"పెళ్ళాన్ని వెనకేసుకొచ్చే చవట.”


******************"పుంజీ పెర్సెంటేజి కోసం ప్రతి వోడూ బ్లాగు చదవనూ, గుండెనెప్పి తెచ్చుకోనూ . మన హాస్పటల్ చాలక పక్క హాస్పటల్లోకూడా పేషంట్లని పెట్టాను. నేను పని చెయ్యలేక పోతున్నానే.”

"అయితే బ్లాగు పెట్టుకో ' పని చెయ్య లేక' అని "

"అది కాదే, అర్ధం చేసుకోవేమే నువ్వు .?“

"నీకు పేషంట్ల కన్నా ముందు వాళ్ళు నా అభిమానులని తెలుసుకో, వాళ్ళని కంటి రెప్పలాగా కాపాడుకో.”

" ఇల్లా అయితే నీకు విడాకులిచ్చి నేను వేరే....”

"బ్లాగులో పాతేస్తా" ఉరిమి చూసింది.

"ఉహూ..తూచ్.. విడాకులిచ్చి ఆ, అదే ..నేను సన్యాసం పుచ్చుకుంటా.”

" బాగుంది. రెండు సంబంధం లేని విషయాలు. విడాకులు- సన్యాసం మీద ఒకటి రాసి పబ్లిష్ చేస్తా.”

సుబ్బు కి ఏం పాలు పోక అక్కడే నుంచున్నాడు.

"ఇంకా ఇక్కడే ఉన్నావే? ఫో, నా అభిమానులకి చెప్పు ఈ పోస్ట్ పబ్లిష్ చెయ్యగానే వోదార్పు యాత్ర కొస్తానని.”

"చచ్చిపోతున్నానే. నా మీద దయ దలచవే“

“@ బ్లాగు ఓనరి మొగుడు గారూ, బ్లాగుని వొదిలే ప్రశ్నే లేదు. “**************


"ఎలా ఉంది అయ్యగారూ, అమ్మగారి బ్లాగు.”

"బ్లాగు పచ్చబడింది, నాకూ పచ్చనోట్లు వొస్తున్నాయి. “

"అంతే అయ్య గారూ, మనం ముగ్గు వేశామంటే తిరుగుండదు. ఏంటీ ఇలా వొచ్చారు? ఇంకెవరికైనా వెయ్యాల్నా ముగ్గులు? " మంత్రాల మర్రి,

విషయం చెప్పి సుబ్బు తన కష్టం వెళ్ళబోసుకున్నాడు.

"అమ్మగారు చెప్పినట్టు మీరుకూడా బ్లాగు పెట్టుకోండి సార్. డిస్కౌంట్ లో ముగ్గేస్తా.”


" డిస్కౌంట్ నాకెందుకూ? కొత్తగా 'కోటికే కుటుంబ ఆరోగ్యం' అనే కార్డు పెట్టా. దాంట్లో నీకే ఎంతో కొంత పెర్సెంటేజీ ఇస్తా. ఆవిడ బ్లాగు మూత పడేలా ముగ్గెయ్యి సామీ. “


"ఈ మధ్య బ్లాగులోళ్ళందరూ నా దగ్గరకే వస్తున్నారు. డబ్బు సమస్య కాదు, కాని, మా అయ్య బ్లాగు పెరుగుడు ముగ్గులే నేర్పాడు. విరుగుడు ముగ్గులు నేర్చుకోబోయే టైం కి పోయాడు. చేతా వాతా కాని ముగ్గులేస్తే నాకే కొడుతుంది. పెళ్ళాం బిడ్డలు లేక పోయినా బ్లాగు చూసుకుని బతుకుతున్నాను. నా బ్లాగు కొట్టకండి అయ్యా.”

"ఏదో ఒక మార్గం చెప్పుమరి, మర్రీ "

"ఒక పని చెయ్యొచ్చు. నేనో రిఫరల్ లెటరు ఇస్తాను నా స్నేహితుడుకి.”

"ఏంటీ నువ్వు కూడా రిఫరల్ ..”

"ఏదో మీ డాక్టర్లు ఆడుకుంటారే ఎముకలోడు, నరాలోడి దగ్గరకీ, వాడేమో ఫిజియోథెరపి అనీ ,అట్టాగే మేమూ, మీరంటే గొప్పోళ్ళు, మీది ఫుట్ బాలాట, మాదేముంది సార్ షటిలేగా, వాడికి నేనూ, నాకు వాడూ..”

"సర్లే సర్లే...అవ్వన్నీ తవ్వకు, విషయానికి రా"

" అమ్మ గారు ఇంత గట్టిగా బ్లాగు పట్టుకు కూర్చున్నారంటే దాని మూలాలు ఎక్కడో గత జన్మలలో ఇరుక్కుని వుంటాయి. నా స్నేహితుడు. గత జన్మల మీద రీసెర్చ్ చేసి ఇప్పుడు టివి ముందు కూర్చుని మనుషుల్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు. వాడి దగ్గరకెళ్ళండి. ఏమైనా ప్రయోజనముండొచ్చు.”

ఎప్పుడెళ్ళను?”

"వెళ్ళబోయే ముందు మీరో పని చెయ్యండి"


************

 మా ఇంటిల్లిపాది, రోజూ మీ బ్లాగు చూడకుండా అన్నం తినం, పప్పేసుకోం.మీరు గత జన్మలో కవయిత్రి మొల్ల అయ్యుంటారని మా ఆవిడా, కాదూ గార్గీ అని మా అమ్మా, మైత్రేయి అని మా చెల్లీ, కాదు కాదూ ఆవిడ అపర సరస్వతీ దేవి అవతారమని నేనూ తెగ కొట్టుకుంటూ ఉన్నాము. మేము చచ్చేలోగా మాలో ఎవరు కరెక్టో చెప్పండి. మీ జవాబు కోసం .. అఙాత మరియు ఫామిలీ


" @ అఙాత మరియు ఫామిలీ, ధన్య వాదాలు. నేను కూడా అదే అనుకుంటాను . గార్గీ, మైత్రేయి లాగా నేను పూర్వజన్మ లో ఎవరినో తెలుసుకోవాలని అనిపిస్తూ వుంటుంది.”

వెదుకుతున్న లింక్ .. విండో లోనే.

**********

గాలరీ లో వంద మంది ప్రేక్షకులు , ఓ పాతికమంది టివి మనుషులు, ఓ పది మంది చుట్టాలు. ఫోకస్ లైట్లు , కెమేరాలు మొహం మీద జూమ్ చేస్తూ ఉండగా, చాలా తేలికగా నాలుగు నిముషాలలో లక్షల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళాడు.

ఎక్కడో భోజరాజు కాలం దగ్గర ... ఆగింది.

"అదిగో కాళిదాసు, రాస్తున్నాడు. నేను వింజామర వీస్తున్నాను.

రాస్తూ రాస్తూ ఆలోచన తట్టక వ్యాహ్యాళి కి పోయాడు.

నేను తీసుకున్నాను ఘంటం. రాయలేక వొదిలేసినదంతా పూర్తిచేశాను.

వచ్చి చూసుకున్నాడు. పూర్తి చేయబడ్డ కావ్యం చూసి అంతా కాళీ మహాత్యం అంటున్నాడే.

అయ్యో నేను ఘోస్టునా?

నా ప్రఙాపాటవాలకు గుర్తింపు ఎప్పుడు దొరుకుతుందో? “

ఏడుస్తూ సుబ్బు భార్య.

గత జన్మల డాక్టరు ఏవో సజెషన్స్ ఇస్తున్నాడు."చాల థాంక్స్, నన్నే కాదు, నా పేషంట్లనీ, వాళ్ళ కుటుంబాలనీ రక్షించారు." సుబ్బు కళ్ళనీళ్ళ్ళు తుడుచుకుంటూ


*********సుబ్బు వాళ్ళ అమ్మ వొచ్చి దగ్గర్లో కూర్చుంది.


"ఒరేయ్ అబ్బాయ్, నా కడుపులో ఎప్పట్నుండో ఒక మాట ఉందిరా. కాపురానికొచ్చిన దగ్గర్నుండీ, నీ పెళ్ళాం చేసిన చుప్పనాతి పనులు, కుళ్ళు వేషాలు ఎవరితోనైనా చెప్పుకోవాలని. నువ్వా తీరిక లేని సన్నాసివి. నీ బిడ్డ కి నోరు తప్ప చెవులు లేవు. అందుకని, బజారెళ్ళి మంచిది చూసి నాక్కూడా ఓ బ్లాగు కొనుక్కు రారా.....అదే చేత్తో, నేను చెప్పేది రాసుకుని , కంపూపర్ లో ఎక్కించడానికి ఓ నరుసు పిల్లని ఇంటికి పంపు. కోడల్ని కూడలిలో కడిగేస్తా”

You too, Brutus?

దబ్బు మని సుబ్బు.


********


"నేనెక్కడున్నాను? నేనెవరిని? భోజరాజు నా? “ నీళ్ళు చల్లిన తర్వాత సుబ్బు లేచి అయోమయంగా అడిగాడు.


"కాదు సుబ్బ రాజువి. వెర్రి వేషాలెయ్యకుండా, లే, లేచి హాస్పటల్ కి పోయి నాలుగు కోట్లు కొట్టుకురా.గంజి కాస్తాను”


*********

8 comments:

సాయి చెప్పారు...

:))

chinni చెప్పారు...

ఈ పార్ట్ అంతగా మనసు కి హత్తుకొలేదండి..

Chandu S చెప్పారు...

Nice to see this honest comment. Thanks Chinni

jyothi చెప్పారు...

ఇంతకీ అత్తగారికి ఓ బ్లాగు కొనిచ్చారా లేదా?

Chandu S చెప్పారు...

కొనిద్దామా?

thanks

Andrew Foster చెప్పారు...

Very good joke about compooper Attamma, please write some comedies in English

అజ్ఞాత చెప్పారు...

' బ్లాగులో పాతేస్తా ' కొత్త తిట్టు బావుంది . పైకి అనలేకపోయినా నోట్లోనయినా గొణుక్కుంటా . థేంక్యూ డాక్టరమ్మగారు
మా అత్తగారు కూడా సేం అయిడియాలో ఉన్నారు. రామకోటి రాసినట్టూ బ్లాగుకోటి ( పోస్ట్లులెండి) రాసి బ్లాగులోకంలో ఆవిడ బోల్డు ఫేమస్ అయిపోయినట్టూ , నేనేమో ఆవిడ బ్లాగులో అజ్ఞాత కామెంట్లు వేసుకుంటూ నక్కి నక్కి తిరుగుతున్నట్టూ కలలొస్తున్నాయ్

naimisha yenduri చెప్పారు...

బాగుంది పడి పడి నవుకునామ్ము

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి