5, ఆగస్టు 2011, శుక్రవారం

ఆనందమే అందం

అబ్బ ఛీ ఇంత సిగ్గు, బిడియం లేని మనుషులేం?

ఆ పిల్లని పరీక్ష గా చూశాను. తేనె రంగు జుట్టు, చామన చాయ, మెరుస్తున్న పెదవులు. అవీ ఎప్పుడు చూసినా విచ్చుకునే. ఏమిటా అందం. వళ్ళు మండు తోంది. ఎంతసేపూ వాడి భుజం వేళ్ళాడుతూ. ఆ పిల్లకు సరే , వాడికైనా ఇంగితం లేకుండా ఏమిటా ముసిముసి నవ్వులు ఆ పిల్ల చెప్పే బుచ్చి కబుర్లు వింటూ. తెలివి తక్కువ బడుద్ధాయి.

ఆ పిల్ల మా బంగళా వైపే వస్తూంది, రోడ్డు దాటి. వాడు పని మాని ఆ పిల్లని కళ్ళతోనే రోడ్డు దాటిస్తున్నాడు. కార్లూ, ఆటోలని తప్పించుకుని వస్తుంటే ఓ... ఆదుర్దా పడుతూ, తిక్క సన్యాసి. ఇంతోటి పెళ్ళాం ఇంతలోకే ఏమవుతుంది?

కింద నుండి వినిపించింది ఆ పిల్ల కంఠం "ఇస్తిరీ బట్టలు వేస్తారా అమ్మ గారూ" అంటూ.

బట్టలన్నీ మూట కట్టుకుని గంతులేస్తూ, కాస్తైనా కుదురులేదు, ఛ ఛా.

రోడ్డు దాటి వెళ్తుంటే మళ్ళీ వాడు పని మానుకుని చూస్తున్నాడు. ఇంకెవరికైనా పెళ్ళైందా లోకంలో వీడికి తప్ప. వెర్రి వెధవ.

వెళ్ళీ వెళ్ళటంతోనే మళ్ళీ సోది. ఏముండి చస్తాయి తిక్క వాగుడూ వాళ్ళూనూ.

సరస్వతి వచ్చింది. నారింజ రంగు జరీ చీర, తెల్లటి తెలుపు. విశాలమైన కళ్ళు. పొడుగాటి జడ. కుదురైన శరీరం. అమ్మా, నాన్నలు అందమైన కోడలు కావాలని ఏడాది పాటు వెతికారు ఊళ్ళన్నీ. ఏదీ అందం?

"దార్లో పని ఉంది, కూడా రానా?” మెత్తటి గొంతు

"సరే.”

నిశ్శబ్దంగా వెళ్ళింది.

ఎంచక్కా అవసరమైనంత వరకే మాట్టాడుతుంది. కిటికీ లోంచి బయటకు చూశాను. ఆ పిల్ల మళ్ళీ వాడితో వాగుడూ, మరీ ఇంత విచ్చలవిడి తనం పనికి రాదు సుమా, ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం.

ఇద్దరం కార్లో కూర్చున్నాం.

ఈ వాచ్ మేన్ ఎక్కడ చచ్చాడు కారు బయటికెళ్ళే టైం లోనే ఎక్కడికో తగలడతాడు.

వుద్యోగం లో నుండి తీసెయ్యాలి వెధవకి తిక్క కుదుర్తుంది.

లోపల ఎవరో విచిత్రంగా చూస్తున్నారు నా వంకే

'ఏమిటోయ్ జగన్నాధం అంత విసుగు, నీ ఉద్యోగం లేకపోతే వాడికి జరగనట్టు.'

సరస్వతి కూడా వాచ్ మేన్ కోసం చూసి కారు దిగబోతోంది.

గేటు తియ్యబొయే లోగా ఆ పిల్ల పరిగెడుతూ వచ్చి గేటు తీసి నవ్వుతూ నుంచుంది.

బోడి చనువు, మెహర్బానీ పనులున్నూ,

నాకు వల్లమాలిన చిరాకు సుమీ. మా గేటు మేం తీసుకోలేమా?

కారు దాటే లోపల గ్లాసు దించి కార్లో సాయిబాబా బొమ్మ దగ్గరున్న గులాబీ తీసి సరస్వతి ఆ పిల్లకిచ్చింది.

మొహమంతా పరుచుకున్న నవ్వు.

ఏమిటో సరస్వతి కూడా అప్పుడప్పుడు తలకాయ లేని పనులు చేస్తుంది. ఎంతవరకు ఉండాలో తెలియక పోతే ఎట్లా?

కార్లో పెద్దగా మాటలేముంటాయి. వున్నా మాట్లాడాలా ఓ పద్ధతి పాడూ లేకుండా?

చిన్న నోట్ బుక్ తీసింది.

"అడ్వాన్స్ టాక్స్ కట్టాలి"

"ఎంత?”

సంఖ్య.

"ఎక్కడికి?”

ప్రదేశం

"మళ్ళీ ఎలా"

"లక్ష్మి గారి కార్లో"

అబ్బ హాయిగా ఉంటుంది ఇలా ముక్కలు ముక్కలుగా ముక్తసరిగా మాట్లాడుతూ వుంటే.


***********


ఫోన్

సార్, ఇవ్వాళ ఆఫీసుకి రావొద్దు. దార్లో గొడవలుగా ఉంది.

బాల్కనిలోకి వెళ్ళాను.

చక్కటి పూల కుండీలు, కింద గార్డెన్ లో చెట్లు గాలికి ఊగుతూ, పూలు ఉదయపు ఎండకు మెరుస్తూ. సెలవొస్తే బాగానే ఉంటుందే..

అటూ ఇటూ చూస్తుంటే మళ్ళీ ఆ జంట. ఒకటే వాగుడు. మూడంతా ఖరాబైంది.

లోపలికి వెళ్ళి తయారయ్యి కిందకు వొచ్చాను.

సరస్వతి నిశ్శబ్దం గా బ్రేక్ ఫాస్ట్ వడ్డిస్తుంది. వంట వాళ్ళు వినయంగా, దూరంగా..

నా స్పూన్, ఫోర్క్ చప్పుడు తప్ప, ఇంకేం వినిపించనంత పద్ధతిగా,

అవును ఇలాగే బాగుంటుంది. మనశ్శాంతి గా ఉంది.

లోపలెవరో జోకేమీ లేక పోయినా పెద్దగా నవ్వుతూ.

పోనీ సరస్వతిని కూడా తోడు కూచోమని తినమంటే.

ఛీ ఏమిటీ, నా మతిక్కూడా చెదలు పడుతోంది. అసలిదింతా ఆ పిల్ల వల్లే ...

తొందరగా, బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి నా రూమ్ లో కంప్యూటర్ చూసుకుంటున్నా.

ఏం చెయ్యాలి ఈ రోజంతా?

వద్దనుకుంటూనే, కిటికీ లోంచి బయటకు చూశా.


ఆ పిల్ల అలిగి దూరంగా కూర్చుందివాడు పని మానుకుని బతిమలాడుతున్నాడు.

 అంతే మరీ... ఎక్కువగా వాగుతుంటే అలాగే పోట్లాటలు అవుతాయి. బాగా అయ్యింది. ఆ మాటకొస్తే, నాకూ సరస్వతికి ఎప్పుడూ చిన్న తగాదా కూడా రాలేదు.లోపలి శత్రువు మళ్ళీ నవ్వు ఈ సారి జోకు విన్నట్టు.

పోట్లాట రావాలంటే మొదట మాట్లాడుకోవాలోయ్ జగన్నాధం. అంటూ.

నా బిజినెస్ శత్రువుల్ని అణగదొక్కినట్టు, ఈ లోపలి శత్రువుని కూడా...

అయినా వీడితో నాకేంటి అని, కిటికీలోనుండి బయటకు చూశాను.

ఓరి వీడి దుంప తెగా, ఇంతలోకి ఏం చెప్పాడో మళ్ళీ నవ్వులూ, సోదీ,.. పని మానుకుని.

నా గోధుమ రంగు కోటు పక్కన పడి ఉంది.

వళ్ళు మండింది.

పని వాణ్ణి పిలిచి, "గోధుమ రంగు కోటు తీయి.”

బీరువా అంతా వెతికి

"ఇస్త్రీ కెళ్ళినట్టుంది అయ్యా.”

"ఐతే తొందరగా తీసుకురా " పురమాయించాను.

పని వాడు వెళ్ళి ఏదో చెప్పాడు. పనిలో పడ్డారు.

 అమ్మయ్య కొద్దిగా చల్లగా ఉంది.లోపల గోల,

పేరు మార్చుకుంటావుటోయ్, కుళ్ళునాథం....కాసేపటికి

ఆ పిల్ల కంఠం కింద నుండి వినిపించింది. అమ్మా అయ్యగారి కోటు అంటూ.

సరస్వతిపైకి వచ్చింది.

"కోటు.”

"ఆఫీసు లేదు ఇవాళ"

ఆశ్చర్యం


భోజనం చేసి పైకి వచ్చాను.

వాడు ఆ పిల్లకు తినిపిస్తున్నాడు. ఏమిటో ఎర్రటి పచ్చడన్నం . నాకు మళ్ళీ ఆకలయ్యింది. పచ్చడన్నం ఆకలి. సరస్వతి పైకి వచ్చింది కాఫీ మగ్గుతో. నా అలవాటు అది. నా పచ్చడన్నం కోరిక చెపితే ఎలా చూస్తుందో ఊహించి ఆగిపోయాను.

కాఫీ మగ్గు తీసుకుని బయట నిలబడి చూస్తున్నాను. వాడు ముక్కలు ఏరి ఆ పిల్లకు తినిపిస్తూ, వాడు మాత్రం వట్టి అన్నం తింటూ. అంతగా నెత్తినెక్కించుకోవాలా? పిచ్చి వెధవ

విసుగ్గా తలుపు మూసేశాను.

వాళ్ళను అక్కడినుండి వెళ్ళగొడితే. నేనొక్క మాట చెప్తే చాలు వాళ్ల బండి తీసి ...

లోపల మనిషి, ' నువ్వు మనిషి వేనా' అంటూ భయంగా నా వంక చూస్తూ.

టివి పెట్టి చూస్తున్నాను.

ఒకాయన భార్యకు జడ వేస్తున్నాడు. ఛీ ఆడంగి..

ఛానెల్ మార్చాను. మరొకాయన సీమంతం చేస్తూ.. అబ్బబ్బబ్బా...

తోచడంలేదు. నా స్నేహితుడు, నాకు మల్లే ఏవో కంపెనీలు ఉన్నాయి. ఫోన్ చేశాను. ఈ మధ్యే భార్య కారు ఏక్సిడెంట్లో పోయిందట, తను కూడా పోయే మార్గం చెప్పూ అని ఏడుస్తున్నాడు.

ఏమయ్యిందీ వెధవలందరికి?

సరస్వతి వచ్చింది. చక్కటి చీరతో, పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా అదే రూపం.

చిన్ని గడ్డం. దగ్గరకెళ్ళి గడ్డం పట్టుకుని చూస్తే...

...పనేమీ లేక, నా బుర్ర కి కూడా తుప్పు పడుతోందనుకుంటా!

"అన్నపూర్ణమ్మ గారి మనవరాలి పెళ్ళి.”

"వెళ్ళు.”

'ఖాళీ గానే ఉన్నావుగా తోడు పోరాదూ' లోపల్నుండి సలహా.

ఇలాటి చేష్టలు మా ఇంటా...

'ఇంత చిన్న విషయానికి వంశం వరకూ ఎందుకులేవోయ్' మరింత లోపలికి వెళ్ళాడు.

ఎప్పుడో నిద్ర పోయానో తెలియలేదు.

సాయంత్రమవుతూ ఉంది.

స్నానం చేసి బయటకు వచ్చి గార్డెన్ లో తిరుగుతుంటే, ఆ జంట కనిపించింది కొత్త బట్టల్లో, మాటల్లో పడి నడుచుకుంటూ.

ఏముంటాయి అన్నన్ని మాటలు?

ఎలాగైనా ఇవ్వాళ అంతు చూడాలి. అంతంత కబుర్లేంటో!

మెల్లగా వాళ్ళ వెంట నడుస్తున్నాను. కొద్ది కొద్దిగా వెలుతురు తగ్గి పోతూ ఉంది.

వాళ్ళు ఎటు వెళ్తే అటు.

దగ్గర్లో ఉన్న సినిమా హాలు కెళ్తున్నారు.

నేను కూడా..

కింద క్లాసు టికెట్ కొనుక్కుంటున్నారు.

ఆగాను, వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా అదే క్లాసు టికెట్ కొందామని.

'టికెట్ కు డబ్బు తెచ్చావా తిక్కనాథం?, లోపలి వాడి ఆరా

ఎలాగైనా వాళ్ళ వెనక కూర్చుని, వినాలి ఆ వాగుడేంటో.. పట్టుదలగా ఉంది." హలో హలో జగన్నాధం గారూ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకూ, ఎప్పుడు రమ్మన్నా రాని వారు, బంద్ పుణ్యమా అని మా మీద దయకలిగింది, అమ్మగారు కూడా వస్తే బాగుండేది" అంటూ, పై క్లాసు వేపుకు తీసుకెళ్తున్నాడు హాలు యజమాని.

పై బాల్కనిలో కూర్చో బెట్టి, పైపెచ్చు చల్లటి కూల్ డ్రింక్ ఒకటి ,

నా ఆశల మిద జల్లుకోమనా...


************

మా బంగళాకు ఎదురుగా ఉన్న విశాలమైన ఖాళీ ప్రదేశం లో, ఫాక్టరీ లో పని వాళ్ళకు క్వార్టర్లు కట్టాము. ఆ రోజు ప్రారంభోత్సవం.

పొద్దున్నే నేనూ, సరస్వతీ బయలు దేరాం ఇంటి పట్టాలివ్వడానికి. వాడు ఇస్త్రీ బట్టలు తెచ్చి లోపల పెట్టాడు. ఆ పిల్ల వాడి వెనకే.. ఇంటిని పెద్ద కళ్ళతో చూస్తూ.

"సరస్వతీ,”

“?”

"వాళ్ళని కూడా రమ్మను,”

“?”

"ఇంటి తాలుకు పట్టా తీసుకోడానికి"

సరస్వతి పెదవులు విచ్చుకున్నాయి.

అందంగానే ఉందే.... ఆ పిల్లకు మల్లే....

10 comments:

Sravya Vattikuti చెప్పారు...

బావుందండి ! కాని లోపల మనిషి , బయటి మనిషిని ఎలా గెల్చాడు సడన్ గా:)))

Chandu S చెప్పారు...

Thanks Sraavya gaaru,

మొదటి నుండీ గెలుపు లోపలి మనిషిదే, సడెన్ గా ఏం లేదే?

Sravya Vattikuti చెప్పారు...

ఉహు చదువుతుంటే చివరి సంఘటన కాకుండా మిగిలినవన్నీ బయటి మనిషి , లోపలి మనిషి ని తొక్కి పెట్టినట్లు అనిపించిందండి :))))))

మీ నేస్తం చెప్పారు...

నాకైతే బయట మనిషె వాళ్ళని వెళ్ళకొట్టటానికి ఇల్లు ఇచ్చినట్టు అనిపించింది...తప్పుగా అనిపిస్తే మన్నించండి శైలజాచందు గారు:(

Chandu S చెప్పారు...

అయ్యో , అలా అర్ధమయ్యిందా ? నా 'రాతే' ఎక్కడో తప్పు గా ఉన్నట్టుంది.

ఇదో గొప్ప కథ అని అనుకోలేను కానీ, చిన్నexplanation ఇద్దామనుకున్నాను. నేను ఆ జవాబు చెప్తే, కథలో నేను ఉందేమో అనుకునే చిన్న అందం పోతుందని ఊరుకున్నాను.

మీ నేస్తం గారూ

'మన్నించండి' ఇంత పెద్ద మాటెందుకూ?

మీరు చదివినందుకు కృతఙతలు.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

"...అందంగానే ఉందే.... ఆ పిల్లకు మల్లే...."

ముగింపు బాగున్నది. కాని, మీరు పనిష్మెంటు కథలో ఉన్న సైకాలజిస్టు హీరో కనుక ఈ కథలో భర్త పాత్రను అనలైజ్ చేస్తే, నేస్తం గారు చెప్పినది నిజమే అని తప్పక చెప్తాడు.

Chandu S చెప్పారు...

కథ చదివిన తర్వాత Reader గా నాకు ఇలా అర్ధమయ్యింది.


కథ మొదలు కాక ముందే, ఈయన ఆ పిల్లకు ఫాన్.

ఈయన వద్ద డబ్బుంది, అందమైన భార్య ఉంది, ఆనందం లేని నిశ్శబ్దం కూడా ఉంది.

ఆ పిల్ల దగ్గర ఏమీ లేవు. అయినా ఆనందంగా, కబుర్లాడుకుంటూ....

అందని ద్రాక్ష పుల్లన.

వాళ్ళ సంతోషకరమైన జీవనం చూసి, ఎబ్బే ఏం బావుందీ అనుకుంటూ, విసుక్కుంటూ, సణుక్కుంటూ,

(లోపల్లోపల ఇష్టపడుతూ)

Achievers ని చూస్తే మనకి, కనీసం 'నాకు' కలిగే అసూయ, ఒక రకమైన చిరాకు చూపెట్టాడు కథ మొదట్లో.


"పోనీ సరస్వతిని కూడా తోడు కూచోమని తినమంటే.”

"చిన్ని గడ్డం. దగ్గరకెళ్ళి గడ్డం పట్టుకుని చూస్తే...”

"ఖాళీ గానే ఉన్నావుగా తోడు పోరాదూ"


ఆ పిల్ల తనలో కదలిక తీసుకు రావడానికి ప్రయతిస్తుందేమో నని ఈయనకు భయం, మార్పంటే భయం.

ఒక నిముషం వెళ్ళగొడదామా అనుకుని, వెంటనే ఆ ఆలోచనని అసహ్యించుకుని ( లోపలి మనిషి ద్వారా)


లోపల, బయట ఒకరే.

ఆయనకే తెలియదు ఆయన ఆ పిల్లనెంత అభిమానిస్తున్నాడో, ఆ అభిమానానికి పరాకాష్ట ( అమ్మో మాట మరీ బరువుగా ఉంది) ఫలితమే .. ఇల్లివ్వడంఆయన ఇల్లు ఇచ్చాడే కానీ మా ఇంటి ముందు ఇక ఇస్త్రీ బండి పెట్టొద్దనలేదే.


రోజూ నలిగిన కోటెక్కడ వేసుకెళ్తాడూ ఇంత పద్ధతి గలాయన.


కథ కన్నా explanation పెద్దగా వొచ్చిందే!

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

Good Explanation. But sub consciously, he must be trying to drive away the source of his irritation pointing out what he has not got in his life.

Chandu S చెప్పారు...

కథలో చిన్న మార్పు చేశాను, ఆ మనిషి మీద దురభిప్రాయం తొలగడానికి

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

This is the versatility of the medium of Blog, which (dis)comfort, Writers do not have in any other medium of expression. The story can be evolved with the reactions or (mis)understanding levels of the people who read and over)react.

కోకు కథలు బాగుంటాయి, అదే ఇంకొకాయన ఉన్నాడే ఆయన వ్రాస్తే చీ అని పుస్తకం విసిరేస్తాము ఏమిటి కథ! తేడా,చెప్పే పధ్ధతి, కథ ఎత్తుగడ, అన్నిటికన్నా ముగింపులో చదివే వాడికి చెప్పదల్చుకున్నది అర్ధం అయ్యి ఒక్క క్షణం ఇది మనగురించేనా ఏమిటి అనిపించేట్టుగా చెయ్యటం. ఆ చెప్పే విషయం మానవ సహజమైన బలహీనతలు ఆవతలివాడికే ఉన్నాయి, మనం పరిపూర్ణం అనుకునే పాత్రలను పెట్టి వ్రాయటం వలన కథలో సహజత్వం వచ్చును! కథ బాగున్నది.

As you rightly said discussion is more than the story in length, but not in depth.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి