14, నవంబర్ 2012, బుధవారం

నిన్ను నిన్నుగా....


కమలం లా వికసిస్తే కనుచూపు మేరలో నేను.

కలువలా విచ్చుకుంటే కనుమరుగవుతాను.

వేళకొచ్చే నాకు నీ వేడుకే చాలు.

నుదిటి సూరీడులా నీ దారి వెలుగవ్వనీ..


     ఇళ్ళ ముందు పిల్లలు పెద్దవాళ్ళు గోల గోల గా అరుచుకుంటూ టపాకాయలు కాలుస్తున్నారు. అమ్మా నాన్న ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉండి ఉంటారు. దీపావళి టపాసులు కాల్చి కొన్ని సంవత్సరాలైంది. అందరి ప్రహరీ గోడలమీదా దీపాలు. కొన్ని ఒంటరి దీపాలు. వాటిని చూస్తే జాలి కలిగింది. ఇంటికి చేరాడు. గాలి ఎక్కువగా లేదేమో తమ ఇంటి గోడల మీద, మట్టి ప్రమిదల్లో జోడు వత్తుల నూనె దీపాలు. సంతోషం గా కబుర్లాడుకుంటున్నట్టు ఉన్నాయి. గుండెలో ఆశ నింపాయి.

    తలపైకెత్తి చూశాడు. చిన్ని చిన్ని ఎలెక్ట్రిక్ దీపాలు మాలలు మాలలు గా పైనుండి వేలాడుతున్నాయి. గేటు తీసి లోపలకెళ్ళాడు. బయట మనుషులెవరూ లేరు. దీపాల వెలుగులో పచ్చిక మెరుస్తూ ఉంది. తెల్లని పాలరాతి వరండా మెట్ల మీద వరసగా అమర్చిన ప్రమిదల్లో వెలుగుతున్న వత్తులు. గుమ్మాలకు గుత్తులుగా వేళాడుతున్న బంతిపూల మాలలు. ఇల్లంతా బంగారపు కాంతి.

సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుంటానని అమ్మ చెప్పింది. ఏదైనా పేరంటం లాంటిది జరుగుతూ ఉండి ఉంటుందనుకుని ఇంటి బయట లాన్ లోనే పాలరాతి బెంచీ మీద కూర్చున్నాడు. అప్పటికి టపాసుల శబ్దాలు పలచబడ్డాయి. గాజుల అలికిడికి తలతిప్పి చూస్తే........నమ్మలేనంత వింత గా ఆమె. ఆమె తమ ఇంట్లోనా? ఎలా సాధ్యం?

పేరంటానికి ఆమెను కూడా పిలిచిందా అమ్మ. కానీ ఇలాంటి రూపంలో ఎప్పుడూ చూడలేదే తనను.

తెల్లటి పట్టు చీరకు చిన్న జరీ అంచు. మెడలో ఒంటి వరస ఎర్ర రాళ్ళ హారం. ఆమె ఆమేనా? అవును కానీ ఆమెనెప్పుడూ ఇలా చూడలేదే? ఎప్పుడూ స్వేచ్ఛతో గాలిని పలకరించే జుట్టు వెనక్కి తగ్గి, జడ లాగా అల్లుకుపోయి ఉంది. షర్ట్ అడుగున అజ్ఞాతంలో ఉండే తెల్లని చేతులు బయటకొచ్చి గాజుల్లో బందీలైనాయి.

ఆమె చేతులకు గాజులా? నుదుట ఎర్రటి బొట్టు. జుట్టు, బొట్టు, చీర, మెడలో హారం, గాజులు, వేటికవి వేటికవి చూస్తే అందంగా ఉన్నాయి. అన్నీ కలిసిన అద్భుతాన్ని దగ్గర్నుండి చూస్తూ ఉంటే మతి పని చెయ్యడం లేదు. అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం అవసరం, అదృష్టం కూడా.

దగ్గరకొచ్చి అతన్ని చిన్నగా తాకింది. ధ్యానం లోకి వెళ్ళడం సులభమే, బయటకు రావడం ఎంత కష్టం ! మాట్లాడితే కల చెదిరిపోతుందేమో, మాట్లాడకపోతే ఆమె అలిగి వెళ్ళిపోతుందేమో

"ఎంత బాగున్నావు?” అప్రయత్నంగా అన్నాడు.

నవ్వింది.

ఇలాటి మాటలు నచ్చవు ఆమెకు. కోప్పడదే. నవ్వుతుందే మరి?

"కోపం తగ్గిందా?”

"అదెప్పటికీ తగ్గదు. తగ్గకూడదనే అనుకుంటున్నాను." అతని కళ్ళలోకి చూస్తూ అంది. ఆ మాటల్లో కానీ, చూపుల్లో కానీ కోపం లేదు.

"వచ్చావుగా మరి.”

"వచ్చింది నీకోసం కాదు.”

అతనేం మాట్లాడలేదు. చిరునవ్వుతో అలానే నుంచుంది.

"ఎంతసేపు అలా నిల్చుంటావు. కూర్చో" అన్నాడు పక్కకు జరిగి.

"నాకేం నీ మర్యాదలు అక్కర్లేదు" చీర కుచ్చిళ్ళు సరి చూసుకుంటూ కూర్చుంది.

"చీరలో బాగున్నావు అనూ" అభిమానంగా చెప్పాడు.

కాబోయే అత్తగారు బహుమతిగా ఇచ్చారని ఇంగ్లీషులో చెప్పింది.

అత్తగారు చీరపెట్టారా? నిశ్చితార్ధం అయిందా? మనసు అతన్ని ప్రశ్నలడుగుతోంది.

"పెళ్ళెప్పుడు? " అడిగాడు బలహీనంగా

"తొందర్లోనే.”

"అబ్బాయి?”

"నీకూ తెలుసు" మామూలుగా చెప్పింది.

నాకూ తెలిసిన వాళ్ళా? ఎవరై ఉంటారు?

"అదృష్టవంతుడు.” అన్నాడు.

"నీకే అదృష్టాలు అవసరం లేదుగా " అంది.

"అంతమాటనకు అనూ, ప్లీజ్"

ఎవరో వస్తున్నట్లు అలికిడి అయితే ఆమె వెనక్కి తిరిగి చూసింది.

(To be continued)


  

9 comments:

సిరిసిరిమువ్వ చెప్పారు...

మరీ గుళ్ళో ప్రసాదంలా ఇంత కొద్దిగా వ్రాస్తే ఎలాగండి?..త్వరగా మిగతాది కూడా వ్రాయండి.

తృష్ణ చెప్పారు...

చాలా బావుందండీ..:)

ఆ.సౌమ్య చెప్పారు...

అన్యాయం, అక్రమం...బ్రహ్మాండం గా మొదలెట్టి ఇంత చిన్న పోస్ట్ రాయడం ఏం బాలేదు...త్వరగా మిగతా భాగాలు రాయండి.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అబ్బ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అనుకుంటూ మొదలుపెట్టినంతసేపు పట్టలేదండీ చివరికొచ్చేయడానికి :) హ్మ్.. అని నిట్టూర్చా... ప్రారంభం ఆసక్తికరంగా ఉంది, అదృష్టాలు అవసరం లేని ఆ దురదృష్టవంతుడి(?) గురించి తెలుసుకోవాలనే ఎదురుచూపులు మొదలయ్యాయ్...

అజ్ఞాత చెప్పారు...

"నుదుట ఎర్రటి బొట్టు. జుట్టు, బొట్టు, చీర, మెడలో హారం, గాజులు, వేటికవి వేటికవి చూస్తే అందంగా ఉన్నాయి. అన్నీ కలిసిన అద్భుతాన్ని దగ్గర్నుండి చూస్తూ ఉంటే మతి పని చెయ్యడం లేదు. అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం అవసరం, అదృష్టం కూడా"

చాలా బాగుంది. ఇంత బాగా ఎలా రాస్తారు?

చాణక్య చెప్పారు...

గుళ్లో ప్రసాదం కన్నా ఘోరం! ఇంతేనా? ఊరించి వదిలేస్తే ఎలాగండీ!? :(

రాజ్ కుమార్ చెప్పారు...

ఏదో.. రొమాంటిక్ స్క్రిప్ట్ కి ట్రైలర్ లా ఉందండీ.. అదిరింది..
తొందరగా రాసెయ్యండి మరీ..

అన్నట్టూ మనలో మన మాట ..ఎవరండీ ఆ అలికిడి చేసిందీ??

మాలా కుమార్ చెప్పారు...

baagundi .

జ్యోతిర్మయి చెప్పారు...

రుచి చూశాము పాళ్ళు సమంగా కుదిరాయి. అరిటాకులతో మేము సిద్ధం, ఇక మీదే ఆలశ్యం.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి