15, అక్టోబర్ 2012, సోమవారం

చులకనగా చూడకు దేన్నీ    మన సినిమాల్లో హీరోయిన్ వెంట ఒక ప్రేమికుడు పడుతూ ఉంటాడు. వాణ్ణి చీదరించుకుంటూ, ఛీత్కరించుకుంటూ రీళ్ళన్నీ తినేస్తుంది. సిన్మాలో మిగతా కేరక్టర్ ఆరిస్టులందరూ తెగతిట్టిన తర్వాత రియలైజ్ అయి వాణ్ణి వెతుక్కుంటూ పోతుంది. అలా పోతుండగా బాగా ఆకలేసి ఒక కల్యాణమండపంలోకి వెళ్తుంది. పెళ్ళిలో దొంగ భోజనం చేద్దామని. అక్కడ ఇంకో ఆవిడమీద తలంబ్రాలు పోస్తూ హీరో కనబడతాడు . ప్రేమికుడి మీద అక్షింతలు వేసి, వెనక్కి వచ్చి ట్రాఫిక్ సమస్య లేని రోడ్డు మీద ఒంటరిగా ఎటో వెళ్ళిపోతుంది.

మనకు చిరాకొస్తుంది. ఏవమ్మా, మరీ తెగేవరకూ లాక్కపోతే ఏం, అప్పుడప్పుడు వాడివంక ఎంకరేజింగ్ గా చూసి నవ్వితే నీకీ గతి పట్టకపోను కదా అనుకుంటామా లేదా?

నీతేమిటంటే, మరీ వెంటబడుతున్నారు కదా అని చులకనగా చూడకూడదు. ఒకానొక సమయం లో నేను కూడా ఆ హీరోయిన్ లానే ప్రవర్తించాను.

ఇక చదవండి.

మీ పిల్లల్లాగే, మా పిల్లలూ ఆదివారం రోజు మాత్రం నాలుగింటికో అయిదింటికో తెల్లారకుండానే, నిద్రలేస్తారు. నా కళ్ళరెప్పలు లాగి లాగి వాటికింద కనుగుడ్లు చూసి, "అదుగో ఏక్షన్ చేస్తన్నావు, నువు మెలుకూగా ఉన్నావుగామ్మా, లే లే , మాటలూ చెప్పుకుందాం" అంటూ నన్నూ లేపుతారు.

రాత్రి ఇంటికొచ్చేసరికే రెండయ్యింది. సన్నటి ఇసక, పచ్చిమిరపలు కచ్చాపచ్చాగా దంచిన పచ్చడి రుచి కళ్ళలో తెలుస్తుండగా, " సరే చెప్పండి నేను వింటాను" అన్నాను. వాళ్ళదారిన వాళ్ళు ఎంతైనా వాగుతూ పోనీ! నేను ఎలాగైనా నిద్రపోదామన్న యుక్తితో.

"మనం మాట్టాడుకుంటుంటే నాన్నకి డిస్త్రబెన్స్. లే మరీ! హాల్లోకెల్లి లైటేస్కుని చెప్పుకుందాం".
పిల్లల ప్రేమ రుచి ఎరగని  గురకల  తండ్రి ఎంత దురదృష్టవంతుడు. బ్రాహ్మీ ముహూర్తంలో పిశాచ గణ కోలాహలాన్ని వినగల ఈ మహత్తర అవకాశం మరియు ఇంతోటి అధిక ప్రేమ నాకే దక్కినందున, విసుగు కనపడనీయకుండా తీవ్రమైన సంతోషం కనబరుస్తూ సోఫాలో కూలబడ్డాను. ఇద్దరూ చేరోవైపున చేరి, నామీద వాళ్ళ కాళ్ళూ చేతులూ యధేచ్ఛగా పారేసి, జన్మతః సంక్రమించిన హక్కులు అనుభవిస్తున్నారు.

ధరణికి గిరి భారమా,
చెట్టుకు కాయ భారమా?

క్రితం రోజు చూసిన ఓ ఇంగ్లీషు సిన్మా విశేషాలు నాతో చెప్తారట. నేనా కబుర్లు వింటే భలే సంతోష పడతానట. వీళ్ళకు నాతో కబుర్లేమిటీ? కయ్యమైనా, నెయ్యమైనా సమానమైన వాళ్లతో చెయ్యాలంటారుకదా, వీళ్ళు నాతో దేనిలో సమానం. పిల్లకుంకలు , వీళ్ళెంత, వీళ్ళ స్థాయి ఎంత?

నా అనుమతి లేకుండానే మొదలెట్టింది కథ.

"మరే , మరే, ఒకడు నిద్ర పోతంటాడు. అహా, కాదు, ముందు ముందు ఆళ్ళమ్మొచ్చి, రాత్రి పొడుకోబోయే ముందు ముద్దు పెట్కుని దుప్పటి కప్పి, కాదు కాదు ముందు దుప్పటి కప్పి తర్వాత ముద్దు పెట్కుని రాత్రంతా ఆడిపక్కనే ఎల్లిపోకుండా కూచ్చుని, కథ చెప్తా పక్కనే కూచ్చుంటది.”

నా తద్దినానికొచ్చి వీళ్ళు చూసే సిన్మాల్లోనే ఉంటారు, ఈ అతి మంచి తల్లులు.


"చాలా రాత్రి, మళ్ళీ ఇంకా చాల్సేపు పొడుకునీ, పొడుకునీ తర్వాత్తర్వాతెప్పుడో నిదరలేస్తాడు. వాళ్ళ అమ్మ లేపదు (సెటైరా). ఆడే ఎప్పుడో లేస్తాడనమాట . బష్షు మీద పేస్ట్ ఏస్తాడు. తోముతాడు. స్నానం చెయ్యడు. మళ్ళానేమో బట్టలేసుకుంటాడు. గళ్ళ చొక్కా, కాదు, కాదు సారల చొక్కా. ఎర్ర సారలు పచ్చ సారలు. ఏసుకుంటాడు.”

"కాదమ్మా బ్లూ సారలు" సోదరుడి దిద్దుబాటు.

"ఏం కాదు పచ్చ సారలు.”

ఏవో సారలు, నా చావుకొచ్చే చారలు చెప్పండయ్యా.

"అమ్మా నేను మాట్టాడేటప్పుడు వాణ్ణి నోర్మూస్కోమను.”

"నీతో మాట్టాట్టం మొన్నో, ఎప్పుడో మానేశానమ్మా . నేను అమ్మతో సెప్తున్నా. " అని పిల్లతో చెప్పి "ఆవిఁతో నే పలకటల్లేదని ఆవిఁతో సెప్పు " నాతో అన్నాడు

తడికె మహాలక్ష్మి లా ఇద్దరి మొహాలు మార్చి మర్చి చూస్తున్నా.

"అయితే నేను కథ చెప్పను ఫో" అలుగుబాటు

చెప్పక పోతే మరీ మంచిది నువ్వే ఫో అని మనం అనకూడదు. తల్లీ బిడ్డల బంధం బీట్లు వారుతుంది

"ఏంటమ్మామరీనూ, హింతింత సస్పెన్స్ లో పెట్టి ఇప్పుడు చెప్పనంటే ఎట్టామ్మా, . ప్లీజ్ ప్లీజ్ చెప్పవా, చెప్పవా" అంటూ ఉట్టుట్టిగా బతిమలాడు కోవాల.


"ఇందాక ఏం చెప్పాను? "

ఇంతోటి నేరేషన్ కు నేను మాటలందించాలి.

"అదే ,చక్కగా స్నానం చేసి బట్టలేసుకున్నాడు.”

"దువ్వెన తో తల దువ్వు కుంటాడు. మనింటో బ్రౌన్ దువ్వెన లేదూ , నాయనమ్మ దువుకుంటది అట్టాంటిది. సగం సన్న పళ్ళు, ఇంకో సగం పెద్ద పళ్ళు. దాంతో పాప్డీ తీసుకుంటాడు. తీస్కునీ, తీస్కునీ..”

బొత్తిగా ఎడిటింగ్ నైపుణ్యం లేదే పిల్లకు అనుకుని "అలాక్కాదు అక్కడక్కడ కొంచం కట్ చెయ్యాలి .”

"ఎట్టా కట్ చేస్తాం? దువ్వెన గట్టిగా ఉంటది గా, అట్టానే దువ్వుకోవాలి "

"సర్లే తొందరగా కానీ "

"అదిగో నువ్వు విసుక్కుంటన్నావ్. అట్టయితే నేను చెప్పనమ్మా. “

ఏవిటి తెల్లారగట్ట నాకీ హింస?

చిన్న పిల్లలలో ఇలాగ హింసా ధోరణి పెచ్చు రేగిపోతోందే!

తల దువ్వుకోవడం ఒక అరపేజీ, రాలిన చుండ్రు తాలూకు అవశేషాల విశేషాలకొక అరపేజీ చొప్పున పిల్ల పేణాలు తోడేస్తుంది.

ఆహా, అబ్బో, అట్టానా, వార్నీ, ఓరి వీడి దుంప తెగా లాంటి ఆశ్చర్యార్ధక పదాలు అప్పుడప్పుడూ వాడుతూ, ఒక సారి వాడినవి మరోసారి వాడకుండా జాగ్రత్తపడుతున్నాను. అలా అని మరీ బుర్రపెట్టకుండానూ ఉండకూడదు.

కథ చెప్తూ చెప్తూ వాళ్ళు మధ్య మధ్యలో ఆడియన్స్ కో పరీచ్చ పెడతారు. దానికి ముఫ్ఫై సెకండ్లలోపల సరియగు జవాబు చెప్పని ఎడల, శోకావేశంతో జుట్టు పీక్కుని, కింద దొర్లుతూ unmanageableగా తయారవుతారు. కనక ఒక చెవి కథాగమనం పై యుంచితే కొంత క్షేమం.

చావకొట్టేస్తు న్నారే! హింస తప్పించుకునే దారులు వెతికాను. పిల్లలు చెప్పే ఈ ఉరి కథా కాలక్షేపం బదులు సిన్మా చూస్తే బెటర్ కదా.

ఆ మాటే వాళ్ళతో అన్నాను. మీరు చెప్తూ ఉంటే సిన్మా చూసెయ్యాలనిపిస్తోందిరా. చూసేద్దాం అన్నాను. నాతో బాటు సిన్మా చూడటం వాళ్ళకు అత్యంత ప్రీతిపాత్రమైన పనుల్లో మొదటిది. తెలుగు సిన్మా అయితే ప్రతి షాటు కు, అదెక్కడ తీశారో, వాళ్ళు దర్శకనిర్మాతలైనట్టూ, నేనో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ అయినట్టూ సిన్మా చూపిస్తారు.
ఏదో ఇంగ్లీషు సినిమా


ఉట్టి మెటాలిక్ సినిమా. అంటే బేక్ గ్రౌండ్ అంతా మెటాలిక్ గ్రే, మెటాలిక్ నలుపు గోడలకు బిగించిన అర్ధం పర్ధం లేని మిషన్లు, పెద్ద పెద్ద చక్రాల్లాంటి స్క్రూలు. తెడ్డంత స్విచ్చులు. ఏ సినిమా చూసినా నేను హీరోయిన్ ఆహార్యం శ్రద్ధపెట్టి మరీ చూస్తాను.

హీరోయిన్ లంటే నాకున్న ఆసక్తి కొద్దీ ఒకావిడ కనిపిస్తే ఆవిడవంక చూస్తున్నా. కృష్ణకుమారి, వాణిశ్రీ ల వాల్జడలకు ట్యూనైన కళ్ళతో ఆవిడ అందచందాలు పరిశీలిస్తున్నా. బోడి గుండు చేయించుకుని నెత్తి మీద తారు రంగు పూసుకున్నట్లుంది ఆవిడ తలకట్టు. సిగ తరగ అని ఎవరూ తిట్టకుండా ముందు జాగ్రత్తా? .

ఆవిడ  మెటాలిక్ కలర్ లెదర్ తో తయారు చేసిన యూనిఫామ్ వేసుకుంది. అది ఎలా వేసుకుందో ఎలా తీయగలదో ఎంత సేపు చూసినా నా ఆలోచనకందలా. ఆ యూనిఫాంతోనే పుట్టిఉంటుందా అన్న అనుమానం కలిగింది. ఆవిడకు రక్తవర్ణపు లిప్ స్టిక్. ఫ్రేములో అదొక్కటే ప్రైమరీ కలర్. ఇంక మిగతా అంతా బూడిద, ఇనుము, ఉక్కు ల మిశ్రమ వర్ణాలు. ఆ వాతావరణం లో ఎందుకా అదనపు సోకు.

అంత సోకు చేసినా, అలవోకగా రేప్ చెయ్యగల, సమర్ధుడైన ఓ తెలుగు సిన్మా రౌడీ సైతం ఆవిణ్ణి చూస్తే, కన్ను కూడా కొట్టడు. పోనీ ఈవిడే వాడి మీద మోజు పడిందే అనుకుందాం, వాడు రాయుచ్చుకుని వెంటబడటం ఖాయం.

పక్కనున్న ఇంకొకడు కూడా ఉక్కు రంగు తోలు బట్టలతో ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎందుకో కొంపలు ముంచుకు పోయినట్లు పరుగులెత్తుతూ, హడావుడిగా ఆ మిషన్ల మధ్య మాట్టాడుకుంటున్నారు. అ మిషన్ల తాలూకు చక్రాలు సరిగా తిప్పకపోయినా, ఆ స్విచ్చులు సరిగా పైకో కిందకో వెయ్యకపోయినా లోకమంతా అల్లకల్లోలమవుతుందట.

అసలు లోకాల్ని కంట్రోల్ చేసే మిషన్లు ఎందుకు పెట్టుకుంటారు. అవి ఎటు పక్కకు తిప్పాలో అన్న వివరాలు వివరంగా రాసిపెట్టుకోవాలి కదా. పిల్లలిద్దరూ విపరీతంగా టెన్షన్ పడుతూ, పాప్ కార్న్ బొక్కేస్తున్నారు. రేపు కడుపులో నెప్పిలేస్తే ఎవడు జవాబుదారీ. ఈ సిన్మా వాళ్ళకేం హాయిగా ఉంటారు. నేనేగా తిప్పలు పడాలి.

ఇంకా ఎవరో ఊరూ పేరూ లేని బోలెడంత మంది సూట్లేసుకున్న మనుషులొచ్చారు. ఒకడికీ, పక్కవాడికీ రవ్వంతైనా తేడా లేదు. అందరూ కలిసి ఒకే సారి హీరో, హీరోయిన్ల మీద దాడి చేశారు. అనుకుంటాం గానీ మన తెలుగు సిన్మా రౌడీలకున్న క్రమశిక్షణ వాళ్ళలో లేదు. ఒకడొకడే లైన్లో వొచ్చి కొట్టించుకోవాలి గానీ ఇంగితంలేకుండా ఏవిటా మీదబడటం.

నిర్మాతక్కూడా బుర్రన్నట్టు లేదు. ప్రతి రౌడీకూ అంతంత ఖరీదైన సూట్లెందుకు. మన నిర్మాతలైతే రౌడీల్ని సొంత బట్టల్లోనే రండిరా అని అంటారేమో. వాడు పోయినేడాది శుభ్రంగా ఉతికిన నెట్ బనీను వేసుకుని వచ్చేస్తాడు. కాస్ట్ కటింగ్ మీద కాస్త ధ్యాస లేకపోయినందువల్ల కదా వీళ్ళ ఎకానమీలు కుప్పకూలేదీ!


ఆవిడ ఏదో మాట్టాడుతుంది. వీడింకేంటో. ఇద్దరూ ఆడ, మగ అన్న గోలే లేదు. ఏవిటీ నస. జగ్గయ్య, జమున బుగ్గ మీద చిటికేస్తూ 'మూగవైన ఏమిలే' అంటూ ఆటపట్టిస్తుంటే ఎంత బాగుంటుంది. ఆ ఇనప డ్రెస్సులేస్కుని ఓ ముద్దూ ముచ్చట లేకుండా ఎంతసేపు .


టీవీ వైపు చూసి చూసి విసుగేసి పిల్లలవొంక చూశాను.

పిల్లకున్న రొండు పిలకలో ఒకటి ఊడి పోయి, ఇంకొకటి intact గా ఉంది. బాగా నూనె పట్టించి, కుంకుళ్ళ పులుసులో నాలుగు మందారాకులు కలిపి బాగా పీకి పీకి తలంటితే జుట్టుకు మెరుపూ వస్తుంది. పనిలోపని ప్రతీకారం తీర్చుకున్నట్లూ ఉంటుంది. పిల్లోడి దుబ్బు తల బాగా జీబులా పెరిగింది. రత్తయ్యను పిలిచి అర్ధ డిప్పకట్ చేయించాలి, ఇంకో అర్ధ సంవత్సరం వరకూ పనిబడకుండా. ఇలాంటి ఆలోచనలతో కొట్టుకు పోతుండగా,

పిల్లలిద్దరూ ఒకే సారి నావంక చూశారు. నేను ఫాలో కావడం లేదని తెలిస్తే కొంపమునిగిందే.

టీవీ వైపు చూశా. ముఖంలోని ఏ కండరమూ కదల్చకుండా, పల్చటి పెదాలతో లో గొంతుకతో తెరమీది అందగాడు ఏదో మాట్లాడుతున్నాడు. నా కుశాగ్రబుద్ధినుపయోగించి అది జోకై ఉంటుందని భావించి వెంటనే " ఓహ్హో హో, నాయనో, బాబో" అని చప్పట్లు కొట్టి ముందుకూ వెనక్కూ ఊగుతూ, జోక్ నాకర్ధమైనందువల్లే నవ్వుతున్నట్లు వాళ్ళకు నమ్మకం కలిగించబోయాను.

"అమ్మా నువ్వసలు ఎక్కడో ఉన్నావు. కాన్సంట్రేట్ చెయ్యట్లా" అని ఇద్దరూ తిరగబడపోయారు కానీ పనావిడ వచ్చి రక్షించింది.

అమ్మగారూ, ఇందాకట్నుండీ మీఫోన్ మోగుతుందమ్మా అని ఫోన్ తెచ్చి నా చేతిలో పెట్టింది.

"ఈ సిన్మా నీకు నచ్చలేదా?" అని జాలిగా అడిగారు. 

అమ్మయ్య అనుకుని "అవునురా నాకు నచ్చలేదు. పిచ్చిగా ఉంది. హీరో హీరోయిన్లు భార్యాభర్తలు కాదు. పిల్లల్లేరు. అందుకని నచ్చలా" అని చెప్పాను.

"సరే అమ్మా, అయితే నీకు మమ్మీ రిటర్న్స్ అనే సిన్మా చూపిస్తాం "అన్నారు ఉత్సాహంగా.

అమ్మయ్య ఇదొక ఫామిలీ సెంటిమెంట్ సిన్మా అయుంటుందనుకుని కథ ఊహించా. భర్తతో తగువేసుకుని పిల్లల్నొదిలి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక మమ్మీ. పిల్లలు ఏడుస్తూ, 'కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో' అని దీనంగా పాడుకుంటూ ఆ మమ్మీకోసం వెళ్తారు. 

కిడ్నాపులూ, కుట్రలూ, చేజులూ అయినాక మమ్మీ అనే అమ్మ ఇంటికి తిరిగి వస్తుందనుకుంటా అనుకుని "పెట్టండ్రా, అలాంటి సిన్మాలంటే భలే ఇష్టం. ఆ అమ్మ కష్టాలు పడుతుంటే ఆవిడలో నేనూ ఐడెంటిఫై అవుతూ ఏడుస్తాను. బాగుంటుంది."  అన్నాను.

కానీ నా అంచనా తప్పు. అదొక ఇసక సిన్మా. ఇసక మయం. ఎర్రటి ఎండలో మనం కూడా కూర్చున్నట్టు చుర్రున కాలిపోతున్నట్లూ, దాహమేసినా నీళ్ళు దొరనట్లు ఒకలాంటి ఫీలింగ్. ఒక సీనులో, గొంతులోకి గాలి బదులు ఇసకపోతున్నట్లు, పిల్లల తలలో ఇసకున్నట్లూ, తక్షణమే తలంట్లు పొయ్యాలన్న impulse కలిగింది.

 వాళ్ళకూ, మా పక్కింటివాళ్ళకూ కూడా సిగ్గొచ్చేట్టు, వాళ్ళిద్దర్నీ తిట్టి, మీతో కలిసి చస్తే సిన్మా చూడనని శపధం చేశాను. ఇప్పుడిక ఆ అవసరం లేదు. 

ఇప్పుడు పిల్లలు పెద్దయిపోయి ఎక్కడెక్కడో ఉన్నారు. పిల్లలు దూరంగా ఉన్నంత సుఖం ఇంకోటి లేదనుకోండి. నిద్రపోగలిగితే హాయిగా రాత్రంతా నిద్రపోవొచ్చు. లేపేవాళ్ళెవరూ ఉండరు.
చెరొక వైపు దిండ్లు పెట్టుకుని సోఫా మీద నేనొక్కదాన్నే కూర్చుంటా. హాయిగా నాకునచ్చిన పాత తెలుగు సిన్మాలు పెట్టుకుంటున్నాను. సినిమా చూస్తుంటాను కానీ కథేం జరుగుతుందో అర్ధం కావడంలేదు.

'ఈవిడ పిల్లల్ని మిస్ అవుతోంది' అని  గుసగుస గా అనుకుంటున్నారేమో. నాకలాటి బలహీనతలేం లేవు. ఎప్పుడో నా బుర్రకు emotion resistant helmet పెట్టేశా! It's working well.


29 comments:

హరే కృష్ణ చెప్పారు...

>>అదొక ఇసక సిన్మా. ఇసక మయం. ఎర్రటి ఎండలో మనం కూడా కూర్చున్నట్టు చుర్రున కాలిపోతున్నట్లూ, దాహమేసినా నీళ్ళు దొరనట్లు ఒకలాంటి ఫీలింగ్. ఒక సీనులో, గొంతులోకి గాలి బదులు ఇసకబడినట్లూ, పిల్లల తలలో ఇసకున్నట్లూ, తక్షణమే తలంట్లు పొయ్యాలన్న impulse కలిగింది.

LOL

Sravya Vattikuti చెప్పారు...

హ్మ్ ! ఏమి కామెంట్ రాయాలో తెలియడం లేదు :-(

Chitajichan చెప్పారు...

Excellent comeback :)

Mother sentiment tho first story anukuntaanu...

chaala chaala nachesindi naaku.. maa chaduvu raani ( telugu raani )srivari mundu.. padi padi navvutu mee post chadivaanu.. oka vanki or vaddanam koni iste kaani indulo unnadi chadivi vinipistaanu ani chepaanu :)

Pantula gopala krishna rao చెప్పారు...

చక్కటి కామెడీ సినిమా చూసినంత హాయిగా ఉంది.మీ పోస్టులోని ఆఖరి వాక్యం పోస్టుకే హైలైట్.పిల్లలు పెరిగి పెద్దవాళ్లయి వాళ్ల బ్రతుకులు వాళ్లు బ్రతుకుతున్న తర్వాత అనవసరమైన సెంటిమెంట్లతో జీవితాల్ని నరకం చేసుకోకూడదనే నీతి వాక్యాన్ని మీదైన శైలిలో చేప్పారు.హాయిగా నవ్వుకోగల ఇలాంటి పోస్టులు మాకందరికీ టానిక్కుల లాగా పని చేస్తాయి.అభినందనలు అందుకోండి.

శశి కళ చెప్పారు...

దేవుడా మా ఇంట్లో కూడా ఇవే సీన్స్.మళ్ళా మొహాన్ని లాగుతుంటారు నా వైపు ..నా వైపు అని ...ముమ్మి రిటర్న్స్ ..బాబోయ్ మీరు కేక

Palla Kondala Rao చెప్పారు...

మీ జ్నాపకాలు చెప్పిన విధానం బాగుంది.

Sunita Manne చెప్పారు...

చక్కటి గిఫ్ట్ శైలజగారూ. నేను ఎప్పుడూ చెబుదామనుకుని మర్చిపోయే విషయమేమిటంటే మామూలుగా కనపడేవిషయాలకు కూడా మీదైన అబ్సెర్వేషన్ ఉంటుంది. నిజం మీరు చెప్పింది, ఆ సినిమా కధలూ, తడికె కంప్లైంట్లూ ఇంకా ఆ దశలోనే ఉన్నాను.చెవులు వాచిపోతుంటాయి.ఎంత విన్నట్లు నటించినా.....ఇంతమంచిపోస్టు మనసారా ధన్యవాదాలు మేడం.ఏమి చేస్తాం పేరెంటింగ్ బ్లూస్:((

వేణూశ్రీకాంత్ చెప్పారు...

అబ్బేమేమేం అలా గుసగుసలాడుకోటల్లేదండీ.. అంతదాకా ఎందుకు.. శలవల్లో హాస్టల్ నుండి ఇంటికొచ్చిన వారానికి ఓ తెల్లారుఝామున లేచి కూర్చుని ఫ్రెండ్ కి ఉత్తరం రాస్తుంటే, అమ్మ కూడా లేచివచ్చి పక్కన కూర్చుని "ఏవైనా కబుర్లు చెప్పురా" అని అడగడం నాకు కూడా అస్సలంటే అస్సలు గుర్తురాలేదు. మీరేనా మేంకూడా ఎప్పటినుండో ఆ ERH వాడుతున్నాం మాది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది... ఆ!!

మాలా కుమార్ చెప్పారు...

:))

ఆ.సౌమ్య చెప్పారు...

:(( ఒక్కసారిగా అమ్మని కష్టపెట్టిన సందర్భాలన్నీ గుర్తొచ్చేసాయి

ఆ.సౌమ్య చెప్పారు...

శైలజగారూ..మేమంతా ఉన్నాం గా...మీ పిల్లల్ని మరిపించేలా అల్లరి చెయ్యమంటే చేసేస్తాం :))

చాతకం చెప్పారు...

I say it's generation gap. When you become a grandma, your grand kids would hate the same movies that your kids grew up and prefer inception style of more complicated movies. Good narration on the post by a real heroine. ;)

అజ్ఞాత చెప్పారు...

ఎప్పటిలాగే నవ్వించే టపా అనుకున్నా, చివరలో గుండె పిండేసారు.

"ప్రేమికుడి మీద అక్షింతలు వేసి, వెనక్కి వచ్చి ట్రాఫిక్ సమస్య లేని రోడ్డు మీద ఒంటరిగా ఎటో వెళ్ళిపోతుంది" ఇది చాలా బాగుంది

కాముధ

vasantham చెప్పారు...


హబ్బా,,నవ్వి, నవ్వి, కళ్ళల్లో నీళ్ళు వచాయి అంటే నమ్మండి.

నేను సెం, అంతే, ఒక్క పిసరంత బెంగ లేకుండా జాతర్ ధమాల్

అని కూర్చుని హాయిగా ఒక్కర్తీ టీవీ లో తెలుగు సినిమాలు చూస్తున్నా..

కొంచం కడుపులో దుఖం ఉన్నా...దాచేసుకుని మరి....

వసంతం.

వనజవనమాలి చెప్పారు...


సినిమాల గురించి మీ అబ్జర్వేషన్ .. చాలా బావుంది. ఆసాంతం.. ఎంజాయ్ చేసాను. కానీ ..

ఆఖరిలో మనసు పిండేసారు


ఈవిడ పిల్లల్ని మిస్ అవుతోంది' అని గుసగుస గా అనుకుంటున్నారేమో. నాకలాటి బలహీనతలేం లేవు. ఎప్పుడో నా బుర్రకు emotion resistant helmet పెట్టేశా! It's working well.

kiran చెప్పారు...

Hahahhahahahahahahhahaha super sailaja gaaru :D
Entha navvukunnaano…
Anni line lu bhale bahle unnayi…
Mummy returns aithe keka :D
Excellent anthe :)
Touching post at the same time :)

DURGA PRASAD KALIDASU చెప్పారు...

really super. i think you are brahmin. because like Jandhyala, what you are using words are like that. anyway, nice presentation. thanks for giving a nice healthy tonic..
durga prasad kalidasu

Chandu S చెప్పారు...

ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మిత్రులందరకూ క్షమాపణలు.
హరికృష్ణ గారూ, ధన్యవాదాలండి
శ్రావ్య, థాంక్యూ
@Chitajichan ,కథ వినిపించినందుకు వంకీ కానీ వడ్డాణం కానీ అడుగుతారా, ఇంకానయం చదివించినందుకు నన్నడిగారు కాదు. Thank you.
@Pantula gopala krishna rao garu, Thank you sir.
@శశి కళగారు, ధన్యవాదాలండి
@కొండలరావు గారూ, ధన్యవాదాలండి
సునీత గారూ, థాంక్యూ
వేణూ, మీరూ ERH వాడుతున్నారా, అవునులెండి హెల్మెట్ వాడకం తప్పనిసరి. Thank you.
మాల గారు, ధన్యవాదాలండి
మాల గారు, ధన్యవాదాలండి
అది కష్టం కాదులే సౌమ్యా, విలువైన జ్ఞాపకాలు.
అంతకన్నా ఇంకేం కావాలి.Most welcome.
@చాతకం Thank you sir.
@kamudha , ధన్యవాదాలండి.
@vasantham garu, ధన్యవాదాలండి.
వనజగారు, ధన్యవాదాలు మేడం
కిరణ్ గారూ, Thank you.

Chandu S చెప్పారు...

@DURGA PRASAD KALIDASU
I am not a brahmin.
ఈ మధ్య కాలం లో ఎవరికీ ఈ వివరం గురించి జవాబు చెప్పాల్సిన అవసరమే రాలేదు. ఎప్పుడో చిన్నతనం లో, తోటిపిల్లలు కులం గురించిన అడిగిన జ్ఞాపకం. మీ వ్యాఖ్యతో మళ్ళీ ఆ పాతరోజుల్లోకి నడిపించారు. Thank you.

Narayanaswamy S. చెప్పారు...

True. అలాంటి బలహీనతలు పట్తకుండా ఆయుర్వేదం మందు పుచ్చుకుంటున్నా.

కృష్ణప్రియ చెప్పారు...

ఈ మధ్య కాలం లో మీరు నవ్వించినంత వేరెవ్వరూ నన్ను నవ్వించలేదు.. Your posts are amazingly funny..

కృష్ణప్రియ చెప్పారు...

అంత నవ్వించి చివ్వర వాక్యం లో చివుక్కుమనిపించారు :-(

స్ఫురిత చెప్పారు...

మీ టపాలన్నీ వద్దు వద్దు అనుకుంటూనే ఆఫీస్ లోనే చదువుతాను...నా ఎదురు cube లో వున్నాయన ఈ పిల్లకి వేపకాయంత వుండి వుంటుందని అనుకుంటూ వుండి వుంటాడు నన్ను చూసి....:)

అంతలా నవ్వించి చివరి వాక్యానికొచ్చేసరికి మనసు తడిపేసారు...:(

రామ చెప్పారు...

నిజమేనండి మీ టపా తో నా మూడు ఐదేళ్ళ పిల్లలు ఇరవై ఏళ్ళ వాళ్లై చదువుకోవడానికో, ఉద్యోగానికో వెళ్ళిపోయినట్టు నీటిపొర కమ్మింది.

suma చెప్పారు...

Navvi navvi kallalo neelly tiruguthunte, thoodchukunelogaane Edipinchaarandi, Chivari vakhymtho:)

రామ్ చెప్పారు...

ఎన్నో భావాలు కలిగించిన రచన గురించీ ఒక్క ముక్క లో ఎలా రాయటం?

అందరూ చేప్పేసిందే మళ్ళీ ఎందుకు చెప్పటం?

... ఇలా అనుకునీ ఎన్నాళ్ళు రాయకుండా ఉండి పోవటం?

గత కొద్ది రోజులుగా ఈ బ్లాగ్ అంతా..... గ్లాసూ - నిమ్మకాయ తో సహా పీల్చేస్తూ కూడానా ....?!

సీరియల్స్ చదివి ఆగాం , కథలూ కబుర్లూ చదివి, కానీ అనుకున్నాం , 'నాన' గురించీ - పిల్ల కాయల గురించీ చదివాక .......

మహా ప్రభో .................... నమోన్నమః

"అసలు లోకాల్ని కంట్రోల్ చేసే మిషన్లు ఎందుకు పెట్టుకుంటారు. అవి ఎటు పక్కకు తిప్పాలో అన్న వివరాలు వివరంగా రాసిపెట్టుకోవాలి కదా.."

అసలు మన లోకాన్ని కంట్రోల్ చేసే పిల్లల్ని ఎందుకు కంటాం ? మీరే చెప్పాలి డాక్టర్ గారూ ....

Chandu S చెప్పారు...

సాక్షాత్తూ ఎమ్వీయల్ గారేనా నా బ్లాగులో కామెంట్ పెట్టిందీ? మీ ప్రశ్నకు సమాధానం ఏమో కానీ, కాలూ చెయ్యి ఆడకపోవడం అంటే ఏమిటో తెలుస్తోంది సార్.
Thank you very much for your valuable comment

రామ్ చెప్పారు...

డాక్టర్ గారూ

నమస్కారం !! నా పేరు రామ్ ప్రసాద్ - ఎమ్వీయల్ గారి అబ్బాయిని . నానారి పేరున బ్లాగ్ పెట్టాను . ఇంతకూ ముందు కామెంట్ లో పేరు రాయక పోవటం నా పొరపాటే . ప్రొఫైల్ లో నా పేరు ఉంది కదాని బద్ధకం కొంత , మీ బ్లాగ్ రసామృతం తాలూకు మైమరుపు కొంత .. కారణం !!

నానారు పైనించీ మీ బ్లాగ్ చదువుతూ ఉండి ఉంటారని నా నమ్మకం !! ఈ లోకం లోనే ఉండి ఉంటే - ఆయన శైలి లో - కామెంట్ తో ఊరుకోక - మీ రచనల గురించీ పది మంది తో తన ఆనందోత్సాహాలు పంచుకునే వారని మాత్రం చెప్పగలను.

భవదీయుడు
రామ్ ప్రసాద్

Chandu S చెప్పారు...

రామ్ ప్రసాద్ గారూ
నాన్న గారి సిగ్నేచర్ చూడగానే నాక్కూడా మైమరపు వచ్చింది. నాన్న గారి జ్ఞాపకాలతో బ్లాగ్ ప్రారంభించినందుకు అభినందనలు.
<< నానారు పైనించీ మీ బ్లాగ్ చదువుతూ ఉండి ఉంటారని నా నమ్మకం ! >>
పొరపాటు కు క్షమించండి

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి