14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

నేనూ - నా పొలిటీషియన్ కల
        పండిత పుత్ర పరమ శుంఠ అన్నారే గానీ,కూతురి గురించి చెప్పలేదే? లింగ వివక్ష నాకు నచ్చని విషయం. 'పండిత పుత్రికా పరమోత్తమ శుంఠికా' అన్న నానుడి కూడా జనాల్లోకి లాక్కెళ్ళి, కన్న కూతురిగా నా ఋణం తీర్చుకుందామనుకుని, మా నాన్న ఏయే విషయాల్లో పండితుడో , ఆ పుస్తకాల జోలికి చచ్చినా పోయేదాన్ని కాదు. అంచేత, పాలిటిక్స్, హిస్టరీ, జాగ్రఫీ నాకు అంతుబట్టని విషయాలైనాయి. 

   వారసత్వంగా పదవులు వచ్చినట్లు, చదువులూ రావాలి. అంతేగాని మీ నాన్న బాగా చదివాడు, నువ్వూ చదవాలి అంటే ఇదిగో, నాలాంటి శుంఠలే మిగులుతారు.

మా ఇంట్లో అందరికీ పాలిటిక్స్ అంటే విపరీతమైన ఆసక్తి. మొదట్లో అవంటే నాకు పరమ విసుగు. ఎందుకసలా పాలిటిక్స్. ఎవడు మనల్ని పాలిస్తే మనకేంటి. హాయిగా వేడి అన్నంలో చుక్క నెయ్యి, కంది పచ్చడి వేసుకుని భోంచేసే దానికి. పనికిమాలిన రాజకీయాలు అని చిరాకు పడుతుండే దాన్ని.

మా మేనమామలు పెదనాన్నలు అందరూ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గుక్కపెట్టి చెప్తూ ఇల్లంతా వేడెక్కించేవాళ్ళు. ఇంట్లో ఎవడికి వాడు విప్లవకవి లా ఫీలవుతూ, నేనో నిప్పు కణికను, నింగి కెగిరి పోతా, పక్కింటి వీరాసామి గడ్డివాముపైన పడతా అంటూ, వాగుతూ ఉండేవాళ్ళు. ఓ సారి, జడవేసే ముందు మా అమ్మ కొబ్బరినూనె సీసా కాసేపు ఎండలో పెట్టమంది. వీళ్ళవ్యవహారం ఏవిటో చూద్దామని, అది తెచ్చి ఒకడి వీపు కానించి చూశా. అదింకా గడ్డ కట్టింది. పోచుకోలు వెధవ .

వీళ్ళ కమ్యూనిస్ట్ సొద వింటూ పెరిగినందున ఎనిమిదో తరగతి లో రాష్ట్ర పతి పేరేవిఁటి అన్న ప్రశ్నకు చండ్ర రాజేశ్వరరావు అని రాసొచ్చాను. మా పంతులు గారు విజ్ఞానం అందరికీ పంచాలన్ని ఉద్దేశ్యం తో నా పేపర్ ని అన్ని క్లాసుల వాళ్ళకూ పంపించారు. అలా నా పేపర్, పరువూ ఒకే సారి ఊరేగించబడ్డాయి.

అనకూడదు కానీ మానాన్నకన్నీ తాహతుకు మించిన ఆశలు. నన్నేదేదో చెయ్యాలని కలలు కనేవాడు. క్విజ్ లో నూ, డిబేటింగ్ లోనూ, వ్యాస రచనలోనూ పాల్గొనాలనేవాడు.
రేడియోలో వింజమూరి లక్ష్మి ఏదో చక్కటి పాట పాడుతుంటే, వినేసి పోవొచ్చుగా. "అమ్మాయీ ఈ పాట నువ్వు నేర్చుకో, స్కూల్లో యానివర్సరీ రోజు నీతోపాడిస్తా" అని చెప్పాడొకసారి. ఆ యానివర్సరీ అయ్యేవరకూ తగ్గకుండా జొరం తెచ్చుకోవాలంటే పిల్లకెంత కష్టమో ఆలోచించడు.

మా వూరి డాక్టరమ్మను చూసి ఇదిగో అమ్మాయ్, నువ్వలా డాక్టరవ్వాలి అనేవాడు. కలెక్టర్ బంగళా చూసి నువ్వు కలెక్టర్ కూడా అవ్వాలనే వాడు. ఓ చేత్తో పూలదండలందుకుని మరో చేత్తో ఒడుపుగా జనాల వేపు విసిరేసే ఇందిరా గాంధీ ని చూసి ,ముచ్చట పడి నేను కూడా ఆవిడలా ఓ చలాకీ రాజకీయవేత్తనైతే బాగుండుననుకునేవాడు. నాకేమో చదువే సరిగా రాదు, ఇలా అనేక ప్రజ్ఞలు ప్రదర్శించగల సామర్ధ్యమెక్కడిది?

ఒకే మనిషి ఇన్ని కాలేరు కనక ఇద్దరం ప్లాను వేశాము. ముందు డాక్టరవ్వాలి . ఆ ఎం.బి బి ఎస్ పట్టా అలంకారంగా అట్టే పెట్టుకుని ఆ పైన , కలెక్టరవాలి. కొంతకాలం పాటు ఎడా పెడా మంచి పనులు చేసేసి, సిన్మాల్లోలాగా డాక్టర్ cum కలెక్టరమ్మ దేవతతో సమానం అన్న పేరు తెచ్చుకున్న తర్వాత, ఉద్యోగం మొహాన రాజీనామా విసిరికొట్టి రాజకీయాల్లో చేరి , లీడర్ అయిపోవాలి. స్టేజిల మీద ధారాళంగా ప్రసంగించేస్తూ ప్రజా సేవలో తరిస్తూ గొప్ప పేరుతెచ్చుకోవాలి. అదీ ప్లాను.

నాకేమో లోకజ్ఞానం తక్కువ. మీకు నా స్థాయి అర్ధం కావడంకోసం ఓ ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యన ఓ రెండువారాలు సెలవలొచ్చాయి. కెనడాలో సాంబడని మా కజినొకడున్నాడు. వాడికి నా మీద వల్లమాలిన అభిమానం. చిన్నతనం లో, అందరూ చెర్లో ఈతలేస్తుంటే , నీళ్ళలో దిగేందుకు భయపడి ఒడ్డునే కూర్చుని పిరికి సాంబడని పేరు తెచ్చుకున్నాడు. ఎదురు డబ్బులిచ్చినా ఎవరూ ఎత్తుకెళ్ళని కొన్ని లాగూ చొక్కాలకు వాడు నా సహకాపలాదారు. 

"అక్కా నేనెప్పటికైనా నీళ్ళలో కెళ్ళగలనా" అని ఏడుస్తుంటే, ధైర్యం చెప్పి వాడి భుజం తట్టి, వాణ్ణి గేదారోహణగావించి, చెర్నాకోలతో బలంగా దాని వెన్నుతట్టి చెరువులోకి పంపి, వీడు చెరువులో విహరించేలా చేశానని కృతజ్ఞతతో తల్లడిల్లుతూ ఉంటాడు. ఎప్పట్నుండో రమ్మంటున్నాడని ఈ రెండు వారాలు వాడిదగ్గరకెళ్దామనుకున్నా. ఆస్ట్రేలియాలో ఉన్న మా అన్నకు ఫోన్ చేసి  మన సాంబడి దగ్గరకెళ్తున్నానని చెప్పాను.

అదేమిటి మాఇంటికి రావొచ్చుగా అన్నాడు. సర్లే దారేగా, తిరుగు ప్రయాణంలో వస్తాలే అన్నా. "ఇండియాకు ఏది ఎటుపక్కుందో తెలియకపోతే ఎట్టా బాగుపడతావో" అన్నాడు.

అయినా ఏదెక్కడుంటే మనకెందుకు? టికెట్ కొనుక్కుని బోర్డింగ్ పాస్ తీసుకుని ఫైట్ ఎక్కేసి పొయ్యేదానికి!

మా నాన్న ఆశల్లో ఒకటి తీర్చేసరికి మా తాతలు దిగొచ్చి 'జనరల్ నాలెడ్జీ లేని నీకూతురు జనాల్నేం ఉద్ధరిస్తుంది కానీ, ఇంక చాలు రారా' అని మానాన్నను వాళ్ళతో బాటే తీసుకెళ్ళారు.

పాపం మానాన్న! కలెక్టర్ అవాలంటే ఏజ్ బారన్నారు. సరే పొలిటీషియన్ అయిపోయి నాన్న కల తీర్చాలని మధ్యన మరీ మరీ అనిపిస్తూ ఉంది. పొలిటీషియన్లు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఏం మాట్టాడుతున్నారు? అన్న విషయాలపై టీవీ చూసి ,కొంత హోమ్ వర్క్ చేశాను. చూసిన కొద్దీ రాజకీయాల్లోకి దిగేసేద్దాం అన్న ఉత్సాహం ఊపేస్తోంది.

దానికి తోడు బరువు కూడా పెరిగాను, వేపాకులు, కాకర పిందెలు తినీ డైటింగ్ చేసినా తగ్గడం లేదు. నా రాజకీయరంగ ప్రవేశ ప్రోత్సాహానికి ఇదో మంచి శకునం లా అనిపించింది. బక్క రాజకీయనాయకులెవరైనా పెద్దగా పైకొచ్చిన దాఖలాలు లేవు. స్లిమ్ గా ఉన్న పొలిటీషియన్స్ మీద జనాలకు లాంటి తక్కువ అభిప్రాయం ఉంటుంది. వెయిట్ తక్కువ వాళ్ళు చెప్పే మాటలకు, వెయిట్ తక్కువ.

మటన్ పులావులు, కోడి వేపుళ్ళు, కొర్రమీను పులుసులు తిని తిని బోరు కొట్టినపుడు టూర్లు వేయొచ్చు. ఎంచక్కా రోడ్డుపక్కన గుడిసె లో వాళ్ళు నూరుకున్న చింతకాయ పచ్చడేసుకుని తినేసి, వాళ్ళ పచ్చిపులుసుతో అన్నం తింటూ ఫోటోలు తీయించుకుంటే ఇంకేం గావాల బతుక్కి.

నేషనల్ పాలిటిక్స్ అయితే ఇంకా లాభం. నార్తిండియాలో ఓ చిన్న ఇంట్లో జొరబడి, ముక్కూ మొహం ఎరగనావిడ నెత్తి మీద చెంగు సవరించుకుంటూ పొయ్యి ముందు కూర్చుని వేడి వేడి రొట్టెలు తయారు చేస్తూ ఉంటే, పేనం మీంచి రొట్టెలు ప్లేటులో వేయించుకుని అదేదో సబ్జీ కూర ( పేపర్ కాయితకం లాంటి మాట) తినేస్తే అదీ బాగుంటుంది. అదుగో, అదుగో, మీరు కూడా టెంప్ట్ అవుతున్నారు.

చిన్నప్పటి ఆటలు పెద్దయిన తర్వాత ఆడుకోలేక పోతున్నందుకు అసలు బాధ పడక్కర్లా, అసెంబ్లీలో ఆడుకోవడానికి బోల్డంత మంది ఉంటారు. కోపాలొస్తే పెద్దమనుషుల్లా కప్పిపుచ్చుకోవాల్సింది అంతకన్నా లేదు. ఒకళ్ళనొకళ్ళు తోసేసుకుంటుంటే ఎంత బాగుంటుంది.

చిన్నపుడు కజిన్స్ అందరూ గుర్తొచ్చారు. ముందు మనం వెళ్తే తర్వాత ఒక్కక్కణ్ణీ లాక్కొచ్చి అసెంబ్లీలో కూలేసి ఏడుపెంకులాటో, మరి చర్ పట్టీనో ఏదో ఒకటి ఆడేసుకోవచ్చు. ఆ బల్లలు, అవీ ఓ తల కాయనెప్పి సరంజామా. అన్నీ గోడవారగా నిలబెట్టేస్తే బోల్డంత జాగా. స్పీకర్ టేబిల్ వరకూ ఉంచేద్దాంలే. ఎప్పుడైనా 'వీరీవీరీ గుమ్మడి పండు' ఆడాలంటే తల్లిలా కూచోడానికి ఒకరుండాలిగా.

అసెంబ్లీ లో మార్షల్స్ ఎత్తుకుని బయటకు తీసుకెళ్తుంటే రంకెలేస్తూ బయటికెళ్ళడం ఎంత బాగుంటుంది. ఎప్పుడో చిన్నతనం లో మా అన్నలో కజిన్సో ఇద్దరు చేతులు చతురస్రాకారం లో పట్టుకుని మమ్మల్ని ఎక్కించి దేవుడమ్మా దేవుడు అని ఊరేగించేవాళ్ళు. మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ వచ్చేనా, అసెంబ్లీ ప్రాంగణాన అలనాటి బాల్య క్రీడావినోద వసంతాలు వికసించేనా? ఇంతకూ ఆడమార్షల్స్ ఉంటారా అసెంబ్లీలో, ఉంటే నా బరువు మోయగల వాళ్ళై ఉంటారా. చూడాలి.

నేను పొలిటీషియన్ అయిపోయినట్లూ, రకరకాల పట్టు చీరలు సింగారించుకుని, మేచింగ్ నగలతో , చేతులనిండుగా మెహెందీ డిజైన్ పెట్టించుకుని కరువు బాధితు పరామర్శకెళ్ళినట్లు, వాళ్ళందరూ నన్ను చూసేందుకు ఎగబడి తొక్కిసలాటలో ప్రాణాలు విడిచినట్లూ, ప్రభుత్వం తరఫున నేను కుటుంబానికో కోటి చొప్పున నష్టపరిహారం ఇప్పించినట్లూ ఒకటే కలలు. కలలు కంటే సరిపోతుందా, దాన్ని సాకారమో ప్రాకారమో చేసుకోవాలిగా. అందుకే అటువేపుగా అడుగులు వేశాను.

అసెంబ్లీ  విధులేంటి, పార్లమెంటు  పనులేంటి? లోక్ సభేంటో తెలియదు, రాజ్య సభ అంటే తెలియదు. కొంచం జ్ఞానం అవసరం అనిపించి, జనరల్ నాలెడ్జీ పుస్తకం ఒకటి, 8,9,10 తరగతుల సోషల్ స్టడీస్ పుస్తకాలు చదివి ఒక నోట్స్ వ్రాసుకున్నాను.

జాగ్రఫీలో వీక్ కాబట్టి దానిమీద ఎక్కువ సమయం వెచ్చించాను. నా మేనల్లుడితో కూర్చుని దేశాలు- రాజధానులు ఇలాంటి విషయాలు బట్టీ కొట్టాను. లేకపోతే ఆవిడెవరో లాగా, భోపాలు నాది, నేపాలు నాది అంటే అసయ్యంగా ఉంటుంది. రోజాలు, విజయశాంతులు పుస్తకాలు చదువుతారో, ఆత్మవిశ్వాసం వొలకబోస్తూ మైకులో అట్టా అరిచి గీపెడుతుంటారు.

మొదట్లో కొంత ఇబ్బంది పడ్డాను కానీ, ఇప్పుడు నెలరోజుల నిరంతర సాధన వల్ల సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేసింది. ఇప్పుడు నిద్రలో లేపి అడిగినా నన్నపనేని రాజకుమారి పార్టీనో చెప్పగలను.ఏం కన్ఫ్యూజన్ లేదు.


అసలు పొలిటీషియన్ కావాలంటే ఏం చెయ్యాలి? రాజకీయనాయకుడితోనూ కనీసం బీరకాయ పొట్లకాయ రిలేషన్ లేదాయె. వారసత్వం ఎందుకసలు, గాంధీ, నెహ్రూ ఎవరికీ వారసులు కాదే. మన అన్న ఎన్ టీ ఆర్ మాత్రం ఆపాట్న వెనకెవరూ లేకుండా దూసుకెళ్ళలేదూ. నాకు మాత్రమెందుకు వారసత్వం. ఒరిజినాలిటీ నమ్ముకోవాలి కానీ వారసత్వం ఏం కూడుబెడుతుందీ? జైళ్ళలో మగ్గే వారు కొందరు, పెళ్ళీ పెటాకులూ లేక అలమటించేవారు కొందరు.

ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే, ఒక ట్రెయినింగ్ కో, ట్యూషన్ కో వెళ్ళాలి కదా, అలాగే రాజకీయ ట్రెయినింగ్ ట్యుటోరియల్స్ ఏవైనా ఉన్నాయా అని చూస్తే ఎక్కడా లేవు.

తెలిసిన రాజకీయ నాయకుడొకాయన ఉంటే, ఎలాగైనా ఆయన్ని బతిమాలి రాజకీయ ట్యూషన్ చెప్పించుకుందామని వెళ్ళా. సార్ పూజలో ఉన్నాడంటే కూర్చుని ఎదురు చూస్తున్నాం. పావుగంటకు వచ్చాడాయన. తెల్లని బట్టలు, ఎర్రని బొట్టు. అంత పెద్ద బొట్టు? ఇప్పటివరకూ , మా వూరి సిరిలచ్చమ్మదే నేను చూసిన పెద్దబొట్టు. సిరిలచ్చమ్మ రికార్డు బద్దలు కొట్టిన మొనగాణ్ణి చూసిన దిగ్భ్రాంతిలో, నుంచున్నాను.

అందరూ గుమికూడి ఏవేవో సమస్యల పేపర్లతో చుట్టుముట్టారు. ఆయన విసుక్కోకుండా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు.

రాజకీయాల్లో చేరాలంటే, రోజుకో వంద గ్రాముల కుంకుమ నుదిటికి మెత్తుకోవాలా, లెక్కన నెలకో బస్తా కుంకుమ కావొద్దూ? సంపాయించినదంతా కుంకుమకే ఖర్చయేట్లుందే. ప్రజాసేవ చేయడానికొస్తే ఇంతింత ఖర్చులేంటీ?


"ఏవిటాయన అట్లా ఉన్నాడు" అని నాకు తోడొచ్చినాయన్ని అడిగాను.

"అట్లా అంటే?" పక్కనున్నాయనకు నా భావం అర్ధం కాలేదు.

"అదే ఎర్ర బొట్టు, ఎర్ర కళ్ళు ?" అన్నాను.

" ఆయనెప్పుడూ పూజలో ఉంటారు, అందుకని" అని చెప్పాడు.


"పాలిటిక్స్ లో చేరితే నేనూ చెయ్యాలనమాట పూజలు." అడిగాను.

" ఆడవాళ్ళు చేయక్కర్లేదు." కంగారుగా అన్నాడు.

అన్నేసి పూజలూ, అంతంత బొట్లూ కూడా అన్నీ మగవాళ్ళకే . పోనీలే ఇదీ మంచికే. అయినా నా సౌభాగ్యాన్ని ఎప్పటినుండో నమ్మకంగా నిలుపుతున్న ఐ టెక్స్ కంపెనీ ఉందిగా. నాలు బొట్టుబిళ్ళ ల పేకెట్లు కొనుక్కుంటే సరిపోయే.

ఆయన నా ఉత్సాహం పట్టుదల గమనించి తర్ఫీదు ఇవ్వడానికి వొప్పుకున్నాడు. కొంత కాలం తర్ఫీదు తర్వాత mock exam పెడతానన్నాడు. ఉట్టుట్టి ప్రెస్ మీట్. దాంట్లో నేను పాసైతే కనక నేను రాజకీయాల్లో క్లిక్ అయ్యానన్న మాటే.

మీరే ప్రయోజనం ఆశించి రాజకీయాల్లోకొస్తున్నారు?

నాకంటూ సొంత ప్రయోజనాల్లేవు. ప్రజా ప్రయోజనాలకోసం ప్రాణత్యాగానికి సైతం వెనకాడను.
పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళెప్పుడూ అంటుంటారు, 'నువ్వు ఇక్కడికే వచ్చి కృష్ణా, రామా, ఒబామా అనుకోరాదా? ఎందుకీ కష్టం' అని. కాదు, నేను పుట్టిన గడ్డకోసం ఏదైనా చెయ్యాలి, నా అన్నదమ్ములకోసం, అక్కచెల్లెళ్ళకోసం నా జీవితం అంకితం కావాలి అనుకున్నాను. రానని చెప్పేశాను.
ఈ శరీరం మట్టిలో కలిసేంతవరకూ, నా శ్వాస గాలిలో ఏకమయ్యేవరకూ, ప్రజాసేవ చేస్తూనే గడుపుతాను.


పేదవాళ్ళకోసం మీరేమైనా ప్రత్యేక పాలసీ చేపడతారా?

వెనుకబడిన, బలహీన వర్గాల, స్వావలంబన, సంక్షేమం కోసం సమగ్ర సమైక్య పరి రక్షణ సంఘ నిర్మాణమే మా పార్టీ సిద్ధాంతమూ, ధ్యేయము.

మేడమ్, మీరు మాట్లాడుతుంటే, డబ్బాలో కంకర రాళ్ళు గిలకరించి నట్లుంది కానీ ఏం అర్ధం కావడం లేదండీ.

ఏమయ్యా జర్నలిస్టూ , మైకు పట్టుకుని ఏసీ కాబ్ లో తిరిగే నీకేం తెలుసు, జొన్నలు దంచిన చేతులు, కంకర రాళ్ళు తిన్న శరీరాలు మావి. పేదవాళ్ళ కడుపుకోతలు నీకేం అర్ధవుతాయి.

అదికాదు మేడమ్, పొంతన లేకుండా మాట్టాడుతున్నారు?

పొంత పక్కన , పట్టెడన్నం కోసం పస్తులుండే ప్రజల ఆకలి కేకల ప్రతిధ్వని ని ప్రపంచానికి వినిపించే జన ప్రతినిధిని. వాళ్ళ కష్టాలు తీర్చడానికొచ్చిన వారి సొంత ఆడపడుచుని.

మీమీద ఆరోపించబడ్డ అవినీతి, ఆరోపణల గురించి ఏమంటారు?

(సోఫాలో వెనక్కి వాలి, కులాసాగా పెద్దగా ఓ రెండునిముషాలు నవ్వి) అవ్వన్నీ నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే తప్ప మరొహటి కాదు.
నిరూపించమనండి నేను రాజకీయ సన్యాసం తీస్కుంటా, నిరూపించలేకపోతే రాజకీయ కల్యాణం చేసుకుంటా
( అదేం మాట అని అట్టా చూస్తారే? మాటలనేవి మనలాంటివాళ్ళు పుట్టించక పోతే ఎలా వొస్తాయండీ?)

జీడిపాకంలా సాగుతున్న ఒక సున్నితమైన సమస్య మీద మీ అభిప్రాయం చెప్పండి. మీరైతే ఏం పరిష్కారమార్గాన్ని సూచిస్తారు?

సూత్రప్రాయంగా ప్రభుత్వ విధానాల సవరింపు కోసం, సున్నితమైన విధాన అధ్యయనం చేస్తూ, అఖిల పక్ష, భారతీయ, ప్రవాస, పృథక్కైన మేధావుల విస్తృత చర్చా వేదికనేర్పాటు చేసి, వేర్పాటువాదం నెరుపుతున్న, విభేదిస్తున్న పార్టీ వర్గాలన్నింటినీ ఒకే త్రాటి మీదకు తీసుకు రావడానికై నిరంతర కృషి సలుపుతున్నాం.

వుట్టుట్టి జర్నలిస్టులందరూ మాట రాకుండా పడిపోతే , పనివాళ్ళు నీళ్ళు చిలకరించుతున్నారు. నన్ను చూసి మా గురువుగారు దగ్గరకొచ్చి, 'చాలమ్మా చాలు' అని కండ్లు తుడుచుకున్నారు.

35 comments:

శిశిర చెప్పారు...

హహ్హహ్హ.

Nag చెప్పారు...

Baagundandi :)

రాజ్ కుమార్ చెప్పారు...

కొత్తగా చెప్పడానికేం లేదు.. as usual గా , ఎక్సెలెంట్ గా, ఎక్స్ట్రార్డినరీ గా ఉందండీ..
మీరు వీలయినంత తొందరగా సీయమ్మో, కుదరక పోతే అధమ పక్షం పీయమ్మో అయిపోవాలని కోరుకుంటున్నాను.

అన్నట్టు బ్రిటన్ రాణి పోస్ట్ ఖాళీ గా ఉన్నాదేమో వాకబు చేశారా?? అహా.. మీకేమ్ తక్కువండీ? మీరు నించోండీ.. నా ఓటు మీకే.. ;)ః)

Mahek చెప్పారు...

Super :D

చాతకం చెప్పారు...

మాటలనేవి మనలాంటివాళ్ళు పుట్టించక పోతే ఎలా వొస్తాయండీ?
....ఈ మాటకి వేసుకోండి రెండు వీరతాళ్ళు ;)

ఇంక మీరు ఓ చేత్తో పూలదండలందుకుని మరో చేత్తో ఒడుపుగా జనాల వేపు విసిరేయటం ప్రాక్టీసు చెయ్యటమే ఆలస్యం ;)

ఇందు చెప్పారు...

Hahaha. Super Sailaja garu. Addaragottaru rajakeeya tution lo meeku 100 ki 100 marks annamata ;)

అజ్ఞాత చెప్పారు...


అమ్మయ్య మళ్ళీ కనపడ్డారు, సంతోషం. ఎలా మిస్ అయ్యానబ్బా రెండు రోజులూ అని అనుకుంటున్నా. మీకు చిన్నప్పటినుంచి రాజకీయనాయకుల లక్షణాలున్నాయ్. మరెందుకూ ఆలస్యం 2014 ఎలక్షన్ లో సి.ఎమ్ అయిపోండి. అభినందనలు, ధన్యవాదాలు, అడ్వాన్స్ గా.

Sravya Vattikuti చెప్పారు...

హ హ సూపర్బ్ అసలు :-))) ఇదంతా ఏమో గానీ మొత్తం మీద మీరు రాజకీయనాయకురాలు అయ్యాక నన్ను మర్చిపోకూడదు :-)))

Narayanaswamy S. చెప్పారు...

brilliant.

Anuradha చెప్పారు...

పండిత పుత్ర పరమ శుంఠ అన్నారే గానీ , కూతురి గురించి చెప్పలేదే?
----------------------------------------------------
ఆ అన్నవాళ్ళకి కూతుళ్ళ తెలివితేటల మీద డౌట్ ఉండి ఉండదు శైలజ గారు :)
పోస్ట్ బాగుంది.

Chitajichan చెప్పారు...

Chaala bavundi.. welcome back

Sunita Manne చెప్పారు...

హహహ....కృష్ణా..రామా...ఒబామా:))) ఒక్కమాటలో బ్రెమ్హాండంగా ఉందీ పోస్స్ట్ అంతే....

టి. శ్రీవల్లీ రాధిక చెప్పారు...

చాలా బాగా రాశారు శైలజగారు. ఇదివరకు ఎపుడయినా వ్యాఖ్య రాశానో లేదో గుర్తు లేదు కానీ నేను మీ హాస్యరచనలకి పెద్ద అభిమానిని.శ్రీనివాస్ పప్పు చెప్పారు...

ఏంటండీ వీటిని కూడా రాతలంటారా,ఇలాగేనా రాయడం,ఇది చదవడానికి నిన్న రాత్రినించి పొద్దున్న దాకా కూర్చొని ఇన్నిసార్లు చదవాలా అసలు,వస్తున్న నవ్వుని ఆపుకుంటూ కామెంట్ రాయడం ఎంత కష్టమో ఎప్పుడన్నా అనుభవించారా మీకు..హుం..మీకెలా తెలుస్తుందిలెండి మీ పాటికి మీరు ఇలాంటి పోస్ట్ లు రాసేసి మా మొహాన్న కొడితే నవ్వలేక మాకొచ్చే కడుపునొప్పికి వైద్యం ఎవరు చేస్తారు,అయిన ఖర్చుకి డబ్బులెవరిస్తారు చెప్పండి.నేను వాక్ఔట్ చేస్తున్నా

జ్యోతిర్మయి చెప్పారు...

హహహ...శైలజ గారూ ప్రాక్టీసులు అయిపోయాయి. స్టేజి ఏర్పాటు చేసి మైక్ సెట్ పెట్టించడమే తరువాయి.

buddha murali చెప్పారు...

అబ్భో ఆమాత్రం కోచింగ్ తోనే నన్నపనేని రాజకుమారి ఏ పార్టీ లో ఉన్నారో చెప్పేస్తారా ? సరే అయితే ఆమె ఇప్పటి వరకు ఎన్ని పార్టీల్లో పదవులు చేపట్టారో చెప్పుకోండి చుద్దాం

అజ్ఞాత చెప్పారు...

టపా అదిరింది.

'శుంఠిక' కి ఈ మాటకి వేసుకోండి మరో రెండు వీరతాళ్ళు.

మీఇంటి ఆడపడుచు చెప్పారు...

అబ్బో...మీరు ఆరితేరిపోయారు . మీ రాజకీయ ప్రేలాపనలకి నేనెంత ముగ్ధురాలినైపోయానంటే ఇదిగో ఇప్పటికిప్పుడే మీకోసమే ఓ పార్టీ పెట్టేయాలన్నంత.
పదండి మరి అర్జంటుగా మీరో పాతిక నేనో పాతిక పట్టుచీరలు కొనుక్కొని మెహెందీ అవీ పెట్టించుకోవాలి. అన్నటు ఆవిడెవరో ట్రాక్టర్ నడుపుతూ ఇంటర్వ్యూ ఇచ్చింది. మరి ఆ ప్రయత్నాలు కూడా చేస్తే ప్రజలకి మరింత చేరువైపోవచ్చు.

అజ్ఞాత చెప్పారు...

వేడి అన్నం, నెయ్య చుక్క, కందిపచ్చడి చాలా టెంప్ట్ చేస్తున్నారు.

కాముద.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హహహహ ఆ పద ప్రయోగాలేంటీ, సెటైర్లేంటీ, బాబోయ్.. టపా ఆద్యంతమూ నవ్వించేశారండీ.. చాలా బాగుంది :)

రసజ్ఞ చెప్పారు...

:):):) శుభస్య శీఘ్రం! మీ టపా సూపరంతే!
చిన్నప్పుడు స్కూలులో రెండు మార్కుల ప్రశ్నకి కలెక్టరు విధులు వ్రాయమంటే, రెండు మార్కులకి ఆయనవెందుకులే అని సబ్ కలెక్టరు విధులు (ఇవి చాలులే అని నా ఫీలింగ్) వ్రాసిన రోజు గుర్తొచ్చింది.

the tree చెప్పారు...

వినాయక చవితి శుభాకాంక్షలు!

హరే కృష్ణ చెప్పారు...

హ హ్హ
చాలా బావుంది శైలజ గారు

ఆ.సౌమ్య చెప్పారు...

http://2.bp.blogspot.com/-Ob9K2it3aGQ/T1pZhwscRjI/AAAAAAAACG4/5x4CpDDBBs8/s1600/brahmanandam+whistle.gif

జవాబులు అద్దిరిపోయాయంతే..మీకు తిరుగులేదు,...మీరు గో...ప్ప రాజనీయనాయకురాలైపోతారు. మీవెనుక మేమున్నాం...మన నాయకురాలు శైలజమ్మ కీ జై :))

ఆద్యంతం నవ్వించారు...ఎప్పటిలాగే :))

santu చెప్పారు...

కెవ్వు కేక, బాగున్నదండి, మీ రాజకీయ రంగ ప్రవేశం...
మీరు తొరగా పెద్ద రాజకీయ నాయకులైపోవాలని ఆశిస్తూ....

kiran చెప్పారు...

hahhahahahahhahahahhahahaha...kevvvvvvvvvvvvvvvvv!!!
jai sailajamma..jai : :P

పుట్టపర్తి అనూరాధ చెప్పారు...

ఏంటండీ ..
ఆ టపా ఏంటి
పండిత పుత్రః పరమ శుంఠః
అయితే
పుత్రికలు శుంఠికలా
పండితుడైన తండ్రిని స్మరిస్తూ బ్లాగ్ పెట్టడం అందులో రాయడం మీకు తమాషాగా అనిపిస్తూందా
మా నాన్న గారిపై వచ్చిన విషయాలన్నీ నెట్ పెట్టాలనుకోవడం తప్పా
పోనీ మీరేమైనా సకల కళా వల్లవనా
పండితుడైన తండ్రికి పండితుడో పండితురాలో పుట్టాలా సామాన్యంగా వుండకూడదా..
వుంటే వారిని గురించి ఏమీ రాయకూడదా..
నేనేమీ పండుతురాలనని చెప్పలేదే..
మా నాన్న పండితుడైన విషయాలు వివరించటానికి నాకు యోగ్యత లేదు సరే..
మీరు ఇంత నిర్లజ్జగా ఒకరిని అవమానిస్తూ అదేదో హాస్యమని అందరూ రాస్తే పొంగిపోతున్నారా..
పుస్తకాలైతే చెదలూ పట్టిపోతాయి
ఇంటర్ నెట్లో పెడితే ముందు తరాలకు అందుతాయన్న ఒకే ఒక సంకల్పం తప్ప
నేనేదో శుంఠనీ మీరు విజ్ఞాన ఖని అయినట్లు భావించకండి
ఒకరిని విమర్శిస్తూ హేళన చేస్తూ రాస్తే అది హాస్యం కాదు వెకిలితనం

Chandu S చెప్పారు...

అనూరాధ గారూ, నా పోస్ట్ మిమ్మల్ని బాధించితే ముందుగా మీకు క్షమాపణలు. మీరెవరో నాకు తెలియదు. మీ బ్లాగేమిటో కూడా తెలియదు. ఇది సత్యం. నేను బ్లాగుల్లోకొచ్చి వేరే బ్లాగులు చదివి కొన్ని నెలలవుతోంది . ఈ పోస్ట్ పూర్తిగా నా మీద నేను వ్రాసుకున్నదే. అవమానపరచాలన్న ఉద్దేశ్యం ఉంటే అది ముందుగా ఆ అవమానం నాకే అనుకోండి. మీరెవరో మీ నాన్న గారెవరో నాకు నిజంగా తెలియదు. ఈ పోస్ట్ మిమ్మల్ని, పెద్దవారూ, గౌరనీయులైన మీ నాన్న గారిని ఉద్దేశించి మాత్రం కాదు. మీరు పొరబడ్డారు. అయితే నా పోస్ట్ వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యురాలిని.

పుట్టపర్తి అనూరాధ చెప్పారు...

సారీ అండీ
చదవగానే ఆవేశానికి గురయ్యాను
ఒకరిలాగే మా అక్కయ్యను డైరెక్ట్ గా విమర్శించారు
ఆమె గత ముఫై ఏళ్ళుగా మా నాన్న గారి పుస్తకాలని ముద్రిస్తూ ఆయన ధ్యాసలోనే జీవిస్తోంది
ఆమెను ఆ వ్యాఖ్య ఎంతగానో బాధించింది.
మీరు తెలియక చేసాను అంటున్నారు..
ఇప్పుడు నేను మిమ్మల్ని బాధ పెట్టినదాన్ని అయ్యాను..
కీర్తి శిఖరాలనందుకున్న వారి బిడ్డల మానసిక స్థితి మీరూహించలేరు..
వారు ఇక్కడ జీవించలేరు వారి వెంట పోనూ లేరు..
ఏమనుకోవద్దండి..
సరేనా ..

Chandu S చెప్పారు...

మీ స్పందనకు ధన్యవాదాలు అనూరాధ గారూ, నాన్న గారి వివరాలు నేను తెలుసుకునేందుకు దయచేసి మీ బ్లాగు లింక్ ఇవ్వగలరు. My sincere apologies once again if you are hurt with my post.

పుట్టపర్తి అనూరాధ చెప్పారు...

అయ్యో మీరు నన్ను సిగ్గుపడేటట్లు చేస్తున్నారు.
మీ మంచితనం ముందు నేను ఫిదా అయిపోయాను శైలజా..


http://puttaparthisaahitisudha.blogspot.in/

the tree చెప్పారు...

మీ ఇంటర్వ్యూ గొప్పగా వుందండి, రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభించరా,నేను కూడా చేరతాన్నండి....నోటిఫికేషన్ ఇచ్చేయండి,...

no చెప్పారు...

chandu garu,
mee * nenu napoliticiankalanu sankshipthanga vacche aadivaram andhrajyothi sanchikalo prachuristhunnam-
editor, andhrajyothi

Sree Sudha చెప్పారు...

excellent

Sree Sudha చెప్పారు...

superb andi..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి