21, నవంబర్ 2012, బుధవారం

నిన్ను నిన్నుగా -6వెంటనే డాక్టర్ ను పిలిపించాడు.

ఆమె ప్రెజెంటేషన్ కు వెళ్ళాల్సిన అవసరం గురించి చెప్పాడు.

"మురళీ, ఇలా ప్రెజెంటేషన్ ఉందని నిన్న నాతో ఓ మాట కూడా అనలేదే. ఆమె ఇప్పుడప్పుడే నిద్రలేచే అవకాశం లేదు. మధ్యాహ్నానికి మెలుకువ వస్తుంది కానీ, నిన్నంతా ఆహారం లేదు, దానికి తోడు ఇంజెక్షన్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ సేపు స్టేజ్ మీద నిలబడలేక పోవొచ్చు.  కనీసం గంటైనా ఉండదూ. స్పీచ్ మధ్యలో కళ్ళు తిరిగితే బాగోదుకదా. ఆమె ప్రెజెంటేషన్ మానేస్తే బెటర్. " సలహా ఇచ్చాడు.

"కనీసం కూర్చోగలదా?”

"కూర్చోగలదు. కానీ నిల్చుని చెయ్యలేదేమోనని నాడౌట్" అన్నాడు డాక్టర్.

అయితే పర్వాలేదుఆ తర్వాత అనూ వాళ్ళ బాస్ తో ఫోన్ లో మాట్లాడాడు. చిన్న ప్రాబ్లెం వచ్చిందనీ తను కాన్ఫరెన్స్ జరిగే చోటుకు వస్తున్నాననీ చెప్పాడు.

విషయం క్లుప్తంగా చెప్పి, సర్, మీరు సహాయం చేయాలి. ఎలాగైనా అనూ ప్రెజెంటేషన్ మధ్యాహ్నానికి పోస్ట్ పోన్ అయేట్టు చూడమన్నాడు. కొంత మంది గెస్ట్ స్పీకర్స్ తో స్వయంగా మాట్లాడి వాళ్ళు ముందు మాట్లాడేందుకు ఒప్పించాడు. ఆమెకు లంచ్ తర్వాత టైం కేటాయించారు.

" అనూ రాగలదా మురళీ?” అడిగాడు బాస్ .

"చూస్తాను సర్." ఆయనకు చాలా కంగారు గా ఉంది చివరి నిముషం లో అనూకి వంట్లో బాగోక పోవడం.

"ఒక వేళ ఆమె రాలేకపోతే?"

"Virtual presentation ఏర్పాటు చేస్తాను Skype ద్వారా."

"అంటే ఎలా?"

"తను రూం లోనే కూర్చుని, Skype ద్వారా ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఆడియన్స్ తో interactionఅంతా మామూలుగానే ఉంటుంది. కాకపోతే అనూ స్టేజ్ మీద కాకుండా స్క్రీన్ మీద ఉంటుంది. అదే తేడా" అని వివరించి అక్కడ కాన్ఫరెన్స్ తాలూకు టెక్నికల్ టీం తో మాట్లాడి అన్నీ సిద్ధం చేశాడు.

అనూ లేచేసరికి పదకొండు అవుతూ ఉంది. కర్టెన్లు వేసేసి, రూం లో టైం సూచించే గడియారాలు, లాప్ టాప్ , మొబైల్స్ అన్నీ ఏడింటికి సెట్ చేసి ఉంచాడు.

బయటికొచ్చి చూసింది. మురళి బయటే వెయిట్ చేస్తూ కనిపించాడు.

"మురళీ టైమెంతయింది." అడిగింది.

"ఇంకా చాలా టైముంది. రెడీ అవుతావా?" అన్నాడు.

నర్స్ సహాయంతో తయారయింది.

"ఏవిటో వళ్ళు తూలుతోంది మురళీ, ఇలా అయితే ఎలా?” అంది.

"అనూ, ఒక విషయం. డాక్టర్ చిన్న ప్రాబ్లెం చెప్పారు. బిపి తక్కువగా ఉన్నందువల్ల స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇబ్బంది అవుతుందనీ, ఎక్కువ టైం నిల్చోడం సాధ్యపడదనీ అన్నారు. గంట ప్రెజెంటేషన్ కాబట్టి " virtual presentation అరేంజ్ చేశాను.”

"అదెలా.?”

"ఆడియన్స్ తో interaction మామూలుగానే చెయ్యొచ్చు. అంతా రెడీగా ఉంది."

నిరాశగా కూర్చుంది. "ఇలా నేనెప్పుడూ చెయ్యలేదు మురళీ.”

" అక్కడ చెప్పినా ఇక్కడ కెమెరా ముందు చెప్పినా ఏం తేడా ఉండదు అనూ. ఇదే బెటర్, అలిసిపోకుండా ఇంకా బాగా చెప్పగలవు. టెన్షన్ పడకుండా కూర్చో" అని

బెడ్ మీద వెనక దిండు కానించి కూర్చో బెట్టాడు. ఆమె ఎదురుగా పేషంట్స్ ఆహారం తీసుకునే టేబిల్ బెడ్ మీదికొచ్చే విదంగా అమర్చి, దాని మీద ఆమె లాప్ టాప్ నుంచి, ద్వారా ప్రెజెంటేషన్ కు సిద్ధం చేశాడు.

ముందుగా, బాస్ వచ్చి, తమ సీనియర్ ఎక్జెక్యూటివ్ అనుపమకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల virtual presentation ఇవ్వడానికి సిద్ధంగా ఉందనీ గెస్ట్స్ అంతా సహకరించాలనీ రిక్వెస్ట్ చేశాడు.

అనూ స్క్రీన్ మీద కనిపిస్తూ, తను బాగానే ఉందనీ దయచేసి తన ఆరోగ్యం మీద కన్నా, తను చెప్పే విషయాలపై శ్రద్ధపెట్టమనీ కోరింది.

నెమ్మదిగా తొందరపాటు లేకుండా మొదలైంది ఆమె ఉపన్యాసం. ఆమె, తన రూం లో బెడ్ మీద కూర్చున్న విషయం, స్పీచ్ మొదలైన కొన్ని నిముషాల్లోనే మర్చిపోయింది. ఆత్మవిశ్వాసం నిండిన కంఠంతో ఆమె మాట్లాడుతూ ఉంటే, సంస్థ మీద ఆమెకున్న ప్రేమ, సబ్జెక్ట్ మీద ఉన్న అధికారం, తన ఉద్యోగం పట్ల నిజాయితీ అన్నీ కలిసి వినేవాళ్ళను మంత్రముగ్ధుల్ని చేశాయి.

కమ్యూనికేషన్ స్కిల్స్ లో తనకున్న అనుభవాన్ని కనబరుస్తూ ఉపన్యాసం ఏకపక్షంగా కాకుండా ప్రతి సారీ ఆడియన్స్ తో communicate చేస్తూ సహజంగా సాగించింది. ముప్పావుగంట గడిచిందని వినేవాళ్ళెవరూ గుర్తించలేనంతగా లెక్చర్ హాల్ లో తన ఎనర్జీతో నింపేసింది. మధ్య మధ్యలో సభికులతో interact అవుతూ, తనదైన శైలిలో చిన్న చమత్కారాలతో వాళ్ళ కాన్సంట్రేషన్ ఎటూ మళ్ళకుండా చూసింది.

ఆమెలో ఆమెలో ఆవేశం, కోపం తప్ప వేరే కోణం చూడని మురళికి అంతా ఆశ్చర్యంగా ఉంది. అనూ సామర్ధ్యం వినడమే తప్ప కళ్ళారా చూడని మురళి, ఆమె పెర్ఫార్మెన్స్ లైవ్ లో చూసి అతను అప్పటికప్పుడు ఆమె అభిమాని అయ్యాడు.. ఎదుటివారికి ఏ విషయమైనా అర్ధం అయేలా చెప్పగలనని అతనికి అతనికెక్కడో ఒక గర్వం ఉండేది. ఆమె ప్రెజెంటేషన్ శైలికి ముగ్ధుడై మనసులోనే ఓటమిని ఒప్పుకున్నాడు.

లెక్చర్ అయిన తర్వాత గెస్ట్ లందరూ అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబులలో ఆమె కనబరచిన spontaneity, authenticity కు అందరూ ముచ్చట పడ్డారు.

అంతా అయిన తర్వాత, అనారోగ్యం తో కూడా వృత్తికి ఆమె ఇచ్చిన గౌరవానికి, ఒక అసాధారణమైన ఉపన్యాసం విన్న ఆనందంతో హాల్లో ఉన్న శ్రోతలందరూ నిల్చుని చప్పట్లతో ఆమెను అభినందించారు మురళితో సహా.

ఆమెనే చూస్తున్న మురళి కి కళ్ళు తడి అయ్యాయి.

కెమేరా ఆఫ్ అయిన తర్వాత మంచి నీళ్ళ బాటిల్ ఇచ్చాడు. ఆమె తాగిన తర్వాత అతని వంక చూసింది. సాధించిన విజయానికి అభినందించడానికి అతనే దగ్గరకొస్తాడని ఎదురు చూసింది.

ఆమెను కౌగలించుకోమని, నుదిటి మీద జుట్టు చేత్తో వెనక్కి దువ్వి ముద్దు పెట్టుకోమనీ మనసు తొందర చేసింది. సుడిగాలిలా మెలిపెడుతున్న కోరికను అణుచుకుని, రూం లో ఉండటం అంత క్షేమం కాదని బయటకొచ్చి నుంచున్నాడు.

ఆమె కూడా లేచి బయటికొచ్చింది. కాలి బాట పై ఆర్చ్ లా అమర్చిన పూల తీగెల పందిళ్ళ కింద నడుస్తూ.
"కంగ్రాట్స్ అనూ, బాగా చేశావు . "

" థాంక్స్ , థాంక్యూ" అంది.

"థాంక్స్ అక్కర్లేదు అనూ. ఆ మాత్రం నన్ను చేయనిచ్చావు. నాకదే చాలు.”

"కానీ నేను నీకు ఋణపడి ఉండాలని అనుకోవడం లేదు. ఏదోలా తీర్చేస్తాను. చెప్పు నీకేం కావాలో అంటే , బుక్స్, గిఫ్ట్స్ లేదా ఏవైనా అలాంటివి" అడిగింది.

ఆమెలో మళ్ళీ చిన్ననాటి అనూ కనిపించి నవ్వాడు.

" ఏదిచ్చినా సరే డబ్బుతో కొనకూడదు.”

" అంటే?”

ఇద్దరి కళ్ళు కాసేపు చిక్కుబడి విడిపోయాయి.

" ఏమో నువ్వే ఆలోచించు. తెలివైన దానివి. బై " అంటూ వెనుదిరిగాడు.

ఈ సారి ఆమె అనుమతి తోనే ఆమె చేయి ముందుకు వచ్చి అతని చేతి స్పర్శ కోసం చూసింది. అతను గమనించలేదు. వెళ్ళిపోయాడు.

ఇద్దరూ ఎలాగైనా దగ్గరవుతారనీ, వినోదం చూడొచ్చనీ ఎదురు చూసిన పూల తీగెలు ఇంత విరసమైన జంటను ఎప్పుడూ చూడలేదమ్మా అనుకుని విసురుగా విసుక్కున్నాయి .
ఆ రోజు సాయంత్రం బాస్ గెస్ట్ హౌస్ కు వచ్చి హడావుడి చేశాడు. నిలువెత్తు పూల బొకే తెచ్చి ఇచ్చాడు.
" ఇన్ని పూలెందుకు సార్?”

" కొన్ని నీ ప్రెజెంటేషన్ కు, కొన్ని నీ ఆరోగ్యం కోసం, మిగతావి నీ గురించి కొన్ని నిజాలు తెలిసిన సంతోషం లో"

"నా గురించిన నిజాలేవిటి సర్"

" అదే మురళి గురించి. ఏవిటంత ఇంట్రెస్ట్ నీ మీద?” అంటూ ఇంజెక్షన్ వల్ల అనూ నిద్రపోయిన విషయం, దానికి గెస్ట్ స్పీకర్స్ ను బతిమలాడి మళ్ళీ అరేంజ్ చేసిన సంగతులు చెప్పాడు.

“Virtual ప్రెజెంటేషన్ కోసం టీం నంతా ఎంత తొందరగా కో ఓర్డినేట్ చేశాడనీ. మురళి లేకపోతే , ముందు నేను మునిగిపోయే వాడిని. అబ్బో నీ మీద అతనికెంత శ్రద్ధ అనీ "

తన దగ్గర రహస్యాలు దాచినందుకు అలిగాడు. "నేను పరాయివాడిననే కదా నాకెప్పుడూ మురళి సంగతి చెప్పలేదు." అంటూ నిష్టూరంగా అన్నాడాయన.

"అదేమీ లేదు సార్, మా ఇద్దరి మధ్యా అలాంటిదేవీ లేదు అంది.”

" నాకు బుర్రలేదని మా ఆవిడంటే ఒప్పుకుంటాను, నువ్వూ నన్ను బుర్రలేని వాడి కింద లెక్కేస్తే ఎలా ? మొదటి రోజు నుండీ నాకు కొద్దిగా డౌటు గానే ఉంది. ఎప్పుడూ సీరియస్ గా ఉండే నువ్వు అతనితో నవ్వుతూ మాట్లాడడం, అతనేమో నీకోసం ఒళ్ళంతా హూనం చేసుకోవడం ఇవన్నీ ఏవిటో. సరే అతని పేరెంట్స్ తోనూ, మీ అమ్మా, నాన్నల తోనూ మాట్లాడతాను ఈ సంగతేవిటో."
అంటూ వచ్చినంత హడావుడిగా వెళ్ళిపోయాడు.

అమ్మ కు తమ్ముడిలా ఉన్నాడే ఈయన అనుకుంది

******

కాన్ఫరెన్స్ నడిపిన తీరు, తమ సంస్థ కోసం ఆమె పనిచేస్తున్న పద్ధతి నచ్చి, పేరున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఆమెకో ఆఫర్ ఇచ్చింది. కాన్ఫరెన్స్ జరిగిన ఊరిలోనే, తమ బ్రాంచ్ నొకదాన్ని ఏర్పాటు చేస్తామనీ దానిపై అన్ని అధికారాలు ఆమెకే ఒప్పజెప్పడానికి సిద్ధమనీ కబురు చేశారు.

ఆ ఆఫర్ గురించి బాస్ కు కూడా తెలిసి ,

"అనూ, నువ్విన్నాళ్ళు పడిన శ్రమకు ఫలితం దక్కింది. నువ్వూ ఎదగాలి, నాకన్నా కూడా పైకి రావాలి. ఆ ఆఫర్ ఒప్పేసుకో. ఇక్కడ సెటిల్ అవడం నీకన్ని విధాలా మంచిది.”

"అన్నివిధాలా?”

"ఏమనుకోవద్దు అనూ, నీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని. "అని కొంచం ఆగాడాయన.

" నువ్వు నాతో పని చేసే రోజుల్లో , ఇలాంటి అమ్మాయికి భర్తగా ఎవరొస్తారో చూడాలని నాలో ఆసక్తి ఉండేది. ఒక్కోసారి నీకు తగినవాడు దొరకడం కష్టమనుకునే వాణ్ణి. మురళి నాకెంతకాలం గానో తెలుసు. అన్ని రకాలా నీకు తగిన వాడు. ఈ ఊళ్ళో నీకు ఆఫర్ రావడం కూడా మంచిదైంది. ఇద్దరూ ఒక చోటే ఉండొచ్చు. ఆలోచించు అనూ. మీరిద్దరూ ఒకటైతే బాగుణ్ణు అనుకునే వాళ్ళలో మీ అమ్మానాన్నల తర్వాత నేనే.”

ఆమె చేతులు తన రెండు చేతులమధ్యా ఉంచుకుని అభినందించి వెళ్ళిపోయాడు.

*******

మాష్టారు వచ్చారు ఆశీర్వదించడానికి. తమిద్దరి మధ్యా గొడవలు ఆయనకు తెలియవనే అనుకుంది అనూ. లోపలికి తీసుకెళ్ళి  కూర్చో బెట్టి, ఎదురుగా కూర్చుంది.

"చాలా సంతోషం అనూ. ఎప్పటినుండో కలగన్న రోజు ఇది, నిన్నిలాంటి స్థితిలో చూడాలని అనుకున్నాను.

అనూ, మీరిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. అడగకూడనివి అడుగుతున్నాననుకోక పోతే ఒకటడగనా? మురళి ఎందుకో మునుపటిలా హుషారుగా లేడమ్మా. పెళ్ళిమాట ఎత్తితే దాటవేస్తున్నాడు. ఏమైందో చెప్పడు. నీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పు.” అని ఆగారు.

చెప్పాల్సినంత వరకూ తమ మధ్య జరిగింది చెప్పింది.

" ప్రకృతి లో దొరికే గాలి, నీరు, సూర్యకాంతి , వాటినెప్పుడూ మనం యధేచ్ఛగా వాడుకుంటాంఅవి వాడుకునేందుకు ఏ  Terms & Conditions గుర్తు రావు మనకు. మురళీకి నీపై ఉండే అభిమానం కూడా అలాంటిదే. దానికి హద్దులు గీయొద్దునీ లక్ష్యానికి తోడవుతాడే కానీ, నువ్వు భయపడే ఇబ్బందులు ఏవీ కలగజేయడనే నా నమ్మకం. "


******

కొన్ని నెలలు గడిచాయి.  

ఆమె సి ఇ ఓ గా ఏర్పాటైన సంస్థ ప్రారంభోత్సవం ఆర్భాటం గా జరిగింది. కలెక్టర్ హోదాలో మురళి కూడా హాజరయ్యాడు. అందరూ వెళ్ళిపోయి, హడావుడి తగ్గిన తర్వాత వచ్చాడు.

వస్తూ వస్తూ పూల బొకే ఒకటి తెచ్చాడు. అభినందించిన తర్వాత అతన్ని ఆఫీసు రూంలో కూర్చోబెట్టిందికాసేపు మాటలైన తర్వాత 

"ఆ తర్వాత, ఫ్యూచర్ ప్లాన్స్ ఏవిటి?" అడిగాడు.

"నీ ప్లాన్స్ ఏవిటీ?" అడిగింది.

"ఏముంది, ఉద్యోగం చేసుకుంటాను అంతే"

" పెళ్ళి చేసుకోవా?"

మాట్లాడకుండా ఆమె కళ్ళలోకి చూశాడు.

అతని చూపులో ఆమెకు జవాబు దొరికి, తడబడింది.

"అదే ప్రశ్న నిన్నడిగితే?" అన్నాడు.

" నువ్వంటే, ఎవరికోసమో పెళ్ళి మానుకున్నావు, నేను అలా మానుకోవాల్సిందేం లేదు. నాన్న గారు తన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ని చూశారు. దాదాపు కుదిరినట్లే" అంది.

" ఎవరా అబ్బాయి?

"పెళ్ళికొస్తావు కదా, అప్పుడు పరిచయం చేస్తాలే ."

"మరి నీ Terms & Conditions? "

"అతనితో వాటి అవసరమే రాదనుకుంటున్నాను .పెళ్ళికి తప్పకుండా రావాలి. బహుమతులు స్వీకరించబడతాయి కనక వట్టి చేతులతో రావొద్దు.”

"నువ్వు చిన్నప్పుడు నాకు తెలిసిన అనూవేనా అన్న అనుమానం వొస్తుంది నాకు. ఎప్పుడూ తీసుకోవడమేనా, నాకేదో బాకీ ఉన్నావు. అదిచ్చేదేం లేదా?”

"డబ్బులతో కొన వద్దన్నావు మరి, ఎంత కష్టం అలాంటివి తీసుకురావడం.”


********

ఇళ్ళ ముందు పిల్లలు పెద్దవాళ్ళు గోల గోల గా అరుచుకుంటూ టపాకాయలు కాలుస్తున్నారు. అమ్మా నాన్న ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉండి ఉంటారు. దీపావళి టపాసులు కాల్చి కొన్ని సంవత్సరాలైంది. అందరి ప్రహరీ గోడలమీదా దీపాలు. కొన్ని ఒంటరి దీపాలు. వాటిని చూస్తే జాలి కలిగింది. ఇంటికి చేరాడు. గాలి ఎక్కువగా లేదేమో తమ ఇంటి గోడల మీద, మట్టి ప్రమిదల్లో జోడు వత్తుల నూనె దీపాలు. సంతోషం గా కబుర్లాడుకుంటున్నట్టు ఉన్నాయి. గుండెలో ఆశ నింపాయి.

    తలపైకెత్తి చూశాడు. చిన్ని చిన్ని ఎలెక్ట్రిక్ దీపాలు మాలలు మాలలు గా పైనుండి వేలాడుతున్నాయి. గేటు తీసి లోపలకెళ్ళాడు. బయట మనుషులెవరూ లేరు. దీపాల వెలుగులో పచ్చిక మెరుస్తూ ఉంది. తెల్లని పాలరాతి వరండా మెట్ల మీద వరసగా అమర్చిన ప్రమిదల్లో వెలుగుతున్న వత్తులు. గుమ్మాలకు గుత్తులుగా వేళాడుతున్న బంతిపూల మాలలు. ఇల్లంతా బంగారపు కాంతి.

సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుంటానని అమ్మ చెప్పింది. ఏదైనా పేరంటం లాంటిది జరుగుతూ ఉండి ఉంటుందనుకుని ఇంటి బయట లాన్ లోనే పాలరాతి బెంచీ మీద కూర్చున్నాడు. అప్పటికి టపాసుల శబ్దాలు పలచబడ్డాయి. గాజుల అలికిడికి తలతిప్పి చూస్తే........నమ్మలేనంత వింత గా ఆమె. ఆమె తమ ఇంట్లోనా? ఎలా సాధ్యం?

పేరంటానికి ఆమెను కూడా పిలిచిందా అమ్మ. కానీ ఇలాంటి రూపంలో ఎప్పుడూ చూడలేదే తనను.

తెల్లటి పట్టు చీరకు చిన్న జరీ అంచు. మెడలో ఒంటి వరస ఎర్ర రాళ్ళ హారం. ఆమె ఆమేనా? అవును కానీ ఆమెనెప్పుడూ ఇలా చూడలేదే? ఎప్పుడూ స్వేచ్ఛతో గాలిని పలకరించే జుట్టు వెనక్కి తగ్గి, జడ లాగా అల్లుకుపోయి ఉంది. షర్ట్ అడుగున అజ్ఞాతంలో ఉండే తెల్లని చేతులు బయటకొచ్చి గాజుల్లో బందీలైనాయి.

ఆమె చేతులకు గాజులా? నుదుట ఎర్రటి బొట్టు. జుట్టు, బొట్టు, చీర, మెడలో హారం, గాజులు, వేటికవి వేటికవి చూస్తే అందంగా ఉన్నాయి. అన్నీ కలిసిన అద్భుతాన్ని దగ్గర్నుండి చూస్తూ ఉంటే మతి పని చెయ్యడం లేదు. అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం అవసరం, అదృష్టం కూడా.

దగ్గరకొచ్చి అతన్ని చిన్నగా తాకింది. ధ్యానం లోకి వెళ్ళడం సులభమే, బయటకు రావడం ఎంత కష్టం ! మాట్లాడితే కల చెదిరిపోతుందేమో, మాట్లాడకపోతే ఆమె అలిగి వెళ్ళిపోతుందేమో

"ఎంత బాగున్నావు?” అప్రయత్నంగా అన్నాడు.

నవ్వింది.

ఇలాటి మాటలు నచ్చవు ఆమెకు. కోప్పడదే. నవ్వుతుందే మరి?

"కోపం తగ్గిందా?”

"అదెప్పటికీ తగ్గదు. తగ్గకూడదనే అనుకుంటున్నాను." అతని కళ్ళలోకి చూస్తూ అంది. ఆ మాటల్లో కానీ, చూపుల్లో కానీ కోపం లేదు.

"వచ్చావుగా మరి.”

"వచ్చింది నీకోసం కాదు.”

అతనేం మాట్లాడలేదు. చిరునవ్వుతో అలానే నుంచుంది.

"ఎంతసేపు అలా నిల్చుంటావు. కూర్చో" అన్నాడు పక్కకు జరిగి.

"నాకేం నీ మర్యాదలు అక్కర్లేదు" చీర కుచ్చిళ్ళు సరి చూసుకుంటూ కూర్చుంది.

"చీరలో బాగున్నావు అనూ" అభిమానంగా చెప్పాడు.

కాబోయే అత్తగారు బహుమతిగా ఇచ్చారని ఇంగ్లీషులో చెప్పింది.

అత్తగారు చీరపెట్టారా? నిశ్చితార్ధం అయిందా? మనసు అతన్ని ప్రశ్నలడుగుతోంది.

"పెళ్ళెప్పుడు? " అడిగాడు బలహీనంగా

"తొందర్లోనే.”

"అబ్బాయి?”

"నీకూ తెలుసు" మామూలుగా చెప్పింది.

నాకూ తెలిసిన వాళ్ళా? ఎవరై ఉంటారు? నాన్న గారి స్నేహితుడి కొడుకు తో పెళ్ళి అని చెప్పిన సంగతి గుర్తొచ్చింది

"అదృష్టవంతుడు.” అన్నాడు.

"నీకే అదృష్టాలు అవసరం లేదుగా " అంది.

"అంతమాటనకు అనూ, ప్లీజ్"


ఎవరో వస్తున్నట్లు అలికిడి అయితే ఆమె వెనక్కి తిరిగి చూసింది.


అనూ అమ్మా, నాన్న, మాష్టారూ, మురళి వాళ్ళ అమ్మా అందరూ బయటికొస్తున్నారు. ఇంకా ఎవరెవరో ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు. అందరూ ఇంటికి కొంచం దూరం లో ఉన్న మైదానం లో టపాసులు కాలుస్తారట,
మీరూ తొందరగా రండి అంటూ గోలగోల గా వెళ్ళిపోయారు.

లోపలికెళ్ళి ఏదో పాకెట్, చిన్ని గిన్నెలో పాయసం తెచ్చింది.

"ఏవిటిది.?"


పాకెట్ తీసి చూశాడు. ఆరోజు కొలను గట్టు మీద ఆమె కాళ్ళకు పెడదామనుకున్న కాళ్ళ పట్టీలు.

"నేనేం చేసుకోను అనూ ఇవ్వి. నీ పెళ్ళికి గిఫ్ట్ గా ఉంచుకో."

"నువ్వే పెట్టరాదూ?” అని కాళ్ళు బెంచీ మీద పెట్టింది

"అతని అదృష్టం నాకెందుకు అనూ?”

"అతనెవరు?”

"మీ నాన్నగారి స్నేహితుడి కొడుకు.”

"మొద్దువి. మాష్టారు కూడా మా నాన్నగారి స్నేహితుడే. సరే అదృష్టాలు వద్దంటే ఏం చేస్తాను" అంటూ కాళ్ళు పాలరాతి బెంచీ మీంచి కింద పెట్టుకోబోయింది.

చటుక్కున మధ్యలో ఆపి మళ్ళీ తన ఎదురుగా పాదాలు పెట్టుకుని పాదాలకు పట్టీలు పెట్టి శీలలు బిగించాడు.

"ఇదంతా నిజమేనా?” నమ్మలేనట్లు అడిగాడు.

"అనుమానంగా ఉందికదూ, నిజమే కాదో చెక్ చేసుకో" అంటూ అతని బుగ్గ గిల్లింది. 

"అబ్బా నొప్పి,  ఏవిటిది అనూ?" 

" డబ్బుతో కొనగూడని గిఫ్ట్ ఏదో కావాలని గోల పెడుతున్నావుగా. అది." 
కమలం లా వికసిస్తే కనుచూపు మేరలో నేను.

కలువలా విచ్చుకుంటే కనుమరుగవుతాను.

వేళకొచ్చే నాకు నీ వేడుకే చాలు.

నుదిటి సూరీడునై నీ దారి వెలుగవ్వనీ..The end
ప్రియ స్నేహితురాలు కొత్తావకాయగారికి బహుమతిగా 


22 comments:

చాతకం చెప్పారు...

Amazing narration. It took me a while to come down to earth after floating in imaginary world. Thank you for this novel [?] ye dil maange more ;)

nirmal చెప్పారు...

maha adbhutam

రాజ్ కుమార్ చెప్పారు...

Wah waa.. wah waaaaaaaa.....
NO WORDS....

కొత్తావకాయ చెప్పారు...

అందమైన కథ.. అతిచక్కని కథనం. గుర్తుండిపోతుందండీ. చాలా నచ్చింది. కంగ్రాట్స్!

థాంక్యూ :)

Narsimha చెప్పారు...

చాలా ...బాగుంది.....ఈ కథ తో మీరు ఎక్కడికో ....తీసుకెళ్ళారు..తిరిగి రావలనిపించక మళ్ళీ మొదటి నుండి చదవాలి

ramesh చెప్పారు...

కథ బాగుందండి. అను లాంటి (సాధికారత, ఉక్రోషం, పొగరు వున్న) వాళ్ళు ఖచ్చితం గా ఉంటారు. కానీ, అలా దాసోహమనే అంతగా ప్రేమించే (అదే ప్రేమనుకోండి, అంటే నా అభిప్రాయం అనుకోండి) మురళి ని, నొప్పించే విధంగా మాట్లాడుతూ దూరం పెట్టిన అను, మళ్ళీ ప్రేమించేటప్పుడు (నిజం గా ప్రేమిస్తుంటే? ప్రేమించకుండా పెళ్ళికి ఒప్పుకోదు అనుకుంటే), ఒక్క క్షణం తన ప్రవర్తన లోని (బహుశా ప్రేమ లోని) అపరిపక్వతను తెలుసుకొని, ఒక్క క్షమాపణ అడిగి ఉంటే మా (మగ) మనసు తృప్తి పడేదేమోనండి :) పాపం మురళి ఏమవుతాడో (పెళ్ళి అయిన తరువాత) అని దిగులు లేకుండా ఉండేదేమోనండి :) - మురళి లాగ ప్రేమించేటప్పుడు దాసోహం, పెళ్ళయ్యాక (అంటే ప్రేమించటమే జీవిత పరమావధి అని మనస్సు పదే పదే గొడవ పెట్టనప్పుడు) నేను అనే వాడు పదే పదే అలిగి దాసోహాన్ని ఓడించేటప్పుడు ఇబ్బందులు పడే వాళ్ళే ఎక్కువండి మరి.

అజ్ఞాత చెప్పారు...

@ Ramesh - When you love,you love - As they are and as they are not. There is no wrong, no right, no good, no bad.
If you reach that place no need to ask are accept forgivness. It happens in actions not in words. And this has heppend in Anus actions.

శశి కళ చెప్పారు...

చాలా చాలా బాగుంది..ఒక చల్లటి మంచు తెర మనసుని తాకినట్లు

dee చెప్పారు...

కధ ఎంత అందంగా మొదలైందో అంతే అందంగా ముగించారు శైలజ గారు..ఐదవ భాగం చదివి అందమైన కధ చివరిలొ రొటీన్ గా ముగుస్తుందేమో అని భయపడ్డాను... కాని చివరి భాగం లొ మీరు రెందు పాత్రలని కలిపిన విధానము చాలా చాలా బాగుందండి...హాట్సాఫ్ మేడం!

Chandu S చెప్పారు...

కథ చదివి విలువైన వ్యాఖ్యలందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
@ రమేష్ గారు, నేను చెపుదామనుకున్న జవాబు కాముధ గారు చెప్పేశారు. 'సారీ' అన్న మాట ఏదో పొరపాటున కాలు తగిలితేనో చెయ్యి తగిలితేనో చెప్పే పదం అని నేననుకుంటాను. ప్రవర్తన వల్ల నొప్పించి 'సారీ' చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉండక పోగా, దెబ్బ తిన్న వ్యక్తి ఇంకా వేదనకే గురి అవుతాడు. మురళి కి ఫార్మల్ గా అనూ తో సారీ చెప్పించడం కన్నా ఇంకా ఎక్కువే చేయించాను ఆమెతో. అతనికి దగ్గరవాలనుకోవడం, అతనితో పెళ్ళి కోరుకోవడం లాంటివి. అదీకాక అనూ లాంటి వాళ్ళు నోటితో సారీ చెప్పరు కాముధ గారన్నట్లు.

ramesh చెప్పారు...

@kamudha - I agree with all that you said except with "this has happened in Anu's actions."

In case, I am not clear...
@when you love... - Agree
@no need to ask or... - Agree
@it happens in actions... - It can. Agree
@this has happened in... - Did not come out to me in the story that way :)

But, it very often happens this way with the characters, the author sketched out, according to me too. That's why I said, the story is good (by this, I mean, I liked the story). But, as an ordinary reader, who wants to see just behavior from every character (especially, the characters in gray shades that some people see as all white, in other words good/great) at the end, felt the way I said. Sorry for the long comment, Chandu garu, and kamudha garu. I usually don't leave comments, and hence the immaturity (lack of brevity) that you are seeing.

సుభ/subha చెప్పారు...

అద్భుతమైన శైలి అండీ.. కథ నడిచిన తీరు ఆద్యంతం ఆశక్తిదాయకం. ముఖ్యంగా కొన్ని సీన్లు మర్చిపోలేనంతగా ఉన్నాయి. ఎంత బాగుందో మాటల్లేవు చెప్పడానికి.

Chandu S చెప్పారు...

రమేష్ గారు, long comment కు సారీ చెప్పడమెందుకండీ. పాఠకులేమనుకుంటున్నారో తెలుసుకోవడం నాకు సంతోషాన్నిస్తుంది. మీ ఆలోచనలు పంచుకున్నందుకు Thank you
శుభ గారూ, చదివినందుకు ధన్యవాదాలు

మధురవాణి చెప్పారు...

కథ బాగుందండీ శైలజ గారూ!
అచ్చంగా యుద్ధనపూడి నవల చదివిన అనుభూతి కలిగింది.. :)

Chandu S చెప్పారు...

కథ చదివి మీ మీ అభిప్రాయాలు తెలియజేసిన స్నేహితులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాతి పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నామన్న కొందరి మిత్రుల వ్యాఖ్యలు చాలా సంతోషాన్నిచ్చాయి. Thank you very much.

Sravya Vattikuti చెప్పారు...

అమ్మయ్య మొత్తానికి సుఖాంతం చేసారు :-) బావుదండి .

sndp చెప్పారు...

apude ayipogotaru...:(

జయ చెప్పారు...

మీ కథ చాలా, చాలా....చాలా బాగుంది శైలజ గారు. మీరిచ్చిన ఉపమానాలు, చెమక్కులు సూపర్. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఇటువంటి భావాలతో అతి జాగ్రత్తల్లోకి పోతున్నారు. తమ కెరియర్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తు, జీవితపు అసలైన విలువలు, మాధుర్యాన్ని దూరం చేసుకుంటున్నారు. పూర్వం అస్సలు స్వేచ్చ లేక, ఇప్పటి విపరీతమయిన స్వేచ్చ తో, సరి అయిన మార్గదర్శకం లేక, తొందర నిర్ణయాలతో, అది ఆత్మాభిమానమనుకొని, స్వాభిమానంతో జీవితాన్ని తప్పుదారిలోకి తోసేసుకుంటున్నారు. అభిమానానికి, అహంకారానికి తేడా తెలుసుకోలేక పోతున్నారు. ఇటువంటి అమ్మాయిలనే నే నెక్కువగా చూస్తున్నాను. అబ్బాయిల్లో కూడా మురళి లాంటి వ్యక్తులు పెరిగితే అనూ లాంటి అమ్మాయిలకు అబ్బాయిల మీద నమ్మకం పెరిగి, జీవితాన్ని తామనుకున్న కోణంలో సంతోషంగా కావాల్సినంత సపోర్ట్ తో దేదీప్యమానంగా చేసుకో గలరు. చాలా చక్కటి ముగింపు ఇచ్చారు.

కృష్ణప్రియ చెప్పారు...

Was good reading. మీ హీరోయిన్లంతా నాకు నచ్చుతారు,.. చక్కటి వ్యక్తిత్వం తో ఉంటారు.

చాలా బాగుంది.

Sailaja yenduri చెప్పారు...

Sailaja garu really hats off.

Mohita చెప్పారు...

శైలజ గారు,
తెలుగు వెలుగు లో మీ గుఱించి నిన్ననే చదివాను. మీ బ్లాగ్ ఈ రోజు ఉదయం నుంచి చదువుతూనే ఉన్నాను. (దీని కోసం కాలేజీ కూడా మానేశాను అది వేరే విషయం అనుకోండి) . అన్ని ఆర్టికల్స్ చదివి సంతోషిద్దాం అనుకున్నానే గాని ‘నిన్ను నిన్నుగా ‘ చదివాక ఇక ఉండలేక ఇది టైపు చేస్తున్నాను . మీ కథలో అను క్యారెక్టర్ తో నాలాంటి చాలా మంది ఈ తరం పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఐడెంటిఫై చేసుకుంటారు . క్లారిటీ ఇచ్చినందుకు థాంక్స్ . తన పాత్రలతో అతి సహజంగా చెప్పదల్చుకున్న నీతి ని/విషయాన్ని చెప్పించేసేయ్యటం ఒక అద్భుతమైన కళ . ఈ తరం రచయిత్రుల్లో మీ స్థానం అత్యున్నతం అని నాకు తోచింది మీకు తెలియజేస్తున్నాను .దయ చేసి ప్రశంస స్వీకరించండి .

nagarjuna adimulam చెప్పారు...

Sailaja garu, I have no words to express after reading this story...fantastic.... :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి