20, నవంబర్ 2012, మంగళవారం

నిన్ను నిన్నుగా....5
పెద్దప్రమాదం తప్పినందుకు అనూ క్షేమంగా తిరిగి ఆఫీసుకొచ్చినందుకు ఆఫీసు స్టాఫ్ సంతోషపడ్డారు.

బాస్ వచ్చి పరామర్శించాడు. "కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చుకదా.”

"లేదు సార్.ఇంట్లో ఉంటే నాకు తోచదు.”


మురళీ ఫోన్ చేస్తున్నా, ఒక్క సారి కూడా ఆన్సర్ చెయ్యలేదు. ఆఫీసు లాండ్ లైన్ కు ఫోన్ చేశాడు. తప్పని సరిగా మాట్లాడాల్సి వచ్చింది.

"అనూ, మొబైల్ కు చేస్తుంటే ఆన్సర్ లేదని ఆఫీసుకు చేశాను. ఇబ్బంది లేదుగా, మాట్లాడొచ్చా?”

కొంత సేపు మౌనంగా ఉంది.

ఈ గొడవలు పడడం అంతా టైం వేస్ట్ అనుకుంది.

"చెప్పు" అంది

ఆమెగొంతులో నిరాసక్తత చూసి "అనూ, ఏమయ్యింది?”

"ఏమవుతుంది, ఏమీ లేదు.”

"పనిలో ఉన్నావాడిస్టర్బ్ చేశానా?”

"నువ్వు చెయ్యాలనుకున్నా అంత తొందరగా డిస్టర్బ్ అవను మురళీ. కంగారు పడకు.”

"ఆరోగ్యం ఎలా వుంది. దెబ్బలు తగ్గాయా?”

"దెబ్బ మానిపోతోంది. మళ్ళీ నువ్వు గుర్తు చేయకు.”

"కోపమా అనూ?”

"ఎప్పుడూ కోపమేనా, నాకు వేరే పనులు కూడా ఉంటాయి. “

"సారీ అనూ, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించు.”

"పొరపాటు నావల్లే జరిగింది మురళీ. ఇన్నాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. చిన్న నిర్లక్ష్యం. ఏక్సిడెంట్ అయింది.  బయట పడ్డాను, ఇకనుండీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి.”

మాటలకందని మెసేజ్ అర్ధమవుతుంది మురళికి.

ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు ఫోన్ లోనే

నాకు పనుంది అంటూ అతని జవాబు కోసం ఎదురుచూడకుండా ఫోన్ పెట్టేసింది.

*******

"ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనూ. జరగబోయే కాన్ఫరెన్స్ మన సంస్థకు ఎంతో ప్రెస్టీజియస్ విషయం. డెలిగేట్స్ అందరూ చాలా దేశాలనుండి వస్తున్నారు. ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ గా నిన్నే అప్పాయింట్ చేశానుఇక్కడైతే డెలిగేట్స్ అందరికీ ఎకామడేషన్ కష్టం. బ్రాంచ్ ఆఫీసు ఉన్న ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కాన్ఫరెన్స్ కండక్ట్ చెయ్యడానికి అదే బెస్ట్ ప్లేస్. అనూ, ఓ చిన్న రిక్వెస్ట్, కాన్ఫరెన్స్ అయేంత వరకూ నువ్వు అక్కడే ఉండాలి. కావాలంటే మీ పేరెంట్స్ తో కలిసి ఉండేందుకు వేరే గెస్ట్ హౌస్ చూస్తాను.

తల్లిదండ్రులు కూడా వస్తామన్నారు. అమ్మ అక్కడికి వస్తే మురళీ వాళ్ళ ఇంటికెళ్ళడమో, అతన్ని తమదగ్గరకు పిలవడమో ఏదో ఒకటి చేసి ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈ పనులయ్యేంతవరకూ ఒంటరిగానే ఉండాలని చెప్పింది.


మురళి వాళ్ళ ఊళ్ళో కాన్ఫరెన్స్ పెట్టినందుకు అతనున్న వూళ్ళో ఉద్యోగం ఎలా అంటూ మనసు నసిగింది. ఆ పై చివాట్లు తింది.

'అతనితో పరిచయమొక ఏక్సిడెంట్,అంతే. ఊరికే అతని గురించే ఆలోచిస్తూ టైం వేస్ట్ చెయ్యడానికి నువ్వేం తెలుగు సిన్మా హీరోయిన్ వి కాదు. ఒకే ఊళ్ళోనే కాదు, అతను పక్కనే ఉన్నా సరే నోర్మూసుకుని పనిచెయ్యాలి. పిచ్చి వేషాలేస్తే....జాగ్రత్త' అంటూ మనసుకో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.


పనులు, పరుగులతో మళ్ళీ మునపటి అనూ అయింది. ప్రతి విషయాన్నీ ఏ లోపం లేకుండా చెయ్యడానికి వంద శాతం కృషి చేసింది. మూడు రోజుల కాన్ఫరెన్స్. చివరి రోజు అనూ చెయ్యాల్సిన ముఖ్యమైన కీ నోట్ ప్రెజెంటేషన్ ఉంది. సంస్థ ప్రస్థానం, విజయాల గురించి చెప్పే కీలకమైన లెక్చర్.

బాస్ చెప్పకపోయినా సంస్థ ఎదుగుదలను ప్రచారం చేయడం కూడా కాన్ఫరెన్స్ లో ఒక భాగమేనని అనూకి తెలుసు. కాన్ఫరెన్స్ అనౌన్స్ చేసిన నాలుగైదు రోజుల్లోనే తన కీనోట్ తయారు చేసుకుని రెండు మూడు సార్లు రిహార్సల్స్ వేసుకుని చూసి సంతృప్తి పడింది. కంప్యూటర్ లో ఉన్న ఆ కీనోట్ ఒక పెన్ డ్రైవ్ లోకి ట్రాన్స్ఫర్ చేసి జాగ్రత్తగా తన బ్రీఫ్ కేస్ లో దాచింది.

తనకు కావలసిన బట్టలు, అవసరమైన ఫైల్స్ తీసుకుని ప్రయాణమైంది.

వెళ్ళబోయే ముందు " అమ్మా, నేనటెళ్ళగానే ఇటు మురళీ వాళ్ళింటికి ఫోన్ చేసి ఇదిగో అమ్మాయొస్తుంది, బాగా చూసుకోండి అని ఫోన్లు చెయ్యొద్దు. నేను వెళ్తున్నది చాలా ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన పని మీద. నాకు ఖాళీ అయినపుడు నేనే వాళ్ళకు ఫోన్ చేస్తాను"

"మీ అమ్మ పంపించలేదమ్మా, మా అంతట మేమే వచ్చాం అని వాళ్ళంటే ఏంచేస్తావూ ? " అడిగింది ఆవిడ తెలివిగా మొహం పెట్టి

"వాళ్ళంతట వాళ్ళొచ్చారో, నువ్వు పంపించావో నాకు తెలుస్తుంది. సో అలాంటి అలాంటి సాహసాలు చెయ్యొద్దు.”

గయ్యాళి, మొండి. లాంటి పదాలు పెదవులు కదల్చకుండా అని తృప్తి పడింది ఆవిడ.


ఊరెళ్ళగానే , ఉతికి ఇస్త్రీ చేయించిన అతని షర్ట్ జేబులో అతను రాసిన లెటర్ ఉంచి మురళీ కి పంపించింది. ఆమె ఊహించినట్లు గానే మురళీ ఆమెను కలవడానికొచ్చాడు." రా మురళీ . సంతోషం గా ఉన్నావా? "

" పొరపాటు జరిగింది అనూ. ”

"లేదులే మురళీ కావాలనే చేశావు. నన్ను రిజెక్ట్ చేస్తే నీకెంత గొప్ప గా ఉంటుందో అంచనా వేసి మరీ చేశావు.”

"ప్లీజ్ అనూ, రిజెక్ట్ అనే పదం వాడకు. ఆ మాటకొస్తే నాకే అర్హత లేదనుకుంటాను"

"మరి ఉత్తరం లో అదేగా నువ్వు రాసింది, నేనేం కల్పించి మాట్లాడుతున్నానా?”

"నిజమే అనూ నేనే రాశాను, కాదనను. మనిద్దరి ఆలోచనలూ కలవవు. పెళ్ళైతే కష్టమేమోననుకున్నాను. రాసినపుడు నా భావాలు కూడా అవే. ఆతర్వాత నాకు తెలియకుండానే నిన్ను వదులుకోలేనంత బలహీనుణ్ణి అయ్యాను. నిన్ను నిన్నుగా చూడాలనీ గౌరవించాలనీ తెల్సుకున్నానులెటర్ నీకు చేరాలని మాత్రం అనుకోలేదు. ఇది నిజం.”


"కావాలనుకోవడం, వద్దనుకోవడం, మళ్ళీ కావాలనుకోవడం ..ఒహో అంతా నీ ఇష్టమే, మురళీ మొదటి నుండీ నాకు నీలో నచ్చనిది ఈ అహంకారమే. నేను చెప్పిన planned marital life లో ఏమైనా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నానా. కెరీర్ మీద నాకున్న ఇష్టం వల్ల    ఎవరి పరిధి లో వారుంటే గొడవలు లేని జీవితం గడపొచ్చనీ చెప్పాను. ఇందులో తప్పేముందో నాకేం తెలియడం లేదు.”

"అహంకారం అనొద్దు అనూ, ఇప్పుడు నాలోఉన్నది బలహీనత. నువ్వు లేకుండా జీవితం ఊహించలేని బలహీనత. నీకు దూరం కాలేని బలహీనత.”

"ఏం పాపం అంతలోనే బలహీనత. బలమైన భావుకతలతో ప్రపంచాన్నే నడిపిస్తారు కదా మీలాంటి వారు. ఎందుకు ఆలోచనలు మార్చుకోవడం?”

తన ఆలోచనల మార్పుకు కారణమైన కొన్ని విలువైన క్షణాలు గుర్తొచ్చాయి. అదేమిటో బయటకు చెప్పి ఆ బంగారు అనుభవాన్ని చులకన చెయ్యదలుచుకోలేదు.

తలొంచుకున్నాడు.

"సరే నీలాగా నాకు పొయెట్రీ రాదు, భావుకత అంటే తెలియదు. నీకు తగ్గ అమ్మాయిని వెతుక్కో.” చివరి మాటకు మనసు ఎదురుతిరిగింది. ముందుగానే నిర్ణయమైపోయిన నియంత శాసనానికనుగుణంగా తిరుగుబాటు అణిచివేయబడింది.

******

కాన్ఫరెన్స్ మొదటి రెండు రోజులు విజయవంతంగా పూర్తి చేసింది. డెలిగేట్స్ నుండి వస్తున్న స్పందనకు, ప్రశంసలకు బాస్ చాలా సంతోషం గా ఉన్నాడు. అనూ పడ్డ శ్రమకు ఆయన ఎప్పటికప్పుడు ముగ్ధుడై పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. చివరి రోజు కూడా ఎలాంటి సమస్య లేకుండా అయిపోతే కొంచం ఊపిరి పీల్చుకోవచ్చు.

ఆ రోజు కార్యక్రమాలు ముగిసేప్పటికే సాయంత్రం అయిదయింది. రేపటి రోజు ప్రోగ్రాంస్ కు సూచనలు ఇచ్చేసి గెస్ట్ హౌస్ కి వచ్చింది. స్నానం చేసి లాప్ టాప్ ముందు కూర్చుంది. తన కీ నోట్ చివరి సారి రిహార్సల్స్ వేసుకుని చూసి నిద్ర పోదామనుకుంది.

పొద్దున తిన్న బ్రేక్ ఫాస్ట్. పనుల హడావుడిలో లంచ్ మరిచిపోయింది. సరే కీనోట్ ఒక్క సారి చూసుకుని ఆ తర్వాత ఏమైనా తిందామనుకుంది. బ్రీఫ్ కేస్ తీసి చూస్తే కీనోట్ ఉన్న పెన్ డ్రైవ్ కనిపించలేదు.
గుండాగిపోయినట్లయింది. ఎలా ఇప్పుడు ఎలా. అనుకుంటూ, అన్ని కప్ బోర్డ్స్, టెబిల్ సొరుగులు అన్నీ వెతికింది. ఎక్కడ చూసినా కనిపించలేదు. టైం చూస్తే ఏడవుతోంది. .

భగవంతుడా రేపు ఉదయమే ప్రెజెంట్ చెయ్యాలి.

ఆకలి మండుతోంది. పక్కనే ఉన్న గాజు జగ్ ఎత్తి నీళ్ళు తాగింది. ఆకలి చల్లారక పోగా ఇంకా భగ్గుమంది. ఆకలి, నీరసం, టెన్షన్ అన్నీ ఒకే సారి చుట్టుముట్టాయి.

'కూల్, కూల్.. సమస్య పక్కనే పరిష్కారం ఉంటుంది. నెమ్మదిగా ఆలోచించు' లోపల్నుండి instruction వచ్చింది.

ముందు ఏదైనా తినాలి అనుకుని "వాచ్ మాన్" అంటూ కేకేసింది. కుక్ తో చెప్పి తినడానికి ఏవైనా తీసుకురమ్మంది.

"కుక్ లేడమ్మా, ఇక్కడి పనోళ్ళందరూ అక్కడ మీటింగుల్దగ్గరే పంజేస్తన్నారుగా" అన్నాడు.

"అయితే ఏవైనా తినడానికి తీసుకురా, నువ్వు కూడా ఏవైనా తెచ్చుకో" అని డబ్బులిచ్చింది.

ప్రతి క్షణం ఆశ తో ఓపిక తెచ్చుకుని రూం లో అంగుళం అంగుళం వెతికింది. జాగ్రత్తగా బ్రీఫ్ కేస్ సర్దుకుంది. ఎలా మిస్ అయిందో అర్ధం కాలేదు. బాస్ కు తన మీద ఎంత నమ్మకం. ఇలాంటి సిల్లీ కారణం ఎలా ఒప్పుకోగలడు. ఆయనకేం జవాబు చెప్పాలి. రేపు అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే తనని తాను ఎప్పటికీ క్షమించుకోలేదు.

వాచ్ మాన్ వచ్చి ఒక పొట్లాం చేతికిచ్చాడు.

వేడి వేడి మిరపకాయ బజ్జీలు.

ఏదో ఒకటి ముందు కడుపులో తిండి పడితే ఆ తర్వాత ఆలోచించొచ్చు అని తినేసింది.

లోపలి మంట తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది.

ఫోన్ పావుగంటకోసారి మోగుతోంది. ఎవరికైనా మరీ అవసరమైతే మొబైల్ కు కాంటాక్ట్ చేస్తారులే అనుకుని ఫోన్ తీసి పక్కన పెట్టేసింది. .

ఎన్నాళ్ళనుండో సరైన తిండిలేక ఉన్న కడుపులో మిరపకాయ బజ్జీలు తినడం వల్ల ఇమడక కడుపులో నొప్పి, మంట వచ్చింది. కూర్చుంటే నీరసంగా ఉంది. చెమట్లు పడుతున్నాయి.

ముఖం కడుక్కుని కూర్చుంది లాప్ టాప్ ముందు.

డోర్ మీద చప్పుడైతే తలెత్తి చూసింది.

మురళి నిల్చున్నాడు. ఇతనెందుకొచ్చాడు ఇప్పుడు?

"సారీ అనూ, మీ పేరెంట్స్ నిన్ను కాంటాక్ట్ చేయలేక పోతున్నారని కంగారు పడుతూ నాకు ఫోన్ చేశారు ఏవైందో ఒక సారి చూసి రమ్మనమని.”

బేగ్ లో మొబైల్ తీసి చూసింది. చూస్తే ఛార్జ్ లేదు.

మురళి అనూ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి బాగానే ఉందనీ, తను అక్కడే ఉన్నాననీ చెప్పాడు. అనూతో మాట్లాడించాడు.

"అమ్మా నేను రేపు తీరిగా మాట్లాడతా" అని చెప్పి మొబైల్ మురళికిచ్చేసింది.

అనూ వంక చూశాడు. వళ్ళంతా చెమటలతో ముద్దై పోయింది. కళ్ళు ఎర్రగా, నిద్రలేక పీక్కు పోయి ఉన్నాయి. ముఖం అలసటగా, ఏదో లోకంలో ఉన్నట్లు నిలబడి ఉంది.

రూమంతా చిందరవందరగా ఉంది. పుస్తకాలు, ఫైల్స్, బట్టలు , పేపర్లతో గందరగోళంగా ఉంది.

తలంతా దిమ్ముగా, కడుపులో నొప్పి, మంట, కళ్ళు తిరుగుతుంటే ఓ స్టూల్ మీద కూర్చుంది.

"అనూ, ఏవైంది?”

ఏమీ లేదన్నట్లు తలూపింది.

"ఏవైనా తిన్నావా?”

మౌనంగా ఉంది.

ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు.

"అనూ, ఒక్క రెండు నిముషాలు నా మాట విను. ఆ తర్వాత నువ్వు చంపేసినా నాకు సంతోషమే. నిన్ను చూస్తుంటే రేపసలు నిలబడగలవా అన్నంత నీరసంగా ఉన్నావు. ఏదో ఒకటి చేయనీ నన్ను ప్లీజ్ కాదనకు. ఈ ఒక్క రోజుకీ నన్ను నీ శత్రువని మర్చిపో. రేపు నీ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మళ్ళీ నీ కంటికి కనబడను.”

"ఏమైంది. ఏవిటిదంతా? "అని రూం లో గందరగోళం చూసి అడిగాడు.


విషయం చెప్పింది. రేపు ఎనిమిదింటికల్లా ప్రెజెంట్ చెయ్యాల్సిన ఇంపార్టెంట్ కీనోట్ ప్రెజెంటేషన్ తాలూకు పెన్ డ్రైవ్ కనిపించడం లేదని.

"ఐ క్లౌడ్ ద్వారా నీ మాక్ లో వచ్చే ఉంటుంది. చూడు.”

"ఆఫీసులో కంప్యూటర్ విండోస్, రాదు.”

" రఫ్ వర్క్ ఏదో ఉండే ఉంటుందికదా నీ లాప్ టాప్ లో ,కాన్సెప్ట్ గుర్తు తెచ్చుకో. మళ్ళీ కొత్తది చేసేద్దాం"

"ఇప్పుడా? " ఆశ్చర్య పోయింది.

"పర్లేదు ఇద్దరం కలిసి రాత్రి లోపల రెడీ చేద్దాం. "

లాప్ టాప్ లో ఉన్న డిటెయిల్స్, గ్రాఫులు, కొన్ని వీడియోలు , రఫ్ వర్క్ అంతా ఓ పద్ధతి ప్రకారం ఉంచాడు.

కడుపులో నొప్పితో బాధపడుతుంటే అతనికి తెలిసిన డాక్టర్ ని పిలిపించాడు.

కడుపులో ఏ ఆహారం లేకుండా, ఒకే సారి స్పైసీ ఫుడ్ తినడం వల్ల నొప్పి వచ్చిందనీ, అవసరమైన ఇంజెక్షన్స్ ఇచ్చి, నీరసం తగ్గేందుకు ఫ్లూయిడ్స్ పెట్టి ఆమెకు అవసరమైన ఇంజెక్షన్స్ ఇచ్చేందుకు, సహాయానికి ఒక నర్స్ ను తోడుగా ఉంచి వెళ్ళాడు అతను.

ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్స్ తో కొద్దిగా సౌకర్యంగా ఉంది . ఆమె చెప్తూ ఉంటే అతను టైప్ చేసి , వీడియోస్, మ్యూజిక్, గ్రాఫులు, ఎఫెక్ట్స్ అన్నీ జత చేసి కీనోట్ తయారు చేసే సరికి రాత్రి రెండున్నర అయింది. ఒక్క సారి ఫైనల్ రిహార్సల్స్ వేసుకుని చూసి సంతృప్తిగా తలూపింది.

ఆమె రిహార్సల్స్ వేసుకునే టైంలో రూమంతా సర్ది పెట్టి ఆమె మర్నాడు వేసుకోవాల్సిన డ్రెస్ ఏమిటో అడిగి, అది తీసి ఎదురుగా పెట్టాడు.

కొంచం సేపు నిద్రపో అని ఆరింటికి అలారం సెట్ చేసి ఆమె పక్కనే ఉంచి బయటికి వెళ్ళాడు.

నర్స్ బయటే కునికి పాట్లు పడుతోంది.

మురళీ బయట ఉన్న సోఫాలో కూర్చోగానే నిద్రపట్టింది.

******

చప్పుడైతే నిద్రలేచాడు. నర్స్ లోపలినుండి వస్తోంది. ఆమె చేతిలో సిరంజి ఉంది.

టైం చూసుకున్నాడు. ఆరవుతోంది. ఇంకో గంటలో అనూని నిద్రలేపితే సరి ఎనిమిదింటికి ప్రెజెంటేషన్.

"సిస్టర్, ఏమిటా ఇంజెక్షన్?" అడిగాడు.

కడుపు మంట వల్ల వాంతులు కాకుండా సర్ అంది.

అలాగా అన్నట్లు తలూపాడు.

ఆమె వెళ్ళబోతూ తలుపు వరకు వెళ్ళి" సర్" అని పిలిచింది.

"ఈ ఇంజెక్షన్ కు సెడేషన్ వస్తుంది. మేడం మధ్యాహ్నం తర్వాత నిద్రలేస్తారు."

"గాడ్. మధ్యాహ్నమా?"

"మధ్యాహ్నం లేచిన తర్వాత ఫ్రెష్ గా ఉంటారు. కంగారు పడకండి."

మీరు కూడా... వీలైతే తర్వాతి భాగమే ముగింపు  

To be continued


5 comments:

Sravya Vattikuti చెప్పారు...

Super andi !

రాజ్ కుమార్ చెప్పారు...

అంతా మన మంచికే... ఆ నర్స్ దేవత కదండీ..
ఇప్పుడు చూడండి.. మా వోడు ప్రెజెంటేషన్ ఇచ్చి పడగొట్టేస్తాడు ;)
బంగారం లాంటి ఇస్త్రీ చొక్కా నాశనం చెయ్యడమే కాక... రిజెక్ట్ చేస్తాదా లేకపోతే?? ;) ;)

అజ్ఞాత చెప్పారు...

సస్పెన్స్ మెంటైన్ చెయ్యడం లో ఎవరికీ తీసిపోరు

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రాజ్, మీరు తెలుగు సినిమాలు ఎక్కువుగా చూస్తున్నారు.....దహా.

ramesh చెప్పారు...

కథ బాగుందండి. అను లాంటి (సాధికారత, ఉక్రోషం, పొగరు వున్న) వాళ్ళు ఖచ్చితం గా ఉంటారు. కానీ, అలా దాసోహమనే అంతగా ప్రేమించే (అదే ప్రేమనుకోండి, అంటే నా అభిప్రాయం అనుకోండి) మురళి ని, నొప్పించే విధంగా మాట్లాడుతూ దూరం పెట్టిన అను, మళ్ళీ ప్రేమించేటప్పుడు (నిజం గా ప్రేమిస్తుంటే? ప్రేమించకుండా పెళ్ళికి ఒప్పుకోదు అనుకుంటే), ఒక్క క్షణం తన ప్రవర్తన లోని (బహుశా ప్రేమ లోని) అపరిపక్వతను తెలుసుకొని, ఒక్క క్షమాపణ అడిగి ఉంటే మా (మగ) మనసు తృప్తి పడేదేమోనండి :) పాపం మురళి ఏమవుతాడో (పెళ్ళి అయిన తరువాత) అని దిగులు లేకుండా ఉండేదేమోనండి :) మురళి లాగ ప్రేమించేటప్పుడు దాసోహం, పెళ్ళయ్యాక (అంటే ప్రేమించటమే జీవిత పరమావధి అని మనస్సు పదే పదే గొడవ పెట్టనప్పుడు) నేను అనే వాడు పదే పదే అలిగి దాసోహాన్ని ఓడించేటప్పుడు ఇబ్బందులు పడే వాళ్ళే ఎక్కువండి మరి.

- Ramesh

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి