17, నవంబర్ 2012, శనివారం

నిన్ను నిన్నుగా....3


"ఏమయ్యింది?”

ఎదురుగా పడిన రెడ్ సిగ్నల్ చూపించింది.

"ఇక్కణ్ణుండి మీ హాస్పిటల్ దగ్గరే కదా! మీరేమీ అనుకోక పోతే ఇక్కడ దిగుతారా? " అంది.

అతను ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ కారు దిగాడు.

"మీకు తగ్గ అమ్మాయి మీకు దొరకాలని కోరుకుంటున్నాను.”

“Is any thing wrong?”

"అవును, మీరు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. మరీ చలివిడిలా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ " అంటూ కారు డోర్ లాగి వేసుకుని మారిన గ్రీన్ సిగ్నల్ చూసి గేర్ మార్చి వెళ్ళిపోయింది.


ఇంటికొచ్చేసరికి అమ్మానాన్నలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

"ఏమ్మా ఎలా ఉన్నాడు?"

"బాగున్నాడు." అంది.

ఆ ఒక్క మాటకే తల్లిదండ్రులు సంతోషపడి "మరింకేం, వచ్చేనెలలో పెట్టుకుందాం ముహుర్తాలు" అని అనబోతుండగా

"వద్దమ్మా" అంది.

"బాగున్నాడని నువ్వే అన్నావుగా మరి ఇంతలో ఏమైంది?”

"బాగా తెల్లగా ఉన్నాడు. వొద్దు.” అంది.

"అదేమి కారణమే?” తల్లి అసహనంగా అరిచింది.

"అదే కారణం.”

కొన్నాళ్ళు తల్లి ముభావంగా గడిపి, మళ్ళీ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆమె తల్లి దండ్రులతో కూర్చున్న ప్రతి సారీ టీవీ లో పెళ్ళికి సంబంధించిన ప్రోగ్రాం ఒకటి చూపించేది.. సెలెబ్రిటీ దంపతుల పెళ్ళి, పెళ్ళి తర్వాత జీవితం ఎలా విజయవంతమైంది, ఆ విశేషాలకు సంబంధించిన ప్రోగ్రాం.

ఎప్పుడూ ఒకే ప్రోగ్రాం వస్తుందేం అని తండ్రినడిగింది. అనూకెలాగైనా పెళ్ళి చేయాలన్న ఆలోచనతో ఆ ప్రోగ్రాం తాలూకు ఎపిసోడ్లు అన్నీ ఒక సిడి చేయించి అది చూపిస్తోందని చెప్పాడు.

అది చూడకపోతే , తల్లి ఇంకా ఏవో తీవ్రమైన చర్యలకు పాల్పడుతుందని భయపడి తల్లిదండ్రులతో కూర్చున్నపుడల్లా ఆ ప్రోగ్రాం చూస్తూ ఉండేది.

యాంకర్ కట్టుకునే చీరలే మార్పు. అందరికీ ఒకే రకం ప్రశ్నలు

మొదటి సారి ఆయన ఆవిడకిచ్చిన మొదటి బహుమతి.

భార్య కళ్ళలోకి అతిచిలిపిగా చూస్తూ, " చెప్పు నేనేమిచ్చానో " అన్నాడు భర్త.

"అయ్యబాబోయ్, నేను చెప్పలేను. గప్ చుప్" అని చేతుల్లో మొహం దాచుకుంది. చూసే వాళ్ళకు మోతాదు దాటి ఊహించుకోవచ్చు అన్న హింట్ ఇస్తూ.

ఆవిడ ఆయనకిచ్చిన బహుమతి.

"నేనే ఆయనకో పేద్ద గిఫ్ట్" అంటూ పకపకా నవ్వే గడుసు పెళ్ళాం .

బహుమతుల సంస్కృతికి పూర్వం జన్మించిన ఎనభై ఏళ్ళ వృద్ధ దంపతులకూ అదే ప్రశ్న.

మొదటి సారి పండక్కి అత్తగారింటికెళ్తే బావమరిది కోడిని కోశాడా లేదా?

నిశ్చితార్ధానికీ, పెళ్ళికీ మధ్య కాలం లో ఏ తోటల్లో బడి తిరిగారు. ఏం వెలగ బెట్టారు?

కలిసి వెళ్ళిన రెస్టారెంట్ పేరు?

పెళ్ళి కి మంత్రాలు చదివిన పురోహితుడి పేరు చెప్పండి లాంటి ప్రశ్నలు.

నాలుగురోజుల్లో రకరకాల ఆలుమగల్ని చూసింది.

"నేను ఇంటికొచ్చేసరికి తను కనిపించకపోతే పిచ్చెక్కి పోతుందండీ నాకు. " అమితంగా ప్రేమించే భర్త.

ఆయనకు పిచ్చెక్కే సౌలభ్యం లేకుండా ఉద్యోగం మానేసిన భార్య

" అలిసి వొచ్చిన భర్తకు భార్య చిర్నవ్వే ఊరట. కొన్ని కోట్లు పోస్తే మాత్రం దొరుకుతుందటండీ ఆ సంతృప్తి" అని యాంకర్ ని దబాయించే భర్త.

"హేప్పీగా ఉందండీ ఇప్పుడు.” ఆయన్నీ ఇంటినీ చూసుకుంటుంటే దొరికే తృప్తి ఆ వొదిలేసిన ఉద్యోగంలో లేదని సంతృప్తి తో సతమతమయేన భార్య.

విడిపోవడం తప్ప, ఇంకో నిర్ణయం వీలులేని ఘోరమైన కారణాల్ని సైతం , సరదా విషయాలుగా మార్చిచెప్తూ అది తాము చేసిన త్యాగం గా అభివర్ణిస్తున్నారు.

తమ విజయవంతమైన వివాహ రహస్యం గురించి చెప్తోంది ఒకావిడ . "బార్యా బర్త ల మద్య గౌరవమనేది ముక్యం. ఎంత ముక్యమంటే అంత ముక్యం. అది తెలుసుకోపోటంవల్లే పెల్లిల్లు పెటాకులైపోతన్నాయ్. పెల్లి కి ముందే మేమిద్దరం ఒకరినొకరి గౌరవించుకోవాలనుకున్నామండీ. ఆ మాటనే ఇప్పటికీ ఫాలో అవుతున్నాం. " అని చెప్పి నువ్వూ చెప్పూ అన్నట్లు అని ఆయన్ని మోచేత్తో పొడిచింది.

ఆవిడ పక్కన కూర్చున్న సఫారీ సూట్ "అవునవును ఇద్దరం ఒకే ఇదిగా గౌరవించుకుంటాం. బాఁ గౌరవిచ్చేసుకుంటాం" అన్నాడు.

తల్లి ముఖం వంక చూస్తే ఓలాంటి తన్మయత్వం కనిపించింది. ఈ ప్రోగ్రాంల దెబ్బకు కూతురు పెళ్ళి నిర్ణయం తీసుకుంటుందనీ తనకలలు నిజమయే రోజులు ఆట్టే దూరంలో లేవనీ ఆశతో నవ్వుకుంటూ బాగా ఇన్వాల్వ్ అయి టీవీ వంక చూస్తోంది.

సిగ్గు అన్న పదమెరగని ఒక రసిక యువకుడు అన్ని విషయాలూ పూసగుచ్చినట్టు చెప్తున్నాడు. పక్కనున్న అతని భార్య అతని వంతు సిగ్గు కూడా ఆవిడే పడుతోంది. పెళ్ళికి ముందు ఓ సాయంత్రం కాబోయే భార్యను మామగారి స్కూటర్ మీంచి హైజాక్ చేసి ఒక చీకటి రోడ్డు మీద తనేమి చేశాడో చెప్పబోతుంటే అతనేం చెప్తాడోనని అనూకు భయమేసి పెరుగు వరకు ఆగకుండా మధ్యలోనే లేచి టివి కట్టేసి పైకెళ్ళిపోయింది.

అమ్మానాన్నలు ఎంత తనపెళ్ళికోసం ఎంత ఎదురుచూస్తున్నారో, తనపెళ్ళి కుదిరితే ఎంత సంతోషిస్తారో! వాళ్ళ తొందర వల్ల ఆమెకు తెలియకుండానే ఏదో ప్రెజర్ తెలుస్తోంది. ఏ టాస్క్ తీసుకున్నా సరే విజయవంతంగా పూర్తి చేసే తనకు, పెళ్ళి అనే అనే టాస్క్ వింతగానే ఉంది.

పెళ్ళి లో విజయం సాధించడమంటే ఏమిటి?

లోపల ఎన్ని గొడవలు పడినా గానీ బయటికొచ్చేసరికి ప్రేమలు వొలకబోస్తూ, పరువు కోసం కష్టపడి కలిసుండటమే విజయవంతమైన వివాహమా?

పెళ్ళి జీవితం లో ఒక భాగం మాత్రమే. ఒక వ్యక్తితో కలిసి ఉండాలి. ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఒక వేళ పెళ్ళి సక్సెస్ కాకపోతే నిరాశ పడకుండా దానిలోనుండి దెబ్బలు లేకుండా బయటకొచ్చేయాలి అనుకుంది. ఏ రకం గానూ కెరీర్ దెబ్బ తినకూడదు. ప్రేమలు, పెళ్ళీ అంటూ చదువు, ఉద్యోగాలు వదులుకుని జీవితం నాశనం చేసుకున్న ఎంతో మంది గుర్తొచ్చారు.


కలిసిన కొద్ది సమయంలోనే మనుషుల్ని ఆమె ఒక అంచనా వెయ్యగలదు. ఆ అంచనా ఎప్పుడూ తప్పు కాలేదు కూడా. అతి మర్యాదలు, కృత్రిమ గౌరవాలతో ఆమె లో హెచ్చరిక గంట లాగే వారు. వాళ్ళని ఎంత దూరంలో ఉంచాలో వాళ్ళే సూచించే వారు. పెళ్ళి అంటే వ్యతిరేకత లేదు కానీ ఎవరితోనైనా సరే ఓ పది నిముషాలు మాట్లాడితే వాళ్ళలో ఏదో ఒక లోపం కనిపిస్తుంది. మనలో ఏ లోపాలు లేవు మరి వెటకారం వొలకబోసింది అంతరంగం.
   పండుగ సెలవ ఆదివారంతో కలిసి మూడు రోజుల ఖాళీ వచ్చింది. ఆ మూడు రోజులూ కూర్చుని పెళ్ళి అన్న ప్రాజెక్ట్ మీద పని చేసింది.


పెళ్ళికి ముందు ఏం మాట్లాడుకోవాలి. అసలు గొడవలెందుకొస్తాయి. విడాకుల వరకు ఎందుకెళ్తారు. పెళ్ళిలో తను సర్దుకోగలిగిన విషయాలు ఏమిటో, సర్దుకుపోలేనివి ఏమిటో ఏ విషయాల్లో అభిప్రాయభేదాలు రాగలవో ఆలోచించి ఒక నోట్స్ తయారు చేసింది .
డబ్బు, స్నేహితులు, ఉద్యోగం, ఇంటిబాధ్యతలు, పిల్లలు, కోపం, అభిప్రాయబేధాలు, ఇద్దరి గౌరవ మర్యాదలు, ఇరువైపు కుటుంబ పెద్దల బాధ్యతలు, స్వాతంత్ర్యం, వాటి పరిధులు
అన్నింటికీ సంబంధించి గొడవలు రాగల కారణాల్నీ, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక వేళ వస్తే పరిష్కార మార్గాలు, back up plans వివరం గా టైప్ చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసింది.


రాబోయే అతని అభిప్రాయలు కూడా జతపరచడానికి వీలుగా కొంత ఖాళీ ఉంచింది.

తనకోసమని ప్రత్యేకంగా కొన్ని రూల్స్ వ్రాసుకుంది.

భర్త మీద ఆర్ధికంగా ఆధారపడడం, అతనంటే possessive గా ప్రవర్తించడానికి తాను పూర్తిగా వ్యతిరేకం

అతనికి అవసరమైనపుడు సహాయం చేయడానికి ముందుండాలి.

ఆశలు పెంచుకోవడం, అవి తీరనపుడు అతన్ని సాధించడం చేయదు.

తన జీవితం లో నష్టాలకు కష్టాలకు అతన్ని బాధ్యుణ్ణి చేయకూడదు.

తనపట్ల, కుటుంబం పట్ల అతను నిజాయితీ పరుడై ఉండాలి అందులో రాజీలేదు.


తను తయారు చేసిన డాక్యుమెంట్, దానికోసం ఖర్చు చేసిన సమయం తలుచుకుని ఏవిటీ పని లేని పనులు అని నవ్వుకుంది. తనతో పరిచయమున్న వాళ్ళెవరూ తనిలాంటి విషయాలమీద పని చేసిందంటే నమ్మరు గాక నమ్మరు.


ఆ పనంతా అయిపోయిన తర్వాత లేచి కాసేపు బాల్కనీలో నిలబడింది. కరెంట్ పోయింది. రాత్రి చల్లదనం , చిరుగాలి. పైనుండి వేలాడే పూల తీగెలు ఊగుతున్నాయి. పైకి చూస్తే నక్షత్రాలు విచ్చుకున్న మల్లెలని వెదజల్లినట్లుగా ఉన్నాయి.

మొబైల్ మోగుతున్న శబ్దం వినిపించింది. లోపలకెళ్ళి చూస్తే బాస్ ఫోన్ చేస్తున్నాడు.

ఆన్ చేసి "సర్, రోలండ్స్ కంపెనీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. రేపుదయమే మీకిచ్చేస్తాను" అంది.

"అది కాదు అనూ" అంటున్నారు.

" సర్, చెప్పండి "

"మా విజయ్ తెలుసుగా, విజయేంద్ర. వాడికి సివిల్స్ లో పదో రేంక్ వచ్చింది. రేపు సాయంత్రం కొంత మంది క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ కు పార్టీ ఇస్తున్నాను.”

విజయ్ అంటే ఆయన చిన్న కొడుకు. జుట్టు మీద రకరకాల రంగులు పూసుకుని వాటిని గుత్తులు గుత్తులుగా విడదీసి, ఆకాశం వేపు మెలితిప్పి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. మ్యూజిక్ అంటే ఇష్టం. కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి మ్యూజిక్ బేండ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంగ్లీషులో పాటలు రాసి వాటికి సొంత బాణీ కట్టి బాస్ ఇంట్లో జరిగే పార్టీలలో అతిథులను ఎంటర్టెయిన్ చేస్తుంటాడు.

అతనికి సివిల్స్ లో రేంకా? ఆశ్చర్యపోయింది.

"ఎవరు సర్, మీ చిన్నబ్బాయి విజయేంద్రా?” అడిగింది.

"నమ్మలేకుండా ఉన్నావు కదూ, మొదట నేనూ నమ్మలేదు. వాడు ప్రిపేర్ అవుతున్నట్లు కూడా చెప్పలేదు నాకు. రేపు నువ్వు తప్పకుండా రావాలి.”

*******


ఊరి చివరన బాస్ కో గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ తోటలో పార్టీ జరుగుతోంది. పార్టీలో ఆడవాళ్ళు తక్కువగా, వాళ్ళలో ఆమెకు తెలిసిన వాళ్ళు మరీ తక్కువగా ఉన్నారు. వంటరిగా ఓ టేబిల్ ముందు కూర్చుని చుట్టూ హడావుడి గమనిస్తూ ఉంటే విజయ్ దగ్గరకొచ్చాడు. అతని జుట్టు నల్లగా ఉండి, మామూలుగా దువ్వి ఉంది.

"మీరు తీరిక చేసుకుని వచ్చినందుకు థాంక్స్" అన్నాడు.

అతన్ని అభినందించింది. "మీరు సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్నారని నాకు తెలియదే. ఎలా జరిగింది ఇది" అడిగింది.

"సివిల్స్ నా కలేమీ కాదు. కొందరి వ్యక్తుల పరిచయం వల్ల జీవితాలు మారిపోతాయి. ఒక ఫ్రెండ్ , ఫ్రెండ్ కాదనుకోండి నాకు గురువు లాంటి వాడు. అతను మా యూనివర్సిటిలో నాకు సీనియర్. అతని పరిచయం వల్లే అయింది.”

"ఇంతకూ ఏం ఇంఫ్లుయెన్స్ చేశాడు. ఎలా చేశాడు? “

"అతనికి తెలియని సబ్జెక్ట్ లేదు. చదువుకునే రోజుల్లోనే ఎంతోమందిని సివిల్స్ కు ప్రిపేర్ చేసే వాడు. అతని దగ్గర కోచింగ్ తీసుకున్న చాలామంది ఐ ఎ ఎస్ కు సెలెక్ట్ అయ్యారు. ఆయన కవితల్ని నేను ఇంగ్లీషులో రాసుకుని పాడేవాణ్ణి. అలా పరిచయం నాకు. నేను మీనాక్షిని పెళ్ళి చేసుకుందామనుకుంటే నాన్న నాకో కండిషన్ పెట్టాడు. అదంతా అయ్యేపని కాదనుకుని, రహస్యంగా పెళ్ళి చేసుకుందామనుకున్నాను. అతన్ని హెల్ప్ చెయ్యమంటే, నాన్నే మా పెళ్ళి జరిపించేలా చేస్తానని, ఒక సంవత్సరం టైం ఇవ్వమన్నాడు.

చాలా ఓర్పుతో చదివించాడు. రెండ్రోజులకోసారి పేచీ పెట్టేవాణ్ణి, సార్, పెళ్ళి చెయ్యమంటే , నన్ను చావగొడ్తున్నారేంటి సార్" అని.

అతని మాటలకు అనూ నవ్వేసింది.

" కొన్నాళ్ళకు చదువులో కష్టం తెలిసేది కాదు.  నాకు తెలియకుండానే నా ఆలోచనలు మార్చేశాడు. పరీక్షకు టెన్షన్ లేకుండా, నైట్ ఔట్ చేయకుండా రాసిన పరీక్ష ఇదే.”


"ఎవరతను? పార్టీకి పిలవలేదా?”

"వచ్చాడు. తన గురించి అనౌన్స్ చేస్తానన్నాను కానీ వొద్దన్నాడు. .”

"ఇంతకూ అతనేం చేస్తుంటాడు అడిగింది.”

"అతను రెండేళ్ళ క్రితం ఐ ఏ ఎస్ టాపర్. ప్రొబేషన్ పేరియడ్ అయిపోయింది. మీరు నెలనెలా బ్రాంచ్ ఆఫీసుకెళ్తారే, ఈ మధ్యనే అక్కడ పోస్టింగ్ వచ్చింది అతనికి.”

ఏదో గుర్తొచ్చినట్లు పక్కకెళ్ళి ఒకమ్మాయితో వచ్చి నిల్చున్నాడు. అతని భుజాల వరకూ వుంది ఆ అమ్మాయి. బుట్టలాంటి డ్రెస్ వేసుకుని ఉంది. డ్రెస్ మీద చిన్న చిన్న పూసలు, రాళ్ళు కుట్టి ఉన్నందున ఆమె కదిలినప్పుడు తళుక్కులు విరజిమ్ముతున్నాయి.

"మీనాక్షి" అని పరిచయం చేశాడు. ఆ అమ్మాయి మొహంలో సంతోషం, ఉత్సాహం రెండూ కలిసిపోయి ఉన్నాయి.

"అందమైన జంట" అనూ అభినందించింది.

అనూ తో రెండు నిముషాలు మాట్లాడిన తర్వాత "డేడీ పిలుస్తున్నారు రా" అంటూ లాక్కెళ్ళింది.

మళ్ళీ కంపెనీ ఎవరూ దొరక్క అటూ ఇటూ చూస్తుండగా ఒకతను వచ్చి ఎదురుగా నిల్చున్నాడు.

"బాగున్నారా?” అని పలకరించాడు అతను.

అలాంటి వాతావరణం లో తెలుగు వినబడడం కొంచం వింతగా ఉన్నా గానీ ఆమె చిన్ననవ్వుతో తలూపింది.

"అమ్మా, నాన్నగారు బాగున్నారా?” మళ్ళీ అడిగాడు అతను.

ఈ సారి కొద్దిగా చిరాకు పడింది. ఎవరితను బొత్తిగా పరిచయం లేకపోయినా అనుకుంటూ.

ఆమె చిరాకు చదివినట్లు "సారీ, నేను మురళీ ని" చెప్పాడు.

"మురళీ, ఏ మురళీ" అనుకుంటూ "మాష్టారు గారి మురళీ?" అప్రయత్నంగా అంది ఆమె.

"అవును" తలూపాడు.

తనకు తెలియకుండానే లేచి నిల్చుంది.

 ముడతలు లేని తెల్ల చొక్కా, గరుకు గొంతు, చిరునవ్వు.

ఎదురుగా చిరునవ్వుతో నిల్చున్న అతనిలో చిన్నప్పటి మొటిమల మొహం పిల్లాణ్ణి వెతికింది.

ఇంతలో విజయ్ వచ్చాడు. " సర్ మీరిక్కడున్నారా, మీకోసమే వెతుకుతున్నాను. సర్ ఆమె అనుపమ, మా నాన్నగారి ఆఫీసులో ముఖ్యమైన వ్యక్తి. నాన్నగారి కన్సల్టెన్సీ కి బేక్ బోన్.”

"మేడం, నేనిందాక చెప్పానే నా గురువు, ఫ్రెండ్,  గైడ్, నాకు చాలా చాలా .”

to be continued


6 comments:

Sravya Vattikuti చెప్పారు...

సూపర్ గా రాస్తున్నారు అండి . కొంపదీసి తరవాత భాగాలలో అను ని , మురళి దగ్గర చిన్నబోయేట్లు చూపిస్తారా ఏమి ? అలా జరిగితే నేను అస్సలు ఊరుకోను :-)

Sunita Manne చెప్పారు...

మేడం, మీ రైటింగ్ స్కిల్ల్స్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ "ఆ సెలెబ్రిటీ దంపతుల పెళ్ళి, పెళ్ళి తర్వాత జీవితం ఎలా విజయవంతమైంది, ఆ విశేషాలకు సంబంధించిన ప్రోగ్రాం" గురించి రాసారు చూడండి మీకువెంటనే ఓ దండేసి దణ్ణం పెట్టాలనిపించింది". మీకున్న కొద్ద టైములోనే ఇదంతా కూడా గమనించినందుకు:))


buddha murali చెప్పారు...

బాగుంది .. ఆసక్తి కరంగా రాస్తున్నారు .. దంపతుల ఇంటర్వ్యు నిజంగానే ఎబ్బెట్టుగా ఉంటుంది .. దాంపత్యం వ్యక్తి గత వ్యవహారం .. వాటిని రోడ్ పై పడేయడం ఏమిటో .. ఇలా ఇంటర్వ్యులో పాల్గొన్న వారిని బయట కనిపిస్తే ఎవరో ముక్కు మీకం తెలియని వ్యక్తి పలకరించి బాగున్నారా ? మీ వారు ఇంట్లో అలానే చిలిపి పనులు చేస్తున్నారా ? ఏమైనా మారారా ? వంటి ప్రశ్న లు అడిగితే ఎలా ఉంటుందో

రాజ్ కుమార్ చెప్పారు...

బాబోయ్... మీ కధల్లో క్యారెక్టర్లని బట్టీ, మనుషులని మీరు ఏ రేంజ్ లో అబ్జర్వ్ చేస్తారో అర్ధమవుతుందండీ...
నిజం చెప్పాలంటే... మీతో మాట్లాడటానికి భయమేస్తుంది... ;)
పోస్ట్ చాలా రొటీన్ గా..... సూపర్ గా ఉంది

sndp చెప్పారు...

vammo are you writing any one's real story???

జ్యోతిర్మయి చెప్పారు...

విలక్షణమైన రచనా శైలి మీది. పెళ్ళి గురించి అవగాహనన కోసం చేసిన ఆలోచన చాలా నచ్చింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి