16, నవంబర్ 2012, శుక్రవారం

నిన్ను నిన్నుగా-2


తెల్లవారక ముందే నిద్రలేచి ఇద్దరూ మాష్టారి వెనకగా నడుస్తూ వెళ్తున్నారు. పార్క్ దగ్గరకెళ్ళే సరికి తెలతెలవారుతోంది. పార్కు లో బెంచీలమీద కూర్చుని అప్పటికే మాష్టారి స్నేహితులు ఎదురుచూస్తున్నారు. వాళ్ళతో కబుర్లాడుతూ ఉంటే, మాష్టారు చెప్పిన మనిషి ఎవరై ఉంటారా అని మురళీ, అనూ వాళ్ళని పరీక్షగా చూస్తూ ఉన్నారు.

ఎంత సేపు చూసినా వాళ్ళలో ఆ ఆదర్శ ఉద్యోగి ఎవరో అంతుబట్టలేదు. అందరూ మామూలుగానే ఉన్నారు. ఇంకా మామూలుగా రాజకీయాలు మాట్లాడుతున్నారు.

మధ్యలో వీలు చిక్కినపుడు మురళీ అడిగాడు. "నాన్నా, ఎవర్నో చూపిస్తానన్నావు. ఆయనింకా రాలేదా?"

మరిచే పోయాను అంటూ పక్కకొచ్చారు. పైకి చూసి "వచ్చేశారుగా ” అన్నారు.

ఎవరు మాష్టారూ ?

చుట్టూ చూశారు పిల్లలిద్దరూ.

లేత నీలి రంగు ఆకాశం లో మెల్లమెల్లగా పైకి లేస్తున్న ఎర్రని సూర్యుణ్ణి చూపించారు.

"సూర్యుడా?" అనూ గొంతులో ఆశ్చర్యం.

"ఆయనే నాకు తెలిసిన గురువు, గొప్ప ఉద్యోగి.

సూర్యుడి చుట్టూ మనం తిరుగుతున్నా చూసేందుకు ఆయనే వస్తున్నట్లు, వెళ్తున్నట్లు ఉంటుంది. మనకొక మంచి పాఠం నేర్పేందుకే

వేల సంవత్సరాలనుండీ వేళతప్పకుండా ఉద్యోగానికి వస్తాడు.

జీతమక్కరలేదు.

సెలవనేది ఎరగడు.

వృత్తిలో బీదా గొప్పా తేడా చూపించడు. అందరికీ సమానంగా వెలుగునీ వెచ్చదనాన్నీ పంచుతాడు.

ఆయనే లేకపోతే మనకు మనుగడలేదు. ఇంత చేస్తున్నా మన నుండి ఒక నమస్కారం కూడా ఆశించడు. అన్నింటినీ మించి తనలాగా జీవించమని, ఏమీ ఆశించకుండా ఎదుటివారికి సహాయం చేయమని నిశ్శబ్దంగా పాఠం నేర్పుతున్నాడు. ”

"క్రమశిక్షణ, టైం కు రావడం వరకే సూర్యుణ్ణి ఫాలో కాగలం కానీ, మిగతావి మనమెలా చెయ్యగలం. ఆయనలా మనమెలా ఉండగలం? మనం కూడా అలా ఊరికే అందరికీ సహాయం చేస్తే మనల్ని పిచ్చివాళ్ళనుకోరా మాష్టారూ?" అడిగింది అనూ

"సూర్యుణ్ణి చూసి మనం పిచ్చివాడని నవ్వగలమా అనూ?”

"సూర్యుడు మనిషి కాదుగా మాష్టారూ? ”

"మనమెవరికైనా సహాయం చేయగానే, వారు జీవితమంతా ఆ సహాయాన్ని గుర్తుంచుకోవాలని అనుకుంటాం. 'థాంక్స్ ' చెప్పకపోతే కోపగించుకుంటాం. ఏదీ ఆశించకుండా సహాయం చేయగలిగితే , లోకమంతా వెలుగుతో నిండిపోదా?”

మాష్టారి మాటలు ఒప్పుకోలేనట్లు మౌనంగా నిల్చుంది.

"నీకేం నచ్చిందో చెప్పు" అన్నారు మురళిని.

మురళి ఏమీ మాట్లాడలేదు.

"సూర్యుడిలో ఏవీ నచ్చలేదేమో మాష్టారూ,” వెటకారంగా అంది అనూ.

"నిశ్శబ్దంగా సహాయం చేయడమే నచ్చింది.” అన్నాడు ఓ క్షణమాగి.

***

పదవ తరగతి పరీక్షల ఫలితాలు రాకముందే ట్రాస్ఫర్ అయిన ఊరికి ప్రయాణమయ్యారు మాష్టారు.
ఊరు మొత్తం కదిలి వచ్చి వీడ్కోలు చెప్పింది. మాష్టారు దగ్గరకొచ్చి 'వెళ్ళొస్తానమ్మా' అని చెప్తుంటే మాష్టారు కాళ్ళకు దణ్ణం పెట్టించింది అనూ వాళ్ళ అమ్మ.

ఫలితాలు వచ్చిన రోజు , తననుకున్న దానికన్నా బాగా మార్కులు వచ్చినందుకు ఆమె సంతోషపడింది. ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. మురళీ స్టేట్ ఫస్ట్ గా నిలిచాడు. స్కూల్ సెకండ్ గా వచ్చింది. ఓడిపోయినట్లయింది.
ఓటమి రగిలించిన మంటతో దహించుకుపోయింది. ఎంత బాగా చదివేది. అలాంటిది ఇతనొచ్చి ఓటమి రుచి చూపించాడు. సెకండ్ వచ్చిన అవమానం, బాధతో ఆ రోజంతా తల్లడిలింది. కొంతసేపటికి బాధ చల్లారినా, ఆ అనుభవం పట్టుదలను పెంచింది.

ఆ తర్వాత లేచి ఒక నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా తను గొప్ప స్థితి కి చేరుకోవాలి. గెలవాలి. గెలుపు తో తప్ప ఓటమితో తను బతక కూడదు. పైమెట్టు ఎక్కాలంటే ఓటమిని మించిన ఇంధనం ఏముంటుంది?

కెరీర్ తప్ప ఇంకో ఆలోచన లేకుండా శ్రమ పడింది.

చిన్న వయసులోనే ఎన్నో విజయాలు. పేరున్న టాక్స్ కన్సల్టెన్సీ ఫర్మ్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం. బిజినెస్ కంపెనీలకు చార్టెడ్ అకౌంటెంట్ గా క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంది. పని అయ్యేంతవరకూ అనుకున్న ఫలితం దక్కేవరకూ నిద్రాహారాలు మాని శ్రమిస్తుంది.

కెరీర్ లో ఎవరూ ఎక్కలేని మెట్లు ఆమెకు సంతోషకరమైన జీవితం అందించాయి.

ఆ ఏడాది Women Entrepreneur award అందుకుంది.

ఆమెకు తగ్గ మనిషి కోసం తల్లిదండ్రులు వెదుకుతూ ఉన్నారు.


తల్లి చిన్ననాటి స్నేహితురాలి కొడుకట. ఒకవేళ ఈ పెళ్ళికుదిరితే , స్నేహితురాళ్ళిద్దరూ కలిసి చేసుకోగల షాపింగ్ వేడుకల కలలు కనేశారు.
తల్లిని నిరాశ పరచడం ఇష్టం లేక ఆ అబ్బాయిని ఒక హోటల్ లో పూల్ పక్కనున్న రెస్టారెంట్ లో లంచ్ టైమ్ లో కలిసింది.


"మీరెక్కడ పని చేస్తుంటారు" అని అడిగింది

అతను పని చేసే కంపెనీ పేరు చెప్పి , తను చేరక ముందు అదెంత దిక్కుమాలిన స్థితిలో ఉందో, తను చేరి, చావడానికి సిద్ధంగా ఉన్న ఆ కంపెనీకి ప్రాణప్రదానం చేసి ఎలా కొత్తజన్మనిచ్చాడో, మూలస్తంభం లా ఎలా నిలబడ్డాడో , తను లేకపోతే అతను పనిచేస్తున్న కంపెనీ ఏ రకంగా కుప్పకూలగలదో, వివరించాడు.

"మా బాస్ కు నేనంటే చచ్చేంత నమ్మకం. నేను లేకపోతే బోర్డ్ మీటింగ్ కూడా పెట్టుకోడు. పక్కన నేను లేకపోతే ఆయనకు కాలూ చెయ్యి ఆడదు. మంచోడే కానీ పిచ్చోడు. ఉట్టి బుర్రలేని మేళం.”

ఆమె గురించి అడిగాడు.


ఆమె వృత్తి వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోతూ,

"ఇంత చిన్న వయసులో ఎలా? అసలెలా సాధ్యం. మీరింత సుకుమారం గా ఉండి, ఇన్ని పనులు ఒక్కరే చేయడం అమేజింగ్." నమ్మలేకపోతున్నట్లు ఓ లాగా తలవిదిలించాడు.

తన గురించి సుకుమారం అనే మాట వాడడం ఆమెకు నచ్చలేదు.

ఆమెలో అందం, తెలివితేటలు, పట్టుదల, సామర్ధ్యం అన్నీ కలిసి ఉన్నందుకు విస్తుపోయాడు. ఆమె తెలివితేటలను పొగుడుతూ, ఆశ్చర్యపోతూ అలిసిపోతున్నాడు.

"మీరు సామాన్యులు కాదు, మీతో చెతుర్లు కాదు " అంటూ అప్పుడప్పుడు అభినందనలు విసిరేస్తూ intellectual flirting చేస్తున్నాడు.

ఆమె హాబీలడిగాడు.

" ఖాళీగా ఉండే టైము తక్కువ. ఆదివారం సాయంత్రం అమ్మానాన్నతో గడుపుతాను.” అని చెప్పింది.


"నాకు ఫ్రెండ్స్ బాగా ఎక్కువ. స్నేహితులంటే ప్రాణమిస్తాను. మొన్న నా స్నేహితుడి చెల్లెలి పెళ్ళి సందర్భంలో అన్నీ దగ్గరుండి నేనే చూసుకున్నాను. కొంత డబ్బు సహాయం కూడా చేశాను. నాకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువని నేను లేకపోతే పార్టీ చేసుకోడానిక్కూడా ఇష్టపడరు ఫ్రెండ్స్.”

  మధ్యలో ఏదో ఫోన్ కాల్ మాట్లాడాడు. ఆమె ఎదురుగానే కూర్చుని ఆఫీసు వ్యవహారాలు చక్కదిద్దుతున్నాడు. ఫోన్లో అవతలివేపు మనిషితో క్లయింట్కి ఏం లెటర్ పంపించాలో వివరించాడు. తననడక్కుండా సొంత నిర్ణయం తీసుకున్నందుకు చీవాట్లు పెట్టాడు.

మొబైల్ ని రెండు చేతులమధ్యా పెట్టి, చటుక్కున పర్స్ మూసి నట్లు మూసేసి తన అసహనాన్ని తెలియజేశాడు. అసలు బుర్రలేని మనుషులెలా జన్మిస్తారు అని ఇంగ్లీషులో ఈమెనడిగాడు

దేవుడెంత పక్షపాతి, ఎవరికీ పెట్టని తెలివి, చురుకుదనం, జాలిగుణాలు, సెన్సాఫ్ హూమర్లూ అన్నీ రోటి పచ్చడి చేసి ఈయన బుర్రలోనే కూరాలా? పనుందని లేచి వెళ్ళిపోవాలనుకుంది. ఏ రకంగానూ అతన్ని చిన్నబుచ్చకూడదని తల్లి మాట తీసుకుంది.


"ఆకలిగా ఉంది తినడానికి లేద్దామా" అని బఫే దగ్గరకు తీసుకెళ్ళింది.

" నాకు మనవైపు వంటలే ఇష్టమండి. ఎక్కడికి వెళ్ళినా అన్నం , రసం కోసం చూస్తాను.”అంది.

"అదేమిటి మీరు చూడ్డానికి ఇంత మోడర్న్ గా ఉన్నారు, అన్నం , రసం తింటారా?" అతను ఆశర్య పోయాడు.

"ఏమో, మన వంటల్లో ఉన్న రుచి నాకింక ఎక్కడా దొరకలేదు. ఒక వేళ మిగతావి ట్రై చేసినా ఏదో ఒకటి రొండు సార్లు, అంతే, మళ్ళి అన్నం , పప్పూ, పచ్చడి తినకపోతే నా వల్ల కాదు.”

అలా తిండి మీద మొదలెట్టిన సంభాషణ, ఏ రెస్టారెంట్ లో ఏ పదార్ధం బాగుంటుంది, సరైన ఫిల్టర్ కాఫీ అడ్రస్ ఎక్కడా ఇలాంటివి మాట్లాడుకున్నారు.

విడిబోయే ముందు " చాలా బాగుందండీ . గుర్తుంచుకోదగిన లంచ్" అంటూ అతనికి చెప్పి వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె పెళ్ళికి సంబంధించిన ఏ విషయమూ మాట్లాడలేదనీ, సాంబారూ రసం అంటూ టైమ్ గడిపేసి వెళ్ళిందనీ అర్ధమైంది. పరీక్ష ఫలితం తెలిసిపోయింది అతనికి. ఇలా కూడా నో చెప్పవచ్చా అని విస్తుపోయాడు.

'పెద్ద ఉద్యోగం, ఎంతో మర్యాదస్తుడు. ఉన్నంతసేపూ ఆంటీ ఆంటీ అని చూట్టూతా తిరిగాడు. చేసుకోడానికేం' అంటూ అమ్మ బాధపడింది.


ఇంకో సంబంధం తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. అతనో సూపర్ స్పెషలిష్ట్ డాక్టర్.
ఆజాను బాహుం అరవింద దళాయ తాక్షం.

అతన్ని చూడగానే ఎవరికైనా పౌరాణిక సిన్మా ఏక్టర్లు గుర్తుకొస్తారు. తాతలు, తండ్రులు, మేనమామలు ఎస్ వీ ఆర్, ఎన్ టీ ఆర్, ముక్కామల స్థాయి మనుషులైఉంటారు. లేకపోతే అంతటి విగ్రహం అసాధ్యం.
చతురస్రాకారపు ముఖంలో సిమ్మెట్రికల్ గా అమర్చబడిన పెద్ద కళ్ళు. చక్కటి ముక్కు. తెల్లగా ఉన్నాడు. మచ్చలేని తెల్లదనం, అంతకన్నా తెల్లని బట్టలు. కాలిగోరుకూడా శుభ్రంగా ఉంది. అందం అనే పదం ఎక్కువగా ఆడవాళ్ళే వాడేసుకుంటూ ఉంటారేమో, పాపం ఇతనికోసం కూడా వాడాలి.

మెత్తని గొంతు, చిత్తూరినాగయ్య నుండి వడ్డీకి అరువు తెచ్చుకున్నకిలోలకొద్దీ సౌమ్యత. , ప్రతి మాట లోనూ సహజంగా పలుకుతున్న అతిమంచితనం.


ఆమె ఆఫీసుకే వచ్చి కలిశాడు. తన పని గురించి చెప్పాడు.

"ఎన్నో రాత్రులు నిద్ర ఉండదు. పేషెంట్ కు ఆరోగ్యం బాగయ్యే వరకూ అదే ఆలోచనగా ఉంటుంది. ఆ వత్తిడిని తట్టుకునేందుకు భార్య సహకారం చాలా అవసరమవుతుంది.”

ఆమెకూడా డాక్టరే అయితే , ఇతన్ని చూసుకునే టైము ఆవిడ దగ్గర ఉండదు, కనక తీరికగా సేదదీరలేడు. పైగా భార్యకూడా ఒకే వృత్తి అయిన పక్షం లో జీవితంలో వైవిధ్యం కోల్పోయే ప్రమాదముంది కనక వేరే వృత్తిలో ఉన్న పెళ్ళికూతురికోసం చూస్తున్నాడు.

అతనితో తృణీకరించబడిన డాక్టరమ్మలు ఈమెను చూస్తే అసూయపడతారట. తమకు దక్కని అదృష్టం చేజిక్కించుకున్న తోటి ఆడపిల్లను చూస్తే అసూయ కలగదా మరి!

తన విషయాలు చెప్పేసి, కొద్దిగా నిట్టూర్చాడు. కుర్చీలో వెనక్కి వాలి ఆమె టేబిల్ మీద అతని నాజూకు వేళ్ళ తో చేసే విన్యాసం ద్వారా సంగీతం పలికించడానికి ప్రయత్నిస్తూ, "ఊ మీరు చెప్పండి, ఏం చేస్తుంటారు, అసలు టాక్స్ కన్సలెంటెంట్ అంటే ఏవిటీ?" అని అడిగి అలాంటి విషయాలపట్ల డాక్టర్ల కుండే సహజమైన అజ్ఞానాన్ని ప్రదర్శించాడు.

ఆమెకెందుకో ఏమీ చెప్పాలని అనిపించలేదు. " అదేమీ అంత కాంప్లెక్స్ విషయం కాదు" అంది.

"అఫ్ కోర్స్, మీరలా మా ప్రొఫెషన్ తో పోల్చుకుని ఫీలవకండి. పర్లేదు చెప్పండి. అసలీ విషయాలు తెలుసుకునే టైముండదు నాకు" ఆమెకో అవకాశమిచ్చాడు తన జ్ఞానశూన్యత అదనపు అర్హతగా భావిస్తూ.

ఎదురుగా ఉన్న ఫైల్ మూసేసి " నేను వెళ్ళాల్సిన టైం అవుతోంది ."

"ఎక్కడికి వెళ్ళాలి?"

"ప్రతినెలా ఒక వారం నేను మా బ్రాంచ్ ఆఫీసు పనులు సూపర్ వైజ్ చెయ్యడానికెళ్తాను"

"మరి పెళ్ళి అయితే" ఈ నామమాత్రపు మాటల తతంగం తర్వాత పెళ్ళేకదా అన్న ఉద్దేశ్యంతో.

"పెళ్ళికి, నా పనికి ఏం సంబంధం?"

"కొంచం టైముందా నేను మాట్లాడటానికి"

టైం చూసి "ఎయిర్ పోర్ట్ కెళ్ళాలి. ఇంటికెళ్ళి నా బేగ్ తీసుకుని వెళ్తాను.” అంది. పోనీ వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం అన్నాడు. తన డ్రైవర్ తో కారు తీసుకెళ్ళి హాస్పిటల్ దగ్గర పెట్టమని చెప్పి ఆమెతో బయలు దేరాడు.

ఆమే డ్రైవ్ చేస్తూ ఉంది.

"మీరిలా ఊళ్ళు తిరుగుతూ కష్టపడాల్సిన అవసరమే లేదు. మీ నెల సంపాదన నేను రెండు ఆపరేషన్లు చేస్తే వచ్చేస్తుంది. మరీ ఖాళీగా ఇంట్లో ఉండలేరనుకుంటే నా హాస్పిటల్ ఎకానమీ మీరే డీల్ చెయ్యొచ్చు." ఏమాట మాట్లాడుతున్నా సరే, గొంతులోని మెత్తదనం చెదరనివ్వడం లేదు.

ఆమె దృష్టి అంతా ట్రాఫిక్ మీదే ఉంది.

ఏమీ మాట్లాడలేదు.

"ఇంకో మాట, నాకు పెద్దగా ఖాళీ దొరకదు. మీకు ఒకె అయితే వచ్చే నెలలో ముహూర్తాలున్నాయట. ఈ నెల చివరివారం నేను సెలవు తీసుకుంటాను. అప్పుడు పెళ్ళి షాపింగ్ లాంటివి చేసెయ్యొచ్చు." అతన్ని ఒకె చెయ్యకపోడానికి భూమ్మీద ఏ ఆడపిల్లకైనా ఏమి అభ్యంతరం ఉంటుంది? అందగాడు, సంపాదనపరుడు, హోదా, సుతిమెత్తని పంచదార చలివిడి లాంటి మనిషి. కాదనడానికేముంటుంది?

"ఏమంటారు? " ఆమె ఏమీ మాట్లాడకపోవడం చూసి అడిగాడు.

కారాపింది.

To be continued 7 comments:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

కారాపింది....
ఆవిడ నిర్ణయం మాకు అర్ధమైపోయింది.. :-))

రాజ్ కుమార్ చెప్పారు...

మీ కధల్లో పాత్రలూ, వాటి క్యారెక్టరైజేషన్లూ.. ఉహూ.. నేను చెప్పడం కాదు మీరు రాయాలి.. మేం చదవాలి ;)

sndp చెప్పారు...

karapi..get out..:)

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

<>

నాకూ అదే నచ్చింది డాట్రమ్మా,చక్కటి సందేసాన్నిచ్చారు సూర్యుడ్ని చూపిస్తూ అదీ గురువంటే.

మిగతా విషయం కధంతా అయ్యాకే

శశి కళ చెప్పారు...

అబ్బ ఎక్కడ ఆపారు స్టోరీ ...పాపాలు చుట్టుకుంటాయి

..nagarjuna.. చెప్పారు...

మీరు ప్రకృతిని ఇంత బాగా ఎలా వర్ణించగలుగుతున్నారూ !? మాష్టారు గారూ సూర్యుడు అనగానే కాస్త నిరాశ పడ్డాను... but... i am stuck again !

సుభ/subha చెప్పారు...

సూర్యుడి కాన్సెప్ట్ అదుర్సండీ.. కామెంట్ కథంతా అయ్యాక పెడతానులెండి.. మద్యలో ఇలాంటి చమక్కులుంటే కామెంట్ పెట్టకుండా ఉండడం కుదరదులెండి :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి