15, నవంబర్ 2012, గురువారం

నిన్ను నిన్నుగా....1


కథలోకి వెళ్దామా...          

      అదో మంచి ఊరు. మంచి ఊరంటే ... సూర్యదయాల్ని కప్పేసే కట్టడాలు లేని ఊరు. ఊరి నిండా పచ్చని చెట్లు. రోడ్డు పక్కన కంచె లేని మామిడి తోటలు. కురచ మామిడి చెట్లు. కాయలు కోసుకోవాలంటే చెట్టెక్కాల్సిన పని లేదు కాయలే నేలకానుతూ ఉంటాయి. రోడ్డు పక్కన ఎక్కడ చూసినా క్రమశిక్షణ లేకుండా చిత్తువత్తుగా విరగ బూసిన జూకా మందారాలు. ఆ పక్కనే చెరుకు తోటలు. చెరుకు గడను విరిచి తినాలంటే ఎవరి అనుమతీ అక్కర్లేదు. అదేమంత తప్పు కూడా కాదు. కంది చేలల్లోకి అలా వెళ్ళి కాసిని పచ్చి కందికాయలు మధ్యలో చీల్చి తినేయొచ్చు. కానీ భద్రం, అప్పుడప్పుడు పురుగు మందు చల్లుతారు.

స్కూలు, బేంక్ లాంటి సదుపాయాలున్న చిన్న ఊరు.

   మురళి వాళ్ళ నాన్న కు హెడ్ మాస్టారిలా అక్కడికి బదిలీ అయినప్పుడు, అద్దె ఇంటికోసం వెతుకుతుంటే, ఊరి చివరన ఉన్న అనూ వాళ్ళ ఇల్లు చూపించారు. రెండు అంతస్తుల డాబా ఇల్లు. ఖాళీగా ఉన్న పై అంతస్తు మాష్టారికి అద్దెకిచ్చారు. కొంత ఎత్తు మీద ఇల్లు కట్టడం వల్ల ఇంటి వెనక వైపు పెద్ద లోయలా ఉండేది. లోయలో ముదురాకు పచ్చని ఎత్తైన చెట్లు. వర్షం పడేప్పుడు, ఇంటివెనక వైపు బాల్కనీలో కూర్చుని లోయలో పడే వర్షాన్ని చూడాల్సిందే కానీ అదెలా ఉంటుందో చెప్పడానికి కుదరదు.

     మాష్టారే ఇంట్లో అద్దెకుండడం తో అనూ కోసం ట్యూషన్ చెప్పేవారు లేరన్న బెంగ తీరింది. అనూ అప్పటికి ఎనిమిదో క్లాసు చదువుతోంది. చురుకైన అమ్మాయి. అల్లరి చిల్లరి వేషాలకు దూరం. క్లాసులో ఫస్ట్ రావడం ఒక్కటే ఆమెకు బాగా ఆనందం కలిగించే విషయం. తన బదులు ఇంకెవరైనా మొదటి స్థానం లో ఉంటే ఆమె తట్టుకోలేక పోయేది. ఆ పరిస్థితి రానీయకుండా ఎప్పుడూ శ్రమ పడేది. క్లాసులో టీచర్లందరూ ఇష్టపడతారు కానీ క్లాసు పిల్లలు ఆమెకు దూరంగా ఉండేవాళ్ళు. మిగతా పిల్లలతో కలవలేకపోవడం అనేది ఆమెకో ఇబ్బంది అనిపించేదికాదు.

   మురళి ఆ స్కూల్లో చేరే వరకూ ఆమెకు క్లాసులో ఎదురులేదు. అతను ఏ పాఠమైనా ఒప్పజెప్పడానికి చాలా తక్కువ సమయం తీసుకునేవాడు. ఇంకా తక్కువ టైం లో ముత్యాల లాంటి చేతి రాత తో కొట్టివేతలు లేకుండా వ్రాసి చూపించే వాడు. అతని చదివే పద్ధతిలో వేగం టీచర్లకే కాదు, తోటి పిల్లలకు కూడా వింతగా ఉండేది.  

అలా అని చదువే లోకం లా ఉండేవాడుకాదు. అతనికున్న తెలివితేటల గురించి అతనికేం పట్టనట్లు ఉండేవాడుపిల్లలతో కలిసి ఇంటి ముందు ఆటలాడేవాడు. బాగా చదుతాననో, మాష్టారి గారి అబ్బాయిననో అహం చూపించకపోవడంతో పిల్లలందరికీ నచ్చాడు.

ఇంట్లోనూ, తోటిపిల్లలకు సహాయం చేసే వాడు. అనూ వాళ్ళ అమ్మకు కూడా ఏది కావాలన్నా మురళీనే పిలిచేది. "మురళీ కర్వేపాకు అందుకో అనో, బజారెళ్ళి వాము తీసుకురా" అనో పురమాయించేది.
అప్పుడప్పుడు తల్లికి వంటలో సహాయం చేస్తూ కనిపించేవాడు. రాత్రి పూట మేలుకుని చదువుతాడేమోనని ఆరాతీసింది. అదీ కాదు. ఎప్పుడు చదువుతాడో అంతుబట్టేది కాదు అనూకి.

ఆమె లెక్క చేసి చూపించే లోపల అతను రెండు మూడు పద్ధతుల్లో చేసి చూపించేవాడు.

"ఎలా చేశావు ? రాత్రి మాష్టారి దగ్గర స్పెషల్ ట్యూషన్ చెప్పించుకుని ఇప్పుడు మొదటి సారి చేస్తున్నట్లు మా ముందు ఫోజు కొడుతున్నావు కదూ " అని కోపం గా అడిగింది.

మురళి ఏదో చెప్పబోతే వినిపించుకోకుండా మాష్టారినే అడిగింది. "మాష్టారూ, ముందే మీదగ్గర చెప్పించుకున్నాడు కదూ" అని.

అనూ ని తన పడక్కుర్చీ పక్కనే కూర్చోబెట్టుకుని "లేదు నాన్నా, నాకు మీరెంతో వాడూ అంతే, వాడికి ఒక్కటి కూడా మీకన్నా ముందు చెప్పను, ఎక్కువ చెప్పను"

"మరి ఎలా చేస్తున్నాడు మాష్టారూ ?”

"వాడు ఎలా చేస్తున్నాడో నాకూ తెలియదు. ఒక్కో సారి వాడు చేసే పద్ధతులు నాకూ కొత్తగానే ఉంటాయి.”

మొదటి సారి, ఆమెకు క్లాసు ఫస్ట్ దక్కకుండా పోయింది.

క్లాసులో తనకన్నా ఎక్కువ మార్కులు రావడం, పిల్లలంతా మురళీ, మురళీ అంటూ వెంటపడటంతో అనూకేమీ నచ్చలేదు.

  డిబేటింగ్, వ్యాస రచన పోటీల్లో ఇదివరకెప్పుడూ అనూకే వచ్చేవి ప్రైజులు. ఆమె తప్ప ఆ స్కూల్లో పెద్దగా మాట్లాడగలినదీ ఎవరూ లేకపోవడం ఒక కారణం. మురళి వల్ల ప్రైజులు ఇద్దరూ చెరిసమానంగా పంచుకోవాల్సి వస్తోంది.
అడుగడుగునా ఆమెతో పోటీ పడుతూండడం వల్ల, మాష్టారి దగ్గరకు ట్యూషన్ కు వెళ్ళినా, అతనితో సరిగా మాట్లాడేది కాదు.

   మాష్టారు పని మీద బయటికి వెళ్ళినపుడు ట్యూషన్ పిల్లలతో లెక్కలు తనే చేయించే వాడు. ట్యూషన్ లో మిగతా అమ్మాయిలందరూ అతనితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించడం అనూ కు చిరాకు వేసేది. మరీ అతి చేస్తున్నాడు. మంచివాడిలా కనిపించడానికే ఈ వేషాలు అనుకుంది.

అందరికన్నా వరలక్ష్మి ధోరణి భరించలేనట్టుగా ఉంది. మురళి కనిపించగానే బోడి నవ్వులు, తిక్క వేషాలు. అవసరమున్నా లేకపోయినా తట్టెడు అనుమానాలతో మురళి పక్కనే కూర్చుంటుంది. అతనితో లెక్కలు చెప్పించుకోవడం, ముసిముసిగా నవ్వుతూ థాంక్స్ చెప్పడం చూస్తే అనూకి ఎక్కడలేని కంపరం కలుగుతోంది. మాష్టారి చెప్పిన దానికన్నా, మురళి చెప్తేనే బాగా అర్ధం అవుతోందట ఆ పిల్లకు.

రెండు జడలు వేసుకుని రిబ్బన్ తో పైకి కట్టి ఒక జడ ముందుకు, ఇంకో జడ వెనక్కూ వేసింది. ముందుకు పడిన కుడివేపు జడలో క్రితం రాత్రి దణ్ణెం మీద మంచులో తడిసిన మల్లె చెండు. వరలక్ష్మి, మురళితో మాట్లాడున్నపుడు అవికూడా ఊగుతూ ఉన్నాయి. వాళ్ళ అమ్మ చూడాలి దీని వేషాలు. జడపట్టి ఒక్క గుంజు గుంజి ఇంటికి లాక్కెళ్తుంది.
పరీక్షలు దగ్గర పడుతుండగా, అనూకి జ్వరమొచ్చి వారం రోజులు స్కూలు మానేయాల్సివచ్చింది. తను రాని క్లాసుల నోట్స్ వ్రాసుకుంటానని క్లాసులో ఎవర్ని అడిగినా తలా ఒక సాకు చెప్పారు.

'మా అమ్మ కోప్పడతారోయ్'

'నేనూ సరిగా వ్రాసుకోలేదు'

'నాన్నారు ఇవాళ ఇంటి దగ్గర చదివిస్తానన్నారు.'

'మురళి ఉండేది మీ ఇంటి పైనే కదా, అతని దగ్గర తీసుకో' అని ఉచిత సలహాలు చెప్పారు.

ఎలా ? పరీక్షలు దగ్గరవుతున్నాయి. మురళీని అడగబుద్ధి కాలేదు.

ఏం చెయ్యాలో తోచక కూర్చుని సైన్స్ టెక్స్ట్ తీసింది. ఏమీ అర్ధం కావడం లేదు.

దిగులుగా కూర్చుంటే మురళీ వచ్చాడు నోట్ బుక్ తో.

"ఏంటీ?" అసలే కోపంగా ఉందేమో, విసురుగా అడిగింది.

"నువ్వు అటెండ్ అవని క్లాసుల నోట్స్ అనూ." అన్నాడు.

"నోట్స్ నాకిస్తే మరి నువ్వేం చదువుతావు.”

"ఇది నీకోసమే రాశాను. నా నోట్స్ వేరే ఉంది" అన్నాడు.

"ఒహో బాగా మంచివాడివని నేను కూడా అనుకోవాలి కదూ? పర్లేదు నేను ఎలాగో వ్రాసుకోగలను. నీ హెల్ప్ నాకక్కర్లేదు " అంది.

ఇంతలో అనూ వాళ్ళమ్మ వచ్చి , 

" ఏవిటా మొండితనం తీసుకో." అంటూ అనూని కోప్పడి, "ఈ జ్వరమొచ్చిన తర్వాత బక్కకోపం ఎక్కువైంది బాబూ నువ్వేం అనుకోకు " అని మురళితో చెప్పింది. మురళి మీద కోపం తల్లిమీద విసుగు గా మారింది.

నోట్ బుక్ కిటికీలో పెట్టి వెళ్ళిపోతున్నాడు.

కోపంతో పుస్తకం విసిరికొట్టబోయి ఆగి 'అమ్మో సరస్వతీ దేవి' అనుకుని పుస్తకం కళ్ళకద్దుకుంది.

పదవతరగతి పరీక్షలైనాయి.

మాష్టారికి బదిలీ అయే సూచలున్నాయని తెలిసి అనూ తల్లిదండ్రులు బాధ పడ్డారు.

"మీరిక్కడికి రావడం, అమ్మాయి చదువుకు ఎంతో ఉపయోగపడింది. మీరెళ్ళిపోతే ఎక్కువగా బాధపడేది మేమే. అమ్మాయికి భవిష్యత్తులో ఎలా చదవాలో, పెద్దయిన తర్వాత ఏం అయితే బాగుంటుందో మీరో మాట చెప్తే బాగుంటుంది. ” అన్నారు.

మాష్టారు, పిల్లలిద్దరినీ తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఇంటర్ లో తీసుకునే సబ్జెక్ట్లు, పై చదువులు గురించి, మాట్లాడుతూ, వాళ్ళేం కావాలనుకుంటున్నారో ఏ వృత్తి పట్ల ఆసక్తి ఉందో చెప్పమన్నారు మాష్టారు.

"ముందు తనని చెప్పమనండి" మురళీ నుద్దేశించి అంది అనూ.

"లేడీస్ ఫస్ట్ అంటారుగా తనే చెప్పాలి ముందు " .

"నేను ఆడపిల్లనని, ముందు అవకాశం ఇచ్చినట్లు మాట్లాడితే నాకు నచ్చదు మాష్టారూ " రోషంగా అంది.

"సారీ ” అనూ వంక చూస్తూ చెప్పాడు.

అది పట్టించుకోనట్లు "మాష్టారూ, మీరెళ్ళిపోతే నాకెవరు చెప్తారు ఎలా చదువుకోవాలో, ఎలాంటి ఉద్యోగం చెయ్యాలోతనకేమో మీరెప్పుడూ పక్కనే ఉంటారుఅన్నీ చెప్తారుమరి నన్నెవరు గైడ్ చేస్తారు?” అంది అనూ.


"అనూ, నా స్టూడెంట్స్ అందర్నీ, పిల్లల్లానే అనుకున్నానమ్మా. రేపు వీడి కన్నా కూడా నువ్వు మంచి స్థితిలో ఉంటే మీ అమ్మానాన్న లాగే సంతోషిస్తాను. నేను లేకపోయినా, నాకన్నా మంచి మాష్టారికి ఒప్పజెప్తాను.”

"ఎవరైనా ఒకటి రెండేళ్ళేగా మాష్టారూ, తనకేమో ఎప్పుడూ ఉంటారు మీరు. గొప్ప ఉద్యోగం తెచ్చుకుంటాడు. మరి నాకెవరున్నారు.”

"రేపు నేను చూపించబోయే ఆయన, నన్ను మించిన గురువు. అంతకన్నా మించి గొప్ప ఉద్యోగి. నాకు తెలిసి ఆయనను మించి గొప్పగా ఉద్యోగం చేయగలవాళ్ళని నేను చూడలేదు. ఆయనను ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో చాల పైకొస్తావు అనూ. దిగులుపడొద్దు.”

"ఆయన ఎక్కడ చేస్తారు ఉద్యోగం? మన ఊళ్ళోనేనా?”

"మన ఊళ్ళో నేకాదు, చాలా ఊళ్ళల్లో...”

"అంటే ప్రయాణాలు చేస్తుంటారా?”

"ప్రయాణాలు చేస్తున్నట్లే ఉంటారు.”

అసలేం ఉద్యోగం చేస్తారు?"

"బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ వచ్చిందా?”

పిల్లలిద్దరూ ప్రశ్నల మీద ప్రశ్నలేస్తుంటే మాష్టారు ఆపి

"ఇంతవరకూ ఎవరూ ఏ అవార్డూ ఇవ్వలేదు. అన్నీ ఆయననే అడగొచ్చు.తొందరెందుకు రేపటి వరకూ ఆగండి.”

మీరు కూడా.
..To be continued

10 comments:

Narsimha చెప్పారు...

తూచ్....కొన్న్ని సీన్లు నా గతం లా ఉన్నాయని చదివితే మీరు సస్పెన్స్ లా ఆపేస్తార...పైగా రేపటి వరకు ఆగండి...అని ఊరిస్తార?.....త్వరగా రాయండి ....కథ బాగుంది.

sndp చెప్పారు...

nice writing ..:)

రాజ్ కుమార్ చెప్పారు...

ఇదేంటండీ? కొంతవరకూ నా స్టోరీలాగా ఉన్నాది?? కొంపదీసి మా స్కూల్ లో టీచర్ గా కాని చేశారా?
100% లవ్ కి ఎక్స్టెన్షన్ నా? సూపర్ గా ఉమ్దండీ

వేణూశ్రీకాంత్ చెప్పారు...

రేపటి వరకే కదా !! హమ్మయ్య :)

Sravya Vattikuti చెప్పారు...

కథ సూపర్ గా ఉందండి !

..nagarjuna.. చెప్పారు...

మొదటి పేరాలోనే ఆగిపోయాన్నేను ఆ ఊరెక్కడుందో చెప్పండి శైలజగారూ, ఓ ఇల్లు కట్టుకుంటాను.

nirmal చెప్పారు...

good going

అజ్ఞాత చెప్పారు...

అసలు మా డొంకాడ అగ్రహారం మీరు ఎప్పుడు వెళ్ళారు? నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు?

Padmarpita చెప్పారు...

మరి what next? త్వరగా పోస్ట్ చేయండి:-)

సంతు (santu) చెప్పారు...

chaala bagundi, kaani 10th loney anni alochanalaaa.. :p

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి