continued from చందమామ-4
నేనింకా బతికే ఉన్నానని మీరు అసహ్యించుకున్న దానికన్నా, వెయ్యి రెట్లు నన్ను నేను అసహ్యించుకున్నాను. నన్ను మించిన మోసగాడు ఎవరూ ఉండరేమో అనిపించేది. ఆమె అంటే అంతిష్టం, ఇంతిష్టం అని నేను చెప్పిన మాటలు ఒట్టి పై పై మాటలే అంటూ నా లోపల ఇంకెవరో నన్ను చీదరించుకునే వారు.
గుండె ఏడుపు కాలం లాగా ఉంది. ఆగదు, అంతం లేదు.
ఆమె లేని రోజున నేను బతకి ఉండను అన్న నా నమ్మకాలు ఒట్టి ప్రగల్భాలేనా?
ఎక్కడకెళ్ళినా, ఏది చూసినా ఆమె ఙాపకాలే. ఆ ఙాపకాలకు దూరంగా పారిపోవాలిని ఎక్కడెక్కడో తిరిగాను. నేనే తన ఙాపకాలమయం అని తెలుసుకోలేని కస్తూరి మృగం లాగా. ఎలాగైనా మర్చిపోవాలని, ఎన్నో ప్రయత్నించాను. ఆల్కహాల్, మత్తు మందు, వేదాంతం, ...అన్నిటినీ జయించి నిలిచింది ఆమెను కోల్పోయిన దుఃఖం.
భౌతికం గా ఆమె లేదు.
భౌతికంగా నేను ఉన్నా, చచ్చిపోయాను.
ఆ ఇంటికి రోజూ వెళ్ళి బయట రావిచెట్టు కింద కూర్చుండేవాణ్ణి.
లోపల నన్ను బతికించిన స్నేహం,
బయట నన్ను చిత్రవధ చేసిన ఆమె మరణం.
లోపలికి వెళ్ళే ధైర్యం ఎప్పుడూ చెయ్యలేదు.
ఆ మొదటి రోజు, ఆ పాదాల స్పర్శ, నేను నిండు మనిషినైన అమృత గడియలు... అవి తట్టుకోలేని దుర్బలుణ్ణి.
ఆ రావిచెట్టుకి నా తల కొట్టుకునే వాణ్ణి.
ఆ మట్టి లో పడి ఏడిచే వాణ్ణి.
గుప్పెళ్ళతో మట్టి తీసి కళ్ళలో కొట్టుకునేవాణ్ణి. నేను బతికేఉన్నందుకు నన్ను నేను తీవ్రంగా ఛీత్కరించుకునేవాణ్ణి.
నాన్నా, నాన్నా అని మనసులో ఎలుగెత్తి అరిచేవాణ్ణి.
ఎన్ని చేసినా, నాకు స్వాంతన లేదు.
ఈ దేహాన్ని చంపెయ్యాలని నేను ఎన్నో రకాలుగా ఆలోచించేవాణ్ణి. ఓ నెల రోజుల పాటు అదే ప్రయత్నంలో ఉన్నాను. ఓ రోజు అర్ధరాత్రి, ఎలాగైనా ఈ జీవితం అంతం చెయ్యాలి, ఇదింక కొనసాగించలేను.
మా పెరటి బావిలో దూకేసి చచ్చిపోదామని బాగా ఆలోచించించి రాత్రి అందరూ నిద్ర పోయేవరకు ఓపికగా ఎదురు చూశాను. ఎంతో సంతృప్తిగా ఉంది నా నిర్ణయానికి.
ఇంట్లో జనాన్ని తప్పించుకుని వెనకవైపు మెట్లు దిగి ఆమెను పెరట్లో కలుసుకునే వాడిని. ఇవ్వాళ కూడా అదే మెట్లు దిగి ఆమెను కలుసుకోబోతున్నాను. అవును, నేను మోసగాణ్ణి కాదు, నాకన్నా ఆమెనే నా ప్రాణం అనుకున్నాను.
ఈ రోజుతో ఈ బాధ అంతం కావాలి.
మెల్లగా అడుగులో అడుగేస్తూ చీకట్లో బయటికి వెళ్తున్నాను. కాలికేదో తగిలింది.
మరు క్షణం లైటు వెలిగింది.
వెనకవైపు గుమ్మం ముందు చీర చెంగు పరుచుకుని పడుకున్న అమ్మ.
అది అమ్మ కాలు.
ఇంకొంచం దూరంలో నా బిడ్డలు చెరొక కుర్చీలో కూర్చుని నిద్ర పోతున్నారు.
ముగ్గురూ నాకు కాపలాగా
అమ్మ ముఖం లోకి చూడలేక కాళ్ళ వంక చూశాను.
చామనచాయలో, ఎండిపోయి, పగుళ్ళిచ్చిన పాదాలు. ఇద్దరం నిశ్శబ్దం గా చాలా సేపు కూర్చున్నాం.
బతకలేక నేను పడుతున్న నరకయాతన అమ్మ అర్ధం చేసుకుంది.
నాన్నని పోగొట్టుకున్న అమ్మ
బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లి దండ్రులు
చిన్న వయసులో అమ్మని పోగొట్టుకున్న పసిపాప
పేదరికం
ఆకలి
ఎన్ని కష్టాలు ఈ లోకంలో
నేనే, నా సమస్య తప్ప వేరే ఇంకేదీ పట్టని అతి స్వార్దపరుణ్ణి.
" నా బాధ నాతోనే ఉండాలి. ఇంకెవరినీ బాధించకూడదు "
నాన్న చెప్పిందే ఆమె కూడా చెప్పింది
నీ సమస్య కన్నా బాధ్యత ముఖ్యం.
పనిలో పడినట్లు, దుఃఖం మరుస్తున్నట్టు అందరినీ నమ్మించాను.
గుడిసెలు కాలిపోయిన పేదవాళ్ళకు ఇళ్ళు కట్టించాను. ఇంకేవో పనులు చేస్తూ ..బతుకుతున్నాను
బతకటం తప్ప ఇంకో మార్గం లేదు.
ఆమె తిరిగి రాదని తెలిసి
ఇంకొకరికోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాను.
మృత్యువు కోసం
***
10 comments:
ఇది ట్రూ స్టొరీ (True Story) ఆ?
కాదు, కథే!
:((
Nijamgaa edi true story naa :(
అలా ఉందా? కథే ఇది
అలా బ్లాగుళ్లొ విహరిస్తూ చూశానండి మీ బ్లాగ్. మీ చందమామ అసాంతం చదివించి కళ్లల్లొ నీళ్లు తెప్పించింది.
మీరు అతడు కాదు ఆమె అని తెలిసి పెళ్లాం మానేజ్మెంట్ తొ పెద్ద ఝలక్ తిన్నాను.
మీరు గైనెకాలజిస్ట్ అని చూసి మీ కున్న కొద్ది పాటి టైం ని ఇలా ఉపయోగిస్తున్నారంటే (స్వతహాగ గైనెకాలజిస్ట్స్ మంచి ఓర్పు కలవారు కాబట్టె అది ఎంచుకొంటారు) చాల మెచ్చుకొ తగ్గది.
ఈ మద్య కాలంలొ ఇలా మనసును కొన్ని రొజుల పాటు వెంటాడే కథలు చదవ లేదు
మీ రచనలు చాలా బాగున్నాయండి.
శివకుమార్ దిన్నిపాటి
@శివకుమార్ గారు,
Thank you.
idi katha aitene baguntundi
ఆమె మరణం అతనితోపాటు నేనూ తట్టుకోలేకపోయాను.. ఒక్కసారి గుండె పిండినట్టుగా అనిపించింది. ఇది నిజ జీవిత కథ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
హాయి గా చదువుకుంటూ ఉంటే ఇలా కన్నీళ్ళు తెప్పించటం ఏమీ బాలేదండీ ! తట్టుకోలేకపోతున్నాను..
కామెంట్‌ను పోస్ట్ చేయండి