27, జులై 2012, శుక్రవారం

వరలక్ష్మీ వ్రతం( మగవాళ్ళకు స్పెషల్)


ఆమె ఏకాగ్రత గా రాసేటపుడు కింది పెదవిని నొక్కి పడుతోంది. గులాబి రంగు, ఎరుపులోకి మారింది. అవునూ, మెత్తని ఎర్రని పెదవులను మించిన మారణాయుధాలుంటాయా? అందమైన వాటిని చూస్తే ఏదో బాధ బయలు దేరుతుంది. ఎందుకు? సొంతం చేసుకునే వీలు లేక ఏవిటో మనసు గజిబిజిగా తయారయి గుండె గుబులవుతుంది.

పై పెదవి కింది పెదవి ని కలుసుకున్న చోట నిలిచింది అతని చూపు. ఏమిటీ అందమైన కోణం. ఎన్ని డిగ్రీలుంటుంది.

ఆ కోణం లో ఇరుక్కుని చచ్చిపోతే జన్మ ధ్యనమవదూ.

' సంగతి తెలిస్తే, తలుపుసందులో నిన్ను పెట్టి నొక్కుతుంది మీ ఆవిడ' అంతరాత్మ గుర్తుచేసింది.

ఈ లోకం లోకి వచ్చి పడ్డాడు.


చూపు మళ్ళించాడు. నేలవేపు చూస్తుంటే, ఆమె వోణి నేల మీద జీరాడుతోంది. తెల్లటి జార్జెట్ వోణీ. గులాబీ రంగు పూసలు కుట్టి ఉన్నాయి. ఆ పక్కనే నల్లటి జడ. ఈ రోజుల్లో జడవేసే అమ్మాయిలున్నారా. మరీ ఇంత పెద్ద జడా? . ఆ జడతో ఒక్కటేస్తే చాలదూ ప్రాణం హరీ మనడానికి. ఆ జడ చూస్తుంటే గుబులెక్కువై గబుక్కున దానికే ఉరేసుకుందామనిపిస్తోంది

'ఏవిటయ్యా నీ వ్యవహారం మరీ అతిగానూ, శృతి మించుతున్నట్లూ లేదూ?'

'నువ్వూ మనిషివైతే తెలిసేది నా తపన. అనుభవించి తెలుసుకోవాల్సిందే తప్ప నీలాంటి వ్యర్థ అంతరాత్మలకు అంతుబట్టనిదీ సౌందర్యానుభవ బాధ.'

'మరీ చెప్తావ్, నీ సొద తట్టుకోవడం కన్నా బాధాకరం ఇంకేం ఉంటుందిలే!'

'నీ బొంద నీకేం తెలుసు నా సౌందర్య పిపాస.'

'సౌందర్య తెలుసు, బిపాసా తెలుసు. ఈ 'పిపాస' ఎవరు?  ఎవరీ కొత్తావిడా?'

'ఛీ నోర్ముయ్. వెధవ సంత'

వోణీకూ, ఆ జడకూ అసలు సౌంద్యర్య ధ్యాసేమైనా ఉందా, అంత అందాన్ని అట్టి పెట్టుకుని ఉండి కూడా చైతన్యం లేకుండా ,అలా నేల మీద పడి ఉన్నాయే మందకొడిగా! గాలి వీచినపుడల్లా ఆమె వంటి మీదినుంచి ఏదో పరిమళం అతన్ని చుట్టుముట్టి ఇరకాటంలో పడేస్తోంది. ఈ పరిమళం ఎక్కడో తెలుసు తనకు.

చిన్నపుడు శాస్త్రి గారి అమ్మాయితో ఆడుకోవడానికెళ్ళినపుడు వాళ్ళతోటలో పూల పరిమళం. ఆమె వోణీలు వేసుకుంటోందని ఇంక అటువైపు వెళ్ళకూడదని అమ్మ చెప్పిన తర్వాత, మరచిపోయిన ఆ పరిమళం మళ్ళీ ఈ వోణీ తో పరిచయమైంది. వోణి కీ , ఆ మంచి వాసనకూ ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా

'ఉంది నీ పైత్యానికీ, పిచ్చికీ సంబంధం ఉంది.'


లోపల సంఘర్షణకు సంబంధం లేకుండా పాఠం సాగుతోంది. ఇక్కడ third person singularకదా, క్రియకు 's' చేర్చాలి. క్లాసులో ఖంగుమనేది తన గొంతు, ఇక్కడేవిటీ ఇంత బలహీనంగా వినపడుతోంది. అతనేం చెప్తున్నాడో తెలియక తలెత్తి చూసింది.

'అబ్బా తల్లీ నువ్వు కళ్ళెత్తి చూడకు గురువుగారు బలహీనమై లఘువైనారు. చచ్చినా చావగలడు. '

ఈ అంతరాత్మ గాడొకడు. వాడు చావడు, నా చావు నన్ను చావనీయడు. చచ్చేవరకూ వీడి పీడ ఒకటి.

ఆమె చేసిన పొరబాటు చూపిస్తూ, నోట్ బుక్ మీద వేలు పెట్టాడు. అదే సమయానికి ఆమె చూపుడు వేలు కూడా అక్కడికొచ్చేసింది. ఇద్దరి వేళ్ళూ ఒక్క చోట కలుసుకున్నాయి. ఇంకో పొరబాటు జరిగిపోయింది. స్పర్శ లో తీవ్రతకు వడ దెబ్బ తగిలినట్టు సోలిపోయాడు.

ఒక్క వేలిలోనే ఇంత వోల్టేజీ ఉంటే , మిగతా వేళ్ళూ, శరీరం సంగతేమిటీ.

'లెక్కల పంతులువి కావుగదా, వదిలేయి.'

అవును అందుకేనా స్త్రీని శక్తి స్వరూపిణి అన్నారు?

' అవును ఆడవాళ్ళు పవర్ హౌసులే. దగ్గరకెళ్ళేవు. నీ చావుకొచ్చినట్లే ఉంది ఈ ట్యూషన్'

ఈ ఆడవాళ్ళలో ఇంతింత విద్యుత్తులుంటే, ఏవిటీ ఎంత సేపూ పవరు కట్టు చేసి చస్తాడే ఆ ఎలెక్ట్రిసిటీ వాడు. దాన్ని వెలికి తీసి వాడుకునే పద్ధతి కనిపెట్టగల శాస్త్రజ్ఞుడే లేడా?

క్రియకు ఎస్ చేరుస్తూ, పొరపాటు జరిగిందనీ, సరిదిద్దుకున్నానని ఎర్రటి నాలుక పైపెదవితో చెప్పింది.
ఆ దృశ్యం ఒక చిత్రపటమై మనసులో నిలిచి పోయింది.

ఈ చిత్రమైన విన్యాసంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.

'ఏవిటోయ్ మరీనూ ఆ అమ్మాయి గ్రామర్ 'ఎస్' వ్రాసింది. నీకేదో 'ఎస్' చెప్పినట్లు ఏవిటీ మెలికలు తిరుగుతున్నావు.'

పెదవుల అందం ఎక్కువైంది ఏమిటా అని చూస్తే చిరునవ్వు వల్ల కొంచం సాగినందువల్ల అని తెలిసింది. క్షణక్షణం మారుతున్న వింత అందాలకు వివశుడవుతున్నాడు.

ఇవన్నీ తట్టుకుంటూ ఎంత సేపు సాగాలి ఈ ప్రయాణం. ఏమో, ఎంత సేపటికి అవుతుందో ఈ పాఠం. నిట్టూర్చాడు

'నీ క్లాసులో వెనకబెంచీ వాళ్ళు కూడా ఇదే మాట అనుకుంటుంటారోయ్ సుబ్బారావ్.'


కళ్ళొంచుకుని గ్రామర్ ఎక్సర్ సైజులు చేస్తోంది. . కళ్ళ మీద కవిత్వాలు రాస్తారనుకోండి. రెప్పలు కూడా అందంగా ఉన్నాయే. ఇదో కొత్త విషయం. రెప్పలమీద కూడా రాసేయాలి. తనకు రాదే. ఏమని రాయాలి ఈ రెప్పల గురించి. అసలేం చెయ్యాలి ఇంత అందమైన అమ్మాయి పక్కనే కూర్చుని.

మొహం చూస్తుంటే లాభం లేదు అనుకుని లేదు అని దృష్టిని అటూ ఇటూ పరిగెత్తించి ప్రాణం నిలుపుకునే ప్రయత్నాలు చేశాడు. మళ్ళి ఎక్కడో చూపులు ఆగిపోయాయి. అదేమిటీ బ్లౌజ్ పక్కనే ఆ చర్మం అంత మెరుస్తుందే?


మధ్యలో తలెత్తి "సర్, ఏక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ కు మార్చాను చూడండి" అంది.


'వాయిస్ దేముంది లేమ్మా, మనిషికి మనిషే పాసివ్ అయిపోయాడు నీ దెబ్బకు.'

ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి తల్లి వచ్చింది. ఆవిడేమీ మాట్లాడకపోయినా తడబడ్డాడు. తన ధోరణి ఎవరైనా పసికడితే ఎంత పరువునష్టం. మనసును కట్టడి చేయబోయాడు. కొద్దిగా మాట విన్నట్లే ఉంది.

అతని భార్య ఆమె తల్లితో మాట్లాడుతోంది.


'మీరేం భయపడకండి. ఆయన సొంత చెల్లెలికన్నా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.' భార్య భరోసా ఇస్తోంది. 
చెల్లెలు. హూ..అంత అందమైన అమ్మాయి చెల్లెలు. సకారణంగా భార్యమీద కోపం ఉవ్వెత్తున లేచింది. అసలా చెల్లెలి వరసని తగలబెట్టెయ్యాలి. ఏదైనా గట్టి తిట్టు తిడితే బాగుణ్ణు అని మనసు అట్టడగు పొరల్లో పాతేసిన ఓ పనికి మాలిన తిట్టు బయటికి తెచ్చి భార్యని తిట్టుకున్నాడు.

భార్యలా వీరు, మగ మనోభావాల మేనేజర్లు, మా స్వాతంత్రపు శాసనాధికారులు, 
పురుష స్వేచ్ఛా ప్రకృతి శాసించే వనితల వికృత సంస్కృతి---
-----

'ఎందుకలా అర్ధం పర్ధం లేని తెలుగులో ఆయాసపడతావు, ఒక ప్రాస లేదు పాడు లేదు. ఇంగ్లీషులో ఏడువు'


"వెళ్తాను సర్" అంటూ లేచింది. తల్లితో కలిపి అడుగులేస్తూ వెళ్తుంటే చూశాడు.

అదేమిటీ ఆ వోణీ, జడా రెండూ బొత్తిగా బద్ధకపు వస్తువులని పొరబడ్డాడే. రెపరెపలాడే తెల్లటి ఓణీ, చూడబోతే ఉట్టి గాలి రకంగా ఉంది. ఇక జడ సంగతి సరే సరి. ఫాస్ట్ బీట్ పాటకు లేత అడుగుల నాట్యం చేస్తోంది.

మనసు కోతి మళ్ళీ గంతులేస్తోంది. అతనికి గుండెలో సన్నగా నొప్పిలాంటిది తెలుస్తోంది.

భగవంతుడా అసలు అందమైన వాటిని ఎందుకు సృష్టిస్తావు. మళ్ళీనేమో అవి నువ్వు సొంతం చేసుకోకూడదు అని ఒక ఇనపకంచె కడతావు.

'పాపం, నీలాంటి వాళ్ళు చూసి ఆనందిస్తారని.'

'ఊరికే చూసి ఆనందించే విషయాలా ఇవి'

"భోజనానికి రండీ" పిలిస్తే వెళ్ళి కూర్చున్నాడు. ఏవీ సహించడం లేదు. తినబుద్ధి కాలేదు.

'బలహీనమయ్యావు కదా, కొంచం మెక్కు, రేపటికి పుంజుకుంటావు.'

'వెధవ సలహాలివ్వకు, ఫో నా ఇంట్లోంచి బయటికు ఫో.'

'ఏది ఇల్లు? ఏది బయట?'
.
'ఎట్లాగో తగలబడు.'

"మీకిష్టమని వంకాయ కూర, మీకిష్టమని పప్పు చారు.”

'నేనీ క్షణం నుంచే వంకాయను వదిలేస్తున్నాను.'

'వదిలెయ్యాల్సింది వంకాయను కాదోయ్, వంకర ఆలోచనల్ని.'


రాత్రి నిద్రలో ఎన్నో కలలు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి పెళ్ళి చేసుకోమంటూ గొంతు మీద కూర్చున్నాడట. నాకు పెళ్ళయ్యింది గా అని అంటుంటే, చండశాసనుడైన తండ్రి పక్కనే నిల్చుని 'కుంకా ఎప్పుడయ్యిందిరా నేను చెయ్యకుండా, నోర్మూసుకు చేసుకో' అని హూంకరిస్తున్నాడు . 'అబ్బ నాన్న మంచోడు. నిజమే నాకు పెళ్ళెక్కడయింది' అనుకుంటూ ఉంటే మెలుకువ వచ్చింది. ఎంత అందమైన కల.

భార్యను ఎలాగైనా చంపేయాలని తిరుగుతుంటే ఎవరో, ఒక ఆఫీసు అడ్రసు, సలహా ఇచ్చారు. ఆ ఆఫీసులో డబ్బు చెల్లించి రశీదు తీసుకుంటే సరి. ఎవరినైనాసరే, ఆ ఆఫీసు వాళ్ళే మనకు తెలియకుండా చంపేస్తారట. అంతా లీగలేనట. మెడకేమీ చుట్టుకోదట. ఎంత మంచి ఏర్పాటు. భలే ఉంది అనుకుంటూ  ఆ ఆఫీసుకెళ్ళాడు. కౌంటర్లో ఉన్న ఆవిడని అడుగుతున్నాడు" ఏమండీ కేష్ కట్టాలా, లేక బాంక్ డ్రాఫ్ట్ తీసుకు రమ్మంటారా" అని.

ఆవిడ తలెత్తి చూసి "ఇంతకూ ఎవర్ని చంపాలో వివరాలు చెప్పండి" అంది.

ఓరిబాబో!

ఆవిడెవరో కాదు తన భార్యే.

మళ్ళీ మెలకువ. మళ్ళీ కలలు. కలత నిద్ర తో లేటుగా నిద్ర లేచాడు.

ఉదయం పదకొండు అవుతోంది. అమ్మో కాలేజీకి వెళ్ళలేదు. ఇంత లేటైనా నిద్ర లేపలేదే ఈ దేభ్యం.

ఆవిణ్ణి పేరుతో అరుస్తూ పిలిచాడు.

చేసిన తప్పుకు సంజాయిషీ అడిగాడు.

" ఇవ్వాళ వరలక్ష్మీ వ్రతం , కాలేజీ సెలవు అని లేపొద్దన్నారు మీరే" గుర్తు చేసింది.

" ఈ మధ్య కోపం ఎక్కువైయింది మీకు." గొంతులో ఏదో తడి. మొహం తిప్పుకుని గదిలోంచి వెళ్తుంటే కంటిలో తడి తళుక్కుమని అతన్ని నిలదీసింది.

నా ఊహలు ఆలోచనలు తెలిసిఉంటాయా అనుకున్నాడు.

' ఆ దాని బొంద. వఠ్ఠి మందమతి. అంత తెలివే ఉంటే ఇంకేమి? ఆడవాళ్ళు ఊరికూరికే ఏడుపులు సాగిస్తూ ఉంటారు. అంతగా పట్టించుకోనక్కరలేదు.' మనసు ఊరుకోబెట్టింది.

"ఇలాగే అనుకుంటూ ఉండు, ఎప్పుడో నిన్ను విరగ్గొట్టేస్తది" పక్కనే చేరి, కులాసాగా నవ్వుతూ రౌడీ అంతరాత్మ అంటోంది.

ఏమో ఏమి జరిగినా జరగొచ్చు జాగ్రత్తగా ఉండాలి.

ఇంత మందమతి భార్యకే అనుమానమొచ్చిందంటే ఆమె క్కూడా తెలిసే ఉంటాయా నా ఆలోచనలు. తెలిస్తే ?


'తెలిసే ఉంటుంది, ఆడవాళ్ళెవరైనా భార్యకన్నా తెలివైన వాళ్ళే కదా! నీ పెళ్ళయిందే'

మధ్యాహ్నం నాలుగైంది. ఆమె వస్తోంది. వెంట అమ్మా నాన్నలు. అమ్మో నా వెర్రి ఆలోచనలు పసిగట్టి నిలదీయడానికొస్తున్నారా? మనసు తలుపులు తీసి, తలపులు చూసి వీళ్ళకు తెలిపిందెవరు. ఇవ్వాళ నాకు మూడినట్లేనా?

ఎప్పుడూ పక్కనే ఉండే అంతరాత్మ గాడేడీ, మాట్టాడడే?

ఆయన వచ్చాడు.

"రండి రండి "

"నమస్కారం మాష్టరు గారూ. అమ్మాయి మీగురించి ఎంతో చెప్తూంది రోజూ. బాగా చెప్తారనీ, అమ్మాయి కి ఈ శ్రావణం లోనే ... అబ్బాయి నా మేనల్లుడే. ఉండేది అమెరికా. అక్కడికెళ్ళి ఇంగ్లీషుకు ఇబ్బంది పడకుండా ..చాలా సహాయం చేశారు.” ఆయన చెప్పేవి అక్కడో ముక్క అక్కడో ముక్క వినబడుతూ ఉన్నాయి.

అమ్మయ్య. చివరి క్షణం లో ఉరి తప్పిన వాడిలాగా ఉంది.

దేవుడా మనసనే అర ఒకటి ఇచ్చి ఎంత మేలు చేశావయ్యా. ఎన్ని వెధవ ఆలోచనలు చేసినా రెండో మనసు కు, మూడో మనిషికి తెలియదు.

ఆయనతో బాటు నడుస్తూ బయటికెళ్ళి ఇంటికొచ్చేసరికి చీకటి పడింది. మధ్యాహ్నపు వడగాలి తగ్గి చల్ల గాలి వీస్తోంది. చుట్టూ ప్రశాంత నిశ్శబ్దం.

రోడ్డు మీది తెల్లటి దీపం తాలూకు వెలుగు అతని ఇంటి తోటలో పడుతూ ఉంది. ప్రహరీ గోడ పక్కనే ఉన్న గుబురు చెట్టు ఏదో తెల్ల పూలతో విరగ బూసి ఉంది. కొన్ని పూలు రాలి పచ్చిక మీద పడి ఉన్నాయి.

బయట వరండాలో కుర్చీలో వెనక్కి వాలి, ఆలోచనలు లేని మనసు తో కూర్చున్నాడు. కళ్ళు మూసుకుంటే ప్రశాంత సముద్రం పక్కనే ఉన్నట్లు ఉంది.

చందనం, మల్లెల కలగలపు పరిమళం దగ్గరయింది. అలికిడి కి కళ్ళు విప్పాడు. భార్య పక్కనే నిల్చుంది. ముదురాకు పచ్చ పట్టు చీరకు ఎర్రటి అంచు. తలలో చేమంతులు. ఎర్రటి పెదవులు.

తలొంచుకున్నాడు.

చేతిలో అక్షింతలు పెట్టి పాదాలు తాకింది. విష్ణు మూర్తి, తన పాదం పట్టుకున్న తర్వాత భృగు మహర్షి పరిస్థితి లా ఉంది అతనికి. సిగ్గు ముంచుకొచ్చింది.

"పూజ చేసి ఏం కోరుకున్నావు?”

"ఏమీ కోరుకోలేదు. ఊరికే వ్రతం చేశాను. అంతే"

"అదేమిటీ?”

"పూజ చేసేది మనసుని కోరికల వెంట పరుగులెత్తించడానికి కాదు. ఒక చోట నిలుపుకోవడానికే.”

"వచ్చే జన్మలో మంచి మొగుడు రావాలనో, ఏవో కోరుకుంటారుగా ఆడవాళ్ళు.”

"ఏవిటా మాటలు? " అవమానపడ్డట్ట్లుగా అంది.

"నాకు కోపమెక్కువ కదా , నాకన్నా మంచి వాణ్ణి కోరుకుని ఉంటావేమోనని..”

ఇంక ఆపమన్నట్లు అతని పెదవుల మీద ఆమె వేలు ఉంచింది.

అబ్బా దేవుడా!

వేళ్ళలో విద్యుత్తు పెట్టావేం తండ్రీ.

'ఎవరు ముట్టుకున్నా విద్యుత్తు విద్యుత్తు.  సిగ్గులేక పోతే సరి.' ఎక్కణ్ణుంచో ఊడిపడింది అంతరాత్మ, సమయం సందర్భం లేకుండా          

ఈ అంతరాత్మ గాణ్ణి చంపమని ఆ ఆఫీసులో రశీదు తీసుకోవాలి. ఎంత డబ్బైనా పర్వాలేదు.

7, ఏప్రిల్ 2012, శనివారం

నటీ నటులు కావలెను.



ఒక సినిమా ఆఫీసు


హీరో కావాలని ఉందా? ఏనాడైనా అద్దం లో చూసుకున్నావా?

నేను అందగాణ్ణని మా కాలేజీ లో ఆడపిల్లలంతా అంటారు. ఇదిగోండి వాళ్ళందరూ సంతకాలు పెట్టిన పేపర్.

నేనేమైనా గుడ్డోణ్ణనుకుంటున్నావా. అందగాడివే, కానీ అదే నీ కొంపముంచింది. ఇహ హీరోగా ఏం పనికొస్తావు. ఆయనెవరూ.. ఆఁ ...అరవింద స్వామి అందగాడు అందగాడు అన్నారు.. మట్టిగొట్టుకు పోయాడు..అప్పట్లో అతెనవరూ.. ఆ సుమన్.. ఎర్రగా బుర్రగా ఉన్నాడని పొలోమంటూ ఆడంగులంతా వెంట బడ్డారు. ఏడీ హీరోగా నిలబడ్డాడా? లేదే..

ఏవిటి సార్ ఈ అన్యాయం.. తెల్లగా ఉన్నాను, కళ్ళూ ముక్కూ ఏ వంకరా లేదు ..

అదే నీ నెత్తికొచ్చింది. తెల్లగా ఉంటే లాభం లేదయ్యా.. అసలు తిరుగులేని హీరో అనిపించుకోవాలంటే కాస్తో కూస్తో అనాకారిగా ఉండి, చామన చాయో, వీలైతే నికార్సైన నలుపు రంగులో ఉండాలి.

కృష్ణ, శోభన్ బాబు తెల్లగా అందంగా ఉండేవారు కదా సార్.

ఎప్పటి మాట! రోజులు మారాయి. ఇప్పుడు అందగాళ్లంటే అసయ్యమేస్తోంది అందరికీ.

ఒకటే మొయిన అందంగా ఉంటే.. సగటు మనిషికి చీదర వొస్తుంది. 'ఛీ ఏవిటింత అందంగా ఉన్నాడు వీడు' అని తిక్క రేగి, వాణ్ణి ఎవరూ చూడరు. అదే వికారంగా అదరగొట్టాడే అనుకో, మనలాగే సాదా సీదాగా ఉన్నాడు అని ప్రతి వాడూ హీరో లా ఫీలయి, హీరోగా నిలబెడతారు.

మరిప్పుడు ఏం చెయ్యడం సార్..

.. ఆ ముదనష్టపు ముక్కు మరీ కోటేరు లా ఉండి, చూట్టానికి, అసహ్యంగా ఉంది. నా మాట విని ప్లాస్టిక్ సర్జెరీ చేయించి పొట్టిదిగానో, వొంకరగానో చేయించు. మనకి తెలిసిన ప్లాస్టిక్ సర్జన్ ఉన్నాళ్ళే..


సరే సార్.. అలా చేయించుకొస్తే మరి నన్ను హీరోగా తీసుకుంటారా?

తొందర పడకు. మరి నీ రంగో.. రంగెవరు తట్టుకుంటారు? మరీ అంత పచ్చని పసిమి రంగులో ఉంటే ఏవిటో కడుపులో నాకే తిప్పుతోంది . కాస్త రంగు తగ్గాలి. తప్పదు. నా దగ్గర కొన్ని ప్రత్యేకమైన ఆయింట్ మెంట్లున్నాయి. అవన్నీ కలేసి పూత లాగా మొహానికి రాసుకో. రంగు తగ్గి మొహం మీద పుట్టలు పుట్టలుగా మొటిమలు పుడతాయి.

అదేవిటి సార్.. సిన్మా హీరో మహేష్ బాబుకు మంచి రంగు, మంచి ముక్కు ఉన్నాయిగా.. హీరోగా పైకి వచ్చాడుగా..

నీకు అతితెలివి శానా ఉందయ్యా. టివి చానెల్ పెట్టుకోక పోయావ్, ఈడకొచ్చి నా పేణాలు తోడక పోతే...ఒకటో రెండు సుడి గాళ్ళ కేసులు తీసుకుని వితండ వాదం పెట్టక. నేను మాట్లాడేది మెజారిటీ సంగతి. సూపర్ రిన్ తెల్లగా ఉన్నవాళ్ళెవరూ సూపర్ స్టార్లు, మెగా స్టార్లు కాలేరు. చామన చాయే అచ్చివచ్చిన రంగు.

*******

నువ్వేమిటమ్మాయ్, హీరోయిన్ గానా..?


ఫోటోలు తెచ్చావా? అమ్మా..తళుకు బెళుకు ఫోటోలు తట్టెడేల..నిక్కమైన ఒక ఎక్సరే చూపించు తల్లీ.


చూడమ్మా, ఎక్స్ రేలో కనిపించినంత బాగా బొమికలు నీ వంటి మీద స్పష్టంగా కనిపించడం లేదు. హీరొయిన్ కావాలని ఉబలాట పడితే సరిపోదు. దానికి కొంత సాధన చెయ్యాలి.

ఏం చెయ్యాలో చెప్పండి సార్. చేస్తాను.

జిమ్ కెళ్ళు. అక్కడ రోజుకు పదకొండు గంటలు ఎక్సర్ సైజ్ చెయ్యి. స్కిన్ అండ్ బోన్స్ మాత్రమే కనపడాలి. తెలిసిందా..ఒక్క మిల్లీగ్రామ్ కొవ్వు కనిపించినా జనాలు చూడరమ్మా.

అదేమిటండీ.. ఆ రోజుల్లో సావిత్రి గారు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పటికీ అందరూ పడి చస్తారు.

స్క్రీన్ మీద పక్కనున్న మిగతా ఆర్టిస్టులని తిని తిని ఆవిడలా అయ్యుండొచ్చు. సావిత్రి మాకొద్దమ్మా. కొంత దీసి రేపు ఇంటర్వ్యూ లలో సావిత్రి తెలుసు అని తెలివి తక్కువగా మాట్లాడేవు.ఖర్మ..ఎవరైనా సావిత్రి అంటే.... ఆవిడ ఎవరండీ.. మీ అమ్మగారా అని అడగాలి.

అది సరే.. ఆ జుట్టేవిటి నల్లగా ఉంది.

పుట్టినప్పట్నుండీ జుట్టు అంతేనండీ.. అలా ఉండకూడదాండీ?

నీ వంటి రంగు సరిగా మేచ్ అవ్వాలంటే ఇటుకరాయి రంగు అయితే కరెక్టు గా సూట్ అవుతుంది. అదిలేకపోతే .. పసుపురంగుతో అడ్జెస్ట్ అవుదాము. బ్యూటీ క్లినిక్ కు పోయి ఆ రంగేసుకో.

మరో సంగతి, నువ్విలా కాణీ సైజు అర్ధణా సైజు ఉంటే కుదరదు. సుబ్బరంగా సున్నా సైజుకో అరసున్నా సైజుకో రావాల. దానికో స్పెషల్ డైట్ ప్రోగ్రామ్ ఉంది.

చెప్పండి సార్. నాకు డైట్ కు సంబంధించిన విషయాలంటే భలే ఇష్టం.

పొద్దున్న, ఓ గ్లాసు నిమ్మకాయనీళ్ళు, ఒక కీరదోస ముక్క, ఒక కేరెట్ స్లైసు, మళ్ళానేమో ఒక కమలా బద్ద.

ఇది బ్రేక్ ఫాస్టా..

తప్పదు మరి. బ్రేక్ ఫాస్టంటే కొద్దిగా హెవీగా ఉండాల్సిందే.

లంచ్ విషయానికొస్తే, ఒక మీడియమ్ సైజు కాకరకాయ ఉడికించి, దాని మీద నిమ్మకాయ పిండి మిరియాల పొడి జల్లుకుని పండగ చేసుకో.

కనీసం డిన్నర్ కైనా?

డిన్నర్ అంటే శుద్ధమైన మినరల్ వాటర్.. నా restrictions లేవు. ఇహ నీ ఇష్టం , నీ కెపాసిటీ.

ఇలాంటి ఫుడ్ ఎన్నాళ్ళు సార్.

బతుకంతా . తిండి దగ్గర కక్కుర్తి పడ్డావో.. అంతే..హీరోయిన్ గా నీకింక బతుకు లేదు.నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పదిరోజుల్లో ప్రేతకళ పడాల!

ఇంకో విషయం.. కళ్ళ చుట్టు బొత్తిగా నల్లగా లేదేవిటమ్మాయ్. ఇలా అయితే ఎలా. కొన్నాళ్ళు స్ట్రిక్ట్ గా నిద్ర మానేసెయ్. మేక్ అప్ చెయ్యొచ్చనుకో.. హీరోయిన్ ల మధ్య అసలే విపరీతమైన పోటీ ఉంది. ఫలానా వాళ్ళ హీరోయిన్ ది సహజ సౌందర్యం కాదు అంటే ఎంత పరువు తక్కువ.


ఇంతకూ పేరేవిటీ?

వాణికళ. దసరా బుల్లోడు మా నాన్నకు ఇష్టమైన సినిమా సార్. వాణిశ్రీ లో మొదటి సగం, చంద్రకళలో చివరి సగం కలిపి పెట్టాడు..

అయ్యబాబోయ్..ఏవిటీ మోటుతనం.

ఏమయ్యింది సార్?

నీ భాష ఘోరం. వాణికళ కాదమ్మా, వానికల అనాలి. ఇంటిపేరు ఏమిటీ?

పాటిబళ్ళ

అయితే వానికల పాటిల్ అని మార్చుకో. అప్పుడు అందరూ ఎక్కడో నార్త్ నుండి వచ్చావనుకుంటారు. ముందు ఎక్స్ రే కు మేచ్ అయ్యేట్టు వెయిట్ తగ్గితే చూసి ఒకె చేసిన తర్వాత, హీరోయిన్లు మాట్లాడే నంగి భాషలో ట్రైనింగ్ తీసుకుందువుగాని.

*****

సార్, ఈయనెవరో విలన్ వేషం లో 'జీవిస్తా, జీవిస్తా' అంటూ నన్ను చంపేస్తున్నాడు.

ఊఁ..కండలుగిండలు బాగానే పెంచావ్.

సార్! చాన్సివ్వండి సార్. జీవిస్తాను
ఇదిగో ఈ సీను చదువు . చదివిన తర్వాత, నాముందు జీవించు. నేను బతికి ఉంటే తెర మీద జీవించుదువు గాని.

సీన్ నంబర్: 18

విలన్ పాత బంగళా ముందున్న ఖాళీ ప్రదేశం

మెయిన్ విలన్ వెనక ఓ వందమంది ఎక్స్ ప్రెషన్ లేని దిట్టమైన అనుచరులు. అంతా నిశ్శబ్దం.

విలన్ తన ఇమేజ్ కు తగ్గ కుర్చీ నుండి లేచి భయం, ఆశ్చర్యం కలిసిన ఎక్స్ ప్రెషన్ చెదరనీయకుండా నుంచున్నాడు.


అమెరికా నుండి వచ్చిన విలన్ కొడుకు మండుటెండలో డిజైనర్ లెదర్ జాకెట్ తొడుక్కుని పక్కనే వున్నాడు. పిలక వేసుకుని వెనక నుండి చూస్తే ఆడపిల్లలా, ముందు గడ్డం చూస్తే పిల్లిలా ఉన్నాడు.

"వాడెవడు డాడ్! మీ ముందు బచ్చా, ఒక స్ట్రీట్ రౌడి వాడికి మీరు భయపడటమేమిటి?”

విలన్ ఒక మెట్టు దిగి ఆగి చెప్పాడు.

"వాడు బచ్చా కాదురా, బాలయ్య బాబు.”

రెండో మెట్టు దిగి చెప్పాడు.

"రౌడీ కాదురా, మన పాలిట రజనీ కాంత్.”

మూడో మెట్టు మీద నించున్న బామ్మర్ది చనువు చేసి ఓ డైలాగు చెప్పాడు..

"ఆడు మామూలోడు కాదు బావా .. మగాడు. “

డైలాగు చెప్పి చెంప చెళ్ళు మనిపించుకొన్నాడు విలన్ చేతిలో. ఛెళ్ అన్న శబ్దం రీ సౌండ్ ఇస్తుండగా విలనే తర్వాతి డైలాగు చెప్తున్నాడు.

"మగాడు కాదురా 'మెగా'డు'

"మగాళ్ళకే మగా స్టార్"


సీన్ చదివావుగా. ఏదీ ఇప్పుడు నటించి చూపించు, చూస్తాను.

ఏవిటండీ ఈ ఘోరం! నా బాడీ చూశారా? ఉక్కు.. సార్.. ఉక్కు. పొరుగు వాళ్ళు మా చెట్టు దబ్బకాయ కోశారని ఒక్క దెబ్బతో ఆ చెట్టు పడగొట్టాను. ఇంకో గుద్దుతో పక్కింటోణ్ణి పాడెక్కించాను. ఇంత బతుకు బతికి, నేను ...నేను..ఈ హీరో బక్కోణ్ణి పొగడాలా?

మరి పొగిడితేనేగా? వాడు ఎలివేట్ అయ్యేది.

......

నీకు నచ్చక పోతే చెప్పు, ఈ రోల్ కోసం బండెడు మంది లైన్లో ఉన్నారు.

సరే సార్....ఏదో ఒక సిన్మాలో జీవించాలని నా జీవితాశయం.

ఇదిగో, వచ్చిందగ్గర్నుండి 'జీవిస్తా జీవిస్తా' అని ఒకటే నరాలు తెంపుతున్నావు . వచ్చీ రాని ఏక్షన్ చేస్తే చాలు. అరవడోస్ ఏక్షన్ అంటే ఇప్పటి వాళ్లకు డోకు.

మరో విషయం ,సరే గానీ నువ్విలా తెలుగు సుబ్రంగా మాట్టాడితే కుదర్దు. నీ డైలాగులు ఒక నార్తిండియన్ తెలుగు నేర్చుకుని మాట్లాడితే ఎలా ఉంటుందో, అంటే పరభాష యాస తెలుగులో మాట్టాడేందుకు ఒక ట్యూషన్ మేష్టార్ని పెట్టాను. ప్రాక్టీస్ చెయ్యి.

19, మార్చి 2012, సోమవారం

TAKE A BREAK



       
      TAKE A BREAK 

    కొన్ని నెలల క్రితం మొదలెట్టిన ఈ బ్లాగు ఒక ఇష్టమైన వ్యసనం లా మారింది. వృత్తి లో టైము బాగా లాగేస్తూ, ఒక అర్ధం చెప్పింది. (బ్లాగు - టైం బాగా లాగేసేది.) 
  పని లో కొన్ని అదనపు బాధ్యతలు తోడయినందువల్ల, బ్లాగు లో వ్రాయడం మరికొన్ని నెలల వరకు కుదరని పరిస్థితి కనపడుతోంది. 
 ఈ బ్లాగు కు కారణమైన వారు చాలా గౌరవనీయులు. ఈ వ్రాత వ్యసనం లో ఉన్న ఆనందం రుచి చూపించినందుకు కృతఙ్ఞత తెలియజేసుకుంటున్నాను.

  ఇప్పుడు నువ్వు రాయక పోతే ఏవిటమ్మా సైలెంట్ గా ఉండు, దానికీ ప్రకటన ఎందుకూ అని మీకనిపించొచ్చు. బ్లాగు పెట్టడానికి కారణమైన శ్రేయోభిలాషులకూ, దీని వల్ల పరిచయమైన స్నేహితులకూ ఒక ముక్క చెప్పాలికదా..అదే.. 

కృతఙ్ఞతలు.

    వ్యసనం మానడం అంత తేలిక కాదుగనక పొరపాటున ఎప్పుడైనా ఒక పోస్ట్ పెడితే మొన్న బ్రేక్ అన్నావు, అప్పుడే మాట బ్రేక్ చేసావే అని చిరాకు పడకండి.

12, మార్చి 2012, సోమవారం

నాకే ఎందుకిలా?




మా పనావిడ ఓ పది రోజులు రానని చెప్పింది. వెళ్తూ వెళ్తూ

"నా మొబైల్ నంబరు చేవ్ చేస్కోండి" అంటూ నా ఎదురుగా నించుని కలెక్టర్ పాత్ర లో నటించే హీరోయిన్ పెన్ను పెట్టుకునే  ప్రదేశం నుండి తన మొబైల్ తీసింది.

మొబైల్ ఎర్ర రంగులో చూడ ముచ్చటగా ఉంది .

"అవసరం లేదు. నేను మేనేజ్ చేసుకుంటాలే. ఎప్పుడో ఒక సారి రా.” అన్నాను.

' నువ్వెళ్ళిపోతే ఇంటిపనెవరు చేస్తారే అంటూ, నేను శోకాలు తీసి అని కాళ్ళా వేళ్ళా పడతానని ఊహించిందేమో, నా నిర్లిప్త ధోరణికి ఆమె ఇగో దెబ్బ తింది. దానికి తోడు దాని మొబైల్ సోకులు సరిగా వీక్షించ కుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి ఇంకా గాయపరచాను..

ఇంటిపనంతా చేసి ఇంటాయన దగ్గర కొంత గుర్తింపు, ఒక సర్టిఫికేట్ కొట్టేయాలి.

తెల్లవారు జామున ఇంటి ముందు ఊడ్చి నీళ్ళు కొట్టాను. మసక వెలుతురులో నాకొచ్చిన ఒకే ఒక పెద్ద చుక్కల ముగ్గు వేస్తూ ఉన్నాను. ఎదురింటి ఆసామి భార్యతో కలిసి వాకింగ్ కు వెళ్ళి వస్తున్నాడు.

టీ షర్ట్ లో గుమ్మడి కాయ దాచుకుని ఆయన, చేతిలో పేపరు, పాల పేకెట్లతో ఆవిడ.


నా ముగ్గునీ, నన్ను వెనకగా చూశారు కొంత సేపు. ముగ్గు చక్కదనం నచ్చినట్లే ఉంది.

'ముగ్గు బాగుందండీ'  అంటే నేను వాళ్ళకెలా నా ధన్యవాదాలు తెలపాలోనని ఎదురుచూస్తూ ఉంటే..

'వాళ్ళ అర్భకపు పనిమనిషిని తీసేసి, ఈ పనావిడ ని పెట్టుకుందామా?' అని నాకు వినబడేట్లు పైకే ఆలోచించుతూ లోపలికెళ్ళి పోయారు..



ఇల్లంతా బాగా తుడిచి మెరిసి పోయేట్లు చేశాను.

అయ్యగారికి టిపిను, కాపీ ఏడేడిగ అట్టుకెళ్ళి అందించి వినయంగా వంగి నించుంటే, నావేపు చూసి

"చేతులు శుభ్రంగా కడుక్కునే తెచ్చావా?” అని అనుమానపడ్డారు.

"బలేవోరే అయ్యగోరూ, తానం కూడా సేసే వొంట సేశానండీ" అంటే రాజుగోరు తల పైకీ కిందికీ కొద్దిగా ఊపారు. మరి దాని అర్దవేంటో?

అయ్యగోరు పొద్దుటి నుండీ నిద్ర బోయే వరకూ ఒక వ్రతం లో ఉంటాడు. పెళ్ళయిన మగవాళ్ళందరూ చేయాల్సిన వ్రతమే కానీ, ఈయన బాగా నిష్ఠగా చేస్తాడు. నా మాటలు సరిగా, పూర్తిగా వినని వ్రతం.


"ఛ.. బొత్తిగా ఇంట్లో గుర్తింపు లేదు.”

"ఇంట్లో లేకపోతే మార్కెట్ కు పోయి తెచ్చుకో.”

"అక్కడ దొరుకుతుందా?”

"భలే దానివే. అక్కడ దొరకనిదంటూ ఏమీ ఉండదు. బజారెళ్ళి ఓ నాలుగుక్కిలోలు కొనుక్కొస్తే సరి.”


ఎటూ కూరగాయలు కూడా కొనాలి అనుకుని సూపర్ మార్కెట్ కెళ్ళాం.

చుట్టూ చూశా. ఎవరూ గుర్తించక పోతే ఎట్లా?

ఎవరో ఓ బులుగు చొక్కా ఆయన నా వొంకే చూస్తున్నాడు. ఎక్కడో చూసినట్లే ఉంది. వెళ్తూ వొక సారి, వెనక్కి తిరిగి రెండోసారి చూశాను. బాగా తెలిసిన మొహం. గుర్తించలేదని అతను ఫీలయ్యే ప్రమాదం ఉందని పలకరింపుగా నవ్వా. మా సీతమ్మ పిన్ని రెండో అల్లుడు కాదూ, కాడనుకుంటా. నా అభిమాని అయి వుంటాడు. బహుశా నా రచనలు చదివి ప్రభావితుడై, తన జీవిత గమనాన్ని మార్చుకునే ఉంటాడు.

షేవింగ్ సామాగ్రి కొంటున్న వాడు తన గమనాన్ని మార్చుకొని నేనున్న కూరగాయల విభాగం వేపు వచ్చాడు. నేను వంకాయలేరుతుంటే, అతడు పుచ్చు వంకాయలేరుకుంటున్నాడు. ఎంత అభిమాన రచయిత్రి ఎదురైతే మాత్రం పుచ్చు వంకాయలకూ మంచి వంకాయలకూ తేడా గమనించనంత విచక్షణ కోల్పోవాలా?

ఎటు వెళ్తే అటు వస్తున్నాడు. ఏవిటి నాకీ ఫాలోయింగ్? అబ్బ, నాకే కన్ను కుడుతోంది.

సర్లెమ్మని చిక్కుడు కాయలేరుకుంటుంటే అటువేపు వచ్చాడు. వెర్రి నాగన్న, నన్ను పలకరించడానికి భయపడుతున్నట్లున్నాడు. నిజమే మరి, అభిమాన రైటర్ ఎదురైనపుడు నిలువు గుడ్లు పడతాయని స్నేహితులు కొందరు చెప్పి ఉన్నారు. పాపం అతను మాత్రం ఏం చేస్తాడు నా రచనా చమత్కృతిలో చిక్కుకున్న చిక్కుడుకాయ.

"ఏవేఁ.. బీరకాయలు తీసుకో, తొక్కు పచ్చడి చేద్దూ గానీ. నాకిష్టం.” అంటూ వచ్చాడీయన.

బులుగు చొక్కా మాయమయ్యింది.

"ఏవయ్యా, నీకు బుర్ర ఉందా, అతనెవరో నా ఫాన్, ఫాలో అవుతుంటే, కుళ్ళుపడి తోలేశావు.”

"నీ బొందలే. వాడెందుకు ఫాలో అవుతున్నాడో చూసుకోకుండా నా మీద ఎగురుతావే?”



ఇంట్లో గుర్తింపు సాధ్యం కాదు. పోనీ వృత్తిలో సాధించుదాం గుర్తింపు.

కాన్ఫరెన్స్ లో పేపరొకటి చదివితే కొద్దిగా గుర్తింపు రావొచ్చు.

ఓ మందుల కంపెనీ వాడొస్తే చెప్పా "అబ్బాయ్ అర్జెంటుగా ఓ కాన్ఫరెన్స్ కెళ్ళాలని .”

మా ఇంటినుండి కాన్ఫరెన్స్ వరకు అవసరమయ్యే రైలు టికెట్లు, ఎయిర్ టికెట్లు ఇంకా పంచభూతాల ద్వారా నడిచే సమస్త వాహానాల టికెట్లు, నా హోటల్ బస అతను భరించేట్టు, బదులుగా నేను బతికున్నంత కాలం అవసరమున్నా లేకపోయినా అతని కంపెనీ మందులనే వాడతాననే ఒక రహస్య ఒప్పందం తర్వాత ప్రయాణపు ఏర్పాట్లు చేసుకున్నాను.

తోడు ఎవర్ని తీసుకెళ్దాం

"ఏమోయ్ రెండో టికెట్టూ, రెండో టికెట్ మీద నువ్వొస్తావా నాతో?”

" మీ ఆడోళ్ళ పేరంటాలకు నేను రాను.”

"మగ వాళ్ళు కూడా ఉంటారోయ్. మొన్నో సారి వొచ్చావుగా!”

"అవునవును. మీ కొలీగ్ ఒకడు చీర ఫాల్ ముడతలు రాకుండా ఎలా కుట్టాలో చెప్పాడు. నా జన్మ ధన్యమైంది. అది చాలు.”

ఎక్కువ బతిమాలితే అతనికి కొమ్ములు పెరిగే ప్రమాదముంది.

పనిలోపని, సబలనని నిరూపించుకున్నట్లూ ఉంటుందనుకుని ఒక్కదాన్నే పోయాను.

ఊరెళ్ళగానే ఇంటినుండి ఫోన్ వొచ్చింది.

"ఎలా ఉన్నావూ? " అనుకుంటూ

"ఎలా ఉన్నావంటే ఏం చెప్పేది. నీ మీద జాలి పడక తప్పదోయ్. అబ్బబ్బబ్బ, మొగుడు అనే నస పిల్లిని వెంటేసుకెళ్ళకుండా కాన్ఫరెన్స్ పెళ్ళికొచ్చానే ... అద్దీ... అసలు స్వర్గం. భర్త పదార్ధం లేని బతుకులు సంతోషమయం.. అబ్బో, అబ్బో.. సరే నీ సంగతి జెప్పు"

“Reverse is also true.”

"ఏంటీ?”

"చివరి sentenceలో భర్త బదులు భార్య అని రీప్లేస్ చేసి చూడు. నా స్థితి అర్ధమవుతుంది.”

దెబ్బ కొట్టాడే..

“ఇక్కడ మా బేచ్ మేట్ అర్నబ్ కూడా వచ్చాడు. “

"అలాగా..సరే... ఇంకేంటీ చెప్పు.” అన్నాడు తాపీగా, పట్టించుకోని నిర్లక్ష్య ధోరణిలో.

Ignorance is the worst insult.

"నా అందం కుంచెం కూడా తగ్గలేదు సరికదా, ఇప్పుడింకా బాగున్నానని అన్నాడు.” అసూయాస్త్రం వేశాను. ఇక గిలగిల్లాడాల్సిందే!

"ఆ మధ్యన వాణ్ణి చూశానుగా. సోదరీ సమానుడు. మీ బ్రాంచ్ లో ఓ పదేళ్ళు పని చేశాడుగా.. ఇంక అనుమానపడేందుకు ఏమీ ఉండదులే గానీ...ఇంకేంటీ విశేషాలు? ”

"ఓయ్, నా క్లాస్ మేట్ ని ఏమన్నా అన్నావో...”

"సరే ఉంటానే, నాకు పనుంది" అని నేనో కౌంటర్ ఇచ్చే లోపున కట్ చేశాడు.

ఇదో కొత్త రకం తెలివి తేటలు. అనాల్సిన మాటలు అనేసిన తర్వాత కొంపలు ముంచుకుపోతున్నట్టు ఫోను పెట్టెయ్యడం.

ఎందుకో మళ్ళీ ఫోన్ చేశాడు. అమ్మయ్య, ఇప్పుడేదో ఒకటి కచ్చ తీరేట్లు అనాలి అనుకుని

"ఇదిగో చూడూ .."అని మొదలెట్టా. నా మాటలు పట్టించుకోకుండా.

"ఇందాక చెప్పడం మర్చిపోయానే, పోయిన సారి చూసినపుడు, మీ వాడు భలే డేన్స్ చేశాడే. మన శివ శంకర్ మాస్టారిలా .. .మా క్లాస్ రీయూనియన్ లో డేన్సాడతాడేమో కనుక్కోవా, ప్లీజ్, ప్లీజ్" అంటున్నాడు.

కోపంలో స్ట్రాంగ్ గా ఏదైనా అందామంటే బుర్రకేవీ తోచలా.

"ఛీ ఫో.. నాతో మాట్టాడవాక" అని ఫోన్ పెట్టేశా.

ఇకనుంచి చిన్న నోట్ బుక్ లో కొన్ని పదునైన సంభాషణలు రాసి పెట్టుకోవాలి.



కాన్ఫరెన్స్ లో లంచ్ టైము కు, స్టేజ్ మీద ఏదో చెప్పుకు పోతున్న మనిషి మనోభావాలను తోసేసి, ఒకళ్ళనొకళ్ళం తోసుకుంటూ, కూర్చున్న వాళ్ళ కాళ్ళు తొక్కిపడేస్తూ పరుగు పరుగున భోజనాల హాలు కెళ్ళాము. అప్పటికే పెద్ద పెద్ద సీనియర్లు బిరియానీ డేకిసాల దగ్గర క్యూలో ఉన్నారు. నేనూ ఓ బొచ్చ చేతిలో పట్టుకుని క్యూలో చివర్న నుంచున్నా.

ఎన్ని కాన్ఫరెన్స్ ల కెళ్ళినా ఒక కామన్ విషయం ఏవిటంటే, చికెన్ బిరియానీ, పాయసం కు డిమాండ్ ఎక్కువ. వాటి దగ్గరే సోమాలియా నుండి వచ్చిన వాళ్ళ లా మేము తొక్కిసలాటకు గురి అవుతాము.

ప్లేటు నిండా వడ్డించుకుని గుంపులు గుంపులు గా నించుని తిండి మీద అసలు దృష్టి లేని వాళ్ళలా రియల్ ఎస్టేట్ కబుర్లు, తోటి వాళ్ళ కాపురాల మీద, పిల్లల మీద అభాండాలు మాట్లాడుకుంటాము.

తిరుగు ప్రయాణం లో ఆలోచిస్తున్నా. ఎబ్బె ఈ కాన్ఫరెన్సుల వల్ల వచ్చే చిన్నా చితకా గుర్తింపు చాలదు నా ప్రాణానికి.

ఈ మధ్య ఏ సినిమా చూసినా హీరోకు, విలన్ కూ కొద్దిగా వెనకగా ఓ గుంపు ఉంటుంది. నా వెనక ఒక గుంపు చేరితే అబ్బ ఎంత బాగుంటుంది. అసలా ఆనందమే వేరు.

ఎస్కలేటర్ అంటే నాకు విపరీతమైన భయం. ఎస్కలేటర్ ఎక్కడానికి ధైర్యం కూడగట్టుకుంటూ వాటివంక అదే పని గా చూస్తుంటే, ఒకాయన వచ్చి, చాలా మర్యాదగా ఆ కదిలే మెట్లవైపు చేయి చాచి "మేడమ్, లేడీస్ ఫస్ట్" అన్నాడు.

"లేడీస్ ఫస్ట్"

నా కా మాటంటే ఎక్కడలేని కోపం. నా జెండర్ గుర్తించి ఎవరైనా రాయితీ ఇవ్వబోతే వాళ్ళను తీవ్రంగా అవమానించి గానీ వొదల్ను.

"అర్భకంగా ఉన్నావు. ముందు నువ్వెళ్ళు" అన్నాను.

అలా ఎస్కలేటర్ ఎక్కడానికి వెనకాడుతుంటే నా వెనక ఓ గుంపు చేరింది.

"పదవమ్మా, ఇంతలోకే చావవుగానీ" అని ఎస్కలేటర్ ఎక్కించే ప్రయత్నం చేసి, దాదాపు నన్ను వాటి మీదికి తోసినంత పని చేశారు.

ప్రయాణం లో పక్క సీటు మనుషులతో వివరాలు పంచుకుంటే వచ్చే సమస్యలు బాగా తెలిసి ఉండటం చేత, నేను నా పక్క సీటు మనిషికి తెలిసిన ఏ భాషా రాని దాని వలె ప్రవర్తిస్తూ ఉంటాను. అందువల్ల వాళ్ళు, నేను కొంత రాతి యుగం వైపుకు వెళ్ళి, సంఙ్ఞ లతో communicate చేసుకుంటూ ఉంటాం.

నా జాతక రీత్యా, ప్రయాణాల్లో తప్పని సరిగా ఓ పిల్ల పిశాచం నా పక్క సీట్లో ఉండాల్సిందే. ముందు మొహం లో మొహం పెట్టి నవ్వుతుంది. దీని దుంప తెగా, ముద్దొస్తుందీ బిడ్డ అని కొంచం ముచ్చట పడ్డానా, వాళ్ళ అమ్మనొదిలేసి నాతోనే సెటిల్ అవుతుంది.

ఇలా కాదని బోర్డింగ్ పాస్ ఇచ్చే అబ్బాయితో 'పిల్లలు లేని సీటు, పిల్లలు లేని సీటు' అని మొత్తుకుంటుంటే, పిల్లలు కలగడానికి ఇంకా టైమున్న ఓ హనీ మూన్ జంట పక్కన పడేశాడు. కొత్త దంపతులు ప్రయాణం మొదలైన దగ్గర్నుండీ ఒకే న్యూస్ పేపర్ తెగ దీక్ష గా చదువుతున్నారు. ఏమున్నాయో అంత గొప్ప న్యూస్! వాళ్ళని పలకరించి. మీరు చదవడం అయిపోయిన తర్వాత పేపర్ నాకివ్వండేం అన్నా.


ఏ రోజు పేపర్ ఆ రోజు చదవడం కుదరదు నాకు. ఏదైనా సెలవు రోజున, చిత్తు కాగితాల వాడొచ్చి కాటా వేసుకుంటుంటే, నేనూ పక్కనే కూర్చుంటా. వాడు దొంగ కాటా వేసి ఓ రూపాయి ఎందుకు కాజేయాలి. ఆ టైములో అన్ని న్యూస్ భలే ఇంట్రెంస్టింగ్ గా ఉంటాయి. వాడు త్రాసులో పెట్టిన పేపర్లు కొన్ని బయటకు లాగుతూ పూటంతా వాణ్ణి మాఇంట్లోనే కూర్చోబెట్టి చదువుతాను. అమ్మా, నేను వేరే బేరానికి పోవద్దా అని వాడు నసుగుతున్నా సరే .

హనీ మూన్ జంట అరగంటయినా తలకాయలు పేపర్లోంచి బయటకు తీయకుండా న్యూస్ పేపర్ నాకు తెరలా అడ్డం పెట్టుకుని చదువుతున్నారు. నాకు కనిపించే వైపు అంతా చదివేశాను. 
పేపర్ కు అవతల వేపు విశేషాలేమిటో???

 మళ్ళీ అడిగా 'న్యూస్ పేపర్' అంటూ. వాళ్ళు ఎయిర్ హోస్టెస్ ను పిలిచి సీటు మార్పించుకున్నారు. మరీ చోద్యం. నేనేమడిగాను గనక, అంత మాత్రానికే సీటు మారాలా? ఎందుకిలా?

ఖాళీ అయిన సీట్లలో ఓ పిల్ల తల్లి వచ్చి చేరింది, నా జాతకాన్ని నిజం చేస్తూ..

వాళ్ళ అమ్మ భోం చేసేటప్పుడు, పిల్ల కుదురుగా నావొళ్ళో కూర్చుందా, నేను తినబోయేసరికి ప్లేట్ లో బడి కెలికి పారేసింది.
కాస్త కునుకు తీద్దామంటే వల్లకాదు. రెప్ప వేశానో, పాపాయి తన చురుకు చేత్తో తపా తపా మొహం మీద చరుస్తూనే ఉంది. 'ఆయ్ పిల్లా' అని గదుముదామంటే సొంత పిల్ల కాదాయె. రాత్రంతా నిద్ర లేదు.

ప్రయాణం చివర్లో వాళ్ళమ్మ తల దువ్వుకుంటానని పిల్లను నా చేతికిచ్చింది. వాళ్ళమ్మ మేకప్ అయ్యే లోపు నాక్కూడా మేకప్ చేసింది, నా జుట్టు అదీ పీకి పెట్టి. పిల్లను తీసుకుని తన మేకప్ సామాగ్రి నాకివ్వ బోయింది. సహజ సౌందర్యం చాలుననుకొని తిరస్కరించాను.

పక్కన కూర్చున్నావిడ మొగుడు కాబోలు, పెళ్ళాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు.. నన్ను పైనుండి కింది వరకూ ఎగా దిగా చూస్తున్నాడు.

హే భగవాన్, నేను గుర్తింపు కావాలనుకుంది నా వృత్తి, విద్వత్తు విషయాల్లో మాత్రమే. అందం వలన వచ్చే గుర్తింపు నాకొద్దు స్వామీ, నాకొద్దు.

ఏదో మామూలు అందం ఇస్తే సరిపోయేదానికి అసమాన సౌందర్యాన్ని నాకంట గట్టి, పైనుండి చోద్యం చూస్తూ ఆనందిస్తున్నావా ప్రభూ? వీడెవడో పక్కనున్న పెళ్ళాన్ని వొదిలి నా వొంకే చూస్తున్నాడు.

ప్రయాణం చేసేప్పుడు వింత వేష ధారణ చేస్తాను బంగి అనంతయ్య టైపు లో. తెలుగు తెలుసునని వాళ్ళు అనుకోలేని విధంగా నా ఆహార్యం, వ్యవహారం ఉండటం చేత, భయం లేకుండా తెలుగులో మాట్టాడేసుకుంటున్నారు.

మొగుడు: ఆవిడెవరూ అలా ఉందీ?

పెళ్ళాం : నా పక్క సీటే.

మొగుడు: మరీ దెయ్యం లా ఉంది. కొద్దిగా దువ్వెన పడెయ్యకూడదూ ఆవిడకు.

పెళ్ళాం: ఇచ్చాను వొద్దంది.ఆవిడ కోసం ఎవరూ వచ్చినట్లు లేరు రిసీవ్ చేసుకోడానికి.

మొగుడు: వచ్చి ఎక్కడో దాక్కుని ఉండి ఉంటాడు, ఈ అవతారాన్ని ఇంటికి తీసుకెళ్ళడం ఇష్టం లేక.

మొగుడు, పెళ్ళాం: హిహి హి కి కి కి..

నాకే ఎందుకిలా?