16, నవంబర్ 2012, శుక్రవారం

నిన్ను నిన్నుగా-2


తెల్లవారక ముందే నిద్రలేచి ఇద్దరూ మాష్టారి వెనకగా నడుస్తూ వెళ్తున్నారు. పార్క్ దగ్గరకెళ్ళే సరికి తెలతెలవారుతోంది. పార్కు లో బెంచీలమీద కూర్చుని అప్పటికే మాష్టారి స్నేహితులు ఎదురుచూస్తున్నారు. వాళ్ళతో కబుర్లాడుతూ ఉంటే, మాష్టారు చెప్పిన మనిషి ఎవరై ఉంటారా అని మురళీ, అనూ వాళ్ళని పరీక్షగా చూస్తూ ఉన్నారు.

ఎంత సేపు చూసినా వాళ్ళలో ఆ ఆదర్శ ఉద్యోగి ఎవరో అంతుబట్టలేదు. అందరూ మామూలుగానే ఉన్నారు. ఇంకా మామూలుగా రాజకీయాలు మాట్లాడుతున్నారు.

మధ్యలో వీలు చిక్కినపుడు మురళీ అడిగాడు. "నాన్నా, ఎవర్నో చూపిస్తానన్నావు. ఆయనింకా రాలేదా?"

మరిచే పోయాను అంటూ పక్కకొచ్చారు. పైకి చూసి "వచ్చేశారుగా ” అన్నారు.

ఎవరు మాష్టారూ ?

చుట్టూ చూశారు పిల్లలిద్దరూ.

లేత నీలి రంగు ఆకాశం లో మెల్లమెల్లగా పైకి లేస్తున్న ఎర్రని సూర్యుణ్ణి చూపించారు.

"సూర్యుడా?" అనూ గొంతులో ఆశ్చర్యం.

"ఆయనే నాకు తెలిసిన గురువు, గొప్ప ఉద్యోగి.

సూర్యుడి చుట్టూ మనం తిరుగుతున్నా చూసేందుకు ఆయనే వస్తున్నట్లు, వెళ్తున్నట్లు ఉంటుంది. మనకొక మంచి పాఠం నేర్పేందుకే

వేల సంవత్సరాలనుండీ వేళతప్పకుండా ఉద్యోగానికి వస్తాడు.

జీతమక్కరలేదు.

సెలవనేది ఎరగడు.

వృత్తిలో బీదా గొప్పా తేడా చూపించడు. అందరికీ సమానంగా వెలుగునీ వెచ్చదనాన్నీ పంచుతాడు.

ఆయనే లేకపోతే మనకు మనుగడలేదు. ఇంత చేస్తున్నా మన నుండి ఒక నమస్కారం కూడా ఆశించడు. అన్నింటినీ మించి తనలాగా జీవించమని, ఏమీ ఆశించకుండా ఎదుటివారికి సహాయం చేయమని నిశ్శబ్దంగా పాఠం నేర్పుతున్నాడు. ”

"క్రమశిక్షణ, టైం కు రావడం వరకే సూర్యుణ్ణి ఫాలో కాగలం కానీ, మిగతావి మనమెలా చెయ్యగలం. ఆయనలా మనమెలా ఉండగలం? మనం కూడా అలా ఊరికే అందరికీ సహాయం చేస్తే మనల్ని పిచ్చివాళ్ళనుకోరా మాష్టారూ?" అడిగింది అనూ

"సూర్యుణ్ణి చూసి మనం పిచ్చివాడని నవ్వగలమా అనూ?”

"సూర్యుడు మనిషి కాదుగా మాష్టారూ? ”

"మనమెవరికైనా సహాయం చేయగానే, వారు జీవితమంతా ఆ సహాయాన్ని గుర్తుంచుకోవాలని అనుకుంటాం. 'థాంక్స్ ' చెప్పకపోతే కోపగించుకుంటాం. ఏదీ ఆశించకుండా సహాయం చేయగలిగితే , లోకమంతా వెలుగుతో నిండిపోదా?”

మాష్టారి మాటలు ఒప్పుకోలేనట్లు మౌనంగా నిల్చుంది.

"నీకేం నచ్చిందో చెప్పు" అన్నారు మురళిని.

మురళి ఏమీ మాట్లాడలేదు.

"సూర్యుడిలో ఏవీ నచ్చలేదేమో మాష్టారూ,” వెటకారంగా అంది అనూ.

"నిశ్శబ్దంగా సహాయం చేయడమే నచ్చింది.” అన్నాడు ఓ క్షణమాగి.

***

పదవ తరగతి పరీక్షల ఫలితాలు రాకముందే ట్రాస్ఫర్ అయిన ఊరికి ప్రయాణమయ్యారు మాష్టారు.
ఊరు మొత్తం కదిలి వచ్చి వీడ్కోలు చెప్పింది. మాష్టారు దగ్గరకొచ్చి 'వెళ్ళొస్తానమ్మా' అని చెప్తుంటే మాష్టారు కాళ్ళకు దణ్ణం పెట్టించింది అనూ వాళ్ళ అమ్మ.

ఫలితాలు వచ్చిన రోజు , తననుకున్న దానికన్నా బాగా మార్కులు వచ్చినందుకు ఆమె సంతోషపడింది. ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. మురళీ స్టేట్ ఫస్ట్ గా నిలిచాడు. స్కూల్ సెకండ్ గా వచ్చింది. ఓడిపోయినట్లయింది.
ఓటమి రగిలించిన మంటతో దహించుకుపోయింది. ఎంత బాగా చదివేది. అలాంటిది ఇతనొచ్చి ఓటమి రుచి చూపించాడు. సెకండ్ వచ్చిన అవమానం, బాధతో ఆ రోజంతా తల్లడిలింది. కొంతసేపటికి బాధ చల్లారినా, ఆ అనుభవం పట్టుదలను పెంచింది.

ఆ తర్వాత లేచి ఒక నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా తను గొప్ప స్థితి కి చేరుకోవాలి. గెలవాలి. గెలుపు తో తప్ప ఓటమితో తను బతక కూడదు. పైమెట్టు ఎక్కాలంటే ఓటమిని మించిన ఇంధనం ఏముంటుంది?

కెరీర్ తప్ప ఇంకో ఆలోచన లేకుండా శ్రమ పడింది.

చిన్న వయసులోనే ఎన్నో విజయాలు. పేరున్న టాక్స్ కన్సల్టెన్సీ ఫర్మ్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం. బిజినెస్ కంపెనీలకు చార్టెడ్ అకౌంటెంట్ గా క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంది. పని అయ్యేంతవరకూ అనుకున్న ఫలితం దక్కేవరకూ నిద్రాహారాలు మాని శ్రమిస్తుంది.

కెరీర్ లో ఎవరూ ఎక్కలేని మెట్లు ఆమెకు సంతోషకరమైన జీవితం అందించాయి.

ఆ ఏడాది Women Entrepreneur award అందుకుంది.

ఆమెకు తగ్గ మనిషి కోసం తల్లిదండ్రులు వెదుకుతూ ఉన్నారు.


తల్లి చిన్ననాటి స్నేహితురాలి కొడుకట. ఒకవేళ ఈ పెళ్ళికుదిరితే , స్నేహితురాళ్ళిద్దరూ కలిసి చేసుకోగల షాపింగ్ వేడుకల కలలు కనేశారు.
తల్లిని నిరాశ పరచడం ఇష్టం లేక ఆ అబ్బాయిని ఒక హోటల్ లో పూల్ పక్కనున్న రెస్టారెంట్ లో లంచ్ టైమ్ లో కలిసింది.


"మీరెక్కడ పని చేస్తుంటారు" అని అడిగింది

అతను పని చేసే కంపెనీ పేరు చెప్పి , తను చేరక ముందు అదెంత దిక్కుమాలిన స్థితిలో ఉందో, తను చేరి, చావడానికి సిద్ధంగా ఉన్న ఆ కంపెనీకి ప్రాణప్రదానం చేసి ఎలా కొత్తజన్మనిచ్చాడో, మూలస్తంభం లా ఎలా నిలబడ్డాడో , తను లేకపోతే అతను పనిచేస్తున్న కంపెనీ ఏ రకంగా కుప్పకూలగలదో, వివరించాడు.

"మా బాస్ కు నేనంటే చచ్చేంత నమ్మకం. నేను లేకపోతే బోర్డ్ మీటింగ్ కూడా పెట్టుకోడు. పక్కన నేను లేకపోతే ఆయనకు కాలూ చెయ్యి ఆడదు. మంచోడే కానీ పిచ్చోడు. ఉట్టి బుర్రలేని మేళం.”

ఆమె గురించి అడిగాడు.


ఆమె వృత్తి వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోతూ,

"ఇంత చిన్న వయసులో ఎలా? అసలెలా సాధ్యం. మీరింత సుకుమారం గా ఉండి, ఇన్ని పనులు ఒక్కరే చేయడం అమేజింగ్." నమ్మలేకపోతున్నట్లు ఓ లాగా తలవిదిలించాడు.

తన గురించి సుకుమారం అనే మాట వాడడం ఆమెకు నచ్చలేదు.

ఆమెలో అందం, తెలివితేటలు, పట్టుదల, సామర్ధ్యం అన్నీ కలిసి ఉన్నందుకు విస్తుపోయాడు. ఆమె తెలివితేటలను పొగుడుతూ, ఆశ్చర్యపోతూ అలిసిపోతున్నాడు.

"మీరు సామాన్యులు కాదు, మీతో చెతుర్లు కాదు " అంటూ అప్పుడప్పుడు అభినందనలు విసిరేస్తూ intellectual flirting చేస్తున్నాడు.

ఆమె హాబీలడిగాడు.

" ఖాళీగా ఉండే టైము తక్కువ. ఆదివారం సాయంత్రం అమ్మానాన్నతో గడుపుతాను.” అని చెప్పింది.


"నాకు ఫ్రెండ్స్ బాగా ఎక్కువ. స్నేహితులంటే ప్రాణమిస్తాను. మొన్న నా స్నేహితుడి చెల్లెలి పెళ్ళి సందర్భంలో అన్నీ దగ్గరుండి నేనే చూసుకున్నాను. కొంత డబ్బు సహాయం కూడా చేశాను. నాకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువని నేను లేకపోతే పార్టీ చేసుకోడానిక్కూడా ఇష్టపడరు ఫ్రెండ్స్.”

  మధ్యలో ఏదో ఫోన్ కాల్ మాట్లాడాడు. ఆమె ఎదురుగానే కూర్చుని ఆఫీసు వ్యవహారాలు చక్కదిద్దుతున్నాడు. ఫోన్లో అవతలివేపు మనిషితో క్లయింట్కి ఏం లెటర్ పంపించాలో వివరించాడు. తననడక్కుండా సొంత నిర్ణయం తీసుకున్నందుకు చీవాట్లు పెట్టాడు.

మొబైల్ ని రెండు చేతులమధ్యా పెట్టి, చటుక్కున పర్స్ మూసి నట్లు మూసేసి తన అసహనాన్ని తెలియజేశాడు. అసలు బుర్రలేని మనుషులెలా జన్మిస్తారు అని ఇంగ్లీషులో ఈమెనడిగాడు

దేవుడెంత పక్షపాతి, ఎవరికీ పెట్టని తెలివి, చురుకుదనం, జాలిగుణాలు, సెన్సాఫ్ హూమర్లూ అన్నీ రోటి పచ్చడి చేసి ఈయన బుర్రలోనే కూరాలా? పనుందని లేచి వెళ్ళిపోవాలనుకుంది. ఏ రకంగానూ అతన్ని చిన్నబుచ్చకూడదని తల్లి మాట తీసుకుంది.


"ఆకలిగా ఉంది తినడానికి లేద్దామా" అని బఫే దగ్గరకు తీసుకెళ్ళింది.

" నాకు మనవైపు వంటలే ఇష్టమండి. ఎక్కడికి వెళ్ళినా అన్నం , రసం కోసం చూస్తాను.”అంది.

"అదేమిటి మీరు చూడ్డానికి ఇంత మోడర్న్ గా ఉన్నారు, అన్నం , రసం తింటారా?" అతను ఆశర్య పోయాడు.

"ఏమో, మన వంటల్లో ఉన్న రుచి నాకింక ఎక్కడా దొరకలేదు. ఒక వేళ మిగతావి ట్రై చేసినా ఏదో ఒకటి రొండు సార్లు, అంతే, మళ్ళి అన్నం , పప్పూ, పచ్చడి తినకపోతే నా వల్ల కాదు.”

అలా తిండి మీద మొదలెట్టిన సంభాషణ, ఏ రెస్టారెంట్ లో ఏ పదార్ధం బాగుంటుంది, సరైన ఫిల్టర్ కాఫీ అడ్రస్ ఎక్కడా ఇలాంటివి మాట్లాడుకున్నారు.

విడిబోయే ముందు " చాలా బాగుందండీ . గుర్తుంచుకోదగిన లంచ్" అంటూ అతనికి చెప్పి వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె పెళ్ళికి సంబంధించిన ఏ విషయమూ మాట్లాడలేదనీ, సాంబారూ రసం అంటూ టైమ్ గడిపేసి వెళ్ళిందనీ అర్ధమైంది. పరీక్ష ఫలితం తెలిసిపోయింది అతనికి. ఇలా కూడా నో చెప్పవచ్చా అని విస్తుపోయాడు.

'పెద్ద ఉద్యోగం, ఎంతో మర్యాదస్తుడు. ఉన్నంతసేపూ ఆంటీ ఆంటీ అని చూట్టూతా తిరిగాడు. చేసుకోడానికేం' అంటూ అమ్మ బాధపడింది.


ఇంకో సంబంధం తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. అతనో సూపర్ స్పెషలిష్ట్ డాక్టర్.
ఆజాను బాహుం అరవింద దళాయ తాక్షం.

అతన్ని చూడగానే ఎవరికైనా పౌరాణిక సిన్మా ఏక్టర్లు గుర్తుకొస్తారు. తాతలు, తండ్రులు, మేనమామలు ఎస్ వీ ఆర్, ఎన్ టీ ఆర్, ముక్కామల స్థాయి మనుషులైఉంటారు. లేకపోతే అంతటి విగ్రహం అసాధ్యం.
చతురస్రాకారపు ముఖంలో సిమ్మెట్రికల్ గా అమర్చబడిన పెద్ద కళ్ళు. చక్కటి ముక్కు. తెల్లగా ఉన్నాడు. మచ్చలేని తెల్లదనం, అంతకన్నా తెల్లని బట్టలు. కాలిగోరుకూడా శుభ్రంగా ఉంది. అందం అనే పదం ఎక్కువగా ఆడవాళ్ళే వాడేసుకుంటూ ఉంటారేమో, పాపం ఇతనికోసం కూడా వాడాలి.

మెత్తని గొంతు, చిత్తూరినాగయ్య నుండి వడ్డీకి అరువు తెచ్చుకున్నకిలోలకొద్దీ సౌమ్యత. , ప్రతి మాట లోనూ సహజంగా పలుకుతున్న అతిమంచితనం.


ఆమె ఆఫీసుకే వచ్చి కలిశాడు. తన పని గురించి చెప్పాడు.

"ఎన్నో రాత్రులు నిద్ర ఉండదు. పేషెంట్ కు ఆరోగ్యం బాగయ్యే వరకూ అదే ఆలోచనగా ఉంటుంది. ఆ వత్తిడిని తట్టుకునేందుకు భార్య సహకారం చాలా అవసరమవుతుంది.”

ఆమెకూడా డాక్టరే అయితే , ఇతన్ని చూసుకునే టైము ఆవిడ దగ్గర ఉండదు, కనక తీరికగా సేదదీరలేడు. పైగా భార్యకూడా ఒకే వృత్తి అయిన పక్షం లో జీవితంలో వైవిధ్యం కోల్పోయే ప్రమాదముంది కనక వేరే వృత్తిలో ఉన్న పెళ్ళికూతురికోసం చూస్తున్నాడు.

అతనితో తృణీకరించబడిన డాక్టరమ్మలు ఈమెను చూస్తే అసూయపడతారట. తమకు దక్కని అదృష్టం చేజిక్కించుకున్న తోటి ఆడపిల్లను చూస్తే అసూయ కలగదా మరి!

తన విషయాలు చెప్పేసి, కొద్దిగా నిట్టూర్చాడు. కుర్చీలో వెనక్కి వాలి ఆమె టేబిల్ మీద అతని నాజూకు వేళ్ళ తో చేసే విన్యాసం ద్వారా సంగీతం పలికించడానికి ప్రయత్నిస్తూ, "ఊ మీరు చెప్పండి, ఏం చేస్తుంటారు, అసలు టాక్స్ కన్సలెంటెంట్ అంటే ఏవిటీ?" అని అడిగి అలాంటి విషయాలపట్ల డాక్టర్ల కుండే సహజమైన అజ్ఞానాన్ని ప్రదర్శించాడు.

ఆమెకెందుకో ఏమీ చెప్పాలని అనిపించలేదు. " అదేమీ అంత కాంప్లెక్స్ విషయం కాదు" అంది.

"అఫ్ కోర్స్, మీరలా మా ప్రొఫెషన్ తో పోల్చుకుని ఫీలవకండి. పర్లేదు చెప్పండి. అసలీ విషయాలు తెలుసుకునే టైముండదు నాకు" ఆమెకో అవకాశమిచ్చాడు తన జ్ఞానశూన్యత అదనపు అర్హతగా భావిస్తూ.

ఎదురుగా ఉన్న ఫైల్ మూసేసి " నేను వెళ్ళాల్సిన టైం అవుతోంది ."

"ఎక్కడికి వెళ్ళాలి?"

"ప్రతినెలా ఒక వారం నేను మా బ్రాంచ్ ఆఫీసు పనులు సూపర్ వైజ్ చెయ్యడానికెళ్తాను"

"మరి పెళ్ళి అయితే" ఈ నామమాత్రపు మాటల తతంగం తర్వాత పెళ్ళేకదా అన్న ఉద్దేశ్యంతో.

"పెళ్ళికి, నా పనికి ఏం సంబంధం?"

"కొంచం టైముందా నేను మాట్లాడటానికి"

టైం చూసి "ఎయిర్ పోర్ట్ కెళ్ళాలి. ఇంటికెళ్ళి నా బేగ్ తీసుకుని వెళ్తాను.” అంది. పోనీ వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం అన్నాడు. తన డ్రైవర్ తో కారు తీసుకెళ్ళి హాస్పిటల్ దగ్గర పెట్టమని చెప్పి ఆమెతో బయలు దేరాడు.

ఆమే డ్రైవ్ చేస్తూ ఉంది.

"మీరిలా ఊళ్ళు తిరుగుతూ కష్టపడాల్సిన అవసరమే లేదు. మీ నెల సంపాదన నేను రెండు ఆపరేషన్లు చేస్తే వచ్చేస్తుంది. మరీ ఖాళీగా ఇంట్లో ఉండలేరనుకుంటే నా హాస్పిటల్ ఎకానమీ మీరే డీల్ చెయ్యొచ్చు." ఏమాట మాట్లాడుతున్నా సరే, గొంతులోని మెత్తదనం చెదరనివ్వడం లేదు.

ఆమె దృష్టి అంతా ట్రాఫిక్ మీదే ఉంది.

ఏమీ మాట్లాడలేదు.

"ఇంకో మాట, నాకు పెద్దగా ఖాళీ దొరకదు. మీకు ఒకె అయితే వచ్చే నెలలో ముహూర్తాలున్నాయట. ఈ నెల చివరివారం నేను సెలవు తీసుకుంటాను. అప్పుడు పెళ్ళి షాపింగ్ లాంటివి చేసెయ్యొచ్చు." అతన్ని ఒకె చెయ్యకపోడానికి భూమ్మీద ఏ ఆడపిల్లకైనా ఏమి అభ్యంతరం ఉంటుంది? అందగాడు, సంపాదనపరుడు, హోదా, సుతిమెత్తని పంచదార చలివిడి లాంటి మనిషి. కాదనడానికేముంటుంది?

"ఏమంటారు? " ఆమె ఏమీ మాట్లాడకపోవడం చూసి అడిగాడు.

కారాపింది.

To be continued 



15, నవంబర్ 2012, గురువారం

నిన్ను నిన్నుగా....1


కథలోకి వెళ్దామా...          

      అదో మంచి ఊరు. మంచి ఊరంటే ... సూర్యదయాల్ని కప్పేసే కట్టడాలు లేని ఊరు. ఊరి నిండా పచ్చని చెట్లు. రోడ్డు పక్కన కంచె లేని మామిడి తోటలు. కురచ మామిడి చెట్లు. కాయలు కోసుకోవాలంటే చెట్టెక్కాల్సిన పని లేదు కాయలే నేలకానుతూ ఉంటాయి. రోడ్డు పక్కన ఎక్కడ చూసినా క్రమశిక్షణ లేకుండా చిత్తువత్తుగా విరగ బూసిన జూకా మందారాలు. ఆ పక్కనే చెరుకు తోటలు. చెరుకు గడను విరిచి తినాలంటే ఎవరి అనుమతీ అక్కర్లేదు. అదేమంత తప్పు కూడా కాదు. కంది చేలల్లోకి అలా వెళ్ళి కాసిని పచ్చి కందికాయలు మధ్యలో చీల్చి తినేయొచ్చు. కానీ భద్రం, అప్పుడప్పుడు పురుగు మందు చల్లుతారు.

స్కూలు, బేంక్ లాంటి సదుపాయాలున్న చిన్న ఊరు.

   మురళి వాళ్ళ నాన్న కు హెడ్ మాస్టారిలా అక్కడికి బదిలీ అయినప్పుడు, అద్దె ఇంటికోసం వెతుకుతుంటే, ఊరి చివరన ఉన్న అనూ వాళ్ళ ఇల్లు చూపించారు. రెండు అంతస్తుల డాబా ఇల్లు. ఖాళీగా ఉన్న పై అంతస్తు మాష్టారికి అద్దెకిచ్చారు. కొంత ఎత్తు మీద ఇల్లు కట్టడం వల్ల ఇంటి వెనక వైపు పెద్ద లోయలా ఉండేది. లోయలో ముదురాకు పచ్చని ఎత్తైన చెట్లు. వర్షం పడేప్పుడు, ఇంటివెనక వైపు బాల్కనీలో కూర్చుని లోయలో పడే వర్షాన్ని చూడాల్సిందే కానీ అదెలా ఉంటుందో చెప్పడానికి కుదరదు.

     మాష్టారే ఇంట్లో అద్దెకుండడం తో అనూ కోసం ట్యూషన్ చెప్పేవారు లేరన్న బెంగ తీరింది. అనూ అప్పటికి ఎనిమిదో క్లాసు చదువుతోంది. చురుకైన అమ్మాయి. అల్లరి చిల్లరి వేషాలకు దూరం. క్లాసులో ఫస్ట్ రావడం ఒక్కటే ఆమెకు బాగా ఆనందం కలిగించే విషయం. తన బదులు ఇంకెవరైనా మొదటి స్థానం లో ఉంటే ఆమె తట్టుకోలేక పోయేది. ఆ పరిస్థితి రానీయకుండా ఎప్పుడూ శ్రమ పడేది. క్లాసులో టీచర్లందరూ ఇష్టపడతారు కానీ క్లాసు పిల్లలు ఆమెకు దూరంగా ఉండేవాళ్ళు. మిగతా పిల్లలతో కలవలేకపోవడం అనేది ఆమెకో ఇబ్బంది అనిపించేదికాదు.

   మురళి ఆ స్కూల్లో చేరే వరకూ ఆమెకు క్లాసులో ఎదురులేదు. అతను ఏ పాఠమైనా ఒప్పజెప్పడానికి చాలా తక్కువ సమయం తీసుకునేవాడు. ఇంకా తక్కువ టైం లో ముత్యాల లాంటి చేతి రాత తో కొట్టివేతలు లేకుండా వ్రాసి చూపించే వాడు. అతని చదివే పద్ధతిలో వేగం టీచర్లకే కాదు, తోటి పిల్లలకు కూడా వింతగా ఉండేది.  

అలా అని చదువే లోకం లా ఉండేవాడుకాదు. అతనికున్న తెలివితేటల గురించి అతనికేం పట్టనట్లు ఉండేవాడు. పిల్లలతో కలిసి ఇంటి ముందు ఆటలాడేవాడు. బాగా చదుతాననో, మాష్టారి గారి అబ్బాయిననో అహం చూపించకపోవడంతో పిల్లలందరికీ నచ్చాడు.

ఇంట్లోనూ, తోటిపిల్లలకు సహాయం చేసే వాడు. అనూ వాళ్ళ అమ్మకు కూడా ఏది కావాలన్నా మురళీనే పిలిచేది. "మురళీ కర్వేపాకు అందుకో అనో, బజారెళ్ళి వాము తీసుకురా" అనో పురమాయించేది.
అప్పుడప్పుడు తల్లికి వంటలో సహాయం చేస్తూ కనిపించేవాడు. రాత్రి పూట మేలుకుని చదువుతాడేమోనని ఆరాతీసింది. అదీ కాదు. ఎప్పుడు చదువుతాడో అంతుబట్టేది కాదు అనూకి.

ఆమె లెక్క చేసి చూపించే లోపల అతను రెండు మూడు పద్ధతుల్లో చేసి చూపించేవాడు.

"ఎలా చేశావు ? రాత్రి మాష్టారి దగ్గర స్పెషల్ ట్యూషన్ చెప్పించుకుని ఇప్పుడు మొదటి సారి చేస్తున్నట్లు మా ముందు ఫోజు కొడుతున్నావు కదూ " అని కోపం గా అడిగింది.

మురళి ఏదో చెప్పబోతే వినిపించుకోకుండా మాష్టారినే అడిగింది. "మాష్టారూ, ముందే మీదగ్గర చెప్పించుకున్నాడు కదూ" అని.

అనూ ని తన పడక్కుర్చీ పక్కనే కూర్చోబెట్టుకుని "లేదు నాన్నా, నాకు మీరెంతో వాడూ అంతే, వాడికి ఒక్కటి కూడా మీకన్నా ముందు చెప్పను, ఎక్కువ చెప్పను"

"మరి ఎలా చేస్తున్నాడు మాష్టారూ ?”

"వాడు ఎలా చేస్తున్నాడో నాకూ తెలియదు. ఒక్కో సారి వాడు చేసే పద్ధతులు నాకూ కొత్తగానే ఉంటాయి.”

మొదటి సారి, ఆమెకు క్లాసు ఫస్ట్ దక్కకుండా పోయింది.

క్లాసులో తనకన్నా ఎక్కువ మార్కులు రావడం, పిల్లలంతా మురళీ, మురళీ అంటూ వెంటపడటంతో అనూకేమీ నచ్చలేదు.

  డిబేటింగ్, వ్యాస రచన పోటీల్లో ఇదివరకెప్పుడూ అనూకే వచ్చేవి ప్రైజులు. ఆమె తప్ప ఆ స్కూల్లో పెద్దగా మాట్లాడగలినదీ ఎవరూ లేకపోవడం ఒక కారణం. మురళి వల్ల ప్రైజులు ఇద్దరూ చెరిసమానంగా పంచుకోవాల్సి వస్తోంది.
అడుగడుగునా ఆమెతో పోటీ పడుతూండడం వల్ల, మాష్టారి దగ్గరకు ట్యూషన్ కు వెళ్ళినా, అతనితో సరిగా మాట్లాడేది కాదు.

   మాష్టారు పని మీద బయటికి వెళ్ళినపుడు ట్యూషన్ పిల్లలతో లెక్కలు తనే చేయించే వాడు. ట్యూషన్ లో మిగతా అమ్మాయిలందరూ అతనితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించడం అనూ కు చిరాకు వేసేది. మరీ అతి చేస్తున్నాడు. మంచివాడిలా కనిపించడానికే ఈ వేషాలు అనుకుంది.

అందరికన్నా వరలక్ష్మి ధోరణి భరించలేనట్టుగా ఉంది. మురళి కనిపించగానే బోడి నవ్వులు, తిక్క వేషాలు. అవసరమున్నా లేకపోయినా తట్టెడు అనుమానాలతో మురళి పక్కనే కూర్చుంటుంది. అతనితో లెక్కలు చెప్పించుకోవడం, ముసిముసిగా నవ్వుతూ థాంక్స్ చెప్పడం చూస్తే అనూకి ఎక్కడలేని కంపరం కలుగుతోంది. మాష్టారి చెప్పిన దానికన్నా, మురళి చెప్తేనే బాగా అర్ధం అవుతోందట ఆ పిల్లకు.

రెండు జడలు వేసుకుని రిబ్బన్ తో పైకి కట్టి ఒక జడ ముందుకు, ఇంకో జడ వెనక్కూ వేసింది. ముందుకు పడిన కుడివేపు జడలో క్రితం రాత్రి దణ్ణెం మీద మంచులో తడిసిన మల్లె చెండు. వరలక్ష్మి, మురళితో మాట్లాడున్నపుడు అవికూడా ఊగుతూ ఉన్నాయి. వాళ్ళ అమ్మ చూడాలి దీని వేషాలు. జడపట్టి ఒక్క గుంజు గుంజి ఇంటికి లాక్కెళ్తుంది.
పరీక్షలు దగ్గర పడుతుండగా, అనూకి జ్వరమొచ్చి వారం రోజులు స్కూలు మానేయాల్సివచ్చింది. తను రాని క్లాసుల నోట్స్ వ్రాసుకుంటానని క్లాసులో ఎవర్ని అడిగినా తలా ఒక సాకు చెప్పారు.

'మా అమ్మ కోప్పడతారోయ్'

'నేనూ సరిగా వ్రాసుకోలేదు'

'నాన్నారు ఇవాళ ఇంటి దగ్గర చదివిస్తానన్నారు.'

'మురళి ఉండేది మీ ఇంటి పైనే కదా, అతని దగ్గర తీసుకో' అని ఉచిత సలహాలు చెప్పారు.

ఎలా ? పరీక్షలు దగ్గరవుతున్నాయి. మురళీని అడగబుద్ధి కాలేదు.

ఏం చెయ్యాలో తోచక కూర్చుని సైన్స్ టెక్స్ట్ తీసింది. ఏమీ అర్ధం కావడం లేదు.

దిగులుగా కూర్చుంటే మురళీ వచ్చాడు నోట్ బుక్ తో.

"ఏంటీ?" అసలే కోపంగా ఉందేమో, విసురుగా అడిగింది.

"నువ్వు అటెండ్ అవని క్లాసుల నోట్స్ అనూ." అన్నాడు.

"నోట్స్ నాకిస్తే మరి నువ్వేం చదువుతావు.”

"ఇది నీకోసమే రాశాను. నా నోట్స్ వేరే ఉంది" అన్నాడు.

"ఒహో బాగా మంచివాడివని నేను కూడా అనుకోవాలి కదూ? పర్లేదు నేను ఎలాగో వ్రాసుకోగలను. నీ హెల్ప్ నాకక్కర్లేదు " అంది.

ఇంతలో అనూ వాళ్ళమ్మ వచ్చి , 

" ఏవిటా మొండితనం తీసుకో." అంటూ అనూని కోప్పడి, "ఈ జ్వరమొచ్చిన తర్వాత బక్కకోపం ఎక్కువైంది బాబూ నువ్వేం అనుకోకు " అని మురళితో చెప్పింది. మురళి మీద కోపం తల్లిమీద విసుగు గా మారింది.

నోట్ బుక్ కిటికీలో పెట్టి వెళ్ళిపోతున్నాడు.

కోపంతో పుస్తకం విసిరికొట్టబోయి ఆగి 'అమ్మో సరస్వతీ దేవి' అనుకుని పుస్తకం కళ్ళకద్దుకుంది.

పదవతరగతి పరీక్షలైనాయి.

మాష్టారికి బదిలీ అయే సూచలున్నాయని తెలిసి అనూ తల్లిదండ్రులు బాధ పడ్డారు.

"మీరిక్కడికి రావడం, అమ్మాయి చదువుకు ఎంతో ఉపయోగపడింది. మీరెళ్ళిపోతే ఎక్కువగా బాధపడేది మేమే. అమ్మాయికి భవిష్యత్తులో ఎలా చదవాలో, పెద్దయిన తర్వాత ఏం అయితే బాగుంటుందో మీరో మాట చెప్తే బాగుంటుంది. ” అన్నారు.

మాష్టారు, పిల్లలిద్దరినీ తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఇంటర్ లో తీసుకునే సబ్జెక్ట్లు, పై చదువులు గురించి, మాట్లాడుతూ, వాళ్ళేం కావాలనుకుంటున్నారో ఏ వృత్తి పట్ల ఆసక్తి ఉందో చెప్పమన్నారు మాష్టారు.

"ముందు తనని చెప్పమనండి" మురళీ నుద్దేశించి అంది అనూ.

"లేడీస్ ఫస్ట్ అంటారుగా తనే చెప్పాలి ముందు " .

"నేను ఆడపిల్లనని, ముందు అవకాశం ఇచ్చినట్లు మాట్లాడితే నాకు నచ్చదు మాష్టారూ " రోషంగా అంది.

"సారీ ” అనూ వంక చూస్తూ చెప్పాడు.

అది పట్టించుకోనట్లు "మాష్టారూ, మీరెళ్ళిపోతే నాకెవరు చెప్తారు ఎలా చదువుకోవాలో, ఎలాంటి ఉద్యోగం చెయ్యాలో? తనకేమో మీరెప్పుడూ పక్కనే ఉంటారు. అన్నీ చెప్తారు. మరి నన్నెవరు గైడ్ చేస్తారు?” అంది అనూ.


"అనూ, నా స్టూడెంట్స్ అందర్నీ, పిల్లల్లానే అనుకున్నానమ్మా. రేపు వీడి కన్నా కూడా నువ్వు మంచి స్థితిలో ఉంటే మీ అమ్మానాన్న లాగే సంతోషిస్తాను. నేను లేకపోయినా, నాకన్నా మంచి మాష్టారికి ఒప్పజెప్తాను.”

"ఎవరైనా ఒకటి రెండేళ్ళేగా మాష్టారూ, తనకేమో ఎప్పుడూ ఉంటారు మీరు. గొప్ప ఉద్యోగం తెచ్చుకుంటాడు. మరి నాకెవరున్నారు.”

"రేపు నేను చూపించబోయే ఆయన, నన్ను మించిన గురువు. అంతకన్నా మించి గొప్ప ఉద్యోగి. నాకు తెలిసి ఆయనను మించి గొప్పగా ఉద్యోగం చేయగలవాళ్ళని నేను చూడలేదు. ఆయనను ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో చాల పైకొస్తావు అనూ. దిగులుపడొద్దు.”

"ఆయన ఎక్కడ చేస్తారు ఉద్యోగం? మన ఊళ్ళోనేనా?”

"మన ఊళ్ళో నేకాదు, చాలా ఊళ్ళల్లో...”

"అంటే ప్రయాణాలు చేస్తుంటారా?”

"ప్రయాణాలు చేస్తున్నట్లే ఉంటారు.”

“ అసలేం ఉద్యోగం చేస్తారు?"

"బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ వచ్చిందా?”

పిల్లలిద్దరూ ప్రశ్నల మీద ప్రశ్నలేస్తుంటే మాష్టారు ఆపి

"ఇంతవరకూ ఎవరూ ఏ అవార్డూ ఇవ్వలేదు. అన్నీ ఆయననే అడగొచ్చు.తొందరెందుకు రేపటి వరకూ ఆగండి.”

మీరు కూడా.
..To be continued

14, నవంబర్ 2012, బుధవారం

నిన్ను నిన్నుగా....


కమలం లా వికసిస్తే కనుచూపు మేరలో నేను.

కలువలా విచ్చుకుంటే కనుమరుగవుతాను.

వేళకొచ్చే నాకు నీ వేడుకే చాలు.

నుదిటి సూరీడులా నీ దారి వెలుగవ్వనీ..


     ఇళ్ళ ముందు పిల్లలు పెద్దవాళ్ళు గోల గోల గా అరుచుకుంటూ టపాకాయలు కాలుస్తున్నారు. అమ్మా నాన్న ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉండి ఉంటారు. దీపావళి టపాసులు కాల్చి కొన్ని సంవత్సరాలైంది. అందరి ప్రహరీ గోడలమీదా దీపాలు. కొన్ని ఒంటరి దీపాలు. వాటిని చూస్తే జాలి కలిగింది. ఇంటికి చేరాడు. గాలి ఎక్కువగా లేదేమో తమ ఇంటి గోడల మీద, మట్టి ప్రమిదల్లో జోడు వత్తుల నూనె దీపాలు. సంతోషం గా కబుర్లాడుకుంటున్నట్టు ఉన్నాయి. గుండెలో ఆశ నింపాయి.

    తలపైకెత్తి చూశాడు. చిన్ని చిన్ని ఎలెక్ట్రిక్ దీపాలు మాలలు మాలలు గా పైనుండి వేలాడుతున్నాయి. గేటు తీసి లోపలకెళ్ళాడు. బయట మనుషులెవరూ లేరు. దీపాల వెలుగులో పచ్చిక మెరుస్తూ ఉంది. తెల్లని పాలరాతి వరండా మెట్ల మీద వరసగా అమర్చిన ప్రమిదల్లో వెలుగుతున్న వత్తులు. గుమ్మాలకు గుత్తులుగా వేళాడుతున్న బంతిపూల మాలలు. ఇల్లంతా బంగారపు కాంతి.

సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుంటానని అమ్మ చెప్పింది. ఏదైనా పేరంటం లాంటిది జరుగుతూ ఉండి ఉంటుందనుకుని ఇంటి బయట లాన్ లోనే పాలరాతి బెంచీ మీద కూర్చున్నాడు. అప్పటికి టపాసుల శబ్దాలు పలచబడ్డాయి. గాజుల అలికిడికి తలతిప్పి చూస్తే........నమ్మలేనంత వింత గా ఆమె. ఆమె తమ ఇంట్లోనా? ఎలా సాధ్యం?

పేరంటానికి ఆమెను కూడా పిలిచిందా అమ్మ. కానీ ఇలాంటి రూపంలో ఎప్పుడూ చూడలేదే తనను.

తెల్లటి పట్టు చీరకు చిన్న జరీ అంచు. మెడలో ఒంటి వరస ఎర్ర రాళ్ళ హారం. ఆమె ఆమేనా? అవును కానీ ఆమెనెప్పుడూ ఇలా చూడలేదే? ఎప్పుడూ స్వేచ్ఛతో గాలిని పలకరించే జుట్టు వెనక్కి తగ్గి, జడ లాగా అల్లుకుపోయి ఉంది. షర్ట్ అడుగున అజ్ఞాతంలో ఉండే తెల్లని చేతులు బయటకొచ్చి గాజుల్లో బందీలైనాయి.

ఆమె చేతులకు గాజులా? నుదుట ఎర్రటి బొట్టు. జుట్టు, బొట్టు, చీర, మెడలో హారం, గాజులు, వేటికవి వేటికవి చూస్తే అందంగా ఉన్నాయి. అన్నీ కలిసిన అద్భుతాన్ని దగ్గర్నుండి చూస్తూ ఉంటే మతి పని చెయ్యడం లేదు. అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం అవసరం, అదృష్టం కూడా.

దగ్గరకొచ్చి అతన్ని చిన్నగా తాకింది. ధ్యానం లోకి వెళ్ళడం సులభమే, బయటకు రావడం ఎంత కష్టం ! మాట్లాడితే కల చెదిరిపోతుందేమో, మాట్లాడకపోతే ఆమె అలిగి వెళ్ళిపోతుందేమో

"ఎంత బాగున్నావు?” అప్రయత్నంగా అన్నాడు.

నవ్వింది.

ఇలాటి మాటలు నచ్చవు ఆమెకు. కోప్పడదే. నవ్వుతుందే మరి?

"కోపం తగ్గిందా?”

"అదెప్పటికీ తగ్గదు. తగ్గకూడదనే అనుకుంటున్నాను." అతని కళ్ళలోకి చూస్తూ అంది. ఆ మాటల్లో కానీ, చూపుల్లో కానీ కోపం లేదు.

"వచ్చావుగా మరి.”

"వచ్చింది నీకోసం కాదు.”

అతనేం మాట్లాడలేదు. చిరునవ్వుతో అలానే నుంచుంది.

"ఎంతసేపు అలా నిల్చుంటావు. కూర్చో" అన్నాడు పక్కకు జరిగి.

"నాకేం నీ మర్యాదలు అక్కర్లేదు" చీర కుచ్చిళ్ళు సరి చూసుకుంటూ కూర్చుంది.

"చీరలో బాగున్నావు అనూ" అభిమానంగా చెప్పాడు.

కాబోయే అత్తగారు బహుమతిగా ఇచ్చారని ఇంగ్లీషులో చెప్పింది.

అత్తగారు చీరపెట్టారా? నిశ్చితార్ధం అయిందా? మనసు అతన్ని ప్రశ్నలడుగుతోంది.

"పెళ్ళెప్పుడు? " అడిగాడు బలహీనంగా

"తొందర్లోనే.”

"అబ్బాయి?”

"నీకూ తెలుసు" మామూలుగా చెప్పింది.

నాకూ తెలిసిన వాళ్ళా? ఎవరై ఉంటారు?

"అదృష్టవంతుడు.” అన్నాడు.

"నీకే అదృష్టాలు అవసరం లేదుగా " అంది.

"అంతమాటనకు అనూ, ప్లీజ్"

ఎవరో వస్తున్నట్లు అలికిడి అయితే ఆమె వెనక్కి తిరిగి చూసింది.

(To be continued)


  

15, అక్టోబర్ 2012, సోమవారం

చులకనగా చూడకు దేన్నీ



    మన సినిమాల్లో హీరోయిన్ వెంట ఒక ప్రేమికుడు పడుతూ ఉంటాడు. వాణ్ణి చీదరించుకుంటూ, ఛీత్కరించుకుంటూ రీళ్ళన్నీ తినేస్తుంది. సిన్మాలో మిగతా కేరక్టర్ ఆరిస్టులందరూ తెగతిట్టిన తర్వాత రియలైజ్ అయి వాణ్ణి వెతుక్కుంటూ పోతుంది. అలా పోతుండగా బాగా ఆకలేసి ఒక కల్యాణమండపంలోకి వెళ్తుంది. పెళ్ళిలో దొంగ భోజనం చేద్దామని. అక్కడ ఇంకో ఆవిడమీద తలంబ్రాలు పోస్తూ హీరో కనబడతాడు . ప్రేమికుడి మీద అక్షింతలు వేసి, వెనక్కి వచ్చి ట్రాఫిక్ సమస్య లేని రోడ్డు మీద ఒంటరిగా ఎటో వెళ్ళిపోతుంది.

మనకు చిరాకొస్తుంది. ఏవమ్మా, మరీ తెగేవరకూ లాక్కపోతే ఏం, అప్పుడప్పుడు వాడివంక ఎంకరేజింగ్ గా చూసి నవ్వితే నీకీ గతి పట్టకపోను కదా అనుకుంటామా లేదా?

నీతేమిటంటే, మరీ వెంటబడుతున్నారు కదా అని చులకనగా చూడకూడదు. ఒకానొక సమయం లో నేను కూడా ఆ హీరోయిన్ లానే ప్రవర్తించాను.

ఇక చదవండి.

మీ పిల్లల్లాగే, మా పిల్లలూ ఆదివారం రోజు మాత్రం నాలుగింటికో అయిదింటికో తెల్లారకుండానే, నిద్రలేస్తారు. నా కళ్ళరెప్పలు లాగి లాగి వాటికింద కనుగుడ్లు చూసి, "అదుగో ఏక్షన్ చేస్తన్నావు, నువు మెలుకూగా ఉన్నావుగామ్మా, లే లే , మాటలూ చెప్పుకుందాం" అంటూ నన్నూ లేపుతారు.

రాత్రి ఇంటికొచ్చేసరికే రెండయ్యింది. సన్నటి ఇసక, పచ్చిమిరపలు కచ్చాపచ్చాగా దంచిన పచ్చడి రుచి కళ్ళలో తెలుస్తుండగా, " సరే చెప్పండి నేను వింటాను" అన్నాను. వాళ్ళదారిన వాళ్ళు ఎంతైనా వాగుతూ పోనీ! నేను ఎలాగైనా నిద్రపోదామన్న యుక్తితో.

"మనం మాట్టాడుకుంటుంటే నాన్నకి డిస్త్రబెన్స్. లే మరీ! హాల్లోకెల్లి లైటేస్కుని చెప్పుకుందాం".
పిల్లల ప్రేమ రుచి ఎరగని ఆ గురకల  తండ్రి ఎంత దురదృష్టవంతుడు. బ్రాహ్మీ ముహూర్తంలో పిశాచ గణ కోలాహలాన్ని వినగల ఈ మహత్తర అవకాశం మరియు ఇంతోటి అధిక ప్రేమ నాకే దక్కినందున, విసుగు కనపడనీయకుండా తీవ్రమైన సంతోషం కనబరుస్తూ సోఫాలో కూలబడ్డాను. ఇద్దరూ చేరోవైపున చేరి, నామీద వాళ్ళ కాళ్ళూ చేతులూ యధేచ్ఛగా పారేసి, జన్మతః సంక్రమించిన హక్కులు అనుభవిస్తున్నారు.

ధరణికి గిరి భారమా,
చెట్టుకు కాయ భారమా?

క్రితం రోజు చూసిన ఓ ఇంగ్లీషు సిన్మా విశేషాలు నాతో చెప్తారట. నేనా కబుర్లు వింటే భలే సంతోష పడతానట. వీళ్ళకు నాతో కబుర్లేమిటీ? కయ్యమైనా, నెయ్యమైనా సమానమైన వాళ్లతో చెయ్యాలంటారుకదా, వీళ్ళు నాతో దేనిలో సమానం. పిల్లకుంకలు , వీళ్ళెంత, వీళ్ళ స్థాయి ఎంత?

నా అనుమతి లేకుండానే మొదలెట్టింది కథ.

"మరే , మరే, ఒకడు నిద్ర పోతంటాడు. అహా, కాదు, ముందు ముందు ఆళ్ళమ్మొచ్చి, రాత్రి పొడుకోబోయే ముందు ముద్దు పెట్కుని దుప్పటి కప్పి, కాదు కాదు ముందు దుప్పటి కప్పి తర్వాత ముద్దు పెట్కుని రాత్రంతా ఆడిపక్కనే ఎల్లిపోకుండా కూచ్చుని, కథ చెప్తా పక్కనే కూచ్చుంటది.”

నా తద్దినానికొచ్చి వీళ్ళు చూసే సిన్మాల్లోనే ఉంటారు, ఈ అతి మంచి తల్లులు.


"చాలా రాత్రి, మళ్ళీ ఇంకా చాల్సేపు పొడుకునీ, పొడుకునీ తర్వాత్తర్వాతెప్పుడో నిదరలేస్తాడు. వాళ్ళ అమ్మ లేపదు (సెటైరా). ఆడే ఎప్పుడో లేస్తాడనమాట . బష్షు మీద పేస్ట్ ఏస్తాడు. తోముతాడు. స్నానం చెయ్యడు. మళ్ళానేమో బట్టలేసుకుంటాడు. గళ్ళ చొక్కా, కాదు, కాదు సారల చొక్కా. ఎర్ర సారలు పచ్చ సారలు. ఏసుకుంటాడు.”

"కాదమ్మా బ్లూ సారలు" సోదరుడి దిద్దుబాటు.

"ఏం కాదు పచ్చ సారలు.”

ఏవో సారలు, నా చావుకొచ్చే చారలు చెప్పండయ్యా.

"అమ్మా నేను మాట్టాడేటప్పుడు వాణ్ణి నోర్మూస్కోమను.”

"నీతో మాట్టాట్టం మొన్నో, ఎప్పుడో మానేశానమ్మా . నేను అమ్మతో సెప్తున్నా. " అని పిల్లతో చెప్పి "ఆవిఁతో నే పలకటల్లేదని ఆవిఁతో సెప్పు " నాతో అన్నాడు

తడికె మహాలక్ష్మి లా ఇద్దరి మొహాలు మార్చి మర్చి చూస్తున్నా.

"అయితే నేను కథ చెప్పను ఫో" అలుగుబాటు

చెప్పక పోతే మరీ మంచిది నువ్వే ఫో అని మనం అనకూడదు. తల్లీ బిడ్డల బంధం బీట్లు వారుతుంది

"ఏంటమ్మామరీనూ, హింతింత సస్పెన్స్ లో పెట్టి ఇప్పుడు చెప్పనంటే ఎట్టామ్మా, . ప్లీజ్ ప్లీజ్ చెప్పవా, చెప్పవా" అంటూ ఉట్టుట్టిగా బతిమలాడు కోవాల.


"ఇందాక ఏం చెప్పాను? "

ఇంతోటి నేరేషన్ కు నేను మాటలందించాలి.

"అదే ,చక్కగా స్నానం చేసి బట్టలేసుకున్నాడు.”

"దువ్వెన తో తల దువ్వు కుంటాడు. మనింటో బ్రౌన్ దువ్వెన లేదూ , నాయనమ్మ దువుకుంటది అట్టాంటిది. సగం సన్న పళ్ళు, ఇంకో సగం పెద్ద పళ్ళు. దాంతో పాప్డీ తీసుకుంటాడు. తీస్కునీ, తీస్కునీ..”

బొత్తిగా ఎడిటింగ్ నైపుణ్యం లేదే పిల్లకు అనుకుని "అలాక్కాదు అక్కడక్కడ కొంచం కట్ చెయ్యాలి .”

"ఎట్టా కట్ చేస్తాం? దువ్వెన గట్టిగా ఉంటది గా, అట్టానే దువ్వుకోవాలి "

"సర్లే తొందరగా కానీ "

"అదిగో నువ్వు విసుక్కుంటన్నావ్. అట్టయితే నేను చెప్పనమ్మా. “

ఏవిటి తెల్లారగట్ట నాకీ హింస?

చిన్న పిల్లలలో ఇలాగ హింసా ధోరణి పెచ్చు రేగిపోతోందే!

తల దువ్వుకోవడం ఒక అరపేజీ, రాలిన చుండ్రు తాలూకు అవశేషాల విశేషాలకొక అరపేజీ చొప్పున పిల్ల పేణాలు తోడేస్తుంది.

ఆహా, అబ్బో, అట్టానా, వార్నీ, ఓరి వీడి దుంప తెగా లాంటి ఆశ్చర్యార్ధక పదాలు అప్పుడప్పుడూ వాడుతూ, ఒక సారి వాడినవి మరోసారి వాడకుండా జాగ్రత్తపడుతున్నాను. అలా అని మరీ బుర్రపెట్టకుండానూ ఉండకూడదు.

కథ చెప్తూ చెప్తూ వాళ్ళు మధ్య మధ్యలో ఆడియన్స్ కో పరీచ్చ పెడతారు. దానికి ముఫ్ఫై సెకండ్లలోపల సరియగు జవాబు చెప్పని ఎడల, శోకావేశంతో జుట్టు పీక్కుని, కింద దొర్లుతూ unmanageableగా తయారవుతారు. కనక ఒక చెవి కథాగమనం పై యుంచితే కొంత క్షేమం.

చావకొట్టేస్తు న్నారే! హింస తప్పించుకునే దారులు వెతికాను. పిల్లలు చెప్పే ఈ ఉరి కథా కాలక్షేపం బదులు సిన్మా చూస్తే బెటర్ కదా.

ఆ మాటే వాళ్ళతో అన్నాను. మీరు చెప్తూ ఉంటే సిన్మా చూసెయ్యాలనిపిస్తోందిరా. చూసేద్దాం అన్నాను. నాతో బాటు సిన్మా చూడటం వాళ్ళకు అత్యంత ప్రీతిపాత్రమైన పనుల్లో మొదటిది. తెలుగు సిన్మా అయితే ప్రతి షాటు కు, అదెక్కడ తీశారో, వాళ్ళు దర్శకనిర్మాతలైనట్టూ, నేనో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ అయినట్టూ సిన్మా చూపిస్తారు.
ఏదో ఇంగ్లీషు సినిమా


ఉట్టి మెటాలిక్ సినిమా. అంటే బేక్ గ్రౌండ్ అంతా మెటాలిక్ గ్రే, మెటాలిక్ నలుపు గోడలకు బిగించిన అర్ధం పర్ధం లేని మిషన్లు, పెద్ద పెద్ద చక్రాల్లాంటి స్క్రూలు. తెడ్డంత స్విచ్చులు. ఏ సినిమా చూసినా నేను హీరోయిన్ ఆహార్యం శ్రద్ధపెట్టి మరీ చూస్తాను.

హీరోయిన్ లంటే నాకున్న ఆసక్తి కొద్దీ ఒకావిడ కనిపిస్తే ఆవిడవంక చూస్తున్నా. కృష్ణకుమారి, వాణిశ్రీ ల వాల్జడలకు ట్యూనైన కళ్ళతో ఆవిడ అందచందాలు పరిశీలిస్తున్నా. బోడి గుండు చేయించుకుని నెత్తి మీద తారు రంగు పూసుకున్నట్లుంది ఆవిడ తలకట్టు. సిగ తరగ అని ఎవరూ తిట్టకుండా ముందు జాగ్రత్తా? .

ఆవిడ  మెటాలిక్ కలర్ లెదర్ తో తయారు చేసిన యూనిఫామ్ వేసుకుంది. అది ఎలా వేసుకుందో ఎలా తీయగలదో ఎంత సేపు చూసినా నా ఆలోచనకందలా. ఆ యూనిఫాంతోనే పుట్టిఉంటుందా అన్న అనుమానం కలిగింది. ఆవిడకు రక్తవర్ణపు లిప్ స్టిక్. ఫ్రేములో అదొక్కటే ప్రైమరీ కలర్. ఇంక మిగతా అంతా బూడిద, ఇనుము, ఉక్కు ల మిశ్రమ వర్ణాలు. ఆ వాతావరణం లో ఎందుకా అదనపు సోకు.

అంత సోకు చేసినా, అలవోకగా రేప్ చెయ్యగల, సమర్ధుడైన ఓ తెలుగు సిన్మా రౌడీ సైతం ఆవిణ్ణి చూస్తే, కన్ను కూడా కొట్టడు. పోనీ ఈవిడే వాడి మీద మోజు పడిందే అనుకుందాం, వాడు రాయుచ్చుకుని వెంటబడటం ఖాయం.

పక్కనున్న ఇంకొకడు కూడా ఉక్కు రంగు తోలు బట్టలతో ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎందుకో కొంపలు ముంచుకు పోయినట్లు పరుగులెత్తుతూ, హడావుడిగా ఆ మిషన్ల మధ్య మాట్టాడుకుంటున్నారు. అ మిషన్ల తాలూకు చక్రాలు సరిగా తిప్పకపోయినా, ఆ స్విచ్చులు సరిగా పైకో కిందకో వెయ్యకపోయినా లోకమంతా అల్లకల్లోలమవుతుందట.

అసలు లోకాల్ని కంట్రోల్ చేసే మిషన్లు ఎందుకు పెట్టుకుంటారు. అవి ఎటు పక్కకు తిప్పాలో అన్న వివరాలు వివరంగా రాసిపెట్టుకోవాలి కదా. పిల్లలిద్దరూ విపరీతంగా టెన్షన్ పడుతూ, పాప్ కార్న్ బొక్కేస్తున్నారు. రేపు కడుపులో నెప్పిలేస్తే ఎవడు జవాబుదారీ. ఈ సిన్మా వాళ్ళకేం హాయిగా ఉంటారు. నేనేగా తిప్పలు పడాలి.

ఇంకా ఎవరో ఊరూ పేరూ లేని బోలెడంత మంది సూట్లేసుకున్న మనుషులొచ్చారు. ఒకడికీ, పక్కవాడికీ రవ్వంతైనా తేడా లేదు. అందరూ కలిసి ఒకే సారి హీరో, హీరోయిన్ల మీద దాడి చేశారు. అనుకుంటాం గానీ మన తెలుగు సిన్మా రౌడీలకున్న క్రమశిక్షణ వాళ్ళలో లేదు. ఒకడొకడే లైన్లో వొచ్చి కొట్టించుకోవాలి గానీ ఇంగితంలేకుండా ఏవిటా మీదబడటం.

నిర్మాతక్కూడా బుర్రన్నట్టు లేదు. ప్రతి రౌడీకూ అంతంత ఖరీదైన సూట్లెందుకు. మన నిర్మాతలైతే రౌడీల్ని సొంత బట్టల్లోనే రండిరా అని అంటారేమో. వాడు పోయినేడాది శుభ్రంగా ఉతికిన నెట్ బనీను వేసుకుని వచ్చేస్తాడు. కాస్ట్ కటింగ్ మీద కాస్త ధ్యాస లేకపోయినందువల్ల కదా వీళ్ళ ఎకానమీలు కుప్పకూలేదీ!


ఆవిడ ఏదో మాట్టాడుతుంది. వీడింకేంటో. ఇద్దరూ ఆడ, మగ అన్న గోలే లేదు. ఏవిటీ నస. జగ్గయ్య, జమున బుగ్గ మీద చిటికేస్తూ 'మూగవైన ఏమిలే' అంటూ ఆటపట్టిస్తుంటే ఎంత బాగుంటుంది. ఆ ఇనప డ్రెస్సులేస్కుని ఓ ముద్దూ ముచ్చట లేకుండా ఎంతసేపు .


టీవీ వైపు చూసి చూసి విసుగేసి పిల్లలవొంక చూశాను.

పిల్లకున్న రొండు పిలకలో ఒకటి ఊడి పోయి, ఇంకొకటి intact గా ఉంది. బాగా నూనె పట్టించి, కుంకుళ్ళ పులుసులో నాలుగు మందారాకులు కలిపి బాగా పీకి పీకి తలంటితే జుట్టుకు మెరుపూ వస్తుంది. పనిలోపని ప్రతీకారం తీర్చుకున్నట్లూ ఉంటుంది. పిల్లోడి దుబ్బు తల బాగా జీబులా పెరిగింది. రత్తయ్యను పిలిచి అర్ధ డిప్పకట్ చేయించాలి, ఇంకో అర్ధ సంవత్సరం వరకూ పనిబడకుండా. ఇలాంటి ఆలోచనలతో కొట్టుకు పోతుండగా,

పిల్లలిద్దరూ ఒకే సారి నావంక చూశారు. నేను ఫాలో కావడం లేదని తెలిస్తే కొంపమునిగిందే.

టీవీ వైపు చూశా. ముఖంలోని ఏ కండరమూ కదల్చకుండా, పల్చటి పెదాలతో లో గొంతుకతో తెరమీది అందగాడు ఏదో మాట్లాడుతున్నాడు. నా కుశాగ్రబుద్ధినుపయోగించి అది జోకై ఉంటుందని భావించి వెంటనే " ఓహ్హో హో, నాయనో, బాబో" అని చప్పట్లు కొట్టి ముందుకూ వెనక్కూ ఊగుతూ, జోక్ నాకర్ధమైనందువల్లే నవ్వుతున్నట్లు వాళ్ళకు నమ్మకం కలిగించబోయాను.

"అమ్మా నువ్వసలు ఎక్కడో ఉన్నావు. కాన్సంట్రేట్ చెయ్యట్లా" అని ఇద్దరూ తిరగబడపోయారు కానీ పనావిడ వచ్చి రక్షించింది.

అమ్మగారూ, ఇందాకట్నుండీ మీఫోన్ మోగుతుందమ్మా అని ఫోన్ తెచ్చి నా చేతిలో పెట్టింది.

"ఈ సిన్మా నీకు నచ్చలేదా?" అని జాలిగా అడిగారు. 

అమ్మయ్య అనుకుని "అవునురా నాకు నచ్చలేదు. పిచ్చిగా ఉంది. హీరో హీరోయిన్లు భార్యాభర్తలు కాదు. పిల్లల్లేరు. అందుకని నచ్చలా" అని చెప్పాను.

"సరే అమ్మా, అయితే నీకు మమ్మీ రిటర్న్స్ అనే సిన్మా చూపిస్తాం "అన్నారు ఉత్సాహంగా.

అమ్మయ్య ఇదొక ఫామిలీ సెంటిమెంట్ సిన్మా అయుంటుందనుకుని కథ ఊహించా. భర్తతో తగువేసుకుని పిల్లల్నొదిలి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక మమ్మీ. పిల్లలు ఏడుస్తూ, 'కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో' అని దీనంగా పాడుకుంటూ ఆ మమ్మీకోసం వెళ్తారు. 

కిడ్నాపులూ, కుట్రలూ, చేజులూ అయినాక మమ్మీ అనే అమ్మ ఇంటికి తిరిగి వస్తుందనుకుంటా అనుకుని "పెట్టండ్రా, అలాంటి సిన్మాలంటే భలే ఇష్టం. ఆ అమ్మ కష్టాలు పడుతుంటే ఆవిడలో నేనూ ఐడెంటిఫై అవుతూ ఏడుస్తాను. బాగుంటుంది."  అన్నాను.

కానీ నా అంచనా తప్పు. అదొక ఇసక సిన్మా. ఇసక మయం. ఎర్రటి ఎండలో మనం కూడా కూర్చున్నట్టు చుర్రున కాలిపోతున్నట్లూ, దాహమేసినా నీళ్ళు దొరకనట్లు ఒకలాంటి ఫీలింగ్. ఒక సీనులో, గొంతులోకి గాలి బదులు ఇసకపోతున్నట్లు, పిల్లల తలలో ఇసకున్నట్లూ, తక్షణమే తలంట్లు పొయ్యాలన్న impulse కలిగింది.

 వాళ్ళకూ, మా పక్కింటివాళ్ళకూ కూడా సిగ్గొచ్చేట్టు, వాళ్ళిద్దర్నీ తిట్టి, మీతో కలిసి చస్తే సిన్మా చూడనని శపధం చేశాను. ఇప్పుడిక ఆ అవసరం లేదు. 

ఇప్పుడు పిల్లలు పెద్దయిపోయి ఎక్కడెక్కడో ఉన్నారు. పిల్లలు దూరంగా ఉన్నంత సుఖం ఇంకోటి లేదనుకోండి. నిద్రపోగలిగితే హాయిగా రాత్రంతా నిద్రపోవొచ్చు. లేపేవాళ్ళెవరూ ఉండరు.
చెరొక వైపు దిండ్లు పెట్టుకుని సోఫా మీద నేనొక్కదాన్నే కూర్చుంటా. హాయిగా నాకునచ్చిన పాత తెలుగు సిన్మాలు పెట్టుకుంటున్నాను. సినిమా చూస్తుంటాను కానీ కథేం జరుగుతుందో అర్ధం కావడంలేదు.

'ఈవిడ పిల్లల్ని మిస్ అవుతోంది' అని  గుసగుస గా అనుకుంటున్నారేమో. నాకలాటి బలహీనతలేం లేవు. ఎప్పుడో నా బుర్రకు emotion resistant helmet పెట్టేశా! It's working well.