28, ఆగస్టు 2016, ఆదివారం

సౌదామిని-ending

Continued from

“సౌదామినీ” అని ఎలుగెత్తి పిలుస్తూ  పర్వతపు అంచు వరకూ వెళ్ళాడు. 

 నీలాంగన పర్వతాల మీద నుండి వేగంగా జారిపడుతూ ఉంటుంది మాతంగీ  జలపాతం. మితిమీరిన వేగంతో భూమి మీదకు జారిపడడం వలన వాతావరణం లో పొగమంచు కమ్ముకుని ఉంటుంది.  ఆకాశం లో ఏర్పడిన ఇంద్ర ధనస్సులతో చూసేందుకు ఒక ప్రక్క  మనోహరంగానూ, మరో ప్రక్క ఆ వేగం , జలరాశి పరిమాణం , ఆ ఉధృతి, పరిశీలించితే భయం గొలుపుతూ ఉంటుంది.  ఎత్తైన పర్వతాలనుండి వందలాది నదులు ఒకే లక్ష్యంతో జారిపడుతున్నట్లుండే ఆ జలధారల హోరు వినడానికి భీతిగొలుపుతూ , మనసులో గుబులు రేపుతూ ఉంటుంది. మిగతా ప్రకృతితో తనకు సంబంధం లేనట్లు ఏకదీక్షగా సాగిపోతున్న జలరాశి , తనలో ఐక్యం కమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. కిందజాలువారిన పిమ్మట ఏర్పడిన సుడిగుండాలలో ఎంతో మంది లీనమయ్యారు.   అందులో  చిక్కుకున్న వారెవరూ ప్రాణాలతో బయటపడలేదు. 

జలధారలలో జారిపోతున్న సౌదామిని క్షణాల వ్యవధిలో విక్రాంతుడి కనులముందే అదృశ్యమైంది. కొన్ని క్షణాలపాటు అతడికి ప్రాణం లేనట్లు అనిపించింది. ఆమె లేని ప్రపంచంలో తనకు అస్థిత్వమే వలదనీ,  లేదని తలచాడు. మరణ బాధ అనుభవంలోకి వచ్చింది. ఆమెలేని జీవితం నరకప్రాయమని నిశ్చితాభిప్రాయంతో తల్లడిల్లాడు. 

సౌదామిని కావాలని , అతడి హృదయం  కఠినంగా పట్టుబట్టింది.  ఆమెలేని ప్రపంచం శూన్యమేనని మనసు నిశ్చయించింది. అతని కన్నులు అరుణిమతో అగ్నిలా ప్రకాశిసున్నాయి. అతడి శ్వాస వడగాలిని వేడెక్కించింది.  మరుక్షణమే ఓటమిని అంగీకరించని ధీరుడైనాడు. కార్య సాధకుడైనాడు.  

బలవంతుడెపుడూ నిర్ణయాలతో జీవిస్తాడు. 

బలహీనుడు నిర్ణయాలు తీసుకోలేక ఓటమితో మరణిస్తాడు. 

పరమగురువొసగిన స్వర్ణ రేత శక్తి జ్ఞప్తికి వచ్చింది. ఆనాడు సర్పకరాళుడిని హతమార్చడానికి వినియోగించబోయి,  స్వశక్తి విఫలమైనపుడే దానిని ప్రయోగించాలని దాచి యుంచిన  స్వర్ణ రేత శక్తి.  

 స్వర్ణ రేత శక్తి నిక్షిప్తమై యున్న తాయెత్తుని అతడు నడుమున ధరించి యున్నాడు. దానిని చేతుల్లో ఉంచుకుని స్థిరమనస్కుడై గురువుని భక్తితో ప్రార్థిస్తూ 

‘  నా ప్రియసఖి, నా దేవి, నా ప్రాణం , సౌదామిని క్షేమంగా ఉండాలి.’  అని కోరుకుని జలపాతంలోకి జారవిడిచాడు. అది కాంతివేగంతో ప్రయాణిస్తూ జలపాతంలోకి దూసుకుని వెళ్ళింది. 


జలపాతం పక్కనే పడి ఉన్న ఉగ్ర సింహుడు రక్తాన్ని కోల్పోతూ ఉన్నాడు. శ్వాస తీసుకోవడానికి ప్రయాస పడుతున్నాడు. విక్రాంతుడి చూపు తనపై పడగానే తనవద్దకు రమ్మని చేతితో సంజ్ఞ చేశాడు. విక్రాంతుడు అతడి వైపు అడుగులు వేస్తుండగా, వెనుకనుండి 

“విక్రాంతా, ఆగు” అన్న మాటలు వినవచ్చాయి..

ఆ మాటలతో బాటే వేవేల జేగంటలు ఒకేసారి వేగంగా ధ్వనించాయి.  

తిరిగి చూడగా, మాతంగిదేవి విగ్రహం కనిపించలేదు. ఆ స్థానంలో మంగళకరమైన రూపంతో మాతంగీ దేవి ప్రత్యక్షమైంది. 


దేవి నడచి వస్తుంటే, ఆమె ఆభరణాల సవ్వడి  జేగంటల ధ్వనిగా మారి నలుదిక్కులా వినిపించుతున్నది. 

ఆమె చూపులలో ప్రసరించే మాతృత్వ భావనతో ప్రకృతి పులకించింది. 

దేవి ప్రసన్న వదనం లోని మందహాసం తో పుష్పాలన్నీ విరబూశాయి.  వృక్షాలు ఆ పుష్పాలతో  దేవిని అర్చించాయి.

జలపాతం సంతోషంతో అభిషేకం చేసింది. 

నీలాంగన పర్వత శిఖరాలు వంగి నమస్కరించాయి. 

మాతృత్వమే, దేవిగా మారి తన ముందు నిలిచినట్లనిపించే ఆమె దివ్య విగ్రహ వైభవాన్ని చూచి మైమరచిపోయాడు.  అరుణవర్ణపు వస్త్రాలు ధరించిన మాతంగి దేవి ని చూచుటకు కనులే కాదు, జన్మలూ చాలవని అర్థమైంది.  తనని తాను సమర్పించుకున్నట్లు  భక్తితో ఆమె పాదాలపై ప్రణమిల్లాడు విక్రాంతుడు. వాత్సల్యంతో అతడిని లేవదీసింది. 

“విక్రాంతా, ఉగ్ర సింహుని రక్షించవలదు. నీ  దేహం లో ప్రవేశించాలని అతడి యత్నం .” అని పలికి 

ఉగ్ర సింహుడికి అగ్ని తో మరణ శయ్య సిద్ధం చేయమని ఆదేశించింది మాతంగి దేవి. విక్రాంతుడు తన అస్త్ర విద్యతో ఉగ్ర సింహుడు పడి యున్న ప్రదేశంలో,అతడి క్రింద  జ్వాలా సహిత అస్త్రాలతో, మండుతున్న అంపశయ్యనేర్పాటు చేశాడు. ఉగ్రసింహుడు అగ్నికీలలలో చిక్కుకుని దగ్ధమవుతున్నాడు. భస్మమైనంత సమయమూ , అతడి దేహం నుండి ఎన్నో క్షుద్ర శక్తులు వెలువడ్డాయి.  మిక్కిలి భయానకమైన రూపం కలిగిన ఆ క్షుద్ర శక్తులు ప్రకృతిలో సంయోగం చెందాలని ప్రయత్నిస్తుండగా , పంచభూతాలలో వాటికి స్థానం లేకుండా నిరోధించగల పరీణాహ అస్త్రాన్ని సంధించాడు విక్రాంతుడు. ఆ అస్త్ర ప్రభావంతో క్షుద్ర శక్తులు ప్రకృతిలో మనలేక మాతంగి దేవి పాదాలకు ఆభరణాలుగా మారాయి. 

కొంత సమయం తరువాత, ఉగ్రసింహుడు శరీరం దహనమైంది. ఆ ప్రదేశంలో అతడి కపాలం వరకే మిగిలి ఉన్నది. 

‘ఆ కపాలాన్ని తాకకుండా నావద్దకు తీసుకుని రా విక్రాంతా’ అన్న మాతంగి దేవి ఆదేశం తో, బాణం సంధించాడు. అది  కపాలంలోని బ్రహ్మరంధ్రంలో గుచ్చుకుంది. బాణం సహాయంతో కపాలాన్ని తీసుకుని వచ్చి, మాతంగి దేవి పాదాల వద్ద ఉంచాడు. దేవి తన బొటన వేలితో ఆ కపాలాన్ని నొక్కి చూర్ణం చేసింది. 

ఉగ్రసింహుడి దేహం నుండి వెలువడిన భీకరమైన శక్తులను చూచికూడా వెరుపు లేకుండా వాటినన్నంటినీ నిరోధించిన తీరుకు మాతంగి దేవి సంతృప్తి చెందింది.  అద్భుత కాంతులతో వెలుగొందుతున్న సూర్య చాముండికా హారాన్ని అతని మెడలో వేసింది. మణి సహిత  మకుటాన్ని చేతిలో సృష్టించి,  అతని శిరస్సుపై ధరింపజేసి ఆశీర్వదించింది. 

దేవి స్పర్శతో విక్రాంతుడి శరీరం పైనున్న గాయాలన్నీ మాయమైనాయి. దేహం ధృఢతరమైంది , శరీరం తేజోయమయమినది.  మనసు ప్రశాంతతతో నిండింది. 


  భక్తితో దేవిని పూజించాడు విక్రాంతుడు.


“విక్రాంతా, సింహ కేయూర రాజ్యానికధిపతివి నీవే .   నాచే అనుగ్రహింపబడిన ఈ కిరీటమూ, హారమూ వలన ప్రజలు నిన్ను తమ రాజుగా గుర్తిస్తారు. పర్వతం దిగువున వారంతా నీ రాకకై నిరీక్షిస్తున్నారు.   నీ కొరకై  యజుష్పతి రథం ఎదురు చూస్తుంటుంది.  దానిపై అధిరోహించిన తరువాత అది నిన్ను సింహాసనం వద్దకు చేరుస్తుంది. రాజ్యాన్నీ , బాధ్యతలనూ స్వీకరించు. జనరంజకంగా పాలించు. నీకు నేనెపుడూ అండగా ఉంటాను. విజయోస్తు !” అని పలికి , ఆశీర్వదించి అదృశ్యమైంది.


  ఆ దినం ప్రారంభమైన సమయం నుండీ , రాజ్యంలోని ప్రజలకు ప్రకృతిలో పెనుమార్పులు గోచరించాయి.  ఉగ్ర సింహుడి రక్తం తో కలసిన జలపాతం అరుణ వర్ణం దాల్చింది.   పర్వతాల ప్రకంపనలతో, భూమి కంపించింది. జలపాతం తుళ్ళి పడింది.  నదీ జలాలు ఎగసి పడుతున్నాయి. ఆ మార్పులను  గమనిస్తున్న,  ప్రజలు భయభ్రాంతులయ్యారు.   రాజ్యానికెలాంటి ఆపద వాటిల్లనుందోనని కలవర పడ్డారు.   రాజ్యమంతా  అల్లకల్లోమై యున్నది. 


   ఉగ్ర సింహుడి మరణం తరువాత కల్లోలం తగ్గుముఖం పట్టింది. ప్రజలంతా చూస్తూ ఉండగా, ప్రసన్న గంభీరుడైన విక్రాంతుడు , మాతంగీ దేవి ఆశీర్వాదం పొంది , నీలాంగన పర్వతం దిగి  ధీరుడిలా  నడచి వస్తున్నాడు. ప్రకృతి ని శాసిస్తున్నట్లున్న , అతడి చూపులోని ధృఢత్వం,  ప్రళయాన్ని సైతం నియంత్రించగలిగిన అడుగులలో  స్థిరత్వం,   ముఖవైఖరి లో తెగువ, ధైర్యం గమనించారు.  మణిమకుట ధారియై, సూర్య చాముండికా హారపు తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ వీరుడే  తమను రక్షించగల నాయకుడన్న విషయం వారందరికీ అర్థమై మిక్కిలి ఆనందించారు

 బాధ్యతలను స్వీకరించగల యోగ్యుడైన  నాయకుడిని చూసిన, ప్రజల మనసులో నిశ్చింత నెలకొన్నది. 

మాతంగిదేవి ఆశీస్సులతో, సప్త శ్వేతాశ్వాలతో పూన్చిన బంగారు రథం అక్కడ నిలబడి ఉన్నది.  
అతడిని చూడాగానే దేవాశ్వాలు తమంతట తాము నడిచి వెళ్ళి, మానవ భాషలో

"విక్రాంత మహారాజుకు ప్రణామాలు " అని పలికి అతడు అధిరోహించడానికి వీలుగా బంగారు రథాన్ని అతడి చెంత నిలబెట్టాయి. ప్రజలందరూ ఆనందాశ్చర్యాలతో జయజయ ధ్వానాలు చేస్తుండగా విక్రాంతుడు రథాన్ని అధిరోహించాడు.


********

 విక్రాంతుడు స్వర్ణ రేత శక్తిని ప్రయోగించగానే , ఆ శక్తి కాంతి వేగంతో ప్రయాణించి   జలపాతం మధ్యలో ఉన్న సౌదామిని ని కనుగొంది.   బంగారు కిరణ చక్రంలా పరిభ్రమిస్తూ ఆ ప్రదేశానికి చేరింది.  జలపాతం లో సౌదామిని ఉన్న ప్రదేశాన్ని గుర్తించి , ఆ జలధారను రెండుగా ఖండించింది. సౌదామినికి పైన , క్రింద, జలప్రవాహం ఘనీభవించింది. ఆ తరువాత, ఆ శక్తి బంగరు దోనె వలె పరివర్తన చెంది, స్పృహతప్పి యున్న సౌదామినిని తనలోకి గ్రహించింది. అక్కడి నుండి ప్రయాణించి ఆమెను కుటీరానికి చేర్చింది. కుటీరం ముందున్న జలాశయం పక్కనే పూలశయ్య మీద పవళింప జేసి , ఆమెకు శ్వాసనందించింది. ఆమె క్షేమమని తలచాక ,  ఆకాశ మార్గాన ప్రయాణించి పరమ గురువు చెంత చేరింది.  

స్వర్ణ రేత శక్తి తాకిన తరువాత , సౌదామిని మోము  , పున్నమి జాబిలి బంగరు ఛాయ సంతరించుకున్నట్లు  వింత కాంతితో వెలిగింది. శరీరానికి మరింత సౌకుమార్యం వశమయింది.  దేహం నుండి వెలువడుతున్న పరిమళాలకు పూలకొమ్మలు అసూయ చెందాయి.   సౌదామిని స్పృహలోకి వచ్చి కనులు తెరచి చూడాలని ప్రకృతి మొత్తం ఆత్రుతతో నిరీక్షించింది. వృక్షాలు వింజామరలైనాయి. పుష్పాలన్నీ ఆమె పై రాలి పరామర్శించాయి.

కొంత సమయానికి సౌదామిని కనులు విప్పింది. పక్కనే ఉన్న జలాశయంలో తన ప్రతిబింబాన్ని పరిశీలించుకున్నది. నూతన వస్త్రాలు ధరించి, వధూలంకరణతో వింతగా ఉన్న తన రూపాన్ని చూసి ఆశ్చర్యపడింది. వేళ కాని వేళ తానెందుకలా శయ్యపై పవళించియున్నదో అర్థం కాలేదు. ఆ దినం కానీ, కడపటి దినం కానీ ఎలా ప్రారంభమైనాయో జ్ఞప్తి తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. ఏమీ గుర్తుకు రాలేదు.  

కొంత సమయానికి, సమీపంలో మంగళ వాయిద్యాలు, జయ జయధ్వానాలు విన వచ్చాయి. అవేమిటా అని జలాశయం నుండి లేచి కుటీరం ముందుకు వచ్చి నిలబడింది. ఆమె నడక భారమైంది. దానికారణమేమిటా అని యోచించగా, ఆమె శరీరం నిండుగా ఎన్నడూ లేనన్ని ఆభరణాలున్నాయి. వస్త్రాలు, ఆహార్యం కొంత భిన్నంగా ఉన్నవని గమనించింది. తనలోను, ప్రకృతిలోనూ ఏవో అసంబద్ధమైన మార్పులు గమనించినను, వాటికి గల కారణమేమిటో ఆమెకు బోధ పడలేదు.  

అంతకు మునుపేనాడూ మానవ సంచారం లేని నదీ తీరం ప్రజాసమూహంతో నిండిపోయింది. సంగీత నృత్యాలతో ఉత్సాహంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరింత దగ్గరగా చూడాలని, ఆమె కుటీరం నుండి నదీ తీరం వరకూ ఏర్పరిచిన పూల బాట చివరి వరకు వచ్చింది.  కుటీరం పర్వత శ్రేణులపై నిర్మితమైయున్నందున  తీరం వెంట నడుస్తున్న ప్రజలకు సౌదామిని కనబడే అవకాశం లేదు. 

   జనప్రవాహం కదులుతూ వెళుతోంది. ఆ ప్రజలందరూ ఎందుకలా సంతోషంగా ఉన్నారో, తన మనసుమాత్రం కలతబారిందెందుకో  ఆమెకు అర్థం కాలేదు. 

కొంత సమయం తరువాత విక్రాంతుడు అధిరోహించిన రథం వచ్చింది.  తెల్లని అశ్వాలతో కూడిన బంగారు రథం పై మణీకిరీట ధారి మహారాజు నిలబడి ఉన్నాడు. ఇరువురి చూపులూ కలుసు కున్నాయి. చూపులు పలకరించుకున్నాయి. 
వెంటనే అతడెవరో గుర్తుకువచ్చింది. తానెవరో తెలిసి వచ్చింది.  అంతవరకూ జ్ఞప్తికి రాని విశేషాలన్నీ గుర్తు వచ్చాయి.
మస్తిష్కం లో స్తబ్ధత  వీడి, ఆలోచనలకు చలనం వచ్చింది


తన శరీరం పైనున్న వస్త్రాలంకరణ ఏమిటో తెలియవచ్చింది. తానతడి వధువునైన విషయం గుర్తుకు వచ్చింది. 

నదీ తీరాన అతడితో పరిచయం, నక్షత్రాలతో తాను వ్రాసిన ప్రేమ లేఖ,  తనని అన్వేషిస్తూ పాణాపాయ స్థితిలో, అతడు  తన కుటీరంలో పడిపోవడం,  ఇరువురూ రాజ్య రహస్యాలకై అన్వేషించడం, మాతంగి దేవి సమక్షంలో తమ సమాగమం అన్నీ ఒక్క సారిగా జ్ఞప్తికి వచ్చి ఆమె దేహాన్ని కంపింప జేశాయి. 

ప్రాణం శరీరం  వెలుపలికి వచ్చి ఎదురుగా రథం మీద విక్రాంతుడిలో నిలిచింది. అతడి ముఖవైఖరిలో ధృఢత్వం ఆమెకు వింతగా తోచింది. అతడి చిరునవ్వులో ప్రజల పట్ల మమకారం ప్రకటితమవుతున్నది తప్ప తననాతడు గుర్తించినట్లు లేదు. 

రాజులా చూశాడు.

తన రాజులా కాదు.

కనులు అవే. చూపులు వేరు .

చిరునవ్వు అదే, భావం వేరు. 

తన ప్రాణ నాథుడు తన వైపు చూశాడు. గుర్తించనట్లు నిష్క్రమించాడు. 

 ప్రతి పర్యాయం కలయిక కోసం నిరీక్షించడం. కలిసిన వెంటనే వియోగం. 'ఎప్పటికీ ఇంతేనా. తనకు అతడితో శాశ్వతంగా జీవించే అదృష్టమే లేదా'  అని కలత చెందింది. 

బంగారు రథం వెళ్ళిపోయింది. ప్రజలంతా నిష్క్రమించారు.

  తనని గుర్తించలేదన్న భావన ఆమెలో దుఃఖాన్ని నింపింది. క్రోధారుణిమతో కనులు కెంపులైనాయి. 
మనసు జడివానలో సముద్రంలా ఉన్నది.  తిరస్కారం తట్టుకోలేని హృదయం వేదనతో కళ్ళనుండి వెలికి రాబోయింది. స్వాభిమానం అడ్డుపడి  తానతడి కోసమై కన్నీరు కార్చకూడదని ఒట్టు పెట్టింది.   నామమేటో  తెలియని అతడిని ప్రాణం  కన్నా మిన్నగా ప్రేమించినందులకే ఈ ఫలితమని  వివేకం విమర్శించింది. 

అతడి స్పర్శతో పునీతమైనానని ఆమె శరీరం, 
శాశ్వతంగా అతడికి తోడుకావాలని ఆమె అంతఃకరణ, 
అతడి వైఖరకి చిన్నబోయానని ఆమె హృదయం , 
ఆమె ఆలోచనలు అంగీకార యోగ్యం కావని తర్కిస్తున్న జ్ఞాపకాలు, 
అతడిని మరచిపోవాలని సూచిస్తున్న ఆత్మాభిమానము  
పలువిధాలుగా ఆమెని కల్లోల పరుస్తుండగా,  విచలితురాలై కూర్చుని ఉన్నది.  

  సమయం గడచి రాత్రి కాబోతున్నది.  ఆకాశ ద్వారంలోనిలబడిన చంద్రుడు సౌదామిని వంక చూశాడు. ఆమె లేఖ వ్రాయడానికి వీలుగా నక్షత్రాలు తమంతట తాము పక్కకు తప్పుకున్నాయి.  చంద్రుని రాకతో రాత్రి వెలిగింది. పుష్పాలు వికసించాయి. పరమళాలు విహరించాయి. ఆమెకు మాత్రం శాంతి కలుగలేదు. చల్లని గాలి ఆమెను కౌగలించుకుని సేద తీర్చబోయింది. ఆమె వేడి నిట్టూర్పులకు భీతిల్లి దూరం నుండే సేవలందిస్తున్నది. 

ఏవో మంగళ వాయిద్యాల సవ్వడి వినిపిస్తున్నది. వాయిద్య ధ్వనులతో బాటు , రథ చక్రాల సవ్వడి , జయ జయ ధ్వానాలు వినవస్తున్నాయి. నగరంలో ఉత్సవాలు ఇంకా ఆగినట్లు లేవు. 

వెనుకనుండి ఎవరో నడచి వస్తున్న అలికిడి అయింది. 

బాగా పరిచయమున్న అడుగుల సవ్వడి.

“దేవీ” 

అతడి కంఠ స్వరానికి  ఆమె ప్రాణం స్పందించింది.  విక్రాంతుడి అడుగుల సవ్వడి దగ్గరవుతున్నది. అతడి పద శబ్ద లయతో ఆమె హృదయ గతి లీనమైంది.  సౌదామిని శరీరం లోని ప్రతి అణువూ అతడి వైపు చూసింది.   అతడి చెంతకు వెళ్ళమని ఇంద్రియాలు ప్రేరేపించాయి.  ఉదయం నుండి తాననుభవించిన ఆగ్రహం, పరితాపం తగ్గలేదు. స్వాభిమానం ఆమెను శిలలా మార్చింది.  కదలిక లేని ప్రతిమలా కూర్చుని ఉంది.  

 మహారాజులా ఉన్న విక్రాంతుడు ఆమె చెంత వచ్చి నిల్చున్నాడు. 

నూతన వధువు వలె సౌదామిని! 
మహారాజు లా విక్రాంతుడు!

 ఇరువురి ప్రతిబింబాలతో  జలాశయం సుందర చిత్రంగా మారింది. 

అతడి కన్నులలో నిరంతరం ప్రసరించే స్నేహాభిమానంతో ఆమె ఆగ్రహం క్షీణించబోయింది.   ధీరనాయకుడి వలె ఉన్న అతడి యశస్సుని వీక్షించిన ఆమె హృదయంలో ఎనలేని సంతృప్తి నిండింది.  


“దేవీ, కుశలమా? ”

“ప్రభువులకు ప్రణామాలు” అని పలికి , ఆపై మౌనంగా ఉన్నది. 

“ నా పై ఆగ్రహమా ?”

“మహారాజుపై ఆగ్రహమా? సామాన్యులకు విధేయత తప్ప వేరే భావమా? " అన్నది. 

ఆ నిష్ఠురమైన పలుకులు విన్న విక్రాంతుడు, సౌదామిని చెంత కూర్చుని ఆమె చేతులందుకున్నాడు.

"దేవీ, క్షమించు, ఒకనాడు నీ స్పర్శతో ప్రాణదానం చేశావు. సమస్యలలో సహచరివై సహాయం చేశావు.  నీతో సంగమం నన్ను పూర్ణ పురుషుడిని చేసింది. నాకు జీవితాన్నందించిన నా దేవిని యోగ్యమైన స్థలం లో సముచితంగా గౌరవించాలనే  సాగిపోయాను. నిన్ను ఉపేక్షించగలనా, ఆపై జీవించగలనా?" విచలితమైన కంఠంతో  పలికాడు.    

అతడి పలుకులకు, ఆమె కన్నుల్లోని నీలిమేఘాలు వర్షించాయి. ఆ కన్నీటిని తనలో కలుపుకుందామని నిరీక్షిస్తున్న జలాశయం కోరిక తీరకుండానే , విక్రాంతుడు ఆమెను తన బాహువులమధ్యకు చేర్చుకుని  చెంపలు తుడిచాడు. .

“ ప్రణయ రాజ్యానికి , నీ రాజుకు రాణివై శాశ్వతంగా నన్ను పరిపాలించు. నన్ననుగ్రహించు సౌదామినీ.” అన్నాడు. 

మృదువైన అతడి పలుకులలోని స్వచ్ఛతకు ఆమె హృదయం కరిగింది. అతడి పట్ల అనురాగం వెల్లువైంది. అతడికి మరింత చేరువై  తన చేతులను అతడి కంఠంలో మాలగావేసింది. అతడి ధృఢమైన భుజాలపై తలవాల్చింది.

జలాశయం వొడ్డున ఉన్న జంటకు, ఒకే ప్రతిబింబమేంటోనని కలువలు నవ్వాయి. 

"ఇక వియోగము, విరహమూ ప్రసాదించనని బాస చేయాలి." 

“విరహమెంతో విలువైనది దేవీ.   సన్నిహితం కావాలని, మన ఇరువురినీ తపించిపోయేలా చేసింది విరహమే. వియోగమంటే భయపడేలా , శాశ్వత ప్రణయభాగ్యాన్ని ప్రసాదించింది  ఆ విరహమే.  విరహం గౌరవార్హం. ఇంక ఆ భావాన్ని ఆస్వాదించే అవకాశముండదు మనకు"  

అంటూ చేతులతో ఆమెను సాలభంజిక వలె లేవనెత్తుతుండగా వలదని వారించింది.  

“నీ కోపభారమోపలేనేమోగానీ, కోమలివి , నీవు నాకు భారమా?” అని పలికి ఆమెను  కొనిపోయి పూలతో అలంకరించబడిన రథం పై కూర్చుండబెట్టాడు.  

ఆ జంటనధిరోహించుకున్న పూల రథం మరింత మనోహరమై గర్వాతిశయంతో కదిలింది.రథానికున్న చిరు జేగంటలు  సంతోషంతో మ్రోగాయి. దూరాన నిలబడి ఉన్న పరివార జనం చెంతకు వచ్చి, రథం పైనున్న తమ మహారాణికి అభివాదం చేశారు.  

రథం పై మహారాజుని , మహారాణినీ చూచిన పురజనులు సంతోషంతో 

“విక్రాంత మహారాజుకు జయం” అని జయజయ ధ్వానాలు చేశారు.

“విక్రాంతుడెవరు? ” ఆశ్చర్యంగా ప్రశ్నించింది. . 

“ప్రజల దాసుడు.”

“మరి నీవు?”

“సౌదామిని దాసుడను.” 

సన్మార్గుడు, సమర్థుడు, సహృదయడు అయిన తన  ప్రభువు పాలనలో సింహకేయూర రాజ్య ప్రజలు చల్లగా ఉండాలని మాతంగి దేవిని మనసులోనే ప్రార్థించింది.   

సమాప్తం

6 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

Hammayya... ee saari twists lekunda sukhantam ayyindi
Super :)

HIMADEVI YEKULA చెప్పారు...

చందూ....గుడ్ ఎండింగ్......విక్రాంతుడెవరు?మరినీవు.???👌👌
అసలైన లవ్ ఎట్ ఫస్ట్ సైట్....ఊరు,పేరు,ఎవరు,ఏమిటి??ఏమీతెలియకుండానే ,కనీసం పెళ్ళైన విషయంకూడా తెలియకుండానే...జీవితాలు మమేకం...
దైవత్వంముందు దుష్టత్వం ఎప్పుడూ పరాజితయే..ఉన్నతమైన మనసుకి ఎప్పుడూ దైవత్వం తోడుగాఉంటుంది... మంచికథను మాకందించినందుకు థాంక్స్.....

prasanthi kolli చెప్పారు...

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పాటించే మహారాజు ఎప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ కీర్తించబడతాడు. అన్ని సమయాల్లో రాజుగారికి ప్రాణాలొడ్డి సహాయపడుతూ సౌదామిని అతని జీవితంలో ఆమె పాత్రని సార్థకం చేసుకుంది. మంచి ముగింపు

Mamtha Baluvuri చెప్పారు...

తల్లిగారిల్లు కథ చాలా బావుందండీ... మీకు నేరుగా ఎలా చెప్పాలో తెలీక ఇక్కడ కామెంట్ పెట్టాను..

Chandu S చెప్పారు...

Mamatha garu, I think తల్లిగారిల్లు కథ is written by Chandu Tulasi. Congratulations to her

రామ్ చెప్పారు...

చాలా బాగుంది అండీ సౌదామిని !! మీరు చాలా పరిశోధించి రాసారేమో !! ఈ రోజుల్లో ఊహ కి అందని చాలా విషయాలు మీ రచన లో ఉన్నాయి !!

అవకాశం, సందర్భం బట్టి - నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో - యువతరం ఎలా ఆలోచించాలో చెప్పారు - మొదటి మూడు భాగాల లో !!"బాహుబలి" హవా నడుస్తున్న ఈ రోజుల్లో .. అంతకు మించిన ఈ కథ ని తెరకి ఎక్కించే వారు .. మిమ్మల్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను !!

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి