17, ఆగస్టు 2016, బుధవారం

సౌదామిని-6


Continued from

సౌదామిని-5


   ఆ సమయం లో, హఠాత్తుగా వారిఎదుట ఒక సుందరాకారుడు నిలబడ్డాడు.  తెల్లని వస్త్రాలు, బంగారు ఆభరణాలు ధరించి సూర్యతేజస్సుతో వెలుగుతూ ఉన్నాడు. అతడి రాకతో అక్కడి పరిసరాలన్నీ వింతకాంతితో నిండిపోయాయి. సూర్యోదయమైనదా అన్నంత భ్రాంతి కలిగింది. 

ప్రకాశవంతమైన చూపులతో, స్నేహపూరితమైన చిరునవ్వుతో వీరివురివద్దకూ వచ్చాడు. అతడెవరై ఉంటారా అని విక్రాంతుడు , సౌదామిని ఆశ్చర్యంతో చూస్తుండగా వారిరువురికీ చేతులు జోడించి " ప్రణామాలు" అన్నాడు. 

"తల్లీ , ప్రభువులు ఉగ్ర సింహుల వారు క్షేమమేనా?" అని సౌదామినిని ప్రశ్నించాడు.

అతడికి నమస్కరించి "మన్నించండి . మీరెవరో గుర్తించలేకున్నాము " అన్నాడు విక్రాంతుడు. 

“మీరిరువురికీ నేను పరిచయమే.” అని పలికి , కొంత విరామం తరువాత, .

“మీలో ఒకరు పునర్జన్మనిచ్చిన తండ్రి.  మరొకరు ప్రభువు సోదరి , ప్రభువుతో సమానం.” అన్నాడు. 

“ఇదివరకెన్నడూ చూసిన జ్ఞాపకం లేదు.” 

“నేను సర్పకరాళుడిని.” 

“సర్పకరాళుడివా? మరి ఆ రూపం ?”  మిక్కిలి ఆశ్చర్యంతో ప్రశ్నించింది సౌదామిని.

“ వికృతాకారుడినై జన్మించిన నేను, ఎన్నో అవమానాలకు గురి అయ్యాను. ఆ వికృతాకారం పోగొట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎంతో వ్యధ చెందాను. చివరకు నాగదేవతని తపస్సుతో ప్రసన్నుడిని చేసుకొనగా, కొంతకాలం క్షుద్ర కార్యములలో నిమగ్నుడునైన తరువాత, నా మరణం గరుడ చిహ్నం కలిగిన యువకుని చేతిలో సంభవిస్తుందని అటు పిమ్మట ఆ వికృతాకారం తొలగి పోతుందని సెలవిచ్చాడు.   ఈ వీరుడు  నా నాభిలో నాటిన అస్త్రాల వలనే ఈ రూపం పొందాను” అని వివరించాడు. 

  సర్పకరాళుడిని చూచి ఆశ్చర్యపోయాడు విక్రాంతుడు. ఆ నాడు తనతో తలపడ్డ  సర్పకరాళుడి రూపానికి , ఈనాడు ఎదురుగా నిలబడ్డ సుందరాకారుడికీ పోలిక లేదు.

“మీరురువురూ ఈ ప్రదేశంలో ఇంత రాత్రివేళ సంచరిస్తున్న కారణమేమిటో నేను తెలుసుకొనవచ్చునా? ఏమైనా సహాయపడగలనా ?” సర్ప కరాళుడు ప్రశ్నించాడు. 

సర్పకరాళుడితో చెప్పవచ్చునో లేదోనన్న సంశయంతో ఇరువురూ మౌనంగా ఉన్నారు.

వారి ఎదురుగా ఉన్న పేటికను చూశాడు సర్ప కరాళుడు.  దానికి గుచ్చుకుని ఉన్న అస్త్ర మాలికను, దాన్ని పైకి తీసుకుని వచ్చిన క్రమాన్ని గమనించాడు. దానికోసమై వారెంత ప్రయాస పడ్డారో అర్థమైంది. వారెదురుగా ఉన్న పేటిక లోనికి తొంగి చూశాడు. అది శూన్యంగా ఉండడం చూసి, 

“ఈ పేటికలోని తాళపత్రాలకోసమేనా మీ అన్వేషణ?”  ప్రశ్నించాడు.

అవునన్నట్లు విక్రాంతుడు, సౌదామిని తలలూపారు. 

“ ప్రభువెపుడో ఈ పేటికనుండి తాళపత్రాలను తొలగించివేశారు. నేనెనాడో వాటిని సేకరించి ఉగ్ర సింహుడికి అందజేశాను.” తెలిపాడు సర్పకరాళుడు. 

సమస్య మరల ఉగ్ర సింహుడి వద్దకే చేరిందని ఇద్దరికీ  కొంత నిరుత్సాహం కలిగింది. 

‘ఇప్పుడా పత్రాలెక్కడ ఉన్నాయో, వాటిలోని రహస్యమేమిటో  ఎలా ఛేదించాలో’నని విక్రాంతుడు యోచిస్తుండగా,  

"కరాళా, ఆ పత్రాలెక్కడున్నాయో? వాటిని పొందే మార్గమేమిటి?" ప్రశ్నించింది సౌదామిని. 

"అవి లేకపోయినను, వాటిలోని సారాంశమంతనూ నాకు విదితమే" అని పలికి వారిద్దరినీ ఒక ప్రదేశానికి తోడ్కొని వెళ్ళాడు. 

  అదొక విశాలమైన మైదానం. వెన్నెల వెలుగులో పచ్చని పచ్చిక మెరుస్తున్నది. పక్కనే కొండ మీదనుండి జారిపడే జలపాతం ఆ ప్రదేశంలోని గాలిని చల్లబరుస్తోంది. వేరొక వైపు ఎత్తైన మాతంగి దేవి విగ్రహం ఉన్నది. 

అచటకు చేరిన తరువాత సర్పకరాళుడు వారితో చెప్పనారంభించాడు. 

“సింహ కేయూర రాజ్యాన్ని పూర్వం సహస్ర మయూఖ వంశస్తులు పాలించేవారు. వారినుండి ఉగ్ర సింహుడి పూర్వీకులు ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు.  ఆ తరువాత రాజ్యం ఎన్నడూ సుభిక్షంగా లేదు. ఎన్నో దుస్సంఘటనలు, దుష్పరిణామాలు.  జన నష్టం, ధన నష్టం , కరువు కాటకాలతో రాజ్యం తీవ్రంగా నష్టపోయింది. ఉగ్రసింహుడి తండ్రి అయిన దేవ సింహుడు రాజ్యక్షేమం కొరకు ఒక యజ్ఞమొనరించాడు.  ఆ యజ్ఞ ఫలంగా సౌదామిని జన్మించింది. యజ్ఞ పురుషుడు ప్రత్యక్షమై దేవ సింహుడికి కొన్ని ఆదేశాలనిచ్చాడు. ఆ ఆదేశాలే తాళ పత్రాలలో లిఖించ బడ్డవి.”


“అవేమిటి?”

“రాజ్యం సహస్ర మయూఖ వంశస్థులకు చెందాలి. సౌదామిని కల్యాణం గరుడ చిహ్నం కలిగిన సహస్ర వంశస్థుడి తో సంభవించాలి. రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఇది జరిగితీరాలి. ”

"సోదరుడు తలపెట్టిన ఈ కల్యాణం రాజ్యక్షేమం కోసమే కదా. ఆ సంకల్పం మంచిదేకదా?"  సౌదామిని ప్రశ్నలో ఎంతో సంతోషం కానవచ్చించి. 

“ప్రభువుల ఉద్దేశం మంచిదే. ఈనాడు కొంత త్వరపడవలసిన ఆవశ్యకత గోచరిస్తున్నది. తల్లీ, అంతా శుభప్రదం కావాలని, నీవు ఆ మాతంగి దేవి పూజ చేసి సిద్ధం కమ్మని” సౌదామినిని కోరాడు సర్పకరాళుడు. 

అతని కంఠంలోని ఆతృతని గమనించి, సౌదామిని అక్కడి నుండి కొద్ది దూరంలో  ఉన్న మాతంగి దేవి విగ్రహం వద్దకు వెళ్ళింది.  మాతంగి దేవి విగ్రహం ఎంతో ఎత్తైనది.  దేవి పాదాల వద్ద నిలబడితే శిరస్సు కంటికి కనిపించదు.  అది రాత్రివేళ కావడం వలన ఆమె రూపం సుస్పష్టంగా కనిపించలేదు వారికి. ఉదయ సూర్యకాంతిలో ఆమె రూపాన్ని చూడగలిగేందుకు ఎంతో ధైర్యం కావాలి. 

దేవి విగ్రహం యొక్క బొటన వేలి వద్ద పూజ చేస్తున్న సౌదామిని , చిన్న పావురం లా కనిపిస్తున్నది.  

సౌదామిని దూరంగా వెళ్ళిన తరువాత సర్పకరాళుడు కొనసాగించాడు 

"విక్రమా, కల్యాణం ఒక్కటే కాదు. మాతంగి జలపాతం లో సింహ కేయూర వంశస్థుల రక్త తర్పరణం జరగాలి. ఆ వంశం లో మిగిలి ఉన్నది ఉగ్రసింహుడు, అతడి సోదరి మాత్రమే. ఉగ్ర సింహుడి రాజ్య కాంక్ష తెలియనిది కాదు. కల్యాణం జరిపిస్తాడు. కానీ సౌదామిని కన్యగా ఉన్నపుడే, ఆమె రక్తం సమ్మిళతం కాక మునుపే , జలపాతంలో ఆమె రక్త తర్పణ చేయాలని ప్రయత్నిస్తాడు. అందువలన మీ వివాహం జరిగిన వెంటనే ఆమె ప్రమాదం లో ఉంటుంది.” 

“అంటే..”

"ఈ రాజ్యాన్నీ, నీ స్త్రీని ఎలా రక్షించుకోవాలో ఒక పురుషుడిగా ఆలోచించు."  అన్నాడు.

అతడి మాటలలోని అంతరార్థం వెదుకుతూ ఆలోచిస్తున్నాడు. 

ఇంతలో దేవి పూజ ముగించి వచ్చి విక్రాంతుడి చెంత నిలబడ్డది.  

సర్ప కరాళుడు, విక్రాంతుడు  ఇద్దరూ గంభీరంగా ఉండడం గమనించి 
“ఏమైంది. మీరెందుకలా వున్నారు?” అని ప్రశ్నించింది. 

" ఎక్కువ సమయం లేదు విక్రమా, రేపు ఉదయమే నీవు ఉగ్ర సింహుడు రాజప్రాసాదం లో ఉండాలి." 
ముందు జరుగ వలసిన కార్యక్రమమేదో యోచించు.”
సర్పకరాళుడు త్వరపెట్టాడు. 

సౌదామిని కి ఏమీ అర్థం కాలేదు. 
విక్రాంతుడు  దేవికి నమస్కరించి ఆమె పాదాలవద్ద కుంకుమను సౌదామిని నుదిటన దిద్దాడు. 
విక్రాంతుడేదో చెప్పబోగా, సర్పకరాళుడు వారించి, “త్వరపడండి, సూర్యోదయం కావడానికి ఎక్కువ సమయం లేదు.” అని పలికి ఆకాశం లో చేయి చాచి, ఒక మేఘం వెనుక నుండి ఏదో పట్టి లాగాడు. ఒక నిముషం తరువాత వారి ఎదుట పర్జన్యాశ్వం నిలబడ్డది. 

“ సూర్యోదయానికి ముందు మీరు మీ గమ్యాలను చేర్చడానికి ఈ ఏర్పాటు” అంటూ వారిద్దరినీ ఒక వృక్షం వద్దకు వెళ్ళమని సూచించాడు. 

   అక్కడొక వృక్షం భూమికి చత్రంలా అమరి ఉన్నది. సర్పకరాళుడు తన భుజం మీద ఉన్న వస్త్రాన్ని ఆ వృక్షం క్రింద విసిరాడు. అదొక వృత్తాకారపు పూల శయ్య లా మారింది. వృక్షపు శాఖలనుండి పూలతీగెలు శయ్య చుట్టూ వేళాడుతూ శయ్య కు తెరలా ఏర్పడ్డాయి. ఆ పూల యొక్క సుతిమెత్తని పరిమళాల తో ఆ ప్రదేశమంతా గుబాళిస్తున్నది. పక్కనే కొండమీదనుండి జారుతున్న జలపాతపు హోరు సంగీతమైంది. జలపాతం మీద నుండి వీచేగాలి అవసరమైన చల్లదనాన్నిస్తోంది. చంద్రుడు చుక్కలతో చేరి వినోదం చూడడానికి ప్రయతిస్తుండగా, వెండి మబ్బులు అడ్డంగా నిలబడి అతడి ఉత్సాహాన్నీ, కళ్ళుచెదిరే వెన్నెల వెలుగునీ అదుపులో పెట్టాయి. 


ఆ శయ్యనీ , ఆ వాతావరణాన్నీ  గమనించిన విక్రాంతుడు , ఆశ్చర్యంతో వెనుదిరిగి సర్పకరాళుడిని ఏదో ప్రశ్నించబోయాడు కానీ అప్పటికే అతడక్కడినుండి అదృశ్యమైపోయాడు. 

అతడికో లక్ష్యం ఉన్నది. లక్ష్యాన్ని అందుకోవలసిన మార్గంలో సహచరితో కలసి ప్రయాణం ప్రారంభించాడు. తదేక ధ్యానంతో ఆమె సౌందర్యారాధన చేపట్టాడు. ఆరాధన ధ్యానమైంది.  మనసు లగ్నం చేసి ధ్యాన సముద్రంలో మునిగాడు. అతడి ఏకాగ్రతతో ఆమె మమేకమైంది. అతడి ధ్యానం ఆమెకు మోక్షకారకమైంది. అతడు లక్ష్య సిద్ధికి చేరడంతోటే, ఆమెకు స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. సంతోష శిఖరాలనందుకున్న ఆమె అంతటి ఆనందాన్ని ఓపలేకపోయింది. తనలోని  ఉధృతి, ఆమెలో గమనించిన జలపాతం, అర్థం చేసుకుని ఆమె ఉద్రేకాన్ని తన హోరులో ఇముడ్చుకుంది.   ఆ ఇద్దరినీ ఆశీర్వదించింది.    

**********


ప్రతి కార్యసాధకుడి మదిలో ఎంతో కొంత కలవరం ఉంటుంది. అది కార్య సాధనకు దోహదంచేస్తుంది. 


ఉగ్ర సింహుడి లో సింహ కేయూర రాజ్యం తన చేయి జారిపోకూడదన్న ఆందోళన. 

విక్రాంతుడికి సహచరులనూ , సౌదామినినీ రక్షించుకోవాలన్న పట్టుదల.

సౌదామిని కి విక్రాంతుడితో ఆజన్మాంతమూ కలిసియుండాలన్న అభిమతం, తన అభిమతం నెరవేరుతుందో లేదోనన్న  కలవరం.

బందీ అయిన యువకులందరిలోనూ ప్రాణాలతో బయటపడగలమా , తమ తల్లిదండ్రుల వద్దకు చేరగలమా అన్న అలజడి.

 ఎవరి భావాలతోనూ , ఆందోళనతోనూ నిమిత్తం లేకుండా , అత్యంత సహజంగా , లోకాన్ని కాంతితో నింపాలనే స్ఫూర్తితో సూర్యోదయమైంది. 

రాజమందిరం లో విక్రాంతుడు నిలబడ్డాడు. ఉగ్రసింహుడు వేగంగా నడచి అక్కడికి వచ్చాడు. ఆనాడేమవుతుందోనన్న కలవరపాటు అతడి ముఖంలోనూ , నడకలోనూ స్పష్టంగా  తెలుస్తోంది.

 నిశ్చలంగా నిలబడియున్న విక్రాంతుడితో 

"ఏమి ఆలోచించావు విక్రమా?" అని ప్రశ్నించాడు.

"యువకుల క్షేమమే నా ధ్యేయం. అందుకోసం ఎందుకైనా సిద్ధమే" అన్నాడు స్థిరంగా.

“చాలా సంతోషం మిత్రమా, మంచి నిర్ణయం తీసుకున్నావు. నీకు గుర్తుందికదా. ఇక రాజ్యక్షేమం కోసమే నీ జీవితం అంకితం కావాలి.  వివాహం అయిన మరుక్షణం నుండి, మరణించేంతవరకూ నా ఆజ్ఞలు పాటిస్తూ దేశానికి సేవలందించాలి. గుర్తున్నదికదా."  

"నా కర్తవ్యం నేనెన్నడూ మరచిపోను ప్రభూ" 

అతడి సమాధానంతో సంతృప్తి చెందిన ఉగ్ర సింహుడు "ఎవరక్కడ" అంటూ ఉత్సాహంగా చప్పట్లు చరిచాడు. 

"వివాహానికి అన్ని  ఏర్పాట్లూ చేయండి." అని ఆజ్ఞాపించాడు.

స్వల్పవ్యవధిలోనే విక్రాంతుడిని, సౌదామిని పరిచారికలు వివాహానికి సిద్ధం చేశారు. 

  పరిచయం లేని నూతన వధూవరులకుండవలసిన సహజమైన తడబాటు వారిద్దరిలో కనబడకపోవడం, ఉగ్ర సింహుడికి కొంత చిత్రంగా తోచినా ,  జరుప వలసిన కార్యక్రమం కోసం వేగిరపాటుతో 

"మేఘవాహిని ని సిద్ధం చేయండి. మాతంగి దేవి సమక్షంలోనే వివాహం జరపాలి " అన్నాడు. 

కొన్ని నిముషాల వ్యవధి తరువాత ముగ్గురూ మాతంగి జలపాతం వద్దనున్న దేవి విగ్రహం వద్ద నిలబడ్డారు. 

తలయెత్తి చూడగా ఆకాశాన్నంటుతున్నట్లుగా ఉంది ఆమె ప్రతిమ. 

ఆకాశం లోని నల్లని మేఘాలు ఆమె కురులముందు చిన్నబోతున్నాయి. 

నుదుటి తిలకం ముందు సూర్యుడు వెలవెలబోతున్నాడు. 

లెక్కించడానికి వీలులేనన్ని  కరములు .  వాటి నిండుగా మరెన్నో అలంకరణలు.

ఒక్కొక్క హస్తం లో పలువిధాలుగా అమరియున్న ఆయుధాలు. 

ఆమె హస్తంలో పర్వతమైనా చిన్న ఆటబొమ్మ అవుతుందన్న విశ్వాసం కలుగుతోంది.

దేవి కళ్ళలో రెండు భూలోకాలు ఇమిడియున్నవేమోనన్న  భ్రాంతి కలుగుతున్నది. 

   వాయు ప్రకంపనలకు ఆమె  కంఠంలోని బరువైన హారాల వేగంగా కదులుతున్నాయి.  ప్రళయమేదో సంభవిస్తుందన్న భయం కలుగజేస్తున్నాయి.  ప్రచండంగా వీస్తున్న గాలి పరిసరాలలో తీవ్రమైన భీతిని నింపుతున్నది.

వాతావరణంలో  నిగూఢమైన ఉగ్రత దాగి ఉన్నది. అవ్యక్తమైన అలజడితో అందరి మనసులూ కల్లోలితమై ఉన్నాయి. 

ఉగ్ర సింహుడు మాతంగి దేవి విగ్రహం  ముందు నిలబడి ఆమెను పలువిధాలుగా పూజించాడు.  
ఆమెను సంతృప్తి పరచుటకై తానేమి చేయదలచాడో , చారణ భాషలో దేవితో సంభాషించాడు.  

"మాతా, సింహ కేయూర రాజ్యం స్థిరమూ శాశ్వతముగా వర్థిల్లాలని ఆశీర్వదించు.  యజ్ఞ పుత్రిక అయిన  సౌదామినిని సూచించిన వరుడితోనే వివాహం జరుపబోతున్నాను.  భర్తతో సమాగమం కాకమునుపే మాతంగి జలపాతం లో సౌదామిని రక్త తర్పణం గావిస్తాను. "

ఆ తరువాత ఏకాగ్ర చిత్తంతో కనులు మూసి ధ్యానించాడు. ధ్యానం ముగియగానే విక్రాంతుడికి, సౌదామినికి  పూల మాలలిచ్చి మార్చుకొమ్మని త్వరపెట్టాడు ఉగ్ర సింహుడు. విక్రాంతుడి మెడలో హారం వేసే  వేళ , మాలతో బాటు తన అహర్మణి హారాన్ని విక్రాంతుడికి వేయవచ్చునన్న ఆలోచనతో ఉన్నది సౌదామిని. 

అది ఉండగా విక్రాంతుడిని ఏ శక్తీ దరిచేరలేదు. ఎవరూ హాని తలపెట్టలేరు.  

అతడి మెడలో పూలమాల వేయబోతుండగా ,  మాతంగి దేవి విగ్రహం లో కదలిక తెలియవచ్చింది. చుట్టూ ఉన్న పర్వతాలు ఉలికి పడ్డాయి. ఏకరీతి వేగంతో నిరంతరమూ ప్రవహించే జలపాతం  తుళ్ళిపడింది. వారు నిలబడ్డ భూమి కంపించింది. 

"కన్య?  ఎవరు కన్య? వివాహితకు మరల కల్యాణమా? మూర్ఖుడా?" అన్న మాటలు దేవి విగ్రహం నుండి వెలువడ్డాయి. 

ఉగ్ర సింహుడు విస్మయ పడి వెనుదిరిగి చూశాడు. సౌదామిని, కన్య కాకపోవడం ఏమిటి? పరపురుషుడి కంట బడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. 

నిశ్చలంగా నిలబడ్డ విక్రాంతుడి స్థిర వదనంలో ఉగ్ర సింహుడికేదో సంశయం కనిపించింది. సౌదామిని వదనంలోని కలవరం దానికి సమాధానంగా నిలిచింది.  

"వారిరువురూ నా సమక్షం లోనే దంపతులైనారు." దేవి మరో సారి పలికింది. 

ఆశించినవి జరగనపుడు ఆవేశం కలగడం సహజం. 

తన ఊహలు, స్వప్నాలు చెదిరిపోయినందుకు కోపోద్రిక్తుడైనాడు ఉగ్ర సింహుడు. ఉద్రేకం, ఆవేశం ,  క్రోధం అన్ని కలిసి అతడి మనసులో సంక్షోభాన్ని రేపాయి. అందుకు కారణమైన విక్రాంతుడి మీద అంతులేని ఆగ్రహం కలిగింది. అతడిని హతమార్చడానికి అక్కడే ఉన్న పదునైన శూలాన్ని బలంగా విక్రాంతుడిపై విసిరాడు. అది తనను చేరకమునుపే, దాని గమనానికి ఎదురుగా వేగంతో చేరుకుని ఒడుపుగా శూలాన్ని అందుకున్నాడు విక్రాంతుడు. సౌదామిని ముఖంలోని ఆందోళన గమనించి ఆ శూలాన్ని బలంగా భూమిలో గుచ్చాడు. 

  పలువిధాల ఆయుధాల్ని ప్రయోగిస్తున్నాడు ఉగ్ర సింహుడు. వాటిని దీటుగా ఎదుర్కుంటున్నాడు విక్రాంతుడు. తనకు తెలిసిన క్షుద్ర శక్తులన్నింటినీ ప్రయోగిస్తున్నాడు ఉగ్ర సింహుడు.  సమస్త తంత్ర విద్యలు తెలిసిన విక్రాంతుడు వాటికి లోబడక స్థిరంగా నిలబడ్డాడు. 
 పైగా గరుడ చిహ్నం కలిగియున్నందున విక్రాంతుడిని లొంగదీసుకోవడం కష్టతరమవుతున్నది. క్షుద్ర శక్తి సంపన్నుడైన ఉగ్ర సింహుడితో సమానంగా యుద్ధం చేస్తున్నాడు విక్రాంతుడు. ఎన్నో రకాల అస్త్రాలనుపయోగించినా ఫలితం లేకపోయింది. అన్నింటికీ దీటుగా బదులిస్తున్నాడు విక్రాంతుడు . 

విక్రాంతుడు ఎటువంటి శక్తినైనా, ఎదుర్కొని విజయుడై నిలబడడంతో ఉగ్ర సింహుడి మదిలో తీవ్ర అసహనం నెలకొంది. చిట్టచివరకు  విక్రాంతుడిని అంతమొందించాలన్న ఉద్దేశంతో  మెడలోని అహర్మణి హారాన్ని ఖడ్గం యొక్క పిడి కమర్చి బలంగా విక్రాంతుడి వైపు విసిరి వేశాడు ఉగ్ర సింహుడు. అది వేగంగా విక్రాంతుడి వైపు ప్రయాణించుతూ వస్తున్నది.  

  ఆ ప్రయోగానికి బదులు చెప్పగల శక్తి విక్రాంతుడి వద్దలేదని సౌదామినికి తెలుసు. తన మెడలోని అహర్మణి హారాన్ని విక్రాంతుడి వైపు విసిరింది. దాన్ని పట్టుకున్న విక్రాంతుడిని ఖడ్గం తాకలేకపోయింది. నిర్వీర్యమై వెను తిరిగింది. లక్ష్యాన్ని ఛేదించలేక వెనుదిరిగిన ఖడ్గం ఉగ్ర సింహుడివైపే ప్రయాణించింది. అతడి మరణం నిశ్చయమని తెలిసింది.  పర్వతం చాటున నక్కి ఖడ్గం నుండి తప్పించుకోవాలని చూశాడు. జలపాతం వైపు పరుగెత్తాడు. కొండ అంచున నిలబడ్డ ఉగ్ర సింహుడిని ఖడ్గం సంహరించింది. కుప్పకూలిపోయాడు. రక్తధారలు పక్కనే ఉన్న జలపాతంలో కలుస్తున్నాయి. ఉగ్ర సింహుడి రక్త తర్పణంతో జలపాతం చల్లారుతున్నది. రక్త తర్పణం స్వీకరించిన జలపాతం అతడి రక్తాన్ని తెలుపుగా మారుస్తోంది.  

తనవల్లనే సోదరుని మరణం సంభవించిందన్న వ్యధతో చేతులలో ముఖం దాచుకుని  ఖిన్నురాలయింది సౌదామిని.  అది గమనించిన ఉగ్ర సింహుడు “సౌదామినీ” అని పిలిచాడు. ఉగ్ర సింహుడి వద్దకు పరుగున చేరింది. సోదరుడి చెంతనే కూర్చుని  రోదించింది. ఆమెను ఆశీర్వదిస్తున్నట్లు  చేయి ఎత్తాడు ఉగ్ర సింహుడు. ఆమె కనులు తుడిచాడు. 
  ఉగ్ర సింహుడి అనునయ ప్రవర్తనతో మరింత ఖేదం కలిగి తల్లడిల్లింది సౌదామిని . ఉగ్ర సింహుడి ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి ఎక్కువ సమయం లేదని తెలుస్తోంది. అతడి చేతులు రెండూ పట్టుకుని క్షమించమన్నట్లు చేతులు జోడించింది. 


  విక్రాంతుడు వారిరువురి వద్దకు రాబోతుండగా , అతడి వైపు చూస్తూ ఉగ్ర సింహుడు , ఒక్క ఉదుటున సౌదామిని చేతులందుకుని  ఆమెను మాతంగి జలపాతం లోకి తోసివేశాడు.  ఊహించని సంఘటన తో విక్రాంతుడు నివ్వెరపోయాడు. 


ఎత్తైన జలధారలలో ఆమె కలిసిపోతూ విక్రాంతుడి వంక చూసింది. అతడిని పిలవాలనుకున్నది.  ప్రాణనాధుడి పేరుకూడా తెలియదు. కన్నులతోనే వీడ్కోలు పలుకుతూ జలధారలలోకి జారిపోయింది. 


పరిచయమైన తొలినాటి నుండీ, 

ప్రతి కలయిక ఫలితమూ విరహమే అయింది.

వివాహ యోగ ఫలం కూడా  శాశ్వత వియోగమేనా అని తలచి  ఖిన్నుడైనాడు విక్రాంతుడు. 


“సౌదామినీ ,దేవీ”  తీవ్రమైన వేదనతో ఆక్రోశిస్తూ  పిలిచాడు. విక్రాంతుడి పిలుపులతో  దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. 

అతడి కంఠంలోని వ్యధకు జలపాతం సైతం ఒక్క క్షణం నిశ్చలమైంది. 

మాతంగి దేవి అతడినే జాలిగా వీక్షించింది. 

..To be ended next week.


1 comments:

HIMADEVI YEKULA చెప్పారు...

మంచిమలుపు..చందూ..శాపరూప సర్పకరాళుడే సహాయంచేయటం...అనుకోని మలుపు...
కధాగమనం బాగుంది...జలపాతంలో సౌదామిని...తప్పక విక్రాంతుణ్ణిచేరుతుందనే భరోసా వచ్చింది.... ఎలా..?అనేది మాత్రం నువ్వేకదా చెప్పాలి.. eagerly waiting for sukhantham.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి