29, జులై 2016, శుక్రవారం

సౌదామిని-5

continued from

సౌదామిని-4


పరాక్రమవంతుడి హృదయాన్ని గాయపరచడం , శక్తివంతుడైన శత్రువుకు సాధ్య పడదేమోగాని , సుకుమారి అయిన ప్రేయసి కది సులభమైన పని. 

మాటతోనో, చూపుతోనో, చివరికి మౌనంతోనైనా అతడి హృదయాన్ని ముక్కలు చేయగలదు.  ఆమె ముఖవైఖరి కాఠిన్యంతో తలపడిన అతడి హృదయం గాయమైనట్లనిపింది.  ఆమె తనకు దూరమైందని తలచాడు.  విక్రాంతుడికి వియోగబాధ అనుభవమైనది.  తెలియకుండానే అతడి చేయి, ఉపశమింపజేస్తున్నట్లు  హృదయాన్ని తడిమింది. అక్కడే ఉన్న సౌదామిని వస్త్రం మృదువుగా  తగిలింది.  విక్రాంతుడిని ప్రేమతో పరామర్శించింది.   అతడి ఆలోచనలు భ్రమలేమోనన్న సంశయం కలుగజేసింది. 

 గవాక్షం నుండి ఆకాశం వైపు చూశాడు. అక్కడ చంద్రోదయం కావొస్తున్నది. నక్షత్రాలు మినుకు మినుకు మంటూ, అస్పష్టంగా కనిపిస్తున్నాయి. . ఆమె చేరువకి వెళ్ళి చూశాడు. 

ఆమె సౌదామిని కాదు. 

సజీవ సౌదామినిని తలపిస్తున్న ఒక  చిత్తరువు మాత్రమేనని గ్రహించాడు.  .


ఆమె ముఖంలో అంతటి కాఠిన్యం ఎలా వచ్చిందో అర్థం కాలేదు.  స్వర్ణాభరాణాల అడుగున ,వాస్తవాభరణమైన సౌశీల్యత కనిపించడం లేదని తలచాడు.  అదీగాక తనకు అనుభవమైన  ఆమె సౌమ్యతను చిత్రకారునికి తెలిసే ఆస్కారం లేదని, నిశ్చలమైన శాంత స్వభావాన్ని  కఠినమైన ఆ శిలలోకి చొప్పించలేకపోయి ఉంటాడని భావించాడు.  

అంతులేని ఉత్సాహం కమ్ముకుంది. మనసు ఉల్లాసభరితమైంది.  చేతులు వస్త్రాన్ని తడుముతుండగా, అప్రయత్నంగా అతడి పెదవులు  వస్తు అనుసార మంత్రాన్ని జపించాయి. ఆ చిత్తరువున్న ప్రదేశం లోని ద్వారం తెరుచుకుంది. అతడు లోపలికి అడుగిడగానే వెనుకనుండి మూసుకుని పోయింది. 

  తానడుగుపెట్టిన ప్రదేశము ఒక చీకటి సొరంగ మార్గమని  గ్రహించాడు. కనులెంత విచ్చుకుని చూసిన ఛేదించ లేని అంధకారం. వస్తు అనుసార మంత్ర ప్రభావం వలన ఆమె వైపు మార్గం సూచిస్తూ  పాదాల క్రింద జలధార తెలియవచ్చింది. . చేతులతో తడిమి చూసి, కొండ రాయిని తొలచడం ద్వారా నిర్మితమైన సొరంగం అని గ్రహించాడు.   
చేతులతో తడుముకుంటూ, బిలం పార్శ్వపు గోడలను ఆధారంగా చేసుకుని నడుస్తూ , చల్లని రాతి మార్గంలో ఎంతో సేపు ప్రయాణించాడుపాదాల కింద్ర జలప్రవాహం అంతకంతకూ పెద్దదవుతోంది. కొంత సేపటికి అది వేగవంతమైన ప్రవాహంగా మారింది . పాదాలు పట్టు తప్పుతూ ,అడుగువేయడం కష్టమవుతోంది. 

****

      పౌర్ణమినాడు విక్రాంతుడు హఠాత్తుగా  తనను విడిచి వెళ్ళిన తరువాత , సౌదామిని మదిలోని ఆశాభంగం ఆగ్రహంగా మారింది. ఆగ్రహం , కన్నీరుగా పరివర్తన చెందింది . విక్రాంతుడిని మరచిపోదామనుకున్న కొద్దీ, అతడు కావాలన్న కోరిక అధికమవుతోంది. అతడిని ప్రేమించకుండా జీవించడం అసాధ్యమని గ్రహించాక ఒక్క క్షణం మనసుకు స్థిమితం దొరికింది. మరు క్షణమే ఏదో కలవరపాటుకు గురి అవుతోంది.  

      క్షణం లో ఇష్టం, మరు క్షణం లోనే అయిష్టం, అంతలోనే ఆగ్రహం , వెంటనే అంతులేని ప్రేమ. క్షణ క్షణానికీ మారుతున్న భావాలతో ఆమె మనసు ఇంద్ర ధనసుని తలపిస్తోంది. అతడిని మరలా చూడాలని, అతని స్వరం  మరి కొంత సేపు వినాలని మనసు అభ్యర్థిస్తోంది, అవశ్యమైన అధికారంతో ఆజ్ఞాపిస్తోంది.  

  అతడెంత ప్రమాదమైన పరిస్థితి ఎదురైతే , అంత హఠాత్తుగా నిష్క్రమించి ఉంటాడోనని,  వివేకం నచ్చ చెప్పి కనులు తుడిచింది.  ప్రేమించిన వారి సాన్నిహిత్యం కన్నా, వారి సౌఖ్యం , క్షేమం కోరడమే ప్రేమ  అని తల్లడిల్లుతున్న ఆమె హృదయాన్ని ఓదార్చింది. 

అనురాగం కురిసే అతడి కన్నులు , రక్షణ కవచమై నిలిచిన అతడి బాహువులు, తానతడి స్వంతమని చెప్పిన కౌగిలి, తలగడగా  మారిన విశాల హృదయం గుర్తుకొచ్చి ఆమె ఆగ్రహాన్ని దూరం చేశాయి. అతడు క్షేమంగా ఉంటే చాలని అనుకుంది.  
కొంత సమయానికి ఆమె మనోవ్యథ తగ్గింది. కాలం నియంత్రించలేని వేదన ఉండదు కదా. 
తనని వదలి వెళ్ళవలసినంతటి తీవ్రమైన పరిస్థితి ఏమై ఉంటుందో ఆమె ఊహకు అందలేదు.  హృదయం స్పందనలను మించి అతడిని పలుమార్లు తలచుకుంది. అతడు క్షేమంగా ఉండాలని, విజయుడై తిరిగిరావాలనీ కోరుకుంది. అతడి క్షేమం కొరకు  ప్రార్థించింది. తన వేదన దైవం గ్రహించి , అతడికి విజయం అనుగ్రహించుతాడని  విశ్వసించింది. 

విక్రాంతుడి ఆలోచనలతోనే శ్వాసిస్తూ  , నిలబడి ఉన్నానన్న విషయం మరచి పోయింది.  ఉదయకాంతులతో సూర్యుడుని చూసే వరకూ ఆమె కన్నులు తెరచి ధ్యానిస్తూనే ఉన్నది. 

ఏ క్షణం లోనైనా అతడు రావచ్చునన్న భావన ఆమెను విశ్రాంతి తీసుకోనీయలేదు. కుటీరమంతా శుభ్రం చేసింది.  తన జాడ లేదని , వెళ్ళిపోతాడేమోనని ద్వారం లోనే నిలబడింది. కనురెప్ప వాల్చడానికే వెనకాడింది.  వనంలోని అతి మధుర ఫలాలను ఎంచి ఫలరసాలను సిద్ధం చేసింది. 

  వియోగ దుఃఖం తెలిసినవారికే కలయికలోని సౌఖ్యం అనుభవమవుతుంది. ఎడబాటు ఒరిపిడి తగలని ప్రేమికులకు ప్రేమ తీవ్రత తెలిసే ఆస్కారం లేదు. 


*****

ఇష్టమైన మార్గంలో శ్రమ తెలియదు. అలసట రాదు. పాదాలక్రింద జల ప్రవాహం పెద్దదవుతున్న కొద్దీ సౌదామినికి చేరువవుతున్నానన్న భావనతో విక్రాంతుడు ఉద్వేగభరితుడవుతున్నాడు. సొరంగ మార్గంలోనికి వెలుగు రేఖలు రావడంతో విక్రాంతుడి కనులు మొదట శ్రమకు లోనైనాయి. అవి చంద్రుని వెన్నెల అని తెలియడానికో క్షణ కాలం పట్టింది. తానెక్కడికి చేరుకున్నాడో అతనికి తెలియవచ్చింది. 

కుటీర ప్రాంగణం లో ఉన్న పూలవనం మధ్యలో శిల్పంలా నిలబడి ఉంది సౌదామిని. వెనుకనుండి చూడగా ఆమె నిలబడిన తీరు శిల్పాన్ని తలపిస్తోంది.  

ఓటమి ఎరుగని వీరుడు సైతం భయపడేది తన స్త్రీ కోపానికి. ఏ గురువూ నేర్పలేనిది దాన్ని ఉపశమింపజేసే విద్య. 
ఆమె ఆగ్రహంగా ఉండి ఉండవచ్చునని తలచి ఆమెకు దూరంగా నిలబడ్డాడు. 

కేశాలు మేఘాల్లాగా చల్లని గాలికి కదలడం తప్ప ఆమె భంగిమలో మార్పులేదు. ఆమె  సౌందర్య కాంతికి శరీరం పైనున్న  ధవళ వస్త్రాలు మరింత మెరుస్తున్నాయి. ఆ మెరుపు తో,  వెన్నెల మరింత ప్రకాశవంతమైంది. 

ఒక అడుగు ముందుకు వేసి చూశాడు. ఆకాశం లో ఆమె నక్షత్రాలను పేరుస్తోంది.

'కుశలమా, ప్రాణమా?

తన రాకను సూచిస్తూ అలికిడి చేశాడు.  
ఉలికిపాటుతో వెనుకకు తిరిగి చూసింది. 

"నా ప్రశ్న కూడా అదే !" ఆకాశంలో ఆమె పేర్చిన నక్షత్రాలను చూపించి పలికాడు. 

 అతడు రాక మునుపు ఎన్నో యోచించింది.  మౌనంగా ఉండాలనీ, కోపగించుకోవాలనీ, అలకబూనాలనీ!  అతడెదురుగా నిలబడగానే, తన కోసమే శ్రమించి వచ్చాడని గ్రహించి, అతడి అలసట తీర్చాలన్న ఆలోచనతప్ప వేరొకటి స్ఫురించలేదు

ప్రేమించిన వారిని కష్టపెట్టేందుకు హృదయం సాహసించదు. వారికెలా సాంత్వన కలిగించాలనే ఆరాటం తప్ప!

అతని రాక తనకెంత సంతోషాన్నిచ్చిందో తెలియజేస్తూ , ఎదురెళ్ళి అతడి చేతులందుకుని కనులకు ఆనించుకుంది. ఆహ్వానం పలుకుతున్నట్లు.  మునివేళ్ళను చుంబించింది.  మధురపానీయాన్ని అందించింది. 

  కుటీరానికి ఈశాన్యంలో  పైనుండి ప్రవహించే లఘు జలపాతం నుండి నీరు అడుగునున్న  జలాశయం వరకు చేరుతుంది. వాతావరణానికనుగుణంగా నీటి ఉష్ణోగ్రత మారుతూ ఉండడమే దాని విశిష్టత.  పరిసరాల్లో ఉన్న వృక్షాలనుండి జారిపడిన సుగంధభరిత పుష్పాలతో నిండి ఉంటుంది. . 

అతడిని ఆ జలాశయం వరకూ తీసుకునివెళ్ళి , నూతన వస్త్రాలను అమర్చింది. జలాశయం లో ఎన్నో సుగంధ భరిత పుష్పాలు తేలు తున్నాయి. పైన వెన్నెల కనువిందు చేస్తోంది.ఆ జలాశయం లోని వెచ్చని నీటితో అతడు స్నానమాడి  రాగా, అతడికి రుచికరమైన ఆహారం అమర్చింది.  అతడికి ఇంకా ఏవో   సపర్యలు చేయడానికి ఆత్రుత పడుతున్నది.

“దేవీ, ఎక్కువ సమయం లేదు” అన్నాడు. 

అతడేదో విషమ సమస్యలో ఉన్నాడని గ్రహించి, శ్రద్ధగా ఆలకిస్తూ అతడివైపు చూసింది. 

సహచరులను సైనికులు బంధించిన విషయమూ, ఉగ్ర సింహుడు తనతో జరిపిన సంభాషణ మొత్తం ఆమెకు వివరించి, తెల్లవారేలోపల నా నిర్ణయం తెలియజేయమన్నాడని తెలిపి,

 “దేవీ , నీవెవరివి?  ఉగ్ర సింహుడెవరు?” ప్రశ్నించాడు. .

“సింహ కేయూర సామ్రాజ్యాధిపతి అయిన దేవ సింహుడి కుమార్తెను. ఒక పర్యాయం సామంత దేశానికి అతిథిగా వెళ్ళి తిరిగి వస్తుండగా, నా తండ్రి హతమైనాడు. ఆ తరువాత నా సోదరుడు ఉగ్ర సింహుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు.” 

కొంత విరామం తరువాత, “నా తండ్రి మరణం నా సోదరుడి వల్లనేనని అందరూ అనుమానించారు.”

“అంతఃపురం లో ఉండవలసిన రాకుమార్తెకు ఈ ఆశ్రమ జీవితం ఏమిటి? రాణివాసంలో పరిచారికల సేవలందుకోవలసిన దేవికి శ్రమతో సహవాసమెందుకు ?”

“సింహ కేయూర రాజ్య క్షేమం కొరకు నా తండ్రి ఆచరించిన యాగ ఫలితాన నేను జన్మించానని, నా పరిణయం గరుడ చిహ్నం ఉన్న యువకుడితోనే నా తండ్రి చెప్పగా జ్ఞాపకం. యుక్త వయసు రాబోతుండగా, పరపురుషుడిని చూడరాదని నా సోదరుడు ఇక్కడ నివాసముంచాడు. నాతో వివాహం జరిస్తానన్న వాగ్దానంలో ఏదో మర్మమున్నది. క్షుద్రమైన ఎత్తుగడ ఏదో ఉండియుంటుంది.”

అని ఆలోచనలో మునిగింది. 

“సామ్రాజ్యానికి సంబంధించిన రహస్య సమాచారమున్న తాళపత్రాలను ఒక పేటికలో ఉంచి, దానిని ఒక గుప్త ప్రదేశం లో భద్రపరచాడు  నా తండ్రి.  అవి పొందగలిగితే ఈ మర్మాన్ని ఛేదించవచ్చునని” పలికింది. 

సౌదామిని లోనికి వెళ్ళి ఒక మణిహారాన్ని ధరించింది. 

సందేహంగా చూస్తున్న విక్రాంతుడితో " ఇది అహర్మణి రత్న హారం.  చీకటిలో సూర్యకాంతితో ప్రకాశిస్తుంది. ఈ మణి ఇంకొకటి నా సోదరుడి వద్ద కూడా ఉన్నది.  " అని పలికింది. 

అతడి చేయందుకుని అమృత వర్షిణి లోయ వైపు దారితీసింది. వృక్షాలకు వేళాడుతున్న బలమైన ఊడల సహాయంతో ఆలోయ లోనికి  దిగారు. 

ఒక పురాతన వృక్షం చెంతకు వెళ్ళి , చేతులు జోడించి నమస్కరించింది. . 

ఆ వృక్షం అప్పటికపుడు పక్కకు జరిగింది.  వృక్ష కాండం కింద ఒక మహాబిలము దర్శనమిచ్చింది.  విశాలమైన బిలమార్గం లో మెట్ల దారి క్రిందికి దారితీస్తోంది.  ఆమె కంఠం లో ఉన్న అహర్మణి వెలుగులో మార్గం కనిపించింది.   మెట్లు నల్లగా అక్కడక్కడ పచ్చని నాచుతో మెరుస్తూ , పాదం జారి పోతుందన్న భావన కలుగజేస్తున్నాయి. ఆమె మృదువైన పాదాలు ఆ మెట్లమీద పట్టుతప్పిపోకుండా ఆమెను పట్టుకుని నడిపిస్తున్నాడు. 

  ఒకరికొకరు ఆధారంగా ఏడడుగులు దాటి ఇంకా ఎన్నో అడుగులు వేస్తూ ఉన్నారు. ‘తన చేయి పట్టి నడుస్తున్న సౌదామినిని పరిగ్రహించాలి. కాపాడుకోవాలి. తనని నమ్మిన సహచరులను రక్షించాలి.’  ఆలోచిస్తూ ఉన్నాడు విక్రాంతుడు.

ఒక ప్రదేశం చేరుకున్న తరువాత మెట్లు కనబడలేదు.  బిలమార్గమంతా ఎండిపోయిన అడవి తీగెలతో దట్టమైన వలవలె అల్లుకొని ఉన్నది. అతడు తన చేతనున్న ఖడ్గంతో అడవిలతలను తొలగించుతుండగా,  మార్గం ఏర్పరచడంలో ఆమె సహాయం చేస్తున్నది. మార్గమెటువైపో నిర్ణయించుకొనడం ప్రతినిముషమూ , వారికి పరీక్షగా మారుతోంది.
అడవి లతలను తొలగించిన తరువాత స్వర్ణ కాంతులతో నిండిన మరొక ఒక అగాథమైన లోయ కాన వచ్చింది. తదేకదృష్టితో గమనించితే ,అడుగున ఎక్కడో  అస్పష్టమైన కదలికలు తెలియవస్తున్నాయి. విక్రాంతుడెంత ప్రయత్నించినా, అడుగున ఏమి ఉన్నదో, ఆ కదలికలేమిటో , కంటిచూపు పరిధిలో తెలుసుకొనడం అసాధ్యమనే తోచింది.   
సౌదామిని వంక చూశాడు. అతడిని కనులు మూసుకొనమని చెప్పి, తన మెడలోనున్న అహర్మణిని అతడి కనులకు తాకించి, 
“ ఇప్పుడు ప్రయత్నించు” అన్నది. 

లోపల రత్నాలు పొదిగిన స్వర్ణపేటిక ఉన్నది. చుట్టూ ఎన్నో విలువైన రత్న మాణికాలు ఉన్నాయి. వేరు వేరు వర్ణాలలో కాంతులు వెదజల్లుతున్నాయి. వాటి వెలుగుకు కళ్ళు శ్రమనొందుతున్నాయి. ఆ స్వర్ణ పేటికకు ఎన్నో వర్ణాల మణి సహిత సర్పాలు కావల కాస్తున్నాయి. అవి బుసకొట్టినపుడు అగ్ని జ్వాలలు ఎగసి పడుతున్నాయి. 

“ఆ మణులన్నీ , నాగదేవతల శిరస్సునుండి జారి పడినవే." అని పలికింది.

“ ఆ పేటికలోనే సింహ కేయూర రాజ్యానికి సంబంధించిన గుప్త సమాచారమున్నది. నా జన్మ రహస్యము కూడా దానితో ముడిపడి ఉన్నది.”

పేటిక కొక్కేనికి బాణం వేయగలిగితే ,దాని వెంట వరుస బాణాలతో పైకి వచ్చేయాలా చేయొచ్చు. అనుకొని బాణం వేయబోయాడు.

ఆగు అని వారించింది.

ఏమిటన్నట్లు విక్రాంతుడు ఆమె వంక చూశాడు.

"నాగులందరూ నా తండ్రికి అత్యంత ఆప్తులు. వారెవరూ గాయపడరాదు.  ఒకవేళ గాయపడినచో ఈ బిలమంతా అగ్నికీలలలో చిక్కుకుని భస్మమైపోతుంది."

 భయంలేదన్నట్లు ఆమె భుజం తట్టాడు విక్రాంతుడు. లోయ యొక్క లోతు, సర్పాల కదలికలోని వేగము, పేటిక ఉన్న ప్రదేశము అన్నింటినీ  సూక్ష్మ బుద్ధితో గుణించుకుని అతడు ఖండితమైన వేగంతో కొక్కెమునకు చిక్కుకునేలా బాణం వేశాడు.  ఆ బాణానికి అనుబంధంలా ఇంకొకటి వేసి, ఒకదాని వెనుకున ఇంకో బాణాన్ని వేస్తూ, ఒక దృఢమైన శరాల మాలికను ఏర్పరచాడు. 

సర్పాలన్నీ వేగంగా కదులుతుండడం వలన పేటిక పై భాగం లో ఉన్న కొక్కేనికి బాణం వేయడం మిక్కిలి ప్రమాదకరమైనదని భావించి  ఆమె  భయంతో కళ్ళు మూసుకుంది. 
ఇంకా కనులు మూసుకుని ఉన్న సౌదామిని భుజం తట్టాడు. పేటికపై కదులుతులున్న సర్పాలను తాకకుండా ఒకే ఒక నిముషం లో అతడేర్పరచిన శరాల మాలను చూచి అచ్చెరువొందింది. 

వరుస బాణాల మాలిక సాయంతోఆ పేటికను పైకి లాగారు . పేటిక వారివద్దకు చేరగనే, ఆ ప్రదేశమంతటా వెలుగు నిండింది. ఆ పేటికను తెరచి చూడగా అందులో కొన్ని మణులు మాత్రమే ఉన్నాయి. తాళపత్రాలు కాన రాలేదు. నిరుత్సాహంతో ఒకరినొకరు చూసుకున్నారు.


 మరుసటి  ఉదయానికి విక్రాంతుడు , ఉగ్ర సింహుడు ఎదుట ఉండాలన్న ఆలోచన ఇరువురి మనసులోనూ మెదులుతూ ఉన్నది.  
  అప్పటికింకా సమస్య వైపుకు ఒక్క అడుగు కూడా పడినట్లు లేదని , తదుపరి చర్య ఏమిటా అని ఆలోచించుతూ ఉన్నాడు విక్రాంతుడు. 

రాత్రి సమాప్తమవడానికింకా రెండు జాములు మాత్రమే ఉన్నాయి.

To be continued.

5 comments:

SIVARAMAPRASAD KAPPAGANTU చెప్పారు...

"పరాక్రమవంతుడి హృదయాన్ని గాయపరచడం , శక్తివంతుడైన శత్రువుకు సాధ్య పడదేమోగాని , సుకుమారి అయిన ప్రేయసి కది సులభమైన పని."

అద్భుతమైన మాట వ్రాశారు . అభినందనలు

Kamudha చెప్పారు...

క్షణం లో ఇష్టం, మరు క్షణం లోనే అయిష్టం, అంతలోనే ఆగ్రహం , వెంటనే అంతులేని ప్రేమ. క్షణ క్షణానికీ మారుతున్న భావాలతో ఆమె మనసు ఇంద్ర ధనసుని తలపిస్తోంది.
అద్భుతమైన ఉపమానం.

prasanthi kolli చెప్పారు...

ఊపిరి బిగపట్టి చదవాల్సి వస్తుంది .....☺...hats off

satyadevi ambadipudi చెప్పారు...

Madam, why are not writing new stories. We are missing them.

Chandu S చెప్పారు...

Wrote new story for Koumudi. Wait for the
October issue

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి