29, జులై 2016, శుక్రవారం

సౌదామిని-5

continued from

సౌదామిని-4


పరాక్రమవంతుడి హృదయాన్ని గాయపరచడం , శక్తివంతుడైన శత్రువుకు సాధ్య పడదేమోగాని , సుకుమారి అయిన ప్రేయసి కది సులభమైన పని. 

మాటతోనో, చూపుతోనో, చివరికి మౌనంతోనైనా అతడి హృదయాన్ని ముక్కలు చేయగలదు.  ఆమె ముఖవైఖరి కాఠిన్యంతో తలపడిన అతడి హృదయం గాయమైనట్లనిపింది.  ఆమె తనకు దూరమైందని తలచాడు.  విక్రాంతుడికి వియోగబాధ అనుభవమైనది.  తెలియకుండానే అతడి చేయి, ఉపశమింపజేస్తున్నట్లు  హృదయాన్ని తడిమింది. అక్కడే ఉన్న సౌదామిని వస్త్రం మృదువుగా  తగిలింది.  విక్రాంతుడిని ప్రేమతో పరామర్శించింది.   అతడి ఆలోచనలు భ్రమలేమోనన్న సంశయం కలుగజేసింది. 

 గవాక్షం నుండి ఆకాశం వైపు చూశాడు. అక్కడ చంద్రోదయం కావొస్తున్నది. నక్షత్రాలు మినుకు మినుకు మంటూ, అస్పష్టంగా కనిపిస్తున్నాయి. . ఆమె చేరువకి వెళ్ళి చూశాడు. 

ఆమె సౌదామిని కాదు. 

సజీవ సౌదామినిని తలపిస్తున్న ఒక  చిత్తరువు మాత్రమేనని గ్రహించాడు.  .


ఆమె ముఖంలో అంతటి కాఠిన్యం ఎలా వచ్చిందో అర్థం కాలేదు.  స్వర్ణాభరాణాల అడుగున ,వాస్తవాభరణమైన సౌశీల్యత కనిపించడం లేదని తలచాడు.  అదీగాక తనకు అనుభవమైన  ఆమె సౌమ్యతను చిత్రకారునికి తెలిసే ఆస్కారం లేదని, నిశ్చలమైన శాంత స్వభావాన్ని  కఠినమైన ఆ శిలలోకి చొప్పించలేకపోయి ఉంటాడని భావించాడు.  

అంతులేని ఉత్సాహం కమ్ముకుంది. మనసు ఉల్లాసభరితమైంది.  చేతులు వస్త్రాన్ని తడుముతుండగా, అప్రయత్నంగా అతడి పెదవులు  వస్తు అనుసార మంత్రాన్ని జపించాయి. ఆ చిత్తరువున్న ప్రదేశం లోని ద్వారం తెరుచుకుంది. అతడు లోపలికి అడుగిడగానే వెనుకనుండి మూసుకుని పోయింది. 

  తానడుగుపెట్టిన ప్రదేశము ఒక చీకటి సొరంగ మార్గమని  గ్రహించాడు. కనులెంత విచ్చుకుని చూసిన ఛేదించ లేని అంధకారం. వస్తు అనుసార మంత్ర ప్రభావం వలన ఆమె వైపు మార్గం సూచిస్తూ  పాదాల క్రింద జలధార తెలియవచ్చింది. . చేతులతో తడిమి చూసి, కొండ రాయిని తొలచడం ద్వారా నిర్మితమైన సొరంగం అని గ్రహించాడు.   
చేతులతో తడుముకుంటూ, బిలం పార్శ్వపు గోడలను ఆధారంగా చేసుకుని నడుస్తూ , చల్లని రాతి మార్గంలో ఎంతో సేపు ప్రయాణించాడుపాదాల కింద్ర జలప్రవాహం అంతకంతకూ పెద్దదవుతోంది. కొంత సేపటికి అది వేగవంతమైన ప్రవాహంగా మారింది . పాదాలు పట్టు తప్పుతూ ,అడుగువేయడం కష్టమవుతోంది. 

****

      పౌర్ణమినాడు విక్రాంతుడు హఠాత్తుగా  తనను విడిచి వెళ్ళిన తరువాత , సౌదామిని మదిలోని ఆశాభంగం ఆగ్రహంగా మారింది. ఆగ్రహం , కన్నీరుగా పరివర్తన చెందింది . విక్రాంతుడిని మరచిపోదామనుకున్న కొద్దీ, అతడు కావాలన్న కోరిక అధికమవుతోంది. అతడిని ప్రేమించకుండా జీవించడం అసాధ్యమని గ్రహించాక ఒక్క క్షణం మనసుకు స్థిమితం దొరికింది. మరు క్షణమే ఏదో కలవరపాటుకు గురి అవుతోంది.  

      క్షణం లో ఇష్టం, మరు క్షణం లోనే అయిష్టం, అంతలోనే ఆగ్రహం , వెంటనే అంతులేని ప్రేమ. క్షణ క్షణానికీ మారుతున్న భావాలతో ఆమె మనసు ఇంద్ర ధనసుని తలపిస్తోంది. అతడిని మరలా చూడాలని, అతని స్వరం  మరి కొంత సేపు వినాలని మనసు అభ్యర్థిస్తోంది, అవశ్యమైన అధికారంతో ఆజ్ఞాపిస్తోంది.  

  అతడెంత ప్రమాదమైన పరిస్థితి ఎదురైతే , అంత హఠాత్తుగా నిష్క్రమించి ఉంటాడోనని,  వివేకం నచ్చ చెప్పి కనులు తుడిచింది.  ప్రేమించిన వారి సాన్నిహిత్యం కన్నా, వారి సౌఖ్యం , క్షేమం కోరడమే ప్రేమ  అని తల్లడిల్లుతున్న ఆమె హృదయాన్ని ఓదార్చింది. 

అనురాగం కురిసే అతడి కన్నులు , రక్షణ కవచమై నిలిచిన అతడి బాహువులు, తానతడి స్వంతమని చెప్పిన కౌగిలి, తలగడగా  మారిన విశాల హృదయం గుర్తుకొచ్చి ఆమె ఆగ్రహాన్ని దూరం చేశాయి. అతడు క్షేమంగా ఉంటే చాలని అనుకుంది.  
కొంత సమయానికి ఆమె మనోవ్యథ తగ్గింది. కాలం నియంత్రించలేని వేదన ఉండదు కదా. 
తనని వదలి వెళ్ళవలసినంతటి తీవ్రమైన పరిస్థితి ఏమై ఉంటుందో ఆమె ఊహకు అందలేదు.  హృదయం స్పందనలను మించి అతడిని పలుమార్లు తలచుకుంది. అతడు క్షేమంగా ఉండాలని, విజయుడై తిరిగిరావాలనీ కోరుకుంది. అతడి క్షేమం కొరకు  ప్రార్థించింది. తన వేదన దైవం గ్రహించి , అతడికి విజయం అనుగ్రహించుతాడని  విశ్వసించింది. 

విక్రాంతుడి ఆలోచనలతోనే శ్వాసిస్తూ  , నిలబడి ఉన్నానన్న విషయం మరచి పోయింది.  ఉదయకాంతులతో సూర్యుడుని చూసే వరకూ ఆమె కన్నులు తెరచి ధ్యానిస్తూనే ఉన్నది. 

ఏ క్షణం లోనైనా అతడు రావచ్చునన్న భావన ఆమెను విశ్రాంతి తీసుకోనీయలేదు. కుటీరమంతా శుభ్రం చేసింది.  తన జాడ లేదని , వెళ్ళిపోతాడేమోనని ద్వారం లోనే నిలబడింది. కనురెప్ప వాల్చడానికే వెనకాడింది.  వనంలోని అతి మధుర ఫలాలను ఎంచి ఫలరసాలను సిద్ధం చేసింది. 

  వియోగ దుఃఖం తెలిసినవారికే కలయికలోని సౌఖ్యం అనుభవమవుతుంది. ఎడబాటు ఒరిపిడి తగలని ప్రేమికులకు ప్రేమ తీవ్రత తెలిసే ఆస్కారం లేదు. 


*****

ఇష్టమైన మార్గంలో శ్రమ తెలియదు. అలసట రాదు. పాదాలక్రింద జల ప్రవాహం పెద్దదవుతున్న కొద్దీ సౌదామినికి చేరువవుతున్నానన్న భావనతో విక్రాంతుడు ఉద్వేగభరితుడవుతున్నాడు. సొరంగ మార్గంలోనికి వెలుగు రేఖలు రావడంతో విక్రాంతుడి కనులు మొదట శ్రమకు లోనైనాయి. అవి చంద్రుని వెన్నెల అని తెలియడానికో క్షణ కాలం పట్టింది. తానెక్కడికి చేరుకున్నాడో అతనికి తెలియవచ్చింది. 

కుటీర ప్రాంగణం లో ఉన్న పూలవనం మధ్యలో శిల్పంలా నిలబడి ఉంది సౌదామిని. వెనుకనుండి చూడగా ఆమె నిలబడిన తీరు శిల్పాన్ని తలపిస్తోంది.  

ఓటమి ఎరుగని వీరుడు సైతం భయపడేది తన స్త్రీ కోపానికి. ఏ గురువూ నేర్పలేనిది దాన్ని ఉపశమింపజేసే విద్య. 
ఆమె ఆగ్రహంగా ఉండి ఉండవచ్చునని తలచి ఆమెకు దూరంగా నిలబడ్డాడు. 

కేశాలు మేఘాల్లాగా చల్లని గాలికి కదలడం తప్ప ఆమె భంగిమలో మార్పులేదు. ఆమె  సౌందర్య కాంతికి శరీరం పైనున్న  ధవళ వస్త్రాలు మరింత మెరుస్తున్నాయి. ఆ మెరుపు తో,  వెన్నెల మరింత ప్రకాశవంతమైంది. 

ఒక అడుగు ముందుకు వేసి చూశాడు. ఆకాశం లో ఆమె నక్షత్రాలను పేరుస్తోంది.

'కుశలమా, ప్రాణమా?

తన రాకను సూచిస్తూ అలికిడి చేశాడు.  
ఉలికిపాటుతో వెనుకకు తిరిగి చూసింది. 

"నా ప్రశ్న కూడా అదే !" ఆకాశంలో ఆమె పేర్చిన నక్షత్రాలను చూపించి పలికాడు. 

 అతడు రాక మునుపు ఎన్నో యోచించింది.  మౌనంగా ఉండాలనీ, కోపగించుకోవాలనీ, అలకబూనాలనీ!  అతడెదురుగా నిలబడగానే, తన కోసమే శ్రమించి వచ్చాడని గ్రహించి, అతడి అలసట తీర్చాలన్న ఆలోచనతప్ప వేరొకటి స్ఫురించలేదు

ప్రేమించిన వారిని కష్టపెట్టేందుకు హృదయం సాహసించదు. వారికెలా సాంత్వన కలిగించాలనే ఆరాటం తప్ప!

అతని రాక తనకెంత సంతోషాన్నిచ్చిందో తెలియజేస్తూ , ఎదురెళ్ళి అతడి చేతులందుకుని కనులకు ఆనించుకుంది. ఆహ్వానం పలుకుతున్నట్లు.  మునివేళ్ళను చుంబించింది.  మధురపానీయాన్ని అందించింది. 

  కుటీరానికి ఈశాన్యంలో  పైనుండి ప్రవహించే లఘు జలపాతం నుండి నీరు అడుగునున్న  జలాశయం వరకు చేరుతుంది. వాతావరణానికనుగుణంగా నీటి ఉష్ణోగ్రత మారుతూ ఉండడమే దాని విశిష్టత.  పరిసరాల్లో ఉన్న వృక్షాలనుండి జారిపడిన సుగంధభరిత పుష్పాలతో నిండి ఉంటుంది. . 

అతడిని ఆ జలాశయం వరకూ తీసుకునివెళ్ళి , నూతన వస్త్రాలను అమర్చింది. జలాశయం లో ఎన్నో సుగంధ భరిత పుష్పాలు తేలు తున్నాయి. పైన వెన్నెల కనువిందు చేస్తోంది.ఆ జలాశయం లోని వెచ్చని నీటితో అతడు స్నానమాడి  రాగా, అతడికి రుచికరమైన ఆహారం అమర్చింది.  అతడికి ఇంకా ఏవో   సపర్యలు చేయడానికి ఆత్రుత పడుతున్నది.

“దేవీ, ఎక్కువ సమయం లేదు” అన్నాడు. 

అతడేదో విషమ సమస్యలో ఉన్నాడని గ్రహించి, శ్రద్ధగా ఆలకిస్తూ అతడివైపు చూసింది. 

సహచరులను సైనికులు బంధించిన విషయమూ, ఉగ్ర సింహుడు తనతో జరిపిన సంభాషణ మొత్తం ఆమెకు వివరించి, తెల్లవారేలోపల నా నిర్ణయం తెలియజేయమన్నాడని తెలిపి,

 “దేవీ , నీవెవరివి?  ఉగ్ర సింహుడెవరు?” ప్రశ్నించాడు. .

“సింహ కేయూర సామ్రాజ్యాధిపతి అయిన దేవ సింహుడి కుమార్తెను. ఒక పర్యాయం సామంత దేశానికి అతిథిగా వెళ్ళి తిరిగి వస్తుండగా, నా తండ్రి హతమైనాడు. ఆ తరువాత నా సోదరుడు ఉగ్ర సింహుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు.” 

కొంత విరామం తరువాత, “నా తండ్రి మరణం నా సోదరుడి వల్లనేనని అందరూ అనుమానించారు.”

“అంతఃపురం లో ఉండవలసిన రాకుమార్తెకు ఈ ఆశ్రమ జీవితం ఏమిటి? రాణివాసంలో పరిచారికల సేవలందుకోవలసిన దేవికి శ్రమతో సహవాసమెందుకు ?”

“సింహ కేయూర రాజ్య క్షేమం కొరకు నా తండ్రి ఆచరించిన యాగ ఫలితాన నేను జన్మించానని, నా పరిణయం గరుడ చిహ్నం ఉన్న యువకుడితోనే నా తండ్రి చెప్పగా జ్ఞాపకం. యుక్త వయసు రాబోతుండగా, పరపురుషుడిని చూడరాదని నా సోదరుడు ఇక్కడ నివాసముంచాడు. నాతో వివాహం జరిస్తానన్న వాగ్దానంలో ఏదో మర్మమున్నది. క్షుద్రమైన ఎత్తుగడ ఏదో ఉండియుంటుంది.”

అని ఆలోచనలో మునిగింది. 

“సామ్రాజ్యానికి సంబంధించిన రహస్య సమాచారమున్న తాళపత్రాలను ఒక పేటికలో ఉంచి, దానిని ఒక గుప్త ప్రదేశం లో భద్రపరచాడు  నా తండ్రి.  అవి పొందగలిగితే ఈ మర్మాన్ని ఛేదించవచ్చునని” పలికింది. 

సౌదామిని లోనికి వెళ్ళి ఒక మణిహారాన్ని ధరించింది. 

సందేహంగా చూస్తున్న విక్రాంతుడితో " ఇది అహర్మణి రత్న హారం.  చీకటిలో సూర్యకాంతితో ప్రకాశిస్తుంది. ఈ మణి ఇంకొకటి నా సోదరుడి వద్ద కూడా ఉన్నది.  " అని పలికింది. 

అతడి చేయందుకుని అమృత వర్షిణి లోయ వైపు దారితీసింది. వృక్షాలకు వేళాడుతున్న బలమైన ఊడల సహాయంతో ఆలోయ లోనికి  దిగారు. 

ఒక పురాతన వృక్షం చెంతకు వెళ్ళి , చేతులు జోడించి నమస్కరించింది. . 

ఆ వృక్షం అప్పటికపుడు పక్కకు జరిగింది.  వృక్ష కాండం కింద ఒక మహాబిలము దర్శనమిచ్చింది.  విశాలమైన బిలమార్గం లో మెట్ల దారి క్రిందికి దారితీస్తోంది.  ఆమె కంఠం లో ఉన్న అహర్మణి వెలుగులో మార్గం కనిపించింది.   మెట్లు నల్లగా అక్కడక్కడ పచ్చని నాచుతో మెరుస్తూ , పాదం జారి పోతుందన్న భావన కలుగజేస్తున్నాయి. ఆమె మృదువైన పాదాలు ఆ మెట్లమీద పట్టుతప్పిపోకుండా ఆమెను పట్టుకుని నడిపిస్తున్నాడు. 

  ఒకరికొకరు ఆధారంగా ఏడడుగులు దాటి ఇంకా ఎన్నో అడుగులు వేస్తూ ఉన్నారు. ‘తన చేయి పట్టి నడుస్తున్న సౌదామినిని పరిగ్రహించాలి. కాపాడుకోవాలి. తనని నమ్మిన సహచరులను రక్షించాలి.’  ఆలోచిస్తూ ఉన్నాడు విక్రాంతుడు.

ఒక ప్రదేశం చేరుకున్న తరువాత మెట్లు కనబడలేదు.  బిలమార్గమంతా ఎండిపోయిన అడవి తీగెలతో దట్టమైన వలవలె అల్లుకొని ఉన్నది. అతడు తన చేతనున్న ఖడ్గంతో అడవిలతలను తొలగించుతుండగా,  మార్గం ఏర్పరచడంలో ఆమె సహాయం చేస్తున్నది. మార్గమెటువైపో నిర్ణయించుకొనడం ప్రతినిముషమూ , వారికి పరీక్షగా మారుతోంది.
అడవి లతలను తొలగించిన తరువాత స్వర్ణ కాంతులతో నిండిన మరొక ఒక అగాథమైన లోయ కాన వచ్చింది. తదేకదృష్టితో గమనించితే ,అడుగున ఎక్కడో  అస్పష్టమైన కదలికలు తెలియవస్తున్నాయి. విక్రాంతుడెంత ప్రయత్నించినా, అడుగున ఏమి ఉన్నదో, ఆ కదలికలేమిటో , కంటిచూపు పరిధిలో తెలుసుకొనడం అసాధ్యమనే తోచింది.   
సౌదామిని వంక చూశాడు. అతడిని కనులు మూసుకొనమని చెప్పి, తన మెడలోనున్న అహర్మణిని అతడి కనులకు తాకించి, 
“ ఇప్పుడు ప్రయత్నించు” అన్నది. 

లోపల రత్నాలు పొదిగిన స్వర్ణపేటిక ఉన్నది. చుట్టూ ఎన్నో విలువైన రత్న మాణికాలు ఉన్నాయి. వేరు వేరు వర్ణాలలో కాంతులు వెదజల్లుతున్నాయి. వాటి వెలుగుకు కళ్ళు శ్రమనొందుతున్నాయి. ఆ స్వర్ణ పేటికకు ఎన్నో వర్ణాల మణి సహిత సర్పాలు కావల కాస్తున్నాయి. అవి బుసకొట్టినపుడు అగ్ని జ్వాలలు ఎగసి పడుతున్నాయి. 

“ఆ మణులన్నీ , నాగదేవతల శిరస్సునుండి జారి పడినవే." అని పలికింది.

“ ఆ పేటికలోనే సింహ కేయూర రాజ్యానికి సంబంధించిన గుప్త సమాచారమున్నది. నా జన్మ రహస్యము కూడా దానితో ముడిపడి ఉన్నది.”

పేటిక కొక్కేనికి బాణం వేయగలిగితే ,దాని వెంట వరుస బాణాలతో పైకి వచ్చేయాలా చేయొచ్చు. అనుకొని బాణం వేయబోయాడు.

ఆగు అని వారించింది.

ఏమిటన్నట్లు విక్రాంతుడు ఆమె వంక చూశాడు.

"నాగులందరూ నా తండ్రికి అత్యంత ఆప్తులు. వారెవరూ గాయపడరాదు.  ఒకవేళ గాయపడినచో ఈ బిలమంతా అగ్నికీలలలో చిక్కుకుని భస్మమైపోతుంది."

 భయంలేదన్నట్లు ఆమె భుజం తట్టాడు విక్రాంతుడు. లోయ యొక్క లోతు, సర్పాల కదలికలోని వేగము, పేటిక ఉన్న ప్రదేశము అన్నింటినీ  సూక్ష్మ బుద్ధితో గుణించుకుని అతడు ఖండితమైన వేగంతో కొక్కెమునకు చిక్కుకునేలా బాణం వేశాడు.  ఆ బాణానికి అనుబంధంలా ఇంకొకటి వేసి, ఒకదాని వెనుకున ఇంకో బాణాన్ని వేస్తూ, ఒక దృఢమైన శరాల మాలికను ఏర్పరచాడు. 

సర్పాలన్నీ వేగంగా కదులుతుండడం వలన పేటిక పై భాగం లో ఉన్న కొక్కేనికి బాణం వేయడం మిక్కిలి ప్రమాదకరమైనదని భావించి  ఆమె  భయంతో కళ్ళు మూసుకుంది. 
ఇంకా కనులు మూసుకుని ఉన్న సౌదామిని భుజం తట్టాడు. పేటికపై కదులుతులున్న సర్పాలను తాకకుండా ఒకే ఒక నిముషం లో అతడేర్పరచిన శరాల మాలను చూచి అచ్చెరువొందింది. 

వరుస బాణాల మాలిక సాయంతోఆ పేటికను పైకి లాగారు . పేటిక వారివద్దకు చేరగనే, ఆ ప్రదేశమంతటా వెలుగు నిండింది. ఆ పేటికను తెరచి చూడగా అందులో కొన్ని మణులు మాత్రమే ఉన్నాయి. తాళపత్రాలు కాన రాలేదు. నిరుత్సాహంతో ఒకరినొకరు చూసుకున్నారు.


 మరుసటి  ఉదయానికి విక్రాంతుడు , ఉగ్ర సింహుడు ఎదుట ఉండాలన్న ఆలోచన ఇరువురి మనసులోనూ మెదులుతూ ఉన్నది.  
  అప్పటికింకా సమస్య వైపుకు ఒక్క అడుగు కూడా పడినట్లు లేదని , తదుపరి చర్య ఏమిటా అని ఆలోచించుతూ ఉన్నాడు విక్రాంతుడు. 

రాత్రి సమాప్తమవడానికింకా రెండు జాములు మాత్రమే ఉన్నాయి.

To be continued.

13, జులై 2016, బుధవారం

సౌదామిని-4


Continued from 
సౌదామిని-3అదే సమయానికి ఉగ్ర సింహుడు , సర్పకరాళుడితో మంతనాలు జరుపుతున్నాడు.

"సర్పకరాళా, కడపటి అమావాస్య వారంతా ఎక్కడో దాగియున్నారు. పర్యాయం సైతం అదృశ్యమయే ప్రయత్నాలు చేయక మానరు.."

ఉగ్ర సింహుడి మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ నిలబడ్డాడు సర్పకరాళుడు.  


“పౌర్ణమి నాడు నీవు కబళిస్తావని ఎవరూ ఊహించరు. ఊహించని సమయంలోనే దాడిచేయడం అన్నివిధాలా యుక్తంగా తోస్తున్నది.” 

ఉగ్రసింహుడి అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నట్టు సర్ప కరాళుడు తల ఊపాడు. శిరస్సు పైనున్న సర్పాలు సైతం బుసలు కొట్టాయి

అప్పటి వరకూ అస్థిరంగా తిరుగుతూ ఉన్న ఉగ్ర సింహుడు ఒక ఆసనం పై కూర్చుని. సర్పకరాళుడితో  

“అయితే వారందరూ ఎక్కడ ఉన్నారో నన్ను దర్శించనీ!”  అన్నాడు.

సర్పకరాళుడు కదిలాడు. అతడు కదిలి వెళుతుండగా భూమిమీద పడిన ప్రతి రక్తపు బిందువూ సర్పంగా మారి అతడి శరీరాన్ని ఆధారంగా చేసుకుని మరలా పైకి వెళుతోంది. మందిరం లోని గోడలకు బిగించి ఉన్న జ్వాల వరకూ వెళ్ళాడు.  తన కేశాలలోని ఒక నల్లటి త్రాచుని పెరికి వెలుగుతున్న జ్వాలలో సర్పాన్ని కొద్దిసేపుంచి దాన్ని వత్తిలా వెలిగించాడుఅటు పిమ్మట  ఉగ్ర సింహుడికి ఎదురుగా ఉన్న గోడపై బిగించి యున్న వృత్తాకారపు దర్పణం పై విసిరాడు

అది సాధారణ దర్పణం కాదు. అగ్ని శోధక యంత్రం. రక్త కీనాశుడనే రాక్షసుడు  ఉగ్ర సింహుడాచరించిన క్షుద్ర యాగానికి సంతృప్తి చెంది అగ్ని శోధక యంత్రాన్ని బహూకరించాడు.అగ్ని ని తాకించిన వెంటనే కోరుకున్న ప్రదేశం లో  సంభవిస్తున్న విషయాలు గానీ,   లేదా ఒక వ్యక్తి కి సంబంధిన వివరాలు గోచరిస్తాయి.   


   సర్ప జ్వాలను తాక గానే , దర్పణం లో అగ్ని జ్వాలలు ఎగసి పడ్డాయి. క్రమేణా, అగ్ని లోనే ఒక దృశ్యం కనిపించసాగింది

నదీ తీరాన యువకులందరూ రకరకాల క్రీడలలో మునిగితేలుతున్నారు. ప్రకృతి లీన ప్రక్రియ ద్వారానదీజలాలలో, వృక్షాలలో, వాటి పై తిరుగాడే జంతువులలోనూ  లీనమై ఒకరి నొకరు ఆటపట్టించుకుంటుంటూ అంతులేని ఆనందం పొందుతున్నారు

వారిక్రీడలు గమనించిన ఉగ్ర సింహుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. అతి క్లిష్టమైన ఆ తంత్ర విద్యలను సామాన్యులైన వారందరికీ బోధించినదెవరో అతడికి అర్థం కాలేదు. సహస్ర మయూఖ వంశానికి చెందిన యువకులవలనే తనకు సింహ కేయూర లోకాధిపత్యం చేజారిపోతుందని వ్యథ చెందుతున్న ఉగ్ర  సింహుడికి , వారికి తంత్ర విద్యలు సైతం తెలుసునన్న విషయం మిక్కిలి కలవరపాటు కలిగించింది. 

“ఇంక ఉపేక్షించవలదు. వారినందరినీ మట్టుబెట్టి రమ్మని” సర్పకరాళుడిని ఆదేశించాడు. 

*********

  సర్పకరాళుడు తన భారీ దేహాన్ని పదింతలు గా చేసి వారికి చేరువగా వచ్చాడు. అప్పటికే వేరు వేరు జంతు రూపాల్లో క్రీడాసక్తులైయున్న యువకులు సర్ప కరాళుడి దేహాన్ని ఒక పర్వతమని తలచారు. అతడి దేహం పై తిరుగాడుతున్న సర్పాలలో చేరి ఆడుతున్నారు. పరుగులు పెడుతున్నారు. యువకులకు ఆపద వాటిల్లబోతుందన్న విషయం ఋత గీర్వాణ పత్రాలపై పఠించిన  విక్రాంతుడు సౌదామిని కుటీరం నుండి వేగంగా నదీతీరానికి చేరుకున్నాడు.   


మునుపెన్నడూ చూడని అంతటి భారీ పర్వతం అక్కడికెలా వచ్చిందోనని ఆలోచించాడు. గురువొసగిన సువర్ణాక్ష అంజనాన్ని నేత్రాలకు రాసుకుని చూశాడు . అంజనం వలన అదృశ్య రూపం లో ఉన్నవారైనా, రూపాంతరం చెందినవారైనా తమ తమ సహజ రూపాలలో దర్శనం ఇస్తారుకళ్ళలో అంజనం ధరించిన విక్రాంతుడికి , సర్ప కరాళుడి భీకర నిజ స్వరూపం తెలియవచ్చిందియువకులందరూ ఏరూపంలో ఉన్నారో అర్థం అయింది

అదే సమయం లో సర్ప కరాళుడి చేతిలో చిక్కిన మాల్యవంతుడిని కూడా చూశాడు. మాల్యవంతుడి రూపం లో ఉన్న సర్పం ఇంకొక్క క్షణం లో అతడికి ఆహారమవబోతోంది అనుకున్న వెంటనే అతడి చేతిని లక్ష్యంగా చేసుకుని బాణాన్ని సంధించాడువిక్రాంతుడు వేసిన బాణం సర్పకరాళుడి చేతిమీద గాయం చేసింది. మాల్యవంతుడిని వదిలి వేశాడు సర్పకరాళుడు.  


విక్రాంతుడిని చూసిన యువకులందరూ, తమ తమ నిజరూపాలు ధరించి అతని చుట్టూ చేరారు. విక్రాంతుడి ముఖం గంభీరంగా ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోయారు. గాయం నుండి కారుతున్న ప్రతి రక్తపు బిందువు నుండీ ఒక సర్పం వెలువడుతోంది. వాటిలో కొన్ని నదీతీరాన తిరుగాడుతూ ఉండగా, కొన్ని సర్పకరాళుడి దేహం మీద పాకుతున్నాయి.    

  విక్రాంతుడు తన సహచరులందరకూ అతడి నిజ స్వరూపాన్ని చూపే అంజనాన్ని ఇచ్చేంత వ్యవధి లేదని గ్రహించి  వారందరికీ తన బాణాలను అనుసరిస్తూ బాణాలు వేయమని  ఆదేశమిచ్చాడు
 విక్రాంతుడు సర్పకరాళుడి గుండె ను లక్ష్యం గా చేసుకుని బాణం ఎక్కు పెట్టాడు. మరు క్షణం లోనే విక్రాంతుడు, అతడి సహచరులు వేస్తున్న అస్త్రాలు సూటిగా వెళ్ళి సర్పకరాళుడి గుండెను తాకి, అక్కడ రంధ్రం చేశాయి.   గుండెలో అయిన గాయం నుండి రక్తం పైకి వేగంగా ఎగచిమ్ముతోంది. వెల్లువై పొంగుతున్న రక్తధారలలోని ప్రతి రక్తపు బిందువూ ఒక విషపూరితమైన సర్పమవుతున్నది. నదీజలాలతో సరిసమానంగా తీరాన , సర్పాల ప్రవాహం ఏర్పడుతోంది. అతడి దేహానికి గాయం కాకూడదన్న విషయం అర్థమైంది విక్రాంతుడికి

  దాదాపు ఆకాశాన్నాంటుతున్నంత రూపం లో, అడుగులు వేస్తూ  సర్ప కరాళుడు  మరింత చేరువలోకి కదిలి వస్తున్నాడు., సర్ప సమూహాలు అంతకంతకూ ఎక్కువై నదీతీరమంతా నిండిపోయేలా ఉన్నది. అవి నగరం లోకి వస్తే ప్రజలెవరూ ప్రాణాలతో ఉండరన్న విషయం గ్రహించి అతనిని నిలువరించడానికి పరమ గురువొసగిన స్వర్ణ రేత శక్తిని వినియోగించక తప్పదని తలచాడు.

  కానీ, వేరే ప్రత్యామ్నాయం గోచరించని పరిస్థితిలోనే వాడవలెనని పరమ గురువు ఆదేశం. మొదట తన శక్తి యుక్తులతో ప్రయత్నించి చూడాలని నిశ్చయించుకున్నాడు.  అగ్ని రక్షక శరాన్ని వినియోగించి, సర్పకరాళుడికీ వీరికీ మధ్య ఒక సరిహద్దు ఏర్పరచాడు. గాయాన్ని మూసివేయడానికి , రక్త ధారల్ని నిలిపివేయడానికి , ప్రతిబంధక శరాలను సంధించాడుసర్ప కరాళుడి  శిరస్సున ఉన్న త్రాచులను ఆకాశం నుండి గుర్తించిన కొన్ని రాబందులు అతడి తలచుట్టూ ఒక తిరుగాడడం గమనించాడు విక్రాంతుడు.   యువకులందరినీ ఆ రాబందుల శరీరాల్లో చేరమని, ఆ తరువాత చేయవలసిందేమిటో వారికి ఆదేశమిచ్చాడు. 

యువకులందరూ రాబందుల దేహంలో చేరి క్షణ కాలం సైతం వ్యవధి ఇవ్వకుండా, సర్ప కరాళుడి కేశాల వలెనున్న త్రాచులను ఒకటొకటిగా  పెకిలించి వేయనారంభించారు. బాధను తట్టుకోలేక సర్పకరాళుడి అరుపులతో పర్వతాలు ప్రతిధ్వనిస్తున్నాయి.   సర్పకరాళుడు ఆ రాబందులను తరిమికొట్టడానికి చేతులతో ప్రయత్నిస్తున్నాడు. అతని దృష్టి మొత్తం రాబందులపైనున్న సమయంలో ,  విక్రాంతుడు సర్పకరాళుడి నాభిని లక్ష్యంగా చేసుకుని శరపరంపరను సాగించాడు. క్షణ కాలంలో లెక్కలేనన్ని  బాణాలు వేగంగా వెళ్ళి అతడి నాభిలో దిగబడిపోయాయి. నిరంతరం రక్త ధారలను , వేల సర్పాలను వెలువరించే  రంధ్రం మూసుకునిపోయింది.   నాభినుండి వెలువడే రక్త ధారలు అతని ఉదరంలోనే చేరిపోతున్నాయి. క్షణానికి నూరు సర్పాల చొప్పున వెలువడే సర్పాలు బయటకు వచ్చే దారిలేక లోపలే ఉండిపోవడంతో మెల్లమెల్లగా అతడి ఉదరం క్షణ క్షణానికీ పెద్దదవ సాగింది.

సర్పకరాళుడు బుద్ధికి తెలిసిన విషయాలు చాలా తక్కువ. ఉగ్ర సింహుడి ఆజ్ఞలు పాటించడమొకటి. పైన అతడి మరణం ఉగ్ర సింహుడి చేతిలోనే ననిఅప్పటి వరకూ అతడికి శారీరక బాధ ఏమిటో తెలియదు. ఆకలి దప్పికలు తెలియవు. నాభిమూసుకుని పోయిన తరువాత అతడికా బాధలేమిటో తెలిసి వచ్చాయి. క్షణ క్షణానికీ రెట్టింపవుతున్న  వేదనను భరించలేకపోతున్నాడు.   బాధ తాళలేక , విక్రాంతుడి సహచరులను  అంతమొందించవలసిన లక్ష్యాన్ని మధ్యలోనే వీడి , ఉగ్ర సింహుడే తన బాధను ఉపశమించజేయగలడని భావించి పరుగుపరుగున రాజమందిరం వైపుకు సాగిపోయాడు

అతడే దిక్కుకు వెళ్ళినా , అది మృత్యుద్వారం వైపుకేనని  గ్రహించిన విక్రాంతుడు నిశ్చింతగా నిట్టూర్చాడు


*******

అగ్ని శోధక యంత్రమందు సర్ప కరాళుడు విక్రాంతుడితో తలపడుతున్న దృశ్యాలు అతడు మిక్కిలి ఉత్కంఠతో వీక్షించుతూ ఉన్నాడు ఉగ్ర సింహుడు. సర్పకరాళుడిని అంతమొందించడానికి విక్రాంతుడి యుక్తులను, పరాక్రమాన్ని ప్రత్యక్షంగా గమనించాడు. ప్రత్యర్థిని చావు వరకూ తీసుకెళ్ళడంలో అతడు చూపిన సమయస్ఫూర్తికి ప్రశంసించకుండా ఉండలేకపోయాడు

    సర్ప కరాళుడు ఆహార పానీయాలు లేక అతడు కృంగి కృశించిపోతాడని , ఇక అతడి మరణం తథ్యమని అర్థమైనదినాభిలో గుచ్చుకున్న బాణ సముదాయాన్ని తొలగించాలని  యత్నించినచో రాబోవు ఉపద్రవం సైతం అర్థమైంది అటుపిమ్మట ఏర్పడిన గాయం నుండి వెలువడే ప్రతి రక్తబిందువు నుండీ ఉద్భవించే సర్పసమూహంతో రాజమందిరమే కాదు, నగరమే నిండిపోతుందని గ్రహించాడు

ఇంతలో సర్పకరాళుడు పరుగు పరుగున వచ్చి ఉగ్ర సింహుడితో సంభాషించాలని తన కేశాల స్థానం లో నున్న త్రాచులను వినియోగించబోయాడు. శిరస్సుపైన గానీ, దేహం మీద గానీ అతడికే సర్పమూ లభించలేదు.  తట్టుకోలేని వేదనకు ఆకలి, దాహం తోడై ఉగ్రసింహుడి వంక జాలిగా చూసి కన్నీరు కార్చాడుఅతడికి భాష రాదు. సర్పాలతో తప్ప సంభాషించలేడు. కళ్ళతోనే తన బాధను వెల్లడించబోయాడు. అశ్రువులు వెలువడుతున్నాయి. అతడి అశ్రువులతో రాజమందిరం విషపూరితమవుతుందని  గ్రహించిన ఉగ్ర సింహుడు, కనులు మూసుకొనమని ఆదేశమిచ్చి కనురెప్పలను అంటించి వేశాడు. అతడి రెండు చేతులూ వెనుకకు కట్టి బంధించాడు. ఉగ్ర సింహుడి చర్యలు తనకేదో ఉపశమనం కలుగచేస్తాయని విశ్వసించాడు సర్పకరాళుడు

లోకమంతా చీకటైన సర్పకరాళుడిని చేయిపట్టుకుని మందిరం వెనుకభాగానికి తీసుకెళ్ళాడు. అప్పటికి సూర్యాస్తమయం కావస్తున్నది. మందిరం వెనుకభాగం అంతా ఒక సుందర ఉద్యాన వనం. పుష్ప పరిమళాల మధ్య తనని నడిపించి తీసుకుపోవడం గమనించిన సర్పకరాళుడు , తనవేదన తొలగించడానికే ఈ ప్రయాణమని నమ్మి ఉగ్ర సింహుడివెంట వెళుతున్నాడు. 


ఉద్యానవనం చివరికి వచ్చిన పిమ్మట , తననెక్కడో నిలబెట్టినట్లు గ్రహించాడు. కనులు సైతం కనబడని సమయం. ఉగ్రసింహుడు తను నిలబెట్టినది ఒక పర్వత శిఖరాన అనీ , చిన్న గాలికైనా , లేదా గట్టిగా శ్వాస పీల్చినా సరే , చాలా ఎత్తునుండి అగాధమైన లోయ లో పడిపోతాడని తెలియదు. 

"కరాళా, నేను తదుపరి ఆజ్ఞ ఇచ్చు వరకు ఇక్కడే నిలబడు"  అని  ఆదేశించాడు ఉగ్ర సింహుడు.  

  తదుపరి నిరీక్షణ అంతా నిర్యాణం కోసమేననీ, తెలియని సర్పకరాళుడు  ప్రభువు తదుపరి ఆజ్ఞ కోసమై నిరీక్షిస్తూ కొండ రాయి మీద నిల్చున్నాడు. ఉగ్ర సింహుడు తిరిగి మందిరం లోనికి నడుస్తుండగా అతడాశించిన కేక వినిపించి దూరమైంది.  


సహాయకుడైన శక్తివంతుడైన సహాయకుడు మరణించాడు. శక్తివంతుడినే జయించిన ప్రత్యర్థిని సహాయకుడిగా చేసుకుంటే అన్న ఆలోచన కలిగింది. సర్పకరాళుడిని సైతం మట్టు పెట్టిన  అతడి శక్తి యుక్తులను అంచనా వేయగలిగాడు. అతడిపై ఆగ్రహం, ఉత్సుకత, ద్వేషం, అసూయ వంటి  భావాలు మదిలో చెలరేగాయి. సర్పకరాళుడి లేడన్న సత్యం మనసుని మెలిపెడుతున్నది. యువకుడెవరు.క్షణ క్షణానికీ అతడి భుజం పైనున్న గరుడ చిహ్నం జ్ఞప్తికి వస్తూ కలవరపెడుతున్నది. అతడి వల్లనే తనకు లోకాధిపత్యం. సింహ కేయూర లోకానికి అధిపతి కావడానికి అతడే అవసరం

అతడితోనే అతడి వంశస్థులందరినీ అంతమొందించాలి. తగిన పథకం కోసమై రాత్రి ఎంతో కాలం యోచించుతూ ఉన్నాడు. మందిరం లోని జ్యోతులకు దీటుగా అతని కన్నులు వెలుగుతున్నాయి. ద్వేషాన్ని దాచి , స్నేహం నెరపాలని, అతడినెలా అయినా తన ఆధీనంలోకి  తెచ్చుకోవాలన్న  ఆలోచనతో, మనసులోనే ఒక ప్రణాళికను రచించాడు


***********


సర్పకరాళుడి నిష్క్రమణ జరిగే సమయానికి సూర్యాస్తమయమైనది. యువకులందరూ ఆనందోత్సాహాలతో, అది తమ ప్రథమ విజయంగా భావించి విక్రాంతుడిని చుట్టుముట్టి విక్రాంతుడిని అభినందించారు. యువకులందరూ  పదే పదే అవే విషయాలను చర్చించుకుంటూ ఉన్నారు. 

రాత్రి నగరమంతా విశ్రాంతి తీసుకుంటున్నవేళ విక్రాంతుడి మనసులో ఆలోచనలు నిరంతరంగా సాగుతున్నాయి. ఎన్నో సందేహాలు తెలెత్తాయి. 

 ఆ భయంకరాకారుడెవరో?
 ఎవరు పంపించి ఉంటారతడిని?
అతడికీ, యువకుల అదృశ్యానికీ సంబంధం ఉండి ఉంటుందా?
అతడేదిక్కుకు వెళ్ళి ఉంటాడో? 

   తాను నిద్రిస్తూ ఉన్నపుడు, సౌదామిని వస్త్రం తనపై పడడం,   సౌదామిని కుటీరంలో ఆమెను కలవడం అన్నీ ఒకటొకటిగా గుర్తు వస్తున్నాయి. యువకులు ప్రమాదం లో ఉన్నారన్న విషయం పత్రాలపై చదివియుండకపోతే తాను నిద్రించియుండేవాడు. ఆ తరువాత పర్యవసానం ఊహించగానే అతడి మది కలవరపాటుకు లోనైంది. 

తన జీవితంలో ఆమె పరిచయమొక అద్భుతమని తోచింది. అది దైవానుగ్రహమేనని తలచాడు. ప్రసన్నమైన చిరునవ్వు, మృదువైన ఆమె దేహ స్పర్శ,  ప్రేమను కురిపించే ఆమె చూపులు మరల మరల జ్ఞప్తికి వస్తున్నాయి. 

ఆమె ఎడల కృతజ్ఞతాభావంతో మరేదో సున్నితమైన  భావం కూడా  కలసి మనసు మరింత ఉల్లాసంగా మారింది. అప్రయత్నంగా ఆకాశం వంక చూశాడు. నక్షత్రాలు ఒకటొకటిగా దర్శనం ఇస్తున్నాయి తప్ప వేరే సందేశమేమీ కనిపించలేదు.   క్షణం లోనైనా సౌదామిని సందేశం ప్రత్యక్ష్యమవుతుందన్న ఆశతో అర్థ రాత్రి వరకూ నిరీక్షించాడు
 తాను హఠాత్తుగా నిష్క్రమించినందుకు ఆమె కినుక వహించి యుండవచ్చునని తోచింది

******

ఉదయాన్నే లేచి సైన్యాధిపతిని పిలిపించాడు. సహస్ర మయూఖ వంశానికి చెందిన యువకులందరినీ బంధించాల్సినదిగా ఆజ్ఞాపించాడు. అగ్ని శోధక యంత్రం లో విక్రాంతుడి ముఖాన్ని చూపించాడు

ఇతడిని మాత్రం బంధించవద్దు. ప్రజలలో రాజ వ్యతిరేకత  తలెత్తకుండా తగిన జాగరూకత వహించండి.”

“ప్రభూ, ఏ నేరమూ చేయని అమాయ….”

ఆ యువకుడిపై ప్రజావ్యతిరేకత పెంపొందించడానికి అదే మార్గం తోస్తున్నదని మనసులో అనుకుని తీక్షణంగా సైన్యాధికారి వంక చూశాడు.

అతడు " రాజాజ్ఞను శిరసా వహిస్తాను" చెప్పి అచటినుండి వెళ్ళాడు. 

కడపటి దినాన , బాధనోర్చునలేక సర్పకరాళుడి ఆక్రందనలు నగర వాసులందరూ వినియున్నారు. సర్పకరాళుడి రాక, అతడి భీకర రూపము, అతడితో విక్రాంతుడు తలపడిన క్రమమూ యువకుల ద్వారా తెలుసుకొన్నారుమిక్కిలి భీతిగొలిపే విధంగా ఉన్న సర్పకరాళుడి కేకలు ఇంకనూ వారి చెవులలో ఇంకనూ వినబడుతూనే ఉన్నాయివిక్రాంతుడంతటి ధైర్యశాలి తమ నగరవాసి అయినందుకు మిక్కిలి సంతోషించారు. వారి పుత్రులను కాపాడగలిగేది అతడేనని , విక్రాంతుడిని అభినందిస్తుండగా ఒకేసారి  , ఇంచుమించుగా వేయిమంది బలాఢ్యులైన ఉగ్ర సింహుడి సైనికులు , యువకులను చుట్టు ముట్టారు

తంత్ర విద్యలనభ్యసిస్తున్నారనీ, వాటిని ప్రయోగించడం వలన నగరంలోని ప్రజలు భయభ్రాంతులయారన్న అభియోగాలతో , యువకులందరినీ బంధించారు. విక్రాంతుడు ముందుకు వచ్చి సైనికులతో యువకులకేపాపమూ తెలియదనీ, వారి బదులుగా తనని బంధించవలసిందిగా కోరాడు. సైనికులలో ముఖ్యులైన వారు విక్రాంతుడి ముఖాన్ని గుర్తించారు. విక్రాంతుడిని బంధించరాదని ఉగ్ర సింహుడి ఆజ్ఞ వారి మదిలో మెదిలింది.  


"నిన్ను బంధించడానికి మాకాజ్ఞ లేదని " విక్రాంతుడితో పలికి , అతడిని తప్ప మిగిలిన యువకులనందరినీ బంధితుల్ని చేసి , సైనికులు కొనిపోవడానికి ప్రయత్నిస్తుండగా వారి వారి తల్లిదండ్రులు శోకంతో తల్లడిల్లారు. 

సమయంలో విక్రాంతుడు  సహచరులతో, తాను తప్పకుండా రక్షించడానికి వస్తానని  గోప్యంగా పలికి, అంతవరకూ తప్పించుకోవడానికి తంత్ర విద్యనూ ఉపయోగించరాదని  వారి వద్దనుండి మాట తీసుకున్నాడు. ఉగ్ర సింహుడు క్షుద్ర శక్తి సంపన్నుడని విక్రాంతుడికి తెలుసుయువకులు తమకు తెలిసిన విద్యలతో బంధనాలనుండి విముక్తి పొందడానికి ప్రయత్నించితే జరగబోవు పరిణామాలేమిటో ఊహించాడు. బంధితులైన యువకులతో సైనికులు నిష్క్రమించిన పిమ్మట    సహజంగానే వారి వారి  తల్లిదండ్రులు కోపోద్రిక్తులయారు. విక్రాంతుడిని మాత్రం వదలి, సహస్ర మయూఖ వంశస్థులందరినీ బంధించడం ఉగ్రసింహుడితో అతడేర్పరుచుకున్న ఒక ఒప్పందమేనని  విక్రాంతుడి పై ఆగ్రహించారు.  తల్లిదండ్రులందరిని అనునయించబోయిన అతడిపై, వారు పరుషవచనాలతో దాడిచేశారు. యువకులనెందుకు బంధించారో తెలుసుకుని, మరల వారితో బాటే నగరప్రవేశం చేస్తానని ప్రజలకు మాట ఇచ్చాడు. అయినను వారు విక్రాంతుడి మాటలను విశ్వసించక దుఃఖిస్తూనే ఉన్నారు. 


యువకులను బంధించిన సైన్యాధికారులు ఉగ్ర సింహుడిని కలిసి ఆ విషయాన్ని తెలియజేశారు. విక్రాంతుడిని మాత్రం బంధించలేదనీ, అతడిపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని వివరించగా, ఉగ్ర సింహుడి ముఖం ఆనందం తో వికసించింది.

“అతడికి మాత్రం రాజ మార్గాన్ని తెరచి ఉంచండి. నా మందిరంలోకి ప్రవేశించే విధంగా మార్గాన్ని సిద్ధం చేయండని” అని ఆదేశించాడు. 

సైన్యాధికారులు విస్మయపడి,  ప్రభువు ఆదేశాలను అమలు పరచడానికి నిష్క్రమించారు. ********   


ఉగ్ర సింహుడి రాజప్రాసాదం నగరానికి ఉత్తర దిక్కున ఉన్న శత మఖ పర్వతాలనానుకుని ఉంటుంది. అత్యంత ఉన్నతమైన ఆ రాజ దుర్గం యొక్క క్రింది భాగం , రాజ్య పాలనకు సంబంధించిన కార్యకలాపాలకు వినియోగించబడుతుంది. రాజకుటుంబీకులందందరూ దుర్గం లోపలే నిర్మితమైన వేర్వేరు భవనాలలో నివాసముంటారు. దక్షిణ దిక్కున కారాగారం నిర్మించబడినది. ఆ దుర్గం లోపలికి ప్రవేశించడం ఎంత కష్టమో, నిష్క్రమించడం అంతకన్నా కఠినమైంది. 

 ఉగ్ర సింహుడి మందిరం మరింత ఉన్నతంగా పర్వత శిఖరాన్నానుకుని ఉంటుంది. రాజ్యకలాపాలు చక్కబెట్టేందుకు అతడు ‘మేఘ వాహని’ అను ఆకాశనౌకను వినియోగిస్తాడు. అతడికి పర్జన్యాశ్వమనే శక్తివంతమైన గుర్రం కూడా ఉన్నది. ఎవరిని చేరుకోవాలో వారి పేరుని ఆ అశ్వము చెవిలో చెప్పినంతనే  ఆకాశమార్గాన ఆ ప్రదేశానికి చేర్చగలదు.  
  
  ఉగ్ర సింహుడి రాజ ప్రాసాదానికి వెళ్ళాడు విక్రాంతుడు. ఒక విశాలమైన ప్రాంగణంలో వందలాది సైనికులు సాధన చేస్తూ కనిపించారు. అతడినెవరూ అడ్డగించకపోవడం, ప్రశ్నించకపోవడం విక్రాంతుడికి విస్మయం కలిగిస్తోంది. ఆ ప్రాంగణాన్ని దాటిలోని వెళ్ళగానే , అతి విశాలమైన ఒక మందిరం. మందిరంలో ఉన్న సౌకర్యవంతమైన ఆసనాలున్నాయి. లోపలి గోడలు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. ఓ చోట వర్తులాకారంలో ఉన్న విశాలమైన మెట్లు కనిపించాయి.   కనీసం నూరు మంది మనుషులు ఒకే పర్యాయం నడచి వెళ్ళగలిగినంత విశాలమైన మెట్లు.  అసంఖ్యాకంగా ఉన్న ఆ మెట్లు ఎటువైపు తీసుకువెళతాయో తెలియరాలేదు.  ఆ మెట్లమీద కొంత సమయం ప్రయాణించి వెనుకకు తిరిగిచూడగా , దాటి వచ్చిన మెట్లు అతని కంటికి కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.  అంతే కాదు పరిసరాల్లో తాను తప్ప మరెవరూ లేరన్న విషయం గ్రహించాడు. 

  ఒకే విధంగా ఉన్న పలు విశాలమైన మందిరాలను దాటుకుంటూ వెళుతున్నాడు .  ప్రతిమందిరంలోనూ, దూరానెక్కడో పరిచారికలు సంచరించడం గమనించి వారి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా  వారు అదృశ్యమైపోతున్నారు.  అక్కడక్కడ రక్షణగా శిల్పాలవలె నిలబడి యున్న సైనికులతో ప్రశ్నించబోయాడు.  జీవం ఉన్న విగ్రహాలవలె నిలబడియున్నారు తప్ప బదులు పలుకరని గ్రహించాడు. 

కొన్ని మందిరాలు దాటగనే సుందర ఉద్యానవనాలు. వుద్యానవనం లో అందమైన జలాశయాలు.  పరుగులు తీసే సెలయేళ్ళు, ఎన్నడూ చూడని వింత వింత అందమైన పక్షులు కొన్ని మందిరాలు దాటగనే  పేరుతెలియని వృక్ష జాతులతో మనోహరమైన ఉద్యానవనాలు. వాటిని దాటుకుంటూ వెళుతున్నాడు.   వాటి పరిమళాలతో నిండిన ఉద్యానవనాలు. 

ఎంతోసేపు ప్రయాణించినట్లంపించింది. రాజమందిరం మొత్తం చూసినా ఎవరూ అతడికి సమాధానం చెప్పేవారు కనిపించలేదు. ఎటు చూచినా అతడికి ఎవరూ ఎదురుపడలేదు. చిట్ట చివరికి ఒక పర్వతానికి ఆనుకుని ఉన్న  రాజమందిరం లోనికి ప్రవేశించాడు. భూమికి ఎంతో ఎత్తున నిర్మించబడినట్లున్నదా మందిరం. ఆకాశానికి చేరువలో ఉన్నట్లున్నది. అచటి నుండి క్రిందికి చూడగా నగరమే కాదు, దూరాన పారుతున్న నది సైతం కనిపించుతోంది.  అతడంత ఉన్నతమైన పర్వతానికెలా చేరుకున్నాడో అర్థం కాలేదు. ఆకాశంలో సూర్యుడిని చూస్తే మరో రెండు గడియలలో సూర్యాస్తమయం కాబోతున్నట్లుగా ఉన్నది. రాజప్రాసాదంలోకి ఉదయమే తాను అడుగిడినట్లు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. . 

 మానవమాత్రుడు కనిపించని ఆ ఏకాంత సామ్రాజ్యం లో ,  తన స్నేహితులందరూ ఎక్కడ ఉన్నారో, వారిని విడిపించడం ఎలాగోనన్న ఆలోచనతో చుట్టూ ఉన్న పరిసరాలను  గమనించాడు. 

ఆలోచించుతూ , ఒక మందిరంలోనికి ప్రవేశించాడు. అప్పటివరకూ దాటి వచ్చిన మందిరాల వలె కాక , కొంత భిన్నంగా ఉన్న మందిరం. మందిరం మధ్యలో అతిపెద్ద జలాశయం.  ఎవరో తదేకంగా తనని పరీక్షగా గమనించుతున్నట్లూ, అదృశ్యంగా అనుసరిస్తున్నట్లనిపించే  వింత అనుభూతుల మధ్య నిలబడి యుండగా ఉగ్ర సింహుడొచ్చి హఠాత్తుగా ఎదురుగా ప్రత్యక్షమయాడు. 
అతడెటువైపునుండి వచ్చాడో విక్రాంతుడికి బోధపడలేదు.    


ఉగ్ర సింహుడి గురించి అతడిదివరకే విని యున్నాడు గనుక వెంటనే పోల్చుకోగలిగాడు.

ఉగ్రసింహుడి రూపం అద్భుతంగా ఉంది. అద్భుతంలో అవ్యక్తమైన అసాధారాణత దాగి ఉన్నది. సౌందర్యం , మృగత్వం సమపాళ్ళలో కలసిన విగ్రహం. 

 "ప్రభువులకు ప్రణామాలు. నన్ను విక్రాంతుడని పిలుస్తారు.  " 
ఉగ్ర సింహుడు మౌనంగా , తీక్షణంగా విక్రాంతుడి వైపే చూస్తూ ఉన్నాడు. 

"అమాయకులైన నా సహచర యువకులను సైనికులు బంధించి తెచ్చారు. వారిని బంధవిముక్తులను చేయగోరవచ్చాను."

" నీ కోరిక నీకెంత ముఖ్యమైనదో తెలుసుకొన వచ్చునా?”

" వారందరూ నాకు ప్రాణసమానులు. వారి క్షేమమే నాకు ప్రధానం."

" ప్రధానమైనవి పొందుటకు మూల్యమధికంగా ఉంటుంది."

"మూల్యమెంతైనా దానికి నేను సిద్ధమే  ప్రభూ " 

"అది నీ ప్రాణమైతే?” 

"అమూల్యమైన స్నేహానికి అనిత్యమైన ప్రాణం సమానమా? అవశ్యం మహారాజా!”

" ప్రాణరహిత దేహం నిరర్థకమైనది." అన్నాడు ఉగ్రసింహుడు. 

‘విక్రాంతుడు  లేనిదే దుర్బలులైన యువకులు చేయగలిగేదేమీ ఉండదు. అతడు తన చెంత ఉంటే సహస్ర మయూఖ వంశస్థుల వలన ముప్పేమీ ఉండబోదు. సమస్త  యుద్ధ విద్యలూ, తంత్ర శాస్త్రమూ తెలిసిన ఇతడు తన సహాయకుడిగా ఉండుట శ్రేయస్కరమని’ తలచి   విక్రాంతుడి వంకే మౌనంగా  చూస్తూ ఉన్నాడు.

మహారాజు ఏమి చెప్పబోతున్నాడో వినడానికి వేచిచూస్తున్నాడు విక్రాంతుడు.

"వారిని వదలివేస్తాను. నీవు నాకూ,  రాజ్యానికి సేవలందించాలి"

"మీ రాజ్య పౌరుడిగా అది నా బాధ్యత ప్రభూ "

"కానీ, నగర వాసుల దృష్టిలో నీవు మరణించినట్లే. నా సహాయకుడిగానే జీవించాలి. అప్పుడే యువకులు ప్రాణాలతో క్షేమంగా ఉంటారు."    

విస్మయానికి గురై మౌనం దాల్చాడు విక్రాంతుడు

"అంతే కాదు. నీవు సమ్మతించినందుకు ప్రతిఫలంగా  నా సోదరితో వివాహం జరిపిస్తాను. జీవితాంతం రాజభోగాలనుభవించు. రేపటిలోగా నీ నిర్ణయం నాకు తెలియాలి" 

 మౌనం ఆలోచనగా మారింది. రాజ ప్రాసాదంలో తనను గానీ , యువకులను గానీ అంతమొందించడం ఉగ్రసింహుడికెంతో సులభం. 

సోదరితో వివాహమేమిటో , దాని అంతరార్థమేమిటోనని విక్రాంతుడు యోచిస్తూ ఉండగా   ఉగ్ర సింహుడు ఎటునుండి అదృశ్యమయ్యాడో తెలియరాలేదు. 


  సూర్యాస్తమయం దాటి రాత్రి కాబోతోంది.  ఆకాశమంతటా నక్షత్రదీపాలు వెలిగాయి.  నడుస్తూ ఉండగా మెట్లకాధారంగా ఉన్న ఒక గోడ మీద ద్వారం కనిపించింది.  అక్కడి దృశ్యం చూసి, నివ్వెరపాటుతో ఒక అడుగు వెనుకకు వేశాడు. ఆ ద్వారంలో సౌదామిని నిల్చుని ఉన్నది. రాజకుటుంబీకులు ధరించే  మృదువైన పట్టు వస్త్రాలు ధరించి అతి విలువైన రత్నాభరణాలతో , పసిమి ఛాయకు బంగరు వన్నె కలసిన మేని రంగుతో  మెరిసిపోతూ ఉన్నది.  

సౌదామినీ


ఆనాడు  స్నేహ పరిమళాలను వెద జల్లిన సౌమ్య సౌదామిని 

ఈనాడు సుగంధ రహిత స్వర్ణ పుష్పమై ఎదురుగా నిలబడిన  సౌదామిని 

అప్పుడు తననల్లుకోకుండా నిలువలేని లత వంటి సౌదామిని

ఇప్పుడు కఠిన దృక్కులతో తనను నిలువరిస్తున్న రాచ కన్నె సౌదామిని ….

‘సౌదామినీ’  అంటూ మనసు కలవరించింది. 

....To be continued