6, జూన్ 2016, సోమవారం

సౌదామిని

  సూర్యోదయానికి ఒక గడియ ముందు….

చంద్రుడింకా ఆకాశంలోనే ఉన్నాడు. 
వెలుగు చీకట్ల పందెంలో రెండవది అపజయాన్ని  పూర్తిగా అంగీకరించకపోయినా, క్రమక్రమంగా ప్రకాశానిదే పై చేయి అవుతోంది.
సూర్యుని రాక ను తెలియజేస్తూ వెలువడే వెలుగు కిరణాలు వైశాఖీ నదిపై పడుతున్నాయి. 

    నదీ  తీరాన్నానుకుని నీలాంగన పర్వత శ్రేణులున్నాయి. .  పేరులోనే నీలం కానీ, ఆకాశాన్నంటుతున్నట్లు  భ్రమ కలిగించే  ఉన్నతమైన వృక్షాలతోనూ, దట్టంగా పెరిగిన అడవి లతల తోనూ పర్వతాలు హరిత వర్ణంలో మనోజ్ఞంగా ఉండేవి.  ఆ అరుదైన వృక్ష జాతులకన్నింటికీ కలిపి ఒక విశేష గుణమున్నది.  పుష్పాలు చంద్రకాంతిలోనే వికసిస్తాయి . పత్రాలు సైతం పౌర్ణమి కాంతికి ప్రకాశిస్తాయి.  అడవితీగెల పై  రాత్రి వికసించిన  పుష్పాల సుగంధం చల్లని గాలిలో మిళితమై పరిమళభరితమైనది.  ఆ పర్వతాలకు, అరణ్యానికి  సంబంధించి వింత వింత కథలు ప్రచారం లో ఉండడం వలన అటు వైపు మానవ సంచారం ఉండదు.

సూర్యకిరణాలు సోకి నదీ తీరాన ఉన్న తెల్లని ఇసుక మెరుస్తోంది. నీల వర్ణపు నదీజలం తళతళలాడుతూ నిలకడగా పారుతోంది. 

  ఆ సమయం లో  , విక్రాంత సేనుడు తన సహచరులతో కలిసి ధనుర్బాణ సాధనకు నదీతీరానికి వచ్చాడు. అందరూ యువకులే అయినా, విక్రాంతుడిచ్చిన సూచనల మేరకు నిశ్శబ్దంగా ఉన్నారు. 

విక్రాంత సేనుడు సహస్ర మయూఖ  వంశానికి చెందిన వాడు. ఆ వంశస్థులందరూ పింగళ దేశానికి ఉత్తర దిక్కున ఉన్న కపిలానగరం లో నివాస ముండేవారు. గత కొన్ని మాసాలుగా,ఒక వింత సంఘటన జరుగసాగింది.  ప్రతి అమావాస్య దినాన ఒక ఆరోగ్యవంతుడైన యువకుడు అదృశ్యమవుతున్నాడు.  ఎంత సావధానంగా ఉన్ననూ, ఎన్ని ముందు జాగ్రత్తలు పాటించినా అమావాస్య దినాన ఒక యువకుడు మాయవడంతో అందరూ కల్లోలానికి లోనైనారు. తల్లిదండ్రులు వేదనతో నగరాధికారులకు మొరపెట్టుకున్నారు. వారి నిర్లక్ష్య ధోరణితో నిరాశ చెందారు.  ఈ విషయాన్ని  దేశాధిపతి ఉగ్రసింహుడి దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. 

   కొద్ది దినాల క్రితమే విద్యాభ్యాసం ముగించి నగరానికి తిరిగివచ్చిన విక్రాంతుడు , నగరవాసుల ఆందోళనపై అప్రమత్తుడైనాడు. అదృశ్యమవుతున్న యువకుల  వివరాలు సేకరించాడు. అందరూ ఆరోగ్యవంతులు, ఇరవై, ఇరవై అయిదు సంవత్సరాల మధ్య వయసువారే. సహస్ర మయూఖ వంశానికి చెందిన యువకులే అదృశ్యమవుతున్నారని గమనించాడు. . తదుపరి అమావాస్యకు ఒక ప్రణాళిక రూపొందించాడు.  ప్రతి గృహం లోని యువకులందరినీ, ఒక దినం ముందుగనే   శాకంబరి మాత ఆలయపు గర్భ గుడి లో ఉన్న సొరంగపు మార్గం ద్వారా   నీటి అడుగున నిర్మితమై యున్న మాతంగి దేవి గుహలో దాచి ఉంచాడు. 

తాను కూడా సహస్ర మయూఖ వంశానికి చెందిన యువకుడే అయి ఉండడం వలన , ఈ పర్యాయం తనే అదృశ్యం కావడానికి సిద్ధమై ,  ఖడ్గం చేతబూని నగరం మధ్యన ఉన్న రాతి మంటపం లో  రాత్రంతా నిలబడి ఉన్నాడు. ఆ నాటి రాత్రి ఎవరూ అదృశ్యం కాలేదు కానీ , భయానకమైన గాలివాన  నగరాన్ని కంపింప చేసింది.  విక్రాంతుడే అదృశ్యమవడానికి సిద్ధపడడం , పుత్రులందరూ క్షేమంగా తిరిగి రావడం తో నగరవాసులకు అతనిపై విశ్వాసం ఏర్పడింది.  అతని శాంత గంభీర వ్యక్తిత్వం, జన హృదయాలకు చేరువైంది. ఏ సమస్యకైనా వివేకంతో కూడిన అతని పరిష్కారాలు ఉపశాంతి కలిగించేవి . వారి కష్టాలకు తక్షణమే ప్రతిస్పందించడం వలన  జనహృదయ నాయకుడైనాడు. 

రాబోయే అమావాస్యకు యువకులను మరలా ఎక్కడ దాచి ఉంచాలన్న అందరూ సందేహం వ్యక్తం చేశారు. 

‘పలాయనం ఏ సమస్యకూ పరిష్కారం కాదు.’ అని పలికి , ఆ సమస్య భారాన్ని తనపై మోపమని వారికి ధైర్యం చెప్పాడు. 

‘ తమవారిని రక్షించలేని జీవనం మరణంతో సమానం!’ అని భావించి, ఈ సమస్య పూర్తిగా అంతమయే వరకూ తాను విశ్రమించకూడదని నిశ్చయించుకున్నాడు. 

 భూత భవిష్యత్కాలాలను కంటితో చూసి చెప్పగల గరువర్యుడు, బ్రహ్మ జ్ఞాని అయిన ఋతంబర మహర్షి వద్ద తానభ్యసించిన   తంత్ర విద్యలలో కొన్నింటిని ఆ యువకులకుపదేశించాలని భావించాడు. 
తొలి అడుగులోనే తంత్ర విద్యలు నేర్పడం వలన, తంత్ర మహిమలను దుర్వినియోగపరచే అవకాశాలెక్కువని తలచాడు. ముందు ఆత్మ రక్షణ లోనూ, యుద్ధవిద్యలోనూ వారికి శిక్షణ ఇచ్చి వారిలో ఆత్మ స్థైర్యం పెంపొందించిన తరువాతే తంత్ర విద్యలు నేర్పడం శ్రేయస్కరమని తలచి, శిక్షణకు మానవ సంచారం ఉండని నది తీరాన్ని ఎంచుకున్నాడు.  

  శిక్షణకు  యువకులందరూ సమ్మతించారు కానీ, నీలాంగన పర్వతాలపై ప్రచారం లో ఉన్న కొన్ని కథలు జ్ఞప్తికి తెచ్చుకుని, కలవరానికి గురి అయ్యారు.  విక్రాంతుడివద్ద తమ భయాన్ని వ్యక్తపరచారు. 

“ ఏ ప్రయాణానికైనా భయం, గమ్యం కారాదు. మొదటి అడుగు భయంతో వేయడం ధైర్యవంతుల లక్షణం కాదు.”  అని వారికి నచ్చ జెప్పి , అవసరమైన శిక్షణా సామగ్రితో బాటు వారి మనసులను కూడా సిద్ధం చేశాడు. 


విక్రాంతుడు ఇచ్చిన ధైర్యం తోనూ,  అతడు తమకు తోడున్నాడన్న విశ్వాసం చేతనూ మరుసటి నాడు, సూర్యోదయానికి ముందే అందరూ  నది వద్దకు చేరారు. 
    మునుపటి రాత్రి విక్రాంతుడు  భూమికి అయిదారుగుడుల ఎత్తు పై కుండలను  బోర్లించి వాటిని లక్ష్యాలు గా  అమర్చాడు.   నదికీ , జనావాసానికీ మధ్య ఒక కాలిబాట ఉండేది. మానవులు సంచరించకపోవడంతో ఆ మార్గమంతా వృక్షాలు పెరిగాయి.  యువకులందరూ చెట్లపైనుండి , ఆ చిరువెలుగులో దూరాన ఉన్న లక్ష్యాలకు గురిపెట్టి బాణాలు వేస్తున్నారు.  కొన్ని గురి తప్పుతున్నాయి. మరి కొన్ని ఎటువెళుతున్నాయో కూడా అంతు చిక్కడం లేదు. అయినా విసుగులేకుండా వారికి బోధిస్తూ సాధన చేయిస్తున్నాడు . 

   కొంత సేపటికి, వారు అమర్చిన కుండలకు చాలా దూరాన  , బంగారు కాంతితో మెరిసిపోతున్న కడవ ఒకటి నదీ జలాలపై తేలుతోంది. అది వారు అమర్చినది కాదని స్పష్టంగా తెలుస్తోంది. 

సహచరులందరూ కలవర పడ్డారు. ‘ఇదేదో మాయగా ఉన్నదని’ భీతి చెందారు. వెనుదిరిగి వెళ్ళిపోదామని విక్రాంతుడిని వేడుకొన్నారు. 

వారిలో ధైర్యాన్ని నింపదలచి, " మీరనుకుంటున్న మాయనిప్పుడే ఛేదిస్తాను” అంటూ  కదులుతున్న ఆ బంగారు కడవపై, బాణం ఎక్కు పెట్టాడు. రెండు క్షణాల్లో అది లక్ష్యాన్ని చేరింది. 

అంతలో , బాణం ప్రయాణించిన దిశ నుండి 

"ఆ.." అన్న స్త్రీ కంఠ స్వరంతో ఆర్తనాదం వినవచ్చింది. కొండలలో ఆ శబ్దం ప్రతిధ్వనించింది. 
నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాల్లో ఆ ఆర్తనాదం జడుపుగొలిపేలా ఉన్నది. 

అప్పటికే భయంతో తల్లడిల్లుతున్న యువకులందరూ  హడలిపోయి , కొమ్మల మీద నుండి క్రిందికి దూకి నగరం లోకి పరుగులు తీశారు.  విక్రాంతుడు   తానున్న వృక్షం పైనుండి నేలమీదకు దూకి , ధ్వని వచ్చిన దిశగా పరుగుతీశాడు.

  నీలి రంగు వస్త్రాలతో, దట్టమైన నీలి కురులతో , నదీ జలాల దాపున ఒక యువతి కూర్చుని వుంది.  ఆమె ధరించిన వలువలు నీలపు వర్ణం లో ఉండడం వలన నదీజలాలలో కలిసి పోయింది.  . కటి భాగాన యున్న కడవలో అతని బాణం గుచ్చుకుని ఉండడం గమనించాడు. ఆమె శరీరవర్ణం ప్రతిఫలించడవలనే ఆ కడవ బంగరు రంగులో మెరిసిపోతోందా అన్న అనుమానం వచ్చింది. కనులెత్తి అతడి చూస్తూ ఉన్నది. విశాలమైన నీలి సముద్రాలవలెనున్న ఆమె కనులులో చిరుకోపం కనవచ్చింది. కనుకొలుకులు ఎరుపెక్కాయి. . ఆమె చూపులలో కనిపించిన రవంత రోషానికి అతను కలవరపడ్డాడు.

అతను దగ్గరగా వెళ్ళి, ఒక కాలు మడచి ఆమె పక్కనే కూర్చుని , 
“పొరపాటు జరిగింది. మన్నించగోరతాను.” అంటూ , ఆ బాణాన్ని తొలిగించాడు. 

అతని కంఠస్వరంలోని మృదుత్వానికి, కఠినమైన కోపం ఓడిపోయింది. 

స్త్రీ సౌందర్యాన్ని అంత సన్నిహితంగా వీక్షించడం అతనికదే ప్రథమం.   

సున్నితమైన ఆమె చెక్కిలితో పోల్చడానికి  ప్రకృతిలోని ఏ పువ్వూ సాటి రాదన్న సత్యాన్ని గుర్తించి ఆశ్చర్యపోయాడు. . 
అధరాల వర్ణాన్ని అంచనా వేసేందుకు విఫల ప్రయత్నం చేశాడు.  దట్టమైన కురులలో చూపు చిక్కుకుపోయే ప్రమాదమున్నదని గ్రహించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ప్రకృతి శోభ, సూర్యోదయ కాంతులు ఆమెలో  ప్రతిఫలించడం  ప్రకృతి సహజమైన నియమిత చర్య లా ఉన్నది. 


"పరిసరాలపై దృష్టి ఉండదా, లక్ష్యం లేదా?”  

“లక్ష్యమే దృష్టి గా ఉన్నది,  ఈ క్షణం వరకూ “

“గురితప్పి గాయమైతే?”

“గురి తప్పలేదు. కానీ గాయమైంది.”

అతని సంభాషణ అంతుబట్టక ఆమె వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలైంది.

ఆమె వెళ్ళబోతోందని తలచి , సాధన కోసం అమర్చబడిన కుండలలో ఒకటి తీసికొని వచ్చి ఆమెకివ్వబోయాడు. ఆమె అందుకోలేదు. పరుగున వెళ్ళి నదీ జలం తో నింపి తెచ్చాడు. ఆమె అనుమతికొరకై దూరంగా నిలబడి ఉన్నాడు.  అతని ఉన్నతమైన రూపం సూర్యకాంతిలో మనోహరమైన చిత్తరువుగా నిలిచింది. అతడెంత సేపు అలా నిలబడి ఉంటాడో పరీక్షించదలచి ఆమె మౌనంగా నిలుచున్నది. అప్పటివరకూ ప్రకృతి, తనలోని సౌందర్యాన్నే వీక్షించిన ఆమె కన్నులకు పురుషుడి సౌందర్యం వింతగా తోచింది.

చూపులలో సహజంగా ప్రవహించే ప్రేమ , చిత్తాన్ని సాంత్వన పరిచే శాంత మందహాసమూ, నడకలో ధీరత్వమూ, ముఖములో వివేకము , బలమైన అతని బాహువులలో,  అనంతమైన భద్రత గోచరించింది.
పురుషుడిలో ఇంత సౌందర్యమా అని ఆమె అణువణువూ ఆశ్చర్యానికి లోనైంది. 

అన్నింటినీ మించి, ఆద్యంతములు లేని ఆత్మస్వరూపత్వం తెలిసివచ్చింది. 
ఆమే ముందుకు నడచి అతని చేతిలోయున్న కడవనందుకుంది.  సౌందర్యంతో ఒరిపిడికి గురైన వారిరువు కళ్ళూ సూదంటురాళ్ళైనాయి. 

 చూపులు స్నేహం చేసుకున్నాయి. అతనెవరో తనకు పరిచయం లేని వ్యక్తి అని బుద్ధి జ్ఞాపకం చేయబోతే, అతడన్యుడు కాదు కాదని హృదయం అడ్డు చెప్పింది. గతజన్మల జతగాడితడేనన్న  జ్ఞానం వికసించింది.

 శర్వరుని శరాపరంపరకు వశులై , వివశులైయున్నవేళ,  వారి 
మౌనమే సంభాషణ. 
వీక్షణమే ఆకర్షణ 
కరస్పర్శే కల్యాణం అయింది..

సిగ్గు పడిన ఆమె మోము ఎర్రగా కందింది.   తనలోని ప్రకాశం ఆమెలో చూసి సూర్యోదయకాంతి విస్తుపోయింది.


ఒకరి నొకరు రెప్పవేయకుండా కొన్ని క్షణాలు చూసుకున్నాక,  ఆకాశంలో ఉరుముకు స్పృహలోకి వచ్చారు. 

“నీవు మానవ కన్యవు కావు కదా.”

 మందహాసం అతనికి సందిగ్ధ సమాధానమైంది.  

“గంధర్వ కన్నెలకు కడవనీటి  అవసరమేమిటో?” ప్రశ్నించాడు.  

మందహాసం మరింత ప్రకాశమై, అతన్ని పరవశింప చేసింది.

“నామధేయం తెలుసుకోవచ్చునా?” 

అతడి మృదు సంభాషణ త్వరగా ముగుస్తుందేమోనన్న , భయంతో ఆమె హృదయం మరింత వేగంగా స్పందించ సాగింది.

“ చెప్పవా?”

అతని అభ్యర్థన కు  ఆమె ఆంతర్యం ఓడిపోయింది.

ఆకాశం లో నీలి మేఘాలు పరుగులు పెడుతున్నాయి. ఆందోళనగా పైకి చూసింది. మేఘాల్లో ఒక మెరుపు!

వేలితో ఆ మెరుపుని సూచించింది.

మెరుపు! అంటే, 

కనులు మూసుకున్నాడు.

“సౌదామినీ.” 

“సౌదామినీ.”

పిలుపుతో  ధ్యానించాడు.

కనులు తెరిచి చూడగా  , ఆమె జాడ లేదు. 

క్షణకాలపు విరహాన్ని సైతం తాళలేనన్నట్లు  

“సౌదామినీ” ఎలుగెత్తి పిలిచాడు .

 పర్వతాల్లో  పిలుపు ప్రతిధ్వనించింది

అది ప్రతిధ్వని కాదనీ, తన హృదయ ప్రతిస్పందనే  అని కొంత సేపటికి తెలుసుకున్నాడు. 

……To be continued

సౌదామిని-1
Dear readers,
నేను 1982 లోMBBS చేరాను.   నా బాచ్ మేట్స్ అంటే ఉన్న ఇష్టం వల్ల , నాకు ఆ సంఖ్య అంటే ఎంతో ప్రేమ.. 


హిమ అంటే..  డా. వై . హిమదేవి. గైనకాలజిస్ట్, కవయిత్రి, స్నేహ శీలి. Spontaneity అనేది ఆమెకొక అలంకారం. ఆ మధ్యన తను నాకో పెన్నిచ్చింది. నేను తర్వాత వ్రాసే blog write up నీకే అంకితమిస్తానని మా హిమకు ప్రామిస్ చేశాను.  మా హిమదేవికి ఈ ఎపిసోడ్ అంకితం.5 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

సూపర్... తరువాతి ఎపిసోడ్ గురించి ఎదురుచూస్తూ...

MURALI చెప్పారు...

మీ కథే కాదు, మా ఎదురుచూపులూ మొదలయ్యాయి ఇప్పుడు

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

:)

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

చాలా బాగుంది డాక్టర్ గారు.

Clinuxpro చెప్పారు...

మా తరం లో చాల మంది పుట్టక ముందే MBBS లో చేరారు. అయినా మీరు ఇప్పటికీ మా ఫీలింగ్స్ తో కనెక్ట్ అయ్యేలా రచనలు చేస్తున్నారు. హాట్స్ ఆఫ్ అండీ. మీరు తీసుకునే ప్రతీ కథా వస్తువు మాలో తర్వాత ఏం జరుగుతుందో అన్న ఉత్సుకత కలుగజేస్తుంది. కానీ పరిసరాల వర్ణన, వ్యక్తి /వ్యక్తిత్వ పరిచయం లాంటి విషయ వర్ణనలు కూడా ఆకట్టుకునేలా మరింత జాగ్రత్త తీసుకోండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి