9, జూన్ 2016, గురువారం

సౌదామిని-1  Continued from

  చిన్న చిన్న చినుకులతో ప్రారంభమైన వర్షం జడివాన గా మారింది. ఆమె ఎటు నుండి నిష్క్రమించిందో అతనికి బోధ పడలేదు. నది వైపు దృష్టి సారించాడు. అంతా మసకగా కనిపించింది
మరోవైపు పర్వతాలు. వర్షానికి ఈదురు గాలి తోడైంది. ఎత్తైన వృక్షాలు విరిగిపోతాయేమోనన్నంతగా ఊగుతున్నాయి
 కనురెప్ప మూసి తెరిచేంత వ్యవధిలో  వాటిని అధిరోహించి అదృశ్యం కావడం అసంభవం.  ఇంకొక వైపు  తాము నగరం నుండి నడచి వచ్చిన కాలిబాట. ఆమె నగర వాసి కాదని స్పష్టంగా తెలుసు. నదీ తీరం చివరి వరకూ వెళ్ళాడు. ఆమె జాడ లేదు


 కొన్ని క్షణాల ముందు ఎంత సంతోషం. ఇప్పుడెంతటి నైరాశ్యం.  

క్షణం లో మనోభావాలెంత వేగంగా పరివర్తన చెందాయి . 

'ఏ భావోద్రేకమూ శాశ్వతం కాని ఈ జీవితమెంత విచిత్రమైనది.' అనుకున్నాడు. 

జీవితం మనదైనా, సంతోషం మాత్రం మన మనసు దోచిన వారి వద్ద దాచి ఉంచుతాము.

‘ఆమెను మళ్ళీ కలవగలనా? ఒకవేళ కలవలేకపోతే?’ అన్న ఆలోచనతో హృదయమంతా శూన్యత నిండి, భారమైంది. మునుపెన్నడూ అనుభవించని ఖేదంతో కలత చెందాడు.   

ఆకాశం వైపు చూశాడు. వాడి సూదులవంటి వర్షపు చినుకులు అతడి కళ్ళపై దయలేకుండా దాడి చేశాయి.  జడివానలో ఆ పరిసరలాన్నింటినీ  అలుపులేకుండా అన్వేషించాడు. ఎక్కడా ఆమె జాడ కానరాలేదు. అతని హృదయం నుండి వెలువడే వ్యాకులపాటు వడగాలులను, వర్షపు ధారలు ఉపశమించ లేక పరాజయం పొందాయి నిముషం పాటు నిశ్చలంగా జడివానలో నిల్చున్నాడు. నిముషం , గంటలైందిఅతని క్లేశం ముందు కాలం తన ఉనికిని కోల్పోయింది.  
   వర్షం వెలిసింది. ఆకాశం నిర్మలంగా ఉన్నది. హృదయం మాత్రం  మబ్బుకమ్మినట్టున్నది. మరొక పర్యాయం నదీ తీరాన్ని, పర్వత పంక్తులను పరికించాడు. దిక్కులన్నీ అతడిని దిగులుగా చూశాయి. తాము నడచి వచ్చిన కాలి బాట వెంట నగరంలోకి దారి తీశాడు

కలత బారిన అతని ముఖం చూసిన సహచరులందరూ , అతడు ఆగ్రహంతో ఉన్నాడని భావించారు. శిక్షణ పై తమకు శ్రద్ధ లేకపోవడం అతడలా ఉన్నాడనుకున్నారు. దగ్గరకు రావడానికి జంకుతూ నిలబడ్డారు. కుముదుడు మాత్రం సాహసించి.

"క్షమించు విక్రమా" అన్నాడు.

వారి వైపు చూశాడు. నేరభావనతో వారి ముఖాలు విచారంతో నిండి ఉన్నాయి. 
‘ఎంత విశ్వాసంతో ఉన్నారు తనమీద. తానేదో వారిని రక్షించుతానని నమ్మకం వలనే  వలనే కదా వారికింత భయభక్తులు’ అనుకున్నాడు. వారిపై జాలికలిగింది. దయతో నిండిన అతని చూపులతో ధైర్యం తెచ్చుకున్న మిగిలిన సహచరులందరూ అతని చుట్టూ చేరారు

ఇంక ఎన్నడూ అలా శిక్షణను, నిన్ను వదిలి వెళ్ళము. ఇది తొలి తప్పిదమనుకోతుది పర్యాయం కూడా " అని బ్రతిమలాడుకున్నారు. వారందరి ముఖాల్లోనూ గోచరిస్తున్న స్వచ్చమైన అమాయకత్వం చూసి చిరునవ్వు నవ్వాడు.


"ఇంకెప్పుడూ అలా చెయ్యం విక్రమా. అయినా నీవుండగా  మేమెందుకు భయపడడం."

" నేను లేకపోయినా మీరు భయపడకూడదు"

"అదెలా సాధ్యం?"

"సమస్యకు భయపడి పారిపోతే, అది మరింతగా వెంటాడి వేధిస్తుంది. సమస్య అదృశ్యం అయేవరకూ యోధుడు పోరాడాలి. నేను లేకపోయినా పారిపోకూడదు."

“ఏదైనా ఆపద వస్తే”

“ఎదుర్కోండి.” 

“మరణిస్తే.?”

“సమస్యకు భయపడి పారిపోయిన నాడు మాత్రం జీవించియున్నట్లా?”

వారికి ధైర్యం కలిగించే మాటలతో , తదుపరి దినం చేయవలసిన సాధన గురించి చర్చించాడు

అతడి ముఖంలో ఉన్న గంభీర ముద్రకు భయపడిఆ ఆర్తనాదమెవరిది , వివరాలేమిటి’ అని ప్రశ్నించడానికి వెనకడుగు వేశారు. విక్రాంతుడికి ఆహారం తీసుకుని వచ్చి , అతను  భుజించే వరకూ ఉన్నారుమరుసటి ఉదయం ప్రదేశం లో సమయంలో సమావేశం కావాలో నిర్ణయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు

రాత్రి చీకట్లు కమ్ముకున్నాయి. వచ్చే అమావాస్య నాటికి , ఇంకా ఎన్నిరోజులుందో లెక్కవేశాడు

రాతిమండపం లో కూర్చుని ఆకాశం వంక చూశాడు. ఎంతకూ నిద్ర పోవాలని అనిపించలేదు. నాటి ఉదయం ఆమె కనిపించడం మొదలు,  ఆ స్వల్ప సాహచర్యమూ, అప్పటి తమ సంభాషణ, మనసులో నెమరు వేసుకున్నాడు. ఆమె కన్నులలో ఎంతటి ఆత్మ గౌరవం. చూపులలో ఎంతటి స్నేహతత్వం. మృదువైన స్త్రీత్వమే ఆమె సౌందర్య రహస్యం   

ఆమె మందహాసం, సిగ్గుపడిన ఎరుపు చెక్కిలి జ్ఞప్తికి వచ్చింది. ఆమె తన స్త్రీ అన్న సత్యం అనుభవమైంది. 

ప్రజలు తన మీద ఉంచిన విశ్వాసం మరచి , వ్యక్తిగత వ్యామోహాలకు లోనై కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయుట ధర్మమేనా అని బుద్ధి ప్రశ్నించింది.  

   తనని చూసి సిగ్గుపడి, ఇష్టాన్ని వ్యక్తపరచిన స్త్రీని చేపట్టలేని వాడు పురుషుడెలా అవుతాడని హృదయం నిలదీసింది

బుద్ధికి , హృదయానికి మధ్య అంతర్యుద్ధం ఎంతో సమయం సాగింది. 

 మార్గనిర్దేశం చేయమని పరమ గురువైన ఋతంబర మహర్షిని మనసులోనే ధ్యానించాడు..

‘గమనం లో ప్రతి పదమూ గమ్యానికి చేరువ చేస్తుంది. 
‘లక్ష్యాన్ని సాధించాలిసహచరినీ చేపట్టాలి. రెండూ సిద్ధించిననాడే సంపూర్ణత్వం.’   ******


అదే సమయం లో సౌదామిని తన కుటీరం ముందు ఉన్న తోటలో శీత యామిని పత్రాల పై పరుండి ఆకాశం వైపు చూడ సాగిందిఆమె కుటీరం,  పర్వతాలపైన,  భూమికి నూరు అడుగుల ఎత్తు మీద  వరుస వృక్షాల వెనుక దాగి ఉంది. నదీ తీరాన్నుండి గమనించితే, ఎవరూ గుర్తించలేనంత గోప్యంగా నిర్మించబడినది.  
 కుటీరం ముందు భాగమంతా విశాలంగా  చదునుగా ఉంది. ప్రాంగణం చుట్టూ , అందమైన పుష్పవనం

ధవళ వస్త్రాలలో ఆమె సౌందర్యం, వెన్నెల కాంతులను విరజిమ్ముతోంది. ఆ సౌందర్యకాంతులను గమనించిన   విదియ నాటి నెలవంక నిస్పృహ చెందాడు. క్షీణించిన  శశాంకుడికి ఉపశమనం కలుగజేస్తున్న రీతిలో నక్షత్రాలు చుట్టూ చేరి ఉన్నాయి.రాత్రివేళ పుష్ప సుగంధాలతో నిండిన గాలి ఆమె సుకుమార శరీరాన్ని స్పృశిస్తోంది.  

ఏకాంతంలో, ఎవరికైనా మదినలరించేది, అది దోచిన వారి తలపులే. మనసునెంత నియంత్రించబోయినా , మనోహరమైన అతని రూపము , స్నేహం కోరే అతని చూపులూ గుర్తుకు రాక మానడం లేదు.   మనసులోని వింత భావాలకు, ఊహలకు స్పందించిన ఆమె శరీరం మధుర ప్రకంపనలకు లోనైంది. ఆమె శరీరాన్ని స్పృశించిన శీతలవాయువు వేడెక్కి వెనుదిరుగుతోంది. పక్కకు వత్తిగిలి , చేతుల్లో  ముఖం దాచుకుంది. 

తన మనోస్థితి చంద్రుడికీ, నక్షత్రాలకూ అవగతమైనదేమోనని, ఒక క్షణం  మనసులో భయపడింది.  మరో క్షణంలో, తన వేదన అతడికి చేరవేస్తే బాగుండునని లోలోపల గాఢంగా కోరుకుంది. 

మరల సమాగమెప్పుడో, అప్పటివరకూ నిరీక్షణ ఎటులోనని చింతించింది. నిరీక్షణకు మించిన శిక్ష లేదని నిట్టూర్చింది

  మనసులో ఉప్పొంగుతున్న భావాలన్నింటినీ వ్యక్తపరచకపోతే మరింత భారమయేట్లున్నదని గ్రహించి , ప్రణయ సందేశం లో వాటిని భద్రపరచాలనుకుంది .  పక్కనే ఉన్న పద్మపాణి  పత్రాలను తీసుకొని, కొనగోటితో వ్రాయబోయింది. హృదయాన్ని ఆక్రమించుకున్న  మధురభావాలనూ , వాటి తీవ్రతనూ  ఒకే ఒక పత్రం పై లిఖించాలనుకోవడమెంత అవివేకమో గ్రహించింది

కల్లోలిత భావ సముద్రాన్ని లిఖించడానికి ఆకాశమే సరైన యవనిక లా భావించి, ఓ వైపునున్న నక్షత్రాలను తన చేతితో మెల్లగా వేరే వైపుకు నెట్టింది. ఆశ్చర్యంగా అవి పక్కకు తొలిగాయి

ఆమె లిఖించడానికి పూనుకుంది
ఏమని సంబోధించాలో తెలియ లేదు.

స్నేహితుడా,’  వట్టి స్నేహమేనా? నిరాశ చెందింది.

ప్రియా,’   అంత త్వరగా పురుషుడికి వశమగుట స్త్రీల ప్రవృత్తికి జతపడదని  మనసు మందలించింది.  

సుందరుడాఅతను అందగాడేనా? తనలో తాను ప్రశ్నించుకుందిపెదవులపై చిరునవ్వులు విరబూశాయి

సంబోధన వద్ద ఏర్పడ్డ సందిగ్ధావస్థ  లో ఆమె తెల్లవారుజాము వరకూ గడిపింది

తన హృదయమంతా నిండి ఉన్నాడు గనుక ,'హృదయేశ్వరుడు అని ఆకాశం లో కొన్ని నక్షత్రాలను పేర్చింది. ఆ అక్షరాలు అతనికి మాత్రమే  కనిపించాలని వాటికి ఆంక్షపెట్టింది
 ఆమె వ్రాసిన నక్షత్ర ప్రేమలేఖ వలన కొన్ని ముఖ్యమైన గ్రహాల స్థానం మారిందని, వాటివలన అతనికి ఆపద కలుగుతుందనే సత్యం తెలియక , వాటి వంక చూస్తూ నిద్రలోకి జారుకున్నది.

********


మరుసటి ఉదయం సూర్యోదయానికి ముందే యువకులందరూ , విక్రాంతుడితో కలసి నదీ తీరానికి చేరుకున్నారు. నిన్నటి నుండీ విక్రాంతుడి ముఖంలో  కనిపిస్తున్న గంభీర ముద్రకు కారణం తామేననీ, తమకు విద్య పట్ల శ్రద్ధ లేకపోవడవలన అతడు వ్యాకుల పడుతున్నాడని సహచరులందరూ తలచారు.  మిక్కిలి శ్రద్ధతో సాధన చేయాలని ,  స్నేహితుడు , గురువు, అయిన విక్రాంతుడిని ఎటులైనా సరే తమ ప్రవర్తనతో మెప్పించాలని నిర్ణయించుకున్నారు.   ఎటువంటి ఆపద ఎదురైనా శిక్షణ జరిగే ప్రదేశాన్ని వీడిపోరాదని తమలో తాము చర్చించుకుని సంతృప్తి చెందారు

నిరంతరం వారికి తోడుగా నిలబడడం వలన  వారికి ఆధారపడడం తప్ప వేరేదీ నేర్పలేనన్న ఉద్దేశంతో విక్రాంతుడు వారికి దిశానిర్దేశం చేసి, సాధన సమయం వరకూ తాను వారితో ఉండబోననీ, తాను లేకపోయినా సరే, భీతిల్లకుండా మరల తిరిగి వచ్చు సమయానికి వారి స్థానం వదలరాదని హెచ్చరిక చేశాడు

అతని మాటకు కట్టుబడతామని వారు ప్రమాణం చేశారు

  తదుపరి అమావాస్యకు ఎక్కువ దినాల గడువు లేదనీ, అమాయకులైన సహచరులందరి బాధ్యత తన మీద ఉన్నదని, జ్ఞప్తికి వచ్చింది. వారికే ప్రమాదమూ వాటిల్లకుండా వారి చుట్టూ  హిరణ్యాగ్ని రక్షా బంధాన్ని ఏర్పాటు చేసి నడక సాగించాడు. విక్రాంతుడు  తన సహచరుల చుట్టూ అమర్చిన బంధాన్ని దాటివారికెవరైనా హాని కలిగించాలని  ప్రయత్నం చేసిన ఎడల మంత్రాగ్నికి ఆహుతి అవుతారు. కానీ మంత్ర ప్రభావం, రక్షణ శక్తి శాశ్వతమైనది కాదు. సూర్యాస్తమయం వరకే వారిని కాపాడగలదు. .  

అతను నది తీరం వెంబడి నడువ సాగాడు. సమస్యకు మూలం ఎక్కడో అన్న విషయం ఆలోచిస్తున్నాడు. వారిని అదృశ్యం చేస్తున్నది ఎవరు.  ఏ ప్రయోజనం ఆశించి చేస్తున్నారో తెలుసుకోగలిగితే , పరిష్కారం తెలుస్తుందని యోచిస్తూ నడుస్తుండగా  తీరం మీద, ఒక ప్రదేశం లో ఆమె బంగరు రంగు కడవ కనిపించింది. చేతిలోకి తీసుకున్నాడు
 తన బాణం చేసిన  గాయం కూడా కనిపించింది.

  చుట్టూ చూశాడు. ఎవరూ లేరుచిత్రకర్ముడనే గంధర్వుడి నుండి నేర్చుకొన్నవస్తు అనుసరణ’ విద్య తో  కడవనుపయోగించి, ఆమె జాడ కనుగొనవచ్చునని భావించాడు. ఎవరి కొరకై అన్వేషణ జరుపుతున్నామో, వారు స్పృశించిన వస్తువును కలిగియున్నపుడు ఆ మంత్రమును పఠించాలి.  వారిని చేరే మార్గం జలప్రవాహ రేఖ ద్వారా సూచించబడుతుంది. దాన్ని అనుసరిస్తూ వెళుతున్న సమయం లో, వ్యక్తి దగ్గరవుతున్న కొలదీ , జల ప్రవాహ ధార పెద్దదవుతూ ఉంటుంది కడవను నడుముకు కట్టుకుని చిత్ర కర్మ మంత్రాన్ని పఠించాడు. వెంటనే ఫలితం వెంటనే కనపడింది.   అలా జలం కనిపించిన వైపు అడుగులు వేశాడు. మార్గం నీలాంగన పర్వతం వైపు దారి తీసింది

  పర్వతం ప్రారంభంలో , బలమైన కాండపు వృక్షాల మధ్య దారి కనిపించిందికొద్దిగా అధిరోహించగానే దట్టమైన పొదలతో మార్గమే కనిపిచలేదు. తన నడుముదట్టీలో ఉన్న కత్తి తీసి వాటిని మిక్కిలి కష్టం తో తొలగించి దారి చేసుకున్నాడు. వాటిని తొలిగించగానే ఏటవాలుగా ఉన్న పర్వతం మీద నీటి రేఖ కనిపించింది. మార్గం స్పష్టం గా కనిపిస్తున్నా,  పర్వతం నునుపుగా , నిటారుగా ఉండడం వలన ,దానికి తోడు నీటి ప్రవాహం వలన పట్టు చిక్కక జారిపోతున్నాడు. 
అతి ప్రయాస తో అధిరోహిస్తున్న తరుణం లో ఒక చోట ఒక పిడికిలి లో పట్టనంత పరిమాణంలో ఉన్న రెండు అడవి లతలు జమిలిగా పెనవేసుకుని ,ఒకటిగా వేళాడుతున్నాయి. వాటి వెంబడిరెండు దోసిళ్ళ ప్రమాణం లోజలధార పెద్దదై,  క్రిందికి జారిపోతోంది. అంటే ఆమె నివాసమిక్కడే . విక్రాంతుడి గుండె వేగం హెచ్చిందిఅడవిలతను పట్టుకుని లాగితే , ఆమె కుటీరం కు ముందు అడ్డుగోడ వలెనున్న వరుస వృక్షాలు  ప్రక్కకు తొలిగి , మరు క్షణమే  సౌదామిని కుటీర ప్రాంగణం లో ఉండేవాడు.

ఊహించనవి జరగడమే జీవితం .  

  రెండుగా కనిపిస్తున్నవి రెండూ తీగెలు కావనీ , అందులో ఒకటి , తీగె రంగులోనూ, అదే పరిమాణంలో ఉన్న ఒక మందమైన పసరిక పాము అని తెలుసుకోలేకపోయాడుఆమెను చూడబోతున్నానన్న ఆత్రుత లో  లతారసన లతిక భ్రాంతితో, తీగె బదులు , పొడవైన పసిరికపాముని పట్టుకున్నాడు. సర్పాన్ని స్పృశించిన వెంటనే అతడి కాలికింద ఆధారం కదిలింది. మరు నిముషం లో ఊహించని వేగంతో , గాఢాంధకారం అలుముకున్న లోయలోకి జారిపోతున్నట్లు  తెలిసి వచ్చింది.  

భూమ్యాకర్షణ శక్తికి మించి, రెండింతల భయంకరమైన వేగము, చిక్కని చీకటి తప్ప వర్ణింప శక్యం కాని ఒక పరిస్థితి .   వేగంగా లోపలికి జారిపోతున్న సమయంలో, ఏదైనా ఆధారం దొరుకుతుందేమోననిచేతులతో వెతుకుతూ ఉన్నాడు

లోయలో జారిపోవడం ప్రారంభమైన ఒక అర్థ గడియ పిమ్మట అతనికేదో ఆధారం దొరికింది. తడిమి చూడగా అది నునుపైన ఒక  లోహపు స్థంభం అని అర్థమైందిరెండు చేతులతో దానిని గట్టిగా పట్టుకున్నాడు. స్థంభాన్ని రెండు చేతులతోనూ తన శరీరంతోనూ లంకె వేసి , జారిపోకుండా వేగాన్ని నియంత్రించ గలిగాడు. . మెల్లగా స్థంభం పై భాగం వైపు పాకుతూ వచ్చాడు. అప్పటికి కళ్ళు కూడా చీకటికి అలవాటు పడ్డాయి. నలుదిక్కులా పరికించి చూశాడు. విశాలంగా గోళాకారంలో ఉన్న  కొండరాతి పైకప్పు. తను ఎటువైపునుండి లోపల పడ్డాడో అంతుచిక్కలేదు. పైకప్పు లో ఎక్కడా ఖాళీ ఏర్పడినట్లో , రంధ్రం ఉన్నట్లో కూడా తెలియరాలేదు. కిందికి చూశాడు. అడుగు భాగమెక్కడో అతడి కన్ను గుర్తించలేనంత దూరాన ఉన్నట్లనిపించింది. భూతలమే అడుగుభాగమా , లేక తను,అంతకన్నా క్రింది  తలం లో ఉన్నాడా  అన్న విషయం తెలియలేదు


దూరాన, ద్రవాలు ఉడుకుతున్నట్లు శబ్దం వినవస్తోంది ప్రదేశమంతా వేడి ఆవిర్లతో నిండి ఉంది. ఉష్ణానికి , అతని శరీరమంతా స్వేదం ధారలుగా కారిపోతోంది. కొంత సేపటికి చేతులు కూడా తడి అయ్యాయి. చేతులకు పట్టు చిక్కక స్తంభం కిందకు జారిపోతున్నాడు.   చేయి పట్టుతప్పితే అతను ఉడికే ద్రవంలో ఉంటాడనేది తథ్యంస్థంభాని పైకెగబ్రాకాడు. పైభాగాన్ని తడిమి చూడగా అది ఒక పాదం మాత్రమే పట్టేంత విస్తీర్ణంలో  ఉంది
స్థంభం పై భాగానికి చేరి వృక్షాసనం లో వలె ఒక పాదం మీద నిలబడ్డాడు. ఒకే స్థితిలో ఎక్కువ సమయంపాటు  స్థిరంగా నిలబడడం అతడు శిక్షణా కాలంలో నేర్చుకున్నదే. అలా నిలబడగలగడానికి ముఖ్య కారణం దృఢమైన స్థిర చిత్తమే గనుక , మనోబలంతో  శరీరాన్ని సమస్థితిలో నిలిపి ఉంచాడు.   

సమయం గడుస్తున్న కొద్దీ, ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా, ఉడుకుతున్న శబ్దాలు దగ్గరవుతున్నాయి

అవే తన ఆఖరి క్షణాలా?  

యువకుల ముఖాల్లోని అమాయకత్వం వెంటాడింది. వారిని రక్షించగలనన్న ప్రజల విశ్వాసం అతడిని నిలదీసింది

సౌదామిని గుర్తు వచ్చింది. అతడి పట్ల ఇష్టాన్ని వ్యక్తం చేసిన ఆమె మధుర మందహాసం మదిలో నిలిచింది.  

మందహాసం 
తనకోసమే, నిశ్చయంగా తనకోసమే!

అంతటి విషమ పరిస్థితిలో కూడా అతని హృదయమంతా అలౌకికానందంతో నిండింది.

సౌదామినీ...అప్రయత్నంగా కనులు మూసుకున్నాడు.

పేరు , ఆమె తలపు , అద్భుతమైన ఆమె చిరునవ్వు, క్షణంలో 

మరణాన్ని ఆహ్వానించగలిగే స్థైర్యాన్ని ప్రసాదించింది.

మరు జన్మకు ఋణపడవలదన్న శాసనమూ చేసింది

 అంతకంతకూ  ఉడుకుతున్న ఆకుపచ్చని రంగు ద్రవాలు  ఉబికి వస్తూ అతనికి చేరువవుతున్నాయి.   ఇంకా కొద్ది నిముషాలలో అతని పాదాలను స్పృశిస్తాయేమోనన్నంత వేగంతో దగ్గరవుతున్నాయి.


....To be continued 

2 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

ఆ నక్షత్రాలు జరిపెయ్యటం... ప్రేమ లేఖ రాయటం... అనుసరణ విద్య. .. వీటికి పేటెంట్ తీసుకోండి సినిమా వాళ్ళు వాడేస్తారు...

సూపర్

prasanthi kolli చెప్పారు...

Chandu......no words....u stunned us again....

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి