25, జూన్ 2016, శనివారం

సౌదామిని-3

Continued from 
సౌదామిని-2'ప్రతి కలయిక చివరిదేమోనన్న అనుమానం'

'ప్రతి చూపునూ మదిలో నిలుపుకోవాలన్న అభిమతం'

'ప్రియతములను మరల చూడలేమోనన్న సంశయం' 

ప్రేమలో ఉన్న వారి మనసులో ఉదయించే సహజమైన ఆలోచనలే ఆమెలోనూ కలిగాయి. 

విక్రాంతుడు కనుమరుగయేవరకూ అతడిపై చూపు నిలిపింది. ఆ తరువాత అతడి అడుగు జాడలను వెదికింది. ఆ పాదముద్రల తావిలో నున్న పూలను దోసిలితో అందుకుని , కనులుమూసి ముఖానికి దగ్గరగా తీసుకుంది.  ఏదో అనుమానంతో కనులు విప్పి చూడగా ఆ పుష్పాలపై అతడి రక్తపు బిందువులు కనిపించాయి. 

అతడి శిరస్సుకయిన గాయానికి తాను వస్త్రంతో కట్టుకట్టిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ ప్రదేశం  నుండి  జారిన రక్త బిందువులని, అతడికింకా స్వస్థత చేకూరలేదని గుర్తించింది.

  కుటీరం చివరివరకూ వెళ్ళి ,  ఉత్తరాన ఉన్న లోయలోని అశ్వనీ వనం లోనికి తొంగి చూసింది. లోయలోని వృక్షాలన్నింటినీ దేవ వైద్యులైన అశ్విని సుతులు నాటినవని ఆమె తండ్రి జీవించియున్నపుడు ఆమెకు చెప్పగా జ్ఞాపకం. ఆ ప్రదేశంలో మాత్రమే పెరిగే  అమృత వర్షిణి వృక్షాలు ఋతువులకతీతంగా నిరంతరమూ పుష్పిస్తాయి.  పసిడి కాంతులీనే వాటి  పూలతో లోయ మొత్తం మనోహరంగా ఉంటుందిలోయలోపల ఔషధ గుణాలతో కూడిన జలంతో నిండిన తటాకం ఉంది.   తండ్రినుండి బహుమతిగా పొందిన ఆ వనంలోని ప్రతి వృక్షమూ ఆమె ఎడల మిక్కిలి ప్రేమ కలిగి ఉంటాయి. 

  దోసిట ఉన్న పుష్పాలను ఆ లోయలోకి జారవిడిచి, అతడికి స్వస్థత చేకూర్చమని వనాన్ని కన్నీళ్ళతో వేడుకుంది.   
 అతడి రక్తం బిందువులతో తడిసి, ఆపై ఆమె అశ్రువులతో మెరిసిన ఆ పుష్పాల ద్వారా  సౌదామిని  సంతాపాన్నీ,  సందేశాన్నీ గుర్తించాయి. ఆమె ఆదేశాన్ని అందుకున్న మరుక్షణమే  అమృత వర్షిణి వృక్షాలు తమ పుష్ప రజస్సుతో తటాకం లోని జలాలను మిశ్రమించి, మిక్కిలి వేగంతో ప్రయాణించి విక్రాంతుడిపై మేఘంలా ఆవరించాయి. 
 అమృతసమానమైన ఔషధ  వర్షం కురిపించాయి. అతడి శరీరం పైనున్న గాయాలన్నీ మాయమైనాయి. దేహం  తేజోమయమైంది. మనసుత్తేజితమైంది.  


వర్షపు తాకిడికి, అతడి శిరస్సుకు ఆమె బంధించిన వస్త్రం విడి వడిందిగాలికి ఎగురుతూ వెళ్ళి ఓ చెట్టుకొమ్మకు చిక్కుకుంది. 

వస్త్రంతో బాటే  ఆమె జ్ఞాపకాలు కూడా అతన్ని వీడాయి.

*******

ఆ నాటి రాత్రి అందరూ విశ్రమించాక ఆకాశం వైపు చూస్తూ ఉన్నపుడు సౌదామిని ఆకాశంలో హృదయేశ్వరుడు అన్న రీతిలో సౌదామిని అమర్చిన నక్షత్రాలను గమనించాడు

తన చెంత ఉన్న కుముదుడిని పిలిచి

"కుముదా , నక్షత్రాలను అక్షరాలుగా ఎవరు అమర్చారో?" అన్నాడు

కుముదుడు కూడా తలయెత్తి , విక్రాంతుడు చూస్తున్న దిక్కుకే చూశాడు

"నక్షత్రాలేమిటీ? అక్షరాలేమిటీ? నాకేమీ అర్థం కావడం లేదు" విస్మయ పడుతూ అడిగాడు కుముదుడు

"ఆకాశం వంక చూసి చదువు, నీకే అర్థమవుతుంది." 

కుముదుడు తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు

నక్షత్రాలు కనిపిస్తున్నాయిగానీ, అక్షరాలేమీ లేవే?” అన్నాడు

తనకు భ్రాంతి కలుగుతుందేమోననుకునున్నాడు విక్రాంతుడు. వాటి వంక ఇంకో క్షణం చూసి ఉంటే అతడి జ్ఞాపకాలు జీవం పొందేవేమో ...


********

  కొన్ని దినాలపాటు యువకులందరినీ అన్ని రకాల విద్యలలో శిక్షణ ఇచ్చిన పిమ్మట , భౌతికమైన దాడికి వారందరూ సన్నద్ధులుగా ఉన్నారనీ, ఎంతటి శక్తివంతులు ఎదురైనా ఎదుర్కోగలరని విశ్వాసం కలిగాక   విక్రాంతుడు సంతృప్తి చెందాడు. శారీరకంగా తమని తాము సంరక్షించుకోగలరని తలచిన తరువాత వారికి తంత్ర విద్యల్లో శిక్షనివ్వడానికి ఏర్పాటు చేశాడు. శిక్షణ రాత్రి సమయంలోనే సాగేది.


“రాత్రి పూట ఎందుకు విక్రమా, పగలే సాధన చేద్దాం.”

“తంత్ర విద్యలు సూర్య కాంతి యున్నపుడు అభ్యసించరాదు .”

“వీటన్నిటికన్నా మాకు అదృశ్యంకావడం నేర్పు. ఎవరైనా మమ్మల్ని ఎత్తుకెళ్ళాలని వస్తే అదృశ్యం అయిపోయి మమ్మల్ని మేము కాపాడుకుంటాము.”

“మీరు మాయమైనంత మాత్రాన సమస్య మాయవదు కదా. అదీగాక, ఈ తంత్ర విద్యలు సమస్యపై పోరాటానికే తప్ప, పారిపోవడానికి కాదు.”  

వారు భయపడకుండా మానసికంగా వారిని  సంసిద్ధులను చేయాలని వారందరినీ వారి వారి భయాలేమిటో తెలియజెప్పమన్నాడు. 

“చీకటి అంటే భయం.”

“భూత ప్రేతాలన్న మిక్కిలి భయం.”

“ఒంటరిగా ఉండాలంటే భయం.”

అందరూ తమ తమ భయాలన్నింటినీ చెప్పారు. 

“భయానికి లోనైన సమయంలో మీకెన్ని మంత్ర విద్యలు, తంత్ర యుక్తులు తెలిసి యున్నా ప్రయోజనముండదు. అవి జ్ఞప్తికి రావు. ధైర్యమే నిజమైన ఆయుధం. ”

వారిమది నుండి భయాన్ని దూరం చేసే ప్రయత్నంలో భాగంగా , పలువిధాలుగా వారికి భ్రాంతులను కలుగచేసి భయాన్ని క్రమంగా దూరం చేశాడు

ఆకాశం వంక చూపించాడు. చూపుడువేలితో అక్కడో కొంత మేరకు చీల్చాడు . చీలికనుండి వేయిమందిని బంధించగల పొడవాటి కొండచిలువ తోక వారివైపే ప్రయాణిస్తూ వస్తోంది. తోకకు ఇరువైపులా, పదునైన కత్తులున్నాయి. తోక కదలికలు చూస్తుంటే అది ఎటువైపునుండి వీరిని కబళిస్తుందో అర్థంకాక కలవరపడి కేకలు వేయసాగారు
విక్రాంతుడు నిలబడి. కత్తులలోనుండి ఒక దానిని పెరికి దానిని నిలువునా గుచ్చాడు. క్షణంలో కొండ చిలువగానీ, కత్తులుగానీ ఏమీ కాన రాలేదు .అదృశ్యం అయాయి.

మిక్కిలి సంభ్రమమానికి లోనయ్యారు యువకులు.ఎన్నో భయంకరమైన రాక్షసాకారులను , పిశాచ రూపాలను  కల్పించి వారికా అనుభవం ద్వారా భయాన్ని పోగొట్టాడు.
 , అటువంటివి ఎదురైనపుడు భయం లేకుండా ఎలా ప్రతిఘటించాలో వారికి శిక్షణ ఇచ్చాడు


పంచభూత పరివర్తన ప్రక్రియ ఏమిటో వివరించాడు. 

"దీని  ద్వారా ఆపదలో చిక్కుకున్నపుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు " అని చెప్పి వారిని విడిచి  దూరంగా వెళ్ళాడు. 

ఒక ప్రదేశం లో నిల్చుని తన చుట్టూ ఒక అగ్ని వలయాన్ని ఏర్పరచాడు. అతడిని చుట్టుముట్టిన అగ్నికీలలు అంతకంతకూ పెరుగుతూ ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తున్నాయి. యువకులందరూ భయభ్రాంతులయారు. అతడా అగ్ని నుండి జీవంతో బయటపడడం అసంభవమని తలచే లోగా ,
విక్రాంతుడు చిరునవ్వుతో చేయి సాచి ఆకాశం నుండి ఒక మేఘమాలికను కిందికి రప్పించాడు. దానిని జలగుళికగా మార్చి అందులో ప్రవేశించి, అగ్నివలయం నుండి సురక్షితంగా బయటకు వచ్చాడు. 

అంతే కాదు, నీటిలో మునిగినపుడు వాయు నాళికను ఏర్పరుచుకోవడం, సుడిగాలిలో చిక్కుకున్నపుడు శిలగా మారడం చూపించడమే కాక అందరికీ ఆ ప్రక్రియలను బోధించాడు. 

ప్రత్యర్థి రూపంలో వారిని కబళించబోయినా దానికనుగుణంగా వారిని వారు రక్షించుకోగల యుక్తులన్నింటిలోనూ శిక్షణ ఇచ్చాడు. ఆనాడు పౌర్ణమి


నదీ తీరాన వారంతా సమావేశమైనారు


“ఇప్పటివరకూ మీరందరూ ఒక జట్టుగా కలసి యున్నారు. ఇప్పటివరకూ అదృశ్యమైన యువకులు ఒకరొకరే మాయమయ్యారు. మీరు ఏకాంతంలో ఉండడం కూడా అలవరచులోవాలని చెప్పాడు.”

వారందరినీ జట్టుగా కాక , రాత్రి రెండవ జాము వరకూ ఏకాంతంగా, ఒక్కొక్కరుగా ఒక వృక్షం మీద గడపాలని సూచించాడు


వంటరిగా వారిని విడిచివెళ్ళేందుకు నిర్ణయించుకున్నాడు. వారికేదైనా ఆపద వాటిల్లితే, అన్న ఆలోచన విక్రాంతుడిని వ్యాకులపాటుకు గురిచేసింది. వారందరికీ అతి విశిష్టమైన  ప్రకృతి లీన మర్మాన్ని బోధించాడు. ఆపద ఎదురైన సమయంలో ఆ మర్మం తెలిసిన వ్యక్తి తన దరిదాపులలో ఉన్న పదార్థంలోనైనా , లేదా ఏ ప్రాణిలోనైనా క్షణంలో లీనం కాగల మర్మం. 

విక్రాంతుడి గురువు శిక్షణాకాలం పూర్తి అయిన పిదప అతడికి బోధించిన అత్యంత గుప్తమైన మర్మాన్ని సైతం వారికి బోధించాడు. వారి క్షేమాన్నాశించి విక్రాంతుడు తీసుకున్న నిర్ణయం అతడికి అపాయం కలుగ జేస్తుందని ఊహించలేకపోయాడు. 

******పూర్ణ చంద్రుడు.   నిశ్చలంగా కురుస్తున్న వెన్నెల. చల్లని గాలి, నదీ జలాలు సైతం నిశ్శబ్దం లో లీనమయినట్లు మెల్లగా ప్రవహిస్తున్నాయి. అతడు ఒక విరగబూసిన ఉన్న మాలతీ వృక్షం కింద విశ్రమించాడు. పుష్ప సుగంధం తో కలసిన గాలి అతడి దేహానికి సేవలందిస్తోందికనులుమూసుకుని సుషుప్తిలోకి జారబోతుండగా వృక్షం పై చిక్కుకున్న సౌదామిని వస్త్రం కొమ్మ నుండి విడివడి అతనిపై పడింది.  

ప్రేమ తో నిండిన చేతులతో ఎవరో లేపనం పూస్తున్నారు. అతడి చేతి వేళ్ళు మృదువైన పెదవుల మధ్య బంధింపబడి మధుర శిక్షకు లోనవుతున్నాయి. పాదాలు వెచ్చటి స్పర్శతో సుఖాన్నందిస్తున్నారు. ఎవరో ప్రేమతో  జీవామృతాన్నందిస్తున్నట్లుగా ఉన్నది. ప్రాణాలుపోతున్నంత మధురమైన బాధ గానూ ఉన్నది

ఉలికి పడి నిద్ర లేచాడు.  అతడి లాలనకోసమేనన్నట్టు అతడి ఎదపై వస్త్రం పడి ఉన్నది

దాన్ని చేతులలోకి తీసుకునిసౌదామినీ” అన్నాడు అప్రయత్నంగానదీతీరాన ఆమె పరిచయం, ఆమెకొరకు అన్వేషించుతూ ప్రమాదంలో చిక్కుకోవడం, ఆపైన పరివర్తన మంత్రంతో ఆమె కుటీరంలో తను స్పృహకోల్పోవడం అన్నీ వరుసనే గుర్తుకువచ్చాయి

జ్ఞాపకాలతోబాటే, తాను ప్రమాదంలో అర్థ చేతనావస్థలో ఉండగా ఆమె చేసిన సపర్యలన్నీ అనుభవంలోకి వచ్చాయి

‘సౌదామినీ,’ ‘సౌదామినీ’ అన్న పిలుపు అతడి శరీరంలోని ప్రతి అణువులో  ప్రతిధ్వనించింది. ఆమెను వీడి తానెలా మనగలుగుతున్నాడో అన్న సంశయం సహజమైన భావనగా మారిందిఅప్రయత్నంగా ఆకాశం వంక చూశాడు

అదే సమయానికి సౌదామిని అప్పటివరకూ ఉన్న హృదయేశ్వరుడు వలెనున్న నక్షత్రాలను మార్చి ప్రాణ నాథుడు వలె అమర్చింది

విక్రాంతుడు చూస్తుండగనే నక్షత్రాలు తమ స్థానాన్ని మార్చుకున్నాయి. అవి తనకోసమే సౌదామిని వ్రాసినవని తెలిసి వచ్చింది. సంతోషం సహించడం ఎంత కష్టమో అతడికి అనుభవమై, దాన్ని ఎలా వ్యక్తీకరించాలో తెలియక తన ఎదపైనున్న ఆమె వస్త్రాన్ని కౌగలించుకుని ఆమె పేరు జపిస్తూ ముద్దాడాడు

నదీతీరాన ఆమె కోసం వెదుకుతూ వెళ్ళాడు. ఆమె కుటీరం నుండి వెలుపలికి వస్తూ ఏర్పాటు చేసిన బాటకోసం చూశాడు


అప్పటికి సౌదామిని అతడే క్షణం లోనైనా రావచ్చునని , రాకను గుర్తించకపోతే ఎలాగోనన్న ఆలోచనతో నిద్ర పోలేక, వేరే పని మీదా శ్రద్ధ చూపలేక నిరంతర నిరీక్షణ యోగం లో మునిగింది. కన్నులను జ్యోతులుగా చేసి విక్రాంతుడువెళ్ళిన దారి వంక చూస్తూ గడిపింది. శరీరం బలహీనమై ,సౌందర్యం అధికమైంది


 అతడి రాకకు సిద్ధంగా ఉండాలనిమరిన్ని సార్లు  చూసుకోవడంతో  సౌందర్యాన్ని దర్శించి దర్శించి  దర్పణం అలసిపోయింది. అతడి గురించిన ప్రశ్నలకు సమాధానమివ్వలేక పూలవనం విసిగిపోయింది

పౌర్ణమి నాటి రాత్రి సైతం నదీ తీరాన్ని నిరాశగా చూస్తున్న సమయంలో ఆమెకు విక్రాంతుడు కనిపించాడు. హృదయంలో సంతోషపు సముద్రాలు పొంగాయిఊహించని అదృష్టం ఎదురైన సమయంలో శరీరమూ , మనసూ పారవశ్యానికిలోనైనాయి. అనూహ్యంగా ఉద్భవించిన సంతోష సముద్రాలను హృదయం ఓపలేక, శరీరాన్ని వణికించింది

కొన్ని క్షణాల తరువాత  పుష్పాలు పరచిన మెట్లను దాటి, అతడామె ఎదురుగా నిల్చున్నాడు

వారివురూ ఒకరి వంక చూసుకున్నారు. ఇరువురి కన్నులలోనూ ఒకే భావం. రెండు దేహాలుగా విడిపోయిన ఒక ప్రాణం వేయి జన్మల తరువాత ఎదురైన వైనం. 

ఎన్నో యుగాల పాటు , ఎడబాటు ఎడారులలో పయనించిన  వారివురికీ , విరహ దాహం తీరేది అమృతమయమైన కౌగిలిలోనే అని ఏకకాలంలో స్పష్టమైంది.  వేరు దేహాలలో మనగలగడం అసాధ్యమన్న విషయం విదితమై ఒకరిబాహువులలో ఒకరు ఒదిగిపోయారుపరితపిస్తున్న రెండు హృదయాలు ఏకమై,  మౌనమే రాగమై ఉపశమింపజేసుకుంటున్నాయి.  అతడి లాలనలో విశ్రాంతి లభిస్తున్నా, అతడి స్పర్శకు వివశురాలై సౌదామిని  పూలశయ్యపై వాలింది . పౌర్ణమి వెన్నెలలో , నీలికన్నులలో ఒకరినొకరు వీక్షించుతూ స్పృహ నిలబెట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు
 చంద్రుడూ , నక్షత్రాలూ వారి అవస్థ గమనించుతూ ఆనందిస్తున్నాయి


ఎంతో సమయానికి ,ఆమె మృదువైన చెక్కిళ్ళను స్పృశించి  " ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు ?" అని ప్రశ్నించగలిగాడు. నిరీక్షణలోని నైర్యాశ్యమూ, కలయికలోని సంతోషసుఖమూ వెంటవెంటనే అనుభవం కావడంతో  ఆమె అలసి ,శక్తిని కోల్పోయి సమాధానం ఇవ్వలేకపోయింది

పున్నమికాంతిలో , అతడి సన్నిధిలో మరింత ఎరుపెక్కిన అధరాలు చిరుగాలి చల్లదనానికో , అతడి శ్వాసలోని వెచ్చదనానికో చిన్నగా అదురుతున్నాయి.
 ఆమె కనులు మూసి, అతడి మధురమైనస్పర్శకు వేచియున్న క్షణంలో,

విక్రాంతుడికి పక్కనే ఒక మెరుపు మెరిసినట్లైందిఒక క్షణం పాటు కనులు మూసుకున్నాడు. ఆమె పరుండిన ఋతి గీర్వాణ పత్రాల నుండి వెలుగు వస్తున్నదని గుర్తించాడు

వాటిపై పున్నమి వెన్నెల వేళలో భవితవ్యాన్ని దర్శించగలమని విని వున్నాడుతప్ప, ఎన్నడూ చూసియుండలేదు. సంభ్రమంగా పత్రాలపై కనిపిస్తున్న తన భవిష్యత్తుని పఠించసాగాడు

  రాబోతున్న విపత్తుని పత్రాలపై చదివి ఒక్కసారిగా అప్రమత్తుడై లేచి నిల్చున్నాడు. ఆనంద లోకాల ప్రయాణానికి సన్నద్ధురాలైన సౌదామిని స్పృహలోకి వచ్చింది.  అప్పటికే విక్రాంతుడు మెట్లు దాటి వెళ్ళిపోతున్నాడు

ఆమె తీవ్రమైన నిరాశకు గురి అయింది

నిరాశ, ఆగ్రహంగా మారి విచక్షణ కోల్పోయి అతడిని మరల చూడరాదని ఆన తీసుకోబోయి,


అతడిని చూడని జీవితమెందుకని తనని తాను ప్రశ్నించుకుని దుఃఖంతో కుంగిపోయింది.

.....To continued

17, జూన్ 2016, శుక్రవారం

సౌదామిని-2

   Continued from 
సౌదామిని-1      పరిసరాలన్నింటినీ మరొక్క సారి పరికించాడు.  పైకి  చూస్తే  గోళాకారం లోనున్న కొండ రాతి పైకప్పుక్రింది నుండి  అంతకంతకూ ఉడుకుతూ దగ్గరవుతున్న పచ్చటి ద్రవాలు.  ఒక్క పాదం మీద తన శరీరాన్ని మోస్తున్న లోహపు  స్తంభం కూడా  ఉష్ణ ద్రవాల తాకిడికి కంపింస్తోందిస్థంభం మీద మోపిన పాదం ఉష్ణాన్ని తట్టుకోలేక కదులుతోందిశరీరాన్ని సమతుల్యతతో నిలబెట్టడడం ఇక కష్టమని అర్థమైంది.  శరీరం పట్టు దప్పడానికి ఇంకా ఎక్కువ వ్యవధిలేనట్లనిపించిందిభౌతికంగా తప్పించుకునే మార్గమేమీ కానరావడం లేదు.   

విషమ సమయంలో సాహసమే మార్గమవుతుంది

    చిత్ర కర్మ పరావర్తన మంత్రాన్ని పఠించడం తప్ప వేరే మార్గం గోచరించలేదు. 

  సాధారణంగా వస్తు అనుసార మంత్రం ఉపయోగించినపుడు, వస్తువే మార్గ దర్శకం అవుతుంది మార్గం లో ఎదురయే సమస్యలను, కష్టాలను  మంత్ర ప్రయోక్త తొలిగించుకుంటూ వెళ్ళాలి.  కానీ,  గమ్యం చేరక మునుపే , ఏదైనా కారణాల వలన పరావర్తన మంత్రం పఠించితేపరిస్థితి అంతా తారుమారవుతుందిప్రయోగించిన వస్తువు బదులు , మంత్రాన్ని ప్రయోగించిన వ్యక్తి  మార్గం లో ప్రయాణించి గమ్యాన్ని చేరతాడు సమయంలోఎదురయే అడ్డంకులకు అతడి శరీరమే ఎదుర్కొనవలసి ఉంటుంది.   ఏవిపత్తు ఎదురైనా సరే అది  వ్యక్తికే విఘాతమౌవుతుంది

ఉష్ణ ద్రవాలు వేగంగా అతన్ని ముంచెయ్యడానికి దగ్గరవుతున్న సమయంలో, ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి.

తాను ప్రయాణించే మార్గంలో అడ్డు వచ్చే అవరోధాలెలా ఉంటాయో కూడా తెలియదుప్రయత్నం లో ప్రాణాలు కోల్పోవడానికి అవకాశముంది.  యువకులందరూ  క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు.  వారికి రక్షణగా ఉండాలని గురువుని మనసులో ప్రార్థించాడు.

మరణమే తథ్యమైతే....అది సౌదామిని సన్నిధిలోనే. ఆ ఊహ హృదయాన్ని సంతృప్తి తో నింపింది.  . 

  మార్గ మధ్యంలో  అడ్డంకుల నుండి కొంతైనా రక్షణగా ఉంటుందన్న ఉద్దేశంతో , నడుము దట్టీలోనున్న తన కత్తిని తీశాడుకుడిచేతితో దానిని చేపట్టిచేతిని గాలిలో సాచి పరావర్తన మంత్రం పఠించాడు

 పఠించిన మరుక్షణమే,    తను లోయలోకి జారుతున్నపుడు పడిన వేగం కన్నా రెట్టింపు వేగంతో పైకి లేచాడుగమ్యం చేరడానికి ,  ఆ మంత్రం సమీపమైన, సులభమైన మార్గాన్ని ఎంచుకుంటుంది.   కొండరాతి కప్పు ఓ చోట పలుచని, బలహీనమైన రాతిగోడ తో నిర్మితమై యున్నదివిక్రాంతుడు చేయి సాచి ఉంచడం , చేతిలో పదునైన కత్తి ఉండడం వలనమున్ముందు  గోడ ఛిద్రమైందివెను వెంటనే మార్గాన్ని సూచించే భారీ జలధార  లోయలో పడింది. 
అపరిమితమైన వేగంతో ప్రయాణించడంమార్గ మధ్యంలో ముళ్ళపొదల్ని దాటుకుంటూ వెళ్ళడంగమ్యస్థానం చేరగానే విక్రాంతుడు స్పృహతప్పడం అంతా కొన్ని క్షణాల్లో జరిగిందిదూసుకుని వెళ్ళి సౌదామిని కుటీర  ప్రాంగణం లో పడిపోయాడు

కుటీరం లోపల విశ్రమిస్తున్న సౌదామిని, ఆ శబ్దానికి ఉలికి పడి  బయటకు వచ్చి చూసింది. తన కళ్ళముందు  అచేతనంగా పడి ఉన్న విక్రాంతుడిని చూసి నిశ్చేష్టురాలైంది

  అతడి నడుమునున్న బంగారు కడవను , ప్రాంగణంలోనికి వచ్చిన జలధారనూ గమనించింది. అతడు తనకోసమే అన్వేషిస్తూ వచ్చాడని,  ఆ ప్రయత్నం లోనే ప్రమాదానికి గురైనాడని అర్థమైంది . సంతోషమూ , దు@ఖమూ ఏక కాలంలో మనస్సునాక్రమించాయి. లోపలి మస్తిష్కానికి పరిస్థితి అర్థం కావడానికి కొంత సమయం పడుతోంది. ఇంతలో హృదయం విలవిలలాడుతూ అశ్రువులరూపంలో బయటికొచ్చింది. 


******


అదే సమయం లో, ఉగ్ర సింహుడు తన రహస్య మందిరంలో , మిక్కిలి ఆగ్రహంతో ఉన్నాడుసింహ కేయూర రాజ్యాన్ని అధిష్టించినది మొదలు ఇంతవరకూ అపజయమన్న పదం ఎరగడుఆజాను బాహుడుబంగారు ఛాయతో మెరిసిపోయే ఎత్తైన విగ్రహంఅత్యంత సౌందర్యవంతుడు.  బాహ్య సౌందర్యానికి సంబంధం లేని మనఃప్రవృత్తి 

తనని జయించే వీరుడు  భూలోకం లో ఉండరాదని క్షుద్ర దేవతలను ఉపాసిస్తూ ఉంటాడురాజ్యాన్ని సహస్ర మయూఖ వంశానికి చెందిన యువకుడు  అధిష్టించుతాడని , భవిష్యవాణి వల్ల తెలుసుకున్న ఉగ్ర సింహుడు ,  వంశంలో ఉన్న యువకులందరినీ హతమార్చడానికి ఒక క్షుద్ర సేవకుడు కావాలని సంకల్పించి సాధించుకున్నాడు.  
  

ఆ క్షుద్ర సేవకుడే అతనికి విశ్వాస పాత్రుడైన  సర్ప కరాళుడు . భయానకమైన రూపం కలవాడుఅతడి రూపం గాంచిన వారెవరూ ప్రాణాలతో లేరు. తట్టుకుని జీవించి యున్నవారు సైతం మతిభ్రమించి కొంత కాలం పిమ్మట ఆత్మహత్య కు పాలడ్డారు.  అతని నాభి నుండి నిత్యం రక్తం  స్రవిస్తూ ఉంటుంది.   ప్రదేశం నుండి  పలురకాల విషసర్పాలు జన్మిస్తూ అతడి దేహం మీదే తిరుగాడుతూ ఉంటాయి.  ఆ సర్పాలే ఆహారంరక్తమే పానీయంఅతడి కేశాలన్నీ జీవించి యున్న నల్ల త్రాచులేవాటి కదలికలు గమనించితే అవి మిక్కిలి ఆగ్రహంతోనోఆకలితోనే ఉన్నట్లు తోస్తోంది.  వేర్వేరు దిక్కులలో ఎగసి పడుతూ బుసలు కొడుతున్నాయికనులలో కారే అశ్రువులుసైతం విషపూరితమైనవివిషపూరితమైన తన శ్వాస ప్రభువుకు తగలరాదని తలచి దూరంగా వినయంతో నిలబడి ఉన్నాడు

కావలసిన రూపం ధరించ గలడు.  నల్లి వంటి సూక్ష్మ కీటకం లా మారగలడులేదావేయిమందిని ఒకే సారి బంధించగల కొండ చిలువలా  రూపాంతరం చెందగలడు

  
సర్ప కరాళుడుద్భవించిన వృత్తాంతం అంతఃపురం లో కథలుగా చెప్పుకుంటుంటారు

ఉగ్ర సింహుడికి కి విజయాపేక్ష ,రాజ్యకాంక్ష తప్ప స్త్రీలపై అతడికి ఆసక్తి  లేదు.  స్త్రీలతో అతడు సంభాషించగా చూసిన వారు లేరని అంటారు.  కొన్నేళ్ళ క్రితం  అతడు కొండబిలం లో క్షుద్రోపాసన చేసిన పిమ్మట రక్త సిక్తమైన హస్తాలను శుభ్రపరచుకునే నిమిత్తం జలపాతం వద్దకొచ్చాడు. జలపాతం వద్ద జలకాలాడుతున్న  సామంత దేశపు రాకుమార్తె మృగలోచన ఉగ్ర సింహుడిని చూసింది.  అతడి సుందర రూపానికీ, అతడి కన్నులలోని  చిత్రమైన జంతు కాంక్షకు యవ్వవనవతి అయిన మృగలోచన ఆకర్షితురాలైంది ఆమెను వివాహం చేసుకుని రాజ్యానికి తీసుకుని వచ్చాడుప్రభువు వివాహం చేసుకున్నందుకు ప్రజలందరూ సంతోషపడ్డారువివాహానంతరం ప్రవృత్తి మారుతుందన్న విశ్వాసంతో వేడుకలు చేసుకున్నారు.

పరిచారికలు ఎంతో అందంగా ఆమెను అలంకరించి తొలిరేయి సమాగమానికి సిద్ధం చేసి మందిరం లోనికి పంపారుమరుసటి ఉదయం,  శుభ్రం చేయడానికి   మందిరం లోనికి అడుగుపెట్టిన పరిచారికలకు ఉగ్రసింహుడు సుఖనిద్రావస్థలో ఆదమరచి నిద్రపోతూ  కనిపించాడు.  నూతన వధువు కనిపించలేదు, మందిరం లో అక్కడక్కడా పడి ఉన్న ఆమె శరీర శకలాలు తప్ప శరీర శకలాలలో నూతన వధువు ముఖం కానరాలేదుఆమెనేదో ప్రయోజనార్థం బలి ఇచ్చాడాన్న విషయం విదితమైంది

   ఆ రాత్రి జరిగిన క్షుద్ర పూజానంతరం బహుమతిగా వచ్చిన సర్ప కరాళుడు మందిరంలో ఓ మూలన కూర్చుని ఉన్నాడు. నిలబడితే మందిరపు ఉపరితలం అతడి శిరస్సుని తాకుతుందని అర్థమవుతోంది. అతడి నాభినుండి రక్తం ధారగా స్రవిస్తోంది.  నిశ్చింతగా కూర్చుని ఉన్న అతడికి , నాభినుండి వెలువడే కొన్ని సర్పాలు ఆహారంగా మారుతున్నాయి.  ఎంత హేయమైన రీతిలో ఆమెను బలి ఇచ్చాడో వారి అమాయకపు బుద్ధికవగతమైనదిఎంతటి ధైర్యస్థులైనా వ్యాకులపడేంత  భయానకంగా  ఉన్న వాతావరణానికి  సున్నిత హృదయులైన చెలికత్తెలు భయభ్రాంతులైనారు
 ఒక చెలికత్తె మాటలుడిగి నిల్చుండగా, మరొక సేవిక మాత్రం భయంతో కేకలు వేయసాగింది.  నిద్రాభంగమైన ఉగ్ర సింహుడు ఆగ్రహంతో శయ్య పైనుండి లేచాడు

అతడు లేవగానే, తలగడ స్థానంలో నూతన వధువు శిరస్సుని చూసి పరిచారిక మరింత భీతి చెందింది. ఆమె  గొంతునుండి వెలువడే భయాక్రందనలతో మందిరం మార్మోగిందిఉన్మాది గా మారిన  పరిచారిక ప్రవర్తనకు ఏవగించుకున్న ఉగ్ర సింహుడుఆమె ముఖంలోని  భాగం నుండి కేకలు వెలువడుతున్నాయో గుర్తించి తక్షణమే,  తన ఖడ్గంతో వాటిని నిలిపి వేశాడుఅతడి భీభత్స  ప్రవృత్తిని కనులారా వీక్షించి, అప్పుటికే భయంతో స్థాణువుగా మారిన రెండవ పరిచారిక ప్రాణాలు కోల్పోయింది


 కడపటి అమావాస్య నాడు సహస్ర మయూఖ వంశం లో ఉన్న యువకుడిని బంధించుకుని రాలేదన్న సత్యాన్ని ఒప్పుకోలేని ఉగ్ర సింహుడు ఆగ్రహంతో ఉన్నాడు. అసంభవమనేది ఎరుగని సర్ప కరాళుడి వైఫల్యానికి మిక్కిలి అసంతృప్తితో ఉన్నాడు.  

 ‘ఏకారణం వలన యువకుడిని బంధించలేకపోయాడో’ ప్రశ్నించాడు. 

 సర్ప కరాళుడు మాటలతో సంభాషించడుబదులు చెప్పాలనుకున్నపుడు తన శరీరం మీద ఒక సర్పాన్ని కానీవేరేదైనా సరీ సృపాన్ని గానీ ఉపయోగిస్తాడు.  సంభాషణ తీవ్రతను బట్టిచెప్పదలచుకున్న విషయాన్ని బట్టి సర్పాన్ని వేరు వేరు విధాలలో వినియోగిస్తాడు.

 మందిరం మధ్యన దీర్ఘవృత్తాకారం లో ఒక జలాశయం ఉందికేశాలవలె నున్న నల్లత్రాచులనుండి ఒక దాన్ని పెరికిదానితో సంభాషించి దానిని జలాశయం లో కి వదిలాడు.  

ఆకు పచ్చగా ఉన్న జలాశయం రంగు మెల్లగా నలుపు రంగు కు మారిఅటు పిమ్మట తెల్లగా నిశ్చలంగా మారింది అమావాస్య నాటి రాత్రి ఏమి జరిగిందోస్పష్టంగా దృశ్యమై కనిపిస్తోంది

 నగరం లో ప్రవేశించిన  సర్ప కరాళుడు, పారదర్శకమైన నల్లని తెరలా మారాడునగరవాసుల మధ్యే తిరుగుతున్నా ఎవరికీ అనుమానమే రానంత సహజంగా ఉన్నాడు తెర వారి పక్కగా వెళ్ళినపుడు  గాలి వీచినట్లు  వస్త్రాలు కదులుతున్నాయిజుట్టు రేగుతోందినలుగురు కూర్చున్న చోట ఒకరికే అలా జరుగుతున్ననూ, ఎవరూ శ్రద్ధగా గమనించలేదు.  ఎవరికీ అనుమానం రానంత సహజంగానూ జరుగుతోందిఅన్ని ప్రదేశాల్లోనూ వెదుకుతున్నట్లు తిరుగుతోంది  నల్లని తెర.  ఎక్కడా చూసినా వృద్ధులునడివయసువారే తప్ప యువకులు కానరావడం లేదు

ఉగ్ర సింహుడు తదేకంగా  దృశ్యాలు కనిపిస్తున్న జలాశయం వంకే చూస్తూ  , యువకులందరూ ఏమైనారని కళ్ళతోనే వెదుకుతూ ఉన్నాడువారు కనిపించక పోవడంతో తెరరూపం  కూడా  అసహనం  సూచిస్తున్న వేగంతో నగరాన్ని ముట్టడిస్తోంది.  నగరం మధ్యలో ఉన్న రాతి మండపం లో విక్రాంతుడు ఖడ్గం చేత బూని నిల్చున్నాడు.  

“ అడుగో యువకుడు.” ఉగ్ర సింహుడు ఆసనం నుండి దిగ్గున లేచి నిల్చున్నాడు.

విక్రాంతుడి ముఖము సూర్య తేజస్సుతో వెలుగుతోందిధైర్యంఆత్మవిశ్వాసం తో కనులు జ్యోతుల్లా వెలుగుతున్నాయి

నల్లని తెర విక్రాంతుడి చుట్టూ ప్రదక్షిణం చేసి, అతన్ని కబళించే ప్రయత్నం చేయక వెనుదిరిగింది.

ఉగ్ర సింహుడు మండి పడ్డాడు.  

“అతడినెందుకు బంధించలేదు లేదు కరాళా ?” అంటూ  తీవ్ర స్వరంతో ప్రశ్నించాడు

జలాశయంలోని నీటిని వృశ్చికాలంకృతమైన తన వేళ్ళతో కదిపాడు.  దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తోందివిక్రాంతుడి కుడివేపు భుజం కనిపించిందినల్లని తెర అతని చుట్టూ మంద వేగంతో ప్రదక్షిణలు చేస్తోంది  భుజం మీద గరుడ ముద్ర ఉన్నది

దాన్ని చూచిన ఉగ్ర సింహుడు దిగ్భ్రాంతికి లోనై అయితే ఇతడేనా  యువకుడు. యువకులందరినీ దాచి ఇతడొక్కడే  నిలబడ్డాడాఎంతటి ధైర్య శాలిఎంతటి పరాక్రమ వంతుడు?" స్వగతంలో అనుకుంటున్నట్లుగా పలికాడు

అతడిని సంహరించకపోవడం ఎంత యుక్తమైన నిర్ణయమో గ్రహించి "సర్ప కరాళానీ వివేకము నన్ను మిక్కిలి సంతోషపరుస్తున్నదినీవే నాకు సరైన అనుచరుడివిఅంటూ ప్రశంసించాడు.


*********

 అచేతనంగా ఉన్న విక్రాంతుడి వద్దకు పరుగున వెళ్ళి వాలింది సౌదామిని.  

స్నేహం కురిపించే కనులు మూసుకుని ఉన్నాయి.
సమ్మోహనపరచే చిరునవ్వు లేక, పెదవులు పేలవంగా ఉన్నాయి.

అతడి విశాల హృదయం పై చెవినుంచింది. 
హృదయస్పందనలు విన్న తరువాత ఆమె శ్వాస తీసుకుందినిరంతర ప్రవాహమై జాలు వారుతోన్న ఆమె వెచ్చని కన్నీళ్ళు అతడి శరీరాన్ని పరామర్శిస్తున్నాయి

తాను ప్రాణాలతో ఉండిఅతడు అచేతనంగా ఉండడం  అత్యంత అధర్మమని  ఉద్వేగానికి లోనైంది.

తన ప్రేమలో ఉన్న వ్యక్తికి ఇంత ఆపద ఎలా సంభవించింది అని విస్మయ పడింది

అతడే తన హృదయేశ్వరుడని తలచాక  విపత్తు సంభవించకూడదు కదా అన్న నిరాధార తర్కంతో తల్లడిల్లింది.   


ఉపశాంతిలేని దుఃఖంతో ప్రకృతిని ప్రశ్నించింది.

ఆకాశం వైపు చూసి, జారుతున్న అశ్రువులతో,   జగడమాడింది.

ఇది అనుచితం కాదా అని నదీ ప్రవాహంతో  వాదించింది

సహాయం చేయమని సూర్యుడిని వినయంతో వేడుకుంది. అతడిని స్వస్థుడిగా చేయాల్సిన సంకల్పంతో కన్నీరు తుడుచుకుని  పరుగున లోనికి వెళ్ళి పొడి వస్త్రాలను తెచ్చి అతడి దేహమంతా తుడిచింది.   ఉద్యాన వనం నుండి ఔషధ పత్రాలను తెచ్చి అతడి శరీరమంతటికీ  ఆచ్ఛాదనగా చేసింది.   అతడి దేహానికి స్వర్ణ ధన్వంతరి  లేపనంతో ఉపశాంతి కలగజేసిందిఅతడి చల్లని శరీరరం చూసి   కలత చెందుతూ ,అతడి ముఖాన్ని తన చేతులతో తడిమిందిచల్లని చేతులను తన చెక్కిళ్ళకానించుకుని వెచ్చ చేసిందినీలంగా ఉన్న అతడి చేతి వేళ్ళను తన ఎరుపు పెదవుల మధ్య బంధించి బలవంతంగా వాటి వర్ణాన్ని మార్చింది.   పాదాలకు ముద్దులతో ఒరిపిడి పెట్టింది. 

  నీ చిరునవ్వెటుపోయిందని ప్రశ్నించుతూ పెదవుల మీద చూపుడు వేలితో మృదువుగా రాసిందిముఖం వంచి  పెదవులకు వెచ్చదనం అందించిందితన హృదయాన్నంతటినీ చేతులలో ఉంచి  అతడి దేహాన్ని తడిమింది

 తన ప్రాణమే అతడికి శ్వాస కావాలన్న సంకల్పం తప్ప వేరే ఏమీ ఎరుగని తెలియని స్థితిలో , అప్రయత్నంగా ఆమె చేస్తున్న చర్యలకు ఫలితం కలుగుతోంది.  అతడిలో కదలికలు ప్రారంభమైనాయి.  
విక్రాంతుడు బాహ్య ప్రపంచం లోకి అడుగు పెట్టేంతవరకూ , ఆమె ప్రపంచాన్ని మరచింది.  అతడిలో కదలికలు చూడగానేమనసుకు నెమ్మది చేరిందిప్రశాంతంగా నిట్టూర్చింది

   అటు పిమ్మట , ఆమె స్పృహలోకి వచ్చి తనని తాను గమనించుకుందితన శరీరం పై యుండవలసిన ఒక ముఖ్యమైన వస్త్రం అతడి శిరస్సున ఉందిఅప్పటివరకూ ఒక పురుషుడి  శరీరాన్ని అవిరామంగా స్పృశించానని తెలిసివచ్చి తన చర్యలకు తానే   విస్మయపడింది.  విక్రాంతుడు కనులు తెరుస్తుండగా సిగ్గు పడి లోనికి వెళ్ళి నిల్చుంది


  విక్రాంతుడు లేచి కూర్చున్నాడు.  పరిసరాలను గమనించాడు. శిరస్సు భారం గా ఉంది ప్రదేశమేమిటోతానెందుకక్కడ ఉన్నాడో అర్థం కాలేదు.  అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు కానీ శిరోవేదన వలన ఆలోచన సహకరించలేదు.    

చుట్టూ చూశాడు.  సూర్యుడస్తమించబోతున్నాడు

సూర్యాస్తమయం

 దృశ్యం అతడి లో ఒక జ్ఞాపకాన్ని రేకెత్తించిందియువకులనూ , వారి క్షేమాన్నీ గుర్తు తెచ్చింది
 తానేర్పరచిన హిరణ్యాగ్ని రక్షా బంధం సూర్యాస్తమయం తరువాత నిరుయోగమన్న సత్యం జ్ఞప్తికి వచ్చింది.  

   వెంటనే  సహచరులున్న ప్రదేశానికి చేరాలని, వెళ్ళడానికి సంసిద్ధుడై లేచి నిలబడ్డాడు అలికిడితో అతడు వెళ్ళబోతున్నాడని అర్థమై, సౌదామిని లోపలి నుండి తన చేయి చాచి ఒక మధుర పానీయాన్నందించింది. 

అప్రయత్నంగా అందుకున్నాడుతాగిన పిమ్మట శరీరం శక్తివంతమైంది

 కానీ ఆలోచనలకు మాత్రం ఇంకా స్పష్టత  రాలేదు.  పానీయమిచ్చిన  చేయినుద్దేశించి 

"నేను వెంటనే వెళ్ళాలిఅన్నాడు

 స్వరంలోని ఆతురతను గుర్తించింది.  

గవాక్షం నుండి  చేయి సాచి, బయట వేళాడుతున్న అడవి తీగెను పట్టి లాగిందిపర్వతం నుండి నదీ తీరం వరకూ , పుష్పాలతో నిండిన మెట్లతో ఒక బాట ఏర్పడిందివాటిమీదుగా అతడు నడచి వెళుతుండగా ఆమె లోపలినుండి బయటకు వచ్చి ద్వారం లో నిల్చుందివెనుకనుండి అతడి రూపం మరింత సుందరంగా ఉన్నది.  

 విక్రాంతుడు వెళ్ళిపోతుంటే తన ప్రాణం కూడా అతడివెంటే వెళుతోందన్న భావనకలిగిందామెకు.  అతడి నిష్క్రమణను ఓపలేని మనసు, అతడి వెంటే నడచి దూరమవుతున్న అతడి వృష్ఠభాగాన్ని కౌగలించుకుని ముద్దాడింది

అతడిని ఆపమని,  వెనుకకు పిలవమని హృదయం అమెను ప్రేరేపించింది.  

ఓర్చుకోవాలనివిరహమోపడం నేర్చుకోవాలని వివేకం హెచ్చరించింది

ఆమె అలా చూస్తుండగా అతడి కుడి భుజం పై నున్న గరుడ ముద్ర కనిపించింది

పట్టరాని సంతోషంతో ఒక్క క్షణం హృదయం ఉల్లాసభరితమైందివెను వెంటనే అతడికి కలగబోయే ఆపద జ్ఞప్తికి వచ్చి ఖిన్నురాలైంది

...To be continued