30, నవంబర్ 2012, శుక్రవారం

అందమా.. అందుమా


ఆ మధ్యన నేను నా స్నేహితురాళ్ళు కలిసినపుడు సౌందర్య సదస్సు నొకటి ఆకస్మికంగా నిర్వహించాం. 'పెరుగుతున్న వయసు-  తరుగుతున్న సౌందర్యనిలవలు' అనేది టాపిక్.

  కామన్ ఆలోచనాధోరణి కలిగి ఉండటం చేతనే మేమందరం స్నేహ పక్షులమయాం. అవేమిటంటే, పద్ధతి గా మాట్లాడుకోవడం ఎరగం . ఒకరు ఆపిన తర్వాత వేరొకరు మాట్లాడాలి అనే చచ్చు పుచ్చు మర్యాదలు పాటించం. ఒకరి అభిప్రాయాలనీ ఇంకొకరం చచ్చినా గౌరవించుకోం.

       ఒకానొక స్వర్ణ యుగం లో, పౌడరు కూడా రాయకపోయినా, కనీసం పది సైకిళ్ళన్నా పైకెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేవనీ, ఇపుడేమో ' ఆంటీ'  పిలుపులు మోస్తూ బతుకులీడ్చాల్సివస్తుందనీ మూకుమ్మడిగా బాధ పడ్డాం.

   ఈ రోజున ఎదురింటాయన వచ్చి అక్కయ్య గారూ అంటాడు. ఎలాగోలా పోనీ అనుకుందామంటే ఎదురింటో పుట్టిన ఈ కొత్త తమ్ములు గారికి మొహంలో కనుబొమలు తప్ప ఎటు చూసినా ధవళ వర్ణమే.

ప్రతి దానికీ ముందు మాట్టాడే ఇందిర పాల మీద మీగడ వాడితే పదికాలాల పాటు పాలుతాగే పసిపిల్లల చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని చెప్పింది . పక్కవాడికి ఎదురుపోవోయ్ అనే సిద్ధాంతం తోనే బతికే నేను, నిరంకుశంగా దాని పాల వాదన విరగ్గొట్టి, " అసలు పాల మీద మీగడేం కడుతుంది, పెరుగు మీద మీగడే అందాన్ని సంరక్షిస్తుంది" అని వాదించాను.

అది చెప్పిన పాల సిద్ధాంతానికి ఓ పురాణ ప్రమాణం కూడా పట్టుకొచ్చింది. కృష్ణుడు, రాముడు నల్లని వారే కానీ కేలండర్ల సాక్షిగా మహావిష్ణువు తెల్లగానే ఉంటాడంది.
"ఎలా సాధ్యం? అంతా పాల మహిమ. పాల సముద్రం లో నివాసముండీ, ఉండీ ఆయనకా ఛాయ. లక్ష్మీ కళ అనే మాట ఎందుకొచ్చింది ఓ చేత్తో ఆయన కాళ్ళు పడుతూ, ఇంకో చేత్తో పక్కనే ఉన్న పాల సముద్రం లో కాస్త నురగ తీసి మొహానికి పూసుకోబట్టి కాదా?” అంటూ వాదించింది మా ఇందిర.

ఒకేసారి ఇద్దరం, ముగ్గురం, అందరం మాట్లాడేస్తూ, పక్క కొంపల వాళ్ళకు మా ఇంట్లో ఏదో పెద్ద ఎత్తున తగాదా జరుగుతోందన్న సంతోషకరమైన భావన కలగజేశాం.

ఆహారం సౌందర్యం రెండూ దగ్గర సంబంధం ఉన్న విషయాలురుచి కి అందానికి చుక్కెదురురుచి కావాలనుకుంటే అందం గురించి ఆలోచన మానుకోవాలిరుచీ పచీ లేని పరమ దరిద్రపు తిండి తింటే అందాన్ని పదికాలాల పాటు కాపాడుకోవచ్చు.


కడుపెలా మాడ్చుకోవాలి, ఈడు కెలా ఎదురీదాలి అన్న సమస్యపై చర్చించుకున్నాం. , అందం కోసం చేయాల్సిన త్యాగాలు, తీయాల్సిన పరుగులు లెక్కవేసి సమగ్ర నివేదికనొకటి తయారు చేసి తలా ఓ కాపీ తీసుకున్నాము.

******

ఆ మధ్యన ఏదో పెళ్ళికెళ్ళాల్సి వచ్చింది.

మొహం అద్దం లో చూసి "నాసి గా ఉందే!" అని పైకే అనుకుంటుంటే,

"దానికి అద్దం చూడాలా, నన్నడిగితే నే జెప్పనా?” అన్నాడు పేపరు చదివే సొంత ఇంటి శత్రువు.

కొంత మంది వివాదాస్పదులైన వ్యక్తులతో చర్చలకు దిగి మనశ్శాంతి పోగొట్టుకునే అవకాశం ఉందని దినఫలాలు హెచ్చరించాయి. ఈయనతో మనకు మాటలెందుకు?

పెళ్ళి కి కట్టుకుందామని ఓ చీరకొనుక్కున్నాను, ఆ చేత్తోనే కాస్త అందం కూడా కొనేసుకుంటే సరి అని బ్యూటీ పార్లర్ కు వెళ్ళాను.

క్లినిక్ లో పని చేసే ఆడపిల్లలు అందాకా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారేమో నేను లోపలికెళ్ళగానే మాటలాపేసి నా వంక చూశారు.

ఏం కావాలి అని అడిగారు. " రెండ్రోజుల్లో పెళ్ళి ఉంది" అంటూ నసిగాను.

నన్ను ఎగా దిగా చూసి " పెళ్ళా? " అని ఆశ్చర్యపోతుంటే వాక్యం సరిదిద్దాను. "అదే అదే రెండ్రోజుల్లో పెళ్ళికెళ్ళాల్సి ఉంది. మొహానికేవైనా చేస్తారేమోనని " అని

అందరూ ఊపిరితీసుకున్నారు.

"రండి, రండి. మొహమొక్కటే ఏవిటి మేడం, చేతులు , కాళ్ళూ కూడా  చక్కగా చేసేస్తాం. అన్నీ మేం చూసుంటాం" అని నన్ను సకల మర్యాదలతో లోపలికి తీస్కెళ్ళారు

బంగారపు ఫేషియల్, వజ్రపు ఫేషియల్ అని కొన్ని ప్రక్రియలు చెప్పారు. బంగారం తో మొహానికి నగిషీ పెట్టే సామాన్లు నిన్ననే తెప్పించారట. ఆ సౌకర్యాన్ని వినియోగించుకోగల ప్రథమ సౌందర్యాధమురాలిని నేనేనట. మొహం, జుట్టూ పరీక్ష చేసి చర్మం బాగా డేమేజ్ అయిందనీ, జుట్టు పొడిబారిందనీ చెప్పారు.


ఆవిడ తన అసిస్టెంట్స్ ను పిలిచి చూపించి రిపైర్ కు కూడా లొంగని ఈ మొహాన్ని ఏం చెయ్యాలో కదా అని వాపోయింది. అయినా కానీ బహుచక్కగా బాగుచెయ్యగలననీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఆ పిల్లకాయ ట్రెయినీలతో వెలిబుచ్చింది. ఆ ఔత్సాహిక అపక్వ బ్యుటిషియన్లు నేర్చుకునే నిమిత్తం వాళ్ళ ఇష్టాను సారం నా జుట్టూ గిట్టూ పరిశీలించి జాలి చూపించారు.

నన్ను పడుకున్నట్లు కూచోబెట్టే కుర్చీలో పడేసి, ముగ్గురు ఆడపిల్లలు మొహాన్నొకరు, చేతులొకరు, స్వాధీనపరుచుకున్నారు. చేతికందిన లేపనాలేవో పులుముతున్నారు.

ఒకావిడ పక్కనే చేరి తెలుగు తాలింపు పెట్టిన ఇంగ్లీషులో ఊళ్ళో సోది చెప్తోంది.

చేతులకేదో క్రీము పూసి చిన్న గుడ్డ ముక్కనతికించారు. అది ఎందుకో ?

ఆ పరిస్థితిలో నన్ను నేను పరిచారికల సేవలందుకుంటున్న శకుంతలలా ఊహించుకున్నాను.

కుడి చేతి మీద ఒక క్రీము రాసిన అమ్మాయిని

"ఏమే ప్రియంవదా, శీతా కాలంలో ఎసి ఎందులకే" అని అడగబోయేంతలో నా చేతికంటించిన గుడ్డముక్కను వ్యతిరేక దిశలో ఒక్కసారిగా లాగి పారేసింది . చర్మం ఊడి వచ్చినంత పనయ్యింది.

'ఓరినాయనో' అంటూ నా పై ప్రాణాలు పైకి పోబోయి, కొంత సేపు మా నాయన గారి స్వర్గం లో ఊగిస లాడి , కిందకొచ్చిపడ్డాయి. ఆవిడ ట్రీట్ మెంట్ ఇచ్చిన మేరా చర్మం ఎర్రగా కంది మంటలేస్తోంది.

ఏవిటీ హింస. పొరపాట్న వచ్చి పోలీస్ స్టేషన్ లో పడ్డానా? అన్న డౌట్ వచ్చింది.
పోలీసులు, ఓ అరగంట దొంగల్ని ఇక్కడ పడేసి ఈ ట్రీట్మెంట్ ఇచ్చినట్లైతే నచ్చిన వస్తువుల్ని రికవరీ చేసుకోవచ్చు.

"ఏవిటమ్మా ఇది" అని అడిగితే దాన్ని వాళ్ళపరిభాషలో ఏమంటారో చెప్పి "కొద్దిగా ఓర్చుకోండి మేడం మిమ్మల్ని సుందరంగా మార్చే పూచీ మాదే" అంది.

అమ్మాయీ, అహింసా మార్గం లో అందగల అందం మాత్రమే చాలునన్నాను.

నన్నో వెర్రి జంతువుని చూసినట్లు చూసి

"నో పెయిన్ నో గెయిన్" అంది

ఉసూరుమంటూ ఇంటికొచ్చాను. ఇక చచ్చినా బ్యూటీపార్లర్ కు పోను.

ఇంట్లో దొరికే సరుకులతోనే సౌందర్యసాధనగావించాలని నిర్ణయించుకుని పొద్దున్నే ఉత్సాహంగా లేచాను. జుట్టు మెత్తగా అవాలంటే నిమ్మకాయ తేనె, మజ్జిగ, గుడ్డు మహత్తరమైన పరిష్కారాలని, అవన్నీ జుట్టుకు పట్టించి ఓ ఘంట తర్వాత స్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుందని ఎక్కడో చదివాను.

నేనా శుద్ధ శాకాహారిని. గుడ్డు అన్న పదం పలకడం కూడా ఇష్టపడను. నా స్వభావ రీత్యా తోటి మనిషి ఎంతటి విజయం సాధించినా సరే 'వెరీ గుడ్డు' అనను. కానీ ఈ రోజున గుడ్డు వాడాల్సిన అత్యవసరపరిస్థితి ఎదురైంది.
అటూ ఇటూ చూస్తుంటే టేబిల్ మీద మజ్జిగ గ్లాసు కనిపించింది. అమాంతంగా దాన్ని ఎత్తిపట్టి నా తలపై గుమ్మరించుకున్నా. ఫ్రిజ్ లోంచి ఓ గుడ్డు తీసుకుని నెత్తికి నడిబొడ్డున చిన్నగా తాటించా. నా అటిక తలను తాకినంతనే వెయ్యివక్కలైంది. మా అత్తగారు రోజూ నిమ్మకాయ రసం, తేనె తో కలిపి పొద్దున్నే పుచ్చుకుంటారు. ఆవిడ ఏమరుపాటుగా ఉన్న సమయంలో అవి తీసి గబ్బుక్కున నెత్తిమీద ఒంపేసుకున్నా.

ఉడికించిన కేరట్లు గుజ్జు చేసి మొహానికి పట్టించా. వంటకు సమకూర్చుకున్నవన్నీ నేనే వాడేస్తున్నాననీ, ఇహిలా అయితే తను పనిచెయ్యడం కష్టమని మా అత్తగారితో చెప్పి రుసరుస లాడుతూ వెళ్ళింది వంటావిడ. వంటింటి సరుకుల్తోనే అందంగా తయారవుతున్నానని ఓర్చలేనితనం.


బరువు తగ్గి సన్నగా నాజూకుగా కనపడాలి. ఓ రోలు పొత్రం తెప్పించి బయట బంతిమొక్కల పక్కనే పడేయించా. రోజూ మినప్పప్పు నానేసి రోట్లో కాటుకలా రుబ్బి పడేస్తే, మెత్తటి అట్లు వేసుకోవచ్చు, చేతులు కూడా సన్నబడతాయి. అన్నిటినీ మించి, ' కోడలితో ఎంతెంత పని చేయిస్తుందమ్మా ఆ రాకాసి అత్త' అని పక్కింటివాళ్ళ మనసుల్లో మా అత్త మీద వ్యతిరేక భావం కలగించొచ్చు. ఒకే రోలు, కానీ ఎన్నో రోల్సు.

బట్టలుతికే బాపమ్మ అన్ని విధాలా నా రోల్ మోడల్. ఎన్నో ఏళ్ళబట్టీ జీరో సైజు మెయింటైన్ చేస్తోంది. ఏళ్ళనుండీ చూస్తున్నాను. వీసం వెయిటెక్కని విగ్రహం. పొద్దున్న ఆరింటికి బయలుదేరుతుంది ఆ సూపర్ ఫాస్ట్ బాపమ్మ. బట్టలుతకడానికి ఆ వీరోత్సాహమేంటో నాకర్ఢం కాదు. " పని మొనాటనస్ గా ఉందోయ్" అని కనిపించిన ప్రతివాడి దగ్గర వాపోతూ ఉండే నాకు మా బాపమ్మ ఉద్యోగోత్సాహాలు  చెంపలు చెళ్ళుమనిపిస్తుంటాయి.

దాని నడుము కొలతకు హీరోయిన్లు సైతం కలత చెందాల్సిందే. ఐశ్వర్యా రాయి కూడా ముందు అసూయచెంది ఆపైన మొహం చూసి అమ్మయ్య అనుకుంటుందిలెండి. బట్టలుతికితే మనం కూడా నాజూకుగా తయారవొచ్చన్న విషయం విశదమైంది.

మా బాల్కనీలో ఒక బండ వేయించా. ఓ రోజు నా మొహం ఒండ్రు మట్టితో పాకింగ్ చేసి బాల్కనీలోకెళ్ళి అటూ ఇటూ చూసా. చుట్టు పక్కల ఇళ్ళలో అలికిడే లేదు. ఎవరైనా చూసినా ఒండ్రు మట్టి వెనక దాగిన నా ముఖాన్ని ఆనవాళ్ళు పట్టలేరు. అల్మైరా లోంచి ఇస్త్రీ చేసిన ఓ మల్లె రంగు టవల్ మడతలు విప్పి నీళ్ళలో ముంచి 'జై బాపమ్మా' అనుకుంటూ ఆ ఏటవాలు బండకేసి బాదుతుంటే 'హెలో మేడం గారూ' అన్న పిలుపు వినిపించింది. అదేంటి నన్నెవరూ గుర్తుపట్టరనుకున్నాగా.

అటూ ఇటూ చూస్తే వాళ్ళ బాల్కనీలో నించుని పక్కింటాయన కనిపించాడు.

టవల్ కట్టుకుని ముప్పాతిక స్థాయి ఎక్స్పోజింగ్ తో ఉన్నాడు. అప్పటి వరకూ శవాసనం వేస్తున్నాడేమో నేను చూసుకోలేదు. ఎంతో మర్యాదస్తుడు. ఎక్కడ కనిపించినా పలకరించకుండా వదలడు. ఆయన అవతారం, నా అవస్థ ఎలా ఉన్నా సరే అవేమీ పట్టించుకోనంత మర్యాద. పలకరింపు ముఖ్యం కానీ మిగతా విషయాలతో ఏం పని .

పాదరస సమాన వేగంతో బుర్రను పరిగెత్తించి చటుక్కున ఒక అత్యవసర నిర్ణయం తీసుకున్నా. నేను నేను కాదన్నట్టు అయోమయంగా ఆయన వంక చూస్తూ గొంతు మార్చి కీచు గొంతుకతో 'ఓలమ్మో, నేనవరనుకుంతన్నారో అయగోరు ' అన్నాను.

వాళ్ళ బాల్కనీ తాలూకు ఇనప ఊచలు పట్టుకుని "అటూ ఇటూ గా మీ అమ్మగారిలానే ఉన్నావే నీ దుంపతెగా, నీ పేరేవిటే ? ” అడిగాడు . పరిగెత్తుకుని కిందకొచ్చి పడ్డాను.


నాకు కొద్దిగా మిమిక్రీ కళ వచ్చు. పిల్లలకు సిన్మా కథ చెప్తున్నప్పుడు రామారావులా, నాగేస్సర్రావులా గొంతుమార్చి డైలాగులు చెప్తుంటా. నా మిమిక్రీ టేలెంట్ వల్లే కదా ఇవ్వాళ ఒక విపత్తు నుండి విజయవంతంగా బయటపడింది. ఆ కళకు సాన బట్టాలి అని అప్పటికప్పుడు అనుకుని రకరకాల గొంతులు ప్రాక్టీసు మొదలెట్టా.

ఓ పద్ధతి పాడూ లేకుండా టైమంతా వేస్ట్ చేయడం నాకు కొట్టిన పిండి. ఒక పని చేస్తూ అది పూర్తి కాకుండా ఇంకో పని మీదికి దూకడం లో కొమ్మల మీద కోతులు కూడా నాతో పోటీకి రాలేవు.

నాకు పరిచయమున్న వాళ్ళందరి గొంతులూ గుర్తు తెచ్చుకుని ఆడా మగా అన్న తేడా చూపకుండా అనుకరిస్తూ ఎడా పెడా ప్రాక్టీసు మొదలెట్టా. కాసేపు మిమిక్రీ కళనభ్యసించిన తర్వాత బోరుకొట్టింది. మిమిక్రీ కళనూ, పాటలు పాడే కళను కలిపేస్తే అన్న ఆలోచన వచ్చింది.

పనిలో పనిగా ఓ ఘంటసాల సుశీల యుగళ గీతం ఎంచుకుని ( అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ) అంటూ పాటెత్తుకుని మగ గొంతు తో, ఆడగొంతు తో మార్చి మార్చి పాడడం ప్రాక్టీసు చేస్తున్నా. ఏదో ఒక రోజు ప్రఖ్యాత ఆడ మిమిక్రీ ఆర్టిస్టు లా ఇద్దరిగొంతులతో పాట మొత్తం స్టేజి మీద పాడేసి ఈయన కళ్ళు కుట్టేలా, కుళ్ళు పుట్టేలా పేరు తెచ్చేసుకోవాలి.

చండ ప్రచండంగా ప్రాక్టీసు చేసిన తర్వాత, అమాంతం గా నామీద నాకు గౌరవమూ, ఇంటాయన అదృష్టం మీద అసూయ రగిలింది.

ఆహా ఏమీ నా మిమిక్రీ ప్రజ్ఞ!

వ్యాకరణం తెలిసిన వాళ్ళకుండే restrictions నాకెటూ లేవు. అప్పటికప్పుడు నాకు తోచినట్లు పౌరాణిక స్టైల్లో మనసులో ఓ పద్యం కట్టాను

'ఇనుకోర పెనిమిటి ఓ మంచి మాట

ఇన్నేసి కళలున్న ఇంతి దక్కుట

ఎవడికైనా కలదె నీ లక్కు ఇచట

కారణమేమందువా, నీ పూర్వ పుణ్యంబు పుచ్చుట ఆ ఆ ఆ..

అంటూ ఓ రాగం తీయబోయాను కానీ గొంతు సహకరించలేదు. వాయిస్ ఎక్సర్సైజు వికటించి , గొంతు చిక్కబట్టి, బేస్ వాయిస్ లో పలికే రఘువరన్ గొంతు దగ్గర స్థిరపడింది.

రేపటికి సెటిల్ అవుతుందిలే అనుకుని రేప్పొద్దున్నే వెళ్ళాల్సిన పెళ్ళికి ఫైనల్ గా మెరుగు దిద్దాలని గుర్తొచ్చింది. పొద్దస్తమానం డబ్బా కొట్టుకునే మా సుబ్బులు చెప్పిన చిట్కా ప్రయోగించదల్చుకున్నా. మాలో అందరం అంతో ఇంతో రోజూ డబ్బా కొట్టుకోకుండా బతకలేమనుకోండి, కానీ మా సుబ్బులు ఎవరికీ అందనంత స్థాయికెదిగింది.

' ముందు రోజు రాత్రి బీట్ రూట్ రసం రాసి, ఓ అర్ధగంట తర్వాత , నీళ్ళు మరగబెట్టి అందులో చిటికెడు కర్పూరమేసి నెత్తిమీద దుప్పటి కప్పుకుని ఆవిరి పడితే.. మొహమంతా దివిటీలా వెలిగిపోతుందట. ఈ చిట్కా వాడినందువల్ల వాళ్ళమ్మాయి పెళ్ళిలో అమ్మాయెవరో అమ్మెవరో కనుక్కోలేక బుట్టలో దీన్నే కూర్చోబెట్టి పీటలవరకూ లాక్కెళ్ళారట దాని అన్నలు.' అంటూ స్వీయానుభవాన్నొకటి మాకు వివరించింది .

పైకి "అలానా!” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసి లోలోపల మాత్రం 'దీనిబొందఅనుకున్నాం.
రాత్రి అయింది కదా అని ఎర్రటి, చిక్కటి బీట్ రూట్ రసం తయారు చేసి మొహానికి పూసుకున్నా. అద్దం చూసుకోవాలంటే ఎందుకు రిస్కు ఒకే సారి కడిగిన తర్వాత చూసుకోవచ్చు అనుకున్నా. ఆర్గ్యుమెంట్లు అంటే ఉన్న ఇష్టం వల్ల దెయ్యాలు లేవని ఎదుటివాడు నోర్మూసుకునేవరకూ వాదించగలను గానీ, స్వతహాగా నాకు దెయ్యాలంటే చచ్చేంత భయం. స్నేహితుణ్ణి రైలెక్కించి వస్తాననీ, లేటవుతుందనీ చెప్పి వెళ్ళాడీయన.


బాగా ఎర్రబడాలని ఇంకోరౌండ్ బీట్ రూట్ రసం మొహానికి పూసేశా. మొహమంతా మెరిసిపోవాలి. దెబ్బకు, కరెంట్ బిల్లు సగానికి సగమవాలి. ఓ అరగంట తర్వాత సుబ్బులు చెప్పినట్లు మొహానికి ఆవిరి పట్టాను. ఆవిరికి బీట్ రూట్ రసమంతా కారుతోంది.

కాలింగ్ బెల్ మోగితే లేచి తలుపు తీశా.

ఎదురుగా ఈయనే, రైల్వే స్టేషన్ సువాసనతో.

'రావయ్యా రా.. నీకోసమే చూస్తున్నా' అన్నాను. గొంతులోంచి రఘువరన్ పోలేదు. నిలువు గుడ్లేస్కుని నా వంక చూసి

"ఓరిబాబో , నేను రాను" అంటూ వెనక్కు అడుగులేస్తున్నాడు.

'లేటుగా ఇంటికొచ్చినందుకే ఇంతభయపడాలా, ఏవీ అననులే' అందామనుకుని

అదంతా అనలేక 'రా, రా,' అన్నాను.

"నేను రాను, నేను రాను" అంటూ వణికిపోతున్నాడు.

" తిననులే రావయ్యా , రా " అన్నా.

 వినకుండా బేర్ మని, పరుగుతీస్తూ పారిపోయాడు.

కాసేపటికి బెడ్ రూం లో ఫోన్ మోగుతుంటే వెళ్ళి తీశాను.

నేను హలో అనకముందే "ఇదిగో నిన్నే, మన ఇంటి ముందు తలుపు దగ్గర రక్త పిశాచి ఉందే.  మొహమంతా రక్తం పూసుకుని రా రా అంటూ నన్ను పిలిచింది. నేను పారిపోయి వచ్చేశా. దర్గా దగ్గరకెళ్ళి తాయెత్తు కట్టించుకొస్తా. నువ్వు తలుపు దగ్గరకెళ్ళకు. బెడ్ రూం లోనే కూర్చో. అందాకా హనుమాన్ చాలీసా గుర్తు తెచ్చుకుని పాడుకో"  

(కల్పితం) 

59 comments:

మధురవాణి చెప్పారు...

LOL :D :D

తృష్ణ చెప్పారు...

అయ్యో.. నవ్వి నవ్వి కడుపు నెప్పి వచ్చింది శైలజ గారూ.....సూపరంతే....:))))))))


>>"దానికి అద్దం చూడాలా, నన్నడిగితే నే జెప్పనా?” అన్నాడు పేపరు చదివే సొంత ఇంటి శత్రువు.<<

రసజ్ఞ చెప్పారు...

:):):) LOL

అజ్ఞాత చెప్పారు...

హ హ.. చందుగారూ, చంపేశారు అసలు. కెవ్వు .. కేక.. :-D

మాలా కుమార్ చెప్పారు...

హమ్మ ఏమి నవ్వించారండీ బాబూ :))))))

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హహహహ వీకెండ్ నవ్వులతో ప్రారంభించేలా చేశారు :-D

కృష్ణప్రియ చెప్పారు...

:) Simply loved the post. అద్భుతం..

చాతకం చెప్పారు...

ROFL. ;)

Sravya Vattikuti చెప్పారు...

వామ్మో వామ్మో నవ్వీ నవ్వీ కడుపు నొప్పి :-) అసలు ఈ లైన్ బావుంది అని చెప్పటానికి వీలు లేకుండా పోస్టంతా బాబోయ్ ఇంత అరాచకమా :-)))))))))))))))))))))

anrd చెప్పారు...

భలే నవ్వించారండి.
నేను ఒకసారి బ్యూటీపార్లర్కు వెళ్ళాను.
ఫేషియల్ అని వెళ్తే, కొంచెం దోసకాయ పేస్ట్ ముఖానికి పూసి, కొద్దిసేపు ఉంచి, తువ్వాలుతో తుడిచి , ఇంకా కొంచెం క్లీన్ చేసి... అంతే అయిపోయిందని చెప్పి బోల్డు ఫీజ్ తీసుకున్నారు.

నాకసలే అనుమానాలు ఎక్కువ. ఒకవేళ ఇంతకు ముందు ఎవరి మొహానికైనా రాసిన పేస్ట్ నాకు గానీ రాసారేమో ? టవల్ను ఉతికారో ? లేదో ? ఇలా సవాలక్ష అనుమానాలు వచ్చి..ఇక అంతే, మళ్ళీ ఎప్పుడూ పార్లర్ కు వెళ్ళలేదండి.

..nagarjuna.. చెప్పారు...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ :))

హర్ష చెప్పారు...

చాలా రోజుల తర్వాత మనస్పూర్తి గా నవ్వాను శైలజ గారు !!

నిషిగంధ చెప్పారు...

:)))))


"కడుపెలా మాడ్చుకోవాలి, ఈడు కెలా ఎదురీదాలి"
"ఒకే రోలు, కానీ ఎన్నో రోల్సు"

ఇలా ఒక్కట్రెండు లైన్లు కాదులేండీ... పోస్టంతా నవ్వులే నవ్వులు కానీ ఈ లైన్స్ దగ్గర గతి తప్పి పెద్దగా నవ్వేశాను.. వర్క్‌లో అందరూ దడుచుకున్నారు.. తర్వాత విషయం తెలిసి, ఇంత హాయిగా నవ్వించే భాష మాకెందుకు రాదా అని కుళ్ళుకున్నారు :))

Anu చెప్పారు...

ROFL...

Sunita Manne చెప్పారు...

<<"కడుపెలా మాడ్చుకోవాలి, ఈడు కెలా ఎదురీదాలి">>
:))))))ఇంకొద్దిరోజుల్లొ గుంటూర్లో పెళ్ళి ఉందండి(మా మరిదిగారి అన్నకూతురి పెళ్ళి) నే వెళ్ళక తప్పదు.ఇంటాయనకు ఆయన కలీగ్ పెళ్ళి ఆయనకూ తప్పదు. మీరన్నట్టే కాస్త ముఖాన్నికి మెరుగు పెట్టుకోవాలి:))అంత రంగున్న మీకే బీత్రూట్ రసం తిరగపడితే ఏదో చామన చాయమీద ఓ పిసరుంటాను. నాకేది దారి:))

ramesh చెప్పారు...

:)

'నచ్చిన' వస్తువుల్ని రికవరీ చేసుకోవచ్చు. మరెన్నో. మిగతావి వేరే వాళ్ళకోసం వదిలిస్తున్నానండి.

ఎంత శతృవు అయినా ఫొన్ చేసి విషయం అందచేసారు సొంత ఇంటి శతృవు!

Bhardwaj Velamakanni చెప్పారు...


lol

సుజాత చెప్పారు...

పద్ధతి గా మాట్లాడుకోవడం ఎరగం . ఒకరు ఆపిన తర్వాత వేరొకరు మాట్లాడాలి అనే చచ్చు పుచ్చు మర్యాదలు పాటించం. ఒకరి అభిప్రాయాలనీ ఇంకొకరం చచ్చినా గౌరవించుకోం. ________________ నేనూ, మా ఫ్రెండ్సూ కూడా ఇంతే నండీ...

ఒక్కటే రోలు, ఎన్నో రోల్స్..:-)))
Lolz..

ఫోటాన్ చెప్పారు...

ROFL :))

అజ్ఞాత చెప్పారు...

Great! I think this is one of your best pieces.
Sharada

రాజ్ కుమార్ చెప్పారు...

నాకు తెలీకడుగుతా... ఇలా ఎలా రాస్తారండీ అసలు??
ఒక్కొక్క లైనూ.. ఫ్రేం కట్టి పెట్టినట్టుగా ఉందీ... సూఊఊఊఊఊఒపర్ అంతే.... రచ్చ రచ్చ... ;) ;)

కృష్ణప్రియ చెప్పారు...

ఓ పద్ధతి పాడూ లేకుండా టైమంతా వేస్ట్ చేయడం నాకు కొట్టిన పిండి. ఒక పని చేస్తూ అది పూర్తి కాకుండా ఇంకో పని మీదికి దూకడం లో కొమ్మల మీద కోతులు కూడా నాతో పోటీకి రాలేవు.

:))So nice..

ఆ సౌకర్యాన్ని వినియోగించుకోగల ప్రథమ సౌందర్యాధమురాలిని నేనేనట. :)

అహింసా మార్గం లో అందగల అందం మాత్రమే చాలునన్నాను.

ర్గ్యుమెంట్లు అంటే ఉన్న ఇష్టం వల్ల దెయ్యాలు లేవని ఎదుటివాడు నోర్మూసుకునేవరకూ వాదించగలను గానీ, స్వతహాగా నాకు దెయ్యాలంటే చచ్చేంత భయం...

sooper lines.

టి. శ్రీవల్లీ రాధిక చెప్పారు...

నేను వ్రాయాలనుకున్న వాక్యాలు చాలావరకూ పై కామెంట్స్ లో కవర్ అయ్యాయి. ఇంకొన్ని...
"దాని పాల వాదన విరగ్గొట్టి.." - ఏం శ్లేష అండీ!
"తగాదా జరుగుతోందన్న సంతోషకరమైన భావన కలగచేశాం."
ఆలోచించే కొద్దీ క్రొత్త అర్ధాలు తోచే సీరియస్ రచనలుంటాయి కానీ తలచుకునే కొద్దీ కొత్త నవ్వులు పుట్టే హాస్య రచనలు, హాస్యం లో ఇన్ని లేయర్లూ... కోణాలూ... అదీ మీ ప్రతిభ.
ఒక వాక్యంలో నుంచే చదవగానే ఓ నవ్వూ.. ఆ వాక్యాన్నే మరికాస్త గమనిస్తే మరో నవ్వూ... మరో నవ్వూ..
వాక్యం మొత్తం లోనుంచీ ఓ చెణుకు కాదు.. ఏ పదానికి ఆ పదం లో నుంచే ఓ చెణుకు...
అభినందించడానికి మాటలు చాలడం లేదండీ.

వారణాసి నాగలక్ష్మి చెప్పారు...

నేనూ మా చెల్లీ కలిసి చదివి పక పకా నవ్వుకున్నాం...హాస్యం రాయడం కష్టమంటారు ,మీరేమిటండీ చాలా సులువుగా రాసిపారేశారూ ?
" నేను నేను కాదన్నట్టు అయోమయంగా ఆయన వంక చూస్తూ గొంతు మార్చి కీచు గొంతుకతో 'ఓలమ్మో, నేనవరనుకుంతన్నారో అయగోరు ' అన్నాను.

వాళ్ళ బాల్కనీ తాలూకు ఇనప ఊచలు పట్టుకుని "అటూ ఇటూ గా మీ అమ్మగారిలానే ఉన్నావే నీ దుంపతెగా, నీ పేరేవిటే ?” అడిగాడు."
నవ్వాగలేదండీ ..

Chandu S చెప్పారు...

పోస్ట్ చదివి కామెంట్ పెట్టిన స్నేహితులకందరికీ ధన్యవాదాలు.
మధుర వాణి గారు,
తృష్ణ గారు,
రసజ్ఞ గారు,
శ్రీకాంత్ గారు,
మాలా కుమార్ గారు,
వేణూ శ్రీకాంత్ గారు,
కృష్ణప్రియ గారు,
చాతకం గారు,
శ్రావ్య,
నాగార్జున గారు,
హర్ష గారు,
నిషి గారు,
అనూ గారు,
సునీత గారు,
రమేష్ గారు,
భరద్వాజ్ గారు,
సుజాత గారు,
ఫోటాన్ గారు,
శారద గారు,
రాజ్ కుమార్,
శ్రీ వల్లీ రాధిక గారు,
నాగలక్ష్మి గారు,
అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. Thank you very much.

శిశిర చెప్పారు...

నేను మీ టపాలన్నీ చదువుతానండి. టపాకి తగ్గ స్థాయిలో కామెంట్ ఎలా రాయాలో అర్థం కాక (చేతకాక) టపా చదివి నవ్వుకుని నవ్వుకుని వెళ్ళిపోతుంటాను. అద్భుతమైన రచనాశైలి. ఎలా రాయాగలరండీ ఇలా? సూపర్బ్.

Chandu S చెప్పారు...

శిశిర గారూ, మీ అభిమానానికి చాలా సంతోషం అండీ. Thank you

సుభ/subha చెప్పారు...

ROFL :D :D :D

జలతారువెన్నెల చెప్పారు...

నేను చదివి హాయిగా నవ్వుకోవడమే కాక , నా స్నేహితులకు కూడా చదివి వినిపించేసాను. Hilarious post andi sailaja gaaru.

Chandu S చెప్పారు...

శుభ గారు, Thank you
వెన్నెల గారు, ధన్యవాదాలండి

Chandu S చెప్పారు...

anrd గారు, పైన మీ పేరు మిస్ అయింది. ఏమీ అనుకోకండి. చదివినందుకు , మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

Chinni చెప్పారు...

పెరుగు మీగడ హైలైట్.. నాదొక చిన్న అనుమానం..ఈ చిట్కాలన్ని పాటిస్తే అందంగా తయారవుతారంటారా..:P:P

paddu చెప్పారు...

ఏం నవ్వించారండీ చందూ ... చెప్పకనే చెప్పారుకదండీ... వీసం వెయిటెక్కని విగ్రహం కావలి అంటే ,బాపమ్మని,, పెరట్ల్లొ రోలుని రోల్ మోడల్ గా తీసుకోమని ..

మనలొ మన మాట ..జుట్టు పట్టుకుచ్చులా వుండాలి అంటే కొబ్బరినూనె లొ వేపాకు ముద్ద అలోవేరా జెల్ (పెరట్ళోదొరికేదేలెండి)నిమ్మరసం సమపాళ్ళాల్లొ తీసుకొని నూనెలొ వేసి కాసి వాడి చుడణ్డీ ... మీతొ వెరీ వెరీ గుడ్డూ అనిపించుకొవచ్చు అని.;)

కొత్తావకాయ చెప్పారు...


"ఆ పరిస్థితిలో నన్ను నేను పరి చారికల సేవలందుకుంటున్న శకుంతలలా ఊహించుకున్నాను."


"'ఓరినాయనో' అంటూ నా పై ప్రాణాలు పైకి పోబోయి, కొంత సేపు మా నాయన నిర్మించిన స్వర్గం లో ఊగిస లాడి , కిందకొచ్చిపడ్డాయి."

గమనించానండోయ్.. బావుంది బావుంది. :D

nice post! hilarious!! :D

స్ఫురిత చెప్పారు...

sooper.....నోటిమీద చెయ్యొ ఎంత గట్టిగా నొక్కిపెట్టినా నవ్వు బయటికొచ్చేసింది...

Sai Veena చెప్పారు...

namasthe shailaja garu.nenu veena.ma amma name me name okkate.me blog chadhavadam recentga start chesa.first okati chedivanu nachindi one day lo anni posts chadivesa.chala interesting ga unnayandi.ikanundi regularga follow avuthanu. meeru chaala nachesaarandi naaku.

hari prasad చెప్పారు...

superb

వనజవనమాలి చెప్పారు...

చాలా రోజుల తర్వాత తీరిక చేసుకుని మీ బ్లాగ్ లోకి వచ్చాను.

ఎంత నవ్వు అంటే.. త్రాగిన పాలు ముక్కుల్లోనుంది బయటకి వచ్చేసాయి. పోస్ట్ ఆసాంతం సూపర్. విడకొట్టి చెప్పడానికి చెప్పలేను కూడా.

ఇలాంటి పోస్ట్ లు మీరు వ్రాస్తూ.. ఉండండి. సౌందర్య సృహ అసలు గుర్తుకు రాదు.
ముఖాలు నవ్వుతో కళ కళ లాడిపోతూ ఉంటారు. బ్యూటీ పార్లర్స్ లో స్టాఫ్ అంతా అమ్మలక్కల కబుర్లు చెపుతూ కాలక్షేపం చేస్తారు.

papineni sivasankar చెప్పారు...

After a long time I have read subtle and healthy humour.
Trust you will continue it.

Narayanaswamy S. చెప్పారు...

brilliant as usual. హాస్యం ఒక యెత్తైతే, భాషమీద మీకున్న పట్టు, మాటల విరుపులూ ఇంకో ఎత్తు.

Kathi Mahesh Kumar చెప్పారు...

:) :) :) :)

kasi చెప్పారు...

మీ రచనలన్నీ చాలా బాగుంటాయి మేడం. చాలా హాస్య భరితంగా , కేవలం మగవాళ్ళు ఆలోచించగలిగే ఆలోచనలను కుడా మీరు రాయగలరు.
మొదట్లో మీ పోస్ట్స్ చూసి మీరు పురుషుడే మో అని అనుకున్నాను. నేనే కాదు మిగతా వాళ్ళు కూడా అలానే అనుకున్నారని అర్ధం అయింది.
అదేంటో గుంటూరు లో ఉన్న దాక్టర్లన్దరికి ప్రవృత్తి రచనలేనా ? మన రమణ గారు కూడా అంతే.

Sailaja yenduri చెప్పారు...

Chala bavundi sailaja Garu

Sudhakar Anumanchi చెప్పారు...

ఈ రోజే మీ బ్లాగ్ చూశాను ! చక్కగా రాస్తున్నారు శైలజ గారూ ! అభినందనలు !
కొన్ని స్త్రీ సంబంధమైన విషయాల మీద టపాలు రాశాను నా బ్లాగ్ లో
మీకు వీలుంటే చూసి మీ '' స్పెషలిస్ట్ '' అభిప్రాయాలూ , సలహాలూ తెలుప గలరు.

సవ్వడి చెప్పారు...

పోస్ట్ చాలా బాగుంది...
ముగింపు ఇంకా బాగుంది.

సంతు (santu) చెప్పారు...

హ్హహ్హహ్హహ్హ...... చాల బావుంది..... :) =D =D

mythilii చెప్పారు...

hi sailaja...mee senior ni college lo..bhale rastunnaru,pleasant surprise to see you!

mythili

Sudha చెప్పారు...

అద్భుతంగా రాస్తారు మీరు శైలజగారు. బీట్ రూట్ రసం దెబ్బ నాకు తెలుసు. రక్తపిశాచిలా మారిపోవడానికి మహత్తరమయిన పూత.
దాని నడుము కొలతకు హీరోయిన్లు సైతం కలత చెందాల్సిందే. ఐశ్వర్యా రాయి కూడా ముందు అసూయచెంది ఆపైన మొహం చూసి అమ్మయ్య అనుకుంటుందిలెండి..............సూపర్.

mythilii చెప్పారు...

nidra manesi mee archives anni chadivestunna...publish cheyandi..chala chala bavunnayi.crisp ga vunna vaktyalu,manchi ambience,ento humanity,inka ento humor..nenu oka serious reader ga cheptunna..pustakam veyandi...nenu meeku gurtochano ledo[1yr sr]..meeru telusu anukovatam boledanta bavundi...

Chandu S చెప్పారు...

మైథిలి గారూ, మిమ్మల్నెలా మర్చిపోతాను. ఎనాటమీ హాల్ లో ఎదురుపడే వాళ్ళం. అనూ తో , నాతో కలిసి మాట్లాడేవారు. మీరు నా రచనలు చదువుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సుజని ఒక సారి కలిసినపుడు కూడా , మిమ్మల్ని ఇద్దరం గుర్తు చేసుకున్నాం.

Chandu S చెప్పారు...

ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మిత్రులందరికీ క్షమాపణలు.
@ చిన్ని గారు, భలే ప్రశ్న అడిగారు. పైన వ్రాసిన చిట్కాలన్నీ విజయవంతంగా ప్రయోగించినబడినవే.
@పద్దు గారూ, థాంక్సండీ. ఇవ్వాళే అలోవెరా తెప్పిస్తాను. Your beauty tip is వెరీ గుడ్డు. Thank you
@ కొత్తావకాయ గారూ, థాంక్యూ
@స్ఫురిత గారూ, ధన్యవాదాలు.
@సాయి వీణ గారు, ధన్యవాదాలండీ, మీ అమ్మగారి పేరు, నా పేరు ఒకటేనా. మీకు నా బ్లాగు నచ్చినందుకు థాంక్స్
@ హరి ప్రసాద్ గారు, Thank you.
@ వనజ గారు, మీకు మరీ ఇంత నచ్చినందుకు నాక్కూడా సంతోషం గా ఉందండీ.
@ పాపినేని శివశంకర్ గారూ, మీ వంటి పెద్దవారు కామెంట్ పెట్టడం నేను ఆశీర్వచనం లా తీసుకుంటున్నాను సర్.
@ నారాయణ స్వామి గారూ, పై లైన్ మీక్కూడా వర్థిస్తుంది. థాంక్యూ సర్.
@ కత్తి మహేష్ గారు, థాంక్సండీ
@ కాశి గారు, రమణ గార్ని చూసే నేను మొదలెట్టాను వ్రాయడం. థాంక్స్
@ Dr. శైలజ గారు, మీరు బిజీగా ఉండి కూడా చదివినందుకు, కామెంట్ వ్రాసినందుకు థాంక్స్.
@సుధాకర్ , థాంక్యు
@ సవ్వడి గారు, థాంక్యూ
@సంతు గారు, థాంక్స్
@ సుధ గారు, ఈ బీట్ రూట్ దెబ్బకు మా అన్నలు హడలెత్తే వాళ్ళు. ఎవర్నో చంపి రక్తం పూసున్నట్లు వుంటుందనే వారు. థాంక్సండీ
@ మైథిలి గారూ, ఎలా మరిచిపోతాను. ఎన్నో ఏళ్ళ తర్వాత మీరిలా ఎదురుపడడం నా అదృష్టం గా భావిస్తున్నా. ఎంత థ్రిల్లింగ్ గా ఉందో.

mythilii చెప్పారు...

mee hindi master gari gurinchi chadivanu...appudu vintu vundedanni...mee papa ki maneesha ani aayane peru pettarata kada.....intha chakkaga rastunnaru...chala receptive ga kuda vunnaru andarithoti...paiki navvesukuntu vunte maa aayana adigaru..[mana senior ne]..mrs.haribabu ani cheppanu...so proud of you dear sailaja....

E.V.Lakshmi చెప్పారు...

Wow !కేక పుట్టించారు శైలజ గారూ ,పంచ్ డైలాగ్స్ సూపర్.
'" ముందు రోజు రాత్రి బీట్ రూట్ రసం రాసి, ఓ అర్ధగంట తర్వాత , నీళ్ళు మరగబెట్టి అందులో చిటికెడు కర్పూరమేసి నెత్తిమీద దుప్పటి కప్పుకుని ఆవిరి పడితే.. మొహమంతా దివిటీలా వెలిగిపోతుందట. "
బీట్ రూట్ రసం తో కూడా ఇంత హాస్య రసం సృ ష్టించడం మీకే సాధ్యం అనిపిస్తోంది.హాట్స్ ఆఫ్.

akondisundari చెప్పారు...

abbabbaa...em navvinchaarandi meeroo...sooparaaathi sooparanthe....

venkat చెప్పారు...

మేడం మీరు పోస్ట్ రాసి చాలా రొజులైపొయింది .
వృత్తి లో బాగా బిజీ గా ఉన్నట్టున్నారు.

suma చెప్పారు...

Bhale navvinchaarandi!!
Simply Superb:)

పచ్చల లక్ష్మీనరేష్ చెప్పారు...

sense of humor bavundi sailaja gaaru... climax adiripoyindi

బంతి చెప్పారు...

హ హ సూపరండి :))))))

రామ్ చెప్పారు...

" ..తెలుగు తాలింపు పెట్టిన ఇంగ్లీషులో ఊళ్ళో సోది చెప్తోంది..."
"..ఒకే రోలు, కానీ ఎన్నో రోల్సు.."
"..గొంతులోంచి రఘువరన్ పోలేదు.."

మీ పోస్టుల ప్రిస్క్రిప్షన్ ప్రతి రోజూ .. భోజనం తర్వాత వాడుతున్నా డాక్టర్ గారూ ... గుణం కనబడుతోంది !!

కదిలిపోయేట్టు నవ్వి .. అరిగిపోయి ... మనసూ శరీరమూ కూడా తేలిక అవుతున్నాయి !!

మీరు చీటీ లో రాయక పోయినా .. రెండో పూట కూడా వాడేస్తా :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి