4, అక్టోబర్ 2011, మంగళవారం

అన్నీ నిజాలే*తెలుగు బ్లాగు కనక ఈ ఇంటర్వ్యూ తెలుగులోకి అనువాదం చేశాను."మీకు సినిమా అవకాశం ఎలా వొచ్చింది?”

"సినిమాలంటే నాకసలు ఇష్టం లేదు. సినిమా అవకాశమే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎనిమిదో క్లాసు చదువుతుండగా,మా స్కూలు యానివర్సరీ రోజు డాన్స్ చెయ్యాల్సిన అమ్మాయికి జొరం వచ్చింది, టీచర్లు అర్జెంటుగా నన్ను డాన్స్ చెయ్యమన్నారు. మొదటినుండీ నాలో రిథం సెన్సు ఎక్కువ. డాన్స్ చేశాను. చూసిన వాళ్ళందరూ చేతులు చచ్చుబడేలా చప్పట్లు కొట్టారు. నేనదేం పట్టించుకోకుండా ఇంటికెళ్ళి పోయాను.”

"మణి సార్ ఆడియన్స్ లో ఉండి , ఈ అమ్మాయే నా హీరోయిన్ అని మా ఇంటి చుట్టూ ఆర్నెల్లు తిరిగారు...”

"ఎవరూ, మణి రత్నం గారే? పెద్ద మనిషి లా ఉంటాడు, సినిమా పనులు మానుకుని స్కూలు ఫంక్షన్స్ రావడమేంటో? అంత పెద్ద డైరెక్టర్ ని అన్ని రోజులు తిప్పించారా?”

" మరి నాకు సినిమాలు ఇష్టం లేదు కదా?”

"హీరోయిన్ అవకాశం వొస్తే ఎవరైనా వొదులు కోరే, మీరేంటీ?”

"నాకు ఇష్టం లేక పోతే, దేవుడు దిగి వొచ్చినా నేను చెయ్యను.”

" హీరోయిన్ గా నన్నే మనసులో పెట్టుకుని ఆయన ఓ సంవత్సరం పాటు మా ఇంటి చుట్టూ తిరిగారు.”

"ఇంతకీ ఎలా ఒప్పుకున్నారు?”

"అప్పుడు, మా అన్నయ్య అమెరికా నుండి వొచ్చాడు.”

"అతనేం చేస్తాడు అమెరికాలో?”

"మాది బిజినెస్ ఫామిలీ. ప్రతి కంట్రీ లోను బ్రాంచ్ లు ఉన్నాయి. అన్నయ్య అమెరికా బ్రాంచ్ చూసుకుంటూ ఉంటాడు. ఒక్క సినిమా లో చేసెయ్యి అని నన్ను బతిమాలాడు.”

"మధ్యలో అతనికేమిటీ ఇంట్రెస్ట్ట్?”

"అన్నయ్య చిన్నప్పట్నుండీ మణి సార్ ఫాన్.”

"ఒప్పుకున్నారా?”

" నేను మొండి ఘటాన్ని. ససేమిరా అన్నాను. ఒక రోజు మా అన్నయ్య ఇంటిపక్కనున్న హోర్డింగ్ ఎక్కాడు. నేను సినిమాల్లో చెయ్యనంటే అక్కడినుండి దూకేస్తానని.”

"అవునవును, ఎవడైనా మాట వినకపోతే, తిండి మానేస్తున్నాననో, దూకుతాననో అనకపోతే దారికి రారు.”

"దాంతో ఊళ్ళో జనాలందరూ వాళ్ళ పనులు మానేసి, హీరోయిన్ గా చెయ్యమ్మా అని కాళ్ళా వేళ్ళా పడ్డారు.”


"మీ అన్న హోర్డింగ్ మీద కెక్కింది మీరు హీరోయిన్ కావటానికే అని జనాలు ఎందుకనుకున్నారు? ఇంక దేనికో అని అనుకోవచ్చుగా? ఒకవేళ ఎక్కిన వాణ్ణి పట్టించుకోకుండా ఎవరి దారిన వాళ్ళు పోతే ?”


"పిచ్చోడు కాదుగా మా అన్నయ్య. సెల్ ఫోన్ రాత్రంతా చార్జ్ పెట్టి, 555 క్రెడిట్ వేయించుకుని, పొద్దున్నే ఓ డజను ఇడ్లీలు పట్టించి, బెదిరించడానికి ఓ పెట్రోల్ డబ్బా తీసుకెళ్ళాడు. పైకెక్కగానే, టివి వాళ్ళకు, పోలిసులకూ ఫోన్ చేశాడు. మా అన్న కోసం బలవంతంగా సినిమాల్లోకి వొచ్చి పడ్డాను.”


"మిమ్మల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసేది ఎవరు?”


"ఎక్కువగా అన్నయ్య. నాన్న కూడా. వాళ్ళిద్దరూ లేకుండా నేను షూటింగ్ కు వెళ్ళను. నాన్న పక్కన లేక పోతే నాకు ఇంటి జబ్బు చేస్తుంది.”


"మరి అన్నా, నాన్నల ముందు, ప్రేమ సీన్లు, వాన పాటలు ఇబ్బంది కాదా?”


"ఎందుకూ ఇబ్బందీ, మీరిప్పుడు పెన్నూ పుస్తకం పట్టుకుని ప్రశ్నలడుగుతున్నారు. మీ అక్కో, చెల్లెలో పక్కనుంటే ఇబ్బంది పడతారా? అది నా ప్రొఫెషన్. మీకింకో విషయం తెలుసా, కొన్ని ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో అన్నయ్యే చెబుతాడు.”

"ఎలాగెలాగెలాగెలాగ ?”

"కొరికేస్తావా, మింగేస్తావా" అన్న పాటలో కొరియోగ్రఫీ అంతా అన్నయ్యే చూసుకున్నాడు.”

'అన్న తోడబుట్టిన వాడేనా ? '

"సరే మీ బక్క అవతారం కోసం ఏం తిప్పలు పడతారు? అంటే, తిండి మాని జిమ్ చుట్టూ తిరగడం, కాస్మొటిక్ సర్జరీలు..”

"ఏమీ చెయ్యను, ఈ శరీరం నాకు దేవుడిచ్చిన వరం. ఎంత తిన్నా లావెక్కను. అన్నీ సుష్టుగా లాగించేస్తాను. ప్రతి రోజూ లంచ్ లో ఉడికించిన చేపలు తప్పని సరి. కోడి వేపుడు అమ్మ కొసరి కొసరి వడ్డిస్తుంది. ఇక మటన్ కుర్మా లేకపోతే ముద్ద దిగదు. డిన్నర్ కు, పాయ ఉండాల్సిందే.”

"ఇలాంటి విచిత్రమైన తిండి బదులు, ఎప్పుడైనా మామూలుగా మనుషులు తినేవి ట్రై చెయ్యక పోయారా ? బచ్చలి కూర పప్పు, వంకాయ కూర లాంటివి, బావుంటాయి. మీకిష్టమైన డ్రింక్ ఏమిటీ?”

"మంచి నీరు, అమ్మ చేతి మంచి నీళ్ళు రోజుకు పదహారు లీటర్లు తాగుతాను.”

"మీ తల్లి గారి గురించి..”

"అమ్మకు నేనంటే ఎంత ముద్దో, అంత స్ట్రిక్ట్ కూడా. సాయంత్రం ఏడు లోపల ఇంట్లో ఉండాల్సిందే. మీకో విషయం తెలుసా, నాకు సొంత మొబైల్ లేదు. అమ్మ కొనివ్వలేదు ఇంకా చిన్న పిల్లనని. “


"మీ హీరోల గురించి చెప్పండి”.

"అందరూ ఎంతో కో ఆపరేటివ్ గా ఉంటారు. నివాస్ సార్ చాలా సీరియస్, రిజర్వడ్ గా ఉంటారు. ప్రవీణ్ సార్ కు చాలా టెక్నికల్ నాలెడ్జ్ , ఎప్పుడూ అవే మాట్టాడతారు, విశ్వాస్ సార్ కు భక్తి ఎక్కువ, పురాణాలు చెబుతారు. ఇక సన్యాస్ సార్ ఐతే చెప్పక్కర్లేదు, సెట్ లో ఉంటే ఒకటే అల్లరి, నవ్వులు. ఒకళ్ళ మీద ఒకళ్ళం పడి పడీ నవ్వుకుంటాం. చాలా మంచి వాళ్ళండీ.”

'ధర్మ రాజు టైపు, ధర్మ రాజుకు లోకంలో అందరూ మంచి వాళ్ళే.'

"హీరో లతో అఫైర్స్ గురించి రూమర్స్ , గాసిప్స్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? “

"ఇందాకే వికాస్ సార్ గారి భార్య ఫోన్ చేశారు. ఏమిటీ, మా ఆయన, నువ్వు పెళ్ళి చేసుకున్నారట కదా, హనీమూన్ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు అని అడిగింది, ఇద్దరం ఒకటే నవ్వుకున్నాం. చాలా సరదాగా తీసుకుంటామండీ.”

"సరే, మీ సౌందర్య రహస్యం?”

"చక్కగా నిద్ర పోతాను, ఎప్పుడూ సంతోషం గా ఉంటాను.”

"సినిమా ఫ్లాపైనా కూడానా?”

"విజయాలకు పొంగి పోను, అపజయాలకు కుంగి పోను.”

'స్థితప్రఙత. అబ్బో, ధర్మ రాణే'


"మీ డ్రెస్ సెలెక్షన్ ?”

"ఎక్కువగా పారిస్, లండన్ లో షాపింగ్ చేస్తాను. మమ్మీ, వొదినా హెల్ప్ చేస్తుంటారు. నేను డ్రెస్ ల విషయం లో చాలా శ్రద్ధ తీసుకుంటానండీ ముఖ్యంగా, పాటలలో. వేరే హీరోయిన్ డ్రెస్ లు చూశారా,ఎంత ఛండాలంగా ఉంటాయో?”

"సారీ మేడం చూడలేదు. అయినా పాట వొస్తే, నేను హీరోయిన్ ని చూడనండీ. నా ఫోకస్ అంతా హీరోయిన్ వెనకున్న ఫారెన్ డాన్సర్ల మీదే, పైగా వాళ్ళు బావుంటారు. అదేమిటో, నా వొంకే చూస్తూ, ఒకటే నవ్వుతూ ఉంటారు. మీరు ఇంటి దగ్గర డాన్సులు, సీన్లు అవ్వీ రిహార్సల్స్ చేస్తారా?”


"లేదండీ, పనిని ఇంటికి ఎప్పుడు తీసుకురాను, అలాగే ఇంటి విషయాలు పని చోటుకు తీసుకెళ్ళను. ఇంటికి రాగానే నాలోని నటిని స్విచ్ ఆఫ్ చేస్తాను. “

"మరి పెద్ద డైలాగులు, కష్టమైన సీన్లు ఎలా?”

"ఎనిమిది పేజీల డైలాగ్ అయ్యినా సరే, అసిస్టెంట్ ఒక్క సారి చెపితే చాలు, కళ్ళు మూసుకుని కాన్ సంట్రేట్ చేసి వింటాను. అలాగే కెమేరా ముందుకెళ్ళిపోతాను.”

"మీరు సామాన్యులు కాదు సుమా! చిన్న తనం గురించి చెప్పండి?”

"చిన్నపుడు తెగ అల్లరి చేసే దాన్నండి.”

"ఎలాటి అల్లరి, చెప్పండి..”

"మా పిన్ని నిద్రపోతుంటే, నాలుగు మీటర్ల ఎర్ర టపాకాయల జడ మా పిన్ని పొడుగు జడకు కట్టి చివర్న అంటించే దాన్ని, మావయ్య కొడుకు ఇంటర్వ్యూ కోసం మా ఇంట్లో దిగాడు ఒక సారి. వాడి సర్టిఫికెట్లు తీసుకెళ్ళి పడవలు చేసి వాన నీళ్ళలో ఆడుకున్నేదాన్ని. ఇప్పుడు గుర్తొస్తే భలే సరదాగా అనిపిస్తుంది.”

"ఒహో చిన్నప్పట్నుండే, హీరోయిన్ లక్షణాలు .”

"హాబీలు?”

"బుక్ రీడింగ్ అంటే పిచ్చి. Barbara Cartland, Harold Robins, Danielle Steel రాసినవి బాగా చదువుతానండీ.”

"ఇష్టమైన నటులు..”

"హాలీవుడ్ లో ..”

"హాలీవుడ్ వొద్దు, తెలుగు నటుల ..”

"సారీ అండీ, నాకు తెలుగు రాదు. “

"మీ బాల్యం ఎక్కడ? ఏ రాష్ట్రం?”

"నాన్న ఐఏఎస్ ఆఫీసరు. అన్ని చోట్ల పని చేశారు. అమ్మ గుజరాతీ, నాన్న పంజాబీ, అమ్మమ్మ తమిళ్, నాయనమ్మ మరాఠీ, మామయ్య ఇంకోటి, టోటల్ గా నాకు పదహారు భాషలొచ్చు, తెలుగు తప్ప.”


"నాన్నగారు ఐఏఎస్, అన్న గారి అమెరికా బిజినెస్ ఉండీ, ఎందుకండీ ఈ తిప్పులు. అదే, అదే, తిప్పలు, హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చో వచ్చుగా, పైగా మీకు సినిమాలంటే ఇష్టం కూడా లేదాయె.”

"నిజమే, కానీ, ఇంత మంచి టెక్నీషియన్స్ వద్ద పని చేసే అవకాశం అందరికీ రాదు కదండీ, నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను, ఈ సినిమా వేషాలు ఆయన నాకు ఒప్పగించిన దైవకార్యం గా భావిస్తాను. ఆరోజు నేను సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఒక చారిత్రాత్మిక తప్పిదం జరిగి ఉండేది.”

"మీ డ్రీమ్ రోల్?”

"మొన్ననే ఒక ఉదాత్తమైన పాత్ర చెయ్యాలని అనిపించింది.”

"ఏమిటో?”

"మళ్ళీ ఎవరితోనూ అనకండి. ఒక గుడ్డి డాన్సరు, కళకోసం అంకితం అయిపోతుంది. ఆవిడని పరీక్ష చేసిన కళ్ళడాక్టరు ఆమెను గుడ్డిగా ప్రేమిస్తూ ఉంటాడు.”

"డాక్టరు కూడా గుడ్డి వాడేనా?”

"మధ్యలో అడ్డు రాకండి. గుడ్డి డాక్టరు, ఛీ కాదు, కళ్ళ డాక్టరు తండ్రి సి ఎం. ఈ ప్రేమని వొప్పు కోడు. తన ఆస్థాన రౌడీలతో, ఈవిణ్ణి గాంగ్ రేపు చేయించబోతాడు. కానీ హీరోయిన్ కావటవం వల్ల వాళ్ళకు అది సాధ్య పడదు. ఆవిడ పవిత్రంగా ఉండి పోతుంది. “

"రౌడీ లకు ఏమైనా డాక్టరు సలహా అవసరమేమో..”

"అబ్బా మీరు అడ్డు రాకండన్నానా? ఆ రేప్ ఎటాక్ వల్ల ఆవిడకు పిచ్చి ఎక్కుతుంది.కళ్ళ డాక్టరు , ఆవిడని పిచ్చి డాక్టరు దగ్గర చేరుస్తాడు. పిచ్చి హాస్పిటల్ లో ఆవిడ డేన్సులేసుకుంటుంటే, పిచ్చి డాక్టరు కూడా ఈవిణ్ణి పిచ్చిగా ప్రేమిస్తాడు. ఇక గుడ్డి పిచ్చి డాన్సరు, పిచ్చి ప్రేమికుడు, గుడ్డి ప్రేమికుడు మధ్య ట్రైయాంగిల్ ప్రేమ. క్లైమాక్స్ ఫైట్ తర్వాత, ఈవిడకు పిచ్చి పోతుంది, చూపు కూడా వస్తుంది.”

"మధ్యలో ఫైట్ ఎక్కడనుండి వొచ్చిందీ?”

"వండితే వస్తుంది. “

"డేన్సు, గుడ్డి, పిచ్చి, రేపులు, త్రికోణ ప్రేమ ఇన్నిటి మధ్యా అదో కష్టమా? ఇంతకీ ఆవిణ్ణి ఎవరు పెళ్ళి చేసుకుంటారు.”

"నువ్వు చేసుకో అంటే నువ్వు చేసుకో అని కళ్ళ డాక్టరు, పిచ్చి డాక్టరు త్యాగాలకు సిద్ధ పడతారు. అప్పుడు ఈవిడ, నా బతుక్కి డేన్సు తప్ప వేరే ఏమీ వొద్దు అని, అస్తమిస్తున్న సూర్యుడి వైపు నడిచెళ్ళిపోతుంది.”

"ఏంటో ఆర్ట్ సినిమాలా ఉందండీ.”

"మీరలా నెగటివ్ టాక్ స్ప్రెడ్ చెయ్యకండీ. మసాలా జత చెయ్యడానికి చాలా అవకాశం ఉంది. ఎక్స్ పోజింగ్ కు కావలిసినంత స్కోపు ఉంది. హీరోయిన్ కు కళ్ళు కనపడవు కాబట్టి, హీరో ఆమెకు సహాయం చేస్తుంటాడు, ఉదాహరణకు చీర కట్టడం లాంటివి, ఇక గాంగ్ రేపు సీనులో కావలిసినంత, ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇప్పుడే చెప్తే సస్పెన్స్ పోతుంది.” అంటూ కొద్దిగా సిగ్గు పడింది,

"నేషనల్ అవార్డు ఎటూ తప్పదనుకోండీ, నటనకు బాగా ఆస్కారముంది కనక ఆస్కార్ కు కూడా పంపించొచ్చు.”

15 comments:

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

A good parody of a typical interview with a Heroine imported into Telugu film world. Well done!

రాజేష్ మారం... చెప్పారు...

:)

yaramana చెప్పారు...

చాలా సరదాగా రాశారు. పబన (పగలబడి నవ్వాను. LOL కి స్వేచ్చానువాదం). వ్యంగ్య రచనలో ఆరితేరారు.

Tejaswi చెప్పారు...

ఇరగదీశారు బాసూ!

Chandu S చెప్పారు...

@ శివరామప్రసాదు కప్పగంతు గారు,

Thank you sir for your comment.

Chandu S చెప్పారు...

@ రాజేష్ మారం...

Thanks

Chandu S చెప్పారు...

@ Tejaswi గారు,

thanks for reading.

కృష్ణప్రియ చెప్పారు...

Too good.. :)

అజ్ఞాత చెప్పారు...

ఎందుకయినా మంచిది సినిమా కథని దాచెయ్యండి . ఈ పోస్ట్ ఏ పిచ్చి డైరెక్టర్ కళ్ళ పడినా ' గుడ్డి ప్రేమ ' సినిమా తయారయే ప్రమాదాన్ని కాదనలేం

మధురవాణి చెప్పారు...

హహ్హహ్హా.. భలే రాసారండీ.. చాలా నవ్వించారు..
ఈ ఒక్క ఇంటర్వ్యూ చదివితే చాలు.. అందరు హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూసిన ఫలం దక్కుతుంది.. :)))))
<< టోటల్ గా నాకు పదహారు భాషలొచ్చు, తెలుగు తప్ప.
ఇది మాత్రం ultimate అసలు.. :)))))

naimisha yenduri చెప్పారు...

meeku nijamgaa hats off cheppakunda vundaleka pothunna. WOW.

buddha murali చెప్పారు...

bagundi

vasantham చెప్పారు...

yiraga deesarandi..baboy..

vasantham.

Pappula Ganesh చెప్పారు...

నటనకు బాగా ఆస్కారముంది కనక ఆస్కార్ కు కూడా పంపించొచ్చు.” super

Pappula Ganesh చెప్పారు...

last sunday i read ur blog in andhrajyothy , appatanundi daily mee blogs lo 2011 nundi okkakkati chadhuvukuntu vasthunnaa, chala bavunnayi

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి